షిర్క్ నాలుగు సూత్రాలు – షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ [పుస్తకం & వీడియో పాఠాలు]

al-qawaid-al-arbah.gif

ఇస్లాం ధర్మం యొక్క నాలుగు నియమాలు
(అల్ ఖవాఇద్ అల్ ఆర్బా)
షిర్క్ నాలుగు సూత్రాలు

మూలం:షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లాహ్ అలై)
అనువాదకులు:ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
పుస్తకం నుండి:ఇస్లాం మూల సూత్రాలు (హదీసు పబ్లికేషన్స్)

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [9 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ]


بسم الله الرحمن الرحيم

أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ

మహోన్నత సింహాననానికి అధిపతి అయిన అల్లాహ్‌ దర్బారులో అభ్యర్ధించుకుంటున్నాను – ఆయన ఇహపరాలలో మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉండుగాక! మీరెక్కడున్నా మిమ్మల్ని శుభవంతుల్ని చేయుగాక!

  وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة

కలిమిని ప్రసాదించినపుడు కృతజ్ఞతలు తెలుపుకునే, లేమికి గురి చేసినప్పుడు సహనం వహించే, తప్పులు జరిగిపోయినప్పుడు పశ్చాత్తాపం చెందే సజ్జనులకోవలో మిమ్మల్ని చేర్చుగాక!- ఈ మూడు విషయాలే మహాభాగ్యం అనబడతాయి.

اعلم أرشدك الله لطاعته أن الحنيفية – مِلةَ إبراهيمَ – : أنْ تَعبُدَ الله مُخلصاً له الدين، وبذلك أمرَ الله جميع الناس، وخَلَقهم لها ، كما قال

ఆరాధనలో ఏకాగ్ర చిత్తం కలిగి ఉండటం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) అనుయాయునిగా మారటం – అంటే ఏమిటో తెలుసా?! ఒక్కడైన అల్లాహ్‌ను సేవించడంలో చిత్తశుద్ధినీ, వజ్ర సంకల్పాన్ని కనబరచటం! అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

“మేము మానవుల్ని, జిన్నుల్ని మా దాస్యం కోసమే పుట్టించాము.” (అజ్జారియాత్‌ 51:56)

فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة)

అల్లాహ్‌ తన దాస్యం కోసమే మిమ్మల్ని పుట్టించాడన్న సంగతి మీకు తెలిసినప్పుడు, ఆ దాస్యం స్వచ్చమైన – ఏకేశ్వరోపాసన (తౌహీద్‌) – తో కూడుకున్నదై ఉండాలన్న సత్యం కూడా మీరు తెలుసుకోవటం అవసరం. ఏ విధంగానయితే మీరు శుచీ శుభ్రతల (తహారత్‌)ను పాటించినపుడే నమాజ్‌ నెరవేరుతుందో అదే విధంగా అద్వితీయుడైన అల్లాహ్ కు భాగస్వామ్యం (షిర్క్‌)కల్పించకుండా ఉన్నప్పుడే దాస్యం స్వీకార యోగ్యం అవుతుంది.

فإذا دخل الشركُ في العبادة فسدتْ، (كالحَدَثِ إذا دخل في الصلاة) ، كما قال تعالى

ఆరాధన (దాస్యం)లోనే గనక “షిర్క్‌” వచ్చి చేరితే అది కలుషితం అయిపోతుంది.శుచీ శుభ్రతలను అశుద్ధ వస్తువులు పాడు చేసేసినట్లే షిర్క్‌తో కూడుకున్న పనులు స్వచ్చమైన తౌహీద్‌ను పాడు చేసేస్తాయి. దివ్యగ్రంథంలో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ

“ముష్రిక్కులు అల్లాహ్‌ మసీదులలో సంరక్షకులుగా, సేవకులుగా ఉండటానికి పనికి రారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమై పోయాయి.నరకంలో వారు కలకాలం ఉండాలి.” (అత్‌ తౌబా 9:17)

فإذا عرفتَ أنّ الشرْكَ إذا خالط العبادة أفسدها وأحبط العمل وصار صاحبه من الخالدين في النار: عرفتَ أن أهمَّ ما عليك: معرفةُ ذلك؛ لعل الله أن يخلصك من هذه الشبكة، وهي الشرْكُ بالله

‘షిర్క్‌’ (భాగస్వామ్యం) వల్ల ఆరాధనలు, ఆచరణలన్నీ వ్యర్థమైపోతాయనీ, ముష్రిక్కుల పర్యవసానం నరకమని మీకు తెలిసిపోయిన మీదట, ఆ “షిర్క్‌” గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, దానిపట్ల జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా మీపై ఉంది; అప్పుడే మీరు ఆ వినాశకర చేష్ట నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోగలుగుతారు. దాని గురించి అల్లాహ్‌ ఇలా అంటున్నాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

“అల్లాహ్‌ దృష్టిలో షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది.అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు.” (అన్‌ నిసా 4:116)

: وذلك بمعرفة أربع قواعد ذكرها الله في كتابه

అల్లాహ్‌ తన గ్రంథంలో ప్రస్తావించిన ఈ క్రింది నాలుగు ప్రధానాంశాలను తెలుసుకున్నప్పుడే దీని గురించిన పూర్తి అవగాహన ఏర్పడుతుంది.

మొదటి నియమం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వ్యతిరేకంగా వైర వైఖరిని అవలంబించి, కయ్యానికి కాలు దువ్విన అవిశ్వాసులు కూడా అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రదాతగా, విధాతగా అంగీకరించేవారు. కాని వారి ఈ అంగీకారం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. (అంటే ఒక్కడైన అల్లాహ్‌ను సేవించే వరకూ వారు ముస్లింలు కాలేకపోయారు.) దివ్యగ్రంథంలోని దైవోపదేశం ఇందుకు ప్రబల నిదర్శనం:

قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ

వారిని అడుగు : ఆకాశం నుండీ, భూమి నుండీ మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? వినే శక్తీ, చూసే శక్తీ ఎవడి అధీనంలో ఉన్నాయి? ప్రాణములేని దాని నుండి ప్రాణమున్న దానినీ, ప్రాణమున్న దాని నుండి ప్రాణములేని దానినీ వెలికి తీసేవారు తప్పకుండా అంటారు. ఇలా అను: “అలాంటప్పుడు మీరు (షిర్క్‌కు వ్యతిరేకంగా నడవటం) మానుకోరేమిటి?” (యూనుస్‌ 10:31)

రెండవ నియమం :

తాము వాళ్ళను (తమ మిథ్యా దైవాలను, వలీలను) కేవలం సామీప్యం కోసం, సిఫారసు కోసమే పిలుస్తున్నామని ముష్రిక్కులు అనేవారు. ఈ సామీప్యానికి వారిచ్చే నిదర్శనం ఏమిటంటే ఈ వలీలు, పుణ్య పురుషులు తమను అల్లాహ్‌కు చేరువ చేస్తారని అనేవారు. కాని ఇది పచ్చి షిర్క్‌. ఈ సందర్భంగా అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు :

أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

ఇక ఆయనను వదిలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారు, (తమ ఈ చర్యకు సమర్థింపుగా) “వారు మమ్మల్ని అల్లాహ్‌ వద్దకు చేరుస్తారని మాత్రమే వారిని ఆరాధిస్తున్నాము” అని అంటారు.అల్లాహ్‌ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాదీ, సత్య ధిక్కారి అయిన ఏ వ్యక్తికీ అల్లాహ్‌ సన్మార్గం చూపడు.” (జుమర్‌-3)

సిఫారనుకు సంబంధించిన (అంటే వారు కల్పించుకున్న కాల్పనిక దేవుళ్ళు వారికి వారధిగా ఉంటారన్న వారి నమ్మకం షిర్క్‌ అని చాటి చెప్పే) ఆయతు:

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

“ఈ ప్రజలు అల్లాహ్‌ను కాదని తమకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ కలిగించలేని వారిని పూజిస్తున్నారు.పైగా ఇలా అంటున్నారు : “వారు అల్లాహ్‌ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు.” (ప్రవక్తా!) వారితో ఇలా అను : ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా?” ఆయన పరిశుద్దుడు.ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు, ఉన్నతుడూను.” (యూనుస్‌ 10:18)

సిఫారసు రెండు రకాలు. ఒకటి: నకారాత్మక సిఫారను. రెండు : సకారాత్మక సిఫారసు.

1. నకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన వాటి కోసం దైవేతరుల ముందు అర్థించటం. దీనికి ఆధారం ఇది :

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ

“విశ్వసించిన ఓ ప్రజలారా! క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగ పడని, సిఫారసు కూడా చెల్లని, ఆ (చివరి) దినము రాక పూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరి సంపదలనుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మా ర్గులు”.’ (అల్‌ బఖర 2:254)


* ఈ సూక్తి గురించి వ్యాఖ్యానిస్తూ అల్లామా ఇబ్నె కసీర్‌ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు – అల్లాహ్‌ తన దాసులకు, తాను ప్రసాదించిన ఉపాధి నుండి, తన మార్గంలో ఖర్చుపెట్టమని ఆదేశిస్తున్నాడు.ఎందుకంటే వారు తవు ప్రభువు వద్ద తమ పుణ్య రాసులను సమకూర్చుకొవాలని! ప్రళయ దినం రాకముందే వారు ఈ పని చేసుకోవాలి.ఆ రోజు ఎంత కఠినమైనదంటే, ఆనాడక్కడ క్రయ విక్రయాలు గానీ, బేరసారాలు గానీ, స్నేహసంబంధాలు గానీ, రికమండేషన్లు గానీ ఏ మాత్రం పనికిరావు. పరిహారంగా సొమ్ము ఇవ్వటం కుదరదు. భూమండలం లోని బంగారాన్నంతటినీ ఇచ్చినా ఆనాడు మనిషి తనను విడిపించుకోలేడు. ఆవగింజంత ప్రయోజనం కూడా తన  ఆత్మకు చేకూర్చుకోజాలడు.

శంఖం ఊదబడిన రోజున వారు ఒక పట్టాన నిలదొక్కుకోవటం గానీ, ఒకరినొకరు పరామర్శించుకోవటం గానీ చేయలేరు. సిఫారసు చేసేవారి సిఫారసు కూడా ఏ విధంగానూ వారికి ఉపయోగ పడదు.


2. సకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌ను మాత్రమే వేడుకొనే సిఫారసు. సిఫారసు చేసేవాడు కూడా ఈ సిఫారసు మూలంగా ఆదరణీయుడవుతాడు. ఎవరి కోసమైతే సిఫారసు చేయబడుతుందో అతని వట్ల అల్లాహ్‌ కూడా ప్రసన్నుడవు తాడు. ఇటువంటి సిఫారసు కేవలం అల్లాహ్‌ నుండి మాత్రమే అర్థించబడుతుంది. ఎందుకంటే సిఫారసును ఆమోదించటం లేక ఆమోదించక పోవటమన్నది అల్లాహ్‌ అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది.కనుక దైవేతరుల నుండి అర్ధించేవాడు షిర్కుకు ఒడిగట్టినట్లే. ఎందుకంటే అతడు చేయరాని పనిని చేశాడు.’వేడుకోలు’కు విరుద్ధమైన వైఖరిని అవలంబించాడు.అల్లాహ్‌ కేవలం ఏకేశ్వరోపాసనను మాత్రమే ఇష్టపడతాడు. ఏకేశ్వరోపాసకులకై చేసే సిఫారసును మాత్రమే అంగీకరించి ఆమోదిస్తాడు. దివ్య ఖుర్‌ఆన్‌లో ఆయన సెలవిచ్చినట్లు:

مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ

“ఆయన సన్నిధిలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చెయ్యగల వాడెవ్వడు?” (అల్‌ బఖర 2:255)

يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ

“వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు, సిఫారసు వినటానికి అల్లాహ్‌ ఇష్టపడిన వాని విషయంలో తప్ప.” (అంబియా 21:28)

قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا

“ఇంకా ఇలా అను : సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్‌ చేతిలోనే ఉన్నది.” (అజ్‌ జుమర్‌ 29:44)

మూడవ నియమం:

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెక్కు ఆరాధ్య దైవాలను పూజించే ప్రజల్లో ప్రభవింప జేయబడ్డారు.ఆ ప్రజల్లో కొందరు దైవదూతలను పూజించగా, మరి కొందరు దైవప్రవక్తలను ఆరాధించేవారు. కొందరు మహనీయులను కొలవగా, ఇంకొందరు చెట్టు పుట్టలను, రాళ్ళు రప్పలను కొలిచేవారు. మరికొందరు సూర్యచంద్రులను సేవించేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీళ్ళందరి మిథ్యా విధానాన్ని అంతమొందించారు.ఈ విషయంలో వారి మధ్య ఎలాంటి వ్యత్యాసం కనబరచలేదు. దీనికి నిదర్శనం ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:

وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ

“పీడన ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు, అల్లాహ్‌నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ అవిశ్వాసు లతో యుద్ధం చేయండి.” (అన్‌ఫాల్‌ 8:39)

సూర్యచంద్రుల దాస్యానికి సంబంధించిన నిదర్శనం ఇది:

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“రేయింబవళ్ళు, సూర్యచంద్రులు అన్నీ ఆయన(అద్వితీయ శక్తికి) నిదర్శనాలలోనివి. కనుక మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగ పడకండి. మీకు దైవారాధన చేయాలనే ఉంటే ఈ నిదర్శనాలన్నింటినీ సృష్టించిన దైవానికి మాత్రమే సాష్టాంగపడండి.” (హామీమ్‌సజ్దా 41:37)

దైవదూతలను పూజించటం కూడా షిర్కేనన్న దానికి తార్కాణం:

وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا

“మీరు దైవదూతలను, దైవప్రవక్తలను మీ ప్రభువుగా చేసుకోమని ఆయన మిమ్మల్ని ఆదేశించటం లేదు.” ‘ (ఆలె ఇమ్రాన్‌ 3:80)

దైవప్రవక్తలను పూజించటం, అక్కరల కోసం వారిని అర్థించటం ‘షిర్క్‌’ అన్న దానికి ఈ సూక్తి నిదర్శనం:

وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ

(ఆ సన్నివేశాన్ని గురించి కాస్త ఆలోచించండి) “మర్యమ్‌ కుమారుడవైన ఓ ఈసా! నీవు మనుష్య జాతితో, అల్లాహ్‌ను కాదని నన్నూ, నాతల్లిని దేవుళ్ళుగా భావించండి అని బోధించావా? అని అల్లాహ్‌ అడిగినప్పుడు అతను ఇలా మనవి చేనుకుంటాడు: “నీవు అత్యంత పవిత్రుడవు! ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనడం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే, అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది. నామనస్సులో ఏముందో నీకు తెలుసు. నీమనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యదార్థాలన్నీ తెలిసిన మహా జ్ఞానివి.” (అల్‌ మాయిద 5:116)

ఇక ఔలియాలు, పుణ్యపురుషులకు సంబంధించిన నిదర్శనం (అంటే వాళ్ళను వేడుకుని, వాళ్ళ ఆధారంగా దేవుని సామీప్యం పొందవచ్చుననుకోవటం షిర్క్‌. ఇలాంటి వ్యవహారాలకు అల్లాహ్‌ అతీతుడు, ఉన్నతుడు). ఈ సూక్తిని గమనించండి:

أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا

“ఈ ప్రజలు ఎవరిని మొర పెట్టుకుంటున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందడానికి మార్గాన్ని వెతుకుతున్నారు. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వారు, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు.” (బనీ ఇస్రాయీల్‌ 17:57)

ఇక చెట్టు పుట్టలు, రాళ్ళు రప్పలకు సంబంధించిన నిదర్శనం – అంటే వృక్షాలను, రాళ్ళను పూజించటం, మహనీయుల సమాధుల నుండి శుభం పొందాలని తాపత్రయ పడటం, తమ కష్టాలను, కడగండ్లను దూరం చేసుకోవటానికి వాళ్ళను మొక్కుకోవటం, వారి పేరున జంతువులను కోయటం, ఆ సమాధుల వద్ద కొంత కాలంపాటు గడపటం, అక్కడే ఆరాధనలు చేయటం, అక్కడి మట్టితో, వస్త్రాలతో ‘శుభం’ పొందగోరటం-ఇవన్నీ ‘షిర్క్‌’గా పరిగణించ బడతాయి. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు –

أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ

ఇప్పుడు చెప్పండి : “ఈ లాత్‌, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికత గురించి మీరు కాస్తయినా ఆలోచించారా?” (అన్‌ నజ్మ్‌ 53:19)


1 ఈ సూక్తికి వ్యాఖ్యానంగా హాఫిజ్‌ ఇబ్నె కసీర్‌ ఇలా అంటున్నారు: తనను తప్ప మరొకరిని పూజించమని అల్లాహ్ ఎన్నడూ ఆదేశించడు. తన దూతలను పూజించమని గానీ, తాను పంపిన ప్రవక్తలను ఆరాధించమని గానీ కోరడు. ఇస్లాం స్వీకరించిన తరువాత ధిక్కార వైఖరికి ఒడిగట్టమని కూడా అనడు. దైవేతరుల దాస్యం చేయమని పిలుపు ఇచ్చేవాడే ఇలాంటి ఆజ్ఞలు జారీ చేస్తాడు. దైవేతరుల దాస్యం కొరకు ఆహ్వానించిన వాడు నిశ్చయంగా  కుఫ్ర్కి (అవిశ్వాసానికి) ఒడిగట్టాడు. కాగా; దైవప్రవక్తలు సతతం ఈమాన్‌ గురించి మాత్రమే ఉపదేశిస్తారు. సాటిలేని సృష్టికర్తను నమ్మటం, దాస్యం చేయటమే ఈమాన్‌ బిల్లాహ్‌.

2. “ఊలాయి కల్లజీన……..” సూక్తి గురించి బుఖారీలో హజ్రత్‌ అబ్దుల్లాహ్ చే ఇలా ఉల్లేఖించబడింది – “ప్రజలు మొర పెట్టుకునే ఆ కొంతమంది ఎవరంటే వారు జిన్ను వర్గానికి చెందిన వారు. తరువాత వారు ఇస్లాం స్వీకరించారు.”

హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం ఈ విధంగా వుంది: “ఈ ఆయతు జిన్నులను పూజించే అరబ్బులను ఉద్దేశించి అవతరించింది. ఆ జిన్నులు తరువాత ఇస్లాం స్వీకరించారు. ఆ సందర్భంగానే ఈ ఆయతు అవతరించింది. వాస్తవం అల్లాహ్‌ యెరుక” (షేఖ్‌ ముహమ్మద్‌ మునీర్‌ డెమాస్కసీ)


అల్లాహ్‌ ముష్రిక్కుల వైఖరిని ఖండిస్తూ ఈ ఆయతును అవతరింపజేశాడు. వాళ్లు విగ్రహాలను, దేవీదేవతలను పూజించేవారు. వాళ్ల పేరుతో కాబా గృహం మాదిరిగా కట్టడాలు నిర్మించేవారు.

లాత్‌ : తాయఫ్‌లో ఒక తెల్లని రాయి ఉండేది. దానిపై ఓ గృహం నిర్మించబడింది. అందులో అనేక తెరలు ఉండేవి. అనేక మంది సేవకులుండేవారు. దాని చుట్టూ మైదానాలుండేవి. తాయఫ్‌లో సఖీఫ్‌ తెగవారి దృష్టిలోఈ కట్టడం ఎంతో పవిత్రమైనదిగా, పూజనీయంగా ఉండేది.ఆ ప్రదేశంలో ఆ విగ్రహం ఉన్నందుకు ఖురైషులతోపాటు ఇతర అరబ్బు తెగలవారు కూడా గర్వపడేవారు.

ఉజ్జా: ఇదొక వృక్షం.ఇది ‘నఖ్లా’ అనే స్థలంలో ఉంది. ఈ “నఖ్లా’ మక్కా నగరానికి తాయఫ్‌ పట్టణానికి మధ్య ఉంది. ఈవృక్షంపై ఒక కట్టడం వెలిసింది. దానిపై కొన్ని పరదాలు వేలాడదీయబడ్డాయి. ఖురైష్‌ తెగవారు ఈ కట్టడాన్ని ఆరాధించేవారు. ఈ కారణంగానేనేమో ఉహుద్‌ యుద్ధ దినాన అబూ సుఫ్యాన్‌ ఈ కట్టడాన్ని తలచుకుంటూ”మాకు అండగా, ఉజ్జా దేవత ఉంది. మీకెవరున్నారు?!” అని ముస్లింలకు సవాలు విసిరాడు.దానికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రీయ సహచరుల చేత, “అల్లాహ్‌ మాకు అండగా ఉన్నాడు. మీకు అండగా ఎవరూ లేరు” అని చెప్పించారు.

మనాత్‌ : మక్కా-మదీనా నగరాల మధ్య ముసల్లల్‌ అనే స్ధలంలో ఈ విగ్రహం ఉండేది. అజ్ఞాన కాలంలో ఖుజాఅ, బెస్‌, ఖజ్రజ్‌ తెగల వారు ఈ విగ్రహానికి తమ శ్రద్ధాభక్తుల నివాళి ఘటించేవారు. హజ్‌ నెలలో కాబాకు వచ్చే యాత్రికులు ఈ స్థలం నుండే ఇహ్రామ్‌ దీక్ష బూనేవారు.ఈ కట్టడాలన్నింటినీ కూల్చడానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమంది సహాబీలను పంపించారు. హజ్రత్‌ ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (రజి యల్లాహు అన్హు)ని మాత్రం “ఉజ్జా’ వైపునకు పంపారు.ఆయన ఆ కట్టడాన్ని నేలమట్టం చేస్తూ ఇలా పలికారు:-

ఓ ఉజ్జా! నేను నిన్ను ధిక్కరిస్తున్నాను. నీ పవిత్రతను కొనియాడబోను. అల్లాహ్‌ నీకు దుర్గతి పట్టించాడు.”

హజ్రత్‌ ముగీరా బిన్‌ షోబ (రజి యల్లాహు అన్హు), హజ్రత్‌ సుఫ్యాన్‌ (రజి యల్లాహు అన్హు)లను “లాత్‌’ విగ్రహం వైపునకు పంపించగా వారిద్దరూ కలసి ఆ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆస్థలంలో ఒక మస్జిద్ను కూడా నిర్మించారు.ఈ విగ్రహం తాయఫ్‌ పట్టణంలో ఉండేది. మనాత్‌ విగ్రహం వైపునకు హజ్రత్‌ సుఫ్యాన్‌ పంపించబడ్డారు.ఆయన దాన్ని పడగొట్టారు. హజ్రత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ పడగొట్టారని కూడా ఒక ఉల్లేఖనం ఉంది.

మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సత్య ధర్మాన్ని తీసుకువచ్చారు. ఒక్కడైన సృష్టికర్తను సేవించమనీ, దైవారాధన స్వచ్భంగా ఉండాలనీ ఆయన ప్రజలకు బోధించారు. దురాచారాలను, షిర్కుతో కూడుకున్న కర్మలను ఆయన నిర్మూలించారు. ఆయన ప్రియ సహచరులు, వాళ్ల శిష్యులు కూడా ఈ సత్య ధర్మంపై స్థిరంగా ఉన్నారు. అయితే కాలక్రమేణా అనుయాయుల ధర్మావలంబనలో మార్చులు వచ్చాయి. ఆచరణలు కలగాపులగం అయి చాలా మంది ముస్లింలు షైతాన్‌ ఎత్తులకు చిత్తయిపోయారు. మిథ్యావాదులు ముస్లింలను లోబరుచు కున్నారు. వాళ్లు మళ్లీ విగ్రహారాధన వైపునకు మొగ్గసాగారు. తమకు తెలియ కుండానే వాళ్లు నెమ్మదిగా బహు దైవోపాసన వైపునకు తీసుకుపో బడుతున్నారు. కాని పండితులు ఈ విషయాన్ని పట్టించు కోవటం లేదు.ఇది ఎంతో శోచనీయం.

– షేక్‌ ముహమ్మద్‌ మునీర్‌ డెమాస్కసీ

హజ్రత్‌ అబూ వాఖిద్‌ లైసీ (రజి యల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలిసి హునైన్‌ వైపునకు బయలుదేరాము. ఆరోజుల్లోనే మేము దైవధిక్కార (కుఫ్ర్) ఊబిలో నుండి బయటపడి ఉన్నాము. దారిలో ఒక రేగి చెట్టు ఉండేది. బహు దైవారాధకులు ఆ వృక్షం వద్ద బైఠాయించేవారు. తమ ఆయుధాలను ఆ వృక్షానికి వ్రేలాడదీసేవారు. ఆ వృక్షం “జాతుల్‌ నవాద్‌”గా పిలువబడేది. ఆ వృక్షం వద్దకు సమీపించగానే, “దైవప్రవక్తా! ఏవిధంగానయితే ఈ వృక్షం వాళ్లకోసం ‘జాతుల్‌ నవాద్‌’గా ఉందో ఆ విధంగా మాక్కూడా ‘జాతుల్‌ నవాద్‌’ గా చేయండి”అని మేము ప్రాధేయపడ్డాము.దీనిపై మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఆగ్రహం చెందారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వ్యాఖ్యానించారు:

“అల్లాహు అక్బర్‌! ఇవైతే ప్రాచీన కాలవు ఆచారాలు. ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. ఇస్రాయీల్‌ సంతతి వారు మూసా (అలైహిస్సలాం)తో అన్న మాటలే ఈనాడు మీరు అన్నారు.”వాళ్ళకున్న ఆరాధ్య దైవాల వంటివే మాకోసం కూడా కల్పించండి” అని ఇస్రాయీల్‌ వంశీయులు చెప్పి ఉన్నారు. మీరు ఒట్టి అజ్ఞానులు. మీరు మీ పూర్వీకులయిన యూదుల, కైస్తవుల పద్ధతులను అనుసరించేలా ఉన్నారు.” (తిర్మిజీ)

నాల్గవ నియమం :

ఈ కాలపు ముష్రిక్కులు పూర్వకాలపు ముష్రిక్కుల కన్నా కడు హీనంగా ఉన్నారు. ఎందుకంటే, పూర్వకాలపు ముష్రిక్కులు కలిమిలో షిర్క్‌ (బహు దైవోపాసన)కు పాల్చడే వారు. కష్టకాలం దాపురించగానే ఒక్కడైన దైవం వైపుకు చిత్తశుద్ధితో మరలేవారు. కాని ఈ కలికాలపు ముష్రిక్కులైతే కష్ట కాలంలోనే గాక,సుఖ సంతోషాల సమయాల్లో సైతం బహు దైవారాధనకు పాల్పడుతున్నారు. దైవ గ్రంథంలోని ఈ దైవోపదేశం ఇందుకు ప్రబల తార్కాణం :

فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ

“వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు.తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకు రాగానే, అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ఆరంభిస్తారు.” (అన్‌కబూత్‌ 29:65)

మనలోని చాలా మంది తమ పూర్వీకుల, సజ్జనుల సమాధుల వద్దకు పోయి,వాటి ముందు చేయి చాచి అర్థించటం మనం చూస్తూ ఉన్నాము. కలిమిలోనూ లేమిలోనూ కూడా వీళ్లు ఈ పని చేస్తున్నారు. ప్రాచీన కాలపు ముష్రిక్కులే నయం. ఎందుకంటే వాళ్లు కష్టాల్లో మాత్రం నిజదైవం వైపునకు మరలి, కష్టాలు తీరిపోయిన తరువాత బూటకపు దైవాల వద్దకు పోయేవారు. కాని నవీన ముష్రిక్కులకు ఇలాంటి తేడా పాడా లేమీ లేవు. పైగా కష్టకాలంలో వీళ్ల బహు దైవోపాసనా చేష్టలు మరింత పెరిగిపోతున్నాయి. లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్‌ అలియ్యిల్‌ అజీమ్‌.

సర్వోన్నతుడైన అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ

“మీరు అల్లాహ్‌ను కాదని వేడుకునే మీ దేవీలు ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్‌ నాపై కనికరం చూపగోరికే, వారు ఆయన కారు ణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయ మేమిటీ? కనుక వారితో ఇలా అను : “నాకు అల్లాహ్‌ ఒక్కడే చాలు. నమ్ముకునే వారు ఆయననే నమ్ముకుంటారు.” (అజ్‌ జుమర్‌ 39:38)

ఇంకా ఈ విధంగా ఉపదేశించబడింది:

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

“కలత చెందినవాడు మొర పెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్‌తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడా ఎవడయినా ఉన్నాడా? కాని మీరు చాలా తక్కువగా ఆలో చిస్తారు?” (అన్‌ నమల్‌ 27:62)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది :

يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ

“ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా, వాటికి ఏ నమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయంనాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసినవాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజెయ్యలేడు.” (ఫాతిర్‌ 35: 13,14)

ఇంకా ఈ విధంగా కూడా ఉపదేశించబడింది:

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

“అల్లాహ్‌ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి నమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమభ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశ పరచినప్పుడు, వారు తమనువేడుకున్న వారికి విరోధులై పోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ 46:5,6)


[వీడియో పాఠం]

షిర్క్ కి సంబంధించిన నాలుగు సూత్రాలు (The Four Principles of Shirk)
https://youtu.be/nAglSs0ggPE [~ 40 నిముషాలు]
వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)