అల్ కుఫ్ర్ – అవిశ్వాసం (Kufr-Disbelief) – ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ

sad-tree-kufrరచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: అల్ కుఫ్ర్ అంటే అవిశ్వాసం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

అవిశ్వాసం (అల్ కుఫ్ర్)  – الـْــكُــفْــرْ 

అవిశ్వాసం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు

అవిశ్వాసం అంటే ప్రధానంగా ఇస్లాం ధర్మంలోని విశ్వాసపు మూలస్థంభము (అర్కానె ఈమాన్) లలో ఏ మూలస్థంభాన్ని అయినా విశ్వసించక పోవటం.

విశ్వాసపు మూలస్థంభములు (అర్కానె ఈమాన్) ఆరు : అవి

  1. అల్లాహ్ పై విశ్వాసం ఉంచటం,
  2. అల్లాహ్ యొక్క దైవదూతల పై విశ్వాసం ఉంచటం,
  3. అల్లాహ్ యొక్క సందేశహరుల పై విశ్వాసం ఉంచటం,
  4. అల్లాహ్ అవతరింపజేసిన దివ్యగ్రంథాల పై విశ్వాసం ఉంచటం,
  5. పునరుజ్జీవన దినం (తిరిగి లేపబడే తీర్పుదినం) పై విశ్వాసం ఉంచటం,
  6. అల్ ఖదర్ పై విశ్వాసం ఉంచటం – సర్వలోక సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడు (అల్లాహ్) మానవుల జాతకాలను ముందుగానే నిర్దేశించాడని నమ్మటం, దేనినైతే ఆయన ముందుగానే నిర్దేశించి ఉన్నాడో, మన జీవితంలో అది తప్పక అంటే నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుందని విశ్వసించటం.

ఈ అవిశ్వాసం రెండు రకాలు: –

  1. ఘోరమైన అవిశ్వాసం
  2. అల్పమైన అవిశ్వాలం

1) ఘోరమైన అవిశ్వాసం (అల్ కుఫ్ర్ అల్ అక్బర్): ఈ విధమైన అవిశ్వాసం ఇస్లాం నుండి పూర్తిగా బహిష్కరింపజేస్తుంది.  దీనిలో ఐదు రకాలు ఉన్నాయి.:

  • తిరస్కారపు అవిశ్వాసం – కుఫ్ర్ అత్తఖాదిబ్: దివ్యమైన సత్యసందేశాన్ని నమ్మకపోవటం లేదా విశ్వాసపు మూలస్థంభాలలో దేనినైనా నిరాకరించటం (త్రోసి పుచ్చటం) లేదా ఖండించటం. దివ్యఖుర్ఆన్ లోని 39వ అధ్యాయం 32వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “ఎవడు అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదిస్తాడో, సత్యం (దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానం) అతడి ముందుకు వచ్చినప్పుడు అది అబద్దమని దానిని తిరస్కరిస్తాడో, అతడి కంటే పరమ దుర్మార్గుడెవరు? అటువంటి వారికి నరకంలో స్థానమేమీ లేదా?” (V. 39:32)
  • అహంకారపు అవిశ్వాసంకుఫ్ర్ ఇబావత్తకాబ్బుర్ మా అత్తస్ది: అల్లాహ్ ఆదేశాలు సత్యమైనవని తెలిసీ, అహంకారం వలన వాటికి సమర్పించుకోకుండా తిరస్కరించటం. దివ్యఖుర్ఆన్ లోని 2వ అధ్యాయం 34వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “మేము దైవదూతలకు: ‘మీరందరూ ఆదమ్ కు సజ్దా (సాష్టాంగం)చేయండి.’ అని ఆదేశించినప్పుడు, వారందరూ సాష్టాంగ పడినారు. కాని ఇబ్లీసు ధిక్కరించాడు. దురహంకారానికి గురి అయ్యాడు. అవిధేయులలో కలసి పోయాడు. (అల్లాహ్ కు అవిధేయుడైనాడు)”
  • ధిక్కారపు అవిశ్వాసంకుఫ్ర్ అష్షక్కాజ్జాన్న్: విశ్వాసపు ఆరు మూలస్థంభాలపై సందేహం ఉంచటం లేక స్పష్టమైన అవగాహన లేకపోవటం. దివ్యఖుర్ఆన్ లోని 18వ అధ్యాయం 35 – 38వ వచనాలలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునే వాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: ‘ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను. మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను. ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీనికంటే మేలైన స్థానాన్నే పొందగలను.’ అతని పొరుగువాడు అతడితో మాట్లాడుతూ ఇలా అన్నాడు ‘నిన్ను మట్టితో, తర్వాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తర్వాత నిన్ను (సంపూర్ణ) మానవునిగా తీర్చిదిద్దిన ఆయన ను నీవు తిరస్కరిస్తున్నావా? కాని నిశ్చయంగా నాకు మాత్రం ఆయనే అంటే అల్లాహ్ యే నా ప్రభువు మరియు నేను ఎవ్వడినీ నా ప్రభువుకు భాగస్వామిగా కల్పించను”
  • సంకల్పంలో అవిశ్వాసంకుఫ్ర్ అల్ ఇరాదహ్: తెలిసీ సత్యం నుండి తిరిగి పోవటం (ముఖం త్రిప్పుకోవటం) లేదా అల్లాహ్ అవతరింపజేసిన స్పష్టమైన చిహ్నాల నుండి  దృష్టి మళ్ళించటం (ఉల్లంఘించడం). దివ్యఖుర్ఆన్ లోని 46వ అధ్యాయం 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీతకాలం కొరకు మాత్రమే సృష్టించాము. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవుతున్నారు.” (V. 46:3)
  • కపటత్వపు అవిశ్వాసంకుఫ్ర్ అన్నిఫాఖ్: మోసపూరితమైన, వంచనతో కూడిన లేక కపటమైన అవిశ్వాసం. దివ్యఖుర్ఆన్ లోని 63వ అధ్యాయం 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “వారు తమ ప్రమాణాలను ఢాలుగా చేసుకున్నారు. ఆ విధంగా వారు (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి విరోధిస్తున్నారు. నిశ్చయంగా, వారు చేస్తున్న చేష్టలు ఎంతో నీచమైనవి. ఇది నిశ్చయంగా, వారు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అవటం మూలంగానే జరిగినది. కావున వారి హృదయాలు మీద ముద్ర వేయబడి ఉన్నది. కనుక వారు ఏమీ అర్థం చేసుకోలేరు.” (V. 63:2 – 3)

2) అల్పమైన (తక్కువ స్థాయి) అవిశ్వాసం (అల్ కుఫ్ర్ అల్ అస్గర్):

ఈ విధమైన అవిశ్వాసం ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేయదు. దీనినే కుఫ్ర్ అన్నిఆమాహ్ అని కూడా అంటారు. అల్లాహ్ ప్రసాదిస్తున్న దీవెనలు మరియు శుభాల పై అయిష్టంగా ఉండటం అంటే అల్లాహ్ కే కృతఘ్నత చూపటం. దివ్యఖుర్ఆన్ లోని 16వ అధ్యాయం 112వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు. మొదట అది శాంతి భద్రతలతో నిండి ఉండేది. దాని (ప్రజలకు) ప్రతి దిక్కు నుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత  వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు. కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు” (V. 16:112)

English Source: Appendix  from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .