అపనిందలు వేయటం (Gheebah & Slander)

హదీథ్׃ 08

تحريم الغيبة అపనిందలు వేయటం

حَدَّثَنَا يَحْيَىٰ بْنُ أَيُّوبَ وَ شِيْبَةَ وَ ابْنُ حُجْرٍ قَالُوا: حَدَّثَنَا إِسْمَاعِيلُ عَنِ الْعَلاَءِ عَنْ أَبِيهِ، عَنْ أَبِي هُرَيْرَةَ

أَنَّ رَسُولَ اللَّهِ قَالَ  ” أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ قَالُوا” اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ“ قَالَ”ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ“ قِيلَ  ”أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟   “قَالَ ” إِن كَانَ فِيهِ مَا تَقُولُ، فَقَدِاغْتَبْتَهُ. وَإِنْ لَمْ يَكُنْ فِيهِ، فَقَدْ بَهَتَّهُ “   رواة صحيح مسلم

హద్దథనా యహ్యా ఇబ్ను అయ్యూబ వ షీబత వ ఇబ్ను హుజ్రిన్ ఖాలూ, హద్దథనా ఇస్మాయీలు అనిల్ అలాయి అన్ అబిహి,  అన్ అబి హురైరత అన్న రసూలల్లాహి ఖాల, అతద్రూన మా అల్ గీబతు ?” ఖాలూ, అల్లాహు వ రసూలుహు ఆలము. ఖాల, దిక్రుక అఖాక బిమా యక్రహు. ఖీల, అఫరాయ్త ఇన్ కాన ఫీ అఖి మా అఖూలు ?” ఖాల, ఇన్ కాన ఫీహి మా తఖూలు, ఫఖదిగ్ తబ్తహు. వ ఇన్ లమ్ యకున్ ఫీహి, ఫఖద్ బహత్తహు. రవాహ్ సహీ ముస్లిం .

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త   ← యహ్యా ఇబ్ను అయ్యూబ ← షీబత వ ఇబ్ను హుజ్రిన్  ← ఇస్మాయీలు అనిల్ అలాయి ← అన్ అబిహి ← అబి హురైరత (రదియల్లాహుఅన్హు) ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ ఉపదేశించినారు. మీకు తెలుసా అల్ గీబ అంటే ఏమిటి?” సహచరులు ఇలా జబాబు ఇచ్చినారు, అల్లాహ్ మరియు ప్రవక్తకు అందరి కాంటే ఎక్కువగా తెలుసును. అప్పుడు ప్రవక్త ఇలా తెలిపినారు,మీరు మీ సహోదరుని గురించి అతనికి బాధ కలిగించే విధంగా చెప్పటం. (అదివిని) సహచరులు ఇలా ప్రశ్నంచారు, ఒకవేళ మేము ఎదైతే చెప్పినామో అది మా సహోదరునిలో ఉంటే?” అప్పుడు ప్రవక్త ఇలా సమాధానమిచ్చినారు, ఒక వేళ ఏదైతే చెప్పినారో అది అతనిలో ఉంటే, మీరు అతనిని కించ పరిచిన వారవుతారు. ఒక వేళ అది అతనిలో లేకుంటే, మీరు అతనిపై అపనింద మోపిన వారవుతారు సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.

ఉల్లేఖకుని పరిచయం:

అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

హదీథ్ వివరణ

ముస్లిం సమాజానికి నష్టం కలిగించే దుష్టుల చెడుగుణాల గురించి సావధానపర్చే ఉద్ధేశ్యంతో ఇతరులకు  చెప్పడంలో ఎటువంటి తప్పూ లేదు. ఈ హదీథ్ లోని ‘సోదరుడు’ అనే పదం ముఖ్యంగా ఒక ముస్లిం తోటి ముస్లిం పై చాడీలు చెప్పకూడదని సూచిస్తుంది.  ఎందుకంటే, తోటి ముస్లింలను సోదరులుగా స్వీకరించిన తర్వాత, వారిని క్షమించివేయవలెను, వారి తప్పులను గోప్యంగా ఉంచవలెను, మరియు వారిలోని చెడు గుణాలు త్వరగా దూరమవ్వాలని ఆశించాలే తప్ప వాటిని నలుగురిలో వ్యాపింపచేయకూడదు. వలెను. కాని ఎవరైనా తనలోని అవినీతిని, వ్యభిచర్యాన్ని, పోకిరితనాన్ని, సిగ్గుమాలినతనాన్ని,  చెడుగుణాలను బహిరంగంగా చర్చించటం అసహ్యించుకోకుండా, ఇంకా సంతోషపడుతున్నట్లయితే, ఆ చెడుగుణాల గురించి చెప్పటం ‘చాడీలు చెప్పటం’ అనబడదు.  చివరిగా చాడీలు చెప్పటం నిషేధించబడినదనే విషయం సర్వసాధారణమైన విషయం మరియు ఈ విషయమై ఇస్లాం లో ఏకాభిప్రాయం ఉన్నది.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. ముస్లింలు తమ  మానమర్యాదలను కాపాడుకోవటం కోసమైనా ఇస్లాం ఆదేశాలను గౌరవించ వలెను.
  2. చాడీలు చెప్పటం అంటే ‘అయిష్టపడే విధంగా తోటి ముస్లిం సోదరుడి గురించి మాట్లాడటం’ నిషేధించబడినది.
  3. ముస్లింలలో పరస్పర ద్వేషం పెరగటానికి చాడీలు చెప్పుకోవటం కూడా ఒక కారణం.
  4. చెడు అలవాట్లు, గుణాలు ముస్లింలలో నిషేధించబడినాయి.
  5. తోటి ముస్లిం సోదరుడిలోని చెడుగుణాలను, అవి వాస్తవంగా అతడిలో ఉన్నవైనా సరే, ఇతరులకు తెలుపటం అనేదే చాడీలు చెప్పటం అనబడుతుంది.
  6. తోటి ముస్లిం సోదరుడు సంతోషపడే విధంగా అతడి గురించి మాట్లాడటం ఒక మంచి పద్ధతి.

గమనిక: ఈ హదీథ్ చాడీలు చెప్పటం మరియు  నిందలు మోపటం ల మధ్య ఉన్న భేదాన్ని, వాటిలోని దుష్టత్వాన్ని స్పష్టంగా విశదీకరిస్తుంది. ఇవి రెండూ నాలుక ద్వారా జరిగే మహా పాపములు. ఇవి అత్యంత హానికరమైనవి.  ఇటువంటి ఘోరమైన మహాపాపముల నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక!

ప్రశ్నలు

  1. నాలుక ద్వారా జరిగే ఘోరమైన మహాపాపముల గురించి వ్రాయండి.
  2. చాడీలు చెప్పటం మరియు నిందలు మోపటం ల మధ్య ఉన్న భేదాన్ని వ్రాయండి.
  3. సమాజంలో ఐకమత్యాన్ని పెంచే కొన్ని మంచి గుణాల గురించి వ్రాయండి.
  4. సమాజానికి నష్టం కలిగించే కొన్ని చెడు గుణాల గురించి వ్రాయండి.
  5. ఈ హదీథ్ లోని బోధనలను మీ జీవిత అనుభవం ద్వారా వివరించండి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్