నైతిక ప్రవర్తన (నీతిబద్ధమైన నడవడిక) – Good Character

హదీథ్׃ 10

:حسن الخلق : నైతిక ప్రవర్త (నీతిబద్ధమై నడవడిక)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمَرٍ و رضى الله عنهما قَالَ : لَـمْ يَكُنِ النَّبِىُّ ^ فَا حِشاً وَّلاَ مُتَفَحِّشاً وَّ كَانَ يَقُوْلُ : ﺇِنَّ مِنْ خِيَارِكُمْ أَحْسَنُكُمْ أَخْلَاقاً  (رواه البخارى)

అన్ అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదిఅల్లాహు అన్హుమా ఖాల –  ″లమ్ యకున్ అన్నబియ్యు (సల్లల్లాహు అలైహి వసల్లమ్) – ఫాహిషన్ వలా ముతఫహ్హిషన్ – వకాన యఖూల్ ఇన్న మిన్ ఖియారికుమ్ అహ్ సనుకుమ్ అఖ్ లాఖ.″ రవాహుల్ బుఖారి

తాత్పర్యం :- అన్ = ఉల్లేఖన, అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క సహచరుడు(సహాబి), రదియల్లాహు అన్హుమా = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక ,  ఖాల = తెలిపారు,  లమ్  యకున్ = ఉండేవారు కాదు, అన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ్ = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్), ఫాహిషన్ = అసభ్యకరమైన, అసహ్యకరమైన మాటలు పలికే కలవారు, వ = మరియు, లా  ముతఫహ్హిషన్ = అసహ్యకరమైన ప్రవర్తన కలిగిన వారూ కాదు, వ = మరియు, కాన యఖూలు = తెలిపేవారు, ఇన్న = ఖచ్చితంగా, మిన్ ఖియారికుమ్ =  మీలో మంచివారు (ఉన్నతమైన వారు),  అహ్ సనుకుమ్ అఖ్ లాఖ = మంచి గుణాలు కలిగిన వారు. ఇమాం బుఖారి నమోదు చేసినారు.

అనువాదం:- అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ″ఫాహిష్(అసభ్యకరమైన సంభాషణ చేసేవారు)″ మరియు ″ముతఫహ్హిష్ (అసభ్యకరంమైన ప్రవర్తన కలవారు)″ కానీ కారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) అంటూ ఉండేవారు “మీలో ఉత్తమమైన వారు (ఎవరంటే), (ఎవరైతే) ఉత్తమమైన, ఉన్నతమైన గుణగణాలు (నడవడి )కలవారు.

వివరణ:- ఈ హదీథ్ లో – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఉత్తమమైన నడవడి, సభ్యత, సౌజన్యం కలవారు అనడానికి నిదర్శనం ఉన్నది. ఆయన ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడటం గానీ, తనచుట్టూ ఉన్నవాళ్ళను నవ్వించడానికి ఆ విధమైన సంభాషణ చేయడం గానీ ఎప్పుడూ చేయలేదు. అసభ్యకరమైన నడవడిక ఏ విషయంలోనైనా సరే (మనపట్ల) అసహ్యం, ఏహ్యభావం కలగచేస్తుంది. మనం సంభాషించేతీరు, ఉపయోగించే మాటలు, మనచేష్టలు, మన గుణగణాలు, స్వభావం (మనం ఇతరులకు ఆపాదించే గుణగణాలు) ఇవన్నీ మన సభ్యత, అసభ్యతలను తెలియచేస్తాయని గమనించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఒకసారి ఇలా అన్నారు “అసభ్యకరంగా ప్రవర్తించే వారినీ, నీతిబాహ్యులను అల్లాహ్ ఇష్టపడడు”

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు :-

  1. ఇస్లామీయ చట్టాల గొప్పదనం ఏమిటంటే అవి ప్రతి విషయంలోనూ నీతివంతమైన నడవడికి ప్రాధాన్యం ఇస్తాయి. ఇతరులకు నష్టం లేక కష్టం కలిగించడాన్నుంచి ఎల్లప్పడూ దూరంగా ఉండాలని, ప్రీతిపాత్రమైన నడవడిక కలిగి ఉండడాన్ని, మంచిపనులు చేయడాన్ని అన్ని వేళలా ప్రోత్సహిస్తుంటాయని గమనించాలి.
  2. ధర్మబద్ధతకు,సన్మార్గశీలతకు కట్టుబడి ఉండడం అంటే నీతిబాహ్యమైన వాటికి దూరంగా ఉండడం.
  3. నీతివంతమైన ప్రవర్తన, మంచి నడవడిక తీర్పుదినం నాడు మనల్ని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) దగ్గరకు చేరుస్తాయి.
  4. మనం ఇతరులను గౌరవించడం, వారిపట్ల దయ, కనికరం తో ప్రవర్తించడం – ధర్మబద్ధతకు, సత్శీలతకు నిదర్శనం అని గమనించాలి.
  5. సత్శీలత మనల్ని అల్లాహ్ అనుగ్రహానికి దగ్గర చేస్తుంది.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:-ఈ హదీథ్ ను ఉల్లేఖించినవారి పేరు అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ ఆస్ బిన్ వాయిల్ అస్సహామీ రదియల్లాహు అన్హుమా. ఈయన ఖురైష్ తెగకు చెందినవారు. ఈయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వంశానికి చెందినవారే. ఈయన వంశవృక్షంలో ఉన్న ముత్తాత కాబ్ బిన్ లోయి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) వంశవృక్షంలోఉన్న ముత్తాత కాబ్ బిన్ లోయి ఒకరే. ముందుగా ఇస్లాం స్వీకరించినవారిలో (సాబిఖీన్ అల్ అవ్వలీన్) ఒకరు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) హదీథ్ లను ఎక్కువ సంఖ్యలో ఉల్లేఖించినవారిలో వీరూ ఒకరు.

ప్రశ్నలు

  • 01. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) _____________, ____________″  కానీ కారు.
  • 02. “అల్లాహ్ _____________ ప్రవర్తించే వారినీ, _____________ ఇష్టపడడు”
  • 03. ఇస్లాం ప్రతివిషయంలోనూ _____________ నడవడికి ప్రాధాన్యం ఇస్తుంది.
  • 04. _____________ మనల్ని అల్లాహ్ అనుగ్రహానికి దగ్గర చేస్తుంది.
  • 05.అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ ఆస్ బిన్ వాయిల్ రదియల్లాహు అన్హుమా గురించి వ్రాయండి.
  • 06. మంచి వ్యక్తులు కలిగి ఉండే ఉన్నతమైన గుణం  _______________

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా