అవిధేయత మరియు అబద్ధపు సాక్ష్యం నిషేధింపబడినది (Disobedience and Lying)

హదీథ్׃ 05

تحريم العقوق وشهادة الزور

అవిధేయత మరియు అబద్ధపు సాక్ష్యం నిషేధింపబడినది

حَدَّثَني عَمْرُو بْنَ مُحمَّدُ بْنُ بُكَيرِ بْنِ مُحمَّدٍ النَّاقِدُ . حَدَّثَنَا إِسْمَاعِيلُ بْنُ عُلَيَّةَ عَنْ سَعِيدٍ الْجُرَيْرِيِّ . حَدَّثَنَا عَبْدُ الرَّحْمٰنِ بْنُ أَبِي بَكْرَةَ عَنْ أَبِيهِ قَالَ: كُنَّا عِنْدَ رَسُولِ اللّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَ سَلَّمَ  فَقَالَ:   ”أَلاَ أُنَبِّئُكُمْ بِأَكْبَرِ الْكَبَائِرِ؟ ثَلاَثاً :ا‌‌لإِشْرَاكُ بِاللَّهِ. وَعُقُوقُ الْوَالِدَيْنِ. وَشَهَادَةُ الزُّورِ، أَوْ قَوْلُ الزُّورِ “ وَكَانَ رَسُولُ اللَّهِ صَلَّىاللَّهُ عَلَيْهِ وَ سَلَّمَ مُتَّكِئًا فَجَلَسَ. فَمَا زَالَ يُكَرِّرُهَا حَتَّى قُلْنَا: لَيْتَهُ سَكَتَ ! : متفق عليه

హద్దథని అమ్రు ఇబ్న ముహమ్మదు ఇబ్ను బుకైరి ఇబ్ని ముహమ్మదిన్ అన్నాఖిదు, హద్దథనా ఇస్మాయీలు ఇబ్ను ఉలైయ్యత అన్ సయీదిన్ అల్ జురైరియ్యి, హద్దథనా అబ్దుర్రహ్మాని ఇబ్ను అబి బకరత అన్ అబిహి ఖాలా కున్నా ఇంద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఫఖాల అలా ఉనబ్బిఉకుమ్ బిఅక్బరి అల్ కబాయిరి థలాథ, అల్ ఇష్రాకు బిల్లాహి, వ ఉఖూఖుల్ వాలిదైని, వ షహాదతుజ్జూరి, అవ్ ఖౌలుజ్జూరి వ కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ముత్తకిఅన్ ఫజలస ఫమా జాల యుకర్రిరుహా హత్తా ఖుల్నా లైతహు సకత! ముత్తఫఖున్ అలైహ్

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీబుఖారీ మరియు సహీముస్లిం హదీథ్ గ్రంధకర్తలు ← అమర్ ఇబ్ను ముహమ్మద్ ఇబ్ను బుకైరి ఇబ్ని ముహమ్మదిన్ అన్నాఖిదు ← ఇస్మాయీలు ఇబ్ను ఉలైయ్యత అన్ సయీదిన్ అల్ జురైరియ్యి ← అబ్దుర్రహ్మాన్ ఇబ్ను అబి బకరత ← అబి బకరత (రదియల్లాహుఅన్హు) ← అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) – ఒకసారి మేము అల్లాహ్ యొక్క  ప్రవక్త సన్నిధిలో ఉన్నాము, అప్పుడు వారుఘోరాతి ఘోరమైన పాపముల గురించి మీకు తెలుపనా? అవి మూడు

  1. అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించటం.
  2. తల్లిదండ్రులకు అవిధేయత చూపటం.
  3. అబద్దపుసాక్ష్యంపలకటంఅనిబోధించారు.

 

అప్పటి వరకు ఏటవాలుగా ఒకవైపు ఒరిగి కూర్చుని ఉన్న దైవప్రవక్త, ఒకేసారి నిటారుగా కూర్చున్నారు మరియు వారు ఆ మాటలనే మళ్ళీమళ్ళీ “అలా పలకటం ఆపివేసి, నిశ్శబ్దంగా ఉంటే ఎంత బాగుండును” అని మేము కోరుకునేటంతటి వరకు అనేక సార్లు పలికారు. ముత్తఫఖున్ అలైహ్

హదీథ్ వివరణ

ఘోరమైన మహాపాపములు అనేకం ఉన్నాయి మరియు అన్నింటి కంటే ఘోరాతిఘోరమైన మహాపాపం – ‘అల్లాహ్ కు అతడి దివ్యకార్యములలో లేక అతడిని ఆరాధించటంలో లేక అతడి శుభమైన నామములలో లేక అతడి అత్యున్నతమైన గుణములలో భాగస్వామిని కల్పించటం.’ ఇస్లాం ధర్మంలో ఇది అత్యంత ఘోరాతి ఘోరమైన మహాపాపం గనుక, దైవప్రవక్త ఈ మహాపాపంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత, వారు తల్లిదండ్రులకు అవిధేయత చూపటం అనే మరో ఘోరమైన మహా పాపం గురించి తెలిపారు. తల్లిదండ్రులకు అవిధేయత చూపే ప్రజలు భయంకర శిక్ష అనుభవిస్తారని అల్లాహ్ హెచ్చరించెను. బాల్యం నుండి జాగ్రత్తగా, కరుణతో పెంచి పోషించినందుకు, ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించవలెను, మర్యాదగా చూడవలెను. మరియు వినయవిధేయతలతో, నమ్రతగా వారితో మెలగమని అల్లాహ్ మనల్ని ఆదేశించెను. మరియు వారికి అవిధేయత చూపటాన్ని అల్లాహ్ నిషేధించెను.  ఖుర్ఆన్ సూరహ్ అల్ ఇస్రా 17: 23-24 లోని క్రింది వచనాలు-

“నీ ప్రభువు ఇలా నిర్ణయించాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా “ఉహ్ (లేక ఛీ)” అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయ కలిగి, వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి “యా రబ్ (ఓ ప్రభూ)! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు”

ప్రతి ముస్లిం తప్పనిసరిగా తన తల్లిదండ్రుల మాట వినవలెను, వారికి విధేయత చూపవలెను, వారిని గౌరవించవలెను. ఎందుకంటే పాపపు పని చేయమని ఆదేశించనంత వరకు, వారు చెప్పినట్లు నడుచుకోవటం మీ బాధ్యత. వారికి అవిధేయత చూపటం ఇస్లాం ధర్మంలో పూర్తిగా నిషేధించబడినది.

మరొక నిషేధింపబడిన పని – అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం మరియు నిజం పలకటం నుండి కావాలని (సంకల్ప పూర్వకంగా) దూరంగా పోవటం.  అబద్ధం చెప్పటం మరియు అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం అనే తీవ్రమైన తప్పు గురించి తన సహచరులకు బోధించటంలో దైవప్రవక్త ఎక్కువ ధ్యాస చూపేవారు. ఎందుకంటే మాట జారటం నాలుకకు చాలా తేలికైన పని మరియు ప్రజలు ఈ భయంకరమైన మహాపాపం గురించి తరచుగా అజాగ్రత్త వహిస్తారు. ఈ ఘోరమైన మహాపాపానికి అసూయ, వోర్వలేని తనం, ద్వేషం, ఈర్ష్య, శత్రుత్వం, దుష్టభావం, పగ వంటి అనేక చెడు విషయాలు కారణం కావచ్చును. ‘ఈ హెచ్చరికను ఇక ఆపరేమో’ అని తోటి సహచరులు అనుకునే వరకు దైవప్రవక్త దీనిని అనేక సార్లు పలికారు.

కాబట్టి ముస్లింలు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినశిక్షకు గురిచేసే ఈ ఘోరాతి ఘోరమైన ఈ మహాపాపములలో ఏ ఒక్కటీ చేయకుండా జాగ్రత్త వహిస్తూ, తమను తాము కాపాడుకోవలెను మరియు ఇతరులను కూడా కాపాడటానికి ప్రయత్నించవలెను.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. దైవప్రవక్త తన సహచరులకు బోధించిన మార్గదర్శకత్వం మరియు హితవులు మొత్తం మానవజాతికి కూడా వర్తిస్తాయి, వాటిని ఆచరిస్తే తప్పక ప్రయోజనం కలుగుతుంది.
  2. అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం మరియు తల్లిదండ్రులకు అవిధేయత చూపటం నిషేధించబడినది.
  3. అబద్ధం చెప్పటం మరియు తప్పుడు సాక్ష్యం ఇవ్వటం నిషేధించబడినది.
  4. దైవప్రవక్త పై వారి సహచరులు చూపించిన భక్తి మరియు దైవప్రవక్తను చికాకు పెట్టకుండా సహనంతో ప్రవర్తించటం ద్వారా సహచరులలోని గొప్ప లక్షణాలు తెలుస్తున్నాయి.

ప్రశ్నలు

  1. దైవప్రవక్త తెలిపిన ఘోరాతిఘోరమైన మహాపాపములు ఎన్ని? అవి ఏవి?
  2. అబద్ధం చెప్పటం లేక తప్పుడు సాక్ష్యమివ్వటానికి గల కారణాలేమిటి?
  3. తల్లిదండ్రుల కోసం మనం ఏమని ప్రార్థించవలెను?(ఖుర్ఆన్ ఆధారంగా)
  4. ఈ హదీథ్ ద్వారా మీరు గ్రహించిన విషయాలేమిటి?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్