చేసిన ఉపకారాన్ని వృథా చేసుకోకండి! – హబీబుర్రహ్మాన్ జామఇ [వీడియో & టెక్స్ట్]

చేసిన ఉపకారం వృథా చేసుకోకండి!
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/FZrtI0T8FnE [20 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఉపకారం (ఇహ్సాన్) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని అంగీకరించే పద్ధతుల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ఇతరులకు సహాయం చేసే వ్యక్తి అల్లాహ్‌కు అత్యంత ప్రియమైనవాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అయితే, చేసిన ఉపకారాన్ని గొప్పగా చెప్పుకోవడం, సహాయం పొందిన వారి మనసును నొప్పించడం వంటి పనులు ఆ పుణ్యాన్ని నాశనం చేస్తాయని ఖురాన్ హెచ్చరిస్తుంది. ప్రదర్శన బుద్ధితో చేసే దానం, బండరాయిపై ఉన్న కొద్దిపాటి మట్టిలాంటిదని, అది వర్షానికి కొట్టుకుపోయి నిష్ఫలమవుతుందని ఒక ఉపమానం ద్వారా వివరించబడింది. దీనికి విరుద్ధంగా, అల్లాహ్ ప్రసన్నత కోసం చేసే దానం, ఎత్తైన ప్రదేశంలోని తోటలా రెట్టింపు ఫలాలనిస్తుందని చెప్పబడింది. సహాబాలు, ముఖ్యంగా అబుద్-దహ్దాహ్ మరియు ఆయిషా (రదియల్లాహు అన్హుమ్) వంటి వారు తమ సర్వస్వాన్ని దానం చేసి, ఇతరుల మనోభావాలను గౌరవించిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉదహరించబడింది.

وَنَسْتَغْفِرُهُ اسْتِغْفَارَ الْخَاشِعِينَ الْمُخْبِتِينَ
వనస్తగ్‌ఫిరుహు ఇస్తిగ్‌ఫారల్ ఖాషి’ఈనల్ ముఖ్బితీన్
(మేము ఆయనను వినయ విధేయతలతో క్షమాపణ కోరుతున్నాము)

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
వ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్
(మరియు నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు)

الْمُتَفَرِّدُ بِالْجَلَالِ وَالْكَمَالِ
అల్-ముతఫర్రిదు బిల్-జలాలి వల్-కమాల్
(ఆయన గౌరవం మరియు పరిపూర్ణతలో ఏకైక వాడు)

شَرَعَ لِعِبَادِهِ الْأَحْكَامَ وَرَفَعَ عَنْهُمُ الْحَرَجَ وَالْآثَامَ
షర’అ లి’ఇబాదిహిల్ అహ్కామ్ వ రఫ’అ అన్హుముల్ హరజ వల్-ఆసామ్
(ఆయన తన దాసుల కోసం శాసనాలను నిర్దేశించాడు మరియు వారి నుండి కష్టాలను మరియు పాపాలను తొలగించాడు)

وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ
వమా జ’అల అలైకుమ్ ఫిద్దీని మిన్ హరజ్
(ఆయన ఈ ధర్మంలో మీ కొరకు ఏ ఇబ్బందినీ పెట్టలేదు.) (22:78)

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్
(మరియు నేను సాక్ష్యమిస్తున్నాను నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని)

وَنُصَلِّي وَنُسَلِّمُ عَلَى مَنْ بَعَثَهُ اللَّهُ رَحْمَةً لِلْعَالَمِينَ
వ నుసల్లీ వ నుసల్లిము అలా మన్ బ’అసహుల్లాహు రహ్మతల్-లిల్-ఆలమీన్
(మరియు మేము సకల లోకాలకు కారుణ్యంగా పంపబడిన వారిపై సలాత్ మరియు సలాం పంపుతున్నాము)

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِلْعَالَمِينَ
వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్-లిల్-ఆలమీన్
((ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వలోకాలకు కారుణ్యంగా చేసి పంపాము.) (21:107)

اللَّهُمَّ صَلِّ وَسَلِّمْ عَلَى نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ الطَّيِّبِينَ الطَّاهِرِينَ. أَمَّا بَعْدُ.
అల్లాహుమ్మ సల్లీ వ సల్లిమ్ అలా నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహిత్-తయ్యిబీనత్-తాహిరీన్. అమ్మా బ’అద్.
(ఓ అల్లాహ్, మా ప్రవక్త ముహమ్మద్ వారిపై, వారి కుటుంబ సభ్యులపై మరియు పవిత్రులైన వారి సహచరులపై శుభాలు మరియు శాంతిని వర్షింపజేయి. ఇక ఆ తర్వాత.)

فَاتَّقُوا اللَّهَ يَا عِبَادَ اللَّهِ، وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ رَاجِعُونَ
ఫత్తఖుల్లాహ ఇబాదల్లాహ్, వ’అలమూ అన్నకుమ్ ఇలైహి రాజి’ఊన్
(ఓ అల్లాహ్ దాసులారా, అల్లాహ్‌కు భయపడండి మరియు తెలుసుకోండి, నిశ్చయంగా మీరందరూ ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది.)

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ
(వ అహ్సినూ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్)
(ఉత్తమంగా మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ ఉపకారులను ప్రేమిస్తాడు..) (2:195)

దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

أَحَبُّ النَّاسِ إِلَى اللَّهِ أَنْفَعُهُمْ لِلنَّاسِ
(అహబ్బున్-నాసి ఇలల్లాహి అన్ఫ’ఉహుమ్ లిన్-నాస్)
(అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన వ్యక్తి ఇతరులకు ఎక్కువ మేలు చేసే వ్యక్తి.)

ఏ వ్యక్తి వల్ల ఇతరులకు ఎక్కువగా ప్రయోజనం కలుగుతుందో, లాభం కలుగుతుందో, అటువంటి వ్యక్తి అల్లాహ్‌కు అత్యంత ప్రియుడు.

ఉపకారం చేయడం అనేక రకాలుగా, అనేక విధాలుగా ఉంటుంది. ఉపకారం, ఒకరికి సహాయం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు, ఆర్థిక సహాయం. జకాత్, దానధర్మాల రూపంలో, అప్పుల్లో చిక్కుకున్నవారిని ఆదుకోవడంలో, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వగైరా. అలాగే, శారీరక సహాయం. వృద్ధులను చేతబట్టి నడిపించడం, దారి తప్పిన వారిని గమ్యం చేరేలా చేయడం, చేతకాని వారికి పనిలో సహాయం చేయడం వగైరా. అలాగే, మానసిక, ధార్మిక సహాయం. మంచిని బోధించడం, విద్య నేర్పించడం, మంచి సలహాలు ఇవ్వడం, ధైర్యం చెప్పడం, ఓదార్పు ఇవ్వడం వగైరా.

ఈ విధంగా అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక సందర్భాలలో ఉపకారాలు చేయవచ్చు, చేస్తాం కూడా. కానీ, చేసిన ఉపకారాన్ని వృథా కాకుండా కాపాడుకోవాలి. ఇది అసలైన విషయం. ఉపకారం చేయటం ఘనకార్యం కాదు. చేసిన ఉపకారాన్ని కాపాడుకోవాలి. వృథా చేసుకోకూడదు. ఆ ఉపకారాన్ని, దాని మూలంగా వచ్చిన పుణ్యాన్ని నాశనం చేసుకోకూడదు. ఇది అసలైన విషయం, అర్థం చేసుకోవలసిన విషయం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్-మన్ని వల్-అజా)
(ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి..) (2:264)

ఉపకారం చేసే వ్యక్తి, ఎవరైతే ఉపకారం పొందారో వారి మనస్సును నొక్కిస్తే, చేసిన ఉపకారం ఏమవుతుంది? వృథా అయిపోతుంది. దానికి ప్రతిఫలం దక్కదు.

అలా చేసే వారికి స్వయంగా అదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక ఉపమానం ఇచ్చాడు:

فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ

(అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీవర్షం కురిసి, ఆ మట్టి కాస్తా కొట్టుకు పోయి, కటికరాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనాకారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్‌ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.) (2:264)

అతని ఉపమానం – ఎవరి ఉపమానం? ఎవరైతే దానం చేసిన తర్వాత చాటుకుంటాడో, దెప్పి పొడుస్తాడో, అటువంటి వ్యక్తి యొక్క ఉపమానం – కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. అది అసలు బండరాయి, పైన కొంచెం నున్నటి మట్టి ఉంది. దానిపై భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్తా కొట్టుకుపోతుంది. మిగిలేది ఏంటి? కటిక రాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనాకారులకు తాము చేసుకున్న దానిలో మంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ తిరస్కారులకు సన్మార్గం చూపడు. ఈ ఉపమానంలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

మొదటి విషయం ఏమిటి? దానధర్మాలు చేసి ఉపకారాన్ని చాటడం, దానం పుచ్చుకున్న వారి మనసును నొప్పించడం. ఇలాంటి దెప్పిపొడుపులు కపటులు మాత్రమే చేస్తారు. అంటే ఈ ఆయత్ కపట విశ్వాసుల గురించి వచ్చింది. ఈ ఆయత్‌లో ప్రస్తావన ప్రత్యేకంగా కపట విశ్వాసుల గురించి ఉంది. అంటే దానం చేసిన తర్వాత దెప్పి పొడవటం, ఇది ఎవరి లక్షణం? కపట విశ్వాసుల లక్షణం, మునాఫిఖీన్‌ల లక్షణం. కపటులు మాత్రమే చేస్తారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతుల్ని పొందగోరి దానం చేసిన వారు మాత్రమే ఈ విధంగా నోరు జారుతారు. అంటే, విశ్వాసులు అనబడే వారికి ఇది ఎంతమాత్రం శోభించదు.

మరి అల్హమ్దులిల్లాహ్, ప్రవక్త గారి కాలంలో ప్రత్యేకంగా అఖీదాకి సంబంధించిన కపట విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అల్హమ్దులిల్లాహ్ మన సమాజంలో లేరు. ఉన్నా కూడా మనకు తెలియదు. విశ్వాసులు అనబడే వారు కూడా ఇలాంటి లక్షణాలకు, లోపాలకు గురి అవుతున్నారు. అంటే అర్థం ఏమిటి? అటువంటి విశ్వాసులలో కూడా కపటత్వంలో కొంత భాగం ఉంది అని మనం గమనించాలి.

ఇక ఉపకారం చేసిన తర్వాత, అది వృథా రెండు కారణాల వల్ల అవుతుంది. ఒకటి ఏమిటి? ఈ ఉపమానంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఉదాహరణకి, దానికి అర్థం ఏమిటి? ఈ రకమైన దానం బండరాయి వంటిది. అంటే విత్తనం నాటడానికి పనికిరాదు. ఆ బండరాయిలో విత్తనం నాటడానికి పనికిరాదు అది. అక్కడ విత్తనం నాటలేము. ఒకవేళ నాటినా, కురిసే వర్షానికి కొట్టుకుపోతుంది. ఎటువంటి ప్రయోజనం ఉండదు. విత్తనం కొన్నాము, డబ్బు వృథా. కృషి చేశాము, కష్టపడ్డాము, అది వృథా. విత్తనం కూడా పోయింది. ఎటువంటి ప్రయోజనం లేదు. దానం చేసిన తర్వాత దెప్పి పొడిస్తే, వారు కూడా అటువంటివారే. అటువంటి దానానికి ఎటువంటి ప్రయోజనం లేదు. మరి చేసిన దానం వృథా అవ్వడానికి రెండు ముఖ్యమైన కారణాలు. ఒకటి ఏమిటి?

ప్రదర్శన బుద్ధితో దానం చేస్తే, ప్రదర్శన బుద్ధితో ఉపకారం చేస్తే, అది ఏమవుతుంది? రియా అవుతుంది. అర్-రియా వష్-షిర్కుల్ అస్ఘర్. అది షిర్క్ కోవకి చెందినది. కావున ఉపకారం ఏమైంది? వృథా అయిపోయింది. అంటే ప్రదర్శన బుద్ధితో ఉపకారం చేసినా, దానం చేసినా, అది వృథా అయిపోతుంది.

లేదా, మంచి ఉద్దేశంతోనే ఉపకారం చేశాము, మంచి ఉద్దేశంతోనే, సంకల్ప శుద్ధితోనే దానధర్మాలు చేశాము. ఉద్దేశం మంచిదే, విధానం మంచిదే. చేసిన తర్వాత, గ్రహీతల మనస్సులను నొప్పించాము. “నేను చేశాను, చాటి చెప్పుకుంటున్నాము, నేను చేయకపోతే నీ గతి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? నేను ఇచ్చాను, నేను చేశాను” అని చెప్పుకుంటూ పోవడం, గొప్పలు చెప్పుకోవడం, వారి మనస్సును నొప్పించడం, ఇందు మూలంగా కూడా చేసిన దానం, చేసిన ఉపకారం ఏమైపోయింది? వృథా అయిపోయింది.

మరి చేసిన ఉపకారం వృథా కాకూడదు. అది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్ తర్వాత ఆయత్‌లో ప్రస్తావించాడు:

وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

ఇక దైవప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టేవారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా, కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్‌ మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.” (2:265)

దైవ ప్రసన్నతను చూరగొనే తపనతో, సంకల్ప శుద్ధి – అల్లాహ్ కోసమే, అల్లాహ్ ప్రసన్నత కోసం. తపనతో, దృఢ నమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టే వారి ఉపమానం, మెరక ప్రాంతంలో ఉన్న తోట పంట వంటిది. భారీ వర్షం కురిస్తే రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ పెద్ద వర్షం పడకుండా కేవలం వాన జల్లు కురిసినా ఆ పంటకి సరిపోతుంది. అంటే ఎక్కువ వర్షం కురిసినా ప్రతిఫలం, తక్కువ వర్షం కురిసినా ప్రతిఫలం దక్కుతుంది. అల్లాహ్ మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. కనుక, ఉపకారం వృథా కాకుండా ఉండాలంటే సంకల్ప శుద్ధి, అల్లాహ్ ప్రసన్నత కోసమే ఉపకారం చేయాలి, పుణ్యాలు చేయాలి, దానధర్మాలు చేయాలి.

అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “సబ్’అతున్ యుజిల్లుహుముల్లాహు ఫీ జిల్లిహీ యవ్మ లా జిల్ల ఇల్లా జిల్లుహ్” – ఒక సుదీర్ఘమైన, ఫేమస్ హదీస్ ఉంది. అందరికీ తెలిసిన హదీస్. రేపు ప్రళయ దినాన భయంకరమైన వేడి, ఎండ. అప్పుడు అల్లాహ్ నీడ తప్ప మరొక ఏ నీడా ఉండదు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఏడు రకాల జనులకు నీడ దక్కుతుంది.

వారిలో ఒకడు ఎవరు?

رَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لا تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ
(రజులున్ తసద్దఖ బి-సదఖతిన్ ఫ-అఖ్ఫాహా హత్తా లా త’అలమ షిమాలుహు మా తున్ఫిఖు యమీనుహు)
(కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా గోప్యంగా దానం చేసే వ్యక్తి.)

గుప్త దానాలు చేసేవారు. కుడి చెయ్యి చేసిన దానం ఎడమ చెయ్యికి కూడా తెలియదు. ఆ విధంగా దానాలు చేయడం అంటే గుప్త దానాలు చేయటం. ప్రదర్శన బుద్ధి కాకుండా, ఒకరికి మనసు నొప్పించకుండా దానాలు చేయటం.

ఇమాం హసన్ (రదియల్లాహు అన్హు) గురించి వస్తుంది, ఆయన దానం చేసిన తర్వాత, ఎవరైతే దానాన్ని పుచ్చుకుంటున్నాడో, అతని ముఖం వైపు కూడా చూసేవారు కాదు. దానం చేసిన తర్వాత వారి ముఖం కూడా చూసేవారు కాదు. ఎందుకు? నేను ఉపకారం చేస్తున్నాను అనే భావన నాలో రాకూడదు, నేను ఉపకారం పొందుతున్నాను అనే బాధ, సిగ్గు అతని ముఖంలో ఉండకూడదు. అలా ఆలోచించి దానాలు చేసేవారు.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సహాబాల జీవిత చరిత్ర మనం చదవాలి. వారు ధనవంతులు ఏ విధంగా దానం చేసేవారు, పేదవారు ఏ విధంగా దానం చేసేవారు, స్వయంగా లేకపోయినా ఇతరులకు ప్రాధాన్యత ఎలా ఇచ్చేవారు మనకు చాలా వివరంగా తెలుస్తుంది.

ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో:

مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا
(మన్ జల్లజీ యుఖ్రిజుల్లాహ ఖర్జన్ హసనా)
(మీలో ఎవరు అల్లాహ్‌కు మంచి రుణం ఇస్తారు?) (2:245)

రుణం, అప్పు. మీలో ఎవరు అల్లాహ్‌కు మంచి రుణం ఇస్తారు? ఈ ఆయత్‌కి అర్థం ఇది. అల్లాహ్‌కు రుణం ఇవ్వటం ఏమిటి? ఆయన రజ్జాఖ్. ఆయన మాలిక్. ఆయనకి రుణం ఇవ్వటం ఏమిటి? దీనికి అర్థం ఇక్కడ రుణం అంటే ఏమిటి? దానధర్మాలు, సదఖాలు. అంటే పేదవారికి, లేని వారికి ఆదుకుంటే, దానం చేస్తే, ఉపకారం చేస్తే, సహాయం చేస్తే, దానికి ప్రతిఫలంగా అల్లాహ్ స్వర్గంలో మనకు ప్రసాదిస్తాడు.

ఈ ఆయత్ అవతరించిన తర్వాత అబుద్-దహ్దాహ్ (రదియల్లాహు అన్హు) తన తోట, ఆ తోటలో దాదాపు 600 చెట్లు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు. 10-20 కాదు, 600 చెట్లు ఉన్నాయి. అటువంటి తోటను దానంగా ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత, అదే తోటలో ఆయన యొక్క సతీమణి ఉమ్ముద్-దహ్దాహ్ ఉంటే, తోటకి వచ్చి, “నువ్వు వెంటనే వచ్చేయ్. ఇప్పుడు మనం ఈ తోటలో ఉండే అర్హత లేదు” అని చెప్పారు. “ఎందుకండీ?” అంటే, “ఈ తోట నేను దానం చేసేశాను. ఇప్పుడు ఈ తోట మనది కాదు, వచ్చేయ్ వెళ్ళిపోదాం ఇంటికి” అని చెప్పారు. ఆ తర్వాత అంత పెద్ద దానం చేసి ఎవ్వరికీ ఆయన చెప్పుకోలేదు. ఇది పది రూపాయలు, వంద రూపాయలు కాదు. ఇప్పుడు ఎటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాము? పది రూపాయలు దానం చేసి అది డీపీలో, వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో పెట్టుకుంటున్నాం.

ప్రయోజనం ఏమిటి? ఎందుకోసం దానం చేస్తున్నాము? ఎందుకోసం ఉపకారం చేస్తున్నాము? ఇది మనము గమనించాలి. పేదవారికి కూడా మనసు ఉంటుంది, వారికి కూడా సిగ్గు లజ్జ అనేది ఉంటుంది, వారికి కూడా హయా ఉంటుంది, వారికి కూడా అభిమానములు అవన్నీ ఉంటాయి. వారి లేని పరిస్థితి, ఆ దౌర్భాగ్యం వలన, ఆ పేదరికం వలన, అటువంటి దుర్భర పరిస్థితి వలన వారు మనసులో కుమిలిపోతూ కొందరు సహాయాన్ని తీసుకుంటారు, కొందరు తీసుకోరు. అది మనం గమనించాలి. బంధువులైనా, ఇరుగుపొరుగు వారైనా, మిత్రులైనా, ఎవరైనా సరే దానం చేసేటప్పుడు అల్లాహ్ కోసం చేయాలి మరియు వారికి ఎటువంటి బాధ కలగకూడదు. ఆ విధంగా మనము దానాలు చేయాలి. అటువంటి దానాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎన్నో రెట్లు పెంచి మనకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా), అహలె బైత్ గురించి ఒక ఉల్లేఖనం ఉంది. అహలె బైత్, అంటే ప్రవక్త గారి కుటుంబీకులు. వారి గురించి ఒక ప్రస్తావన ఏమిటంటే, అహలె బైత్ ఎప్పుడూ కూడా తమ జీవితాంతం, చనిపోయే వరకు మూడు రోజులు, మూడు పూటల కడుపునిండా భోజనం చేయలేదు. పూర్తి జీవితంలో! ఒక వారంలో కాదు, ఒక నెలలో కాదు, ఒక సంవత్సరంలో కాదు. వారి పూర్తి జీవితం. మూడు రోజులు, మూడు పూటల కడుపునిండా భోజనం చేయలేదు. డబ్బు లేక కాదు. వారు డబ్బు ఉంచుకోలేదు.

ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా), అమీరె మావియా (రదియల్లాహు అన్హు) కాలంలో, ఆయన ఆయిషా (రదియల్లాహు అన్హా) గారికి ఒక లక్ష దిర్హములు బహుమతిగా పంపిస్తారు. ఆయన ఖలీఫా, అమీరుల్ మోమినీన్. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దీఖా గారికి ఎటువంటి ఆదాయం లేదు. ఎవరైనా బహుమతి ఇస్తే తీసుకునేవారు, లేకపోతే చెప్పుకునేవారు, అడిగేవారు కాదు. పస్తులు ఉండేవారు. లక్ష దిర్హములు! ఈ కాలంలో కూడా లక్ష దిర్హమ్ అంటే ఎక్కువ డబ్బులు. 1400 సంవత్సరాల క్రితం లక్ష దిర్హమ్ అంటే ఏంటి? కోటేశ్వరులు. ఆయన అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిపాలన ప్రసాదించాడు, బాగా రాజ్యం ఏలుతున్నారు, అల్లాహ్ డబ్బు పుష్కలంగా ప్రసాదించాడు.

ఒక లక్ష దిర్హములు బహుమతిగా పంపిస్తే, సాయంత్రం వరకు ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా) దానాలు చేసేశారు. మొత్తం లక్ష దిర్హములు. సాయంత్రం, ఇంకా మగ్రిబ్ అవ్వలేదు. అంటే, రేపు వరకు నేను పెట్టుకుంటే అది లెక్క చూపించాలి, వారికి ఇష్టం లేదు.

అనుకోకుండా ఆ రోజు వారు ఉపవాసం ఉన్నారు. ఇఫ్తార్ సమయం అయింది. ఇఫ్తార్ సమయంలో ఇఫ్తార్ చేయటానికి ఏమీ లేదు. పాలు లేదు, తమ్ర్ (ఖర్జూరం) లేదు, తినే వస్తువు లేదు, తాగే వస్తువు లేదు. నీళ్ళు తప్ప ఏమీ లేదు. ఆయిషా (రదియల్లాహు అన్హా) పని మనిషిని అడిగారు, “ఇఫ్తార్‌కి ఏమన్నా ఉందా?” అని అడిగితే, ఆ పని మనిషి, “ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా), మీరు ఇన్ని దానాలు చేశారు, ఇఫ్తార్ కోసం ఒక్క దిర్హమ్ పెట్టుకోవచ్చు కదా” అని అడిగితే, “అవునా? నేను మరిచిపోయాను” అన్నారు.

ఇది, లక్షలు లక్షలు, కోట్లు కోట్లు సహాయం చేసేవారు, కానీ గుప్తంగా చేసేవారు, గ్రహీతుల మనసును నొప్పించేవారు కాదు.

కావున, ఇస్లాం ధర్మం ప్రతి విషయంలో మనకు విధానం నేర్పుతుంది, పరిష్కారం చూపిస్తుంది. ఎటువంటి ఆరాధన ఏ విధంగా చేయాలి, ఎటువంటి దానధర్మాలు, జకాత్ ఉంది, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నఫిల్ సదఖాలు ఉన్నాయి, దానికి నియమాలు ఉన్నాయి. అంటే ప్రతి విషయంలో ఆదేశం ఇవ్వడం మాత్రమే గాక, దాని యొక్క విధానాన్ని ఇస్లాం ధర్మం మనకు నేర్పుతుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని సరైన రీతిలో ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవానా అనిల్-హమ్దులిల్లాహి రబ్బిల్-ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44470

జకాతు & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

ఏమీ లేనివారు దానం చేసేదెలా? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

ఏమీ లేనివారు దానం (సదకా) చేసేదెలా?
https://youtu.be/wB4zgYE0JwQ [21 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దానం (సదకా) యొక్క ప్రాముఖ్యత మరియు దాని విస్తృతమైన అర్థం గురించి వివరించబడింది. గత వారం ప్రసంగంలోని 18 ప్రయోజనాలను గుర్తుచేస్తూ, ఈ వారం ముఖ్యంగా ఏమీ లేని వారు కూడా ఎలా దానం చేయవచ్చో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారా స్పష్టం చేయబడింది. శారీరక శ్రమ చేసి సంపాదించి ఇవ్వడం, అది కూడా సాధ్యం కాకపోతే ఇతరులకు శారీరకంగా సహాయపడటం, అది కూడా చేయలేకపోతే కనీసం చెడు పనుల నుండి దూరంగా ఉండటం కూడా దానమేనని వివరించబడింది. మంచి మాట పలకడం, దారి చూపడం, ఇబ్బంది కలిగించే వస్తువులను తొలగించడం వంటి ప్రతి మంచి పని సదకాగా పరిగణించబడుతుందని చెప్పబడింది. దానం చేసేటప్పుడు ప్రదర్శనా బుద్ధి (రియా) ఉండకూడదని, అల్లాహ్ ప్రసన్నతను మాత్రమే ఆశించాలని ఖురాన్ ఆయతుల ద్వారా నొక్కి చెప్పబడింది. దానం రహస్యంగా ఇవ్వడం ఉత్తమమని, కానీ ఫర్జ్ అయిన జకాత్‌ను ఇతరులను ప్రోత్సహించడానికి బహిరంగంగా ఇవ్వవచ్చని కూడా పేర్కొనబడింది.

الْحَمْدُ لِلَّهِ الَّذِي يُجْزِلُ الْمُتَصَدِّقِينَ
దాతలకు గొప్ప ప్రతిఫలాన్నిచ్చే అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

وَيُخْلِفُ عَلَى الْمُنْفِقِينَ
ఖర్చు చేసేవారికి ప్రతిఫలం ఇస్తాడు.

وَيُحِبُّ الْمُحْسِنِينَ
సజ్జనులను ప్రేమిస్తాడు.

وَلَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ
మరియు విశ్వాసుల ప్రతిఫలాన్ని వృధా చేయడు.

أَحْمَدُهُ سُبْحَانَهُ
నేను ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను,

عَلَىٰ نِعَمِهِ الْعَظِيمَةِ
ఆయన గొప్ప అనుగ్రహాలకు,

وَآلَائِهِ الْجَسِيمَةِ
మరియు ఆయన అపారమైన వరాలకు,

وَصِفَاتِهِ الْكَرِيمَةِ
మరియు ఆయన ఉదార గుణాలకు.

وَأَسْأَلُهُ أَنْ يَجْعَلَ عَمَلَنَا فِي الْخَيْرِ دِيمَةً
మంచి పనులలో మా ఆచరణను నిరంతరం ఉండేలా చేయమని నేను ఆయనను వేడుకుంటున్నాను.

وَأَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.

وَهُوَ الرَّبُّ الْعَظِيمُ
ఆయనే గొప్ప ప్రభువు,

وَالْإِلَٰهُ الرَّحِيمُ
దయగల ఆరాధ్యుడు,

الْجَوَّادُ الْمُحْسِنُ الْكَرِيمُ
దాత, సజ్జనుడు, ఉదారుడు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

النَّبِيُّ الْأَمِينُ
విశ్వసనీయ ప్రవక్త,

وَالرَّسُولُ الْكَرِيمُ
గౌరవనీయమైన ప్రవక్త.

كَانَ أَجْوَدَ النَّاسِ
ప్రజలందరిలోకెల్లా అత్యంత దాతృత్వంగలవారు.

وَأَكْرَمَ النَّاسِ
ప్రజలందరిలోకెల్లా అత్యంత గౌరవనీయులు.

فَكَانَ أَجْوَدَ بِالْخَيْرِ مِنَ الرِّيحِ الْمُرْسَلَةِ
ఆయన మంచి చేయడంలో వేగంగా వీచే గాలి కంటే ఎక్కువ దాతృత్వం కలవారు.

صَلَّى اللَّهُ عَلَيْهِ وَعَلَى آلِهِ وَصَحْبِهِ
అల్లాహ్ ఆయనపై, ఆయన కుటుంబంపై మరియు ఆయన సహచరులపై శాంతిని వర్షింపజేయుగాక.

الَّذِينَ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ
వారు మంచి పనులలో పోటీపడేవారు.

فَكَانُوا يُنْفِقُونَ مِمَّا يُحِبُّونَ
వారు తమకు ఇష్టమైన వాటి నుండి ఖర్చు చేసేవారు.

وَيُؤْثِرُونَ عَلَىٰ أَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ
మరియు తమకు అవసరం ఉన్నప్పటికీ, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

وَمَنْ يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మరియు ఎవరైతే తన మనస్సు యొక్క పిసినారితనం నుండి రక్షించబడ్డాడో, అటువంటి వారే సాఫల్యం పొందేవారు.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా! గత శుక్రవారం మనం ఇహపర లోకాలలో దానం వల్ల కలిగే 18 ప్రయోజనాలు తెలుసుకున్నాం.

ఈరోజు ఏమీ లేని వారు దానం చేసేది ఎలా? ఈ అంశంపై కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట ఇలా ఉంటుంది.

عَلَى كُلِّ مُسْلِمٍ صَدَقَةٌ
[అలా కుల్లి ముస్లిమిన్ సదఖతున్]
ప్రతి ముస్లింపై దానం (సదకా) చేయడం తప్పనిసరి.

ఇది హదీస్ కి అర్థం. ప్రతి ముస్లింపై దానం చేయడం తప్పనిసరి విధి. మరి సహాబాలలో చాలామంది పేదవారు, లేనివారు. అంతెందుకు, కొంతమంది సహాబాకి ఇల్లు కూడా లేదు, మస్జిద్ లో ఉంటున్నారు. వారి నివాసం మస్జిద్. వారిలో కొంతమంది కూలి పని చేసుకుని తన జీవితం గడిపితే, మరి కొంతమంది దీన్ నేర్చుకోవడం కోసం పూర్తి జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి మస్జిద్ లోనే ఉండిపోయేవారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) లాంటి వారు. అంటే ఎవరైనా ఏదైనా దానం చేసి ఖర్జూరం తీసుకుని వచ్చి ఇస్తే అది తినేవారు, లేకపోతే పస్తులు ఉండేవారు. మరి అటువంటి వారు దానం ఎలా చేయాలి? ఈ హదీస్ కి అర్థం ఏమిటి? “అలా కుల్లి ముస్లిం సదకా” – ప్రతి ముస్లింపై దానం చేయడం, సదకా చేయడం తప్పనిసరి. మరి సహాబాలకి ఆశ్చర్యం వేసింది, సహాబాలు అడిగారు. ఏం అడిగారు? “ఓ ప్రవక్తా, ఒకవేళ అతని వద్ద స్థోమత లేకుంటే ఏం చేసేది?”

قِيلَ: أَرَأَيْتَ إِنْ لَمْ يَجِدْ؟
దానం చేసే అంత స్థోమత లేదు, మరి ఏం చేయాలి?

قَالَ
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

يَعْتَمِلُ بِيَدَيْهِ
అతను కూలి పని చేయాలి.

فَيَنْفَعُ نَفْسَهُ
తద్వారా వచ్చిన వేతనంతో తాను తినాలి,

وَيَتَصَدَّقُ
అవసరార్థులకు తినిపించాలి.

ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా దానం చేసే స్థోమత లేదు. అటువంటి వారు ఏం చేయాలి? దానికి సమాధానం ప్రవక్త గారు ఏం చెప్పారు? కూలి పని చేయండి. తద్వారా వచ్చిన వేతనంతో స్వయంగా తినండి, అవసరార్థులకు తినిపించండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు.

అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే మిడిల్ క్లాస్ వారు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, పేదవారు, లేనివారు దానం అనేది ధనవంతులు మాత్రమే చేస్తారు, వారు చేసే పని, నాలాంటి వారికి, మాలాంటి వారికి దానం లేదు, పేదవాళ్ళం కదా అని ఆ భ్రమలోనే జీవితాంతం అలాగే ఉండిపోతారు. కానీ ఈ హదీసులో ఏమీ లేని వారు కూడా తమ స్థోమతను బట్టి దానం చేయాలని మహాప్రవక్త ఆజ్ఞాపించారు. అంతటితో హదీస్ పూర్తి అవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ సహాబాలు అడిగారు.

أَرَأَيْتَ إِنْ لَمْ يَسْتَطِعْ؟
కూలి పని చేసే అంత శక్తి కూడా అతనికి లేదు.

కొందరు ఉంటారు, అనారోగ్యం మూలంగా, ముసలితనం మూలంగా, ఇంకో ఏదైనా కారణంగా ఆ పని కూడా చేయలేరు. మరి మీరేమో “అలా కుల్లి ముస్లిం సదకా” అని చెప్పేశారు, తప్పనిసరి అని చెప్పేశారు. కూలి పని చేసే అంత శక్తి కూడా లేదు, ఆ అవకాశం కూడా లేదు. అటువంటి వారు ఏం చేయాలి? అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒకవేళ అతను కూలి పని కూడా చేయగలిగే శక్తి లేనివాడైతే ఆ వ్యక్తి దుఖితులకు, అవసరార్థులకు శారీరక సేవను చేయాలి. ఇది కూడా దానం కిందకే వస్తుంది. అంటే పేదవాడు, డబ్బు లేదు, ఏమీ లేదు, కూలి కూడా చేయలేడు, అటువంటి వాడు శారీరకంగా ఇతరులకు సహాయం చేయగలిగితే సహాయం చేయాలి, అది కూడా దానం కిందకే వస్తుంది. ఆ తర్వాత అది కూడా చేయలేకపోతే? అనారోగి. ఒక రోగి అనారోగ్యంతో ఉన్నాడు. శారీరకంగా కూడా సహాయం చేసే స్థితిలో లేడు. దాని గురించి అన్నారు, అది కూడా చేయకపోతే చెడు పనుల నుండి తన్ను తాను కాపాడుకోవాలి. ఇది కూడా సదకా కిందకే వస్తుంది. చెడు నుండి తనకు తాను కాపాడుకోవాలి. ఇది కూడా సదకా, దానం గానే పరిగణించబడుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే బుఖారీలో ఒక హదీస్ ఉంది, అది ఏమిటంటే:

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
ప్రతి మంచి మాట కూడా దానం కిందకే వస్తుంది.

ఒక మంచి మాట పలకడం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే అనేక హదీసులలో దారి తప్పిన బాటసారికి దారి చూపటం కూడా దానమే, ఒక గుడ్డివాని చేయి పట్టి మార్గదర్శకత్వం వహించడం కూడా దానమే, దారిలో నుండి ముల్లును, రాయిని, ఎముకను తొలగించడం కూడా దానమే. తన బొక్కెనలో ఉన్న నీరును తోటి సోదరుని కడవలో పోయటం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే దానం చేయాలంటే అనేక మార్గాలు మనకు ఇస్లాం తెలియపరుస్తుంది. కాకపోతే తన స్థోమత మేరకు ఆర్థికపరంగానైనా, శారీరకపరంగానైనా, ఏదో విధంగానైనా దానం చేయాలి, సహాయం చేయాలని బోధపడింది.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం చేసిన తర్వాత వాటి నుంచి ఏదీ ఆశించకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. మొదటి వహీ వచ్చింది: “ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్”. ఆ తర్వాత రెండవ వహీ సూరహ్ ముద్దస్సిర్. దాంట్లో ఒక వాక్యం ఉంది.

وَلَا تَمْنُن تَسْتَكْثِرُ
ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు. (74:6)

నేను దానం చేస్తే, నేను సహాయం చేస్తే, తిరిగి అతనితో నాకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో దానం చేస్తే అది దానం కాదు. అది సదకా కాదు. నువ్వు ఒక ఉద్దేశ్యంతో, ఒక లాభంతో, మళ్లీ నీకు ఏదో రూపంలో తిరుగు వస్తుందనే భావంతో నువ్వు ఇస్తున్నావు కదా? అది దానం ఎలా అయ్యింది? ఆ ఉద్దేశ్యంతో దానం, ఉపకారం చేయకు అని అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశించి అంటున్నాడు. “వలా తమ్నున్ తస్తక్ సిర్” – ఓ ప్రవక్తా, అధికంగా పొందాలన్న ఆశతో ఉపకారం చేయకు. సర్వసాధారణమైన రీతిలో ముస్లింలకు ఈ విధంగా తాకీదు చేయడం జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ
ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. (2:264)

ఈ ఆయతులో ప్రదర్శనా బుద్ధితో దానం చేయటం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిశ్వాసులతో పోల్చాడు. ఏ విధంగా అయితే “వలా యు’మిను బిల్లాహ్”, అల్లాహ్‌ను ఎవరు విశ్వసించరో, అల్లాహ్‌ను ఎవరు నమ్మరో, వారు ఈ విధానాన్ని పాటిస్తారు. వారికి మరణం తర్వాత జీవితం, వారికి అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ పట్ల విశ్వాసం, అల్లాహ్ పట్ల భీతి లేదు కదా? విశ్వాసమే లేదు. అటువంటి వారు చేసే దానం, మీరు విశ్వసించే వారు, మీరు చేసే దానం ఒకే రకంగా ఉంటే తేడా ఏంటి? వారు ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తారు, మీరు అలా చేయకండి. అలా చేస్తే వారు చేసిన దానం మాదిరిగా అవుతుంది అని అల్లాహ్ ఉపమానం ఇచ్చాడు. అలాగే సూరహ్ బఖరాలో ఇలా ఉంది:

قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّهُ غَنِيٌّ حَلِيمٌ
దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్‌ అక్కరలేనివాడు, సహనశీలుడు.(2:263)

అంటే మీరు ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తున్నారు, దానికంటే మంచి మాట చెప్పటం మంచిది. పుణ్యం వస్తుంది. దీనికి పుణ్యం రాదు కదా. అది రియా అయిపోయింది కదా, పాపం అయిపోయింది కదా. డబ్బు పోయింది, పుణ్యం పోయింది. దానికంటే అటువంటి దానం కంటే మంచి మాట పలకటం ఇది గొప్పది అని అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ లో. అలాగే సూరహ్ బఖరాలో ఇలా ఉంది:

إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
[ఇన్ తుబ్దుస్ సదఖాతి ఫనిఇమ్మా హియ, వ ఇన్ తుఖ్ఫూహా వ తు’తూహల్ ఫుఖరాఅ ఫహువ ఖైరుల్ లకుమ్, వ యుకఫ్ఫిరు అన్కుమ్ మిన్ సయ్యిఆతికుమ్, వల్లాహు బిమా త’అమలూన ఖబీర్]
ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్‌ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు.(2:271)

ఇక్కడ బహిరంగంగా అంటే కొంతమంది పండితులు ఇది జకాత్, ఫర్జ్ జకాత్. ఈ ఫర్జ్ జకాత్‌ని కొందరికి తెలిసి నేను ఇస్తే, వేరే వాళ్ళకి నేను ఆదర్శంగా ఉంటాను. ఇది ఫర్జ్ కదా. ఇప్పుడు మనం నమాజ్ ఫర్జ్, దాన్ని గోప్యంగా చేసే అవసరం లేదు. ఉపవాసం ఫర్జ్, గోప్యం అవసరం లేదు. ఉన్నవారికి హజ్ ఫర్జ్, గోప్యం అవసరం లేదు. ఆ విధంగా జకాత్ ఫర్జ్ అయిన వారు కొందరికి తెలిసి జకాత్ ఇస్తే అది మంచిదే. కానీ నార్మల్ సదకా, సాధారణమైన సదకా దానాలు, “వ ఇన్ తుఖ్ఫూహా వ తు’తూహల్ ఫుఖరాఅ ఫహువ ఖైరుల్ లకుమ్” అయితే మీరు వాటిని గోప్యంగా నిరుపేదల వరకు చేరిస్తే అది మీకు మరీ మంచిది. అల్లాహ్ మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. అలాగే:

الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు. (2:274)

ఇక దానం చేసిన తర్వాత మనసులో బాధ కలిగితే, అది ఎటువంటి దానం అది? ఇష్టం లేకుండా, అయిష్టకరంగా ఇవ్వటం. వారు ఇస్తున్నారు, నేను ఇవ్వకపోతే బాగుండదు కదా, అనుకుని ఇవ్వటం. ఇచ్చిన తర్వాత బాధపడటం, అయ్యో పోయింది అని చెప్పి. దీన్ని ఏమంటారు? ఖురాన్ లో ఉంది.

وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمْ كَارِهُونَ
వారు, అంటే కపట విశ్వాసులు, మునాఫిఖీన్లు, ఒకవేళ దైవ మార్గంలో ఖర్చు పెట్టినా అయిష్టంగానే ఖర్చు పెడతారు. (9:54)

ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కపట విశ్వాసుల గురించి చెప్పాడు. బాధపడుతూ దానం చేయటం, అయిష్టకరంగా దానం చేయటం, దానం చేసిన తర్వాత కుమిలిపోవటం, ఎందుకు ఇచ్చానా అని చెప్పి, డబ్బు పోయిందా అని అనుకోవటం, ఇది ఎవరి గుణము? కపట విశ్వాసుల గుణం. సూరహ్ తౌబాలో ఉంది. అంటే అయిష్టంగా ఖర్చు పెట్టడం ఇది కపట విశ్వాసుల లక్షణం.

وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ
దైవ ప్రసన్నతను చూరగొనటానికి (అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ కి మర్జీ, అల్లాహ్ కి రజా పానే కే లియే) తమ పనులను, మనసులను నిమ్మళించడానికి సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం ఎత్తైన ప్రదేశంలో ఉన్న తోట వంటిది.

وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ
ఇంకా మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నతను బడయటానికే ఖర్చు చేయండి. మీరేం ఖర్చు చేసినా అది మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకు ఎంత మాత్రం అన్యాయం జరగదు. (2:272)

అంటే దానాల ప్రయోజనం అల్లాహ్ ఈ లోకంలో కూడా ప్రసాదిస్తాడు, పరలోకంలో కూడా ప్రసాదిస్తాడు.

అభిమాన సోదరులారా, ఒకటి, ప్రతి వ్యక్తి దానం చేయవచ్చు. డబ్బు ఉన్నవారు ఆర్థికపరంగా, తక్కువ ఉన్నవారు తమ స్థోమతపరంగా, ఏమీ లేని వారు ఇతర మార్గాల ద్వారా ప్రతి వ్యక్తి దానం చేసే అవకాశం ఉంది. రెండవది ఏమిటి? ప్రదర్శనా బుద్ధితో దానం చేయకూడదు, అది రియా అవుతుంది, చిన్న షిర్క్ అవుతుంది, దానికి ప్రతిఫలం రాదు.

మూడవ విషయం,

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
[కుల్లు మ’అరూఫిన్ సదఖతున్]
మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదకా క్రిందకే వస్తుంది.

కుల్లు మ’అరూఫిన్ సదకా, మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదకా కిందకే వస్తుంది. కావున స్థోమత ఉన్నవారు తమ స్థోమత పరంగా ఏదో రూపంలోనైనా దానం చేయాలి, అది చిన్నది అని అల్పంగా భావించకూడదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ
ఏ సత్కార్యాన్ని అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి. ఆఖరికి తమ సోదరుణ్ణి నగుమోముతో పలకరించడాన్ని అయినా సరే.

అంటే చిరునవ్వుతో నవ్వటం కూడా మంచి సంకల్పంతో సదకా కిందకే వస్తుంది. అది ఎంత చిన్నదైనా, ఎంత రవ్వంత అయినా సరే, అల్పంగా భావించకండి. అల్లాహ్ మనసు చూస్తాడు, అల్లాహ్ నియ్యత్, సంకల్పం చూస్తాడు. ఎటువంటి సంకల్పంతో, ఎటువంటి బుద్ధితో ఇస్తున్నావు, అది ముఖ్యం. ఎంత ఇస్తున్నావు అది ముఖ్యం కాదు.

అలాగే చివర్లో ఒక హదీస్ చెప్పి నేను ముగిస్తున్నాను. అది ఏమిటంటే, ఒక హదీసులో ఇలా ఉంది:

كُلُّ سُلامَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ، كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ
ప్రతి ముస్లిం ప్రతి రోజూ అతని శరీరంలో ఎముకలు ఎన్ని జాయింట్లు ఉన్నాయో, ఎముకల జాయింట్లు, కొందరు అంటారు దాదాపు 360 జాయింట్లు ఉన్నాయి అంటారు. శరీరంలో ఎముకల జాయింట్లు 360 ఉన్నాయి. అంటే ప్రతి రోజూ ప్రతి జాయింట్ కి బదులుగా ఒక దానం చేయాలి, సదకా ఇవ్వాలి.

అంటే ప్రతి రోజు 360 దానాలు చేయాలి. కాకపోతే ఇక్కడ దానం అంటే డబ్బు రూపంలోనే కాదు. అది ఏమిటి?

يَعْدِلُ بَيْنَ اثْنَيْنِ صَدَقَةٌ
ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయటం సదకా.

وَيُعِينُ الرَّجُلَ عَلَى دَابَّتِهِ فَيَحْمِلُ عَلَيْهَا
ముందు కాలంలో గుర్రాల్లో, గాడిదల్లో, ఒంటెల్లో సవారీ చేసేవారు. దానిపై వారికి ఎక్కించడానికి, కొందరు అనారోగ్యం మూలంగా, వృద్ధాప్యం వలన పైకి ఎక్కలేరు. ఇప్పుడు కూడా బస్సులో, కార్లలో, మోటార్లలో, రైళ్లలో సామాన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సామాన్లు ఎక్కించడానికి వారికి సహాయం చేయటం, కొందరికి ఆరోగ్యం బాగా లేదు, వికలాంగులు, వారికి కూర్చోబెట్టడానికి సహాయం చేయటం అది కూడా దానమే, సదకాయే.

أَوْ يَرْفَعُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ
సామాన్లు మోయటం అది సదకా.

وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ
మంచి మాట చెప్పటం, అది కూడా సదకా.

وَكُلُّ خُطْوَةٍ يَخْطُوهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ
నమాజు కోసం మనము వేసే ప్రతి అడుగు సదకా కిందకే వస్తుంది.

وَيُمِيطُ الْأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ
దారి నుండి హాని కలిగించే, నష్టం కలిగించే ముల్లు లాంటిది, బండ లాంటిది, రాయి లాంటిది, ఏదైనా అశుద్ధత లాంటిది దూరం చేయటం కూడా అది కూడా సదకా కిందకే వస్తుంది.

కావున, ఏమీ లేని వారు కూడా అనేక రకాలుగా దానాలు చేయవచ్చు, ప్రతి రోజు చేయవచ్చు, ప్రతి సమయం చేయవచ్చు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇటువంటి దానాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ఇహపర లోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42048

జకాతు & సదఖా: (మెయిన్ పేజీ )
https://teluguislam.net/five-pillars/zakah/