ప్రాణాంతకమైన 7 విషయాలు!
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/gRDAnqTbVpY [9 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో ఏడు ఘోరమైన, ప్రాణాంతకమైన పాపాల గురించి వివరించబడింది. మునుపటి ప్రసంగంలో చర్చించిన ఏడు రకాల పుణ్యకార్యాలకు విరుద్ధంగా, ఈ పాపాలు ఒక వ్యక్తిని నాశనం చేస్తాయని చెప్పబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసును ఉటంకిస్తూ, ఈ ఏడు పాపాలను జాబితా చేశారు: 1) అల్లాహ్కు భాగస్వాములను కల్పించడం (షిర్క్), 2) చేతబడి (సిహ్ర్), 3) అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీయడం, 4) వడ్డీ తినడం (రిబా), 5) అనాథ ఆస్తిని తినడం, 6) ధర్మయుద్ధం నుండి పారిపోవడం, మరియు 7) పవిత్రులైన విశ్వాస స్త్రీలపై అపనిందలు వేయడం. ఈ పాపాలు ఎంత తీవ్రమైనవో, వాటికి కేవలం సాధారణ పుణ్యకార్యాలు కాకుండా, ప్రత్యేక పశ్చాత్తాపం (తౌబా) అవసరమని నొక్కి చెప్పబడింది. ఈ ఘోరమైన పాపాల నుండి రక్షణ పొందాలని అల్లాహ్ను ప్రార్థిస్తూ ప్రసంగం ముగుస్తుంది.
అభిమాన సోదరులారా! కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
అభిమాన సోదరులారా! ఈ రోజు మనం ప్రాణాంతకమైన ఏడు విషయాలు తెలుసుకుందాం. నిన్న ఎపిసోడ్ లో మనం ప్రళయ దినాన ఏడు రకాల మనుషులకి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు అని తెలుసుకున్నాము. అంటే నిన్న తెలుసుకుంది కావలసిన ఏడు విషయాలు. న్యాయం కావాలి, నమాజ్ చేయాలి, యవ్వనం అల్లాహ్ మార్గంలో గడపాలి, గుప్తంగా దానం చేయాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, ఏకాంతంలో అల్లాహ్ కు భయపడాలి, ఏడవాలి భయపడి, కలుసుకుంటే అల్లాహ్ ప్రసన్నత, విడిపోతే అల్లాహ్ ప్రసన్నత – ఈ ఏడు కావలసిన, చేయవలసిన విషయాలు నిన్న తెలుసుకున్నాము.
ఈ రోజు ఏడు విషయాలని వదులుకోవాలి. ప్రాణాంతకమైన ఏడు విషయాలు. పాపంతో కూడుకున్న ఏడు విషయాలు. ఘోరమైన పాపంతో కూడుకున్న ఏడు విషయాలు. అందుకే, దానికి ప్రాణాంతకమైన విషయాలు అని చెప్పడం జరిగింది. ఆ హదీస్ ఏమిటంటే, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:
اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ
(ఇజ్తనిబు అస్సబ్’అల్ మూబికాత్)
“ప్రాణాంతకమైన ఏడు విషయాలకు దూరంగా ఉండండి” అని అన్నారు.
ఇది విన్న సహాబాలు రిజ్వానుల్లాహి అలైహిం అజ్మయీన్
قَالُوا يَا رَسُولَ اللهِ وَمَا هُنَّ
(ఖాలూ యా రసూలల్లాహ్, వమా హున్)
“ఓ దైవ ప్రవక్తా! ఆ ప్రాణాంతకమైన ఏడు విషయాలు ఏమిటి?” అని అడిగారు.
దానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఏడు విషయాలు వివరించారు. వాటిల్లో మొదటి విషయం
اَلشِّرْكُ بِاللهِ
(అష్-షిర్కు బిల్లాహ్)
అల్లాహ్కు సహవర్తుల్ని నిలబెట్టడం.
ఇది అన్నింటికంటే ఘోరమైన పాపం, ప్రాణాంతకమైన విషయం.
ప్రియ వీక్షకుల్లారా! షిర్క్ అంటే ఏమిటి? అల్లాహ్ అస్తిత్వములో లేదా అల్లాహ్కు కొరకు మాత్రమే ప్రత్యేకమైన ఉన్న భావములో ఆయన గుణగణాలలో లేదా ఆయన హక్కులలో ఎవరినైనా సహవర్తునిగా ఎంచటమే షిర్క్. వాడుక భాషలో చెప్పాలంటే, అల్లాహ్ను నమ్ముతూ, అల్లాహ్ తో పాటు ఇతరులని కూడా పూజ చేయటం, ఆరాధించటం. ఆరాధన అల్లాహ్కే ప్రత్యేకం కదా, కానీ ఆ ఆరాధన ఇతరులకు కూడా చేయటం. ఇది కూడా షిర్క్ అవుతుంది. అంటే బహుదైవారాధన.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరె లుఖ్మాన్ లో ఇలా తెలియజేశాడు:
يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్, ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్)
“ఓ నా కుమారా! అల్లాహ్కు భాగస్వాములను కల్పించకు. నిశ్చయంగా షిర్క్ చాలా పెద్ద దుర్మార్గం.” (31:13)
ఇది లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి హితోపదేశిస్తూ చెప్పిన విషయం ఇది. “యా బునయ్య! ఓ నా ముద్దుల పుత్రుడా! లా తుష్రిక్ బిల్లాహ్ – అల్లాహ్కు భాగస్వాములను కల్పించకు. అల్లాహ్ తో షిర్క్ చేయవద్దు, సాటి కల్పించవద్దు. ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్ – ఎందుకంటే నిస్సందేహంగా షిర్క్ అనేది మహా పాపం, ఘోరమైన అన్యాయం.”
ఇది క్లుప్తంగా షిర్క్. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రాణాంతకమైన ఏడు విషయాలలో ఇది మొట్టమొదటిది, చాలా ఘోరమైనది – షిర్క్. షిర్క్ చేస్తూ చనిపోతే అటువంటి వారికి క్షమాపణ లేదని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి షిర్క్ నుండి – పెద్ద షిర్క్, చిన్న షిర్క్, అన్ని రకాల షిర్క్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించు గాక, కాపాడు గాక.
ఇది మొదటి విషయం. ప్రాణాంతకమైన ఏడు విషయాలలో మొదటి విషయం షిర్క్ చేయటం. అల్లాహ్కు భాగస్వాములు నిలబెట్టడం.
రెండవది:
وَالسِّحْرُ
(వస్-సిహ్ రు)
చేతబడి.
జాదూ. చేతబడి చేయటం, చేయించటం ఇస్లాంలో హరాం, నిషిద్ధం, అధర్మం, ఘోరమైన పాపం.
అలాగే మూడవది:
وَقَتْلُ النَّفْسِ الَّتِي حَرَّمَ اللهُ إِلَّا بِالْحَقِّ
(వ కత్లున్-నఫ్సిల్లతీ హర్రమల్లాహు ఇల్లా బిల్-హఖ్)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపటం.
హత్య చేయటం ఘోరమైన పాపం.
అలాగే నాలుగవది:
وَأَكْلُ الرِّبَا
(వ అకులుర్-రిబా)
వడ్డీ తినటం.
ఇస్లాం ధర్మంలో వడ్డీ సమంజసం కాదు. అధర్మం, నిషిద్ధం, హరాం, ఘోరమైన పాపం, అన్యాయం, దగా, మోసం కిందకి లెక్కించబడుతుంది. ఇస్లాం ధర్మంలో వడ్డీ ఇచ్చినా, వడ్డీ పుచ్చుకున్నా, దానికి సాక్ష్యంగా ఉన్నా, అందరూ పాపములో సమానులే అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అలాగే ఐదవ విషయం:
وَأَكْلُ مَالِ الْيَتِيمِ
(వ అకులు మాలిల్-యతీమ్)
అనాథుని సొమ్ము తినేయటం.
ఎవరి సొమ్మయినా సరే అన్యాయంగా తినేస్తే, కాజేస్తే అది అధర్మమే, అది పాపమే. దాంట్లో ముఖ్యంగా అనాథుని సొమ్ము తినేస్తే ఇది ఇంకా ఘోరమైన పాపం.
ఆరవది:
وَالتَّوَلِّي يَوْمَ الزَّحْفِ
(వత్-తవల్లీ యౌమజ్-జహ్ఫి)
దైవ తిరస్కారులతో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ధర్మయుద్ధం అది. ఎక్కడైతే అక్కడ గొడవ చేయటం, ధర్మయుద్ధం కిందకి రాదు. బాంబులు వేసేయటం, ధర్మయుద్ధం కిందకి రాదు. ఇది అపోహ. దానికి కొన్ని రూల్స్, కండిషన్లు ఉన్నాయి. అల్లాహ్ మార్గంలో యుద్ధం జరిగినప్పుడు వెన్ను చూపి పారిపోవటం.
అలాగే ఏడవది:
وَقَذْفُ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ الْغَافِلَاتِ
(వ కజ్ఫుల్ ముహ్సినాతిల్ ము’మినాతిల్ గాఫిలాత్)
అమాయకులు, శీలవంతులు అయిన విశ్వాస స్త్రీల మీద అభాండాలు వేయటం, అపనిందలు మోపటం.
ఈ ఏడు రకాల పాపాలు ప్రాణాంతకమైనవి. పాపాలలో అతి ఘోరమైనవి. దీనికి పెద్ద పాపాలు అంటారు, కబాయిర్ అంటారు. అంటే, ఈ పాపాలు నమాజ్ వల్ల, దుఆ వల్ల, వేరే పుణ్యాల వల్ల క్షమించబడవు. దీనికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాల్సిందే, తౌబా చేసుకోవాల్సిందే. ఈ పాపాలకి తప్పనిసరిగా తౌబా చేసుకోవాలి, పశ్చాత్తాప పడాలి. అప్పుడే ఇవి క్షమించబడతాయి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఈ ఘోరమైన పాపాల నుండి రక్షించు గాక! అల్లాహ్ మనందరినీ షిర్క్ నుండి కాపాడు గాక! వడ్డీ నుండి కాపాడు గాక! చేతబడి చేయటం, చేయించటం నుండి కాపాడు గాక! అనాథుని సొమ్ముని కాజేయటం నుండి అల్లాహ్ మనల్ని రక్షించు గాక! ప్రతి పాపం నుండి, ఆ పాపం పెద్దదైనా, ఆ పాపం చిన్నదైనా, అల్లాహ్ మనందరినీ రక్షించు గాక! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక! ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42368
పాపాలు (Sins):
https://teluguislam.net/sins/