యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో | టెక్స్ట్]

యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/dTlJikQ_EoE [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రవక్త యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర వివరించబడింది. ఆయన వంశం, ఆయన తండ్రి ఇస్ హాఖ్ (అలైహిస్సలాం) మరియు తాత ఇబ్రాహీం (అలైహిస్సలాం కూడా ప్రవక్తలేనని ప్రస్తావించబడింది. యాఖూబ్ (అలైహిస్సలాం) తన మామయ్య కుమార్తెలు లయ్యా మరియు రాహీల్ లను వివాహం చేసుకున్న వృత్తాంతం, ఆయనకు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆయన తన ప్రయాణంలో కన్న కల, దాని ఆధారంగా ఒక పుణ్యక్షేత్రం (బైతుల్ మఖ్దిస్) నిర్మిస్తానని మొక్కుకున్న సంఘటన, మరియు ఆ మొక్కును నెరవేర్చిన విధానం కూడా వివరించబడింది. చివరగా, ప్రవక్తలు వారి జాతి కోసమే పంపబడ్డారని, కేవలం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే యావత్ మానవాళి కోసం పంపబడ్డారని స్పష్టం చేయబడింది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్]
మరియు ప్రవక్తలలో శ్రేష్ఠుడు మరియు ప్రవక్తల నాయకునిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

نَبِيِّنَا مُحَمَّدٍ وَّ عَلَى آلِهِ وَ أَصْحَابِهِ أَجْمَعِيْنَ
[నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై మరియు వారి అనుచరులందరిపై శుభాలు కలుగుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహా ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించాడు, అయితే సంతానము తరఫున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే, చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటిచూపుకి ఆయన దూరమైపోయారు. ఎవరాయన అంటే, ఆయనే ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలాం వారు.

యాఖూబ్ అలైహిస్సలాం వారు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్ హాఖ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్ హాఖ్ అలైహిస్సలాం కూడా ప్రవక్త, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త కాబట్టి, నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను.

ఇక రండి, యాఖూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్ హాఖ్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాఖూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది.

రిబ్కాతో వివాహం జరిగిన తరువాత, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సంతానం కోసమో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈస్ (ఈసు అని కూడా చెబుతూ ఉంటారు), రెండవ కుమారుని పేరు యాఖూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఈస్ పెద్ద కుమారుడు, యాఖూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఈస్ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాఖూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. ఈస్ వారిని ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు, యాఖూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు, అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.

ఇకపోతే, ఆ పుట్టిన ఇద్దరు కుమారులు, ఈస్ మరియు యాఖూబ్, ఇద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాప్యానికి చేరుకున్నారు, ఆయన కంటిచూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తరువాత, వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగినప్పుడు, తల్లి రిబ్కా యాఖూబ్ వారిని పిలిచి, “చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో.” అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాఖూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు.