పిల్లల శిక్షణలో తల్లి పాత్ర – సలీం జామయి [వీడియో & టెక్స్ట్]

పిల్లల శిక్షణలో తల్లి పాత్ర
https://youtu.be/4JQEh-fctIQ [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, పిల్లల శిక్షణలో తల్లి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. పిల్లలు అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహమని, వారిని నరకాగ్ని నుండి కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత అని ఖురాన్ ఆయతుతో స్పష్టం చేయబడింది. తండ్రితో పోలిస్తే తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుందని, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తల్లితోనే గడుపుతారని ఒక హదీసు ఉటంకించబడింది. ప్రవక్త నూహ్ మరియు ప్రవక్త ఇబ్రాహీం (అలైహిముస్సలాం)ల కుమారుల ఉదాహరణల ద్వారా తల్లి విశ్వాసం పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేయబడింది. అలాగే, ఇమామ్ అలీ, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్, ఇమామ్ బుఖారీ, మరియు ఇమామ్ షాఫియీ వంటి గొప్ప ఇస్లామీయ పండితులు మరియు నాయకుల జీవితాలలో వారి తల్లుల పెంపకం, భక్తి మరియు త్యాగాల పాత్రను చారిత్రక సంఘటనలతో వివరించారు. నేటి యువత మార్గభ్రష్టులు కావడానికి ధార్మిక విద్య లోపించడమే కారణమని, సమాజ సంస్కరణ జరగాలంటే బిడ్డలకంటే ముందు తల్లులకు విద్య నేర్పించడం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడు అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో ‘పిల్లల శిక్షణలో తల్లి పాత్ర’ అనే అంశం మీద ఇన్ షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసు వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులకు అనేక అనుగ్రహాలు ప్రసాదించాడు. ఆయన ప్రసాదించిన అనుగ్రహాలలో సంతానం గొప్ప అనుగ్రహం. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సంతానము ఇవ్వలేదో, అలాంటి దంపతులకు వెళ్ళి కలిసి మాట్లాడి చూడండి, సంతానం కోసం, బిడ్డల కోసం వారు ఎంత తపిస్తూ ఉంటారో వారి మాటలు వింటే అర్థమవుతుంది. తద్వారా, ఎవరికైతే అల్లాహ్ బిడ్డలు ఇచ్చాడో, సంతానము ప్రసాదించాడో, వారు అల్లాహ్ తరఫున గొప్ప అనుగ్రహము పొంది ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి.

అయితే, ఆ సంతానం విషయంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు. ఖురాన్‌లోని 66వ అధ్యాయము 6వ వాక్యంలో అల్లాహ్ ఆదేశించిన ఆ ఆదేశము ఈ విధంగా ఉంది.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا
[యా అయ్యుహల్లజీన ఆమనూ ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నారా]
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి (66:6)

ఇక్కడ చాలా మంది ఆలోచనలో పడిపోతూ ఉంటారు. మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రపంచంలో ఉన్నవారికి ఆదేశిస్తున్నాడు, నరకాగ్ని ప్రపంచంలో లేదు కదండీ, పరలోకంలో కదా నరకాగ్ని ఉండేది, ప్రపంచంలో నరకాగ్ని నుండి మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని కాపాడుకోండి అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి అని ఆలోచించుకుంటూ ఉంటే, ధార్మిక పండితులు తెలియజేసిన విషయము చూడండి, ఏ పనులు చేయడం వలన మనము వెళ్ళి నరకంలో పడిపోతామో, ఏ పాపాలు చేయడం వలన, ఏ దుష్కార్యాలు చేయడం వలన మన కుటుంబీకులు వెళ్ళి నరకంలో పడిపోతారో, ఆ పనుల నుండి, ఆ కర్మల నుండి మనము కూడా దూరంగా ఉండాలని, మన కుటుంబీకుల్ని కూడా దూరంగా ఉంచమని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేస్తున్నాడు, ఈ వాక్యానికి అర్థము అది అని ధార్మిక పండితులు వివరించారు.

ఏ పనులు చేస్తే మనిషి వెళ్ళి నరకంలో పడతాడు అంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేయమని ఆజ్ఞాపించిన పనులు చేయకపోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఏ పనులైతే చేయవద్దు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారించాడో, ఆ పనులు చేసేస్తే అది పాపం అవుతుంది, అప్పుడు నరకానికి వెళ్ళి పడాల్సి ఉంటుంది. కాబట్టి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ పనులు చేయమని ఆదేశించాడో, ఏ పనులు చేయరాదు అని ఆదేశించాడన్న విషయాన్ని ముందు మనము తెలుసుకోవాలి, మన కుటుంబీకులకు కూడా తెలియపరచాలి, ఆ విధంగా అల్లాహ్ ఆదేశాలు మనము మరియు మన కుటుంబ సభ్యులు కట్టుబడి ఉంటే ఇన్ షా అల్లాహ్ నరకాగ్ని నుండి రక్షించబడతాము, స్వర్గానుగ్రహాలకు అర్హులవుతాము.

ఇక రండి మిత్రులారా. అల్లాహ్ ఆదేశాల గురించి మనము తెలుసుకోవాలి, మన కుటుంబీకులకు తెలియపరచాలి. మన కుటుంబీకులలో ముఖ్యంగా మన సంతానము ఉన్నారు, ఆ మన సంతానానికి అల్లాహ్ ఆజ్ఞలు తెలియజేయాలి. ఒక రకంగా సూటిగా చెప్పాలంటే, ధర్మ అవగాహన, ధార్మిక శిక్షణ వారికి ఇప్పించాలి. అయితే, బిడ్డలకు ధార్మిక శిక్షణ ఇప్పించే బాధ్యత తల్లి, తండ్రి ఇద్దరి మీద ఉంది, ఇందులో ఎలాంటి సందేహము లేదు, కాకపోతే తల్లి మీద కొంత ఎక్కువగా బాధ్యత ఉంది.

చూడండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ప్రవచించారు.

وَالْمَرْأَةُ رَاعِيَةٌ عَلَى بَيْتِ بَعْلِهَا وَوَلَدِهِ وَهِيَ مَسْؤولَةٌ عَنْهُمْ
[వల్ మర్అతు రాఇయతున్ అలా బైతి బాలిహా వ వలదిహీ వహియ మస్ఊలతున్ అన్హుమ్]
మహిళ తన భర్త ఇల్లు మరియు సంతానము పట్ల బాధ్యురాలు. వారి బాధ్యత పట్ల ఆవిడ ప్రశ్నించబడుతుంది. (సహీహ్ బుఖారీ)

పురుషుడు కూడా బాధ్యుడే. ముఖ్యంగా ఇక్కడ మహిళ గురించి తెలియజేస్తూ, భర్త ఇల్లు మరియు సంతానము పట్ల మహిళ బాధ్యురాలు. ఆ బాధ్యత గురించి ఆమెకు ప్రశ్నించబడుతుంది కాబట్టి ఆ బాధ్యత ఆమె ఇక్కడ ప్రపంచంలో నెరవేర్చాలి అన్నారు. అలా ఎందుకన్నారన్న విషయాన్ని వివరిస్తూ ధార్మిక పండితులు తెలియజేశారు, తల్లి బిడ్డల అనుబంధము చాలా పటిష్టమైనది. బిడ్డలు తల్లి వద్ద ఎక్కువగా ఉంటారు. తండ్రి ఉద్యోగ రీత్యా, వ్యాపారము రీత్యా, ఇతర పనుల రీత్యా బయట ఎక్కువగా ఉంటాడు. కాబట్టి, బిడ్డలు తల్లి వద్ద ఎక్కువ ఉంటారు, తల్లి మాటల ప్రభావము, తల్లి చేష్టల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే చూడండి పండితులు అంటూ ఉంటారు, ‘తల్లి ఒడి శిశువుకి మొదటి బడి’. అలా ఎందుకంటారంటే బిడ్డలు తల్లి వద్ద ఎక్కువగా నేర్చుకుంటారు, తల్లి మాటల ప్రభావం బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా తెలియపరిచారు. అందుకోసమే తల్లి మీద సంతానం పట్ల కొంచెం బాధ్యత ఎక్కువ అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది మిత్రులారా.

ఇక రండి, తల్లి మాటల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అనటానికి ఖురాన్‌లో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా, హదీసులలో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా అని మనం చూచినట్లయితే, ఖురాన్‌లో ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన మనకు కనిపిస్తుంది.

ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు, తూఫాను వచ్చినప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు పిలవగా, “నాన్నా వచ్చి పడవలో ఎక్కు, విశ్వాసులతో పాటు కలిసిపో, ఈ రోజు ఈ తూఫాను నుండి ఎవ్వరూ రక్షించబడరు” అంటే, పడవలెక్కి కాదండీ, నేను పర్వతం ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటాను అన్నాడు. పర్వతం ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉండగా పెద్ద అల వచ్చి తాకింది. ఆ తాకిడికి నీళ్ళలో పడి, మునిగి మరణించాడు.

ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడ్ని చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వచ్చి, “నా కుమారా, నేను కల ద్వారా ఆదేశించబడ్డాను. నేను నిన్ను బలి ఇవ్వాలని అల్లాహ్ కోరుకుంటున్నాడు, నువ్వేమంటావు?” అంటే, “నాన్నగారండీ, మీకు ఇవ్వబడిన ఆదేశాన్ని వెంటనే మీరు అమలుపరచండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నన్ను సహనం పాటించే వారిలో చూస్తారు” అని వెంటనే ఆయన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైపోయారు. జరిగిన విషయం మనకు తెలుసు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని కాపాడాడు, ఆకాశము నుండి ఒక పశువుని పంపించి ఆయనకు బదులుగా ఆ పశువుని జబా చేయించాడు.

అయితే ఆలోచించి చూడండి. అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు ప్రవక్త పొజిషన్‌లో ఉన్న తండ్రి మాట వినట్లేదు, పర్వతం ఎక్కుతాను అని ప్రయత్నించాడు, చివరికి నీట మునిగి మరణించాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం, ప్రవక్త పదవిలో ఉన్న తండ్రి మాటను వెంటనే శిరసావహించాడు, బలి అయిపోవటానికి సిద్ధమైపోయాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే, ధార్మిక పండితులు ఆ విషయాన్ని కూడా వివరించారు. ఆ తేడా ఎందుకు వచ్చిందంటే, అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసురాలు, అవిధేయురాలు కాబట్టి, ఆమె అవిశ్వాస ప్రభావము ఆ బిడ్డ మీద కూడా పడింది, ఆ బిడ్డ కూడా అవిశ్వాసుడయ్యాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి హాజిరా అలైహస్సలాం గొప్ప భక్తురాలు. ఆమె భక్తి, ఆమె ఆరాధన, ఆమె ఆలోచన, ఆమె చేష్టలు వాటి ప్రభావము ఇస్మాయీల్ అలైహిస్సలాం వారి మీద పడింది. కాబట్టి ఆయన కూడా ఒక గొప్ప భక్తుడయ్యాడు. భక్తురాలి బిడ్డ భక్తుడయ్యాడు, అవిధేయురాలు బిడ్డ అవిధేయుడయ్యాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. తద్వారా తల్లి ఆలోచనల, తల్లి విశ్వాసాల, తల్లి చేష్టల, తల్లి మాటల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుందన్న విషయం అక్కడ స్పష్టమైపోయింది మిత్రులారా.

ఇక రండి. పూర్వం ఒక తండ్రి బిడ్డలను పిలిచి, వారు పెద్దవారైన తర్వాత సమావేశపరచి ఏమంటున్నాడంటే, “బిడ్డలారా! మీరు పుట్టిన తర్వాత నేను మీ మీద దయ చూపించాను. అలాగే, మీరు పుట్టక ముందు కూడా నేను మీ మీద దయ చూపించాను” అన్నాడు. బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు, ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం వారి వద్ద ఉన్నింది కాబట్టి వెంటనే నాన్నగారితో, “నాన్నగారండీ! మేము పుట్టిన తర్వాత మన కోసం మీరు కష్టపడ్డారు. మా ఆరోగ్యము రక్షించడానికి, మనకు మంచి ఆహారము తినిపించడానికి, మంచి బట్టలు ధరింపజేయటానికి, మంచి విద్య నేర్పించటానికి మీరు కష్టపడ్డారు, మా మీద దయ చూపించారు. ఇది అర్థమయింది. కానీ మేము పుట్టక ముందే మా మీద మీరు దయ చూపించారు అంటున్నారేమిటి? అది ఎలా సాధ్యమవుతుంది?” అని ఆశ్చర్యంగా వారు ప్రశ్నించినప్పుడు, ఆ తండ్రి అన్నాడు, “బిడ్డలారా! నా బిడ్డలు విద్యావంతులు, సమర్థవంతులు, క్రమశిక్షణ కలిగిన వారు, విలువలు కలిగిన వారు అవ్వాలంటే, నేను విద్యావంతురాలిని వివాహం చేసుకోవాలి. క్రమశిక్షణ కలిగిన, ధర్మ అవగాహన కలిగిన, భక్తురాలితో నేను వివాహం చేసుకోవాలి. అప్పుడే నా బిడ్డలు కూడా విద్యావంతులు, క్రమశిక్షణ కలిగిన వారు, భక్తులు అవుతారు అని నేను అందగత్తెల వెంట పడకుండా, ధనవంతురాలి వెనక పడకుండా, భక్తురాలు ఎక్కడున్నారని వెతికి మరీ నేను ఒక భక్తురాలితో వివాహం చేసుకున్నాను. అలా నేను వివాహం చేసుకోవడానికి కారణము, మీరు మంచి వారు, ప్రయోజనవంతులు, భక్తులు, సామర్థ్యము కలవారు కావాలనే ముందు చూపుతో అలా చేశాను కాబట్టి, మీరు పుట్టక ముందు కూడా నేను మీ మీద దయ చూపించాను” అని తెలియజేయగా, అప్పుడు ఆ బిడ్డలకు ఆ విషయం అర్థమయింది. తద్వారా ధార్మిక పండితులు తెలియజేసే విషయం ఏమిటంటే, మహిళ భక్తురాలు అయితే, విద్యావంతురాలు అయితే, వారి ఒడిలో పెరిగే బిడ్డలు కూడా గొప్ప భక్తులు అవుతారు, గొప్ప విద్యావంతులు అవుతారు.

దీనికి ఉదాహరణలు కూడా మనకు ఇస్లామీయ చరిత్రలో చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు ఇన్ షా అల్లాహ్ నేను మీ ముందర ఉంచుతున్నాను, చూడండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూ బకర్ రజియల్లాహు అన్హు వారు నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగము ప్రశాంతంగా గడిచిపోయింది. ఆయన మరణానంతరం ఉమర్ రజియల్లాహు అన్హు వారు నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగము కూడా ప్రశాంతంగా గడిచిపోయింది. ఇస్లామీయ సామ్రాజ్యము విస్తరించి చాలా దూరం వరకు వ్యాపించిపోయింది. ఆ తర్వాత ఉస్మాన్ రజియల్లాహు త’ఆలా అన్హు ముస్లిముల నాయకులయ్యారు. ఆయన ప్రారంభంలో ప్రశాంతంగానే పరిపాలన జరిపారు, అయితే చివరి రోజుల్లో పెద్ద పెద్ద ఉపద్రవాలు తలెత్తాయి. చివరికి ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు షహీద్ చేయబడ్డారు. అప్పటికే ఇస్లామీయ సామ్రాజ్యము చాలా దూరం వరకు వ్యాపించి ఉంది. పెద్ద పెద్ద ఉపద్రవాలు తలెత్తి ఉన్నాయి, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు షహీద్ చేయబడ్డారు. ఆ తర్వాత నాయకుని పోస్టు ఖాళీగా ఉంది. ఎవరు బాధ్యతలు చేపడతారు అని ఎవరి వద్దకు వెళ్ళి మీరు బాధ్యతలు చేపట్టండి అంటే, ఎవరూ సాహసించట్లేదు, ఎవరూ ముందుకు వచ్చి ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పరిస్థితులు అలా క్లిష్టతరంగా మారి ఉన్నాయి కాబట్టి, ఉపద్రవాలు అలా తలెత్తి ఉన్నాయి కాబట్టి, ఎవరూ సాహసించలేకపోయారు.

అలాంటప్పుడు, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముందుకు వచ్చి, బాధ్యతలు స్వీకరించి, తలెత్తి ఉన్న ఆ పెద్ద పెద్ద ఉపద్రవాలన్నింటినీ ఆరు నెలల లోపే పూర్తిగా అణచివేశారు. పరిస్థితులన్నింటినీ అల్హందులిల్లాహ్ చక్కదిద్దేశారు.

మరి అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారిలో అలాంటి సామర్థ్యము ఎక్కడి నుంచి వచ్చింది అని మనము కొంచెం ఆయన చరిత్రను వెతికి చూస్తే, అలీ రజియల్లాహు అన్హు వారు జన్మించినప్పుడు, వారి తండ్రి, అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న, వారి వద్దకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. చిన్నాన్న దగ్గరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి, చిన్నాన్న గారి వద్దకు, మీ కుటుంబంలో చాలా మంది బిడ్డలు ఉన్నారు, వారందరికీ పోషించే భారం మీ మీద ఎక్కువగా పడిపోతూ ఉంది కాబట్టి, అలీని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి పెంచుకుంటాను అని చెప్పగా, చిన్నాన్న సంతోషంగా అలీ రజియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతికి ఇచ్చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారిని, ఆయన పుట్టినప్పుడు పసితనంలో తీసుకొని వచ్చి, విశ్వాసుల మాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి చేతికి ఇచ్చి, ఈయనకు మీరు పోషించండి, మంచి బుద్ధులు నేర్పించండి అని చెప్పగా, ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా అలీ రజియల్లాహు అన్హు వారిని తీసుకొని, అలీ రజియల్లాహు అన్హు వారికి మంచి భక్తి, మంచి క్రమశిక్షణ, ఇలాంటి విషయాలు నేర్పించారు. అలా ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వద్ద శిక్షణ పొందిన అలీ రజియల్లాహు అన్హు వారు పెరిగి పెద్దవారయ్యాక, అలాంటి సామర్థ్యవంతులు, ప్రయోగవంతులు అయ్యారు మిత్రులారా. కాబట్టి, తల్లి మాటల, తల్లి భక్తి, తల్లి విశ్వాసపు ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అనటానికి ఇది పెద్ద నిదర్శనం.

ఇక రండి, రెండవ ఉదాహరణగా మనం చూచినట్లయితే, నలుగురు ఖలీఫాలు, అబూ బకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రజియల్లాహు అన్హుమ్ వారు. వారి పరిపాలన యుగము స్వర్ణయుగం. వారి తర్వాత ప్రపంచంలో కేవలం ఒకే ఒక వ్యక్తి వారి లాంటి పరిపాలన, న్యాయంతో కూడిన పరిపాలన కొనసాగించారు. ఒకే ఒకరు. ఒకే ఒకరికి మాత్రమే అలాంటి పరిపాలన, అంటే నలుగురు ఖలీఫాల లాంటి పరిపాలన చేయటానికి వీలు పడింది. ఆ ఒకరు ఎవరంటే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారు. మరి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారికి అలాంటి సామర్థ్యము వచ్చిందంటే, ఎలా వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన జీవిత చరిత్రను ఒకసారి మనము చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్ళి ఆ సంబంధము కలుస్తూ ఉంది. అది ఎలాగంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, ఆయన మారువేషంలో రాత్రి పూట గస్తీ చేసేవారు. ఒక రోజు గస్తీలో మారువేషంలో వెళ్తూ ఉంటే ఒక ఇంటి వద్ద తల్లి కూతుళ్ళ మధ్య గొడవ పడుతూ ఉండే శబ్దాన్ని విని, ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో వినటం ప్రారంభించారు.

అక్కడ తల్లి కుమార్తెతో, “ఈ రోజు పశువులు పాలు తక్కువ ఇచ్చాయి, కాబట్టి పాలలో నీళ్ళు కలుపు. వినియోగదారులందరికీ పాలు దొరికేలాగా పాలలో నీళ్ళు కలుపు,” అంటూ ఉంటే, కుమార్తె మాత్రము, “లేదమ్మా! విశ్వాసుల నాయకులు పాలలో నీళ్ళు కలపరాదు, స్వచ్ఛమైన పాలు మాత్రమే అమ్మాలి అని ఆదేశించి ఉన్నారు కాబట్టి, అలా చేయటము ద్రోహం అవుతుంది, అలా చేయకూడదమ్మా” అంటుంటే, తల్లి మాత్రము కుమార్తె మీద దబాయిస్తూ, “విశ్వాసుల నాయకుడు వచ్చి ఇక్కడ చూస్తున్నాడా? చెప్పింది చెప్పినట్టు చెయ్యి” అని దబాయిస్తూ ఉంటే, అప్పుడు భక్తురాలైన ఆ కుమార్తె తల్లితో, “విశ్వాసుల నాయకుడు చూడట్లేదమ్మా, నిజమే. కానీ ఈ విశ్వానికి నాయకుడు, విశ్వనాయకుడు ఉన్నాడు కదా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా! ఆయన చూస్తున్నాడే, మరి ఆయనకేమని సమాధానం ఇస్తారమ్మా” అని చెప్పారు. ఆ కూతురి, ఆ బిడ్డ మాటలు ఉమర్ రజియల్లాహు అన్హు వారికి చాలా నచ్చాయి. ఆమె భక్తి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి చాలా నచ్చింది. వెంటనే ఆ ఇల్లుని గుర్తు పెట్టుకోండి అని చెప్పి, మరుసటి రోజు ఉమర్ రజియల్లాహు అన్హు వారి కుమారుడు ఆసిమ్ అని ఒకరుంటే, ఆయనతో ఆ బిడ్డ వివాహము చేయించటానికి వెంటనే అక్కడికి మనుషుల్ని పంపించగా, వెంటనే ఆ సంబంధము అల్హందులిల్లాహ్ ఒకే అయింది. ఆ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ అమ్మాయిని, ఆ భక్తురాలిని కోడలుగా చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. అల్లాహు అక్బర్.

ఇక్కడికి ఆగలేదండీ, అసలు విషయం ఇప్పుడు వస్తుంది చూడండి. తర్వాత ఆ భక్తురాలికి ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెకు పుట్టిన బిడ్డే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారు. ఆ విధంగా ఆ భక్తురాలి మనవడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. ఆయన కూడా గొప్ప భక్తుడయ్యాడు, న్యాయంగా పరిపాలన చేసి నలుగురు ఖలీఫాల తర్వాత ఐదవ ఖలీఫాగా ఆయన కీర్తి పొందారు. కాబట్టి మహిళ భక్తురాలు అయితే ఆమె భక్తి ప్రభావము ఎంత వరకు వ్యాపిస్తుందో చూడండి మిత్రులారా.

ఇక రండి మరొక ఉదాహరణ మనం చూచినట్లయితే, ప్రపంచంలో ఖురాన్, అల్లాహ్ వాక్యాలతో నిండిన సురక్షితమైన గ్రంథము. ఖురాన్ తర్వాత ఈ ప్రపంచంలో ఎలాంటి బలహీనమైన వాక్యాలు, కల్పిత వాక్యాలు లేకుండా, పరిశుద్ధమైనది మరియు నమ్మకమైనది, ప్రామాణికమైన మాటలు కలిగి ఉన్న గ్రంథము ఏది అంటే సహీ అల్-బుఖారీ. ‘అసహుల్ కితాబి బాద కితాబిల్లాహి సహీ అల్-బుఖారీ’ అని పూర్తి ప్రపంచము ఆ గ్రంథము ప్రామాణికమైన హదీసులతో నిండి ఉంది అని, పూర్తి ప్రపంచము ఆ గ్రంథాన్ని ‘అసహుల్ కితాబి బాద కితాబిల్లాహ్’, అల్లాహ్ గ్రంథము తర్వాత ప్రామాణికమైన, నిజమైన మాటలతో నిండిన గ్రంథము అని కీర్తిస్తుంది. అలాంటి గ్రంథాన్ని ప్రపంచానికి ఇచ్చి వెళ్ళిన వారు ఎవరంటే ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్, ఇమామ్ బుఖారీ అని ప్రజలందరూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు.

మరి అలాంటి గొప్ప గ్రంథాన్ని ప్రపంచానికి ఆయన కానుకగా ఇచ్చి వెళ్ళారే, ఆయన అంత ప్రయోజకవంతుడు ఎలా అయ్యాడన్న విషయాన్ని మనము ఆయన చరిత్రలో కొంచెం వెళ్ళి చూస్తే, అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఆయన బాల్యంలో కంటి చూపుకి దూరమై అంధుడిగా ఉండేవారు. బాల్యంలో ఆయనకు కంటి చూపు ఉండేది కాదు. మరి, ఆయన తల్లి రాత్రి పూట నిద్ర మేల్కొని తహజ్జుద్ నమాజులో కన్నీరు కార్చి ఏడ్చి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాతో బిడ్డకు కంటి చూపు ఇవ్వాలని ప్రార్థించేది. ఆమె అల్లాహ్ తో ప్రార్థన చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతలచి, ఆమె ప్రార్థన ఆమోదించి, అంధుడిగా ఉన్న ఆ బాలుడికి కంటి చూపునిచ్చాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. కంటి చూపు వచ్చిన తర్వాత, ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత దేశ విదేశాలకు కాలినడకన ప్రయాణాలు చేసి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసులన్నింటినీ ప్రోగు చేసి ఒక గ్రంథ రూపంలో పొందుపరిచారు. అదే సహీ అల్-బుఖారీ గ్రంథము. జాబిల్లి వెలుగులో కూర్చొని ఆయన హదీసులు రాసేవారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. అలాంటి చూపు అల్లాహ్ ఆయనకు ఇచ్చాడు. అయితే, ఆ చూపు రావటానికి, ఆయన అంత గొప్ప విద్యావంతుడు, భక్తుడు అవ్వటానికి కారణము ఆయన తల్లి. చూశారా? తల్లి భక్తి మరియు తల్లి విద్య యొక్క ప్రభావము బిడ్డల మీద ఎలా పడుతుందో చూడండి.

మరొక ఉదాహరణ మనం చూచినట్లయితే, నలుగురు ఇమాములు ప్రపంచంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్, ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్, ఇమామ్ అబూ హనీఫా రహిమహుల్లాహ్. ఈ నలుగురు ఇమాములలో ఇమామ్ షాఫియీ వారు గొప్ప విద్యావంతులు అని అందరికీ తెలిసిన విషయం. అందరూ ఆయన గొప్ప విద్యావంతుడన్న విషయాన్ని అంగీకరిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆయన చాలా పుస్తకాలు రచించి ప్రపంచానికి కానుకలుగా ఇచ్చారు. అందులో ‘అర్-రిసాలా’ అనేది ఒక పెద్ద, మంచి పుస్తకం. అలాంటి పుస్తకము అంతకు ముందు ఎవరూ రాయలేకపోయారు, ఆ తర్వాత కూడా ఎవరూ రాయలేకపోయారు అని ప్రపంచంలో ఉన్న పండితులు ఆ గ్రంథం గురించి తెలియజేస్తూ ఉంటారు, ఆ పుస్తకం గురించి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి విద్యతో నిండి ఉన్న పుస్తకము ప్రపంచానికి ఆయన ఇచ్చారు.

మరి అంత విద్యావంతులు, అంత గొప్ప భక్తులు, ఇమాముగా ఆయన ఖ్యాతి పొందారు అంటే, అలా ఎలా సాధ్యమైందన్న విషయాన్ని మనం ఆయన చరిత్రలో వెతికి చూస్తే, ఆయన జన్మించక ముందే లేదా ఆయన జన్మించిన కొద్ది రోజులకే ఆయన తండ్రి మరణించారు. ఆయన అనాథగా ఉన్నప్పుడు, పసితనంలోనే ఆయన అనాథగా ఉన్నప్పుడు, ఆయన జన్మించింది యెమెన్ దేశంలో. ఆయన తల్లి యెమెన్ దేశం నుండి చంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని ప్రయాణం చేసుకుంటూ యెమెన్ దేశం నుండి మక్కాకు వచ్చేసింది ఆవిడ. మక్కాకు వచ్చి అక్కడ స్థిరపడి, అక్కడ ఈ ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారికి మంచి విద్య నేర్పించింది. బిడ్డను ఒడిలో తీసుకొని వచ్చి మక్కాలో పండితుల వద్ద విద్య నేర్పించారు. అక్కడ స్థిరపడి, అక్కడ కష్టపడి బిడ్డకు విద్య నేర్పించారు, ప్రయోజవంతులు చేయటానికి ఆమె కృషి చేశారు. ఆమె కృషికి ఫలితంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారికి ఎలాంటి విద్యావంతులుగా తీర్చిదిద్దాడంటే, ఏడు సంవత్సరాల వయసులోనే ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత లక్షల సంఖ్యలో హదీసులను ఆయన కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు రచించి ప్రపంచానికి ఆయన ఇచ్చారు. ఆ విధంగా అంత పెద్ద ప్రయోజవంతులు, విద్యావంతులు, ఇమాముగా ఆయన ప్రసిద్ధి చెందారు, ఖ్యాతి పొందారు అంటే అక్కడ ఆయన తల్లి యొక్క శ్రమ, ఆయన తల్లి యొక్క కృషి ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి.

వీటన్నింటి ద్వారా, ఈ ఉదాహరణలన్నీ మనము దృష్టిలో పెట్టుకుంటే, మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే మిత్రులారా, తల్లి విద్యావంతురాలు అయితే, తల్లి భక్తురాలు అయితే, తల్లి వద్ద సామర్థ్యము ఉంటే, ఆ తల్లి భక్తి ప్రభావము, ఆ తల్లి విశ్వాస ప్రభావము, ఆ తల్లి చేష్టల మాటల ప్రభావము బిడ్డల మీద పడుతుంది. ఆ బిడ్డలు పెద్దవారయ్యి గొప్ప విద్యావంతులు, గొప్ప భక్తులు, పండితులు అవుతారు, ఇమాములు అవుతారు, ఖలీఫాలు అవుతారు, ప్రపంచానికి కానుకలు ఇచ్చి వెళ్తారు అని మనకు వీటి ద్వారా అర్థమవుతుంది. ఈ విధంగా పిల్లల శిక్షణలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. తండ్రి కూడా బాధ్యుడే కానీ, బిడ్డల మీద తండ్రి కంటే తల్లి మాటల, చేష్టల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.

అలాగే, మానసిక వైద్య నిపుణులు కూడా, వైద్య రంగానికి చెందిన ఈ నిపుణులు కూడా ఏమంటుంటారంటే, తల్లి గర్భంలో బిడ్డ ఉంటున్నప్పటి నుంచి, తల్లి ఆలోచనల, తల్లి మాటల, తల్లి విశ్వాసాల ప్రభావము తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే పడుతుంది. ఆ బిడ్డ మళ్ళీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తల్లి ఒడిలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా తల్లి ఆలోచనల, తల్లి మాటల, తల్లి చేష్టల, తల్లి విశ్వాసాల ప్రభావము మరీ ఎక్కువగా పడుతూ ఉంటుంది అని వైద్యులు, మానసిక వైద్య నిపుణులు కూడా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నారు.

ఇక నేటి పరిస్థితుల్ని మనం ఒకసారి చూచినట్లయితే, నేటి తరం, నేటి మన యువత, నేటి మన బిడ్డలు మార్గభ్రష్టులయ్యారు, మార్గం తప్పారు, అశ్లీలతకు బానిసయ్యారు, మద్యపానానికి, జూదానికి, ఇంకా వేరే చాలా దుష్కార్యాలకు, అక్రమాలకు వారు పాల్పడుతున్నారు. అలా వారు మార్గభ్రష్టులవటానికి కారణం ఏమిటి అంటే, చాలా కారణాలు దృష్టిలోకి వస్తాయి. అందులో ముఖ్యంగా మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు బిడ్డల ధార్మిక శిక్షణ గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు. బిడ్డలకు భక్తి విషయాలు నేర్పించే విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదు. బిడ్డలకు విలువలు నేర్పించాలి, బిడ్డలకు భక్తి నేర్పించాలి, మంచి చెడు అలవాట్లు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలి అనే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవట్లేదు. కేవలము ప్రాపంచిక విద్య, ప్రాపంచిక ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ, భక్తి, ధర్మ అవగాహన అనే విషయం మీద వారు దృష్టి సారించట్లేదు కాబట్టి నేటి యువత, నేటి మన తరాలు, రాబోయే తరాలు వారు మార్గభ్రష్టులైపోతున్నారు. ఆ విధంగా సమాజంలో అశాంతి, అలజడులు వ్యాపించిపోతున్నాయి అన్న విషయం దృష్టికి వస్తుంది. కాబట్టి, సమాజంలో శాంతి రావాలన్నా, మన బిడ్డలందరూ మంచి క్రమశిక్షణ కలిగిన వారుగా మారాలన్నా, రాబోయే తరాల వారందరూ కూడా ప్రయోజవంతులు కావాలన్నా, వారికి ధార్మిక శిక్షణ ఇప్పించడము తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా, ముఖ్యంగా తల్లులు భక్తురాళ్ళు అవ్వటం చాలా ముఖ్యము. అందుకోసమే ఒక కవి ఉర్దూలో ఈ విధంగా కవిత్వాన్ని తెలియజేశాడు,

اسلاہ معاشرہ آپ کو منظور ہے اگر
بچوں سے پہلے ماؤں کو تعلیم دیجئے

[ఇస్లాహె మాషరా ఆప్కో మంజూర్ హై అగర్,
బచ్చోంసె పెహ్లే మావోంకో తాలీమ్ దీజియే]

మీరు సమాజాన్ని సంస్కరించాలనుకుంటున్నారా?,
అలాగైతే, బిడ్డలకంటే ముందు తల్లులకు మీరు విద్య నేర్పించండి.

తల్లులు సంస్కారవంతులు, విద్యావంతులు అయితే అప్పుడు బిడ్డలు కూడా సంస్కారము కలవారు, విద్యావంతులు అవ్వటానికి మార్గము సుగమం అయిపోతుంది అని తెలియజేశారు.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మమ్మల్నందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యము ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మమ్మల్నందరినీ ధర్మ అవగాహన చేసుకొని మంచి కార్యాలలో చేదోడు వాదోడుగా ముందుకు కొనసాగాలని, అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి ప్రసాదించు గాక, దుష్కార్యాల నుండి, పాపాల నుండి అల్లాహ్ మమ్మల్నందరినీ దూరంగా ఉంచు గాక. ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43475