నలుగురు ఇమాముల విశిష్టత ( ఇమామ్ అబూ హనీఫా, మాలిక్, షాఫయీ, అహ్మద్ బిన్ హంబల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

నలుగురు ఇమాముల విశిష్టత (ఇమామ్ అబూ హనీఫా, మాలిక్, షాఫ’ఐ, అహ్మద్ బిన్ హంబల్)
https://youtu.be/TeTJLqXXYHk [38:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నాలుగు గొప్ప ఇమామ్‌లైన ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయీ, మరియు ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ (రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్) యొక్క జీవిత చరిత్రలు, వారి విశిష్టతలు, మరియు ధర్మ సేవకు వారు చేసిన త్యాగాల గురించి వివరించబడింది. ప్రతి ఇమామ్ యొక్క బాల్యం, విద్యాభ్యాసం, వారి గురువులు, వారు రచించిన ముఖ్య గ్రంథాలు, మరియు వారు ఎదుర్కొన్న పరీక్షల గురించి క్లుప్తంగా చర్చించబడింది. ప్రసంగం ముగింపులో, ఈ ఇమామ్‌లను గుడ్డిగా అనుసరించడం (తఖ్లీద్) లేదా వారిని ద్వేషించడం రెండూ సరికాదని, వారిని గౌరవిస్తూనే, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలకే ప్రాధాన్యత ఇవ్వాలనే సరైన మార్గాన్ని సూచించడం జరిగింది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
ప్రవక్తలలోకెల్లా అత్యంత శ్రేష్టులైన వారిపై మరియు దైవప్రవక్తలందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

أَمَّا بَعْدُ
(అమ్మా బాద్)
ఇక విషయానికి వస్తే

رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْ أَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ
(రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ యఫ్ ఖహూ ఖౌలీ)
“ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుక ముడిని విప్పు. జనులు నా మాటను బాగా అర్థం చేసుకునేందుకు.” (20:25-28)

సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ శోభిస్తాయి.

ఆ కరుణామయుని కారుణ్యం ప్రవక్తలందరిపైనను, ముఖ్యంగా చిట్టచివరి ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించుగాక.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి ప్రసంగంలో నలుగురు ఇమాముల విశిష్టత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇస్లామీయ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ధర్మ సేవ చేసిన భక్తులకు పేరు ప్రఖ్యాతి, ప్రతిష్ట, కీర్తిని ప్రసాదించాడు. గౌరవ ఉన్నత శిఖరాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని చేర్చాడు. అలా ధర్మ సేవ చేసి కీర్తిని పొందిన పండితులలో ఈ నలుగురు ఇమాములు కూడా ఉన్నారు. నలుగురు ఇమాములు అంటే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి.

ధార్మిక సేవ చేసి ప్రాచుర్యం పొందిన అనేక మంది పండితులలో ఈ నలుగురు ఇమాములకు ఉన్నతమైన స్థానం అల్లాహ్ తరపున ఇవ్వబడింది. రండి సోదరులారా, ఈ నలుగురు ఇమాముల గురించి క్లుప్తంగా మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు నోమాన్ బిన్ సాబిత్. ఆయనకు అబూ హనీఫా అని నామాంతరము ఉండేది, దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 80వ సంవత్సరంలో కూఫా నగరంలో జన్మించారు.

ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి తండ్రి బట్టల వ్యాపారం చేసేవారు కాబట్టి, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి కూడా బట్టల వ్యాపారము చేశారు. అయితే ఒకరోజు ఒక వీధి నుండి వెళుతూ ఉంటే, ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి గారి కంటబడ్డారు. ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని చూచిన వెంటనే, “నాయనా, నీవు చదువుకుంటున్నావా లేదా?” అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి, “లేదండి నేను చదువుకోవట్లేదు” అన్నారు. అప్పుడు ఇమామ్ షాబీ రహ్మతుల్లాహి అలైహి వెంటనే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి తో ఇలా అన్నారు, “నాయనా, నీ ముఖారవిందాన్ని బట్టి చూస్తుంటే నీవు ధార్మిక విద్య అభ్యసించడం ఎంతో ఉత్తమము అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నాయనా, నీవు ధార్మిక విద్యను అభ్యసించు,” అని సలహా ఇచ్చారు.

ఆయన సలహాను పాటిస్తూ ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ధర్మ విద్య అభ్యసించారు. ఉదాహరణకు, అతా బిన్ అబీ రబాహ్ రహ్మతుల్లాహి అలైహి, అబ్దుల్లా బిన్ దీనార్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ నాఫె రహ్మతుల్లాహి అలైహి లాంటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ధర్మ విద్యను అభ్యసించారు.

ఆ రోజుల్లో ఇమామ్ హమ్మాద్ ఇబ్నె సులైమాన్ రహ్మతుల్లాహి అలైహి అనే ఒక గొప్ప ధార్మిక పండితుడు, ధర్మ విద్యకు సంబంధించిన ఒక విద్య, ఫిఖహ్ విద్య, ఆ ఫిఖహ్ విద్యలో చాలా ప్రాచుర్యం పొంది ఉన్నారు. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆయన వద్ద కూడా శిష్యరికము చేసి ఫిఖహ్ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఎంతగా ఎదిగారంటే, ఇమామ్ హమ్మాద్ బిన్ సులైమాన్ రహ్మతుల్లాహి అలైహి గారు మరణించిన తర్వాత ఆయన స్థానంలో ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని కూర్చోబెట్టడం జరిగింది.

అభిమాన సోదరులారా, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేక ప్రత్యేకతలను ప్రసాదించాడు. ఆయనకు ప్రసాదించబడిన ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎదుటి వ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగితే దానికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరచటం ఆయనకే సొంతం.

ఉదాహరణకు, ఒకసారి ఆ రోజుల్లో ఒక నాస్తికుడు ఈ సృష్టి మొత్తము తనంతట తానే సృష్టించబడింది, దీనిని సృష్టించినవాడు ఒకడు ఎవడూ లేడు అని వాదించేవాడు. అతను ఒకరోజు కూఫా నగరానికి చేరుకొని అక్కడ కూడా తన వాదన ప్రజలకు వినిపిస్తూ ఉంటే, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి అక్కడికి చేరుకున్నారు.

ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ నాస్తికుని వాదన విన్న తర్వాత, వెంటనే అతనితో ఇలా అన్నారు: “అవునయ్యా, నువ్వు చెబుతున్న విషయం నిజమే. నేను ఇప్పుడే ఒక చోటు నుంచి వస్తున్నాను, మార్గమధ్యలో నేను ఒక విషయాన్ని చూశాను, అదేమిటంటే, ఒక పెద్ద మాను (చెట్టు) ఉందండి, ఆ మాను తనంతట తానే తెగిపోయింది, ఆ తర్వాత చెక్కలు తయారయ్యాయి, ఆ చెక్కలన్నీ కలిసి ఒక పడవ రూపాన్ని దాల్చినాయి, ఆ పడవ నీటి మీద వచ్చి నిలబడింది, అందులో నేను ఎక్కుకున్నాను, ఆ పడవ తనంతట తానే నది అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకు ప్రయాణం చేసి వచ్చింది, నేను ఆ పడవలో నుంచి దిగి ఇప్పుడే అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తున్నాను,” అని చెప్పారు.

ఈ మాటలన్నీ విన్న ఆ నాస్తికుడు, “ఏమండీ! మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేనేమైనా మూర్ఖుడ్నా, బుద్ధిహీనుడ్నా? చెట్టు తనంతట తానే తెగిపోవడం ఏమిటి, చెక్కలు తయారైపోవడం ఏమిటి, ఎవరూ తయారు చేయకుండానే పడవ తయారైపోవటం ఏమిటి, ఎవరూ నడిపించకుండానే పడవ నది అవతల ఒడ్డు నుంచి ఇవతల వైపుకు వచ్చేయటం ఏమిటి? ఇదంతా నమ్మేదానికి నేనేమైనా మూర్ఖుడ్నా?” అని ప్రశ్నించినప్పుడు, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ వ్యక్తితో ఇలా అన్నారు: “అయ్యా, ఒక చిన్న పడవ తనంతట తానే సృష్టించబడదు, ఒక చిన్న పడవ తనంతట తానే నడవదు అని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. మరి ఇంత పెద్ద సృష్టి తనంతట తానే ఎలా సృష్టించబడుతుంది? తనంతట తానే ఎలా నడుస్తుంది ఎవరూ నడిపించకుండానే? ఒకసారి ఆలోచించరా?” అని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి వెంటనే ఆ విషయాన్ని అర్థం చేసుకుని, ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఈ సృష్టిని నడిపించే ఒక యజమాని ఉన్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు సోదరులారా. ఇది ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి చాతుర్యానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ.

ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారి వద్ద చాలా మంది శిష్యులు శిష్యరికం చేశారు. వారిలో ఇమామ్ అబూ యూసుఫ్ యాఖూబ్ బిన్ ఇబ్రాహీం రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ జఫర్ బిన్ హుజైల్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ హసన్ బిన్ జియాద్ రహ్మతుల్లాహి అలైహి, ఈ నలుగురు శిష్యులు చాలా ప్రాచుర్యం పొందారు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికం చేసిన శిష్యుల్లో.

ఆ తర్వాత అలనాటి నాయకుడు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారికి ఖాజీయుల్ ఖుదాత్ అనే పదవిని తీసుకోమని అభ్యర్థించాడు. ఖాజీయుల్ ఖుదాత్ అంటే మన భాషలో న్యాయమూర్తి పదవి అని చెప్పుకోవచ్చు. న్యాయమూర్తి పదవి తీసుకోమని ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని అడిగినప్పుడు, ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి ఆ పదవి స్వీకరించడానికి నిరాకరించారు. ఆ రాజు ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి మీద కోపపడి ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించేశాడు. చెరసాలలోనే ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 150వ సంవత్సరంలో మరణం పొందారు సోదరులారా. ఇది ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవన చరిత్ర.

ఇక రండి, మనం రెండవ ఇమామ్, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు మాలిక్ బిన్ అనస్. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అని నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 93వ సంవత్సరంలో మదీనా పట్టణంలో జన్మించారు.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితులైన ఇమామ్ అబ్దుర్రహ్మాన్ బిన్ హుర్ముజ్, ఇమామ్ నాఫె, ఇమామ్ ఇబ్నె షిహాబ్ జుహ్రీ, ఇమామ్ రబీఆ రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ లాంటి గొప్ప గొప్ప ధార్మిక పండితుల వద్ద ధర్మ విద్యను అభ్యసించారు.

హదీసు గ్రంథాలలో మొట్టమొదటి హదీసు గ్రంథం, మువత్తా ఇమామ్ మాలిక్ అనే గ్రంథాన్ని రచించారు సోదరులారా. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మించిన మస్జిదె నబవీలో కూర్చొని ప్రజలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు, ఉల్లేఖనాలు వినిపించేవారు.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి కాలంలో ఆనాటి రాజు బలవంతంగా ఒక జంటకు విడాకులు ఇప్పించాడు. తలాఖ్ ఇప్పించాడు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్దకు ఆ విషయం చేరినప్పుడు, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి బలవంతంగా ఇప్పించిన విడాకులు ఇస్లాం ధర్మం ప్రకారంగా అధర్మం, నిషేధం, అవి చెల్లవు అని ఫత్వా ఇచ్చారు సోదరులారా.

అలనాటి రాజు, ఖలీఫా మన్సూర్, వెంటనే ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద బలవంతం చేశాడు: “అయ్యా, నా ఇష్ట ప్రకారంగానే ఈ తలాఖ్ చెల్లుతుంది, ఈ విడాకులు చెల్లుబాటులో ఉంటాయి అని మీరు నా ఇష్ట ప్రకారంగా ఫత్వా ఇవ్వండి” అని బలవంతం చేశాడు. కానీ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అలనాటి రాజు ఖలీఫా మన్సూర్ గారి మాటను వినలేదు. అతను ఎంత బలవంతము చేసినా తల వంచలేదు. బలవంతంగా ఇప్పించబడిన తలాఖ్ ఇస్లాం ధర్మం ప్రకారంగా నిషేధం, చెల్లవు అంటే చెల్లవు అని చెప్పి ఫత్వా ఇచ్చారు.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి ఈ ప్రవర్తన చూసి ఖలీఫా మన్సూర్ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద కోపపడి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించాడు, కొరడాలతో కొట్టించాడు సోదరులారా. అంతేకాదు, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించారు.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రజలతో ఒకే మాట చెప్పేవారు: “ప్రజల్లారా, ఎవరైతే నన్ను గుర్తు పట్టున్నారో వారు గుర్తు పట్టున్నారు, మరెవరైతే నన్ను గుర్తు పట్టట్లేదో వినండి, నేను మాలిక్ బిన్ అనస్, నేను చెప్పే మాట ఒక్కటే, బలవంతంగా ఇప్పించబడిన తలాఖ్, బలవంతంగా ఇప్పించబడిన విడాకులు ఇస్లాం ధర్మం ప్రకారంగా అధర్మము, చెల్లవంటే చెల్లవు” అని చెప్పేవారు సోదరులారా. ఇది ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి విశ్వాస నిలకడకు నిదర్శనము సోదరులారా.

ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారికి మదీనా పట్టణం అంటే చాలా అభిమానం. మదీనాలో నివసించే ధార్మిక పండితులు అంటే కూడా చాలా అభిమానం. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు మస్జిదె నబవీలో కూర్చొని ప్రజలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినిపించేవారు. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద కూడా చాలా మంది శిష్యులు శిష్యరికం చేశారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన శిష్యులలో ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ అష్-షైబానీ రహ్మతుల్లాహి అలైహి వీరిరువురు చాలా పేరును పొందారు సోదరులారా.

అలాగే, అలనాటి మరొక రాజు, హారూనుర్ రషీద్, అతను కూడా ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద విద్య అభ్యసించాలనే కోరికతో ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని: “అయ్యా, మీరు రాజభవనానికి వచ్చి నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినిపించండి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను” అని విన్నవించుకున్నాడు. కానీ ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నారో తెలుసా? “మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు వినాలని, నేర్చుకోవాలని కోరిక ఉంటే మీరు మస్జిదె నబవీకి వచ్చి అక్కడ నలుగురితో పాటు కూర్చొని మీరు కూడా వినవచ్చు. నేను వచ్చి మీ రాజభవనంలో మీకు బోధించాలంటే నా వల్ల కాదు” అని చెప్పారు.

అలనాటి రాజు, హారూనుర్ రషీద్, మస్జిదె నబవీకి వెళ్ళి ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి బోధించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు నలుగురితో పాటు సామాన్యమైన ప్రజలతో పాటు కూర్చొని విని ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికం చేశాడు సోదరులారా.

ఆ తర్వాత ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మదీనాలో మరణం పొందాలని చాలా కోరుకునేవారు, అల్లాహ్‌కు ప్రార్థించేవారు. అందుకోసమే ఎవరైనా మదీనా అవతల వైపు నుంచి మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారిని ఆహ్వానిస్తే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మదీనా బయటకు ఎప్పుడూ వెళ్ళేవారు కాదు. ఆయన జీవితంలో చాలా తక్కువ సార్లు ఆయన మదీనా నగరాన్ని వదిలి బయటకు వెళ్ళారు. ఎక్కువ సమయం, ఆయన జీవితంలోని ఎక్కువ సమయం మదీనాలోనే ఆయన గడిపారు సోదరులారా.

ఆ తర్వాత, ఆయన ప్రార్థించినట్లుగానే, ఆయన కోరుకున్నట్లుగానే, హిజ్రీ శకం 179వ సంవత్సరంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారికి మదీనాలోనే మరణాన్ని ప్రసాదించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మదీనాలో మరణం ప్రసాదించిన తర్వాత మదీనాలోనే ఆయన ఖనన సంస్కారాలు కూడా జరపబడ్డాయి. ఇది ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర సోదరులారా.

ఇక రండి, మూడవ ఇమామ్, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా మనం తెలుసుకుందాం సోదరులారా.

ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క అసలు పేరు ముహమ్మద్ బిన్ ఇద్రీస్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అనే నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో కున్నియత్ అంటారు.

ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 150వ సంవత్సరంలో గాజా పట్టణంలో జన్మించారు. రెండు సంవత్సరాల వయస్సుకు చేరగానే ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి తండ్రి మరణించారు. తండ్రి మరణించిన తర్వాత ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి తల్లి ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారిని తీసుకొని మక్కా నగరానికి వచ్చేసారు.

మక్కా నగరంలో ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఏడు లేదా తొమ్మిది సంవత్సరాల వయసులోనే పూర్తి ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేశారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత మదీనాలో ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు బోధిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని మదీనాకు వెళ్లి, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికము చేసి మువత్తా ఇమామ్ మాలిక్ పూర్తి గ్రంథాన్ని వినటమే కాకుండా కంఠస్థము కూడా చేశారు. అల్లాహు అక్బర్! ఇది ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క జ్ఞాపక శక్తికి నిదర్శనము సోదరులారా.

ఆ తర్వాత ఇరాక్ పట్టణంలో ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క ప్రముఖ శిష్యులు ఇమామ్ ముహమ్మద్ రహ్మతుల్లాహి అలైహి గారు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఇరాక్ పట్టణానికి వెళ్లి, ఇమామ్ ముహమ్మద్ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద శిష్యరికము చేసి ఫిఖహ్ ధర్మ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత మక్కాకు తిరిగి వచ్చి మక్కాలో ప్రజలకు ధార్మిక విద్యను బోధించడం ప్రారంభించారు. ఆ తర్వాత 195 హిజ్రీ శకం అలాగే 198 హిజ్రీ శకంలో రెండు సార్లు ఇరాక్ పట్టణానికి వెళ్లి అక్కడ విద్యను బోధించి ఆ తర్వాత తిన్నగా ఈజిప్టు దేశానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత మిగతా జీవితం మొత్తం ఆయన ఈజిప్టు దేశంలోనే గడిపారు.

ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఈ ప్రపంచానికి అందజేసిన గొప్ప కానుకలలో ఒక గొప్ప కానుక ఏమిటంటే ఆయన రచించిన ఒక గ్రంథం ‘అర్-రిసాలా ఫీ అదిల్లతిల్ అహ్కామ్’. ఈ గ్రంథంలో వివిధ విద్యలకు సంబంధించిన నియమాలన్నింటినీ ఆయన పొందుపరిచారు సోదరులారా. నేటికీ కూడా ధార్మిక పండితులు ఈ గ్రంథం యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూనే ఉంటారు. అలాగే ‘కితాబుల్ ఉమ్‘, ‘మస్నదె షాఫయీ‘ లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు ప్రపంచానికి ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి ద్వారా కానుకగా అందజేయబడ్డాయి.

ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 204వ సంవత్సరంలో ఈజిప్టు దేశంలోనే మరణించారు. ఈజిప్టు దేశంలోనే ఆయన ఖనన సంస్కారాలు కూడా చేయబడ్డాయి. ఇది ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర.

ఇక రండి సోదరులారా, నాలుగవ ఇమామ్, నాలుగవ ధార్మిక పండితులైన ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి కూడా మనము క్లుప్తంగా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి అసలు పేరు అహ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ హంబల్. ఆయనకు అబూ అబ్దుల్లాహ్ అని నామాంతరము ఉండేది. దీనిని అరబీ భాషలో మనం కున్నియత్ అంటాము.

ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి వారి తాత పేరుతో ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. వాస్తవానికి అహ్మద్ గారి యొక్క తండ్రి పేరు ముహమ్మద్, కానీ ప్రపంచం ఆయనను అహ్మద్ ఇబ్నె హంబల్, హంబల్ కుమారుడు అని గుర్తిస్తుంది సోదరులారా. అంటే తాతగారి పేరుతోనే అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రాచుర్యం పొందారు.

అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి హిజ్రీ శకం 164వ సంవత్సరంలో బగ్దాద్ పట్టణంలో జన్మించారు. పసితనంలోనే నాన్నగారు మరణించారు. 14 సంవత్సరాల వయసుకు చేరాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు, హదీసులు తెలుసుకోవాలని, నేర్చుకోవాలని మనసులో కోరిక కలిగింది.

అలనాటి గొప్ప గొప్ప ధార్మిక పండితులు, ఇమామ్ అబూ యూసుఫ్ రహ్మతుల్లాహి అలైహి, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి వద్ద ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి విద్యను అభ్యసించారు. సోదరులారా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారికి హదీసుల మీద ఎంత అభిమానం ఉండేదంటే, ఫలానా దేశంలో కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు కంఠస్థం చేసి ఉన్నారన్న వార్త తెలుసుకున్న తర్వాత కాలి నడకన వెళ్ళి వారి వద్దకు చేరుకొని వారి నోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు విని వాటన్నింటినీ ఒక గ్రంథంలో పొందుపరిచారు. ఆయన జీవిత చరిత్ర చూచినట్లయితే, ఆయన బగ్దాద్ నుండి మక్కాకు, మక్కా నుండి యమన్ కు, యమన్ నుండి సిరియాకు కాలి నడకన ప్రయాణాలు చేశారు సోదరులారా. అల్లాహు అక్బర్!

ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, హదీసు గ్రంథాలలో అన్నింటికంటే పెద్ద గ్రంథం ‘మస్నద్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి’. ‘మస్నదె అహ్మద్’, హదీసు గ్రంథాలలోనే పెద్ద గ్రంథం, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రపంచానికి కానుకగా ఇచ్చారు సోదరులారా. ఆయన ప్రపంచానికి అందజేసిన ‘మస్నదె అహ్మద్’ గ్రంథంలో 40,000 కంటే ఎక్కువ హదీసులు పొందుపరచబడి ఉన్నాయి. అల్లాహు అక్బర్!

ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క విశ్వాస ధృడత్వాన్ని మనం చూచినట్లయితే, ఆ రోజుల్లో మాయమాటలకు గురైన ఒక తెగ, మోతజిలే వారు, ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్’ అని ఒక ఉపద్రవాన్ని లేవనెత్తారు. ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్’ అని ఒక ఉపద్రవాన్ని లేవనెత్తినప్పుడు, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి వారి ఈ వాదనను ఖండించారు. ఖుర్ఆన్ ఎన్నిటికీ మఖ్లూఖ్ కాజాలదు. ఖుర్ఆన్ మఖ్లూఖ్ కానే కాదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క వాక్యం, అల్లాహ్ యొక్క మాట, ఖుర్ఆన్ ఎప్పటికీ మఖ్లూఖ్ కాజాలదు అని ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి ప్రకటించారు సోదరులారా.

తత్కారణంగా, అలనాటి నాయకులు ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి మీద దౌర్జన్యం చేశారు, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని చెరసాలలో బంధించారు, కొరడాలతో కొట్టించారు సోదరులారా. ఎంతగా కొరడాలతో కొట్టించారంటే, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి వీపు మొత్తం పుండు అయిపోయింది సోదరులారా, గాయాలతో వీపు మొత్తం పుండు అయిపోయింది.

అయినా కొరడా దెబ్బలు తింటూ కూడా, బాధను భరిస్తూ కూడా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి ఒకే మాట ప్రకటించేవారు. ఆయన ఏమనేవారంటే: ‘అతూనీ బిషైఇమ్ మిన్ కితాబిల్లహి అవ్ సున్నతి రసూలిహి హత్తా అఖూల బిహి’. ‘ఖుర్ఆన్ మఖ్లూఖ్ అని మీరు వాదిస్తున్నారు కదా, దానికి ఆధారంగా మీరు ఖుర్ఆన్ గ్రంథంలో నుంచి ఒక్క వాక్యము గానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక ఉల్లేఖనం గానీ నాకు చూపించండి, నేను ఒప్పుకుంటాను. లేదంటే నా ప్రకటన ఒక్కటే, ఖుర్ఆన్ అల్లాహ్ వాక్యం, అది మఖ్లూఖ్ కాజాలదు‘ అని చెప్పేవారు సోదరులారా.

ఆయన ఆ విధంగా అలాంటి నిలకడను, అలాంటి స్థిరత్వాన్ని ప్రదర్శించారు కాబట్టే తర్వాత వచ్చిన వారు ఆ విషయాన్ని గ్రహించారు. ఖుర్ఆన్ మఖ్లూఖ్ అని చెప్పటము, వాదించటము తప్పు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. ఇదంతా ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ప్రదర్శించిన నిలకడ కారణముగానే జరిగిందని మనం చెప్పుకోవచ్చు సోదరులారా.

అయితే, చాలా ఎక్కువగా హింసలు ఎదుర్కొన్న కారణంగా, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత, హిజ్రీ శకం 241వ సంవత్సరంలో ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి జుమా రోజున మరణించారు. ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గురించి ధార్మిక పండితులు అప్పుడూ ఇప్పుడూ ఒకే మాట చెప్తారు, అదేమిటంటే, ఎవరైతే ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని అభిమానిస్తున్నారో, నిజానికి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉల్లేఖనాలను అభిమానిస్తున్నారు. ఎవరైతే ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారిని ద్వేషించుకుంటున్నారో, నిజానికి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉల్లేఖనాలను ద్వేషిస్తున్నారు. ఇది ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారికి అల్లాహ్ ఇచ్చిన కీర్తి సోదరులారా.

అభిమాన సోదరులారా! ఇప్పటివరకు మనం నలుగురు ఇమాములు – ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయీ, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ గురించి క్లుప్తంగా జీవిత చరిత్రను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ఇమాములు గతించిన తర్వాత ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాల గురించి క్లుప్తంగా తెలుసుకొని, ఆ విషయాన్ని తెలిపి నేను నా మాటను ముగిస్తాను సోదరులారా.

అభిమాన సోదరులారా, నలుగురు ఇమాములు మరణించిన తర్వాత, వారి మరణానంతరం తర్వాత వచ్చిన తరం వారు రెండు భిన్నమైన అభిప్రాయాలకు గురయ్యారు. కొందరు నలుగురు ఇమాములను ఎంతగా అభిమానించారంటే, వారి అభిమానంలో హద్దు మీరిపోయారు. వారిని ప్రవక్తకు ఇవ్వాల్సిన స్థానము ఇమాములకు ఇచ్చేశారు. అభిమాన సోదరులారా, కళ్ళు మూసుకొని వీరిని అనుసరించడం ప్రారంభించేశారు సోదరులారా. దీనిని అరబీ భాషలో తఖ్లీద్ అంటారు. ఇలా చేయడము సరి కాదు అభిమాన సోదరులారా. ఎందుకంటే ఈ నలుగురు ఇమాములలో ఏ ఒక్క ఇమాము కూడా ప్రజలను కళ్ళు మూసుకొని వారిని అనుసరించండి అని బోధించలేదు.

రండి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇమామ్ అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు ఏమనేవారంటే: ‘ఇదా సహ్హల్ హదీసు ఫహువ మజ్హబీ’. “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనం వచ్చేస్తే అదే నా మార్గము” అని చెప్పారు సోదరులారా. అలాగే మరొక సందర్భంలో ఆయన ఏమన్నారంటే: ‘ఇదా వజద్తుమ్ కలామీ యుఖాలిఫు కలామ రసూలిల్లాహి ఫద్ రిబూ బి కలామిల్ హాయిత్’. “ఎప్పుడైనా నా మాట, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు విరుద్ధంగా వచ్చేస్తే, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటనే తీసుకోండి, నా మాటను గోడకేసి విసిరికొట్టండి” అని చెప్పారు సోదరులారా.

అలాగే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నారంటే: ‘కుల్లున్ యుఖజు మిన్ కౌలిహి వ యురద్దు ఇల్లా సాహిబు హాజల్ ఖబ్ర్’. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి మస్జిదె నబవీలో కూర్చొని శిష్యులకు, ప్రజలకు బోధించేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి వైపు సైగ చేస్తూ ఇలా చెప్పేవారు: “ప్రతి మనిషి యొక్క మాట తీసుకొనవచ్చు, ప్రతి మనిషి యొక్క మాటను తిరస్కరించే అధికారము అందరికీ కలదు. కానీ, ఈ సమాధిలో నిద్రిస్తున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలను కేవలం తీసుకోవాలే తప్ప తిరస్కరించేదానికి అధికారము లేదు” అని చెప్పేవారు.

అలాగే ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూచినట్లయితే, ఇమామ్ షాఫయీ రహ్మతుల్లాహి అలైహి ఏమనేవారంటే, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేసిన తర్వాత, ప్రపంచంలోని ఏ వ్యక్తి మాటను కూడా తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటను వదిలేయటము నిషేధం” అని చెప్పేవారు. అంతేకాకుండా ‘ఇదా సహ్హల్ హదీసు ఫహువ మజ్హబీ’, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనం వచ్చేస్తే అదే నా మార్గం” అని ఆయన కూడా ప్రకటించేవారు.

ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి మనం చూసినట్లయితే, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు వారి శిష్యులలోని ఒక శిష్యునికి బోధిస్తూ ఇలా అన్నారు. ఏమన్నారంటే: ‘లా తుఖల్లిద్ నీ వలా తుఖల్లిద్ మాలికన్ వలల్ ఔజాయియ్య వఖుజ్ మిన్ హైసు అఖజూ’. “ఓ నా శిష్యుడా, నువ్వు కళ్ళు మూసుకొని నన్ను అనుసరించకు. అలాగే ఇమామ్ మాలిక్ ని, ఇమామ్ ఔజాయీని ఎవరిని కూడా నువ్వు కళ్ళు మూసుకొని అనుసరించకు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి అయితే ధర్మ విద్యను అభ్యసించారో, నువ్వు కూడా అక్కడి నుంచే ధర్మ విద్యను అభ్యసించు” అని చెప్పేవారు. అల్లాహు అక్బర్!

ఇవన్నీ చూచిన తర్వాత మనకు ఏం అర్థమవుతుంది సోదరులారా? ఇమాములను కళ్ళు మూసుకొని అనుసరించడం ఇది సరి కాదు.

ఇక రెండవ రకమైన ప్రజలు ఎవరంటే ఈ నలుగురు ఇమాముల యొక్క జీవిత చరిత్రను తెలుసుకోకుండా, ఈ నలుగురు ఇమాముల యొక్క త్యాగాలను, వారు చేసిన ధార్మిక సేవను గుర్తించకుండా ఈ నలుగురు ఇమాములను ద్వేషిస్తారు, ఈ నలుగురు ఇమాములను దూషిస్తారు. దీనిని కూడా మనం ఖండిస్తాం. ఎందుకంటే వీళ్ళు ధర్మ సేవకు త్యాగాలు చేసిన వారు, ఎన్నో త్యాగాలు చేసి ప్రపంచానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు అందించిన వారు. వీరి త్యాగాలను మనము కనుమరుగు చేయలేము. వీరిని ద్వేషించుకోవటం, వీరిని దూషించడం తప్పు సోదరులారా.

న్యాయంగా మాట్లాడాలంటే నలుగురు ఇమాములు ప్రజలకు బోధించిన బోధనలలో కొన్ని బోధనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలకు విరుద్ధంగా వెళ్ళాయి. కానీ, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఈ తప్పు చేయలేదు సోదరులారా. వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉల్లేఖనాలు అందలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులు వారికి చేరలేదు. కాబట్టి వారు అలాంటి ఫత్వాలు ఇచ్చారు. అయితే, మరణించే ముందు వారు చెప్పారు కదా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట వచ్చేస్తే అదే మా మార్గము అని. కాబట్టి వారిని ద్వేషించుకోవటం, వారిని దూషించడం సరి కాదు.

ఈ రెండింటికి మధ్య ఒక మార్గం ఉంది. అదే సజ్జన పూర్వికుల మార్గం, అదే సలఫీల మార్గం, అదే అహ్లె హదీసుల మార్గం. అదేమిటంటే నలుగురు ఇమాములను గౌరవించడం తప్పనిసరి. నలుగురు ఇమాములతో పాటు ఇంకా ఎంత మంది ఇమాములు ఉన్నారో, ఎంత మంది ధర్మ సేవ చేసిన పండితులు ఉన్నారో, వారందరినీ గౌరవించడం తప్పనిసరి. వారెవరినీ కించపరచకూడదు. వారి త్యాగాలను మనము కొనియాడాలి. అయితే, వారి ఏ మాటలైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు విరుద్ధంగా వెళ్ళాయో, ఆ మాటలను మాత్రం తీసుకోకుండా అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలనే తీసుకోవటం సరైన మార్గం అని బోధిస్తారు. ఇదే సలఫీల యొక్క బోధన, ఇదే అహ్లె హదీసుల యొక్క బోధన, ఇదే సరైన మార్గం.

అభిమాన సోదరులారా, చివరలో ఒక మాట చెప్పదలచుకుంటున్నాను, అదేమిటంటే, కళ్ళు మూసుకొని అనుసరించడానికి అర్హత కలిగిన ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు చెప్పి మనల్ని అనుసరించాలని ఆదేశించాడు కాబట్టి, కళ్ళు మూసుకొని మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించవచ్చు.

అల్లాహ్ మనందరికీ ఈ విషయాలు అర్థం చేసుకొని సరైన మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

أَقُوْلُ قَوْلِيْ هٰذَا وَأَسْتَغْفِرُ اللهَ لِيْ وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِيْنَ فَاسْتَغْفِرُوْهُ إِنَّهُ هُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ. وَصَلَّى اللهُ تَعَالَى عَلَى خَيْرِ خَلْقِهِ مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ وَأَهْلِ بَيْتِهِ أَجْمَعِيْنَ بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِيْنَ وَالْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16733

ఇతర లింకులు: