
బిలాల్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో & టెక్స్ట్]
https://youtu.be/-deXYNu670Q [23 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగం ఇస్లాం యొక్క మొట్టమొదటి ముఅజ్జిన్ అయిన హజ్రత్ బిలాల్ ఇబ్న్ రబాహ్ రదియల్లాహు అన్హు యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని వివరిస్తుంది. అబిసీనియా (ఇథియోపియా) నుండి వచ్చిన ఒక బానిసగా, బిలాల్ గారు ఇస్లాంను స్వీకరించినందుకు తన యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్ చేత ఎదుర్కొన్న భయంకరమైన హింసను మరియు అతని అచంచలమైన విశ్వాసాన్ని ఇది వివరిస్తుంది. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారి ద్వారా విముక్తి పొందిన బిలాల్ గారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అత్యంత ప్రియమైన సహచరుడిగా మారి, మక్కా విజయం రోజున కాబా పై నిలబడి అజాన్ ఇచ్చే గౌరవాన్ని పొందారు. ప్రవక్త గారి పట్ల బిలాల్ గారికి ఉన్న అపారమైన ప్రేమను, ఆయన మరణానంతరం బిలాల్ పడిన వేదనను మరియు స్వర్గంలో ఆయనకు దక్కిన ఉన్నత స్థానాన్ని ఈ ప్రసంగం కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన వాస్తవానికి అబిసీనియా అనగా ఇథియోపియా దేశస్థుడు. బానిసగా అరబ్బు దేశంలో జీవితం గడిపేవాడు. రంగు పరంగా చూస్తే నల్ల జాతి వాడు. కానీ ఆయన ఘనత ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అడుగుల చప్పుడు స్వర్గంలో చూశారు. ఆయనను ప్రపంచం ముఅజ్జినే రసూల్, ప్రియ ప్రవక్త వారి ముఅజ్జిన్ అనే బిరుదుతో గుర్తిస్తుంది. ఇస్లాం గురించి ఏ కొద్ది జ్ఞానం ఉన్న వారికైనా సరే మీరు ముఅజ్జినే రసూల్ అంటే ఎవరండి అని ప్రశ్నించండి, టక్కున ఆయన నోటి నుండి ఒకటే సమాధానం వస్తుంది – ఆయన మరెవరో కాదు మన ప్రియ ప్రవక్త వారి ప్రియ సహచరుడు బిలాల్ రదియల్లాహు అన్హు.
అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో బిలాల్ రదియల్లాహు అన్హు వారి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు బిలాల్. తల్లి పేరు హమామా. తండ్రి పేరు రబాహ్. ఆయనను ముఅజ్జినే రసూల్ అనే బిరుదుతో ప్రపంచం గుర్తిస్తుంది. ఆయన మక్కాలో జన్మించారు. బానిస కుటుంబంలో జన్మించారు, బానిసగానే పెరిగారు. ఆయనగారి యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్.
బిలాల్ రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకారం మరియు హింస
ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు పెరిగి పెద్దవారయ్యారో, ఆ రోజుల్లో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రహస్యంగా కొద్దిమంది ప్రజలతో కలిసి ఇస్లాం సందేశాన్ని వినిపించారు. ప్రారంభంలో ఇస్లాం స్వీకరించిన వారిలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. ప్రారంభంలో చాలా తక్కువ మంది, పది ఇరవై మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు, వారిలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా ఒకరున్నారు.
అభిమాన సోదరులారా, ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఇస్లాం స్వీకరించారో, ఆయన యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్ కు వెంటనే ఆ విషయం తెలిసిపోయింది. యజమానికి ఆ విషయం తెలియగానే పట్టరాని కోపంతో యజమాని బిలాల్ రదియల్లాహు అన్హు వారిని కాళ్లు చేతులు బంధించేసి కొరడాలతో కొట్టాడు.
అభిమాన సోదరులారా, యజమాని అయిన కారణంగా అతని బానిస తాత ముత్తాతల ధర్మాన్ని వదిలేసి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాడనే కోపంతో హింస ప్రారంభించాడు. ముందుగా తను స్వయంగా కొట్టాడు, ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు వారి మెడలో తాడు కట్టేసి కుర్రాళ్ల చేతులకి ఇచ్చేసాడు. ఆ యువకులు, కుర్రాళ్లు బిలాల్ రదియల్లాహు అన్హు వారి మెడలో ఉన్న ఆ తాడుని పట్టుకొని ఈడ్చుకుంటూ కొండల్లో, రాళ్ల ప్రదేశంలో తిరిగేవారు. అభిమాన సోదరులారా, ఎలాగైతే ఒక జంతువుని ఈడ్చేవారో ఆ విధంగా బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఆ కుర్రాళ్లు ఈడ్చేవారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారి శరీరానికి గాయాలైపోయేవి. ఆయన మెడ మీద తాడు కట్టేసిన కారణంగా గుర్తులు పడిపోయేవి.
అంతటితో యజమాని కోపం చల్లారలేదు. అతను ఏం చేసేవాడంటే తన కసి తీర్చుకోవడానికి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఎండా కాలంలో మిట్ట మధ్యాహ్న సమయంలో బాగా ఎండ, వేడి తీవ్రంగా ఉన్నప్పుడు – మనకందరికీ తెలిసిన విషయమే మనం అరబ్బు దేశంలో ఇక్కడ ఎండను, ఎండ తీవ్రతను చూసినవాళ్ళమే. అలాంటి సమయంలో ఇక్కడి నేల ఎంతగా వేడెక్కిపోతుందో మన అందరికీ తెలుసు అభిమాన సోదరులారా. అలాంటి నేల మీద బిలాల్ రదియల్లాహు అన్హు వారిని వారి యజమాని ఉమయ్య బట్టలు తీసి పడుకోబెట్టేవాడు. ఆ తర్వాత ఎద మీద పెద్ద పెద్ద రాళ్లు ఉంచేసేవాడు. కింద నుంచి కూడా వేడి తగిలేది, పైన ఉంచిన రాయి వేడి కూడా ఆయనకు తగిలేది. అలాంటి పరిస్థితుల్లో బిలాల్ రదియల్లాహు అన్హు వారి చెవి దగ్గరికి వచ్చి యజమాని ఒకే మాట అనేవాడు – “ఓ బిలాల్! నీవు ముహమ్మద్ ప్రవక్త ధర్మాన్ని వదిలివేయి, నేను నిన్ను హింసించడం వదిలేస్తాను.” బిలాల్ రదియల్లాహు అన్హు అంత బాధను భరిస్తూ కూడా అల్లాహ్ యే ప్రభువు అద్వితీయుడు అహద్! అహద్! అని పలికేవారు.
అభిమాన సోదరులారా, యజమాని హింసిస్తూ హింసిస్తూ అలసిపోయాడు. కానీ బిలాల్ రదియల్లాహు అన్హు వారి నోటి నుండి ఒక్క పదము కూడా, ఒక్క మాట కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఆయన వినలేకపోయాడు. అభిమాన సోదరులారా, చరిత్రకారులు చెప్పిన విషయం ఏమిటంటే బిలాల్ రదియల్లాహు అన్హుతో పాటు ఇతర నవ ముస్లిములను కూడా మక్కా పెద్దలు పట్టుకొని హింసించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడండి అని బలవంతం చేశారు. చాలామంది మాట్లాడేశారు కానీ బిలాల్ రదియల్లాహు అన్హు ఎట్టి పరిస్థితుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
బిలాల్ రదియల్లాహు అన్హు విముక్తి
ఒకసారి అబూబకర్ రదియల్లాహు అన్హు మార్గం నుండి వెళ్తూ వెళ్తూ బిలాల్ రదియల్లాహు అన్హు వారికి ఇవ్వబడుతున్న శిక్షలు, బాధలు, హింసలు చూశారు. ఆ తర్వాత వెంటనే ఉమయ్య బిన్ ఖల్ఫ్ తో వచ్చి “ఓ ఉమయ్య! బిలాల్ కి నేను కొనాలనుకుంటున్నాను, నీవు వెంటనే అమ్మేయ్ నేను కొనేస్తాను” అన్నారు. అప్పుడు అతను ఉమయ్య ఏమన్నాడంటే “ఓ అబూబకర్! నేను బిలాల్ కి ఒక ఊకియా, అంటే ఇంచుమించు 70 దిర్హములు, ఆ రేటులో అమ్మాలనుకుంటున్నాను కొనగలవా?” అన్నాడు. అబూబకర్ రదియల్లాహు అన్హు వెంటనే ఆ ఒక ఊకియా (70 దిర్హములు) అతనికి ఇచ్చేసి బిలాల్ ను కొనేశారు. వ్యాపారం జరిగిపోయిన తర్వాత ఉమయ్య హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ అబూబకర్ రదియల్లాహు అన్హు తో అన్నాడు “ఓ అబూబకర్! నీవు బిలాల్ కి బదులుగా ఒక్క దిర్హమ్ మాత్రమే ఇస్తాను అని నీవు అడిగి ఉన్నా నేను ఇచ్చేసేవాడిని. నీవు ఇంత పెద్ద సొమ్ము ఇచ్చేసావే, చెల్లించేసావే” అని ఎగతాళి చేశాడు. కానీ అబూబకర్ రదియల్లాహు అన్హు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? అబూబకర్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ ఉమయ్య! నేను ఎక్కువ ఇచ్చేసానని నీవు ఎగతాళి చేస్తున్నావు. వాస్తవం ఏమిటో తెలుసా? నీవు ఒక ఊకియా మాత్రమే అడిగావు. ఒకవేళ నీవు వంద ఊకియాలు అడిగి ఉన్నా గాని నేను చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు బిలాల్ రదియల్లాహు అన్హు గారిని కొన్న తర్వాత ఆయనకు స్వతంత్రుని చేసేసారు. ఆ తర్వాత నుండి బిలాల్ రదియల్లాహు అన్హు వారు స్వతంత్రులయ్యారు.
మదీనాకు వలస మరియు మొదటి అజాన్
ఆ తర్వాత రోజులు గడిచాయి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, నవ ముస్లింలకు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిపోవాలని ఆదేశించినప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. మదీనాకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మసీదును నిర్మించారు. ఆ మసీదు పేరు మస్జిదే నబవీ. మసీదు నిర్మించబడిన తర్వాత అల్లాహ్ తరఫు నుండి ప్రజలకు నమాజ్ కొరకు పిలవడానికి అజాన్ ఇవ్వాలని ఆదేశం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రథమంగా, అందరికంటే ముందు అజాన్ పలుకులు పలికించడానికి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని పిలిపించి “ఓ బిలాల్! నీవు అజాన్ పలుకులు పలుకు” అని ఆదేశించినప్పుడు ఇస్లాం లో అజాన్ పలుకులు పలికిన ప్రథమ వ్యక్తి బిలాల్ రదియల్లాహు అన్హు. అభిమాన సోదరులారా, ఆనాటి నుండి ఆయనకు ప్రజలు బిలాల్ ముఅజ్జిన్ అనే పేరుతో పిలవటం ప్రారంభించారు.
అభిమాన సోదరులారా, మదీనాలో ఉంటున్నప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు ఐదు పూటల నమాజులకు అజాన్ పలికేవారు. తర్వాత సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులకు కావాల్సిన పనులు చేసి పెట్టేవారు. అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటున్నప్పుడు మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు విశ్వాసులను అక్కడి నుండి తరిమి కొట్టాలని ప్రయత్నించినప్పుడు యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు బిలాల్ రదియల్లాహు అన్హు కూడా ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా హిజ్రీ శకం రెండవ సంవత్సరంలో మొదటి యుద్ధం జరిగింది ఆ యుద్ధం పేరు బద్ర్ సంగ్రామం. ఆ సంగ్రామంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు బిలాల్ రదియల్లాహు అన్హు యుద్ధ మైదానంలో వస్తే శత్రువులలో నుంచి ఉమయ్య వచ్చాడు. ఉమయ్య తెలుసు కదా బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క మాజీ యజమాని. మక్కాలో ఆయనకు హింసించిన వాడు, కొట్టినవాడు, బంధించినవాడు, జంతువులాగా ప్రవర్తించిన వాడు శత్రువుల సైన్యంలో వచ్చాడు. అభిమాన సోదరులారా, యుద్ధమైంది ఆ యుద్ధంలో బిలాల్ రదియల్లాహు అన్హు చేతికి చిక్కిపోయాడు. బిలాల్ రదియల్లాహు అన్హు ఆ రోజు అన్నారు “ఈ రోజు మిగిలితే ఈ భూమి మీద నేను మిగలాలి లేదంటే ఓ దైవ శత్రువా నీవైనా మిగలాలి లేదంటే నేనైనా మిగలాలి, నాతో తలపడు” అని చెప్పేసి బిలాల్ రదియల్లాహు అన్హు అతనితో ఎదుర్కొని అతన్ని హతమార్చేశారు.
అయితే అభిమాన సోదరులారా, మదీనాలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరఫున ఇద్దరు అజాన్ పలుకులు పలికే వారు. ఒకరు బిలాల్ రదియల్లాహు అన్హు వారు అయితే రెండో వారు కళ్ళు లేని, కంటి చూపు లేని ఒక సహాబి ఆయన పేరు అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మఖ్తూమ్.
మక్కా విజయం మరియు కాబా పై అజాన్
అభిమాన సోదరులారా, రోజులు గడిచాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్లిన ఎనిమిదవ సంవత్సరంలో మక్కాని మళ్ళీ జయించేసారు. విజయం పొందిన తర్వాత విజేతల్లాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి శిష్యులు మక్కాలో ప్రవేశించారు. మక్కాలో ప్రవేశించిన తర్వాత మక్కాలోని మస్జిదే హరామ్ లో ఆ రోజుల్లో అవిశ్వాసులు అక్కడ ఉంచిన విగ్రహాలన్నింటిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు శిష్యులు అందరూ కలిసి అక్కడి నుంచి తొలగించేశారు. తొలగించిన తర్వాత మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు వారిని పిలిచి “ఓ బిలాల్! కాబా పైకి ఎక్కి ఈరోజు నీవు అజాన్ పలుకులు పలుకు” అన్నారు. అల్లాహు అక్బర్! అభిమాన సోదరులారా, బిలాల్ రదియల్లాహు అన్హు ఆ రోజు మక్కా విజయం జరిగిన రోజు కాబా పైకి ఎక్కి అక్కడి నుండి అజాన్ పలుకులు పలికారు.
أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్)
أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ
(అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్)
బిలాల్ రదియల్లాహు అన్హు గారు ఈ పలుకులు నిర్మోహమాటంగా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి వణుకు లేకుండా పలికారు. ఒకప్పుడు అదే నగరంలో అల్లాహ్ పేరు తలుచుకోవాలంటే, అల్లాహ్ పేరు పలకాలంటే హింసలు ఎదుర్కోవలసి వచ్చేవి. ఒక్కసారి అల్లాహ్ అని పలకాలంటే యజమానితో భయపడేవారు. ఒక్కసారి అల్లాహ్ అని పలకాలంటే ఆ ఊరి పెద్దలతో భయపడేవారు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే వాతావరణం ఎలాగ మారిపోయిందంటే ఆ రోజు బిలాల్ రదియల్లాహు అన్హు కాబా మీద నిలబడి ఈ పలుకులు పలుకుతూ ఉంటే ఏ ఒక్కడు కూడా వచ్చి అడ్డు పడటానికి సాహసించలేకపోయాడు. అలా మారిపోయాయి.
ప్రవక్త గారి మరణం మరియు బిలాల్ ఆవేదన
ఆ తర్వాత అభిమాన సోదరులారా, రోజులు గడిచాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారో, మరుసటి రోజు నుంచే బిలాల్ రదియల్లాహు అన్హు వారు అజాన్ పలకటం మానేశారు. ప్రజలు వచ్చి ఏమండీ ఎందుకు మీరు అజాన్ పలకటం మానేశారు అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు “అయ్యా అజాన్ పలికేటప్పుడు అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చెప్పిన తర్వాత నేను ఎవరి మొహం చూడాలయ్యా? ఆ పలుకు పలికేటప్పుడు నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తుకు వస్తారు కాబట్టి ఆ పలుకు పలికిన తర్వాత మరి వేరే పలుకులు నేను పలకలేను” అన్నారు. ఆ తర్వాత నుంచి బిలాల్ రదియల్లాహు అన్హు వారి అజాన్ అక్కడి నుంచి ఆగిపోయింది.
ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు విశ్వాసులకు నాయకులైనప్పుడు ఆయన ఏమన్నారంటే “ఓ అబూబకర్ రదియల్లాహు అన్హు! నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్లి సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి వీరమరణం పొందాలనుకుంటున్నాను” అన్నారు. కానీ ఆయనకు అప్పుడే ఎక్కువ వయసు అయిపోయింది కాబట్టి అబూబకర్ రదియల్లాహు అన్హు అనుమతి ఇవ్వలేదు. అబూబకర్ రదియల్లాహు అన్హు తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు నాయకునిగా ఎన్నికైన తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వద్దకు వచ్చి కూడా బిలాల్ రదియల్లాహు అన్హు వారు అనుమతి కోరితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా వయసు ఎక్కువ అయిపోయింది అని అనుమతి ఇవ్వలేదు. కాకపోతే పట్టుబట్టి ఆయన అనుమతి పొందారు, ఆ తర్వాత సరిహద్దుల్లోకి వెళ్ళిపోయారు. సరిహద్దులో వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో కొన్ని ముఖ్య కారణాల వల్ల ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా సరిహద్దుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు తో ఉమర్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ బిలాల్! నా కోరిక మేరకు ఒక్కసారి అజాన్ పలకవయ్యా” అన్నారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు సరిహద్దుల్లో ఒక్కసారి అజాన్ పలికారు.
మరికొన్ని రోజుల తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు మదీనాకు వచ్చినప్పుడు మదీనాలో ఉంటున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవలు హసన్ మరియు హుస్సేన్ మరియు ఇతర సహాబాలు కలిసి బిలాల్ రదియల్లాహు అన్హు ని అజాన్ కోరాలని ప్రాధేయపడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఒక్కసారి ఆయన జీవితంలో చివరిసారి మదీనాలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు అజాన్ పలికారు. అభిమాన సోదరులారా, ప్రజలు బిలాల్ రదియల్లాహు అన్హు వారి అజాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చదివించడానికి ఎంతగా కనెక్ట్ అయిపోయారంటే చాలా గ్యాప్ తర్వాత, చాలా విరామం తర్వాత ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు మదీనాలో అజాన్ పలికారో, మదీనాలో ఆయన అజాన్ పలుకులతో వీధి వీధుల్లో శబ్దం మోగిందో ఇళ్లలో నివసిస్తున్న పిల్లల దగ్గరి నుండి మహిళల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తలుచుకొని కన్నీరు కార్చారు. అదే బిలాల్ రదియల్లాహు అన్హు జీవితంలో ఆయన ఇచ్చిన చివరి అజాన్. ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు దిమష్క్ అంటే ఈనాడు డెమస్కస్ అంటూ ఉంటారు ఆ నగరంలో 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయనకు వయసు అయిపోయిన సందర్భంలో ఆయన అక్కడే మరణం పొందారు. నేటికి కూడా ఆయన సమాధి ఆ నగరంలో ఉంది.
స్వర్గంలో బిలాల్ అడుగుల చప్పుడు
అయితే అభిమాన సోదరులారా, ఆయనకున్న ఘనతలను చెప్పేసి ఇన్ షా అల్లాహ్ నా మాటను ముగిస్తాను అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ యాత్ర సందర్భంలో అల్లాహ్ తో కలవడానికి ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గాన్ని కూడా చూపించాడు, నరకాన్ని కూడా చూపించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని చూస్తున్నప్పుడు అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు నడుస్తున్నట్టుగా వారి కాళ్ళ చప్పుడుని విన్నారు. ఆ యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హుతో ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే “ఓ బిలాల్! నేను స్వర్గంలో నీ అడుగుల చప్పుడు విన్నాను, నీవు ఏ సత్కార్యము చేస్తున్నావో నాకు కొంచెం తెలుపవా” అన్నారు. దానికి బదులుగా బిలాల్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను ఏదో ఒక పెద్ద సత్కారం ఏమి చేయట్లేదండి, కాకపోతే నా అలవాటు ఏమిటంటే నేను వుజూ చేసిన ప్రతిసారి రెండు రకాతుల నమాజ్ ఆచరిస్తాను. నా వుజూ భంగమైపోయిన వెంటనే మళ్ళీ నేను వుజూ చేసేస్తాను, వుజూ చేసిన వెంటనే మళ్ళీ నేను రెండు రకాతుల నమాజ్ ఆచరిస్తాను” అన్నారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన చేసిన ఆ సత్కార్యాన్ని మెచ్చుకున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు కాళ్ళ చప్పుడుని వినిపించాడు. ఒకరకంగా ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా బిలాల్ రదియల్లాహు అన్హు కి స్వర్గ శుభవార్త కూడా తెలియజేసేశాడు ఒకరకంగా ఇక్కడ.
అలాగే బిలాల్ రదియల్లాహు అన్హు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేస్తున్న రోజుల్లో ఒకసారి పండుగ రోజు వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులకు ఖుత్బా వినిపించేసారు. ఆ తర్వాత మహిళల వద్దకు వెళ్లి మహిళలకు కూడా అల్లాహ్ వాక్యాలు వినిపించారు ఆ తర్వాత దానధర్మాలు చేయాలని ఆదేశించినప్పుడు, కోరినప్పుడు అక్కడ ఉన్న మహిళలందరూ వారు తొడిగిన నగలు తీసి విరాళంగా ఇచ్చేస్తున్నారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పక్కనే ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు చేయి పట్టుకొని అక్కడ మహిళలకు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడైతే మహిళలు విరాళాలు ఇచ్చారో బిలాల్ రదియల్లాహు అన్హు అక్కడ దుప్పట పరిచిన తర్వాత మహిళలందరూ అందులో విరాళాలు వేశారు.
ఇక చివరిగా మరొక విషయం ఏమిటంటే ఉమర్ రదియల్లాహు అన్హు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని చూసినప్పుడల్లా ఒక మాట అనేవారు “అబూబకర్ సయ్యిదునా ఆతకా సయ్యిదనా” అంటే అబూబకర్ రదియల్లాహు అన్హు మాకు నాయకుడు, మా నాయకుడు మా నాయకుడైన బిలాల్ ని స్వతంత్రుని చేసేసారు అనేవారు. అంటే బిలాల్ రదియల్లాహు అన్హు వారిని చూసినప్పుడల్లా ఉమర్ రదియల్లాహు అన్హు వారు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని “మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు” అని చెప్పేవారు. వాస్తవానికి ఆయన బానిసగా జీవించినవాడు. కానీ ఇస్లాం లో నల్ల వారికి, తెల్ల వారికి, బానిసకి, స్వతంత్రునికి ఎలాంటి భేదం లేదు అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పటానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
ముగింపు మరియు దువా
కాబట్టి అభిమాన సోదరులారా, ఇది బిలాల్ రదియల్లాహు అన్హు యొక్క విశిష్టత, ఆయన యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర.
చివరిగా నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను అల్లాహ్ మనకు కూడా బిలాల్ రదియల్లాహు అన్హు మాదిరిగా అలాగే ఇతర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల మాదిరిగా దృఢమైన విశ్వాసంతో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఇస్లాం పై నిలకడగా జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఎలాంటి కష్టనష్టాలు, బాధలు లేకుండా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
أَقُولُ قَوْلِي هَذَا، وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ، فَاسْتَغْفِرُوهُ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా, వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వ లిసాయీరిల్ ముస్లిమీన్, ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)
నేను ఈ మాట చెబుతూ, నా కోసం, మీ కోసం మరియు ముస్లిములందరి కోసం అల్లాహ్ క్షమాభిక్ష కోరుతున్నాను. కాబట్టి ఆయన వద్ద క్షమాపణలు వేడుకోండి, నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, అత్యంత దయగలవాడు.
—
సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt
ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8
You must be logged in to post a comment.