అల్లాహ్ శుభ నామాలైన: అర్ – రహ్మాన్ & అర్ – రహీం యొక్క వివరణ – నసీరుద్దీన్ జామిఈ [వీడియో, టెక్స్ట్]

అల్లాహ్ శుభ నామాలైన: అర్ – రహ్మాన్ & అర్ – రహీం యొక్క వివరణ – నసీరుద్దీన్ జామిఈ [వీడియో]
https://youtu.be/TroaV88YDwc [27 నిముషాలు]

సారాంశం

ఈ ప్రసంగంలో అల్లాహ్ యొక్క శుభ నామాలైన ‘అర్-రహ్మాన్’ (అనంత కరుణామయుడు) మరియు ‘అర్-రహీమ్’ (అపార కృపాశీలుడు) యొక్క లోతైన అర్థాలు మరియు ప్రాముఖ్యత వివరించబడింది. ‘అర్-రహ్మాన్’ అనేది అల్లాహ్ యొక్క విశాలమైన, అంతం లేని మరియు లెక్కింపశక్యం కాని కారుణ్యాన్ని సూచిస్తుంది, ఇది ఈ లోకంలో విశ్వాసులు మరియు అవిశ్వాసులు అందరిపై వర్షిస్తుంది. ‘అర్-రహీమ్’ అనేది ప్రత్యేకంగా ప్రళయదినాన కేవలం విశ్వాసులపై నిరంతరంగా కురిసే కారుణ్యాన్ని సూచిస్తుంది. ‘అర్-రహ్మాన్’ అనే పేరు అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం అని, ఇతరులకు ఆ పేరు పెట్టరాదని స్పష్టం చేయబడింది. అల్లాహ్ కారుణ్యం 70 మంది తల్లుల ప్రేమ కంటే ఎక్కువ అనే ప్రచారంలో ఉన్న మాట సరైనది కాదని, దానికి బదులుగా అల్లాహ్ తన కారుణ్యాన్ని వంద భాగాలుగా చేసి, అందులో ఒక్క భాగాన్ని మాత్రమే ఈ లోకానికి పంపాడని, మిగిలిన 99 భాగాలను తన వద్దే ఉంచుకున్నాడని తెలిపే సహీ హదీస్ వివరించబడింది. అల్లాహ్ యొక్క ఈ కారుణ్యాన్ని పొందాలంటే విశ్వాసం, దైవభీతి, నమాజ్, జకాత్ మరియు ఖురాన్ పఠనం వంటి సత్కార్యాలు చేయాలని, అలాగే తోటి సృష్టి పట్ల కరుణ చూపాలని ప్రసంగం ఉద్బోధిస్తుంది.

పూర్తి ప్రసంగం

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
( الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ)
(సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబంపై మరియు ఆయన అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)

ప్రియ వీక్షకుల్లారా, సోదర సోదరీమణులారా, అల్లాహ్ యొక్క శుభ నామాలైన అర్-రహ్మాన్ (الرَّحْمَٰنِ), అర్-రహీమ్ (الرَّحِيمِ) వీటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అయితే, అల్లాహు తాలా ఖురాన్ ఆరంభంలోనే బిస్మిల్లాహ్ (بِسْمِ اللَّهِ) తర్వాత వెంటనే అర్-రహ్మానిర్-రహీమ్ (الرَّحْمَٰنِ الرَّحِيمِ) ఈ రెండు నామాలను ప్రస్తావించాడు.

అర్-రహ్మాన్, ఈ పేరు అలాగే అర్-రహీమ్, ఈ పేరు. ఈ రెండు కూడా ఖురాన్‌లో అనేక సందర్భాలలో వచ్చాయి. అయితే ఇన్షాఅల్లాహ్, నేను ప్రయత్నం చేస్తాను, ఒక 15 నుండి 20 నిమిషాల లోపుగా ఈ రెండు నామాల గురించి కనీసం ఐదు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదటి విషయం దీని యొక్క భావం. అర్-రహ్మాన్ అని అంటే, ఇందులో అంతం కాని, విశాలమైన, లెక్కలేనంత కరుణా కటాక్షాలు గలవాడు అల్లాహ్ అన్నటువంటి భావం అర్-రహ్మాన్ అనే పదానికి వస్తుంది. ఇక అర్-రహీమ్, ఇందులో కూడా కారుణ్యం అన్న భావం ఉంది. ఎందుకంటే రెండు పేర్లు కూడా రా, హా, మీమ్ (ر، ح، م) ద్వారానే వచ్చాయి. అయితే, అర్-రహీమ్ అన్న ఈ పదములో, ఈ పేరులో అల్లాహ్ యొక్క కారుణ్యం దాసులపై, తన యొక్క సృష్టి రాశులపై కురుస్తూనే ఉంటుంది, కంటిన్యూయేషన్, ఈ భావం ఉంది. అర్థమైంది కదా? అర్-రహ్మాన్, అల్లాహ్ యొక్క విశాలమైన, అంతం కాని, మనం లెక్కకట్టనటువంటి కరుణా కటాక్షాలు. ఆ కరుణా కటాక్షాలు గలవాడు. అర్-రహీమ్ అంటే ఆ కరుణ తన దాసులపై, తన సృష్టి రాశులపై యెడతెగకుండా కురిపిస్తూ ఉండేవాడు.

ఇవి రెండూ కూడా అల్లాహ్ యొక్క పేర్లు అని మనం నమ్మాలి. ఇది మన అఖీదా, మన విశ్వాసం. ఈ రోజుల్లో, రహ్మాన్ అంటే, ఆహా ఏ.ఆర్. రెహమాన్, సింగర్, ఇలా రహ్మాన్ అన్న పేరు వింటేనే అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాల గురించి గుర్తు రాకుండా, ఇహలోకంలో ఇలాంటి పేరు పెట్టుకొని ప్రఖ్యాతి చెందిన కొందరు మనకు గుర్తు రావడం ఇది వాస్తవానికి అల్లాహ్ పట్ల మన యొక్క అజ్ఞానం. అల్లాహ్ కారుణ్యాల పట్ల మనం సరిగ్గా తెలుసుకోలేకపోయాము అన్నటువంటి భావం.

సోదర మహాశయులారా, ఇందులోనే మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైనది ఏమిటంటే, రహ్మాన్ ఇది కూడా అల్లాహ్ అన్న అసలైన నామం ఏదైతే ఉందో దాని తర్వాత స్థానంలో వస్తుంది. వేరే ఇంకా ఎన్నో లెక్కలేనన్ని ఇతర పేర్ల కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది. అందుకొరకే ధర్మవేత్తలు ఏమంటారు? అల్లాహ్ తప్ప ఎవరి పేరు కూడా రహ్మాన్ అని పెట్టరాదు. అబ్దుర్రహ్మాన్ అని పెట్టవచ్చు, అలాగే పిలవాలి కూడా. కేవలం రహ్మాన్ అని పిలవరాదు. తప్పు ఇలా పిలవడం. కేవలం రహీమ్ అనవచ్చు, రవూఫ్ అనవచ్చు, కరీమ్ అనవచ్చు, అబ్ద్ లేకుండా. కానీ రహ్మాన్ అన్న పదం వేరే, అంటే అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా ‘అబ్ద్’ అన్నది లేకుండా కేవలం రహ్మాన్ అని పెట్టడం, పిలవడం ఇది తప్పు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి.

అల్లాహ్ సూర బనీ ఇస్రాయీల్‌లోని సుమారు చివర్లో ఏమన్నాడు? “ఖులిద్వుల్లాహ అవిద్వుర్-రహ్మాన్”( قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ). మీరు అల్లాహ్ అని పిలవండి, దుఆ చేయండి, రహ్మాన్ అని దుఆ చేయండి, ఎలా చేసినా పర్లేదు.

రహ్మాన్ విషయంలో మనం దాని అర్థం, దాని భావం తెలుసుకున్నాము కదా. సంక్షిప్తంగా ఆ భావంలో మనకు తెలిసిన విషయం ఏంటి? అల్లాహ్ లెక్కలేనన్ని, ఎంతో విశాలమైన, అతి గొప్ప, అంతం కాని కరుణా కటాక్షాలు గలవాడు. తన సృష్టి రాశులపై తన కరుణా కటాక్షాలు కురిపిస్తూనే ఉంటాడు.

ఇక్కడే ఒక పొరపాటును దూరం చేసుకోవాలి. తప్పుడు భావాన్ని మనం దాని రూపుమాపేసేయాలి. సర్వసామాన్యంగా మనలో ఒక మాట ప్రబలి ఉన్నది. అల్లాహ్ 70 తల్లుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు అని. చాలా ప్రబలి ఉంది కదా ఈ మాట? ఇది తప్పు. దీనికి సంబంధించి ఏ సహీ హదీస్ లేదు. మనం 70 అని అక్కడ చెబుతుంటే, ఒకవేళ చాలా ఎక్కువగా అని భావం తీసుకుంటే అది వేరే విషయం కావచ్చు కానీ, సర్వసామాన్యంగా ఇది తెలియని వారు ఏమనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ దలీల్ కూడా లేదు. మళ్లీ మన ఈ మాట మన సమాజంలో ప్రబలి ఉంది. అందుకొరకు దీనిని తగ్గించే ప్రయత్నం చేయాలి. అల్లాహు తాలా 70 ఏ కాదు, లెక్కలేనన్ని కరుణా కటాక్షాలు గలవాడు. ఎలా?

దీనికి సంబంధించి నేను రెండు హదీసులు మీకు వినిపిస్తున్నాను. కొంచెం శ్రద్ధ వహించండి. ఇన్షాఅల్లాహ్ దీని ద్వారా విషయం మరింత స్పష్టంగా మీకు తెలిసి వస్తుంది. మొదటి హదీస్ సహీ బుఖారీలో వచ్చినది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు, جَعَلَ اللَّهُ الرَّحْمَةَ مِائَةَ جُزْءٍ (జ’అలల్లాహు అర్-రహ్మత మి’అత జుజ్’ఇన్) అల్లాహు తాలా తన కారుణ్యాన్ని, రహ్మత్‌ని 100 భాగాలు చేశాడు. ఎన్ని భాగాలండీ? 100 భాగాలు చేశాడు. తన వద్ద 99 భాగాలను ఆపుకున్నాడు, ఉంచుకున్నాడు. కేవలం ఒక్క భాగం మాత్రమే ఈ లోకంలో పంపాడు. ఆ ఒక్క భాగంలోనే మానవులకు, పశువులకు, ఇతర సృష్టి రాశులకు అందరికీ లభించినది. అందరికీ ఆ ఒక్క భాగంలో నుండే లభించినది. సర్వ సృష్టి పరస్పరం ఏ కారుణ్యం చూపుతుందో, అల్లాహ్ పంపిన 100 భాగాల్లో నుండి ఒక భాగంలోనిదే. చివరికి ఏదైనా పక్షి గాని, హదీస్‌లో వచ్చి ఉంది గుర్రం గురించి, ఒక గుర్రం తన యొక్క కాలు ఏదైనా అవసరానికి లేపినప్పుడు, తన దగ్గర పాలు త్రాగుతున్నటువంటి గుర్రం పిల్లకు తాకి ఏదైనా బాధ కలగకూడదు అని కూడా శ్రద్ధ వహిస్తుంది. అలాంటి ఆ కారుణ్యం ఆ గుర్రంలో కూడా ఉంది అంటే అల్లాహ్ పంపిన ఆ ఒక్క భాగంలోని ఒక చిన్న భాగమే. (సహీ బుఖారీ, హదీస్ నంబర్ 6000). (మహా ప్రవక్త మహితోక్తులు 1750)

ఇక రెండవ హదీస్, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉండగానే ఒక బానిస, తన పాలు త్రాగే పిల్లవాడిని తప్పిపోయింది. ఎంతసేపయిందో పాపం, తన ఆ చంటి పాపకు పాలు త్రాగించకుండా ఆమె స్థనాలు పాలతో నిండిపోయి, అటు ఒక బాధగా ఉంది మరియు పాప తప్పిపోయినందుకు ఓ బాధ. ఈ మధ్యలో ఏ చిన్న పాపను చూసినా తీసుకుని పాలు త్రాపిస్తుంది. ఈ సంఘటనను గమనించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సహాబాలతో ప్రశ్నించారు. ఏమిటి మీ ఆలోచన? ఈ తల్లి తన ఆ పిల్లను, ఆ బిడ్డను అగ్నిలో వేస్తుందా? ఉమర్ (రదియల్లాహు అన్హు) అంటున్నారు, మేమందరం అన్నాము, “లా” (లేదు). ఆమె ఏ కొంచెం శక్తి అయినా సంపాదించి పడకుండా జాగ్రత్త పడుతుంది కానీ, ఎలా వేయగలదు? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు, لَلَّهُ أَرْحَمُ بِعِبَادِهِ مِنْ هَذِهِ بِوَلَدِهَا (అల్లాహు అర్హము బి’ఇబాదిహీ మిన్ హాజిహీ బి’వలదిహా) “అల్లాహ్ తన దాసుల పట్ల ఈమెకు తన బిడ్డపై ఉన్న కారుణ్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కరుణ గలవాడు.”

అయితే అర్థమైంది కదా విషయం. రహ్మాన్, రహీమ్ యొక్క భావాలు ఏంటో అది తెలిసింది. అల్లాహ్ యొక్క పేర్లు అని మనం నమ్మాలి, విశ్వసించాలి అని తెలిసింది. ఈ పేర్లలో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క గొప్ప గుణం కారుణ్యం, కరుణా కటాక్షాలు ఇవి తెలిసాయి. వీటిని మనం అలాగే నమ్మాలి, వేరే ఎవరితో పోల్చకూడదు, ఇందులో ఎలాంటి షిర్క్ చేయకూడదు. రహ్మాన్ అల్లాహ్ యొక్క ప్రత్యేక పేరు అని కూడా తెలిసింది, ఎవరూ కూడా దాని యొక్క అలాంటి పేరు పెట్టకూడదు. ఎవరైనా పెట్టదలచుకుంటే అబ్దుర్రహ్మాన్ అని పెట్టాలి కానీ, కేవలం రహ్మాన్ అని పెట్టరాదు. ఇక సమాజంలో ఉన్న ఒక పొరపాటు కూడా దూరమైపోయింది.

ఇక రండి సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షం ఎంత గొప్పదంటే, ఈ లోకంలో అల్లాహు తాలా ఆయన్ని విశ్వసించిన వారినే కాదు, తిరస్కరించి తలబిరుసుతనం వహించి తన ప్రవక్తలను, పుణ్యాత్ములను సైతం శిక్షలకు గురి చేసే వారిని కూడా కరుణిస్తున్నాడు, వారిపై కూడా తన కరుణా కటాక్షాలు కురిపిస్తున్నాడు. అయితే, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు ఈ లోకంలో పుణ్యాత్ములతో పాటు పాపాత్ములకు కూడా దొరుకుతాయి. కానీ పరలోకాన, పరలోకాన కేవలం విశ్వాసులు మాత్రమే అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలకు అర్హులవుతారు. అక్కడ అవిశ్వాసులు, అల్లాహ్‌ను ధిక్కరించిన వారు పరలోక దినాన అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను పొందలేరు. “వ కాన బిల్ ముఅమినీన రహీమా” (وَكَانَ بِالْمُؤْمِنِينَ رَحِيمًا) (ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణాశీలుడు).

అర్-రహ్మాన్ అన్న పేరుతో ఖురాన్‌లో అల్లాహ్ అర్ష్ (సింహాసనం) పై ఉన్నాడు అన్న విషయానికి అర్-రహ్మాన్ అన్న పదంతో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రస్తావించాడు. “అర్-రహ్మాను అలల్-అర్షిస్తవా” (الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ) (అనంత కరుణామయుడు సింహాసనంపై ఆసీనుడయ్యాడు).

ఈ రెండు పేర్ల యొక్క భావం మనకు తెలిసినప్పుడు, ఇక ఆ రెండు పేర్ల ప్రభావం మన జీవితాలపై ఎలా పడాలంటే, మనం ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు ఇహలోకంలో పొందడంతో పాటు, శాశ్వత జీవితమైన ఆ పరలోకంలో పొందడానికి ఈ లోకంలోనే ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ప్రయత్నం చేయకుంటే, ఇక్కడ ఏదో అతని కరుణా కటాక్షాలు పొందుతాము, కానీ పరలోక దినాన పొందకుండా ఏ నష్టమైతే అక్కడ మనకు వాటిల్లుతుందో దాని నుండి తప్పించుకోవడానికి ఏ మార్గం ఉండదు.

అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మనం పొందాలంటే, విశ్వాస మార్గాన్ని అవలంబించాలి. మనం ధర్మంపై స్థిరంగా ఉండాలి. అల్లాహ్ ప్రతి ఆదేశాన్ని పాటించాలి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని అనుసరించాలి, ఐదు పూటల నమాజులు చేయాలి, జకాతు ఇవ్వాలి, ఖురాన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి చదువుతూ, వింటూ ఉండాలి. సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో మన జీవితం గడవాలి, ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ మాత్రం మనం నడవకూడదు. అప్పుడే ఇహలోకంలోతో పాటు పరలోకంలో కూడా మనం శాశ్వతమైన అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు పొందగలుగుతాము. దీనికి సంబంధించి రండి, సంక్షిప్తంగా నేను కొన్ని ఆయతుల రిఫరెన్స్ మీకు ఇస్తాను. మీరు ఆ రిఫరెన్స్‌లను శ్రద్ధగా ఒకవేళ నోట్ చేసుకున్నారంటే కేవలం, వివరంతో కూడి దాని యొక్క వ్యాఖ్యానం మీరు ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ దయతో చదువుకోగలరు. ఉదాహరణకు చూడండి:

  • సూరహ్ ఆలి-ఇమ్రాన్ (3), ఆయత్ 132.
  • సూరతుల్ అన్ఆమ్ (6), ఆయత్ 155.
  • సూరహ్ అల్-ఆరాఫ్ (7), ఆయత్ 63 (దైవభీతి గురించి).
  • సూరహ్ అల్-ఆరాఫ్ (7), ఆయత్ 204 (ఖురాన్ విషయంలో).
  • సూరతున్నూర్ (24), ఆయత్ 56 (నమాజ్, జకాత్, విధేయత).
  • సూరహ్ నమ్ల్ (27), ఆయత్ 46 (క్షమాపణ కోరడం).

ఇక, పరస్పరం సోదర భావం కలిగి ఉండడం, ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండడం, ఎవరితో కూడా మనం మాట వదులుకోకుండా, ఎప్పుడైనా ఎవరితోనైనా ఏదైనా పొరపాటు జరిగితే, తప్పుడు భావాలు జరిగితే, మాటలో ఏదైనా అర్థం కాకుండా పరస్పరం సంబంధాల్లో తెగతెంపులు, దూరం ఏర్పడితే, “ఫ అస్లిహూ” (فَأَصْلِحُوا) (సంధి చేయండి) సులహ్, సంధి, దగ్గర కావడం, కలుపుగోలుతనంతో మెలగడం, ఇలా చేయడం ద్వారా కూడా మీరు అల్లాహ్ కారుణ్యాన్ని పొందుతారని సూరతుల్ హుజురాత్ (49), ఆయత్ 10లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు.

ఇక్కడ మీరు గమనించండి, కొన్ని రిఫరెన్సులు మాత్రమే నేను రాయించాను కదా మీకు, ఇందులో అఖీదా వస్తుంది, ఇబాదాత్‌లు వచ్చేస్తాయి, ఆరాధనలు. ఇందులో క్యారెక్టర్, అఖ్లాక్ కూడా వచ్చేస్తుంది. భార్యాభర్తల సంబంధం విషయంలో కూడా అల్లాహ్ కారుణ్యాన్ని ఎలా పొందాలి? సూరత్ రూమ్‌లో చదవండి, 31వ ఆయత్ నంబర్. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, పిల్లల పట్ల మనం అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో ప్రేమ కలిగి ఉండి, (ఇక్కడ నేను ఒక పదం పెంచాను గుర్తుందా? అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో) సర్వసామాన్యంగా ప్రతి తల్లిదండ్రికి సంతానం పట్ల ప్రేమ ఉంటుంది, ఇది స్వాభావికమైనది. కానీ మనం అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో వారిని ప్రేమించడం అంటే, వారు ఇహలోకంలో మనకు కేవలం సంతానం అనే కాదు, వారు రేపటి రోజు నరకంలో పోకుండా ఉండడానికి అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో వారిని శిక్షణ ఇవ్వడం, ఇది అసలైన ప్రేమ.

ఇక రండి, ఈ రహ్మాన్, రహీమ్ యొక్క వివరణలో మరో కోణంలో మరికొన్ని విషయాలు తెలుసుకొని సమాప్తం చేద్దాం. అదేమిటి? అల్లాహు తాలా ఎవరికైనా ఏదైనా కరుణ నొసంగాడంటే, ఎవరూ కూడా ఆపలేరు అని అల్లాహు తాలా చాలా స్పష్టంగా తెలిపాడు. మరియు అల్లాహ్ తన కారుణ్యాన్ని ఎవరి నుండైనా ఆపాడంటే, అల్లాహ్‌కు విరుద్ధంగా అతనికి కరుణ నొసంగేవాడు ఎవడూ లేడు.

ఇక్కడ మన విశ్వాసాన్ని ఈ ఖురాన్ యొక్క ఆయత్ ద్వారా మనం సరిచేసుకోవాలి. ముస్లింలలో కూడా ఎందరో తప్పుడు విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు. సర్వసామాన్యంగా మూసా (అలైహిస్సలాం) గురించి ఒక తప్పుడు కథను కొందరు ప్రసంగీకులు ప్రజల ముందు చెబుతూ ఉంటారు. ఇది వారు ఏమనుకుంటారు? అల్లాహ్ యొక్క వలీల షాన్ (గొప్పతనం) చెబుతున్నాము అని. కానీ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్‌కు వ్యతిరేకంగా, ప్రవక్తలకు వ్యతిరేకంగా ఎలాంటి కథలు కట్టి, అల్లి ప్రజల ముందు ప్రజలకు తెలియజేసి విశ్వాసాలను పాడు చేస్తున్నారో వారు అర్థం చేసుకోరు.. వృద్ధాప్యానికి దగ్గరైన ఒక స్త్రీ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు పెళ్లి అయి కానీ సంతానం లేదు, మీరు ప్రవక్త కదా నాకు దుఆ చేయండి అల్లాహ్ సంతానం ఇవ్వాలని. మూసా (అలైహిస్సలాం) దుఆ చేస్తే అల్లాహు తాలా చెప్పాడంట, మూసా ఆమె అదృష్టంలో నేను సంతానం రాయలేదు అని. ఆమె చాలా బాధతో అటు పోతూ ఉంటే, ఒక అల్లాహ్ యొక్క వలీ కలిశాడంట. నవూజుబిల్లాహ్, ఇది అబద్ధం, కానీ ప్రజలు చెబుతారు, “ఓ సుబ్హానల్లాహ్, మాషాఅల్లాహ్, అల్లాహ్ కే వలీ కి క్యా షాన్ హై” అనుకుంటూ తలలు ఊపుతారు అజ్ఞానులు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. ఏమైంది? బాధతో ఆ స్త్రీ వెళ్తూ ఉంటే అటు ఒక వలియుల్లా కలిశాడంట. “ఏంటమ్మా చాలా బాధగా వెళ్తున్నావ్, ఏమైంది నీకు?” అని అడిగితే, సంతానం లేదు, సంవత్సరాలు అయిపోయింది పెళ్లి అయి. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు వెళ్తే ఇక నాకు సంతానమే లేదు అని తెలిసింది, అందుకే బాధగా ఉన్నాను. “అట్లా ఎట్లా జరుగుద్ది, నేను నీకు సంతానం ఇప్పించి ఉంటాను” అని తన కట్టెతో ఇలా భూమి మీద కొట్టాడంట, తర్వాత అల్లాహ్‌తో వాదించాడంట. ఆ తర్వాత ఆమెకు సంతానం కలుగుతుంది అని శుభవార్త వచ్చిందంట. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. చదవండి సూరహ్ ఫాతిర్ (35), ఆయత్ 2 మరియు సూరత్ అజ్-జుమర్ (39), ఆయత్ 38. ఇలాంటి తప్పుడు భావాలన్నీ కూడా దూరం కావాలి.

అయితే, ఈ లోకంలో మనం పుట్టడం, ఇది స్వయం అల్లాహ్ యొక్క కారుణ్యం. మనకు తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే పోషణ మార్గాలు వారికి నొసంగాడో, ఇది కూడా అల్లాహ్ యొక్క కారుణ్యం. ఈ లోకంలో మనకు సంతానం కలగడం, భార్యలు కలగడం, స్త్రీలకు భర్తలు లభించడం, ఇంకా ఎన్నో రకాల అనుగ్రహాలు, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క కారుణ్యం. కానీ, అసలైన కారుణ్యాలను మరచిపోకండి. అవేంటి? విశ్వాసులకు లభించేటువంటి విశ్వాస భాగ్యం, పుణ్యకార్యాలు చేసేటువంటి భాగ్యం. అయితే సోదర మహాశయులారా, ఈ సందర్భంలో మనం గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇహలోకపు సామాగ్రిలో, ప్రపంచపు యొక్క వసతులలో మనకు ఏది లభించినా, విశ్వాసం లభించలేదు, పుణ్యకార్యాల భాగ్యం లభించలేదు అంటే మనకంటే దురదృష్టవంతుడు మరెవడూ ఉండడు. ఇహలోక సామాగ్రిలో ఏదైనా కొరత జరిగి, సంతానం చనిపోవడం గానీ, ఏదైనా వ్యాపారంలో నష్టం జరగడం గానీ, వ్యవసాయంలో మునగడం గానీ, ఇంకా ఏది జరిగినా విశ్వాసం బలంగా ఉంది, అల్లాహ్ ఇష్ట ప్రకారంగా మన జీవితం గడుస్తుంది అంటే, ఓపిక సహనాలతో ఇది అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యం మనపై ఉన్నట్లు. దీనికి చిన్న ఉదాహరణ ఇచ్చే ముందు, ప్రజలలో ప్రబలి ఉన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏమిటంటే, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, ఎవరైనా వ్యాపారంలో నష్టంలో ఉంటే, ఎవరికైనా ఏదైనా ఇహలోకపు కష్టం, బాధ, ఏదైనా నష్టం జరిగితే ఎంతటి దుర్మార్గుడో, ఎంతటి దురదృష్టవంతుడో, అందుకొరకే అల్లాహ్ వాన్ని ఇలా పరీక్షిస్తున్నాడు అని అనుకుంటాము. ఒకవేళ అతడు విశ్వాసంలో మంచిగా ఉన్నా, నమాజులు మంచిగా చదువుతూ ఉన్నా, అతడు అల్లాహ్ యొక్క భయభీతి కలిగి ఉన్నా, ఇహలోక సామాగ్రి తగ్గింది గనుక మనం అతన్ని కించపరుస్తాము, అవహేళన చేస్తాము. సోదరులారా, ఇది చాలా తప్పు విషయం.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క నెలలు గడిచేవి ఇంట్లో పొయ్యి కాలేది కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉండగానే తమ ఏడుగురి సంతానంలో ఆరుగురు చనిపోతారు, కేవలం ఒక్కరే మిగిలి ఉంటారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి కంటే ముందే ఇద్దరు భార్యలు చనిపోతారు. ఇక చాలా దగ్గరి బంధుమిత్రుల్లో ఎంతోమంది చనిపోతారు. నవూజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, ప్రవక్తకు అల్లాహ్ కారుణ్యం లభించలేదా? కాదు. అల్లాహ్ ప్రవక్తనే సర్వలోకాలకు కారుణ్యంగా పంపాడు. “వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్” ( وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ). (నిన్ను మేము సర్వ లోకాలకు కారుణ్యంగా తప్ప పంపలేదు). అందుకొరకే అల్లాహ్ యొక్క రహ్మాన్, రహీమ్ యొక్క పేర్లు, ఈ భావం గల నామాలు ఎక్కడెక్కడ మనం విన్నా గానీ ఖురాన్‌లో, హదీస్‌లో, మన విశ్వాసం సరిగ్గా ఉండాలి, పరస్పరం మనం ఒకరి పట్ల ఒకరు కరుణించుకునేటువంటి గుణం కలిగి ఉండాలి.

చివరిలో నేను ఈ హదీస్, ఖురాన్ యొక్క ఆయత్‌తో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. “ముహమ్మదుర్-రసూలుల్లాహ్, వల్లజీన మఅహూ అషిద్దావు అలల్-కుఫ్ఫారి రుహమావు బైనహుమ్” (مُحَمَّدٌ رَسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ). (ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త. ఆయనతో ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినంగా, తమలో తాము కరుణామయులుగా ఉంటారు). రుహమావు బైనహుమ్ (رُحَمَاءُ بَيْنَهُمْ). విశ్వాసులు పరస్పరం ఒకరికి ఒకరు కరుణించుకునేవారు. ఈ గుణం కలిగి ఉండడం తప్పనిసరి.

ఇక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క హదీస్: “అర్రాహిమూన యర్హముహుముర్-రహ్మాన్, ఇర్హమూ మన్ ఫిల్-అర్ది యర్హమ్కుమ్ మన్ ఫిస్-సమా” (الرَّاحِمُونَ يَرْحَمُهُمُ الرَّحْمَٰنُ، ارْحَمُوا مَنْ فِي الْأَرْضِ يَرْحَمْكُمْ مَنْ فِي السَّمَاءِ). (కరుణించే వారిని కరుణామయుడైన అల్లాహ్ కరుణిస్తాడు. మీరు భూమిపై ఉన్నవారిని కరుణించండి, ఆకాశంలో ఉన్నవాడు (అల్లాహ్) మిమ్మల్ని కరుణిస్తాడు).

అల్లాహు తాలా మనందరికీ కూడా అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్లను మంచి రీతిలో అర్థం చేసుకుని దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని కలిగి ఉండే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

అర్రహ్మానిర్రహీమ్ – అర్థ భావాలు & తఫ్సిర్ (సూర ఫాతిహా 1:2) [వీడియో]

అర్రహ్మానిర్రహీమ్ – అర్థ భావాలు & తఫ్సిర్ (సూర ఫాతిహా 1:2) [వీడియో]
https://youtu.be/2B_bklWsHhY [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb