https://youtu.be/f3JxMD2bySA [33 నిముషాలు]
వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
మదయన్ ప్రాంత వాసులు అరబ్బులు. వారు మఆన్ రాజ్యంలో నివసించే వారు. నేడు ఇది సిరియాలో ఒక భాగంగా ఉంది. వారు అత్యాశ పరులైన ప్రజలు. వారికి అల్లాహ్ ఉనికి పట్లఎలాంటి నమ్మకం ఉండేది కాదు. అన్ని విధాల చెడులతో నిండిన జీవితాన్ని వారు గడిపేవారు. తూనికలు కొలతలో మోసాలు చేసేవారు. తాము అమ్మే వస్తువులలోని లోపాలు దాచి చాలా గొప్ప వస్తువులుగా పొగిడే వారు. వినియోగదారులకు అబద్దాలు చెప్పి మోసగించే వారు.
వారి వద్దకు అల్లాహ్ తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం).ఆయనకు అల్లాహ్ కొన్ని మహత్తులు కూడా ఇచ్చి పంపాడు. షుఐబ్ (అలైహిస్సలాం) వారికి హితబోధ చేయడం ప్రారంభించారు. అల్లాహ్ అనుగ్రహాలను ఎల్లప్పుడుగుర్తుంచుకోవాలని, దుర్మార్గానికి పాల్పడితే తీవ్రమైన ఫలితాలు చవి చూడవలసి వస్తుందని వారికి బోధించారు. కాని వారు ఆయన్ను ఎగతాళి చేశారు. అపహసించారు. షుఐబ్ (అలైహిస్సలాం) సహనంగా, తనకు వారితో ఉన్న బంధుత్వాన్ని గుర్తు చేస్తూ, తాను చేస్తున్నది తన స్వంత ప్రయోజనంకో సం కాదని వారికి నచ్చజెప్పడానికిప్రయత్నించారు.
వారు ఆగ్రహించి షుఐబ్ (అలైహిస్సలాం),ఆయన అనుచరుల వస్తు సంపద మొత్తం లాక్కున్నారు. వారిని పట్టణం నుంచి బయటకు తరిమి వేశారు. ప్రవక్త షుఐబ్ (అలైహిస్సలాం) దేవుని సహాయం కోసం ప్రార్థించారు. ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. అల్లాహ్ ఆ పట్టణం పైకి బొబ్బలెక్కించే వేడిని పంపాడు. ఈ వేడికి వారు అల్లాడి పోయారు. ఆకాశంలో ఒక మేఘాన్ని చూసి హమ్మయ్య ఇక చల్లగా వర్షం పడుతుందని భావించారు.కాని ఆ మేఘం తీవ్ర గర్జనలతో పిడుగులు కురిపించింది. పైనుంచి గుండెలవిసే ఉరుములు వినబడ్డాయి. వాటి శబ్దానికి వారి కాళ్ళ క్రింది భూమి కంపించింది. భయభీతులతో దుర్మార్గులు నాశనమయ్యారు. దుర్మార్గుల అంతాన్ని దూరంగా నిలబడి షుఐబ్ (అలైహిస్సలాం) చూశారు.
“ఓ ప్రజలారా! ప్రభువు సందేశాన్ని నేను మీకు చేరవేశాను. మీకు మంచిసలహాలు ఇచ్చాను. సత్యాన్ని తిరస్కరించిన ప్రజల పట్ల నేను ఎలాసానుభూతి చూపగలను” అన్నారు.
(ఇంకా చదవండి దివ్యఖుర్ఆన్: 7:85-93, 11:84-95, 26-176-191, 29:36-37)
గ్రహించ వలసిన పాఠాలు
(1) సంస్కరణ కర్త ఎల్లప్పుడు ప్రజలకు నచ్చజెబుతూ ఉండాలి. హోదా, పదవి, సంపద వగైరాలు పొందాలన్న ఉద్దేశ్యాలు అతనిలో ఉండరాదు.కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పనిచేయాలి.
(2) తూనికలు కొలతల్లో ప్రజలు మోసాలు చేయకుండా వారిని మార్చడానికి షుఐబ్ (అలైహిస్సలాం) చాలా ప్రయత్నించారు. వస్తువులను వాటి వాస్తవ పరిస్థితికి మించి పొగడడాన్ని ఇస్లామ్ అంగీకరించదు. వాటిలో లోపాలను స్పష్టంగా తెలియ జేయాలని ఆదేశిస్తుంది. నిజాయితీ అన్నది ఇస్లామ్ లో ఒక విధానం మాత్రమే కాదు, అన్ని వ్యవహారాల్లోనూ ఇదే ముఖ్యమైన సూత్రం.
(3) అవినీతికరమైన వ్యవహారాల్లో అల్లాహ్ తన అనుగ్రహాన్ని చూపడు.నేరస్తులను తీవ్రంగా శిక్షిస్తాడు. అల్లాహ్ యొక్క శిక్ష విభిన్న విధాలుగా ఉంటుంది.
ఇతర లింకులు:
- ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets - ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8