శీతాకాలం ఆదేశాలు, మర్యాదలు – జుమా ఖుత్బా [ఆడియో & టెక్స్ట్]

శీతాకాలం ఆదేశాలు, మర్యాదలు – జుమా ఖుత్బా
https://youtu.be/94K03YKJMVg [14 నిముషాలు]
ఖతీబ్ ( అరబీ భాష): షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ ﷾.
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.

ఈ ఖుత్బాలో, షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవి శీతాకాలం యొక్క ప్రాముఖ్యత మరియు ఒక ముస్లిం జీవితంలో దాని స్థానం గురించి వివరించారు. రుతువుల మార్పు అల్లాహ్ యొక్క జ్ఞానానికి నిదర్శనమని, శీతాకాలం నరకంలోని చలిని మరియు స్వర్గంలోని అనుగ్రహాలను గుర్తు చేస్తుందని తెలిపారు. చలికాలంలో పేదలకు సహాయం చేయడం, ఉపవాసాలు ఉండటం మరియు రాత్రి నమాజులు చేయడం వంటి పుణ్యకార్యాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఇది విశ్వాసికి ఒక వసంత కాలం లాంటిదని, ఈ సమయంలో చేసే ఆరాధనలు అల్లాహ్ కు చాలా ఇష్టమైనవని వివరించారు. అలాగే చలిలో వుదూ చేయడం, అనారోగ్యం పట్ల సరైన దృక్పథం కలిగి ఉండటం మరియు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తుచేసుకోవడం వంటి విషయాలను కూడా ప్రస్తావించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

పదిహేనవ డిసెంబర్ 2023, జుమా రోజున ఫదీలతుష్ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవి హఫిదహుల్లాహ్ ఇచ్చినటువంటి జుమా ఖుత్బా అనువాదం, “అష్షితా అహ్ కామ్ వ ఆదాబ్” – శీతాకాలం ఆదేశాలు మరియు మర్యాదలు. దీనినే మనం మరింత వివరంగా అర్థం కావడానికి “కాలాల మార్పులో గుణపాఠాలు” మరియు “శీతాకాలం విశ్వాసికి వసంతం” అన్నటువంటి పేర్లతో మీ ముందు తీసుకురావడం జరిగింది.

ఓ ముస్లింలారా! అల్లాహ్‌ జ్ఞానంలోని సూచనల్లో ఒకటి ఋతువులను వైవిధ్యపరచడం: చలి మరియు వేడి, కరువు మరియు వర్షం, పొడవైన రోజులు మరియు చిన్న రాత్రులు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ఆదేశించాడు సూరతున్ నూర్, సూర నెంబర్ 24, ఆయత్ నెంబర్ 44 లో:

يُقَلِّبُ اللَّهُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ
(యుఖల్లిబుల్లాహుల్ లైల వన్నహార్, ఇన్న ఫీ జాలిక ల ఇబ్రతల్ లి ఉలిల్ అబ్సార్)
అల్లాహ్‌ రేయింబవళ్ళను మారుస్తూ ఉంటాడు. కళ్లున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. (నూర్ 24:44).

అలాగే సూరతుల్ ఫుర్ఖాన్, సూర నెంబర్ 25, ఆయత్ నెంబర్ 61, 62 లో తెలిపాడు:

تَبَارَكَ الَّذِي جَعَلَ فِي السَّمَاءِ بُرُوجًا وَجَعَلَ فِيهَا سِرَاجًا وَقَمَرًا مُّنِيرًا * وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ أَرَادَ أَن يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ أَرَادَ أَن يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا

ఆకాశంలో బురుజులను నిర్మించి, అందులో ప్రజ్వలమైన దీపాన్ని, కాంతిమంతమైన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు. ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది. (ఫుర్ఖాన్ 25:61,62)

ఇప్పుడు ఈ శీతాకాలం తన చలితో మన ముందుకు వచ్చింది. ఇది అల్లాహ్‌ యొక్క స్పష్టమైన సూచనల్లో ఒకటి, ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇంకా ఏమి గుర్తు చేస్తుంది!?

బుఖారీ 3260 మరియు ముస్లిం 617లో ఉంది: హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త ﷺ ఇలా అన్నారు:

»اشْتَكَتِ النَّارُ إِلَى رَبِّهَا فَقَالَتْ: رَبِّ أَكَلَ بَعْضِي بَعْضًا، فَأَذِنَ لَهَا بِنَفَسَيْنِ: نَفَسٍ فِي الشِّتَاءِ وَنَفَسٍ فِي الصَّيْفِ، فَأَشَدُّ مَا تَجِدُونَ مِنَ الحَرِّ، وَأَشَدُّ مَا تَجِدُونَ مِنَ الزَّمْهَرِيرِ«

“నరకం తన ప్రభువుతో ఫిర్యాదు చేసింది: ‘ఓ ప్రభూ! నా కొంత భాగం మరొక భాగాన్ని తినేస్తోంది.’ అప్పుడు అల్లాహ్‌ దానికి రెండు శ్వాసల గురించి అనుమతించాడు: ఒకటి శీతాకాలంలో, మరొకటి వేసవిలో. అందువల్ల మీరు అనుభవించే అత్యంత వేడి దాని తీవ్రమైన వేడిలోనిది, మరియు మీరు అనుభవించే అత్యంత చలి దాని ‘జమ్ హరీర్’ లోనిది.”

జమ్ హరీర్ – నరకంలోని అత్యంత చలి ఉండే ప్రదేశం. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు వస్తున్నాయి, శ్రద్ధగా వింటూ ఉండండి.

అల్లాహ్‌ ఇలా తెలిపాడు:

مُتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا
(ముత్తకి’ఈన ఫీహా అలల్ అరాయికి లా యరౌన ఫీహా షమ్సన్ వలా జమ్ హరీరా)
వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని గానీ, చలి తీవ్రతను గానీ చూడరు“. (ఇన్సాన్ 76:13).

చూశారా? సూరతుల్ ఇన్సాన్ సూర నెంబర్ 76 లోని ఈ 13 వ ఆయత్ లో “వలా జమ్ హరీరా” అని ఏదైతే ఉందో, చలి తీవ్రతను కూడా చూడరు అన్నటువంటి అనువాదం ఇక్కడ చేయడం జరిగింది. 

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఇలా వ్యాఖ్యానించారు: “అంటే వారికి బాధాకరమైన వేడి కూడా లేదు, బాధాకరమైన చలి కూడా లేదు. ఇది శాశ్వతమైన సుఖమే.”

అల్లాహ్‌ ఇలా చెప్పాడు:

هَذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
(హాజా ఫల్ యజూఖూహు హమీమున్ వ గస్సాఖ్)
ఇదీ (వారి గతి)! దాన్ని వారు రుచి చూడాలి. మరిగే నీళ్లు, చీము నెత్తురు. (సాద్ 38:57).

لَايَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا • إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
(లా యజూఖూన ఫీహా బరదన్ వలా షరాబా, ఇల్లా హమీమన్ వ గస్సాఖా)
వారందులో ఎలాంటి చల్లదనాన్నిగానీ, త్రాగటానికి ఏ పానీయాన్నిగానీ, రుచిచూడరు. మరిగే నీరు, (కారే) చీము తప్ప. (నబా 78:25)

ఇవి నరకంలో ఉన్న వారు ఎదుర్కొనే రెండు కఠిన శిక్షలు. తీవ్ర వేడి అంటే ఇక్కడ వేడి వేడి నీరు హమీమన్, మరియు గస్సాఖ్ అని ఏదైతే చెప్పడం జరిగిందో, తీవ్ర చలి అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది.

ఇళ్ల ఆశ్రయం, దుస్తులు, హీటర్లు, వెచ్చదనం ఇవన్నీ అల్లాహ్‌ దయ, అనుగ్రహాలు. అల్లాహ్‌ ఇలా తెలిపాడు:

وَاللَّهُ جَعَلَ لَكُم مِّن بُيُوتِكُمْ سَكَنًا
(వల్లాహు జ’అల లకుమ్ మిన్ బుయూతికుమ్ సకనా)
అల్లాహ్‌ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. (16:80)

وَجَعَلَ لَكُمْ سَرَابِيلَ تَقِيكُمُ الْحَرَّ وَسَرَابِيلَ تَقِيكُم بَأْسَكُمْ
(వ జ’అల లకుమ్ సరాబీల తఖీకుముల్ హర్ర వ సరాబీల తఖీకుమ్ బ’సకుమ్)
ఇంకా ఆయనే మీకోసం, మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షణ కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. (నహ్ల్ 16:81)

మరియు పశువుల గురించి ఇలా తెలిపాడు:

وَلَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ
(వలకుమ్ ఫీహా దిఫ్’ఉన్ వ మనాఫి’ఉ)
వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. (నహ్ల్ 16:05).

అంటే వాటి ఉన్ని, వెంట్రుకలు, బొచ్చుతో మనం దుస్తులు, దుప్పట్లు తయారు చేస్తాము.

మన ఇళ్లల్లో హీటర్లు, దుప్పట్లు, వేడి దుస్తులు అదనంగా, అవసరానికి మించి ఉంటే మన చుట్టూ కొన్ని కుటుంబాలు తీవ్ర చలిలో వణుకుతున్నాయి. ఇది విశ్వాసుల బాధ్యత: పేదలను గమనించడం, సహాయం చేయడం.

ప్రవక్త ﷺ చెప్పారు:

»مَثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ، وَتَرَاحُمِهِمْ، وَتَعَاطُفِهِمْ مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَدَاعَى لَهُ سَائِرُ الْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمَّى «
విశ్వాసులు పరస్పరం అభిమానించుకోవటంలో మరియు ప్రేమావాత్సల్యాలతో మెలగటంలో ఒక అవయవానికి బాధకలిగినప్పుడు మొత్తం దేహమంతా బాధతో, జబ్బుతో మూలుగుతుంది. (ముస్లిం 2586).

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హువారి నసీహత్ గుర్తు చేస్తుంది

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు ప్రజలకు ఇలా వ్రాసేవారు: “చలి శత్రువు లాంటిది. చలికి సిద్ధంగా ఉండండి. ఉన్నితో, సాక్స్‌లతో, దుప్పట్లతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటే వేడిగా ఉంచుకోండి. ఎందుకంటే చలి శరీరంలో త్వరగా ప్రవేశిస్తుంది, నెమ్మదిగా వెళ్తుంది.”

ప్రవక్త ﷺ అన్నారు:

«الغَنِيمَةُ البَارِدَةُ الصَّوْمُ فِي الشِّتَاءِ»
(అల్ గనీమతుల్ బారిదతు అస్సౌము ఫిష్షితా)
శీతకాలంలో ఉపవాసాలు కష్టం లేని యుద్ధ ఫలం లాంటిది. (తిర్మిజి 797. షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు:

الشتاء غنيمةُ العابدينَ
“అష్షితా ఉ గనీమతుల్ ఆబిదీన్” 
శీతాకాలం ఆరాధకులకు గొప్ప అదృష్ట సమయం.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు చెప్పారు:

مرحبًا بالشتاء تنزل فيه البركة، ويطول فيه الليل للقيام، ويقصر فيه النهار للصيام”
“మర్ హబమ్ బిష్షితా ఇ తన్జిలు ఫీహిల్ బరక, వ యతూలు ఫీహిల్ లైలు లిల్ ఖియామ్, వ యఖ్ సురు ఫీహిన్ నహారు లిస్సియామ్” 
“శీతాకాలానికి స్వాగతం, అందులో బర్కత్ (శుభం) దిగుతుంది, తహజ్జుద్ కొరకు రాత్రి పొడుగ్గా ఉంటుంది, ఉపవాసం కొరకు పగలు చిన్నగా ఉంటుంది.”

ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు మరణ సమయంలో ఏడుస్తూ చెప్పారు:

إنما أبكي على ظمأ الهواجر، وقيام ليل الشتاء، ومزاحمة العلماء بالركب عند حِلَق الذكر.
“ఇన్నమా అబ్కీ అలా దమఇల్ హవాజిర్ వ ఖియామి లైలిష్ షితా వ ముజాహమతిల్ ఉలమా ఇ బిర్రుకబి ఇంద హిలఖిద్ దిక్ర్” 
“నేను మూడు వాటికోసమే ఏడుస్తున్నాను: వేసవి ఉపవాసంలోని దాహం, శీతాకాల రాత్రి ప్రార్థనలు, పండితులతో (నేర్చుకొనుటకు) కూర్చోవడం.”

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో అడిగారు: 

»ألا أدلُّكم على ما يمحو الله به الخطايا ويرفعُ به الدرجاتِ؟» قالوا: بلى يا رسول الله.قال: «إسباغُ الوضوءِ على المكارهِ«

అల్లాహు తఆలా ఏ కారణంగా మీ పాపాలను తుడిచివేసి మీ స్థానాలను పెంచుతాడో తెలుపనా?” తప్పక తెలుపండి ప్రవక్తా! అని సహాబాలు అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు: “అనుకూల సమయసందర్భం కాకపోయినా సంపూర్ణంగా వుజూ చేయడం

తీవ్రమైన చలిలో వుజూ పూర్తి చేయడం పుణ్యం పెంచుతుంది, అయితే అవసరమైతే నీటిని వేడి చేయడం అనుమతే. చలి తీవ్రమై వుజూ చేయలేకపోతే తయ్యమ్ముమ్ కూడా అనుమతి ఉంది.

ఉమ్ము సాయిబ్ రజియల్లాహు అన్హాకు తీవ్రమైన జ్వరం వచ్చి బాధపడుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను పరామర్శించి, ఇంతగా వణుకుతున్నావు ఏమిటి అని అడిగారు.

అందుకు ఆమె:

لَا بَارَكَ اللهُ فِيهَا
“లా బారకల్లాహు ఫీహా” 
‘అల్లాహ్ ఈ జ్వరంలో వృద్ధి కలుగుజేయకూడదు’ అని పలికింది.

అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు:

»لَا تَسُبِّي الْحُمَّى، فَإِنَّهَا تُذْهِبُ خَطَايَا بَنِي آدَمَ كَمَا يُذْهِبُ الْكِيرُ خَبَثَ الْحَدِيدِ«
(లా తసుబ్బిల్ హుమ్మా, ఫఇన్నహా తుజ్హిబు ఖతాయా బనీ ఆదమ, కమా యుజ్హిబుల్ కీరు ఖబసల్ హదీద్)
నీవు జ్వరాన్ని తిట్టకు (దూషించకు), ఎందుకంటే బట్టి ఇనుము తుప్పు (జంగు)ను దూరం చేసినట్లు ఈ జ్వరం ఆతం సంతతి పాపాలను దూరం చేస్తుంది. (ముస్లిం 2575).

ఓ అల్లాహ్‌ దాసులారా! అల్లాహ్‌కు భయపడండి — బహిర్గతంగా గానీ, అంతరంగంలో గానీ. అల్లాహ్‌ సూర బఖర 2:216లో ఇలా తెలిపాడు:

وَعَسَى أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ … وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
వ ‘అసా అన్ తక్రహూ షై’అన్ వహువ ఖైరుల్ లకుమ్ వల్లాహు య’అలము వ అన్తుమ్ లా త’అలమూన్. )
మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. … నిజ జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. మీకు ఆ విషయం తెలియదు.

అల్లాహ్‌ ఈ శీతాకాలాన్ని మనపై మరియు సమస్త ముస్లింలపై కరుణ, శాంతి, రక్షణతో నింపుగాక. మన సోదర సోదరీమణుల అవసరాలను తీర్చేలా మనందరిని ప్రేరేపించుగాక. ఆమీన్.

వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42485