షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు [వీడియో & టెక్స్ట్ ]

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్మతుల్లాహి అలైహి) యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర, మరియు ప్రత్యేకంగా గ్యారవీ (రబీఉస్సానీ నెల 11 వ రోజు) గురించి నిజమైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకోగలరు

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు
https://www.youtube.com/watch?v=akZ884vCLw4 [35నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) గారి జీవిత చరిత్ర, ఆయన వంశం మరియు విద్య గురించి క్లుప్తంగా వివరిస్తారు. ఆయన తౌహీద్ (ఏకదైవారాధన) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అనుసరించడంపై చేసిన స్పష్టమైన బోధనలను ఉటంకిస్తారు. అనంతరం, రబీఉల్-ఆఖర్ నెలలో ఆయన పేరు మీద జరిగే ‘గ్యారవీ’ మరియు జెండాలు ఎగురవేయడం వంటి ఆచారాలను తీవ్రంగా ఖండిస్తారు. ఈ పనులు షిర్క్ మరియు బిద్అత్ (ధర్మంలో నూతన కల్పనలు) అని, ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేస్తారు. ఆయన పట్ల గౌరవం చూపించడం మరియు ఆయన విషయంలో అతిశయోక్తికి పాల్పడటం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ, సరైన మధ్య మార్గాన్ని అనుసరించాలని ఉద్బోధిస్తారు. చివరగా, ఇటువంటి మూఢనమ్మకాలకు, కల్పిత కథలకు దూరంగా ఉండి, ఖుర్ఆన్ మరియు సున్నత్‌ను మాత్రమే అనుసరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిస్తారు.

السلام عليكم ورحمة الله وبركاته
[అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد
[అల్ హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్]
సర్వ స్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్ కే. ఆయన తర్వాత ఏ ప్రవక్త లేరో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఇక అసలు విషయానికొస్తే…

మహాశయులారా, పీరానే పీర్, మహబూబే సుబ్ హానీ, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ వారి యొక్క జీవితం మరియు సంక్షిప్తంగా వారి జీవిత చరిత్రతో పాటు వారి యొక్క ముఖ్య బోధనలు ఇంకా రబీఉస్సానీ, రబీఉల్-ఆఖర్ ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఈ నాలుగోవ నెల ఇందులో సామాన్యంగా మన దేశాల్లో పీరానే పీర్ పేరు మీద కొత్త జెండాలు పెట్టడం, గ్యారవీలు చేయడం, ఇంకా ఇలాంటి దురాచారాలు ఏదైతే చేస్తున్నారో వాటి వాస్తవికత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

సోదర మహాశయులారా, పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై హిజ్రీ శకం 470 లేదా 471లో జన్మించారు. ఆయన జన్మించిన స్థలం ఇరాక్ లో జీలాన్ మరియు అలాగే కీలాన్ అని కూడా అనబడింది. కానీ జీలానీ అన్న పేరుతో చాలా ప్రఖ్యాతి గాంచారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు మనమలు హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుసైన్ రదియల్లాహు అన్హుమా వీరిద్దరిలో హజ్రత్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వంశానికి చెందినవారు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై.

యవ్వనంలో చేరిన తర్వాత ఇంచుమించు సుమారు 17, 18 సంవత్సరాల వయసులో బగ్దాద్ లో వచ్చారు. ఆనాటి కాలంలో బగ్దాద్ లో ప్రఖ్యాతిగాంచిన చాలా గొప్ప పండితులు ఉన్నారు. వారితో విద్య అభ్యసించారు.

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై సుమారు 90 సంవత్సరాల వయసు అల్లాహ్ వారికి ఇచ్చారు. ఇంచుమించు 40 నుండి 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన చాలా లోతుగా, మరీ ఎంతో శ్రమించి, కష్టపడి విద్య నేర్చుకున్నారు. ధర్మ విద్యలో ఎన్నో రకాలు కేవలం ఖుర్ఆన్ హిఫ్జ్ మరియు కొన్ని హదీసులు హిఫ్జ్ చేసుకోవడమే కాదు, ఇందులో ఉసూలె తఫ్సీర్, తఫ్సీర్, ఉసూలె హదీస్, హదీస్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్ ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా తజ్కియె నఫ్స్ అంటే మనశ్శుద్ధి, మనిషి యొక్క మనసు ఎల్లప్పుడూ పరలోక విషయంలో ఆలోచిస్తూ ఉండే విధంగా, ఇహలోక జీవితంలోని క్షణం క్షణం కూడా పరలోక లాభానికై గడిపేటువంటి ఆలోచన మనసులో రావాలి. దాని గురించి కొన్ని ప్రత్యేక శిక్షణలు ఇస్లాం ఇచ్చిన ఆదేశ ప్రకారం, వేరే తసవ్వుఫ్ మరియు కొన్ని బిద్అతులు తసవ్వుఫ్ పేరు మీద ఏదైతే మొదలయ్యాయో అలా కాకుండా, అందులో కూడా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ప్రఖ్యాతిగాంచారు.

ఇంకా మహాశయులారా, విద్య అభ్యసించే కాలంలో ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చాయి. ఎన్నెన్నో రోజులు తినడానికి బుక్కెడు కూడు దొరికేది కాదు. అలాంటి కష్టాలను కూడా ఆయన భరించారు. ఆ తర్వాత అల్లాహు తఆలా ఇంచుమించు 40 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువగా ఆయన ప్రజలకు ఇక విద్య నేర్పడం మొదలుపెట్టారు అంటే అందులో కూడా అల్హందులిల్లాహ్ అల్లాహు తఆలా చాలా సేవలు ఆయన నుండి తీసుకున్నాడు. అల్లాహ్ తఆలా వాటన్నిటినీ స్వీకరించి, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై సమాధిని అల్లాహ్ నూర్ తో, కాంతితో నింపుగాక. అల్లాహు తఆలా ఆయన యొక్క సమాధిలో స్వర్గపు ద్వారాలు తెరువగాక. ఎల్లవేళల్లో అల్లాహు తఆలా తన కరుణా కటాక్షాలు ఆయనపై కురిపిస్తూ ఉండుగాక. మరియు అల్లాహు తఆలా ఆయనతో సంతోషించి ఆయన ఇహలోకంలో ఇన్ని సత్కార్యాలు చేశారో వాటన్నిటిని స్వీకరించి, ఆయనతో జరిగిన పొరపాట్లను అల్లాహ్ క్షమించుగాక, మన్నించుగాక. ఆమీన్.

మహాశయులారా, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారు కొన్ని పుస్తకాలు, గ్రంథాలు కూడా రచించారు. అందులో “గునియతుత్ తాలిబీన్” అని చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇంకా వేరే కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. మరియు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై వారు వారి యొక్క బోధనలు, వారు తమ గ్రంథంలో రాసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే, చదివితే మరియు వారి పేరు తీసుకొని ఈ రోజుల్లో ఎవరెవరైతే గ్యారవీలు, జెండాలు ఇట్లా అన్నీ చేస్తున్నారో వారి యొక్క పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా కనబడుతుంది.

ఉదాహరణకు, తౌహీద్ విషయంలో ఒక సందర్భంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై చెప్పారు, “ఓ ప్రజలారా, ఏ సృష్టి చేతిలో కూడా ఎలాంటి అధికారం లేదు. అందరూ కూడా బలహీనులు మరియు ఇహలోకంలో ఎవరైనా రాజు అయినా, ప్రజా అయినా, సిరిసంపదలు గలవాడైనా లేక పేదవాడైనా అందరూ కూడా అల్లాహ్ విధివ్రాతకు లొంగిబడి ఉన్నారు. వారందరి యొక్క హృదయాలు కేవలం అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. అల్లాహ్ తాను కోరినట్లు వారి యొక్క హృదయాలను మారుస్తూ ఉంటాడు.” ఈ విషయం ఆయన రచించిన ఒక గ్రంథం “అల్-ఫత్హుర్ రబ్బానీ” అని 88వ పేజీలో ఉంది.

ఇంకా మహాశయులారా, ఇదే గ్రంథంలోని 191వ పేజీలో,

“ఓ ప్రజలారా, షరీఅత్ ను అనుసరించండి. బిద్అత్లను మీరు కల్పించకండి. మీరు షరీఅత్ ను అనుసరిస్తూ దాని వ్యతిరేకత నుండి దూరం ఉండండి. అల్లాహ్ యొక్క మాట విని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. ఎప్పుడూ కూడా అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు అవిధేయులుగా కాకండి. తమలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి మీరు పాటించే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా షిర్క్ మరియు దాని దరిదాపులకు తాకకండి. ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటుతూ ఉండండి. అల్లాహ్ యొక్క దర్బార్, అల్లాహ్ యొక్క ముందు నుండి మీరు దూరం కాకండి. కేవలం అల్లాహ్ తో మాత్రమే అర్ధించండి. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి ముందు కూడా మీరు మీ చెయ్యి చాపకండి. ఏ సహాయమైనా గాని అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కోరకండి. కేవలం అల్లాహ్ మీద మాత్రమే మీరు నమ్మకం, భారం వేసి ఉండండి. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరి మీద కూడా మీరు మీ నమ్మకాన్ని ఉంచుకోకండి.”

ఇంకా, ఒక సందర్భంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై తమ యొక్క శిష్యునికి బోధ చేస్తూ, “వాస్తవమైన సాఫల్యం పొందడానికి ఒక ఉత్తమమైన చిట్కా తెలుసుకో” అని ఇలా తెలిపారు, “ఒకవేళ నీవు సాఫల్యం కోరితే, నీ మనసులో నుండి, నీ హృదయంలో నుండి అల్లాహ్ తప్ప ఇతరులందరినీ కూడా తీసేసెయ్. అంటే, అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కూడా భయపడకు. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి మీద కూడా ఎలాంటి ఆశ పెట్టుకోకు. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరితోనైనా నీకు ఏదైనా శాంతి లభిస్తుంది అని కూడా నీవు ఆశించకు. ఇంకా, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా నీవు అందరినీ అసహ్యించుకొని కేవలం అల్లాహ్ ను మాత్రమే ఇష్టపడి, ఆయన ప్రేమను మాత్రమే పొందే ప్రయత్నం చెయ్.” ఇక్కడ అందరినీ అసహ్యించుకోవడము అంటే అల్లాహ్ ఎదుట. అంటే అల్లాహ్ కంటే ఎక్కువగా వేరే ఎవరినైనా ప్రేమించడం, అల్లాహ్ కంటే ఎక్కువగా ఎవరితోనైనా భయపడడం, దీన్ని ఖండిస్తున్నారు. “గమనించు, నీవు అల్లాహ్ ను కాకుండా ఎవరిదైనా ప్రేమ నీ మనసులో వచ్చింది అంటే, నీవు ఒక ముర్దార్, ఒక శవాన్ని, ఒక చనిపోయిన దానిని ఎలా చూసి నీ మనసులో ఛీ అనుకుంటావో అలా భావించు. ఎందుకంటే అల్లాహ్ యొక్క జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణ తప్ప నీకు ఎక్కడా కూడా ఆత్మశాంతి అనేది లభించదు. అల్లాహ్ ను వదిలి నీవు ఇతరులను స్మరిస్తూ ఉంటే, అల్లాహ్ ను వదిలి నీవు ఇతరులను నీవు ఇష్టపడినావంటే నీకు ఎప్పుడూ కూడా సుఖము, శాంతి లభించదు.”

ఈ విధంగా మహాశయులారా, చెబుతూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే విషయంలో కూడా ఎంతో ఖరాఖండిగా, ఎంతో క్లియర్ గా చెప్పేశారు. “ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం లేదో, అంటే ప్రవక్త తీసుకువచ్చిన ధర్మానిని అనుసరించకుండా ఆయన యొక్క అనుసరణను వదిలి ఇంకా వేరే ఎవరినైనా అనుసరణను అతడు అవలంబిస్తాడో, అతడు ఎన్నటికీ అల్లాహ్ వద్దకు చేరుకోలేడు. అల్లాహ్ యొక్క ప్రవక్త అల్లాహ్ వద్ద చేరుకోవడానికి ఒక మాధ్యమంగా వచ్చారు. ఆయనను అనుసరించడం తప్పనిసరి. ఆయన అనుసరణ ఎవరైతే వదులుకుంటారో, అతడు నాశనమైపోతాడు. నాశనమైపోతాడు, నాశనమైపోతాడు. అతడు దుర్మార్గంలో పడిపోతాడు, దుర్మార్గంలో పడిపోతాడు.” ఈ విషయం “అల్-ఫత్హుర్ రబ్బానీ” పేజీ నంబర్ 115 లో రాసి ఉంది.

ఇంతేకాకుండా ఇంకా షిర్క్ నుండి, అల్లాహ్ ను కాకుండా వేరే వారిపై నమ్మకాలు ఉంచుకునే దాని గురించి కూడా ఇంకా ఎంతో స్పష్టంగా తెలిపారు. అయితే మహాశయులారా, ఇక రండి మనం కొన్ని క్షణాల్లో ఈ రోజుల్లో జరుగుతున్న గ్యారవీ మరియు జెండాలు, గుండాలు వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మహాశయులారా, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై విషయంలో మన సమాజంలో ఒక రకం ప్రజలలో ఎలా ఉన్నారు? ఆయనను ఎంతో గొప్పగా భావించి, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ యొక్క వలీ, అల్లాహ్ యొక్క భక్తుడు అని అంటారు కానీ, ఆయన గురించి నమ్మకం, ఆయన గురించి విశ్వాసం, ఆయన గురించి మనసులో ప్రేమ, ఆయన గురించి తమ మనసులో భయం అల్లాహ్ పట్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది కొందరికి. ఇది చాలా తప్పు విషయం. చెప్పడానికి నోటితో చెబుతారు, నేను ఈ మాట అన్నందుకు “లేదు నువ్వు తప్పు చెబుతున్నావు” అని తిరుగబడతారు. కానీ నేను చెప్పే ఈ మాట వారి యొక్క రోజువారీ జీవితం ఏదైతే ఉందో, దైనందిన జీవితంలో వారి యొక్క పరిస్థితి ఏదైతే మనం కళ్ళారా చూసామో దానిని చూసి నేను చెబుతున్నాను.

ఉదాహరణకు, మన సమాజంలో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. గ్యారవీ చేయకుంటే ఈ సంవత్సరం మనకు ఏదైనా నష్టం చేకూరుతుంది. పీరానే పీర్ సాబ్ యొక్క గ్యారవీ అది చేస్తేనే కదా మనకు అన్ని రకాల బాగులు, అన్ని రకాల మంచితనాలు మన ఇంట్లో జరిగేది. చివరికి ప్రతి ఈ నెలలో కొత్త జెండాలు ఏదైతే నాటుతారో, పచ్చ జెండాలు ఏదైతే తమ ఇంటి మీద ఎగురవేస్తారో ఈ జెండాలు ఎప్పటివరకైతే పచ్చగా ఉంటాయో అప్పటివరకు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. చివరికి కొందరు పల్లెటూర్లలోని విషయం, గ్రామాల్లోని విషయం స్వయంగా నేను ఎందరో గ్రామస్థులతో విన్న విషయం. ఈ సంవత్సరం మా బర్రె ఏదైతే చనిపోయిందో, ఈ సంవత్సరం మా పంటలో, పొలంలో ఏదైతే నష్టం జరిగిందో ఎవడో మొల్వి సాబ్ అట వాడు వచ్చి చెప్పిండు గ్యారవీ చేయొద్దు అని. అందు గురించి మేము చేయడం మానేసుకున్నాము. మాకు ఇదంతా నష్టం జరిగింది. పీరానే పీర్ సాబ్ మా మీద ఎంత కోపంగా ఉన్నాడో ఏమో మేము ఆయన పేరు మీద ఈ సంవత్సరం గ్యారవీ చేయలేదని. ఈ విధంగా వారి యొక్క నమ్మకాలు ఉన్నాయి.

వారు అల్లాహ్ ఎవరు అని అడిగితే మీరు “అల్లాహ్ ఒక్కడే, మన యొక్క దేవుడు” అని అంటారు. మన యొక్క ఆరాధనీయుడు అని అంటారు. అందరికంటే ఎక్కువగా ఎవరితో భయపడతావు అని అంటే “అల్లాహ్ తో” అని అంటారు. ఎవరి మీద నీకు నమ్మకం అనేది ఉంటే “అల్లాహ్ మీద” అని అంటారు. అయితే కేవలం నోటితో అనడం సరిపోదు సోదరులారా. వారి యొక్క జీవితంలో వ్యవహారం ఎలా ఉంది? ఏదైనా నష్టం జరిగింది అంటే “అయ్యో ఫలానా దర్గా కాడికి మేము పోలే కదా. మేము ఫలానా పీరానే పీర్ సాబ్ యొక్క చిల్లాఖానా నుండి మేము దాటాము కానీ కనీసం మేము అక్కడ కొంచెం చందా కూడా ఇయ్యలేదేమో, నజరానా వేయలేదు. అందుగురించి వాళ్ళ యొక్క పీడ మా మీద పడింది.” ఇది ఏంటి? లాభనష్టాలు అల్లాహ్ కాకుండా, అల్లాహ్ చేతిలో కాకుండా ఇంకా వేరే వారి చేతిలో కూడా ఉన్నాయి అని నమ్మడమే కదా! అందు గురించి మనం మహాశయులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఏమంటున్నారు? “నీ మనసులో నుండి అల్లాహ్ తప్ప ఇతరులందరినీ తీసేసెయ్. అల్లాహ్ పట్ల మాత్రమే ప్రేమ, అల్లాహ్ తో మాత్రమే భయం, అల్లాహ్ తో మాత్రమే ఆశ, అల్లాహ్ మీదనే నమ్మకం నీవు ఉంచుకో. అప్పుడే నీవు సాఫల్యం పొందుతావు” అని పీరానే పీర్ రహమతుల్లాహి అలై గారు తెలుపుతున్నారు.

ఒక రకం మన ప్రజలలో ఇలాంటి వారు. ప్రజలు కొందరు ఇలా చేస్తున్నారు అని మరికొందరు ఏక్ దం అపోజిట్ గా మారుతారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ ప్రవక్తనా? ఏమైనా నబీనా? మనం వారిని అంతగా పొగడడానికి, అంతగా వారిని ప్రశంసించడానికి, ఆయన యొక్క పేరు అంతగా తీసుకోవడానికి, ఆయన కూడా ఒక సామాన్య మనిషి, ఆయన యొక్క ప్రస్తావనే ఎందుకు మనం తీసుకురావాలి? అని ఏ మాత్రం విలువ లేకుండా కూడా చేస్తూ ఉంటారు. అయితే మధ్యే మార్గం అదే సరైన మార్గం ఏమిటంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘంలోని ఒక ఉత్తమ వ్యక్తి మరియు ఆయన ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ యొక్క గొప్ప వలీ అని కూడా మనం నమ్మవచ్చు. ఆయన చేసిన సేవలను బట్టి, ఆయన ఇస్లాం ధర్మ వ్యాప్తి కొరకు ఏ సేవలైతే అందించారో వాటిని బట్టి మనం అల్లాహ్ యొక్క గొప్ప వలీ అని అనడంలో కూడా ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు.

కానీ ఎన్నో చరిత్ర పుటల్లో మరియు ఈ రోజుల్లో రాయబడే ఎన్నో పుస్తకాల్లో కూడా ఆయన గురించి ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి. ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి. వాస్తవానికి కొన్ని సందర్భాలలో వింటే కూడా ఆ విషయాలు వింటే మన విశ్వాసం ఎక్కడ పాడైపోతుందో అన్నటువంటి భయం కూడా కలుగుతుంది.

మాకు అప్పుడు అంత జ్ఞానం లేదు ధర్మం గురించి. ఇంకా చాలా చిన్న వారిమి. బహుశా 13-14 సంవత్సరాల వయసు ఉండవచ్చు, బహుశా. రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక మస్జిద్ లో ప్రసంగం జరుగుతుంది. ఈ రోజు ఇంత రాత్రి ప్రసంగం ఏంటి? ఇషా నమాజ్ అయిపోయి గంట, రెండు గంటలు అయిపోయింది కదా అని అక్కడ కొంతసేపు వెళ్లి కూర్చున్నాము. బహుశా అది ఈ రబీఉల్ ఆఖర్ నెల, ప్రజలు కొందరు ఏమంటారు దీన్ని? గ్యారవీ కా మహినా. రబీఉల్ ఆఖర్, రబీఉస్సానీ అని కూడా గుర్తు లేదు. అయితే అక్కడ మౌల్వీ సాబ్ ప్రసంగం చేస్తూ చేస్తూ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క కరామతులు తెలుపుతూ నఊదు బిల్లాహ్, సుమ్మ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ ఒక వ్యక్తి ఏమన్నాడు మాట్లాడుతూ, అల్లాహు తఆలా మరియు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇద్దరూ, మన వాడుక భాషలో ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే, వాకింగ్ చేస్తున్నారు ఆకాశం మీద. నడుస్తూ నడుస్తూ నఊదు బిల్లాహ్, సుమ్మ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ నకలె కుఫ్ర్ కుఫ్ర్ న బాషద్, అల్లాహ్ యొక్క కాలు జారిపడిందంట నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ అల్లాహ్ ను పట్టుకున్నాడంట. అందు గురించే అప్పటి నుండి ఆయన పేరు దస్తగీర్ అని పడ్డది. ఈ బిరుదు ఆయనకు లభించినది. దస్తగీర్ ఈ పేరు, ఈ బిరుదు ఎలా లభించినది అని వావ్ వావ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పట్ల ఎలాంటి పరిహాసం జరుగుతుంది? ఎలాంటి అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారో ప్రజలు దీన్ని గమనించడం లేదు.

కానీ అస్తగ్ఫిరుల్లాహ్ మనం నేను ఈ మాట చెప్పినప్పుడు ఇలాంటి మాటలు ఎవరూ చెప్పరు అని అంటారు. కానీ అక్కడ వారి పండితులు చెప్పే యొక్క ఆ విధానం, ఉర్దూలో సామాన్యంగా మేము విన్న విషయాలు కదా ఇవి, ఇప్పుడు నేను వాటిని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ ఉర్దూలో పాడుకుంటూ ఎంతో ఆ..ఆ అనుకుంటూ ఏదైతే చెబుతారో దాంట్లో ప్రజలు అల్లాహ్ పట్ల ఎలాంటి అవిశ్వాస మాటలు, పరిహాసం జరుగుతుంది అది ఆలోచించరు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క గొప్పతనం గురించి ఆలోచించుకుంటూ వారు వెళ్తారు. అదే ధోరణిలో వారికి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆయనను ప్రశంసించడం, ఆయన యొక్క గొప్ప విషయాలు అన్నట్టుగా వారు అర్థం చేసుకుంటారు. కానీ సోదరులారా, ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటి తప్పుడు భావనలు.

ఇంకో మాట కొందరితో విన్నాను. నేను స్వయంగా వినలేదు కానీ ఎంతోమంది చెప్పారు. వారు విన్నారు ప్రసంగాలలో అని. ఒక ముసలామె ఆమెకు కేవలం ఒకే ఒక కొడుకు ఉండేనట. అయితే ఆ కొడుకు చనిపోతే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ వద్దకు ఆమె వచ్చింది. చాలా బతిమిలాడింది. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ డైరెక్ట్ ఆదేశించాడంట మలకుల్ మౌత్ కు. ప్రాణాలు తీసే ఆత్మ దూత ఎవరైతే ఉన్నారో ఆయనకు మలకుల్ మౌత్ కు “నీవు ఈ రోజు ఆ అబ్బాయి యొక్క ప్రాణం ఏదైతే తీసుకున్నావో తిరిగి వేసెయ్. ఆ అబ్బాయి యొక్క అవసరం ఆ అతని యొక్క తల్లి ముసలామెకు చాలా ఉంది అని.” నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. మలకుల్ మౌత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మాట వినలేదంట. దాని మూలంగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కోపంతో ఆయన ఆ రోజు ఎవరెవరి ప్రాణాలైతే తీసుకుని పోతున్నాడో ఆ సంచిని కొట్టేస్తే, ఎంతమంది ప్రాణాలు ఆ రోజు తీసుకోబడ్డాయో వారందరూ బ్రతికిపోయారంట నఊదు బిల్లాహ్. ఇంకా ఇదే సంఘటనను ఇంకా వేరే ఎన్నో రకాలుగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కొందరు.

ఏంటి ఇవన్నీ విషయాలు? ఇలాంటి అతిశయం, ఇలాంటి మితిమీరిన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన విశ్వాసాలు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇలాంటి మాసాల్లో ఈ గ్యారవీల యొక్క మహఫిల్లు, సమావేశాలు ఏదైతే జరుగుతాయో అందరూ కొందరు ప్రసంగం చేసేవారు, ప్రసంగిస్తూ ఈ మాటలు చెబుతూ ఉంటారు.

అయితే మహాశయులారా, ఇలాంటి విశ్వాసాలకు, ఇలాంటి తప్పుడు ధోరణికి, ఇలాంటి మూఢనమ్మకాలకు మనం చాలా దూరం ఉండాలి. ఆయన అల్లాహ్ యొక్క మంచి భక్తులు, ఇస్లాం వ్యాప్తి కొరకు చాలా ప్రయత్నం చేశారు, చాలా కృషిపడ్డారు. ఇస్లాం అభ్యాసన గురించి మరియు తర్వాత ఇస్లాం యొక్క శిక్షణ ప్రజలకు ఇవ్వడానికి చాలా ఆయన యొక్క త్యాగాలు ఉన్నాయి. అల్లాహ్ తఆలా వాటన్నిటినీ స్వీకరించుగాక అని మనం చెప్పాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలలో మనం వెళ్ళకూడదు.

ఇక గ్యారవీ విషయం నఊదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. కొందరు రాశారు కొన్ని పుస్తకాలలో. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చాలీస్వా చేసేవారంట. అంటే వారి యొక్క నమ్మకం ప్రకారంగా ఈ మాటనే తప్పు. మరియు ఒకవేళ ఈ మాట చెప్పినా గాని కొంచెం ఆలోచించి చెప్పలేదు గనుక ఆ తప్పు మరింత స్పష్టంగా కనబడుతుంది. ఏంటి? గ్యారహ్, పదకొండు రబీఉస్సానీకి చాలీస్వా చేసేవారు. పదకొండు రబీఉస్సానీకి చాలీస్వా చేసేవారు అనేది ఉంటే ఎక్కడ కుదురుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పన్నెండు రబీఉల్ అవ్వల్ కు చనిపోయారు కదా. పన్నెండు తర్వాత చాలీస్వా ఎప్పుడు వస్తుంది? నలభైవ రోజులు ఎప్పుడు వస్తాయి? రబీఉస్సానీ 22వ తారీఖు, 23వ తారీఖు. కానీ మరి ఇక రాసేవాళ్ళు ఎలాంటి ఆలోచనలో రాశారో. అందు గురించేమంటారు? బిద్అతులు ఏవైతే ఉంటాయో, దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటికి కాళ్ళు, రెక్కలు, వాటికి పునాదులు అనేటివి ఉండవు.

అయితే, రాసిన విషయం ఏంటంటే, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఈ రబీఉస్సానీలో ప్రతి సంవత్సరం 11వ తారీఖుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద చాలీస్వా చేసేవారంట. అది ప్రజలకు ఎంత ఇష్టమైంది అంటే, ప్రజలు ఎంత ఇష్టపడ్డారు అంటే చివరికి ప్రతి నెల 11వ తారీఖుకు చేయడం మొదలు పెట్టారంట. అరబీ హిజ్రీ ప్రకారంగా ప్రతి అరబీ నెల 11వ తారీఖుకు. ఇక షేఖ్ అబ్దుల్ ఖాదిర్ రహమతుల్లాహి అలై చనిపోయిన తర్వాత ప్రజలు ఆయన పేరు మీదనే ఉరుసు మొదలుపెట్టి, ఆయన పేరు మీదనే గ్యారవీలు చేయడం మొదలు పెట్టారు అని. వాస్తవానికి ఇవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. ఎందుకంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇలాంటి ఏ పనులు చేయలేదు, ఇలాంటి పనులు చేయాలని ఎప్పుడూ కూడా చెప్పలేదు. ఆయన తన జీవితంలో చెప్పిన మాట ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. మీరు సాఫల్యం పొందాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. ఆయన అనుసరణను వదిలారంటే మీరు నాశనమైపోతారు, మీరు దుర్మార్గంలో పడిపోతారు అని చెప్పారు.

ఇంకా మహాశయులారా, గ్యారవీ ఎప్పటి నుండి మొదలైంది దీని గురించి ఖచ్చితంగా ఆధారం అనేది లేదు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా కొందరు రాశారు పుస్తకాలలో, కానీ అది ఏ మాత్రం నిజమైన మాట కాదు. మరొక విచిత్ర విషయం ఏంటో తెలుసా? షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇరాక్ లో పుట్టారు, అక్కడే జన్మించారు, అక్కడే మరణించారు, అక్కడే ఆయన బుగ్దాద్ లో ఉండి సేవలు, ధర్మ సేవలు అన్నీ కూడా అందించారు. అయితే ఆయన పేరు మీద దురాచారాలు ఎన్నో జరుగుతాయి ఇటు అరబ్ దేశాల్లో కూడా. కానీ గ్యారవీ యొక్క బిద్అత్ అరబ్ దేశంలో లేదు. కేవలం మన దేశాల్లోనే ఉంది. అంటే ఆయన పేరు మీద మన దేశంలో ఇది కొందరు ఎవరైనా మొదలుపెట్టి ఉంటారు.

మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, గ్యారవీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై వారి పేరు మీద చేయడం తప్పు లేదు అని మన వద్ద కొందరు మౌల్వీ సాబులు అంటారు. ఎందుకు? అంటే ముర్దోం కె నామ్ కా ఈసాలె సవాబ్ కర్ సక్తే. అంటే మన బంధువుల్లో గాని, ఇస్లాం ప్రకారంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు మీద వారి యొక్క ఆత్మలకు, వారికి పుణ్యం లభించాలి అని మనం ఏదైనా సత్కార్యం చేయవచ్చు. దానధర్మాలు, సద్కాలు లాంటివి. ఈ గ్యారవీ కూడా అలాంటి ఈసాలె సవాబ్ అని ప్రజలతో చేయించడానికి వారు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇది ఈసాలె సవాబ్ కూడా కాదు. కేవలం కొందరు మౌల్వీ సాబులు చెబుతున్నారు ప్రజలు చేయాలి అని. కానీ ప్రజలు చేస్తున్నది ఏమిటి? ప్రజలు చేస్తున్నది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు, ఈ రోజు మనం గ్యారవీ చేస్తే, ఈ సంవత్సరం మనం గ్యారవీ చేస్తే మన ఇంట్లో అంత శుభాలు ఉంటాయి, మన ఇంట్లో అన్ని కరుణా కటాక్షాలు కురుస్తూ ఉంటాయి, మన పంట పొలాలు అన్నీ బాగుపడతాయి, మన బర్రెలు, మన ఆవులు అన్నీ మంచిగా పాలు ఇస్తూ ఉంటాయి, మంచిగా వాటికి కూడా ఈ విధంగా లాభాలు కలుగుతాయి అన్నటువంటి అయితే ఎందరో ముస్లింలలో వారి యొక్క నమ్మకాలు ఏంటి? ఇవన్నీ మనం చేస్తే ఈ లాభాలన్నీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ద్వారా లేక ఆయన మాధ్యమంతో, ఉన్కె తవస్సుల్ సే మనకు లభిస్తాయి అని. ఒకవేళ చేయకుంటే మనకు ఏదైనా నష్టం వాటిల్లుతుంది. ఈ విధంగా వాస్తవానికి తఖర్రుబ్ ఇలల్లాహ్, అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క సంతృప్తి పొందడానికి మనం ఏ పుణ్య కార్యాలు అయితే చేస్తామో, ఏ దానధర్మాలు అయితే చేస్తామో, అలాంటిది ఇది గైరుల్లాహ్ (అల్లాహ్ యేతరుల ) కొరకు చేయడం జరుగుతుంది. దీనికి కేవలం పేరు మార్చినంత మాత్రాన ఇది ఈసాలె సవాబ్ పేరు కింద లెక్కింపబడదు. ఎవరైనా బ్రాందీ, విస్కీ ఇది చాలా ఆత్మ శుద్ధి చేస్తుంది, మన యొక్క రక్తంలో చాలా బలం చేకూరుస్తుంది విటమిన్ B మాదిరిగా అనుకుంటూ తాగితే దానిని హలాల్ అని అనవచ్చా? అనరాదు. అందు గురించి ఈ గ్యారవీ అనేది ఈసాలె సవాబ్ కింద లెక్కింపబడదు.

మరొక విషయం నేను ఇంతకు ముందు చెప్పాను కదా? అరబ్ దేశంలో ఇది లేదు. గ్యారవీ అని దీనిని ఏదైతే అంటున్నారో దానికి అరబీలో ఏం పదం వస్తుంది? హాదీ అషర్ అని వస్తుంది. యెహ్దా అషర్ పదకొండు. గ్యారహ్. గ్యారవీ, పదకొండవది. హాదీ అషర్ అని అంటారు. హాదీ అషర్ పేరుతో ఇస్లాంలో ఏదైనా ఈసాలె సవాబ్ కార్యం, ఇస్లాంలో ఏదైనా దానధర్మాల కార్యం ఏదైనా ఉందా? ఏదీ లేదు.

మరొక విషయం మనం ఆలోచించాలి, అదేమిటంటే ఈసాలె సవాబ్ అని ఏదైతే అంటున్నారో సామాన్యంగా ఈసాలె సవాబ్ ఏం జరుగుద్ది? మనం మన తండ్రి వైపు నుండి, మన తల్లికి ఏదైనా పుణ్యం దొరకాలి అని బీదవాళ్లకు బట్టలు కుట్టిస్తాము. ఎవరైనా బీదవాళ్లు వారికి నెలంతా గడవడానికి వారి వద్ద ఎలాంటి తిండి సౌకర్యాలు లేకుంటే వారికి రేషన్ ఇప్పిస్తాము. లేదా ఇంకా ఎవరికైనా నీళ్ళు త్రాగడానికి కష్టంగా ఉండేది ఉంటే బోర్ వెల్, బావి అలాంటిది ఏదైనా వారికి చేసిస్తాము. వాటి యొక్క పుణ్యం మన ఆ తల్లికి, తండ్రికి, మనం ఎవరి గురించి ఆలోచించుకుంటున్నామో, దుఆ చేస్తున్నామో వారికి దొరుకుద్ది. కానీ ఈ గ్యారవీలో చేసినప్పుడు ఏం జరుగుద్ది? అందరూ మనోళ్ళు, మన బంధువులు, మన మౌల్వీ సాబు, వాళ్ళకే, వాళ్ళే తిని వెళ్తూ ఉంటారు. బీదవాళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? అయితే “ఈ రోజు నుండి మేము బీదవాళ్లకి ఇచ్చి గ్యారవీ చేస్తాము” అని అనకండి. అలా చేస్తే కూడా ఇది యోగ్యం కాదు.

మరొక విషయం గమనించాలి మహాశయులారా, అదేమిటంటే కొందరిని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ ఈసాలె సవాబ్ చేసేది ఉంటే మీ తల్లిదండ్రుల హక్కు మీకు ఎక్కువ ఉంది గనుక వారి పేరు మీద చేయండి. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ పేరు మీదనే ఎందుకు? “ఏ లేదు, ఆయన అల్లాహ్ యొక్క చాలా గొప్ప వలీ. ఆయన ధర్మ వ్యాప్తి కొరకు చాలా త్యాగాలు చేశారు. అందు గురించి ఆయన గురించి చేస్తున్నాము.” మరి అంతకంటే ఎక్కువ ఇస్లాం సేవలు చేసిన వారు ఇంకా వేరే ఇమాములు కూడా ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు సహాబాలు ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వారందరి పేరు మీద కూడా ఈసాలె సవాబ్ లు చేసుకుంటూ పోతే ఏదైనా ఒక రోజు మనకు మిగులుద్దా? ఒకసారి గ్యారవీ ఉంటుంది, ఒకసారి బారవీ ఉంటుంది, ఇంకోసారి తేరవీ ఉంటుంది, ఇంకోసారి చౌదవీ ఉంటుంది. ఇక ప్రతి రోజు ఏదో ఒకటి చేస్తూనే పోవాలి. అల్లాహ్ మనకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

అందు గురించి చెప్పే విషయం ఏంటంటే, మహాశయులారా, మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే ఇలాంటి కార్యాలు, గ్యారవీలు, ఆ జెండాలు గిట్ల పెట్టడం, ఇలాంటి చేస్తూ ఉండేది ఉంటే మాకు వ్యతిరేకంగా చెప్పాడు అని మాట వినడం వదులుకోకండి. అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ మనకు ఒక ఖుర్ఆన్ ఇచ్చాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసులు ఇచ్చాడు. మనం

لا إله إلا الله محمد رسول الله
[లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్]
అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త.

అని చదువుతున్నాము. ఈ జెండాలు పెట్టాలి అని ఎక్కడైనా ఖుర్ఆన్ లో ఉందా? ఎక్కడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హదీస్ లో చెప్పారా? ఈ గ్యారవీలు చేయాలి అని ఎక్కడైనా ఖుర్ఆన్ లో ఉందా? మనకు ఎక్కడైనా హదీస్ లో ఉందా?

ఈ రోజు ఒక వెబ్సైట్ చూస్తున్నాను నేను, ఎవరైతే సామాన్యంగా తమకు తాము అహ్లె సున్నత్ వల్ జమాఅత్ అని అనుకుంటూ ఉంటారో, అలాంటి వారి ఒక వెబ్సైట్. వారు తమ వెబ్సైట్ లో ఏం రాశారు? “గ్యారవీ చేయడం చాలా సున్నత్ పని, ముస్తహబ్ పని, మంచి కార్యం.” ఎందుకు? అందులో మనం అన్నీ మంచి కార్యాలు చేస్తూ ఉంటాము. ఏంటి? అందులో మనం జమా అయి ఖుర్ఆన్ చదువుతూ ఉంటాము. ఖుర్ఆన్ చదవడం తప్పా? అందులో ఆ ఆ రోజు మనం జమా అయి ఒకచోట మనం ఒకరికొకరు బోధ చేసుకుని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర చెప్పుకుంటాము, ఆఖిరత్ గురించి, పరలోకం గురించి గుర్తు చేసుకుంటాము. ఇది తప్పా? ఆ రోజు ఏదైనా కొంచెం మంచి వంటకాలు వండుకొని స్వయం మనం తింటాము మరియు బీదవాళ్లకు తినిపిస్తాము. ఇది తప్పా? ఇలాంటి విషయాలు రాసి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు గ్యారవీ చేయాలి అని.

కానీ మీరే బుద్ధిపూర్వకంగా ఆలోచించండి. ఖుర్ఆన్ చదవడం తప్పు అని ఎవరైనా అంటారా? కాదు కదా! దానికి ప్రత్యేకంగా గ్యారవీ అనే పేరు పెట్టుకోవడం ఎందుకు? ప్రతి రోజూ ఖుర్ఆన్ చదవండి. నలుగురు ఎక్కడైనా జమా అయి, సమకూరి ఏదైనా మనం ఖుర్ఆన్ విద్య నేర్చుకోవడం, పరలోక విషయం నేర్చుకోవడం, పరలోకం గుర్తించే అటువంటి విషయాలు మనం తెలుసుకోవడం ఇది తప్పా? కాదు. మరి దాని గురించి గ్యారవీ అని పేరు పెట్టి ఒకచోట ఎందుకు జమా కావడం? ప్రతి రోజూ లేక మీకు వీలున్నప్పుడు వారంలో ఒకసారి, నెలకొకసారి, పదిహేను రోజులకొకసారి మీరు కూర్చోండి, జమా అయి మీ యొక్క విద్యా గురువును పిలిచుకుని కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి. గ్యారవీ అని దానికి పేరు పెట్టే అవసరం ఏంటి? అలాగే దానధర్మాలు చేయడం, మంచి వంటకాలు వండుకోవడం, ఇస్లాం మనల్ని నిరాకరిస్తుందా? లేదు. మీరు మీ ఇంట్లో మీ బంధువులకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఎంతగా చెప్పారు? మీరు వండుకున్న కూరలో కొన్ని నీళ్లు ఎక్కువ పోసి మీ పొరుగువారికి ఇవ్వండి. సంతోషంలో పాలు పంచుకోండి. అయితే మనం మనకు ఇష్టమున్న రోజు ఇవన్నీ చేసుకోవచ్చు. దానికి గ్యారవీ అని పేరు పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేయడం? గ్యారవీ అని, పీరానే పీర్ పేరు మీద అని, ప్రజలు వారిలో ఉన్నటువంటి విశ్వాసం అది వేరు. ఇక్కడ మొల్వి సాబులు చెబుతున్న విషయం వేరు. దానికి ఈసాలె సవాబ్ అని పేరు ఇవ్వడం, ఖుర్ఆనే కదా, ఇదే కదా, ఇదే కదా అని కొన్ని పుణ్యాలను లెక్కించడం, ఈ పుణ్యాలు చేస్తూ ఉండడానికి గ్యారవీ అన్న పేరు దాని గురించి ఎందుకు? ఆలోచించండి, గ్రహించండి, ఇస్లాం నుండి, ఇస్లాం పేరు మీద దూరం అయ్యే ప్రయత్నం చేయకండి. ఎప్పటివరకైతే మనం ఖుర్ఆన్ హదీసును చదవడం మానుకుంటామో, చదవడం లేదో, ఇలాంటి కొందరు ఇస్లాం మీద వ్యాపారం చేసి మనల్ని ఇస్లాం నుండి దూరం చేస్తూ ఉంటారు కానీ మనం గ్రహించలేకపోతాము. అల్లాహ్ తఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇలాంటి దురాచారాల నుండి దూరం ఉంచుగాక.

جزاكم الله خيرا والسلام عليكم ورحمة الله وبركاته
[జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్]
అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక, మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

ముఖ్య సూచనలు

  • షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ వంటి ధార్మిక శ్రేష్ఠులను గౌరవించాలి, కానీ వారి విషయంలో అతిశయోక్తికి పాల్పడి, అల్లాహ్ కు ఇవ్వాల్సిన స్థానాన్ని వారికి ఇవ్వకూడదు.
  • ‘గ్యారవీ’ మరియు జెండాలు ఎగురవేయడం వంటివి ధర్మంలో నూతనంగా కల్పించబడిన ఆచారాలు (బిద్అత్). వాటికి ఖుర్ఆన్ మరియు సున్నత్‌లో ఎలాంటి ఆధారం లేదు, కనుక వాటికి దూరంగా ఉండాలి.
  • లాభనష్టాలు కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ మనకు మేలు గానీ, కీడు గానీ చేయలేరని దృఢంగా విశ్వసించాలి.
  • ధర్మంలో ఏ ఆచరణ అయినా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మార్గనిర్దేశం ప్రకారమే ఉండాలి. ఆయనను అనుసరించడంలోనే సాఫల్యం ఉంది.
  • ధార్మిక విషయాలను గుడ్డిగా అనుసరించకుండా, ఖుర్ఆన్ మరియు సహీ హదీసుల వెలుగులో విశ్లేషించి, అర్థం చేసుకోవాలి.
  • దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు ఏ ప్రత్యేక రోజుకో పరిమితం చేయకుండా, నిరంతరం చేస్తూ ఉండాలి.

క్రింది విషయం ఫిక్రే ఆఖిరత్ (పరలోక చింత) మాసపత్రిక (ఏప్రిల్ 2008) నుండి తీసుకోబడింది

అల్లాహ్ ఆదేశం :

 إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ

అల్లాహ్‌ మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, (ప్రవహించిన) రక్తం, పందిమాంసం, ఇంకా అల్లాహ్‌ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. ఎవరయినా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా – గత్యంతరం లేని స్థితిలో – తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమించేవాడు, జాలి చూపేవాడు. (సూరా అల్ బఖర 2:173)

ప్రియ సోదరులారా! ఇది ఇస్లామీయ నాల్గవ నెల రబీఉస్సానీ కొందరు ఈ నెలను గ్యారవీ నెలగా గుర్తిస్తారు. ఈ నెలలో అబ్దుల్ ఖాదిర్ జీలానీ పేరు మీద  మొక్క బడులు, నైవేద్యాలు చెల్లిస్తారు. అతని పేరుపై పెంచబడిన పశువులను అతని పేరుతో జబహ్ చేస్తారు. ఎందుకంటే ఈ నెలలోనే 11వ తేదీనాడు అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణించారు. వారి సాన్నిహిత్యం పొందటానికి, వారిని సంతోష పరచటానికి ఈ మూఢాచారాలను నెరవేరుస్తారు. దీని ప్రాముఖ్యతను ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే నమాజ్, రోజాలను ఆచరించనివాడు కూడా వీళ్ళ దృష్టిలో పాపాత్ముడేమీ కాదు. కానీ గ్యారవీ చేయని వాడిని మాత్రం మహా పాపాత్ముడుగా భావించి దూషిస్తారు.

గ్యారవీ అనే ఈ మూఢాచారాన్ని కల్పించిన వాడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్ బరేల్వీ. వీడు అజ్ఞానకాలం నాటి ఒక ధర్మాన్ని స్థాపించాడు. దీన్ని నిర్మూలించటానికే అనేక మంది ప్రవక్తలు పంపబడ్డారు. చివరిగా మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ప్రజలకు దైవ ధర్మసందేశాన్ని అందజేసారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన 1260 సంవత్సరాల తర్వాత బరేల్వియత్ స్థాపించబడింది. అయినా ప్రజలు దీన్ని ధర్మంగా భావించి స్వీకరించారు.

గ్యారవీ స్థాపకుడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్ బరేల్వి ఈ మూఢాచారాన్ని స్థాపించి అబ్దుల్ ఖాదిర్ జీలానీని దైవస్థానానికి చేర్చివేసాడు. బరేల్వీ గ్రంధాల ప్రకారం అహ్మద్ రజాఖాన్ తన రచన కితాబుబరకాతి ఇమ్ దాద్ లో ఇలా వ్రాసాడు. “కష్టాల్లో, ఆపదల్లో ఎవరైనా నన్ను సహాయం అర్ధిస్తే, నేను అతని కష్టాలను దూరం చేస్తానని, ఇంకా పిలిచేవాని పిలుపు విని అతని విన్నపాన్ని స్వీకరిస్తానని, మరియు అల్లాహ్ సాన్నిహిత్యం . మన కు పొందటానికి నన్ను మధ్యవర్తిగా భావించడం తప్పని సరి అని అబ్దుల్ ఖాదిర్ జీలానీ అన్నారు”. మరోచోట ఇలా వ్రాసాడు- “నేను నా జీవితంలో అబ్దుల్ ఖాదిర్ జీలానీని వదలి ఇతరులను ఎన్నడూ మొరపెట్టుకోలేదు. సహాయం అర్ధించలేదు. ఒకసారి ఇతన్ని వదలి మహబూబ్ అలీని పిలిచే ప్రయత్నం చేసాను. కాని నా నోట యాగౌస్ పాక్ అనే రాసాగింది.” (మల్ పూజాజ్ అహ్మద్ రజా/ 307)

ఇటువంటి అనేక చిన్న చిన్న కల్పిత సంఘటనలు అబ్దుల్ ఖాదిర్ జీలానీ పై మోపబడ్డాయి. వాస్తవం ఏమిటంటే వీరందరూ అల్లాహ్ దాసులే వీరి బలహీనత, అసహాయతకు సంబంధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి – షేక్  అబ్దుల్ ఖాదిర్ జిలానీ ఒకసారి ఇలా అన్నారు. “నాకు అన్నిటికంటే ప్రజలకు అన్నం పెట్టటమంటే చాలా ఇష్టం. కాని ఏంచేయను బలహీనుణ్ణి, ప్రతి రోజు ప్రజలకు అన్నం పెట్టేంత ధనం నాదగ్గర లేదు.’ (ఫత్ హుర్రబ్బానీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ).

ఈసంఘటన వల్ల తెలిసిన విషయం ఏమిటంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కి తన జీవితంలో తాను కోరింది చేసే శక్తి ఉండేది కాదు. ఎందుకంటే అల్లాహ్ శక్తి ముందు మానవులందరూ అసహాయులే అటువంటప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణానంతరం ప్రజల కష్టాలను దుఃఖాలను, కోరికలను ఏలా తీర్చగలరు?

ఈ గ్యారవీ మూఢాచారాన్ని ప్రోత్సహించే నిమిత్తం అనేక నిరాధారమైన కాల్పనిక కధలు ప్రచారం చేయబడ్డాయి. అంతేగాక ఇవి పరలోక సాఫల్యానికి సాధనాలుగా భావించ డ్డాయి.

ఈ మూఢాచారానికి సంబంధించిన వాస్తవాలు అవాస్తవాలు ఇవి : 

షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణం రబీ ఉస్సానీ 11వ తేదీన సంభవించింది అని భావిస్తారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ జయంతి జరుపుకోవటం ఆయన ప్రీతి పొందే ఒక విధానం అనే మూఢాచారాన్ని నమ్ముతారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణ తేదీ గురించి సంబలీ గారు కితాబుహాలాత్ షేక్ లో ఇలా రచించారు – “అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి మరణ తేదీలో, నెలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు సఫర్ మాసంగా మరికొందరు రబీఉస్సానీగా మరికొందరు 27వ తేదిగా 8వ తేదిగా, 9వ తేదీగా, 11వ తేదీగా మరికొందరు 13, 14 గా పేర్కొన్నారు. భారతదేశంలో దీన్ని 11 రబీఉస్సానీ నాడు జరుపు కుంటారు”. భాగ్దాద్లో 17 రబీఉస్సానీ నాడు జరుపుకుంటారు. మరణ తేదిలో ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా భారత దేశంలో మాత్రం 11వ తేదీన గ్యారవీగా జరుపుకుంటారు.

అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణతేది గురించి హాఫిజ్ అబ్దుల్ అజీజ్ నక్ష్ బందీ ముహమ్మద్ ముర్తుజాయీ ఇలా పేర్కొన్నారు – “షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ తన జీవితంలోని అధిక భాగం బాగ్దాద్ లో గడిపారు. 91 సంవత్సరాల వయస్సులో 561 హిజ్రీ  లో 8 రబీ ఉస్సానీ ఆదివారం నాడు మరణించారు. తన మదరసాలో ఖననం చేయబడ్డారు. మరికొందరు ఆయన మరణం శుక్రవారం జరిగిందని పేర్కొన్నారు“. (హదియదస్తగీర్/7)

ఇప్పుడు అసలు విషయం అంటే ఆయన్ను సంతోషపరచటానికి ఆయన మరణది నాన్ని జరుపుకోవటం గురించి ఆయన బోధనలను పరిశీలిస్తే ఆయన ఏ ఒక్కరి వర్ధంతిని జరుపుకోమని బోధించడం గానీ, చెప్పడంగానీ, ఉత్సాహం చూపడం గానీ చేయలేదని తెలుస్తుంది. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూబకర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), హుసైన్ (రదియల్లాహు అన్హు) ల మరణదినాన్ని కూడా జరుపుకునే వారు కారు. అందువల్లే ఆయన ఇలా అన్నారు.-

అంటే ఒకవేళ హుసైన్ (రదియల్లాహు అన్హు) మరణదినాన్ని జరుపుకోవటం ధర్మ సమ్మతమే అయితే అంతకుముందు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అబూబకర్ (రదియల్లాహు అన్హు),ల మరణదినాన్ని కూడా జరుపుకోవడం ధర్మసమ్మతం అయి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల ఆచరణ కూడా కొనసాగుతూ ఉండేది.” (గునియతుత్తాలిబీన్)

షేఫ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ యొక్క ఈ అభిప్రాయం వల్ల ఆయన ఎవరి వర్ధంతిని జరుపుకోవడాన్ని ఏకీభవించేవారు కారని ఇతరులకు ఆదేశించేవారు కారని తేలిపోయింది. వాస్తవం ఏమిటంటే ఈ మూఢాచారాల్లో కొన్ని అల్లాహ్ కు సాటి కల్పించేపనులు, దాసులై ధర్మాన్ని మార్పులు చేర్పులకు గురిచేయడం, ఇవన్ని అల్లాహ్ కు సాటి కల్పించడానికి, ధర్మంలో అధర్మకార్యాలకు చోటు కల్పించడంతో సమానం, ఈ వేడుక, ఇటువంటి కార్యాలు ఇతని బోధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.

అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఇలా ఉపదేశించారు.

అంటే అల్లాహ్ గ్రంధాన్నీ, ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించండి. ధర్మంలో వింత విషయాలను కల్పించకండి. అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. అవిధేయతకు పాల్పడకండి

తన సంతానానికి కూడా ఈ విధంగానే బోధించారు. దీన్ని గురించి ఈ క్రింది వీలునామాలో పేర్కొనడం జరిగింది.

వీలునామా  

షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ 470 హిజ్రీ లో జన్మించారు. 18 సంవత్సరాల వరకు విద్యాభ్యాసంలో నిమగ్నమయి ఉన్నారు. విద్యాభ్యాసం తరువాత 488 హిజ్రీలో బాగ్దాద్ చేరుకున్నారు. 91 సంవత్సరాల వరకు ఇస్లామ్ మరియు ముస్లిముల సేవచేసి 561 హిజ్రీ లో మరణించారు. మరణానికి కొన్ని రోజుల ముందు తన కొడుకు అబ్దుల్ వహ్హాబ్ కు హితబోధ చేసారు. ఇవి సువర్ణాక్షరాలతో వ్రాయదగినవి.

ఇలా బోధించారు :

కుమారా! అల్లాహ్ పై తప్ప ఇతరులెవ్వరి పైననూ ఆశలు పెట్టుకోకూడదు. అవసరం ఎటువంటిదైనా అల్లాహ్ యే తీర్చగలడు. కుమారా! అల్లాహ్ నే నమ్ముకోవాలి. ప్రపంచ ప్రజలందరూ కలసి నీకు లాభం చేకూర్చదలచినా అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా రవ్వంత లాభం కూడా చేకూర్చలేరు. అదేవిధంగా అల్లాహ్ నీకు లాభం చేకూర్చదలిస్తే ప్రపంచంలోని ఏశక్తి నీకు నష్టం కలిగించ లేదు. కుమారా! ఏకత్వం (తౌహీద్) పైనే స్థిరంగా ఉండాలి. ఇందులోనే నీ సాఫల్యం ఉంది”. (ఫత్ హుర్రబ్బానీ: అబ్దుల్ ఖాదిర్ జీలానీ)

పై వీలునామాలో పేర్కొన్న ఒకొక్క పదం ఏకత్వాన్నే సూచిస్తుంది ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనూ మతి మరుపువల్ల కూడా తన సంతానానికి గ్యారవీ చేయమని ఆదేశించలేదు.

మనం అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలను తెలుసుకొని వారు చూపిన మార్గాన్నే అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?. వారి బోధనలకు వ్యతిరేకంగా, వారి పేరనే మొక్కుబడులు నైవేద్యాలు చెల్లిస్తున్నాం. అయితే మొక్కుబడులు నైవేద్యాలు కూడా ఆరాధనే. ఇవన్నీ అల్లాహ్ కే సొంతం ఇతరులకు ఇవి ఎంతమాత్రం చెల్లవు.

అల్లాహ్ ఆదేశం :-

إِذْ قَالَتِ ٱمْرَأَتُ عِمْرَٰنَ رَبِّ إِنِّى نَذَرْتُ لَكَ مَا فِى بَطْنِى مُحَرَّرًۭا فَتَقَبَّلْ مِنِّىٓ ۖ إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

ఇమ్రాన్ భార్య అల్లాహ్ ను ఇలా ప్రార్ధించినపుడు – ‘ప్రభూ! నాగర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించు కుంటున్నాను. అది నీ సేవకే అంకితం నా ఈ కానుకను స్వీకరించు నీవు అన్నీ వినేవాడవు, అన్ని తెలిసినవాడవూను‘. (ఆలిఇమ్రాన్ – 35)

ఆ వెంటనే ఇలా ఆదేశించడం జరిగింది :

فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍۢ وَأَنۢبَتَهَا نَبَاتًا حَسَنًۭا

చివరకు ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక ఉత్తమ బాలికగా తీర్చి దిద్దాడు.” (ఆలిఇమ్రాన్ – 37)

ఖుర్ఆన్లోని ఈ వాక్యం ద్వారా తెలిసిందేమిటంటే మొక్కుబడులు, నైవేద్యాలు, సమర్పణలు మొదలైనవన్నీ కేవలం అల్లాహ్ కే చెందుతాయి. స్వీకరించబడతాయి కూడా. నిర్ణయం పాఠకులకు వదలి పెడుతున్నాము. ఈ గ్యారవీ ఆచారం షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలకు, ఉపదేశాలకు అభిప్రాయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందా? ఉంటే సరే కాని ఒక వేళ వీటికీ విరుద్ధంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని వదలి వేయడం తప్పనిసరి.

అల్లాహ్ (త’ఆలా) మనం దరికీ సన్మార్గం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికి ఏకత్వం పై ఏకదైవారాధన పై స్థిరంగా ఉంచుగాక! అల్లాహ్ మనందరికీ అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ షిర్క్ కి, కల్పితాలకూ, బిద్ఆత్ లకూ దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్!

సంకలనం : మౌలానా అబ్దుస్సలామ్ ఉమ్రి
అనువాదం : మౌలానా ముహమ్మద్ జాకిర్ ఉమ్రి
రివ్యూ అండ్ చిన్న మార్పులు: తెలుగుఇస్లాం.నెట్
ఫిక్రే ఆఖిరత్ (పరలోక చింత) మాసపత్రిక (ఏప్రిల్ 2008

ఇతరములు: బిద్అత్ (నూతనచారము)

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి
https://teluguislam.net/whatsapp/