తౌహీదె ఉలూహియత్ : ఆరాధనలో ఏకత్వాన్ని పాటించడం విధి – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బహ్]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి, ఆయనకే విధేయత చూపండి, అవిధేయతకు పాల్పడకండి మరియు అల్లాహ్ యొక్క గొప్ప ఆజ్ఞ తౌహీద్ అని గుర్తుంచుకోండి. తౌహీద్ అంటే ఆరాధనలకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని నమ్మడం, ఆయన్నే ఆరాధించడం, ఆయనకు ఎవరిని సాటి కల్పించకుండా ఉండటం. అల్లాహ్ ఈ తౌహీద్ కోసమే మానవులను, జిన్నాతులను సృష్టించాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ
(నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే) (జారియాత్:56)

ఆరాధన: అల్లాహ్ ప్రేమించే, ఇష్టపడే ప్రతీ ఆచరణ ఆరాధనలోకే వస్తుంది. అది నోటి ద్వారా చేసేదైనా లేక మనిషి తన ఆవయవాలతో చేసేదైనా సరే.

ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలిపారు: నమాజ్, జకాత్, రోజా (ఉపవాసం), హజ్, సత్యం పలకడం, అమానతును అప్పగించడం, తల్లిదండ్రుల విధేయత, బందుత్వాలను కలుపుకోవడం, ఒప్పందాలను నెరవేర్చడం, మంచిని బోధించడం, చెడును నిర్మూలించడం, కుఫ్ఫార్ (అవిశ్వాసులు) మరియు మునాఫిఖుల(కపట విశ్వాసుల)తో పోరాడటం, మరియు ఇరుగుపొరుగు, అనాధలు, అభాగ్యులు, బాటసారులు, బానిసలతో ఉత్తమంగా వ్యవహరించడం, పశుపక్షాదుల పట్ల మేలు చేయడం, దుఆ, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మరియు ఇలాంటి ఆచరణలన్నీ ఆరాధనలోనే లెక్కించబడతాయి.

అదేవిదంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించడం, అల్లాహ్ యొక్క ధైవభీతి కలిగి ఉండటం, అల్లాహ్ వైపునకు మరలడం మరియు అల్లాహ్ కొరకు ధర్మాన్ని ప్రత్యేకించడం, ఆయన ఆజ్ఞలను సహనంతో శిరసావహించడం, ఆయన ప్రసాదించిన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపడం, ఆయన నిర్ణయాలపై సంతృప్తి చెందడం, ఆయనపై భరోసా ఉంచడం, ఆయన కారుణ్యం పట్ల ఆశ ఉంచడం, ఆయన శిక్షల పట్ల భయ పడటం మరియు ఇలాంటివన్నీ ఆరాధనలో భాగమే. [వారి మాట పూర్తయింది].

ఓ అల్లాహ్ దాసులరా! నిశ్చయంగా ప్రవక్తల దావత్ (ప్రచారం) ప్రధానంగా ఏకదైవారాధన (తౌహీదె ఉలూహియత్) పై కేంద్రీకృతమై ఉండేది. అల్లాహ్ సూర అంబియా:25లో ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
(నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా “నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము.)

ప్రవక్తలందరూ తమ జాతివారికి ఈ విషయాన్నేచాటి చెప్పేవారు:

يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَهٍ غَيْرُهُ
(“నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో సత్య ఆరాధ్యుడు లేడు) (ఆరాఫ్:59).

ఓ విశ్వాసులారా! వేరే ఎవరు కాకుండా కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు ఏకైక అర్హుడు అనడానికి గొప్ప నిదర్శన (దలీల్); ఏ భాగస్వామి లేకుండా, ఏ సహాయకుడు లేకుండా ఆయన ఒక్కడే ఈ మొత్తం విశ్వానికి ‘రబ్’ అవడం. రబ్ అంటే సృష్టికర్త, యజమాని, నిర్వాహకుడు, పోషకుడు. అల్లాహ్ తప్ప సృష్టికర్త ఎవడూ లేడు, అల్లాహ్ తప్ప యజమాని (అదికారి) ఎవడూ లేడు, అల్లాహ్ తప్ప పోషకుడు (ఉపాధి ప్రధాత) ఎవడూ లేడు, అల్లాహ్ తప్ప విశ్వ నిర్వాహకుడు మరియు ఆదేశించేవాడు ఎవడూ లేడు.

సృష్టించడంలో ఆయనే అద్వితీయుడని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు:

اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ وَكِيلٌ
(అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే. అన్ని వస్తువులకూ సంరక్షకుడు కూడా ఆయనే.) (జుమర్:62)

యజమాన్యం, అధికారంలో ఆయనే అద్వితీయుడని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు:

ذَلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
(ఆయనే అల్లాహ్! మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను వదలి మీరు వేడుకునే వారు, ఖర్జూర బీజంపై ఉన్న పొరకు కూడా యజమానులు కారు.) (ఫాతిర్ :13)

విశ్వనిర్వాహకుడు, తనిష్టానుసారం అందులో ఆదేశాలు జారీ చేయడంలో అల్లాహ్ యే అద్వితీయుడని చాలా స్పష్టంగా తెలిపాడు:

وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ
(సమస్త వ్యవహారాలూ ఆయన వైపుకే మరలించబడతాయి.) (హూద్:123)

చావు, బ్రతుకులు, ఆరోగ్యం, అనారోగ్యం, వర్షాలు, కరువులు, ధనరికం, పేదరికం, శాంతిభద్రతలు, భయాందోలనలు, ఇంకా విశ్వంలో జరిగేదంతా అల్లాహ్ ఆజ్ఞ ద్వారానే జరుగుతాయి.

ఉపాది ప్రసాదించడంలో అల్లాహ్ అద్వితీయుడని ఆధారం:

إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ
(అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు.) (జారియాత్:58)

ఓ ముస్లింలారా! తౌహీదె ఉలూహియత్ (ఏకదైవారాధన)కు విరుద్దం షిర్క్ (బహుదైవారాధన). షిర్క్ అనగా: ఏ ఆరాధన అయినా అల్లాహ్ యేతరుల కొరకు చేయడం. అంటే: మనిషి అల్లాహ్ కు ఓ భాగస్వామిని నిలబెట్టి అల్లాహ్ ను ఆరాధించినట్లుగా ఆ భాగస్వామిని ఆరాధించడం, అల్లాహ్ కు భయపడినట్లుగా అతనికి భయపడటం, ఏదైనా ఆరాధన ద్వారా అల్లాహ్ ప్రసన్నత పొందినట్లు అతని ప్రసన్నత పొందడం. ఉదాహరణకి సమాధుల పూజ చేసేవారు, అక్కడ బలి ఇచ్చేవారు, దాని కొరకు మ్రొక్కుకునేవారు, వాటి ప్రదక్షిణలు చేసేవారు, వాటికి సాష్టాంగ పడేవారు, వాటి మూల మూలన తాకి బర్కత్ లభిస్తుందని నమ్మేవారు. ఇలా చేయడం ద్వారా ఆ సమాధిలో ఉన్నవారే  ఉపాధి ప్రసాదిస్తారు, లాభనష్టాలు చేకూర్చుతారు అని నమ్ముతూ ఇంకా ఇలాంటి ఎన్నో షిర్క్ పనులకు పాల్పడతారు. వాస్తవానికి ఇవన్నీ షిర్క్ పనులు మరియు అల్లాహ్ ఏకైకుడే ఆరాధనలకు నిజ అర్హుడు, ఆయన తప్ప వేరే ఎవరూ కారు అన్న విశ్వాసానికి బద్ధ విరుద్ధం.

ఓ అల్లాహ్ దాసులరా! అల్లాహ్ వారించినవాటిలో అత్యంత ఘోరమైనది షిర్క్. అల్లాహ్ తన ప్రవక్తను ఉద్దేశించి ఇలా తెలిపాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ (65) بَلِ اللَّهَ فَاعْبُدْ وَكُنْ مِنَ الشَّاكِرِينَ

(నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది: “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధన (షిర్క్)కు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.”) (జుమర్:65)

నిశ్చయంగా అల్లాహు తఆలా షిర్క్ చేసే వారి కొరకు కఠినమైన శిక్షను తయారు చేసి ఉంచాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ

(ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు, అతని నివాసం నరకం. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.) (మాయిదా:72)

ఓ విశ్వాసులారా! అల్లాహు తఆలా షరియత్ పరమైన మరియు హేతు బద్ధమైన ఎన్నో ఆధారాల ద్వారా షిర్క్ ను ఖండించాడు.

షిర్క్ ఖండనలో షరియత్ పరమైన ఆధారం:

إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ

(ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు, అతని నివాసం నరకం. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.) (మాయిదా:72)

షిర్క్ ఖండనలో హేతుబద్ధమైన ఆధారాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ రెండు విషయాలు:

మొదటిది: ముష్రికులు (బహుదైవారాధకులు) ఆరాధించేవాటిలో ఉలూహియత్ ప్రత్యేకతలు ఏమీ లేవు. వారు సృష్టితాలే తప్ప, సృష్టించలేరు, వారిని ఆరాధించేవారికి ఏ లాభము చేకూర్చలేరు, వారి నుండి ఏ నష్టాన్ని తొలగించలేరు, వారి చావు బ్రతుకుల ఏ అధికారం కలిగి లేరు, భూమ్యాకాశాల్లో వారికి ఏ కొంచెం కూడా అధికారం మరియు వాటి అధికారంలో వారికి అల్లాహ్ తో పాటు ఏ కొంచెం పొత్తు (పాట్నర్ షిప్, భాగస్వామ్యం) లేదు. అల్లాహ్ ఆదేశాలు శ్రద్ధగా చదవండి:

وَاتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً لَّا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا

(వారు అల్లాహ్‌ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించుకున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగి లేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణానంతరం) తిరిగి లేచే/పే శక్తి కూడా వారివద్ద లేదు.) (అల్ ఫుర్ఖాన్:3) 

మరో చోట ఇలా సెలవిస్తున్నాడు:

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ * وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ ۚ

వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. ఆయన వద్ద – ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప- (ఒకరి) సిఫారసు (ఇంకొకరికి) ఏమాత్రం ఉపకరించదు. (సబా:22-23)

ఈ బూటకపు దేవుళ్ళ పరిస్థితి ఇలా ఉంటే అలాంటి వారిని ఆరాధించడం, పూజలు పురస్కారాలు చేయడం కంటే తెలివితక్కువ పని ఇంకేముంటుంది.

రెండవది: ఓ అల్లాహ్ దాసులారా! ముష్రిక్ లు ఇలా అంగీకరించేవారు – ఏకైకుడైన అల్లాహ్ యే మా రబ్ అని, ఆయనే సృష్టికర్త అని, ఆయన చేతిలోనే సర్వాధికారం ఉన్నదీ అని, ఆయనే శరణు (రక్షణ) ఇచ్చేవాడు, ఆయన శిక్ష నుండి రక్షణ ఇచ్చేవాడెవడూ లేడు. వారు రుబూబియత్ లో అల్లాహ్ ఏకైకుడని నమ్మినట్లుగా ఉలూహియత్ లో కూడా అల్లాహ్ ఏకైకుడని నమ్మడం విధిగా ఉంది. ఈ క్రింది ఆయతుల పై శ్రద్ధ వహించండి:

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ * الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

(ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి, తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.) (బఖర:21-22)

ఈ ఆధారంగానే అల్లాహ్ ను వదలి లేదా అల్లాహ్ తో పాటు ఎవరినైనా నియమించుకొని వారిని ఆరాధించడం తప్పు, తుచ్ఛము.

 ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ وَأَنَّ اللَّهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ

(ఇంకా అల్లాహ్‌యే సత్యం, అల్లాహ్‌ను వదలి వారు మొర పెట్టుకునే వారంతా అసత్యం. ముమ్మాటికీ అల్లాహ్‌యే సర్వోన్నతుడు, గొప్పవాడు.) (లుఖ్మాన్:30)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింపజేయుగాక, వివేకంతో కూడిన ఆయన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరినీ క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.      

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు గుర్తుంచుకోండి అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక! ఆరాధనలలో అతి ఎక్కువగా ప్రజలు అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించే ఆరాధన దుఆ. ఖురాన్ మరియు హదీస్ లలో దుఆని కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించి చేయమని చెప్పబడింది. ఇతరులతో దుఆ చేయడాన్ని కఠినంగా వారించడం జరిగింది. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది:

ادْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً ۚ
(మీరు మీ ప్రభువును కడుదీనంగా వేడుకోండి. గోప్యంగా కూడా విన్నవించుకోండి.) (ఆరాఫ్:55)

అల్లాహ్ మరో చోట ఇలా సెలవిచ్చాడు:

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ
(కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? (అంటే అల్లాహ్ తప్ప ఎవడూ లేడు).  (నమ్ల్:62)

అల్లాహ్ మరో చోట ఇలాసెలవిచ్చాడు:

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ 
(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు) (బఖర:186)

మరో చోట ఇలాఉంది:

وَاسْأَلُوا اللَّهَ مِن فَضْلِهِ ۗ
(మీరు అల్లాహ్‌ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి.) (నిసా:32)

ఖురాన్ లో దాదాపు మూడువందల చోట్ల అల్లాహ్ దుఆ గురించి ప్రస్తావిస్తూ, ఏకైకుడైన అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలని నొక్కి చెప్పాడు.ఓ అల్లాహ్ దాసులరా! దుఆలో షిర్క్ కు దూరంగా ఉండి, ఏకైకుడైన అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయండి సాఫల్యం పొందుతారు.

ప్రవక్త  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా తెలిపారు:

مَنْ مَاتَ وَهُوَ يَدْعُو لِلَّهِ نِدًّا، دَخَلَ النَّارَ
“ఏవ్యక్తి అయితే ఇతరులను అల్లాహ్ కు సాటికల్పించి, అతనితో దుఆ చేసే స్థితిలో మరనిస్తాడో అతడు నరకంలోకి వెళ్తాడు.”(బుఖారి:4497)

మరో హదీస్ లో ఉంది: అల్లాహ్ దగ్గర అన్నిటి కంటే పెద్ద ఘోరమైన పాపం ఏది అని ప్రవక్తను అడిగినప్పుడు, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు:

أَنْ تَدْعُوَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ
“మిమ్మల్ని పుట్టించింది అల్లాహ్ యే అయినప్పటికీ మీరు ఆయనతో పాటు ఇతరులను సాటికల్పించి, వారితో దుఆ చేయడం.” (ముస్లిం:86, బుఖారి:4761).

ఎవరైతే అల్లాహ్ ను వదలి ఇతరులతో దుఆ చేస్తాడో, మొరపెట్టుకుంటాడో, అతని కొరకు మొక్కుబడి, జిబహ్ (జంతుబలి) చేస్తాడో లేదా ఆరాధనల్లో ఏ కొంచమైనా అతని కొరకు చేస్తాడో, అలాంటివాడు అతడ్ని అల్లాహ్ కు సమానంగా నిలబెట్టినవాడవుతాడు, అతడు ఎవరైనా సరే; ప్రవక్త అయినా, వలీ అయినా, దైవదూత అయినా, జిన్ అయినా, విగ్రహమైనా మరియు ఇంకేమైనా సరే. అది షిర్కే అవుతుంది. అల్లాహ్ వీటన్నింటికీ ఎంతో అతీతుడు, పవిత్రుడు.

అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ముఖ్యంగా రెండు చోట్ల ఇతరులతో దుఆ చేయడాన్ని తప్పుగా మరియు నిరాధారమైనదిగా పేర్కొన్నాడు:

మొదటి చోట సూరె హజ్:62లో :

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ هُوَ الْبَاطِلُ
(అల్లాహ్‌యే సత్యం, అల్లాహ్‌ను వదలి వారు మొర పెట్టుకునే వారంతా అసత్యం).

రెండవ చోట సూరె లుఖ్మాన్:30లో:

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
(అల్లాహ్‌యే సత్యం, అల్లాహ్‌ను వదలి వారు మొర పెట్టుకునే వారంతా అసత్యం).

ఓ ముస్లింలారా! దుఆలో షిర్క్ ఈ కాలంలోనే కాదు పూర్వకాలంలో కూడా ఉండినది. బహుదైవారాధకులైన క్రైస్తవుల్లో; వీరు ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ కు సాటి కల్పించారు. అదేవిధంగా ఆవుని ఆరాధించేవారు మరియు స్వయానా తమ చేతులతో చేసుకున్న విగ్రహాలను పూజించేవారు, అనేక రకాల దురాచారాలకు పాల్పడేవారున్నారు. వీరందరూ ఆరాధనలో షిర్క్ కు పాల్పడ్డారు.

అదేవిధంగా తమకు తాము ముస్లిములగా భావించే కొన్ని వర్గాలు కూడా దుఆలో షిర్క్ కు పాల్పడ్డారు. ఉదాహరణకు: తమ పీర్లతో దుఆ చేసే సూఫీలు, ఆలె బైత్ తో దుఆ చేసే రాఫిజీలు. సమాధుల్లో ఉన్నవారితో దుఆ చేసే సమాధి పూజారులు. ఇలాంటి వారు ఎందరో ఇంత దుర్మార్గమైన షిర్క్ కి పాల్పడుతూ కూడా మేము ముస్లింలమే, మేము ప్రవక్తను ప్రేమించేవాళ్ళమే అనే ఆరోపణ చేస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇస్లాంకు, వారి షిర్క్ కు ఏ సంబంధం లేదు.

మేము అల్లాహ్ తో ప్రార్దిస్తున్నాము, ఓ అల్లాహ్! ఈ అంధవిశ్వాసాల నుండి మా అందరినీ కాపాడు, తౌహీద్ మరియు సున్నత్ పై చివరి శ్వాస వరకు స్థిరంగా ఉంచు.

అల్లాహ్ మీపై కరుణించుగాక, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి సూర అహ్ జాబ్:56లో ఆజ్ఞాపించాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వబారిక్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఅద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగా చేయు.

ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి, రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ