ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు
1వ పాఠం : ‘అల్లాహ్ ‘ అంటే ఎవరు?
మీ చుట్టూ వున్న ఈ భూప్రపంచంలోని వస్తువులను పరిశీలించండి. మొక్కలు, వృక్షాలు, జంతువులు, పక్షులు, చేపలు అన్నిటి పై యోచన చేయండి. ఏం అర్థమవుతోంది? అన్నీ తమదంటూ వున్న ఒక నిర్ణీత పద్ధతిలో జీవితం గడుపుతున్నట్లు కనిపించటం లేదూ?! ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రాలను, మేఘాలను ఓసారి గమనించండి. అన్నీ సవ్యం గానే పని చేస్తున్నాయి కదా! అవి సవ్యంగా పనిచేయకపోతే ఈ భూమ్మీద మనిషికి మనుగడ ఉండేదా? అవన్నీ మన కోసమే పని చేస్తున్నట్లు ఉన్నాయి కదూ?!
ఎంతో దూరం ఎందుకు? మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మీ దేహాల్ని, మీ శరీర అవయవాలను, ఇంకా మీ శరీరంలోని జీవన ప్రక్రియలను గురించి కాస్తంత లోతుగా ఆలోచించండి. ఆరోగ్యవంతమైన మీ జీవితాన్ని కాపాడేందుకు అవి తపనపడి పోతున్నట్లు లేదూ? మిమ్మల్ని క్షేమంగా బతికించి ఉంచేందుకు మీ దేహంలోని వివిధ వ్యవస్థలు పరస్పరం ఎంత సమన్వయంగా పనిచేస్తున్నాయో చూడండి!
ఈ అద్భుత వస్తువులను ఎవరు సృష్టించారు? క్షణం కూడా ఆగకుండా సక్రమంగా పనిచేస్తున్న ఈ అంతుబట్టని వ్యవస్థకు సృష్టికర్త ఎవరు? అనంతమైన, ఊహలకు సైతం అందని ఈ సువిశాల విశ్వాన్ని నడుపుతున్నది ఎవరు?
ఈ విశ్వమంతటినీ తానే సృష్టించానని ప్రకటించిన సాహసవంతుడు ఇంతవరకు ఎవరూ పుట్టలేదు? కనీసం తమలో ఆ శక్తి వుందని చెప్పిన ఘనులు కూడా లేరు?
ఈ విశ్వమంతటినీ సృష్టించినది, ఇంకా దీనిని నడిపిస్తున్నది ఒకే ఒక్కరు అని మాత్రం మానవ జ్ఞానానికి అర్థమవుతుంది. కారణం; ఇందులో ఒకరి కంటే ఎక్కువ మందికి భాగస్వామ్యం వున్నట్లయితే ఆకాశాల్లో, ఈ భూప్రపంచంలో ఒక రకమైన గందరగోళం, గజిబిజి నెలకొని వుండేది. ఆ ఒక్కరు ఎవరో కాదు, ఆయనే అల్లాహ్. ఒకే ఒక్క నిజ ఆరాధ్య దేవుడు. మరి అలాంటప్పుడు దేవుడు అసలు లేడని గాని, అనేక దేవుళ్ళు ఉన్నారని గాని అనటానికి ఎక్కడ వీలుంది?
దేవుడు ఉన్నాడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన పేరే అల్లాహ్. ఈ అంతులేని విశ్వాన్ని సృష్టించిన ఏకైక సృష్టికర్త. సకల లోకాలను నడిపిస్తున్న వాడు. కనుక మనం ఆయన పట్ల కృతజ్ఞులుగా మసలుకోవాలి. మన ఆత్మల్ని ఆయనకు సమర్పించుకోవాలి. అంటే మన చేతలు, ఆఖరికి మన మనసుల్లో మెదిలే భావాలు, భావనలు, కోరికలను సైతం దేవుడు నిర్ణయిం చిన విధానానికి అనుగుణంగా మలచుకోవాలి. మనిషి ఆలోచించేవాటిలో అత్యంత తెలివైన, వివేచన గల ఆలోచన ఇదే!
అల్లాహ్ మనందరికి సవ్యంగా ఆలోచించి, సక్రమంగా అర్థం చేసు కునే మంచి బుద్ధిని ప్రసాదించాడు. అంతేకాదు, ఆ తర్వాత మంచి మార్గాన్ని ఎన్నుకునే స్వేచ్ఛనూ అనుగ్రహించాడు. తన ప్రవక్తలను పంపించి మానవులకు సన్మార్గం అందించాడు. ఈ ప్రవక్తల పరంపర అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ముగిసింది. మనుషులకు సత్యం బోధపరచటానికి ఆకాశగ్రంథాలను కూడా అల్లాహ్ అవతరింపజేశాడు. చిట్టచివరగా వచ్చిన దివ్యఖుర్ఆన్ తో ఆ గ్రంథావతరణ అనుగ్రహం కూడా పూర్తి అయింది.
ఇక మనముందు రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి; ఇహపర లోకాల్లో సంతోషాన్ని, సాఫల్యాన్ని సాధించటం. అది ఇస్లాం ద్వారానే సాధ్యమవుతుంది. రెండోది; ఇహలోకంలో మనోవాంఛల వెంటపడి, అవసరాలు, కోరికలు తీరనందుకు ఈ లోకంలో అసంతృప్తితో, దుఃఖ దాయక జీవితం గడపటం, పరలోకంలో శాశ్వత నరక శిక్షలకు గురవటం. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. దేన్ని ఎంచుకుందాం? అల్లాహ్ మనందరికీ మంచిమార్గం, తిన్నటి మార్గం చూపించుగాక! ఆమీన్.
—
ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]
సంకలనం : అబ్దుల్ అజీజ్ సాలెహ్ అష్ షౌమార్,సౌదీఅరేబియా. ఈ పుస్తకం షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారి మూలరచన “అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మహ్” యొక్క వ్యాఖ్యానంతో కూడుకున్న పుస్తక సంకలనం