ఇస్లాం అమర వీరులు [6p] [PDF]
وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
“అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.”
(అల్ బఖర 2: 154)
మహాశయులారా!
పై ఆయతులో అల్లాహ్ ధన్యజీవుల గురించి ప్రస్తావించాడు. వారే ఇస్లాం మార్గంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులు. అల్లాహ్ సన్నిధిలో వారికి మహోన్నత స్థానం ఉంది. మన ఊహకందని మహత్తర జీవితం, ఆనందం వారికి అక్కడ లభిస్తుంది. పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో అమరవీరుల గురించి, వారి విశిష్ఠత గురించి పలు ఆయతుల్లో చెప్పబడింది.
దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో అధర్మంగా, మోసగించబడి ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రముఖ అమరవీరుల గాథలను ఈ రోజు తెలుసుకుందాం. కాని కరుడుగట్టిన విరోధులు వారిని మోసగించి హతమార్చారు. పిరికిపందలైన తిరస్కారుల అలవాటే అది. సత్యవంతులను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది. అందుకే మోసపూరిత సన్నాగాలు, కుట్రలు పన్ని వారిని అధర్మంగా హతమార్చారు. నేటి ఇస్లాం విరోధుల స్థితి కూడా అలానే ఉంది.
ముస్లిం సోదరులారా!
మీ ముందు చెప్పబోయే ఈ సంఘటన ఉహద్ యుద్దం తరువాత హిజ్ర శకం 4వ యేట జరిగింది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం:
ఉహద్ యుద్ధానంతరం తిరస్కారులు, ఇస్లాం విరోధులు ముస్లింల గౌరవ మర్యాదలను మట్టిపాలు చేయటానికి, వారికి నష్టం కల్గించే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నసాగారు. ఇంత నష్టం జరిగినా ముస్లింలు యుద్ధ వ్యూహరచనలతో, శక్తిసామర్థ్యాలతో, సైన్యాన్ని సమీకరిస్తూ పుంజుకోవటాన్ని వారు సహించలేకపోయారు. ఇస్లాంను దెబ్బతీయటానికి, నష్టం, కీడు తలపెట్టడానికి మరో దుష్టాలోచన చేశారు. ఖురైషులంతా కలసి అజల్ ఖిరా జాతిలోని 7 గురు వ్యక్తులను ఎన్నుకుని వారిని మదీనాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి పంపారు. వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, “దైవ ప్రవక్తా! (సల్లల్లాహు అలైహి వసల్లం) ! మా వర్గమంతా ఇస్లాం స్వీకరించటానికి సిద్ధంగా ఉంది. వారి శిక్షణ కోసం ఇస్లామీయా బోధకులను మీరు మా వెంట పంపించండి” అని అంటారు.
కావున దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రముఖ పది మంది అగ్రశేణి సహచరులను వారి వెంట పంపారు. ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) తాతగారైన ఆసిమ్ బిన్ సాబిత్ నాయకత్వంలో ఆ దైవధర్మబోధకులు బయలు దేరారు. మక్కా, అస్ఫాన్ ప్రాంతాల మధ్యలోగల ఓదాంగ్ ప్రదేశానికి చేరుకున్న తరువాత ఆ విరోధులు హుజైల్ జాతికి చెందిన బనూ లహ్యాన్ వర్గం వారికి కబురు పంపింది. వెంటనే 200 మంది విలుకాండ్రు ప్రవక్త సహచరుల అన్వేషణలో బయలుదేరారు. వారి పాదచిహ్నాలను అనుసరిస్తూ అంచనావేస్తూ ఆ ధర్మ విరోధులు మదీనా నుండి తమ వెంట తెచ్చుకున్న ఖర్జూర పండ్లలను తిని పడేసిన చోటుకు చేరుకున్నారు. ఆ ఖర్జూర గింజలను చూసి ఆ తిరస్కారులు ఇవి కచ్చితంగా మదీన వాళ్ళవే అని అనుకున్నారు. వారి పాదచిహ్నాలను అనుసరిస్తూ బయలు దేరారు. చివరికి ఆసిమ్ (రదియల్లాహు అన్హు) వారి సహచరులు విరోధులను చూసిన వెంటనే ప్రాణరక్షణకై అక్కడే ఉన్న కొండలోకి వెళ్ళారు.
వారిని పసిగట్టిన ఆ విరోధులు వారిని మోసగిస్తూ హత్యా సంకల్పంతో ఇలా ప్రకటించారు. ఆయుధాలను పడేసి కొండ దిగి క్రిందకి విచ్చేయండి, మీకూ – మాకూ మధ్య ఒక ఒప్పదం ఉంది. దాని ప్రకారం మేము మీలోని ఏఒక్కరికి హాని తలపెట్టం.
సోదర సోదరీమణులారా!
గుర్తుంచుకోండి, అలాంటి ఇస్లాం విరోధులంతా ఇలాంటి కుతంత్రాలే పన్నారు. మోసాలతోనే హతమార్చారు. 1400 సంవత్సరాల ఇస్లామీయ చరిత్ర సాక్షిగా ఇలాంటి కుట్రలతోనే ఇస్లాం విరోధులు, తిరస్కారులు ముస్లింలకు ఎంతో హాని తలపెట్టారు. నేడు కూడా ఇస్రాయీల్లోని యూదులు ఇలాంటి పన్నాగాలే పన్నుతున్నారు.
ఆ విరోధుల ఆ మాటలు విన్న నాయకుడు ఆసిం (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నేను ఎట్టిపరిస్థితిల్లోనూ వారి శరణును స్వీకరించలేను. వారు ఒప్పందానికి కట్టుబడి ఉంటారన్న నమ్మకమూలేదు”. తరువాత “ఓ అల్లాహ్”! మా స్థితి గురించి ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు తెలియ పరచు” అని ఆయన అల్లాహ్ ను వేడుకున్నారు. దాని తరువాత ఆ మోసగాళ్ళు బాణాల వర్షం కురిపించారు. ఆసిం (రదియల్లాహు అన్హు) తో సహా ఏడుగురు అనుచరులు వీరమరణం పొందారు. మిగిలిన ముగ్గురు ప్రముఖ సహాబీలు ఖుబైబ్ అన్సారీ, ఇబ్నె వస్నా, అబ్దుల్లాహ్ బిన్ తారిఖ్ వారి ఒప్పందంపై కొండ దిగి వచ్చారు (సహీహ్ బుఖారీ)
ఆ ఇస్లాం శూరులు దిగి రాగానే తిరస్కారులు వారిని బంధించారు. అపుడు అబ్దుల్లాహ్ బిన్ తారిఖ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షి! ఇది మీ మొదటి ద్రోహం. నేను మీతో రానేరాను. వీరమరణం పొందటానికైనా సిద్ధమే”. ఆ తిరస్కారులు ఆయన్ను అక్కడే వధించారు.
ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) బద్ర్ సమరంలో మక్కా నాయకుడైన తిరస్కారి హారిస్ బిన్ ఆమీర్ ను హత మార్చారు. అందుచేత హరిస్ కుమారులు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఖుబై బ్ ను చంపివేయలనుకొన్నారు.
తరువాత ఇస్లాం స్వీకరించిన హారిస్ కూతురు జైనబ్ (రదియల్లాహు అన్హా) ఇలా తెలిపారు: చాలా రోజుల వరకు ఖుబైబ్ బందీగా నా దగ్గరే ఉన్నారు. ఆ సమయంలో నేను ఆయనలోని ఎన్నో మంచి లక్షణాలను చూశాను. సత్యతిరస్కారులు ఆయనకు మరణ శిక్ష విధించే రోజున ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) అల్లాహ్ సన్నిధికి చేరుకునే ముందు నాభి క్రింది వెంట్రుకలను తొలగించుకుని పరిశుభ్రత, పరిశుద్ధతలను పొందాలనుకున్నారు. అదే నిమిత్తం ఆయన మంగళికత్తి ఇవ్వమని నన్ను అడిగారు. నేను ఆయనకు మంగళికత్తి ఇచ్చాను. కొంతసేపటికి చూస్తే నా పిల్లవాడు ఆయన తొడపై కూర్చుని ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయన చేతిలో ఆ కత్తి కూడా ఉంది. నేను భయాందోళనకు గురయ్యాను. ఆయన నా పరిస్థితిని గమనించి “అమ్మా జైనబ్! నీ పిల్లవాడ్ని చంపుతానని భయపడుతున్నావా, అమ్మా! నిశ్చింతగా ఉండమ్మా. నా వల్ల నీ పిల్లవాడికి ఎలాంటి కీడు జరగదు” అని అభయమిచ్చారు.
మహాశయులారా!
కాస్త మీరే ఆలోచించండి! ఆ పరిస్థితులు ఎలాంటివి? ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) ఎంతో సాహసంగా ఇస్లామీయ ఆదేశాలను ప్రదర్శిస్తున్నారు.
ఇస్లాంలో యుద్ధ మైదానంలో కూడా పిల్లల్ని, స్త్రీలను చంపటం ధర్మ సమ్మతం కాదు. ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) కూడా అదే అన్నారు. ఆయన(రదియల్లాహు అన్హు) గురించి జైనబ్ ఇంకా ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షి! నేను ఖుబైబ్(రదియల్లాహు అన్హు) కంటే ఉత్తమ ఖైదీని ఎన్నడు చూడలేదు. అల్లాహ్ సాక్షి! నేను ఆయన చేతిలో ద్రాక్ష గుత్తుల్ని చూశాను. ఆయన వాటిని తింటున్నారు. ఆ స్థితిలో ఆయన సంకెళ్ళతో బంధించబడి ఉన్నారు. అది ద్రాక్ష పండ్ల సీజన్ కూడా కాదు. అల్లాహ్ అగోచరంగా ప్రసాదించిన ఆహారాన్ని ఆయన తింటున్నారు”.
ఆ మక్కా బహుదైవారాధకులు ఆయన్ని చంపటానికి సిద్ధమైనప్పుడు ఆయన వారితో ఇలా అన్నారు: “వీరమరణానికి ముందు రెండు రకాతుల నమాజ్ చేసుకోనివ్వండి“. తిరస్కారులు అనుమతించిన పిమ్మట ఆయన 2 రకాతులు పాటించి ఆ విరోధులతో ఇలా అన్నారు: “ప్రాణ భయంతో సుదీర్ఘమైన రకాతులు పాటిస్తున్నాడని మీరనుకుంటారనే నేను త్వరగా నమాజ్ ముగించాను లేదా నేను పొడవాటి నమాజు పాటించేవాణ్ణి.”
ప్రియసోదరులారా!
అల్లాహ్ కిశోరాల స్థితి ఇలా ఉంటుంది. ఒక వైపు ఉరికంబం! మరొకవైపు నమాజ్ పట్ల ప్రేమ! ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) పాటించిన ఆ 2 రకాతులు మనలాంటి వారి వేలాది రకాతులకంటే ఎంతో ఉత్తమం. అల్లాహ్ మనందరికి అలాంటి ధీరత్వాన్ని, ప్రేమను ప్రదర్శించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్..
నమాజ్ తరువాత ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) ఇలా వేడుకున్నారు: “ఓ అల్లాహ్! ఈ సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరి వ్యవహారాన్ని తేల్చు. ఒక్కోక్కరిని సర్వనాశనం చెయ్యి” అని అల్లాహ్ ను మొరపెట్టుకున్నారు. (ఆయన మొరను అల్లాహ్ ఆలకించాడు. తరువాతి కాలంలో ఆ కర్కశులంతా ఒక్కొక్కరుగా నాశనమయ్యారు)
ఆ తరువాత కొన్ని కవితలు చదివారు. ఒక దుర్మార్గుడు ఆయన గుండెను గాయపరచి విర్రవీగుతూ ఇలా అన్నాడు: నీ స్థానంలో నీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి నీవు విముక్తి పొందటం నీకు ఇష్టమేనా? అపుడు ఉద్వేగభరితుడై ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) ఇలా జరిపిచ్చారు: “నా ప్రాణం కాపాడుకోవటానికి నా ప్రవక్త కాలుకు ముల్లు గుచ్చుకోవటం కూడా నాకు సహించదు.”
ఆయన చివరిగా ఈ దుఆ చేశారు: ‘ఓ అల్లాహ్ ! మేము నీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలను, ఆదేశాలను ప్రజలకు అందజేశాము. ఇప్పుడు నీవు నీ ప్రవక్తకు మా పరిస్థితిని తెలియపరచు”. అల్లాహ్ ఆ దుఆను స్వీకరించి ఆ స్థితుగుతులను వహీ ద్వారా తన ప్రవక్తకు తెలియపరిచాడు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సంఘటనలను తీరు అనుచరులకు తెలియజేసారు. ఆసిం వీరమరణ వార్త విన్న అనుచరులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఆయన మృతదేహం కోసం ఒక అవిశ్వాస వ్యక్తి పురమాయించాడు. ఎందుకంటే వారు ఆయన మృత దేహాన్ని ముక్కలుముక్కలు చేస్తారని. ఆసిం (రదియల్లాహు అన్హు) బద్ర్ యుద్ధంలో ఖురైషీయులు ప్రసిద్ధ నాయకుడు ఉఖ్బా బిన్ అబి మూయీత్ ను హతమార్చాడు. కానీ అల్లాహ్ ఆయన మృతదేహ రక్షణకు దైవదూతలను నియమించి కాపాడాడు. అనుచరులు ఆయన మృతదేహాన్ని భద్రంగా తీసుకొని వెళ్లాడు.
తరువాతి కాలంలో ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) చే నియమించబడిన గవర్నర్ సయీద్ బిన్ ఆమిర్ పరిస్థితి విచిత్రంగా ఉండేది. ఒక్కోసారి ఆయన స్పృహ తప్పేవారు. ప్రజలు కారణమడుగగా వారికిలా బదులిచ్చేవారు.
“ఖుబైబ్ వీరమరణ సమయంలో నేను అక్కడ ఉన్నాను. హృదయవిదారకమైన ఆ దృశ్యం అప్పుడప్పుడు నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఖుబైబ్ మాటలు గుర్తుకు వస్తుంటాయి. అంతే నా శరీరమంతా కంపించిపోయి స్పృహ తప్పిపోతాను”.
మహాశయులారా!
ఇస్లాం అనే మహావృక్షం పెంపుదలలో సహాబాలు తమ రక్తాన్ని దారపోశారు. వారి త్యాగాలతో ఆ మహా వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించింది. అలాంటి సంఘటనలు ఇస్లామీయ చరిత్రలో మాత్రమే మనకు అగుపిస్తాయి. వారి త్యాగ ఫలితంగానే నేడు అరబు ఎడారుల నుండి ఇస్లాం ప్రపంచ నలువైపులా చేరిపోయింది. ప్రతి చోట ‘అల్లాహ్ అక్బర్’ నినాదాలు మోగిపోయాయి. ముస్లింలలో త్యాగనిరతి ఎప్పటి వరకు ఉందో ప్రతిచోట వారి ఆధిపత్యం, అధికారం ఉంది. ఎప్పుడైతే ముస్లింలు త్యాగనిరతిని విస్మరించి ప్రపంచ వ్యామోహంలో పడిపోయారో అప్పటి నుండి వారి పతనం మొదలయింది. వాస్తవంగా ఒక సమాజ పురోగమనానికి, పతనానికి ఆ సమాజ ఆర్థిక స్థితితో పాటు త్యాగనిరతి ఎంతో ఆవశ్యం. వట్టి మాటలతో, పెద్దపెద్ద ఉపన్యాసాలతో ఒరిగేదేమీ ఉండదు.
ఓ నవ యువకులారా!
జాగ్రత్తగా వినండి. ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) ను ఆదర్శంగా తీసుకుని పదే పదే కాస్త ఆలోచించండి. ఆయన ఎలాంటి త్యాగాన్ని లోకానికి చాటి చెప్పారో ఆత్మవిమర్శ చేసుకోండి. ఆయన త్యాగనిరతిని ఆదర్శప్రాయంగా తీసుకొని ముందడుగు వేయండి. అల్లాహ్ మనందరికి అలాంటి భాగ్యాన్ని చేసే పద్దతిని ప్రసాదించగాక. ఆమీన్.
—
ఈ పోస్ట్ ఇస్లాం అమర వీరులు [6p] [PDF] అనే ఖుత్బా నుండి తీసుకోబడినది.
పుస్తకం: ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్