హషర్ మైదానంలో అల్లాహ్ కారుణ్యం | ఖుత్ బాతే నబవీ ﷺ

[డౌన్లోడ్ PDF]

إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فَاكِهُونَ
స్వర్గవాసులు ఈ రోజు తమ (ఆహ్లాదకర) వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు“. (36 : 55) 

ఖుత్బాలో నేను పఠించిన ఆయత్ అర్థాన్ని మీరు విన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంత మంది వృద్ధులు వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “ఓ దైవ ప్రవక్తా! ఇస్లాం స్వీకరించటానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాని మేము మహా పాపాలు చేశాము. మా కర్మలపత్రాలు వాటివల్ల నలుపై పోయాయి. ఇప్పుడు ఇస్లాం స్వీకరించి ఏమి చేయమంటారు?” అప్పుడు పై ఆయత్ అవతరింపజేయ బడింది. ఇందులో అల్లాహ్ తన దాసులకు ఎంతో ఓదార్పును నమ్మకాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఇస్లాం మానవుని పూర్వ పాపాలన్నింటినీ తుడిచివేస్తుంది. ఖుర్ఆన్ మజీద్ ఈ అంశానికి సంబంధించిన అనేక ఆయతులున్నాయి. అల్లాహ్ అనంత కరుణామయుడు. పాపాలు చేసి పశ్చాత్తాపంతో మరలే వారికి క్షమాభిక్ష పెట్టటం ఆయన సుగుణం. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు:

وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ

తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినపుడు దానిపై హటం చెయ్యరు“. (ఆలి ఇమ్రాన్ 3 : 135) 

పాపాల మన్నింపు, దైవ కారుణ్యం గురించి ఈ రోజు ఖుత్బాలో తెలుసుకుందాం. పైన పఠించిన ఆయత్తో నేను చెప్పబోయే విషయాన్ని గ్రహించే ఉంటారు. ఈరోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఒక మహోన్నతమైన ప్రవచనాన్ని బోధించ బోతున్నాను. అందులో ప్రళయదిన దృశ్యాలు మన ముందుకొస్తాయి. అల్లాహ్ ప్రళయ దినాన తనదాసుల పాపాలను ఎలా మన్నించి స్వర్గానికి చేరుస్తాడో కూడా మనకు బోధపడుతుంది. దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ దివ్య వచనాన్ని వినేముందు అల్లాహ్ దుఆ చేసుకోవాలి. “ఓ ప్రభూ! ప్రళయదినాన నీ కృపతో మమ్మల్ని మన్నించు” అని వేడుకోవాలి. అల్లాహ్ మనందరి పాపాలను మన్నించి నరకాగ్ని నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశింపుగాక.. ఆమీన్. 

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం కొంతమంది దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా ప్రశ్నించారు. “ఓ దైవ ప్రవక్తా! మేము ప్రళయదినాన మా ప్రభువును చూడలేమా!” నిశ్చయంగా చూడగలరని బదులిచ్చారు ఆయన. విశాల వాతావరణంలో మిట్టమధ్యాహ్నం మేఘాలు లేని ఆకాశంలో సూర్యున్ని ఎలా ఎలాంటి అడ్డు, అవరోదం లేకుండా లేదా పున్నమి వెన్నెల రాత్రి పూర్ణచంద్రుణ్ణి చూసినట్లే మీరూ ప్రళయ దినాన మీ ప్రభువును చూస్తారు. జాగ్రత్తగా వినండి. పిలుపునిచ్చేవాని తరఫున ఇలా పిలుపు ఇవ్వటం జరుగుంది. ప్రపంచంలో ఎవరు ఏఏ వస్తువులనైతే పూజించారో వారంత వారి కల్పితదైవాల వెనుక నిలబడండి. అలాగే వారందరు ప్రపంచంలో ఎవర్ని దైవంగా కొలిచారో ఏ విగ్రహాన్ని దైవంగా మలిచారో వారివెనుక నిలబడతారు ఆ తరువాత కల్పిత అసత్యదైవాలను వారి ఆరాధకులందర్ని నరకంలో నెట్టేయడం జరుగుతుంది. హషర్ మైదానంలో కేవలం సత్యవంతులు మాత్రమే మిగిలి ఉంటారు. వారంతా ఇహలోక జీవితంలో సత్య దైవం అల్లాహ్ ను మాత్రమే పూజించేవారు. అల్లాహ్ కు మరెవ్వరిని సాటి కల్పించేవారు కాదు. వారివద్దకు సాక్షాత్తు విశ్వప్రభువైన అల్లాహ్ వచ్చి వారితో ఇలా అంటాడు: “వారందరు వారివారి దైవాలతో సహా నరకంలో వెళ్ళిపోయారు. మరి మీరెందుకు నిరీక్షిస్తున్నారు?” అపుడు ఆ ఏకదైవారాధకులు “ఓ ప్రభువా! ప్రాపంచిక జీవితంలో మేము నీకు సాటి కల్పించే వారికి బహుదూరంగా ఉన్నాము. అలాంటి వారి సాన్నిధ్యాన్ని త్యజించాము. కాని ప్రాపంచిక అవసరాల రీత్యా మేము వారి అవసరం కలవారమే. అయినప్పటికీ షిర్క్ వల్ల మేము వారి సహచర్యాన్ని త్యజించాము. ఇక ఇదే మా స్థలం. మా ప్రభువు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. ఎవరి వెనుకా వెళ్ళము. మా ప్రభువు రాగానే మేము ఆయన్ని గుర్తిస్తాము అని అంటారు. అబూ సయీద్ ఉల్లేఖ నంలో ఇలా ఉంది: అల్లాహ్ “ఏమిటి! మీకు మీ ప్రభువు ఆనవాళ్ళ గురించి తెలుసా? అని వారిని ప్రశ్నిస్తాడు. అపుడు వారిలా బదులిస్తారు. ఖచ్చితంగా గుర్తిస్తాము. మా ప్రభువు దివ్యఖుర్ఆన్ ఇలా సెలవిచ్చాడు: 

يَوْمَ يُكْشَفُ عَن سَاقٍ وَيُدْعَوْنَ إِلَى السُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ

ఏ రోజున పిక్క విప్పబడుతుందో, అప్పుడు వారు సాష్టాంగ ప్రణామం (సజ్) కొరకు పిలువబడతారు. కాని వారు సాష్టాంగపడలేరు.” (అల్ ఖలమ్ 68 : 42) 

ఆ తరువాత అల్లాహ్ తన మోకాలిని విప్పేస్తాడు. ముస్లింలందరు అల్లాహ్ సమక్షంలో సాష్టాంగ పడతారు. వారంతా చిత్తశుద్దితో ఆ దైవాన్ని ఆరాధించేవారు. మరెవరైతే ప్రదర్శనాబుద్ధితో నమాజు సలిపేవారో వారంతా సజ్దా చేయటానికి ప్రయత్నిస్తారు. వారు ప్రక్కకు ఒరిగిపోతారు. కాని సజ్దా ఎన్నటికి చేయలేకపోతారు. 

అది చాలా భయంకర దినం. ఆ రోజు స్పచ్చమైన ఏక దైవరాధకులు, కపటులు వేరు చేయబడతారు. సత్యనమాజీ సజ్దా చేయగలుగుతాడు. కపట నమాజీ సజ్దా చేయలేకపోతాడు. అల్లాహ్ మనందర్ని సత్యనమాజీ చేయుగాక! ఆమీన్.. 

ఆ తరువాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: 

నరకంపై సన్ననివంతెన (పుల్సిరాత్) వేయబడుతుంది. సిఫారసు ద్వారం తెరవబడుతుంది. ఆ భయంకర పరిస్థితిని చూసి ప్రవక్తలందరు అల్లాహ్ ను మొర పెట్టుకుంటారు. ఓ అల్లాహ్ నాకు శాంతిని, మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ ! నన్ను కరుణించు. ఆ వంతెన పై నుండి సత్యవంతులు మెరుపువేగంలా లేదా కను రెప్పలు తెరచుకునే వేగంలా లేదా గాలివేగంలా తమ తమ పుణ్యాలకనుగుణంగా వారంతా స్వర్గంలో ప్రవేశిస్తారు. కొందరు ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేకుండా క్షేమంగా భద్రంగా స్వర్గం చేరుతారు. మరికొందరు అడ్డంకులు ఎదుర్కొని గాయపడి ఆ వంతెనను తాటిపోతారు మరికొందరు వారి పాపాల చిత్తం నేరుగా నరకంలో పడిపోతారు.”

మీరు వింటున్న ఈ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనంలోని వంతెన పుల్ సిరాత్ గురించి అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో ఎంతో గొప్పగా వివరించాడు: 

وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا ثُمَّ نُنَجِّي الَّذِينَ اتَّقَوا وَّنَذَرُ الظَّالِمِينَ فِيهَا جِثِيًّا

మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావలసిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది. తర్వాత మేము భయభక్తులు కలిగివున్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపైపడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము.” (మర్యమ్ 19:71,72) 

అల్లాహ్ మనందరికి ఆ వంతెన దాటడం సులభతరం చేసి స్వర్గ ప్రవేశాన్ని ప్రసాదించుగాక.. ఆమీన్ 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ దైవం సాక్షి! విశ్వాసులందరు నరకాగ్ని నుండి రక్షింపబడతారు. అవిశ్వాసులు, తిరస్కారులు నరకంలో ప్రవేశిస్తారు. కొందరు విశ్వాసులు అల్లాహ్ ను ఇలా వేడుకొంటారు: “ఓ అల్లాహ్! మాతో పాటే నమాజులు, ఉపవాసాలు పాటించే సోదరులు కూడా నరకంలోకి వెళ్ళారు. ప్రభూ! వారిని క్షమించి రక్షించు”. అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు: “మీరు వారిని గుర్తించి నరకంనుండి తీసుకురండి”. వారి ముఖాలు ఇక నుండి నరకాగ్ని కొరకు నిషిద్దం. అందుకే వారి మొహాలు యధావిధంగా ఉంటాయి. స్వర్గవాసులు నరకంలో ఉన్న తమతో సత్యసహచరుల్ని వెతికి వెతికి నరకం నుండి బయటకు తీసుకువస్తారు.” 

ఓ అల్లాహ్! మాలాంటి పాపాత్ములకు కూడా ఆరోజు సత్యవంతుల సిఫారసును ప్రసాదించు, నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదించు మమ్మల్ని స్వర్గంలో చేర్చు.. ఆమీన్… 

మళ్ళీ ఇలా అంటారు: ఓ అల్లాహ్ నీ మేరకు వారందర్ని నరకం నుండి బయటకు తీసుకువచ్చాము. అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు: మళ్ళీ వెళ్ళండి వెళ్ళి (ఎవరి మనసులో) దీనారంతా బరువు గల విశ్వాసమున్న పాపాత్ములను కూడా తీసుకురండి. వారంతా వెళ్ళి అలాంటి పాపాత్ములను నరకాగ్ని నుండి విముక్తి కలిగిస్తారు. ఆ తరువాత అల్లాహ్ ఇలా సెలవిస్తాడు. “అర్ధరూపాయంతా విశ్వాసమున్న పాపాత్ములను కూడా నరకం నుండి తీసుకురండి”. స్వర్గవాసులు మళ్ళీ వెళ్ళి అలాంటి వారిని కూడా నరకం కూపం నుండి కాపాడుతారు. అలాహ్ మళ్ళీ ఇలా సెలవిస్తాడు: “రవ్వంత విశ్వాసుమున్న వారిని కూడా నరకం నుండి తీసుకురండి”. వారు అలాంటి వారిని కూడా తరువాత తీసుకువస్తారు. వారు ‘ఓ అల్లాహ్! నరకంలో ఎవర్ని వదలకుండా రవ్వంత విశ్వాసమున్నవారిని కూడా తీసుకువచ్చాం’ అని అంటారు. అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు: దైవదూతల సిఫారసు ముగిసింది. దైవ ప్రవక్తల సిఫారసు కూడా అయిపోయింది. ఇక కేవలం సర్వలోకాల స్వామి అనంత కరుణామయుడైయిన అల్లాహ్ సిఫారసు మిగిలిఉంది. ఇలా అని సాక్షాత్తు అల్లాహ్ నే నరకంలో నుండి పిడికిలితో నరకస్తులను తీస్తాడు. అల్లాహ్ కృప వలన వారుకూడా నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదించ బడతారు. వారు ఒక్క పుణ్యం కూడా చేసి ఉండరు. అలాంటి కఠిన ఘోర పాపాత్ములను సైతం అల్లాహ్ నరకాగ్ని నుండి కాపాడుతాడు. వారు తమ పాపాల వల్ల శిక్షలనుభవించి బొగ్గులుగా తయారవుతారు. అలాంటి బొగ్గులాంటి వారిని అల్లాహ్ ఒక కాలువలో ముంచి తీస్తాడు. ఆ కాలువను స్వర్గస్తుల భాషలో ‘నహ్రిహయాత్’ (జీవన సరస్సు) అంటారు. ఆ తరువాత అప్పుడే మొలకెత్తిన పైరులా రెపరెపలాడుతూ ముత్యాల్లా మెరుస్తూ ఉంటారు. వారి మెడలో కొన్ని చిహ్నాలుంటాయి. వాటి ద్వారా వారు స్వర్గవాసులుగా గుర్తింపబడతారు.

ఈ ధన్యజీవులంతా సాక్షాత్తు అల్లాహ్ తన ప్రత్యేక కారుణ్యం ద్వారా విముక్తి పొందినవారు. ఆ ధన్యజీవులు తమ జీవితంలో ఏ ఒక్క పుణ్యకార్యం చేసినవారు కారు. స్వర్గం చేరిన అలాంటి ధన్యజీవులతో ఇలా అనటం జరుగుతుంది: “మీరు చూస్తున్న ఈ స్వర్గం మీకోసమే. మీరు ఊహించని మరెన్నో అద్భుతానుగ్రహాలు కూడా మీరు చూస్తారు.”. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించిన ఈ ప్రవచనం ఎంతో కమనీయమైనది. దీన్ని పదేపదే చదువుతూ, వింటూ వుండాలి. సత్కర్మలు చేస్తూ అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే హదీసె ఖుద్సీలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “నిశ్చయంగా నా కారుణ్యం నా అగ్రహాన్ని ఆవరించి ఉన్నది“. ఈ ప్రత్యేక కారుణ్యం, దయ వల్లే అలాంటి నీచఘోర పాపాత్ములు కూడా నరకవిముక్తి పొందారు. 

సర్వముస్లిలకు అల్లాహ్ ప్రళయదినాన స్వర్గాన్ని ప్రసాదించుగాక, నరక విముక్తిని ప్రసాదించి కరుణించుగాక.. ఆమీన్.. 

ఈ పోస్ట్ హషర్ మైదానంలో దైవకారుణ్యం [6p] [PDF] అనే ఖుత్బా నుండి తీసుకోబడినది.
పుస్తకం: ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్