జీవనోపాధి గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో |  ఖుత్ బాతే నబవీ ﷺ

జీవనోపాధి గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో [6p] [PDF]

وَمِنْهُمْ مَنْ يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ 

ప్రజల్లోనే మరికొందరు, “ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. (అల్ బఖర 2: 201) 

ప్రియసోదరులారా! 

నేటి జుమా ప్రసంగంలో ‘జీవనోపాధి’ గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో తెలుసుకుందాం. అల్లాహ్ సూరా మూమినూన్, 51వ ఆయతులో ప్రవక్తలందరినీ సంబోధిస్తూ ఇలా సెలవిస్తున్నాడు: 

يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
ఓ ప్రవక్తలారా! పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చేయండి. మీరు చేసేదంతా నాకు తెలుసు.” (అల్ మూమినూన్ 23 : 51) 

ప్రవక్తలకు గల గౌరవస్థానం సర్వ సృష్టిలో మరెవ్వరికీ లేదు. వారి స్థానం ఎంత గొప్పదో వారికి ఇవ్వబడిన పై ఆజ్ఞ కూడా అంతే గొప్పది! బ్రతుకు తెరువుకోసం పై ప్రపంచంలో జీవనం గడపటంకోసం ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన వస్తువులను సంపాదించాలని పై ఆయతులో ప్రవక్తలందరికీ ఆదేశించబడింది. 

ఇక ఖుత్బాయే మస్నూన తరువాత నేను పఠించిన మరొక ఆయతులో ఇహపరాల మంచికై వేడుకోలు ఉంది. 

విశ్వాసి సాఫల్యమార్గాన్ని ఎన్నుకుని తన ఇహలోక జీవితాన్ని ఎంత చక్కగా, అందంగా తీర్చిదిద్దుకుంటాడో దాని మీదనే అతని పరలోక జీవితం, సాఫల్యం ఆధారపడి ఉంటుంది. ప్రాపంచిక జీవిత సంస్కరణలో మొట్టమొదటగా ప్రాముఖ్యత ఇవ్వదగిన విషయం-మనిషి సంపాదన. మనిషి సంపాదన ధర్మసమ్మతమైనదైతే, పరిశుద్ధమైనదైతే అతని జీవితంలోని ఇతర విషయాలు కూడా శుభప్రదమవుతాయి. 

మనిషి ప్రాపంచిక జీవితానికి ధర్మ సమ్మతమైన (హలాల్) సంపాదన ఎంతో అవసరం. ఖుర్ఆన్, హదీసులలో ఏ విధంగా నమాజ్, రోజా, జకాత్, హజ్ గురించి పదేపదే తాకీదు చేయబడిందో అదే విధంగా హలాల్ సంపాదన గురించి కూడా నొక్కి చెప్పటం జరిగింది. దానికి గల మార్గాలు ఎంతో చక్కగా విశ్లేషించబడ్డాయి. హలాల్ సంపాదనకుగల ప్రాముఖ్యతను, విశిష్ఠతను దాని లాభాలను, ప్రయోజనాలను స్పష్టపరచటం జరిగింది. 

తన మార్గంలో హలాల్ సంపాదనకై కృషి చేయమని ప్రత్యేక ఆజ్ఞ ఇస్తూ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ
నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి, దైవానుగ్రహాన్ని అన్వేషిం చండి. ఎక్కువగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు“. (అల్ జుమఅ 62:10) 

వ్యాపారం కోసం, సంపాదన కోసం దైవ అనుగ్రహాలను అన్వేషించాలని, ఆరాధన తరువాత మళ్ళీ తమ విధి నిర్వహణలో నిమగ్నమైపోవాలని, వ్యవసాయం చేసేవారు, ఇతర వృత్తి పనులు చేసుకునేవారు తమ తమ కార్యకలాపాల్లో చేరి పోవాలనేది ఈ ఆయత్ భావం. 

‘హలాల్ సంపాదన’ కూడా మనిషి విధే. అది లేనిదే అతని జీవన రథం ధర్మపథంలో ముందుకు సాగదు మరి! దానిని సాధించటానికి శక్తికొలదీ శ్రమించాలి. ఇలా చేసే శ్రమకు ప్రతిఫలం, పుణ్యం లభిస్తుంది. 

బ్రతుకు తెరువుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటంలో వ్యాపారం ప్రధాన భూమికను నిర్వహిస్తుంది. అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  తన యవ్వనంలో వ్యాపారం చేసేవారు. వ్యాపారం కేవలం లాభదాయకమైన, శుభప్రదమైన అంశం మాత్రమే కాదు, అది దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  సంప్రదాయం కూడా. 

వ్యాపార విశిష్ఠతను తెలిపే కొన్ని ప్రవచనాలను, విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని శ్రద్ధగా విని, అర్థం చేసుకొని, వాటిని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక! ఆమీన్.. 

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం: దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: 

التاجرُ الصَّدُوقَ الأَمِينُ مَعَ النَّبِيِّينَ ، وَالصَّدِّيقِينَ ، وَالشُّهَدَاءِ 
అత్తాజిరుస్ స్సదూకుల్ అమీను మఅన్నబియ్యాన వస్సిద్ధిఖీన వష్ షుహదా

ధర్మంగా వ్యాపారం చేసే నిజాయితీ పరుడైన ముస్లిం ప్రళయదినాన దైవ ప్రవక్తల వెంట అమరవీరుల వెంట, సత్యవంతుల వెంట ఉంటాడు“. (సునన్ తిర్మిజీ) 

ఈ హదీసు ప్రకారం నిత్యం నీతి, నిజాయితీ, సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మోసానికి దూరంగా ఉండేదే అల్లాహ్ దృష్టిలో సిసలైన వ్యాపారం. ఇలాంటి వ్యాపారం శుభం ఉంటుంది. ఇలాంటి వ్యాపారం చేసేవారు ప్రపంచంలోనూ అభివృద్ధిలోకి వస్తారు. పరలోకంలో కూడా సాఫల్యం పొందుతారు. (సునన్ తిర్మిజీ) 

అబూ ఉబైదా బిన్ రిఫాఅ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “దైవ భీతితో అసత్యం, దగా మోసములను త్యజించి, ప్రజల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ, అత్యంత నిజాయితీగా వ్యాపారం చేసేవారు తప్ప మిగతా వ్యాపారులంతా ప్రళయదినాన హష్ మైదానంలో దుర్మార్గులు, పాపాత్ముల రూపంలో హాజరుపరచబడతారు”. 

అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహం అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:

طلب كسب الحلال فريضة بعد الفريضة
“తలబు కస్బిల్ హలాలి ఫరీజతున్ బాదల్ ఫరీజతి”

హలాల్ సంపాదన కోసం ఏదైనా వ్యాపారం చేయటం అల్లాహ్ విధుల తరువాత ఒక పెద్ద విధి“. (సహీహ్ బుఖారీ) 

అందుకే తల్లిదండ్రులు తమ సంతానానికి ధార్మిక విషయాలు, విధ్యా బుద్దులు నేర్పించటంతో పాటు జరుగుబాటుకోసం వారికి ఏదైనా ఒక మంచి పని నేర్పించాలి. 

రాఫే బిస్ ఖదీజ్ కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఆయన అనుచరులు ‘దైవ ప్రవక్తా!’అతి శ్రేష్ఠమైన, ధర్మసమ్మతమైన సంపాదన (వ్యాపారం) ఏదని” ప్రశ్నించగా – عمل الرجل بيده وكل بيع مبرور “అమలుర్రజులి బియదిహీ వకుల్లు బైయిన్ మబ్ రూర్ ” మనిషి తన స్వహస్తాలతో ఏదైనా పని చేస్తే వచ్చే సంపాదన అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)  బదులిచ్చారు. (ముస్నద్ అహ్మద్) 

కుట్టుపని, కుమ్మరి, వడ్రంగి పనులు, ఫ్యాక్టరీల్లో మిషన్లు నడపటం, దుస్తులు నేయటం, దుక్కి దున్నటం, వ్యాపార సామగ్రి చేతితో చేయటం, ఇలాంటి పనులన్నీ స్వహస్తాలతో చేసే పనుల క్రిందికే వస్తాయి. వీటన్నింటిని అల్లాహ్ ఇష్టపడతాడు. వీటి ద్వారా వచ్చే సంపాదన ధర్మ సమ్మతమైనది, చాలా శ్రేష్టమైనదీను. అందుకోసమే ముస్లిం ఏ పని చేసినా అతనికి పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్, ఉపవాసాలతో పాటు పొలం దున్నటం, ఫ్యాక్టరీ నడపటం, కాయకష్టం చేయటం వీటన్నింటికీ పుణ్యాలు లభిస్తాయి. 

ప్రజలకు ఇలాంటి సత్కార్యాల గురించి తెలుపుతూ ఇందుకోసం వారిని ప్రోత్సహించటం ముస్లిం పండితుల బాధ్యత. ఖుర్ఆన్ గ్రంథంలో అల్లాహ్ సమాజ్ నెలకొల్పండి, జకాత్ విధిధానం చెల్లించండి అని అనేక చోట్ల ప్రస్తావించాడు. ప్రతి ముస్లిం ఆరాధన చేస్తూ ధర్మసమ్మతమైన మార్గంలో సంపాదించి ధనికులయి జకాత్ చెల్లించగలగాలి. అదే ఈ ఆయత్ లక్ష్యం. ఇస్లామీయ చరిత్రలో ఉస్మాన్ బిన్ అప్పన్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ లాంటి సుప్రసిద్ధ సహచరుల సంఘటనలు మనందరికి గర్వకారణం, ఆదర్శప్రాయం. ఇస్లాం ధర్మసేవ కోసం, దైవ ప్రసన్నతకోసం వారు తమ సంపదనంతా ధారపోశారు. 

హదీసువేత్తలు వ్యాపార విశిష్ఠతను దృష్టిలో ఉంచుకునే నమాజ్, రోజా జకాత్ ప్రకరణాలతో పాటు వాణిజ్య ప్రకరణాన్ని (కితాబుల్ బుయు) ను కూడా తమ హదీసు గ్రంథాల్లో పొందుపరిచారు. వ్యాపార, వాణిజ్యాలకు సంబంధించిన ఆదేశాలన్నీ అందులో మనకు లభిస్తాయి. ఏయే వ్యాపార కార్యాలు ధర్మ సమ్మతమో మరేవీ కావో బోధపడతాయి. వాటిని అధ్యయనం చేస్తే వ్యాపార నిబంధనలు మనకు తెలియటంతోపాటు ధార్మిక, ప్రాపంచిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. 

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) భూమిపై, సముద్రంలో చేసే వ్యాపారాల గురించి వేర్వేరు అధ్యాయాల ద్వారా ఎన్నో విషయాలను తెలియపరిచారు. వాటిలో దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలు ఎన్నో మనకు మార్గదర్శకం అవుతాయి. వాటి ద్వారా వాటి ఆవశ్యకత, ప్రాధాన్యత బోధపడుతుంది. 

మిఖ్దాం(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “స్వహస్తాలతో సంపాదించి తిన్న దానికంటే శ్రేష్ఠమైన తిండి మరేది కాజాలదు. నిశ్చయంగా దావూద్ (అలైహిస్సలాం) తమ స్వహస్తాలతో శ్రమించి ఆర్జించిన సంపాదనను భుజించేవారు“. (సహీహ్ బుఖారీ) 

హజ్రత్ హుజైఫా(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పూర్వకాలానికి చెందిన ఒక వ్యాపారస్తుణ్ణి గురించి ఇలా ప్రస్తావించారు: పూర్వకాలంలో దైవదూతలు ఒక వ్యక్తి ప్రాణం తీసుకున్నారు. తరువాత అతన్ని “ప్రపంచం నుండి నీవేమైన మంచి పనులు తీసుకువచ్చావా”? ఇలా అడిగారు. దానికావ్యక్తి, నా దగ్గర పనిచేసే యువకులకు ‘అభాగ్యులైన రుణగ్రస్తుల రుణాన్ని మాఫీ చేయండి’ అని చెబుతూ ఉండేవాణ్ణి. అంతే, ఈ ఒక్క సత్కార్యాన్నే నా వెంట తీసుకొచ్చాను’ అని బదులిచ్చాడు. ఈ మాట చెప్పిన తరువాత దైవప్రవక్త ఇలా ఉద్బోధించారు; దైవాజ్ఞతో దైవ దూతలు కూడా ఆ వ్యక్తిని మన్నించారు. అతడు మన్నించబడ్డాడు. (సహీహ్ బుఖారీ). మనందరికి అల్లాహ్ అలాంటి సద్బుద్ధిని ప్రసాదించు గాక! ఆమీన్. 

వ్యాపారమే కాకుండా హస్తకళలాంటి వృత్తులు కూడా మంచి జీవనోపాధిని కలుగజేస్తాయి. వాటిలో బట్టలు నేసీ, అల్లె పని చాలా ప్రధానమైనది. ఎందుకంటే మనిషికి తిండితోపాటు గుడ్డకూడా చాలా అవసరం కాబట్టి ఈ వృత్తి చేస్తే మనం జీవించటమేకాకుండా ఇతరులకు కూడా దుస్తుల్ని అందించగలం. 

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ వృత్తికి సంబంధించి ఒక ప్రత్యేక అధ్యాయాన్నే ఏర్పరిచారు. ఆ కాలంలో బట్టలు నేసే ఒక స్త్రీ గురించి అందులో ప్రస్తావించారు. అబూ హజం కథనం : నేను సహ్ల్ బిన్ సాద్ చెబుతుండగా విన్నాను:

ఒక స్త్రీ ఒక బుర్దా (అంచు దుప్పటి) తీసుకొని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చింది. (ఈ సందర్భంగా సహల్ బిన్ సాద్ – బుర్దా అంటే ఏమిటో తెలుసా అని ప్రజల్ని ప్రశ్నించారు. అవును తెలుసు అంచుగల దుప్పటిని ‘బుర్దా’ అంటారని వారు సమాధనమిచ్చారు) ఆ స్త్రీ ఇలా అంది: దైవ ప్రవక్తా! దీనిని నేను నా స్వహస్తాలతో ప్రత్యేకంగా మీ కోసమే చేసి తీసుకువచ్చాను. దాని అవసరం ఉండటం చేత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిని స్వీకరించారు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిని తన అంగ వస్త్రంగా ధరించి బయటకు వచ్చే వారు.

సమావేశంలో ఉన్న ఒక సహచరులు మదీనా నగర సుప్రసిద్ద వ్యాపారి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్తా(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వస్త్రాన్ని మీరు నాకు ప్రసాదించరా! అని అడిగారు. ‘సరే తీసుకో’ అని చెప్పి అక్కడే కాసేపు కూర్చోని తరువాత ఇంటికి వచ్చి ఆ వస్త్రాన్ని తీసి మడత పెట్టి అబ్దుర్రహ్మాన్ ఇంటికి పంపారు. దానిపట్ల ప్రజలు – ప్రవక్తకు కానుకగా ఇవ్వబడిన ఆ వస్త్రాన్ని మీరు అడగటం ఏమీ బాగా లేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)  అడిగిన వారికి ‘లేదు’ అని చెప్పరని మీకు తెలుసుకదా” అని అబ్దుర్రహ్మాన్ని నిలదీశారు. అపుడు అబ్దుర్రహ్మాన్ ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా! నేను ఆ వస్త్రాన్ని ఎందుకు కోరానంటే నేను మరణించిన తరువాత అదే నా శవవస్త్రం (కఫన్) కావాలని ఆశించాను”. ఆయన ఆశించినట్లే అలాగే జరిగిందని సహల్ తెలియజేశారు. అబ్దుర్రహ్మాన్ మరణం తరువాత ఆ దుప్పటిని ఆయన శవవస్త్రం (కఫన్)గా ఉపయోగించటం జరిగింది. 

కుట్టుపని, వడ్రంగి, కుమ్మరి ఇలాంటివి అనేక వృత్తి విద్య, వృత్తుల గురించి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారు తమ గ్రంథంలో పొందుపరచి, వాటిలో ఏ వృత్తి పని చేయటానికి కూడా తలవంపుగా భావించవలసిన అవసరంలేదని నిరూపించారు. ఎందుకంటే కొందరు వాటిని నామోషిగా, సిగ్గు చేటుగా భావిస్తారు. అలా భావించటం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలకు విరుద్ధం. వ్యవసాయం కూడా మంచి వృత్తే. దాని ద్వారా కూడా జీవనోపాధిని సమకూర్చుకోవచ్చు. 

నేడు ముస్లింలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ వారి కార్యాచరణలోను, ఆలోచనల్లోనూ విజయాన్ని, ధృఢసంకల్నాన్ని ప్రసాదించుగాక! ఆమీన్. 

ఇతర జాతుల్లో ఎన్నో సంస్థలు, కమిటీలు తమ జాతి యువకులు నిరుద్యోగ సమస్యను దూరం చేసే పనిలోనే తలమునకలై ఉన్నాయి. మనం కూడా నిరుద్యోగ నిర్మూలన బాధ్యతను స్వీకరించి మన యువకులకు వీటి గురించి తెలిపి వారికి బ్రతుకు తెరువు మార్గాలను చూపుదాం. నేడు జీవనోపాధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అత్యాధునిక ఉపాధి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక పరికారాలను అందుబాటులోకి తీసుకురావటం కూడా గొప్ప పుణ్యకార్యమే. మన యువతను కూడా వారికి నచ్చిన రంగాల్లోకి పంపితే వారు కూడా ఎన్నో కర్మాగారాల, వ్యాపార మార్కెట్లకు యజమానులు అవుతారు. 

అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించు గాక! ఆమీన్. 

ఈ పోస్ట్ జీవనోపాధి గురించి ఖుర్ఆన్, హదీసుల వెలుగులో [6p] [PDF] అనే ఖుత్బా నుండి తీసుకోబడినది.
పుస్తకం: ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్