దైవ ప్రవక్త ﷺ ప్రేమ లో “గులూ” (అతిగా ప్రవర్తించడం, మితి మీరి పోవడం) [వీడియో & టెక్స్ట్]

దైవ ప్రవక్త ﷺ ప్రేమ లో “గులూ” (అతిగా ప్రవర్తించడం, మితి మీరి పోవడం) [వీడియో]
https://youtu.be/obwMyhfkPeM [10 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ‘ఘులూ’ (غلو) అనే ఇస్లామీయ భావనను వివరించబడింది, అనగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమలో హద్దులు మీరడం లేదా అతిశయించడం. సూరహ్ అన్-నిసాలోని ఖుర్ఆన్ వాక్యం ఆధారంగా, మతంలో ‘ఘులూ’ చేయడం నిషిద్ధమని స్పష్టం చేయబడింది. ప్రవక్తకు దైవత్వపు గుణగణాలను ఆపాదించడం లేదా ఆయనను అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అనే స్థాయి నుండి దైవత్వపు స్థాయికి పెంచడం వంటివి ‘ఘులూ’కు ఉదాహరణలుగా పేర్కొనబడ్డాయి. క్రైస్తవులు మర్యం కుమారుడైన ఈసా (అలైహిస్సలాం)ను ప్రశంసించడంలో హద్దులు మీరినట్లు, తనను అలా అతిగా పొగడవద్దని ప్రవక్త స్వయంగా హెచ్చరించారు మరియు తనను “అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త” అని మాత్రమే పిలవమని బోధించారు. అల్లాహ్ యొక్క ప్రత్యేక హక్కులకు మరియు ఆయన దాసుల హక్కులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇబ్నె ఖయ్యిమ్ పద్యం ద్వారా కూడా వివరించబడింది. ముగింపుగా, ప్రవక్తను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి కానీ అది అతిశయం అనే పాపంలోకి వెళ్లకుండా, ఇస్లాం యొక్క సమతుల్యమైన మధ్య మార్గాన్ని అనుసరించాలని నొక్కి చెప్పబడింది.

اِنَّ الْحَمْدَ لِلّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ.
ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహు, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదహు, అమ్మా బఅద్.
నిశ్చయంగా, సర్వ స్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్‌కే శోభాయమానం. ఎవరి తర్వాత ఏ ప్రవక్తా రాబోరో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
(మీకు అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక)

ఈరోజు మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమలో ‘ఘులూ’ (غلو) చేయటం గురించి తెలుసుకుందాం. ‘ఘులూ’ ఇది అరబీ పదం. ‘ఘులూ’ అంటే ఒకరి ప్రేమలో మితిమీరి పోవటం. దీనిని షరీఅత్ పరిభాషలో ‘ఘులూ’ అంటారు. ఒకరి ప్రేమలో హద్దు దాటటం, మితిమీరి పోవటం. దీనిని ‘ఘులూ’ అంటారు. తెలుగులో అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించటం అని చెప్పవచ్చు. అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించటం. ఇది షరీఅత్ పరిభాషలో ‘ఘులూ’ అంటే.

అల్లాహ్ సుబ్ హానహు వ తఆలా సూరహ్ నిసా, ఆయత్ నెంబర్ 171లో ఇలా సెలవిచ్చాడు:
لَا تَغْلُوا فِي دِينِكُمْ (లా తగ్‌లూ ఫీ దీనికుమ్)
“మీరు మీ ధర్మం విషయంలో అతిశయించకండి, హద్దు మీరకండి, మితిమీరకండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ తఆలా సెలవిచ్చాడు.

దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యెడల ‘ఘులూ’ చేయటం అంటే, అతిశయించడం అంటే ఏమిటి? ఉదాహరణకు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్పతనాన్ని వర్ణించేటప్పుడు మితిమీరిపోవటం. సూటిగా చెప్పాలంటే, ఆయన్ని, అంటే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని, దైవ దాస్యపు మరియు దైవ దౌత్యపు స్థానము నుండి మరింత పైకెత్తటం. ఇది ‘ఘులూ’ అంటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక స్థానం ఉంది. దైవ దాస్యపు స్థానం ఉంది, దైవ దౌత్యపు స్థానం ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంని ఆ స్థానం నుంచి పైకి ఎత్తటం. అంటే, దైవత్వపు కొన్ని గుణాలను ఆయనకు ఆపాదించటం. అల్లాహ్‌ను వదలి సహాయం కొరకు ఆయన్ని అర్థించటం, ఇవన్నీ ‘ఘులూ’ క్రిందికి వస్తాయి.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది:

لَا تُطْرُونِي كَمَا أَطْرَتِ النَّصَارَى ابْنَ مَرْيَمَ، فَإِنَّمَا أَنَا عَبْدُهُ، فَقُولُوا عَبْدُ اللَّهِ وَرَسُولُهُ.
లా తుత్రూనీ కమా అత్రతిన్ నసారబ్న మర్యమ, ఫ ఇన్నమా అన అబ్దుహు, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.
క్రైస్తవులు మర్యం కుమారుడిని (ఈసాని) పొగడడంలో హద్దులు మీరినట్లు మీరు నన్ను పొగడకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడిని మాత్రమే. కనుక నన్ను ‘అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త’ అని అనండి.

“క్రైస్తవులు మర్యం కుమారుడగు ఈసా అలైహిస్సలామును పొగడటంలో మితిమీరినట్లు, మీరు నా ప్రశంసలో మితిమీరకండి. నేను దాసుడిని మాత్రమే. కనుక నన్ను దైవ దాసుడని, దైవ ప్రవక్త అని అనండి” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మనం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ గురించి తెలుసుకున్నాం. అంతిమ దైవ ప్రవక్తను ప్రేమించాలి. అత్యధికంగా ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. కాకపోతే, ఆ ప్రేమలో ‘ఘులూ’ చేయకూడదు. ‘ఘులూ’ అంటే ఏమిటో తెలుసుకున్నాం, అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించడం, ప్రవక్త గారి స్థానాన్ని మించి పైకి ఎత్తటం. ఏ విధంగానైతే క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంను ఆయనను పొగడే విషయంలో హద్దు మీరారు, అతిశయించారు, తత్కారణంగా ఏమైంది? దేవుని స్థానములో, దేవునికి సమానంగా నిలబెట్టారు ఈసా అలైహిస్సలాంని క్రైస్తవులు. ఆ విధంగా నాకు పొగడే విషయంలో, నా ప్రశంస విషయంలో మీరు ఆ విధంగా హద్దు మీరకండి, ‘ఘులూ’ చేయకండి, అతిశయించకండి అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని బోధించారు, హెచ్చరించారు.

అభిమాన సోదరులారా! ఇబ్నె ఖయ్యిమ్ రహమతుల్లాహి అలైహి ఒక కవిత్వములో ఇలా తెలియజేశారు, ఖసీదా నూనియ్యాలో. ఖసీదా అంటే పద్యము. నూనియ్యా అంటే ఆయన ఒక అనేక పద్యాలు రాశారు, ఒక పద్యంలో ప్రతి అక్షరం ‘నూన్’తో ముగిస్తుంది. ఆ పద్యంలోని ప్రతి వాక్యంలో చివరి అక్షరం ‘నూన్’ ఉంటుంది. అందుకు ఆ పద్యం పేరే ఖసీదా నూనియ్యా అని పడిపోయింది. ఆ ఖసీదా నూనియ్యాలో ఒకచోట అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు, వ్యాఖ్యానించారు:

لِلهِ حَقٌّ لَا يَكُونُ لِغَيْرِهِ … وَلِعَبْدِهِ حَقٌّ هُمَا حَقَّانِ
لَا تَجْعَلُوا الْحَقَّيْنِ حَقًّا وَاحِدًا … مِنْ غَيْرِ تَمْيِيزٍ وَلَا فُرْقَانِ
లిల్లాహి హఖ్ఖున్ లా యకూను లిగైరిహి, వ లి అబ్దిహి హఖ్ఖున్ హుమా హఖ్ఖాని.
లా తజ్అలుల్ హఖ్ఖైని హఖ్ఖన్ వాహిదన్, మిన్ గైరి తమ్ యీజిన్ వలా ఫుర్ఖాన్.

“అల్లాహ్ యొక్క ఒక హక్కు ఉంది, అది ఎవరికీ చెందదు, దైవ ప్రవక్తలకు కూడా చెందదు. అల్లాహ్‌కు ఒక హక్కు ఉంది, అది ఎవరికీ చెందదు. మరియు ఆయన దాసుని హక్కు ఒకటి ఉంటుంది, దాసునికి కూడా ఒక హక్కు ఉంటుంది. ఇవి రెండూ వేరు వేరు హక్కులు. అల్లాహ్ హక్కు వేరు, దాసుని హక్కు వేరు. కనుక, ఆ రెండు హక్కులను విచక్షణారహితంగా ఒకే హక్కుగా చేయకండి.”

ఆధారం లేకుండా, విచక్షణారహితంగా రెండు హక్కులను ఒకటిగా చేయకండి. అల్లాహ్ హక్కు, దాసుని హక్కు ఒకటి కాదు. అంటే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసుడే కదా. అల్లాహ్ సృష్టికర్త, మనమందరము సృష్టి. ఆ సృష్టిలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒక సృష్టి, దాసుడే. అందుకు అల్లాహ్ హక్కు, అల్లాహ్ దాసుని హక్కు సమానం కాజాలవు, ఒకటిగా అవ్వవు.

అభిమాన సోదరులారా! చెప్పటం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమలో ‘ఘులూ’ చేయకూడదు. అది అధర్మం, ఇస్లాంలో దానికి సమ్మతం లేదు, సమ్మతించబడలేదు ఇస్లాంలో. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక స్థానం ఉంది. ఆ స్థానం నుంచి ఆయనకి పైకి తీసుకుని పోకూడదు, కింద దించకూడదు. ఇదే ఉమ్మతే వసత్. ఇస్లాం ధర్మం, దీనె వసత్. హద్దు మీరకూడదు, తక్కువ స్థాయికి దించకూడదు.

అభిమాన సోదరులారా! అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవుడే. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసులే. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సృష్టిలో ఒక సృష్టి. అందరికంటే ప్రేమ అంతిమ దైవ ప్రవక్త పట్ల కలిగి ఉండాలి, అందరికంటే ఎక్కువ. కాకపోతే, హద్దు మీరకూడదు, అతిశయించకూడదు, మితిమీరకూడదు. ఆయన ప్రేమలో ‘ఘులూ’ ఉండకూడదు అని తెలుసుకున్నాము. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన మనిషి అయినప్పటికీ, దైవ దాసుడు అయినప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం ఏమిటి, ఆ ప్రత్యేకతలు ఏమిటి, ఇన్షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ.
వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. మీకు అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక.