అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు? [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు?
https://youtu.be/aLKl1fLh9eQ [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ

“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.” (సూర బఖర 2:186)

అల్లాహ్ మనతో పాటు ఉన్నాడన్న విశ్వాసం “అల్లాహ్ పై విశ్వాసం”లోని ఓ ముఖ్యమైన భాగం. అరబీలో ‘మఇయ్యతుల్లాహ్’ అనబడుతుంది. అల్లాహ్ తనకు తగిన రీతిలో ఏడు ఆకాశాల పైన తన అర్ష్ పై ఉన్నాడు. ఇందులో ఏ అనుమానం లేదు. ఖుర్ఆనులో ఎన్నో ఆయతులున్నాయి. ఉదాహరణకు చూడండి సూర తాహా 20:5

అయితే ఇది (‘మఇయ్యతుల్లాహ్’) రెండు రకాలు 1: ‘మఇయ్య ఆమ్మ’ 2: ‘మఇయ్య ఖాస్స’

1: ‘మఇయ్య ఆమ్మ’ అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా సర్వ సృష్టి వెంట ఉన్నాడు, అంటే సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ వింటూ ఉన్నాడు. దీనికి దివ్య ఖుర్ఆన్ సూర హదీద్ 57:4 లో ఉంది:

هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

“ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.” (సూర హదీద్ 57:4)

2: ‘మఇయ్య ఖాస్స’: అంటే పై భావంతో పాటు ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడని కూడా భావం వస్తుంది.

దీనికి ఆధారంగా అనేక ఆయతులు హదీసులున్నాయి.

قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ

“మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. అంతా వింటూ, చూస్తూ ఉంటాను” అని సమాధానమిచ్చాడు అల్లాహ్. (సూర తాహా 20:46)

… إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ أَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا…

“బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్‌ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్‌ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. (సూర తౌబా 9:40)

 إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ
“నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.” (సూర నహ్ల్ 16:128)

పై మూడు ఆయతుల వ్యాఖ్యానంలో ఇమాం ఇబ్ను తైమియా (రహిమహుల్లాహ్) చెప్పారు:

“అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అబూ బక్ర్ కు తోడుగా ఉండి, సహాయ పడ్డాడు అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యెతిరేకంగా, మూసా (అలైహిస్సలాం) మరియు హారూన్ (అలైహిస్సలాం)కు తోడుగా ఉండి, సహాయం అందించాడు ఫిర్ఔన్ కు వ్యెతిరేకంగా, ఇంకా భక్తిపరులకు, సద్వవర్తనులకు తోడుగా ఉండి, సహాయపడ్డాడు పాపాత్ములు, దౌర్జన్యపరులకు వ్యెతిరేకంగా.”

(మజ్మూఉల్ ఫతావా 11/ 249-250)

ఈ ప్రసంగంలో అల్లాహ్ మనతో ఎలా ఉన్నాడు (మయ్యతుల్లాహ్) అనే భావనను ఇస్లామీయ విశ్వాసం ప్రకారం వివరించబడింది. అల్లాహ్ ప్రతిచోటా భౌతికంగా ఉన్నాడు అనే సాధారణ తప్పుడు అభిప్రాయాన్ని ఖండిస్తూ, సరైన విశ్వాసం ప్రకారం అల్లాహ్ ఏడు ఆకాశాలపైన, తన అద్వితీయతకు తగిన విధంగా అర్ష్ (సింహాసనం) పై ఉన్నాడని ఖురాన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క సామీప్యం రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. మొదటిది ‘మఇయ్య ఆమ్మ’ (సాధారణ సామీప్యం), ఇది సర్వ సృష్టికి వర్తిస్తుంది. అంటే అల్లాహ్ తన జ్ఞానం, దృష్టి మరియు వినికిడి ద్వారా ప్రతిదాన్ని గమనిస్తూ, పరివేష్టించి ఉన్నాడు. రెండవది ‘మఇయ్య ఖాస్సా’ (ప్రత్యేక సామీప్యం), ఇది కేవలం ప్రవక్తలు మరియు విశ్వాసులకు మాత్రమే లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క ప్రత్యేక సహాయం, మద్దతు మరియు మార్గదర్శకత్వం రూపంలో ఉంటుంది. ఈ రెండు రకాల సామీప్యాలను వివరించడానికి ప్రవక్తలు మూసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితాల నుండి ఖురాన్‌లో పేర్కొనబడిన సంఘటనలను ఉదాహరణలుగా చూపించారు.

అల్లాహ్ మనతో పాటు ఏ విధంగా అతి దగ్గరిలోనే ఉన్నాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది ఏమంటారు? అల్లాహ్ హర్ జగహ్ హై (అల్లాహ్ ప్రతిచోటా ఉన్నాడు). అల్లాహ్ హమారే దిల్ మే హై (అల్లాహ్ మా హృదయాల్లో ఉన్నాడు). ఇంకా దీనికి సంబంధించిన కొన్ని శ్లోకాలు గేయాల మాదిరిగా చదువుతూ ఉంటాడు. అందు లేడు ఇందు గలడు ఈ విధంగా. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని మనం చెప్పవద్దు. అల్లాహ్ అంతటా ఉన్నాడు, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, మస్జిద్ లో ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, ఫలానా ఫలానా ఏమేమో అంటూ ఉంటారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్.

సరైన ఇస్లామీయ విశ్వాసం

సరియైన విశ్వాసం అల్లాహ్ గురించి, అల్లాహు తఆలా తన అస్తిత్వంతో ఏడు ఆకాశాలపైన అర్ష్ పై ఉన్నాడు. అయితే, అల్లాహు తఆలా మనతో ఉన్నాడు అని మనం ఏదైతే అంటామో, దీనిని

معية الله
మఇయ్యతుల్లాహ్ అని అరబీలో అనడం జరుగుతుంది.

అల్లాహు తఆలా అర్ష్ పై ఉన్నాడు, ఖురాన్‌లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు:

الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ
అర్రహ్మాను అలల్ అర్షిస్తవా
(ఆ కరుణామయుడు) సింహాసనంపై ఆసీనుడయ్యాడు.
(సూరతు తాహా, సూర నంబర్ 20, ఆయత్ నంబర్ 5).

అయితే ఈ మఇయ్యతుల్లాహ్, అల్లాహ్ మన వెంట ఉన్నాడు అనే భావం ఏదైతే మనం, మాట ఏదైతే మనం పలుకుతామో, ఇందులో రెండు భావాలు వస్తాయి, రెండు రకాలు వస్తాయి. ఒకటి మఇయ్య ఆమ్మ, రెండవది మఇయ్య ఖాస్స.

మఇయ్య ఆమ్మ (సాధారణ సామీప్యం)

మఇయ్య ఆమ్మ అంటే ఏంటి? అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా, సర్వ సృష్టి వెంట ఉన్నాడు. అంటే, సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ ఉన్నాడు, వారిని వింటూ ఉన్నాడు, వారి గురించి అల్లాహ్ కు సర్వమూ తెలుసు. అమావాస్య చీకటి రాత్రి అయినా, లేకుంటే ఎలాంటి మబ్బు లేని, దుమ్ము లేని పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వెలుతురులోనైనా, అల్లాహ్ కు అంతా కూడా సమానమే. ఒక్కసారి సూరతుల్ హదీద్, సూర నంబర్ 57, ఆయత్ నంబర్ 4 చదవండి. శ్రద్ధగా దీని అర్థ భావాలను గమనించండి.

هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنْتُمْ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్) అధిష్టించాడు. భూమి లోపలికి పోయేది, అందులో నుంచి బయల్పడేది, ఆకాశం నుంచి క్రిందికి దిగేది, మరి అందులోకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మీరెక్కడా ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహు తఆలా చూస్తూనే ఉన్నాడు.

గమనించండి, అల్లాహ్ ఎక్కడున్నాడు? ఇస్తవా అలల్ అర్ష్ (అర్ష్ పై ఆసీనుడయ్యాడు) ఆ విషయం ఇందులోనే వచ్చేసింది. యఅలము (ఆయనకు తెలుసు), అల్లాహ్ కు అంతా తెలుసు. భూమిలోకి వెళ్లేది, భూమి నుండి బయటికి వచ్చేది, ఆకాశం నుండి దిగేది, ఆకాశం వైపునకు ఎక్కేది, అంతా కూడా అల్లాహ్ కు తెలుసు, అల్లాహ్ జ్ఞానంలో ఉంది. వహువ మఅకుమ్ (ఆయన మీకు తోడుగా ఉన్నాడు). అర్ష్ పై ఉండి అల్లాహ్ మీకు తోడుగా ఎలా ఉన్నాడు? అంటే ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనకు తెలుసు అంతా కూడా, ఆయన వింటూ ఉన్నాడు. అందుకొరకే ఆయత్ యొక్క చివరి భాగం ఏముంది?

وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
వల్లాహు బిమా తఅమలూన బసీర్
మీరు చేసే పనులన్నింటినీ కూడా అల్లాహ్ చూస్తూ ఉన్నాడు.

ఇది మఇయ్య ఆమ్మ, అంటే సర్వము ఈ సృష్టిలో ఉన్న ప్రతీ ఒక్కటి ఆయన వినుట, ఆయన యొక్క చూచుట, ఆయన యొక్క జ్ఞానం నుండి బయట ఏదీ లేదు.

మఇయ్య ఖాస్సా (ప్రత్యేక సామీప్యం)

ఇక మరొకటి రెండవ రకం మయ్య ఖాస్సా. ప్రత్యేకమైన తోడు. అదేమిటి? అంటే, ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడు అన్నటువంటి భావం కూడా వస్తుంది. దీనికి ఆధారాలు కూడా ఖురాన్ మరియు హదీసులలో ఎన్నో ఉన్నాయి.

ఉదాహరణకు సూరె తాహా, సూర నంబర్ 20, ఆయత్ నంబర్ 46 గమనించండి. మూసా అలైహిస్సలాం వారిని మరియు ఆయన యొక్క సోదరుడు హారూన్ అలైహిస్సలాంను అల్లాహు తఆలా ఫిరౌన్, ఎలాంటి దౌర్జన్యపరుడైన రాజు, తనకు తానే ప్రభువుగా అన్నాడు, అలాంటి రాజు వద్దకు పంపుతూ, అల్లాహు తఆలా మంచి బోధనలు చేసి మీరు ఎంతో మృదువుగా అతన్ని ఏకత్వం వైపునకు పిలవండి అని చెప్పారు. ఆ సందర్భంలో చిన్నపాటి ఒక కొంత భయం ఏదైతే కలిగిందో, స్టార్టింగ్ లో, ఎందుకంటే మూసా అలైహిస్సలాం ఫిరౌన్ యొక్క ప్యాలెస్ లోనే పెరిగారు కదా. అయితే, అక్కడ ఈ విషయాలను గుర్తుంచుకొని కొంచెం ఒక చిన్నపాటి భయం లాంటిది ఏదైతే కలిగిందో, అల్లాహు తఆలా ఈ ఆయత్, ఆయత్ నంబర్ 46, మీరు దానికంటే ముందు తర్వాత ఆయతులు ఖురాన్ తీసి చదవండి. ఈ ఆయతులో అల్లాహ్ ఏమంటున్నాడు?

قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
ఖాల లా తఖఫా, ఇన్ననీ మఅకుమా అస్మఊ వ అరా
(అల్లాహ్ అన్నాడు) మీరిద్దరూ భయపడకండి. నిశ్చయంగా నేను మీతోనే ఉన్నాను, నేను అంతా వింటూ ఉన్నాను మరియు చూస్తూ ఉన్నాను
.

మీరు చేస్తున్నది గాని, ఫిరౌన్ మీ పట్ల ఎలా ప్రవర్తిస్తాడు ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. అల్లాహు అక్బర్.

విశ్వాసి అల్లాహ్ యొక్క ఏదైనా ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, కొందరు ఎవరైనా వ్యతిరేకులు బెదిరిస్తున్నప్పుడు, అల్లాహ్ నాకు తోడుగా ఉన్నాడు, అల్లాహ్ యొక్క సహాయం నాకు లభిస్తుంది అన్నటువంటి పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఇలాంటి ఈ భావాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, సూరతుత్ తౌబా, సూర నంబర్ 9, ఆయత్ నంబర్ 40 చదవండి.

إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا
ఇజ్ యఖూలు లిసాహిబిహీ లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా
అతను తన సహచరునితో, “విచారించకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు” అని అన్న సందర్భం.

ఇందులో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ప్రస్తావన ఉంది. దీని యొక్క వ్యాఖ్యానం మీరు తెలుగు అహ్సనుల్ బయాన్, ఇంకా హదీసుల్లో కూడా చూడవచ్చు. సంక్షిప్త విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గార్-ఎ-సౌర్ లో మూడు రోజుల వరకు ఉన్నారో, మదీనా వలస పోయే సందర్భంలో, అక్కడ హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తఆలా అన్హు వారికి చాలా బాధ కలుగుతూ ఉండింది, శత్రువులు చూశారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఎంత తలబిరుసుతనంతో, దుష్ప్రవర్తనతో మెలగుతారో ఏమో అని. ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత మంచి రీతిలో అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ధైర్యం చెప్పారో గమనించండి.

ఇజ్ యఖూలు లిసాహిబిహీ, అప్పుడు ఆ సందర్భంలో తన మిత్రుడైన, ఆ సందర్భంలో తన వెంట ఉన్నటువంటి మిత్రునికి, ‘లా తహజన్‘, నీవు బాధపడకు. ‘ఇన్నల్లాహ మఅనా‘, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, అని ఓదార్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? అల్లాహ్ తఆలా ఆ ఘడియలో ప్రవక్తపై ప్రశాంతతను అవతరింపజేశాడు.

وَأَيَّدَهُ بِجُنُودٍ لَمْ تَرَوْهَا
వఅయ్యదహు బిజునూదిల్ లమ్ తరౌహా
మరియు మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు.

మూసా అలైహిస్సలాం, వెనక ఫిరౌన్ యొక్క లష్కర్, సైన్యం. ముంగట సముద్రం ఉంది. ‘ఇన్నాలముద్రకూన్‘ (నిశ్చయంగా మేము చిక్కిపోయాము) అని భయాందోళనకు గురియై అరుస్తున్నారు బనూ ఇస్రాయీల్. అప్పుడు మూసా అలైహిస్సలాం ఎంత నమ్మకంతో, దృఢమైన విశ్వాసంతో, పూర్తి ధీమాతో,

إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
ఇన్న మఇయ రబ్బీ సయహ్దీన్
నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నాకు మార్గదర్శకం చేస్తాడు, దారి చూపుతాడు.

ఎంత గొప్ప నమ్మకమో చూడండి. ఆ నమ్మకం ప్రకారంగా అల్లాహ్ యొక్క సహాయం అందిందా లేదా? అందింది. సముద్రంలో మార్గాలు, నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయి దారి అయిపోయింది. ఇటునుండి అటు దాటిపోయారు. అదే దారి మీద ఫిరౌన్ వచ్చాడు. అల్లాహు తఆలా సముద్రానికి ఆదేశించాడు, సముద్రం కలిసిపోయింది, నీళ్ళల్లో అదే సముద్రంలో, ఏ సముద్రంలో నుండైతే వీరికి మార్గం దొరికింది మరియు దాటిపోయారో, అదే సముద్రంలో ఫిరౌన్ మరియు అతని యొక్క సైన్యాన్ని అల్లాహు తఆలా ముంచి వేశాడు. అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాల పట్ల మనం ఏ రవ్వంత కూడా శంకించకూడదు మరియు వ్యతిరేకించి, అల్లాహ్ ను ధిక్కరించి అతని ఆదేశాలకు వ్యతిరేకంగా నడవకూడదు.

ఇలాంటి భావాలు చూస్తే ఇంకా ఎన్నో ఉన్నాయి. సూరతున్ నహల్ లో కూడా మీరు చదవండి. సూర నంబర్ 16, ఆయత్ నంబర్ 128. ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ ఈ సూరె నహల్ మరియు సూరె తౌబా, సూరె తాహా యొక్క ఆయతులు ఏవైతే సంక్షిప్తంగా చెప్పడం జరిగిందో వాటి యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ కు తోడుగా ఉండి సహాయపడ్డాడు, అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యతిరేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయం చేశాడు. ఇక మూసా అలైహిస్సలాం మరియు హారూన్ అలైహిస్సలాంకు తోడుగా ఉండి సహాయం అందించాడు ఫిరౌన్ కు వ్యతిరేకంగా. అలాగే, ‘ఇన్నల్లాహ మఅల్లజీనత్తఖౌ వల్లజీన హుమ్ ముహ్సినూన్’ సూరతున్ నహల్. విశ్వాసులకు తోడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నవారి మరియు సద్వర్తన కలిగి ఉన్నవారికి తోడుగా ఉన్నాడు, ఎవరికి వ్యతిరేకంగా? దౌర్జన్యపరులకు, పాపాత్ములకు వ్యతిరేకంగా. ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ యొక్క మాట ఇది. మజ్మూఉల్ ఫతావాలో ఉంది. వాల్యూమ్ నంబర్ 11, పేజ్ నంబర్ 249, 250.

అల్లాహ్ పై మనం దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ యొక్క విశ్వాసం దృఢంగా మనలో నిండి ఉండే విధంగా సత్కార్యాలు చేస్తూ ఉండే విధంగా అల్లాహ్ మనందరికీ భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్ (తఆలా) – (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1t8VyQxAKsZ5-yfRrX-ugp