మృతులు (చనిపోయిన వారు) వింటారా?
https://www.youtube.com/watch?v=96plKtzzef4 (51 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, సమాధులను సందర్శించే ప్రజలు చేసే షిర్క్ గురించి వివరించబడింది. గత ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని ముష్రికులు మరియు నేటి సమాధులను సందర్శించే ముస్లింల మధ్య నమ్మకాల పోలికను చర్చించారు. రెండు వర్గాలు అల్లాహ్ను ఏకైక సృష్టికర్తగా నమ్మినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా ఆయనను చేరుకోవాలని ప్రయత్నించారు, దీనిని ఖుర్ఆన్ షిర్క్గా పరిగణిస్తుంది. మృతులు వినగలరనే నమ్మకం కూడా షిర్క్కు దారితీస్తుందని, దీనికి సరైన ఆధారం లేదని వక్త తెలిపారు. బద్ర్ యుద్ధం తర్వాత ప్రవక్త మృతులతో మాట్లాడటం మరియు సమాధిలోని వ్యక్తి పాదాల శబ్దాన్ని వినడం వంటి హదీసులు ప్రత్యేక సందర్భాలని, సాధారణ నియమం కాదని స్పష్టం చేశారు. మృతులు వినలేరని, వారికి సహాయం చేసే శక్తి లేదని ఖుర్ఆన్ ఆయతుల ద్వారా నిరూపించారు. ప్రళయ దినాన, ఈసా (అలైహిస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తమ అనుచరులు తమ తర్వాత ఏమి చేశారో తమకు తెలియదని చెప్పడం, మృతులకు ప్రపంచ విషయాలతో సంబంధం ఉండదనేదానికి నిదర్శనం. ప్రజలు ఖుర్ఆన్ మరియు సహీ హదీసులను చదివి, షిర్క్ నుండి తమను తాము రక్షించుకోవాలని వక్త పిలుపునిచ్చారు.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.
సోదరులారా, గత పాఠంలో మనం సామాన్యంగా ప్రజలు సమాధుల వద్దకు ఎందుకు వెళ్తారు అనే దాని గురించి కొన్ని కారణాలు తెలుసుకున్నాము. వాటికి ఆధారంగా, నిదర్శనంగా, దలీల్గా వారు కొన్ని విషయాలు ఏదైతే ప్రస్తావిస్తారో వాటి యొక్క వాస్తవికత ఖుర్ఆన్ హదీసుల వెలుగులో తెలుసుకున్నాము.
సంక్షిప్తంగా మరోసారి మనం చెప్పుకోవాలంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి ముష్రికులు ఏకైక అల్లాహ్ను సృష్టికర్తగా, ఉపాధి ప్రధాతగా, సర్వ జగత్తుకు నిర్వాహకారునిగా నమ్మినప్పటికీ, కొందరు వలీలను, ఔలియాలను, బాబాలను నిర్ణయించుకుని, అల్లాహ్కు చేయనటువంటి ఆరాధనలు వారికి చేసేవారు. ఎందుకు చేసేవారు? మేము చాలా పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మాకు ముఖం లేదు. ఈ బాబాలు, పీర్లు, ఈ ముర్షదులు, ఈ వలీలు, ఔలియాలు వీరి సాధనంగా, వీరి ఆధారంగా, వీరి యొక్క మధ్యవర్తిత్వం వసీలాతో మేము అల్లాహ్ వద్ద చేరుకుంటాము, వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు. వారి యొక్క ఈ సాకు ఏదైతే ఉండినదో, ఈ రోజుల్లో సామాన్యంగా మన ముస్లింలు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో, బాబాల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క సాకు, వారి యొక్క కారణం కూడా అదే. మేము పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మా దగ్గర ముఖం లేదు. అల్లాహ్ యొక్క ఈ పుణ్యాత్ములు, ఔలియాలు వారి యొక్క మధ్యవర్తిత్వంతోనే మనం పోగలుగుతాము. వారి యొక్క సిఫారసుతోనే మనం అల్లాహ్కు సన్నిహితులుగా కాగలుగుతాము.
అయితే, సూరె యూనుస్ ఆయత్ నెంబర్ 18, సూరె జుమర్ ఆయత్ నెంబర్ 3 వీటి ఆధారంగా ఇదే అసలైన షిర్క్. ఇలాంటి షిర్క్ను ఖండించడానికే ప్రతీ కాలంలో అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపాడు అని మనం తెలుసుకున్నాము.
అంతేకాకుండా ఈ ఆయతులు, ప్రత్యేకంగా సూరె జుమర్ మరియు సూరె యూనుస్లో తెలుపబడిన ఈ ఆయతులను మనం చదివినప్పుడు సామాన్యంగా ఈనాటి ముస్లింలు కొందరు ఏమంటారు, ఈ ఆయతులు మాలాంటి వారి గురించి కాదు అవతరించినవి. ఆ కాలంలో విగ్రహాలను పూజించేవారు. ఆ విగ్రహాలకు వ్యతిరేకంగా ఈ ఆయతులు అవతరించాయి. అయితే మనం ఇందులో మరికొన్ని ఆధారాలు తెలిపి ఉన్నాము. ఉదాహరణకు, సూరె ఆరాఫ్ లోని ఈ ఆయతులో అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు,
عِبَادٌ أَمْثَالُكُمْ
(ఇబాదున్ అమ్సాలుకుమ్)
మీలాంటి దాసులు మాత్రమే.
అల్లాహ్ను కాకుండా మీరు ఎవరైతే ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీలాంటి మానవులు మాత్రమే. మీలాంటి దాసులు మాత్రమే. అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పారు, మీలాంటి దాసులు, మీలాంటి మానవులు. అంటే మక్కా యొక్క ముష్రికులు ఎవరినైతే వారికి మరియు అల్లాహ్కు మధ్య మధ్యవర్తిత్వంగా, సిఫారసుగా నిర్ణయించుకున్నారో వారు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు. రాళ్లతో, చెట్లతో, లేక వేరే వాటితో చేసిన కేవలం మూర్తులు మాత్రమే కాదు. సమాధిలో ఉన్న కొందరు పుణ్యాత్ములు, ఔలియాలు వారిని ప్రవక్తల కాలం యొక్క ముష్రికులు పూజించేవారు.
ఉదాహరణకు, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క హదీస్ కూడా వినిపించడం జరిగింది. తాయిఫ్ నుండి తాయిఫ్కు దగ్గర మక్కా మార్గంలో ‘లాత్’ అనే ఒక పుణ్యాత్ముడు హజ్ కు వచ్చే వాళ్లకు సత్తువ ఇట్లా తాగించి తినిపించేవాడు. అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయిన స్థలంలోనే అతన్ని సమాధి చేసి అక్కడే కొందరు ముజావర్గా కూర్చొని కొద్ది రోజుల తర్వాత వారిని అదే పూజించడం మొదలుపెట్టారు. ఇది సహీ హదీసులో ఉంది.
అంతేకాకుండా, హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కాలంలో ఐదుగురు పుణ్యాత్ములు ఏదైతే చనిపోయారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఏం చెప్పారు? నూహ్ అలైహిస్సలాం కాలంలో వీరు పుణ్యాత్ములు. నూహ్ అలైహిస్సలాం కాలంలో ఉన్నటువంటి ముష్రికులు వీరిని పూజించేవారు. అయితే తర్వాత నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన ఏదైతే తూఫాన్ ఉందో ఆ తూఫాన్ తర్వాత ఈ ఐదు పుణ్యాత్ముల విగ్రహాలు ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో అవి ఎక్కడో దాగిపోయి ఉన్నాయి. కానీ షైతాన్ వాడు అమర్ బిన్ లుహై అనే ఒక నాయకుడు మక్కాలో అతనికి ఏదో రకంగా తెలిపి జిద్దా ఒడ్డున, జిద్దాలో సముద్రం ఉంది కదా, సముద్ర తీరాన ఎక్కడో పాతి ఉన్న ఆ విగ్రహాలను తీసి మళ్లీ మక్కాలో తీసుకొచ్చి వాటి విగ్రహారాధన మరోసారి మొదలుపెట్టారు. అయితే అక్కడ వారు పూజించేది కేవలం విగ్రహం అనే కాదు. వీరు పుణ్యాత్ములు. పుణ్యాత్ముల ఒక ఆకారం, ఒక వారి రూపాన్ని మేము పూజిస్తున్నాము. వీరు మాకు ప్రళయ దినాన సిఫారసు చేస్తారు. అటువంటి నమ్మకాలు వారు ఉంచుకునేవారు.
మృతులు వినగలరా?
ఇంతవరకు మనం గత పాఠంలో ఏదైతే కొన్ని విషయాలు తెలుసుకున్నామో వాటి సంక్షిప్త విషయాలు ఇప్పుడు మరోసారి చెప్పడం జరిగింది. ఈరోజు పాఠంలో నేను మరో విషయం మీకు తెలుపబోతున్నాను. దానిని మీరు చాలా శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నాను. అదేమిటి, చాలా ముఖ్యమైన విషయం. అనేకమంది ప్రజలు సమాధుల వద్దకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం. అదేమిటి, సమాధిలో ఉన్న వాళ్ళు మా యొక్క మొరలను వింటున్నారు. మేము ఏదైనా దుఆ చేస్తే మా దుఆలను వారు ఆలకిస్తారు అని వారి నమ్మకం ఉంది. అయితే వాస్తవానికి చనిపోయిన వారు, మృతులు, సమాధిలో ఉన్న వారు మనం బ్రతికి ఉన్న వాళ్ళు వీరి యొక్క మాటలను వింటారా? ఒకవేళ సమాధి వద్దకు వెళ్లి ఏదైనా మొరపెట్టుకుంటే, ఏదైనా దుఆలు చేస్తే, ఏదైనా అరిస్తే వారికి వినే శక్తి ఉందా? ఈ విషయం ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకుందాం.
అయితే, ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం ఏంటి? సమాధిలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. ప్రత్యేకంగా ఔలియా అల్లాహ్ ఈ బాబాలు వాళ్ళు మా యొక్క కష్టసుఖాలను మేము ఏదైతే చెప్పుకుంటామో, మొరపెట్టుకుంటామో వాటిని వింటారు అన్నటువంటి నమ్మకం ఉంది. వారి ఆ నమ్మకానికి ఖుర్ఆన్లో హదీసులో ఎక్కడైనా ఏదైనా ఆధారం ఉందా? అయితే హదీసు నుండి ఒక ఆధారం, ఒక దలీల్ వారు చూపిస్తారు. అదేమిటి, సహీ బుఖారీలో హదీస్ ఉంది.
ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస పోయి వచ్చిన తర్వాత రెండవ హిజ్రీలో, అంటే వలస పోయి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం, మక్కా యొక్క ముష్రికులతో ఒక యుద్ధం జరిగింది. దాని పేరు బద్ర్ యుద్ధం. గజ్వతె బద్ర్. ఆ యుద్ధంలో అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయ వల్ల ముస్లింలు జయించారు. ముష్రికులు ఓడిపోయారు. ముష్రికుల వైపు నుండి 70 మంది హతమయ్యారు. మరో 70 మంది ఖైదీలు అయ్యారు. అయితే ఆ బద్ర్ ప్రాంతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటి, ఆ మృతులను, ఎవరైతే ముష్రికులు హతులయ్యారో, చంపబడ్డారో వారిని పెద్ద పెద్ద గోతులు తవ్వి అందులో వారిని పడేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఒకసారి అబూ జహల్ ఇంకా పెద్ద పెద్ద కొందరు నాయకులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బావి లాంటిది లోతుగా కొంచెం తవ్వి అందులో వారిని వేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడి ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. ఏమిటి, అల్లాహ్ మీతో మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా? అని వారిని అడిగారు. ఎవరిని అడుగుతున్నారు ప్రవక్త గారు అప్పుడు? ఆ చనిపోయిన వాళ్ళను. ఆ యుద్ధంలో ఎవరినైతే చంపడం జరిగిందో ముష్రికులను, వారిని ఒక బావిలో వేస్తున్నారు. అయితే వారిని వేసిన తర్వాత దాని ఒడ్డున మీద నిలబడి ప్రవక్త వారితో సంబోధిస్తూ, వారిని ఉద్దేశించి ఈ మాట అడుగుతున్నారు. అల్లాహు త’ఆలా, మీ యొక్క ప్రభువు మీతో ఏ వాగ్దానం అయితే చేశాడో దానిని మీరు పొందారా? అయితే కొందరు సహాబాలు అన్నారు, ప్రవక్తా వారు మృతులు కదా మీ మాటలను ఎలా వినగలుగుతారు? అప్పుడు ప్రవక్త అన్నారు,
إِنَّهُمْ الْآنَ يَسْمَعُونَ مَا أَقُولُ
(ఇన్నహుముల్ ఆన యస్మఊన మా అఖూల్)
నిశ్చయంగా వారు ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు.
నేను ఏ మాటనైతే అంటున్నానో ఆ మాటను వారు ఇప్పుడు వింటున్నారు అని ప్రవక్త చెప్పారు కదా. ఈ యొక్క హదీసు తోని ఈనాటి ఆ ముస్లింలు దలీల్ ఆధారం తీసుకుంటారు చూడండి. మృతులు వినరు అని మీరు అంటారు. ఇక్కడ ప్రవక్త స్వయంగా వారికి వినిపిస్తున్నారు. సహాబాలకు అనుమానం కలిగింది. అయితే ప్రవక్త వారికి సమాధానం చెప్పారు వింటున్నారు అని. అందుగురించి మృతులు వింటారు.
వారు సహీ బుఖారీలో ఉన్న హదీస్ మరొకటి వినిపిస్తారు. అదేమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,
اَلْعَبْدُ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتُوُلِّيَ وَذَهَبَ أَصْحَابُهُ حَتَّى إِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ فَأَقْعَدَاهُ
మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టి తిరిగిపోతున్న సందర్భంలో, ఎప్పుడైతే వారి బంధుమిత్రులందరూ వెళ్లిపోతూ ఉంటారో వారి చెప్పుల శబ్దాన్ని అతడు సమాధిలో ఉండి అతడు వింటాడు. అప్పుడే ఇద్దరు దేవదూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ప్రశ్న అడుగుతారు.
ఇక్కడ ఏముంది హదీసులో, సమాధిలో ఉన్న ఆ వ్యక్తి అతని యొక్క బంధుమిత్రులు ఎవరైతే వెళ్తున్నారో వారి యొక్క చెప్పుల శబ్దాన్ని వింటారు అని హదీసులో స్పష్టంగా ఉంది. యస్మఉ ఖర్అ నిఆలిహిమ్. వారి చెప్పుల శబ్దాన్ని అతను వింటాడు. అందుగురించే ఈ మన సోదరులు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తూ ఉంటారో, సమాధిలో ఉన్న వాళ్ళు ఔలియాలు బాబాలు వింటారు, అందుగురించి ఈ హదీసులో ఆధారం అని చూపిస్తారు.
హదీసుల సరైన అవగాహన
కానీ వాస్తవానికి ఈనాటి కాలంలో ఉన్న సమాధులలో లేక సామాన్యంగా ఎవరైనా మృతులు, చనిపోయిన వారు వింటారు అనడానికి ఈ రెండు హదీసులు దలీల్ ఏ మాత్రం కావు. ఎందుకు? మొదటి హదీస్ ఏదైతే ఉందో, ఈ హదీస్ సహీ బుఖారీలో ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అలైహ్ నాలుగు చోట్ల ప్రస్తావించారు. అంటే నాలుగుసార్లు వేరే వేరే స్థానాల్లో ఈ హదీసును ప్రస్తావించారు. ఒకటి కితాబుల్ జనాఇజ్లో, జనాజా అంతక్రియలకు సంబంధించిన చాప్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ, ఇంకా మిగతా మూడుసార్లు కితాబుల్ మగాజి, యుద్ధాల విషయానికి సంబంధించిన హదీసులను ప్రస్తావించాడు ఎక్కడైతే అక్కడ.
అయితే మొదటిసారి కితాబుల్ జనాఇజ్ బాబు అజాబిల్ ఖబ్ర్ హదీస్ నెంబర్ 1370 లో ఎక్కడైతే ఈ హదీస్ వచ్చి ఉందో, ప్రవక్త ఎప్పుడైతే అన్నారో మీరు మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా అని అప్పుడు సహాబాలు అన్నారు, తద్ఊ అమ్వాతన్? మీరు మృతులను పిలుస్తున్నారా? మృతులను సంబోధిస్తున్నారా? దాని యొక్క సమాధానంలో ప్రవక్త ఏం చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ మిన్హుమ్ వలాకిన్ లా యుజీబూన్’. మీరు వారి కంటే ఎక్కువ ఇప్పుడు వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ ఇప్పుడు వింటున్నారు. కానీ వారు సమాధానం ఇవ్వలేరు.
ఇదే హదీస్ మరోచోట ఉంది, అక్కడ హదీస్ నెంబర్ అది 4026. అక్కడ సహాబాలు అడిగారు, యా రసూలల్లాహ్ తునాది నాసన్ అమ్వాతా? ఓ ప్రవక్తా, మీరు చనిపోయిన వారిని మృతులను పిలుస్తున్నారా? అయితే ప్రవక్త చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా ఖుల్తు మిన్హుమ్’. నేను వారికి చెప్పే విషయం ఏదైతే ఉందో దానిని మీరు వారి కంటే ఎక్కువ వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు.
మూడోచోట హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు అని ఉంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు, యా రసూలల్లాహ్ మా తుకల్లిము మిన్ అజ్సాదిన్ లా అర్వాహ లహా. ఆత్మలు లేని ఈ శరీరం వాటితో మీరు సంబోధిస్తున్నారా? వాటికి మీరు వాటితో మీరు వారిని పిలుస్తున్నారా? వారితో మాట్లాడుతున్నారా? అప్పుడు ప్రవక్త ఏమన్నారు, ‘వల్లది నఫ్సు ముహమ్మదిన్ బియదిహ్’. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా అఖూలు మిన్హుమ్’. నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు వారి కంటే ఎక్కువ వినలేరు.
అయితే ఇక్కడ ఒక విషయం మనం ఈ హదీస్ ను ఈ ఒక్క హదీస్ నాలుగు చోట్ల నాలుగు స్థానాల్లో ఏదైతే వచ్చి ఉందో అందులో ఏ ఏ పదాలతో విషయం చర్చించబడిందో వాటిని ఒకవేళ మనం శ్రద్ధ వహిస్తే, సహాబాలు ఏదైతే అడుగుతున్నారో, ఓ ప్రవక్తా మీరు మృతులను సంబోధిస్తున్నారా? ప్రాణం ఏమాత్రం లేని ఈ శవాలను, ప్రాణం లేని ఈ శరీరాలతో మీరు మాట్లాడుతున్నారా? అని ఈ అడగడం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? అప్పటివరకు సహాబాల విశ్వాసం ఏమిటి? మృతులు వినరు. చనిపోయిన వాళ్ళు వినరు అన్న విశ్వాసమే ప్రబలి ఉండింది. ఇదే మాట అందరికీ తెలిసి ఉండింది. అందుగురించే ఎప్పుడైతే ప్రవక్త మృతులతో మాట్లాడుతున్నారో, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా వారు అడిగారు.
రెండో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇప్పుడు వీరు మీ కంటే ఎక్కువ వింటున్నారు.
اِنَّهُمُ الْآنَ
(ఇన్నహుముల్ ఆన్)
నిశ్చయంగా వారు ఇప్పుడు
అల్ ఆన్ అన్న పదం ఉన్నది అక్కడ. ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు. అయితే ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు అన్న ఈ పదంలోనే ఇది ఒక ప్రత్యేక సందర్భం అంతే మాత్రం గానీ చనిపోయిన ఏ వ్యక్తి కూడా బ్రతికి ఉన్న వారి, జీవరాశుల మాటలను వినరు అని స్పష్టం అవుతుంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం.
మరి ఇదే హదీస్ గురించి హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. దాని ద్వారా కూడా సహాబాల యొక్క విశ్వాసం మృతులు వింటారా లేదా అనే విషయం సహాబాలకు ఎలా ఉండింది అది కూడా మనకు తెలుస్తుంది. ఈ హదీస్ హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వద్దకు వచ్చినప్పుడు, హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు చెప్పారు, “ప్రవక్త యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమిటంటే వారి యొక్క జీవితాల్లో నేను మాటిమాటికి ఏదైతే చెప్పేవాడినో, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్కు ఏ మాత్రం సాటి కల్పించకండి, షిర్క్ చేయకండి అని మాటిమాటికి ఏదైతే నేను చెప్పేవాడినో, ఒకవేళ మీరు నా మాటను వినేది ఉంటే అల్లాహ్ స్వర్గం యొక్క వాగ్దానం మీకు చేస్తున్నాడు, మీరు నన్ను తిరస్కరించేది ఉంటే మీరు నరకంలో వెళ్తారు, ఇలాంటి వారి జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఏ మాటలైతే చెప్పేవారో అవి సత్యం అని ఇప్పుడు వారికి తెలుస్తుంది. ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది నిజం అని మీకు ఇప్పుడు తెలిసిందా? దాన్ని మీరు పొందారా? అది సత్యమే అన్న విషయం ఇప్పుడు తెలిసిందా?”
ఇదే సంఘటన కాకుండా వేరే కొన్ని ఆయతులు ఖుర్ఆన్లో ఉన్నాయి. మనిషి చనిపోయినప్పుడు, ఓ దేవా నాకు కొంచెం అవకాశం ఇవ్వు, ఇప్పుడు నాకు తెలిసింది, నాకు కొంచెం అవకాశం దొరికిన గానీ నేను నా ధనాన్ని నీ మార్గంలో ఖర్చు పెడతాను అని కూడా కోరుకుంటారు కొందరు.
ఫిర్ఔన్ చనిపోయేటప్పుడు కూడా ఏమన్నాడు? ఆ, మూసా చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. ఇప్పుడు నేను విశ్వాసం మార్గాన్ని అవలంబిస్తాను.
అయితే ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి ఆ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు అల్లాహు త’ఆలా వారికి ప్రవక్త యొక్క మాట వినిపించారు. అదేంటి, ప్రత్యేక సందర్భం. ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం ప్రతీ శవం గురించి, ప్రతీ చనిపోయిన వారి గురించి, ప్రత్యేకంగా ఔలియాల గురించి, అంబియాల గురించి ఇంకా వేరే వారి గురించి ఈ మాటలు అక్కడ అతికించవద్దు. ఈ మాటతోని, ఈ యొక్క హదీసుతోని “అందరూ వింటారు” అన్నటువంటి దలీల్ పట్టుకోవడం, దీనిని ఒక ఆధారంగా తీసుకోవడం ఎంత మాత్రం నిజమైనది కాదు. అందుగురించి ఇదే హదీస్ సహీ బుఖారీలో 3976వ హదీస్ లో హజ్రత్ ఖతాదా రహమతుల్లాహ్ అలైహ్ ఏం చెప్తున్నారు,
أَحْيَاهُمُ اللَّهُ حَتَّى أَسْمَعَهُمْ
(అహ్యాహుముల్లాహు హత్తా అస్మఅహుమ్)
వారిని వినిపించేంత వరకు అల్లాహ్ వారికి జీవం పోసాడు
అల్లాహ్ వారిని ఆ సందర్భంలో వారికి జీవం పోసాడు. హత్తా అస్మఅహుమ్, ప్రవక్త యొక్క మాటను వారికి వినిపించాడు. తౌబీఖన్ వ తస్గీరన్ వ నఖీమతన్ వ హసరతన్ వ నదామతన్. ఎందుకు, వారికి ఆ సందర్భంలో బాధ, అయ్యో ప్రవక్త మాటను మేము వినలేదు కదా అన్నటువంటి ఒక బాధ, ఎంతో ఒక షర్మిందాపన్, పశ్చాత్తాపం లాంటిది కలగాలి, ఇంకింత వారికి ఆ ఆవేశం అనేది వారి యొక్క అఫ్సోస్ అనేది పెరిగిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ సందర్భంలో అల్లాహు త’ఆలా వారిని మరోసారి లేపి ప్రవక్త యొక్క మాటను వినిపించాడు. అది అంత మటుకు మాత్రమే.
మృతులు వినలేరని చెప్పే ఖుర్ఆన్ ఆయతులు
అందుగురించి, ఇప్పుడు నేను కొన్ని ఖుర్ఆన్ ఆయతులు వినిపిస్తాను వాటిని శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే సామాన్యంగా మృతులు, చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారి ఏ మాటను వినలేరు. సూరె నమల్ ఆయత్ నెంబర్ 80లో అల్లాహ్ చెప్పాడు,
إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَى
(ఇన్నక లా తుస్మిఉల్ మౌతా)
నిశ్చయంగా నువ్వు మృతులకు వినిపించలేవు.
నువ్వు మృతులకు, చనిపోయిన వారికి వినిపించలేవు. అలాగే సూరె రూమ్ ఆయత్ నెంబర్ 52లో ఇలాంటి ఆయతే ఉంది. అక్కడ కూడా ఉంది, ఓ ప్రవక్తా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు. అయితే మృతులు వినరు, బ్రతికి ఉన్న వారు తమ ఏ మాటను కూడా మృతులకు వినిపించలేరు అని ఈ ఆయత్ చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా అల్లాహు త’ఆలా కోరినప్పుడు, ఏదైనా అవసర సందర్భంగా అల్లాహు త’ఆలాకు ఇష్టమైతే వినిపించవచ్చు. ఆ శక్తి అల్లాహ్కు ఉంది. కానీ ఒక సామాన్య నియమం, ఒక రూల్, ఒక పద్ధతి ఏమిటి? మృతులు వినరు. కానీ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు. అల్లాహ్ స్వయంగా వినిపిస్తాడు. దానికి సాక్ష్యంగా ఈ హదీస్, ఈ ఖుర్ఆన్ యొక్క ఆయతును మనం తెలుసుకోవచ్చు. ఈ ఆయత్ సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 22.
وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ
(వమా యస్తవిల్ అహ్యాఉ వలల్ అమ్వాత్)
బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాలేరు.
إِنَّ اللَّهَ يُسْمِعُ مَنْ يَشَاءُ
(ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా)
నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు
وَمَا أَنْتَ بِمُسْمِعٍ مَنْ فِي الْقُبُورِ
(వమా అంత బిముస్మిఇన్ మన్ ఫిల్ ఖుబూర్)
మరియు సమాధులలో ఉన్నవారికి నీవు వినిపించలేవు.
ఇక్కడ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు అని దీంతో కూడా కొందరు పెడమార్గంలో పడిపోతారు. అదేమిటి? అవును ఔలియా అల్లాహ్కు వినిపించే శక్తి అల్లాహ్కు ఉంది, అందుగురించి మేము మొరపెట్టుకునే మొరలను వారు ఇప్పుడు వింటున్నారు, అల్లాహ్ వినిపిస్తున్నాడు, వారు స్వయంగా వింటారని మేము అనుకుంటలేము. మళ్ళీ ఇలా తిప్పికొట్టి వారు తమ యొక్క విశ్వాసాన్ని మరింత గట్టి పరుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే బుఖారీలోని మొదటి హదీస్ బద్ర్లో చనిపోయిన ముష్రికులకు ఏదైతే ప్రవక్త వినిపించారో దానికి ఈ ఆయత్ సాక్ష్యం అవుతుంది.
అంతేకాకుండా చనిపోయిన ప్రతీ వ్యక్తిని సమాధిలో పెట్టినప్పుడు అతన్ని సమాధిలో పెట్టేసి వారి యొక్క బంధుమిత్రులు తిరిగి వస్తున్నప్పుడు అతను ఏదైతే వారి చెప్పుల శబ్దాన్ని వింటాడో, అయ్యో అందరూ నన్ను వదిలేసి నన్ను ఒక్కడిని వదిలేసి పోతున్నారా, నేను ఏకాంతంలో అయిపోయానా, అలాంటి రంది అతనికి కలగడానికి, ఎవరి ఎవరి యొక్క అండదండ నాకు ఉంది అన్న యొక్క ఆలోచనతో నేను ఎంతో అల్లాహ్కు వ్యతిరేకంగా కూడా జీవితం గడిపానో, ఇప్పుడు ఈ సమాధిలో నన్ను ఎవరూ కూడా కానడానికి చూడడానికి వస్తలేరు, నేను ఒక్కడిని అయిపోయాను, అలాంటి ఒక ఆవేదన అతనికి కలగడానికి కేవలం వారు వెళ్ళిపోతున్న చెప్పుల శబ్దాన్ని వినిపిస్తాడు, అంతే. ఇంకా వేరే మాటలను వినిపిస్తాడు అని అక్కడ ఇక్కడ లేదు మనకు. అలాంటి విషయం తెలుస్తలేదు.
అందుగురించి సోదరులారా, ఈ రెండు హదీసులను మనం తీసుకొని ఖుర్ఆన్ ఆయతులను మనం తిరస్కరించవద్దు. ఈ రెండు ఆయతులకు రెండు హదీసులను ఈ సూరె ఫాతిర్ యొక్క ఆయత్. ఒకవేళ వీరందరూ వింటున్నారు అని మనం అనుకుంటే, అల్లాహ్ వారిని వినిపిస్తున్నాడు అని అనుకుంటే, ‘ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా’, అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు అని చెప్పేకి ముందు బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాజాలరు అని ఏదైతే అంటున్నాడో మరి దాని యొక్క భావం ఏంటి? ఒకవేళ అందరూ వినేది ఉంటే, వారు కూడా బ్రతికి ఉన్న వాళ్ళ మాదిరిగానే అయిపోయారు. అందుగురించి ఈ ఆయతులు ఈ హదీసులను మనం విన్న తర్వాత సామాన్యంగా మృతులు వినరు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో, ఏదైనా ఒక ఉద్దేశంతో వినిపిస్తాడు అన్నటువంటి హదీస్ ఎక్కడైనా వచ్చి ఉంటే దానిని అక్కడి వరకే మనం నమ్మాలి గానీ, అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళేసి అన్ని విషయాలను వింటారు అని మనం దాంట్లో కలుపుకోవడం ఇది పెడమార్గానికి తీసుకెళ్తుంది.
మరికొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏం విశ్వసిస్తారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో తమ సమాధిలో ఉండి మనల్ని చూస్తున్నారు, మనం చేసే కార్యాలను చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలను వింటున్నారు అని కొందరు విశ్వసిస్తారు. అది కూడా ఖుర్ఆన్ హదీసులకు వ్యతిరేకమైన విశ్వాసం.
ఏమిటంటారు తెలుసా వాళ్ళు? ఒక హదీసులో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివినప్పుడు ఆ దరూద్ దేవదూతలు తీసుకెళ్లి ప్రవక్త గారికి వినిపిస్తారు. అయితే సహీ హదీసుల్లో ఇంత విషయమే ఉంది. కానీ మరికొన్ని జయీఫ్ హదీసులలో ఏం వస్తుంది అంటే, ఎవరైనా ప్రవక్త సమాధి వద్దకు వచ్చి దరూద్ సలాం చేస్తే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దరూద్ సలాంకు సమాధానం ఇస్తారు. కానీ ఇది నిరాధారమైన హదీస్. బలమైనది కాదు. అయితే హదీసులు కూడా బలహీనంగా ఉంటాయా? హదీస్ యొక్క పరంపరలో, హదీస్ యొక్క సనదులో పరంపరలో కొందరు అబద్దీకులు, కొందరు తప్పుగా ప్రవక్త వైపునకు మాటలు కల్పించే వాళ్ళు కూడా వస్తారు. హదీస్ యొక్క పండితులు అలాంటి కల్పిత హదీసులను వేరుగా చేసి ఉన్నారు. అయితే సహీ హదీసులో ఎక్కడా కూడా ప్రవక్త డైరెక్ట్ మన యొక్క సలాంను దరూదును వింటారు అని లేదు. ఏ సహీ హదీసులో లేదు. దూరమైనా దగ్గరైనా ఎక్కడ ఉండి మనం దరూద్ చదివినా గానీ ప్రవక్త డైరెక్ట్ గా వింటారు అని ఎక్కడా ఏ హదీసులో కూడా లేదు. అందుగురించి ప్రవక్త కూడా మన మాటలను వింటారు అని మనం ఎప్పుడూ కూడా నమ్మవద్దు విశ్వసించవద్దు.
ప్రళయ దినాన అల్లాహ్ మరియు ఈసా (అలైహిస్సలాం) మధ్య సంభాషణ
అయితే, ఇంతవరకు ఈ విషయాలు మనం విన్న తర్వాత నేను ఖుర్ఆన్లోని ఒక ఆయత్, ఆ ఆయత్కు సాక్ష్యాధారంగా సహీ బుఖారీలోని ఒక హదీస్ వినిపిస్తాను. ఈ ఆయత్ మరియు ఈ హదీస్ విన్న తర్వాతనైనా ఇక మన విశ్వాసాలు కరెక్ట్, నిజమైనవి, శుద్ధమైనవి మరియు ప్రవక్త సహాబాల విశ్వాస ప్రకారంగా ఉండాలి. శవాలు వింటారు అని, వారి సమాధుల వద్దకు వెళ్లి అక్కడ ఎలాంటి షిర్క్ పనులకు, ఎలాంటి మనం తావు ఇవ్వకూడదు, ఎలాంటి మనం అక్కడ మోసాలకు గురికాకూడదు.
అదేవిటండీ ఆ ఆయత్ అంటే, సూరె మాయిదాలో అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాం కు సంబంధించిన ఒక సంఘటన తెలిపారు. అదేమిటి, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, తండ్రి లేకుండా అల్లాహు త’ఆలా మర్యమ్ అలైహిస్సలాం ద్వారా అతన్ని పుట్టించాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అలాగే మనం విశ్వసించాలి. అయితే ఈ రోజుల్లో అనేకమంది క్రైస్తవులు స్వయంగా ఈసా అలైహిస్సలాంనే దేవునిగా పూజిస్తున్నారు. మరికొందరు మర్యమ్ అలైహిస్సలాంను కూడా పూజిస్తున్నారు. ఇంకొందరు ఈసా, పరిశుద్ధాత్మ, యెహోవా అని త్రైత్వ దైవాన్ని (Trinity) పూజిస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు. వారి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా షిర్క్లోకి వస్తాయి. స్వయంగా ఈసా అలైహిస్సలాం నన్ను కాదు ఏకైక దేవుణ్ణి పూజించండి అని స్పష్టంగా చెప్పారు. ఖుర్ఆన్ సూరె ఆలి ఇమ్రాన్లో ఉంది.
اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
(ఉ’బుదుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్)
నాకు మీకు ప్రభువైన అల్లాహ్ను మాత్రమే మీరు ఆరాధించండి.
అలాగే బైబిల్లో యోహాను సువార్తలో ఉంది. ఆకాశాల్లో ఉన్న ఆ దేవుణ్ణి పూజించేవారే నిత్య జీవితాన్ని పొందుతారు అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాంను పిలుస్తాడు. అక్కడ గట్టిగా ప్రశ్నిస్తాడు. ఆ విషయం ఏంటి? ఆ ప్రశ్నలు ఏంటి? కొంచెం శ్రద్ధగా వినండి.
وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِنْ دُونِ اللَّهِ
మరియు (ఆ రోజును గుర్తు చేసుకోండి), అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా! నీవు ప్రజలతో, ‘అల్లాహ్ను వదలి నన్నూ, నా తల్లినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోండి’ అని అన్నావా?
మరియం పుత్రుడైన ఓ ఈసా, అల్లాహ్ను వదలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ నీలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినది. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకుంటారు. ఏమని,
قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ
ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రుడిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకే మాత్రం తగదు.
إِنْ كُنْتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ
ఒకవేళ నేను గనక అలాంటిది ఏదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కానీ నీలో ఏముందో నాకు తెలియదు.
إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.
مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
నీవు నాకు ఆజ్ఞాపించిన దానిని తప్ప నేను వారికి మరేమీ చెప్పలేదు: ‘అల్లాహ్ను ఆరాధించండి, ఆయనే నా ప్రభువు మరియు మీ ప్రభువు.’
وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.
ఈసా అలైహిస్సలాం ప్రవక్త కదా, అయినా ఇప్పుడు వారందరూ అంటే క్రైస్తవులందరూ వారిని పూజిస్తున్నారు అన్న విషయం ఈసా అలైహిస్సలాంకు తెలుసా? తెలియదు. అందుగురించి ఏమంటున్నారు, నేను వారి మధ్యలో ఉన్నంత వరకే నేను సాక్ష్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నీవు నన్ను నీ వద్దకు తీసుకున్నావో, నీవే వారిపై వారిని పర్యవేక్షించి ఉన్నావు. వారు ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. ఇది సూరె మాయిదాలోని 116, 117వ ఆయత్.
దీనికి సాక్ష్యాధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఏంటి? అది కొంచెం శ్రద్ధగా వినండి. కానీ ఈ హదీసులో తెలిపే ముందు, ఈ రోజుల్లో ప్రపంచమంతటిలో ఎక్కడెక్కడ ఏ పెద్ద పెద్ద ఔలియాలు, పెద్ద పెద్ద బాబాలు, పీరీలు, ముర్షదులు ఎవరెవరైతే ఉన్నారో, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం వారి కంటే గొప్పదా లేకుంటే వారందరూ మన ప్రవక్త కంటే గొప్పవారా? సమాధానం ఇవ్వండి. ప్రవక్తనే గొప్పవారు కదా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కదా మనకు. అయితే స్వయంగా ప్రవక్త సంగతి ఈ హదీసులో వినండి. ప్రవక్త ఎలా విన్నవించుకుంటున్నారు? ప్రవక్త తమ తర్వాత జరిగిన విషయాలను నాకు తెలియవు అన్నట్టుగా ఎలా ప్రస్తావిస్తున్నారో. మరి ఈ రోజుల్లో మనం ఎలాంటి తప్పుడు విశ్వాసాల్లో, పెడమార్గాల్లో పడి ఉన్నామో మనం మనకు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ హదీస్ సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 4625, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసును హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగించారు. ఖుత్బా ఇచ్చారు. అంటే ఏదో ఒక సహాబీతో ప్రత్యేకంగా చెప్పిన విషయం కాదు. 10 మంది 50 మంది 100 మంది ముంగట ఖుత్బాలో ప్రసంగంలో చెప్పిన విషయం. ఆ ప్రసంగంలో ఇలా చెప్పారు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా ఇన్నకుమ్ మహ్షూరున ఇలల్లాహి హుఫాతన్ ఉరాతన్ గుర్లా. మీరు అల్లాహ్ వైపునకు లేపబడతారు. మొదటిసారి పుట్టిన స్థితిలో, శరీరంపై బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, సున్నతీలు చేయబడకుండా. మళ్లీ ప్రవక్త ఖుర్ఆన్ యొక్క ఆయత్ చదివారు. సూరె అంబియా ఆయత్ నెంబర్ 104.
كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ
తొలిసారిగా మిమ్మల్ని పుట్టించిన రీతిలో మలిసారి మిమ్మల్ని మేము లేపుతాము. ఇది మా యొక్క వాగ్దానం. దీనిని మేము పూర్తి చేసి తీరుతాము.
ఇది సూరె అంబియా ఆయత్ నెంబర్ 104 యొక్క అనువాదం. మళ్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, వినండి, వ ఇన్న అవ్వలల్ ఖలాయిఖి యుక్సా యౌమల్ ఖియామతి ఇబ్రాహీమ్ అలైహిస్సలాతు వస్సలాం. అందరూ ఏ స్థితిలో లేస్తారు సమాధుల నుండి? నగ్నంగా. బట్టలు లేకుండా. చెప్పులు లేకుండా. సున్నతీలు చేయబడకుండా. అయితే, మొట్టమొదటిసారిగా హజ్రత్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు వస్త్రాలు ధరింపజేయబడతాయి. ఆ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అయితే, ఆ మైదానే మహ్షర్లో, ఆ పెద్ద మైదానంలో ఎక్కడైతే అందరూ, ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చిన ఈ జన సమూహం అంతా ఒకే ఒక మైదానంలో సమూహం అవుతారు, జమా అవుతారు. అక్కడ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, వినండి, వ ఇన్నహు యుజాఉ బిరిజాలిన్ మిన్ ఉమ్మతీ ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్. నేను నా హౌదె కౌసర్ పై నా ఉమ్మతీయులు, నా అనుచర సంఘం వస్తుంది అని నేను వేచిస్తూ ఉంటాను. వారు కొన్ని కొన్ని గ్రూపుల రూపంలో వస్తూ ఉంటారు. కొందరు నా వైపునకు వస్తూ ఉంటారు, ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్, వారిని నా వద్దకు రానివ్వకుండా ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. ఫ అఖూల్, అప్పుడు నేను అంటాను, యా రబ్బీ ఉసైహాబీ, ఓ ప్రభువా వీరు నా యొక్క అనుచరులు, నన్ను విశ్వసించిన వారు. ఫ యుఖాల్, అప్పుడు అనబడడం జరుగుతుంది.
إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ
(ఇన్నక లా తద్రీ మా అహదసూ బ’అదక)
నిశ్చయంగా, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో నీకు తెలియదు ఆ విషయం.
ఎప్పుడు అనబడుతుంది? ప్రళయ దినాన. హౌదె కౌసర్ వద్ద. హౌదె కౌసర్ వద్ద ప్రవక్త శుభ హస్తాలతో హౌదె కౌసర్ ఆ శుభ జలాన్ని త్రాగడానికి అందరూ గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఒక గుంపు వచ్చినప్పుడు వారిని ప్రవక్త వద్దకు రానివ్వడం జరగదు. ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. అయ్యో నా వారు వాళ్ళు, రానివ్వండి నా దగ్గరికి అని ప్రభువును వేడుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ ప్రభువు వైపు నుండి సమాధానం ఏమొస్తుంది? నీవు చనిపోయిన తర్వాత, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో (ఇన్నక లా తద్రీ) నీకు తెలియదు ఆ విషయం.
ఈ హదీస్ ఇంకా ముందుకు ఉంది. కానీ ఇక్కడ నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను మరోసారి. ఇన్నక లా తద్రీ. నీకు తెలియదు. నీకు ఆ సందర్భంలో నీకు జ్ఞానం లేదు. నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క ఈ నిన్ను విశ్వసించే వారు ఏ పెడమార్గంలో పడిపోయారో నీకు తెలియదు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాము? ప్రవక్త మనల్ని చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలన్నీ, మనం చేసే ప్రార్థనలన్నీ వింటున్నారు. ఇది తప్పు విషయం ఇది. ఈ హదీసుకి వ్యతిరేకంగా ఉందా లేదా వారి యొక్క ఈ విశ్వాసం? ఆ తర్వాత వినండి, ఫ అఖూల్, ప్రవక్త అంటున్నారు, అప్పుడు నేను అంటాను కమా ఖాలల్ అబ్దుస్సాలిహ్, ఎలాగైతే ఆ పుణ్య పురుషుడైన, సదాచరుడైన దాసుడు ఈసా అలైహిస్సలాం చెప్పాడో
وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.
నేను వారి మధ్యలో ఉన్నంత మాత్రం నేను వారిపై సాక్ష్యంగా ఉన్నాను. ఫలమ్మా తవఫ్ఫైతనీ, ఎప్పుడైతే నీవు నన్ను చంపివేశావో, ఎప్పుడైతే నువ్వు నన్ను నా ప్రాణం తీసుకున్నావో, కున్త అంతర్రఖీబ అలైహిమ్, నీవే వారిని పర్యవేక్షిస్తూ ఉన్నావు. వ అంత అలా కుల్లి షైఇన్ షహీద్, మరియు నీవే సర్వ విషయాలపై సర్వ జగత్తుపై సత్యమైన సాక్షివి.
అయితే సోదరులారా, ఈ హదీస్ ఎంత స్పష్టంగా ఉంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఆయన కూడా ఎవరి ఏ మాట వినరు ఇప్పుడు. ఎవరి యొక్క మొరలను ఆలకించలేరు. అలాంటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే తక్కువ స్థానంలో ఉన్న వారి గురించి వారు వింటారు, వారు చేస్తారు, మనకు అన్ని రకాల అనుగ్రహాలు ప్రసాదిస్తారు, ఇలాంటి విశ్వాసాలు, ఇలాంటి నమ్మకాలు మనల్ని ఎంత షిర్క్ లాంటి లోతుకు తీసుకెళ్తాయో మనమే ఆలోచించాలి. ఇ
లా చెప్పుకుంటూ పోతే సోదరులారా, ఖుర్ఆన్లో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి, ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు విశ్వాసాలకు వ్యతిరేకంగా. కానీ, కొంత సమయం ఉంది గనుక కేవలం ఒకే ఒక ఆయత్, దాని యొక్క అనువాదం మీ ముందు తెలిపి నేను ఈ యొక్క ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. ఇది సూరె ఫాతిర్. సూరె ఫాతిర్లోని ఆయత్ నెంబర్ 13, 14. అల్లాహ్ అంటున్నాడు,
ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ
(దాలికుముల్లాహు రబ్బుకుమ్ లహుల్ ముల్క్)
ఆయనే అల్లాహ్, మీ ప్రభువు, ఆధిపత్యం ఆయనదే.
وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
(వల్లదీన తద్ఊన మిన్ దూనిహీ మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
మరియు ఆయనను వదలి మీరు పిలిచేవారు ఖర్జూరపు బీజంపై ఉండే పొరంత కూడా అధికారం కలిగి లేరు.
ఆయన్ని కాకుండా, ఆయన్ని వదలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో, ఎవరెవరినైతే మీరు పిలుస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, మా యమ్లికూన మిన్ ఖిత్మీర్, ఖర్జూరపు బీజంపై ఉన్నటువంటి మరీ పలుచని ఆ పొర అంత మాత్రం శక్తి కూడా వారికి లేదు. మీరు అల్లాహ్ను కాకుండా ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారి వద్ద ఖర్జూరపు గుట్లి, దాని యొక్క బీజంపై చాలా పలుచని పొర ఏదైతే ఉంటుందో అంత శక్తి కూడా వారి వద్ద లేదు.
إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ
(ఇన్ తద్ఊహుమ్ లా యస్మఊ దుఆఅకుమ్)
ఒకవేళ నీవు వారిని మొరపెట్టుకుంటే మీ మొరలను వారు ఆలకించలేరు, వినలేరు.
وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ
(వలవ్ సమీఊ మస్తజాబూ లకుమ్)
ఒకవేళ వారు విన్నా, మీకు సమాధానం ఇవ్వలేరు.
లేదు వింటారు, వింటారు, వింటారు అని ఏదైతే మీ విశ్వాసం ఉందో, ఒకవేళ విన్నా గానీ మస్తజాబూ లకుమ్, మీకు ఎలాంటి జవాబ్, సమాధానం ఇవ్వలేరు. అల్లాహ్ అంటున్నాడు, ఒకవేళ మీ యొక్క బలహీన విశ్వాసం ఉంది కదా లేదు వింటున్నారు అని, ఒకవేళ విన్నా గానీ సమాధానం ఏ మాత్రం ఇవ్వలేరు. సహీ బుఖారీలోని మొదటి హదీస్ ఏదైతే వినిపించానో అక్కడ కూడా ప్రవక్త అదే చెప్పారు. ఇప్పుడు వారు వింటున్నారు కానీ జవాబు ఇవ్వలేరు. సమాధానం ఇవ్వలేరు. బదులు పలకలేరు. అల్లాహ్ ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ మీ విశ్వాస ప్రకారంగా, ఏదైనా అవసరం పడి, ఏదైనా సందర్భంలో మేము వారికి వినిపించినా గానీ వారు సమాధానం చెప్పలేరు, ఇవ్వలేరు.
وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ
మరియు ప్రళయ దినాన వారు మీ షిర్క్ను తిరస్కరిస్తారు.
మరియు ప్రళయ దినాన యక్ఫురూన బిషిర్కికుమ్. మీరు అల్లాహ్తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో దీనిని వారు తిరస్కరిస్తారు. తిరస్కరిస్తారు. అల్లాహ్ మీరు అల్లాహ్తో పాటు మీరు వారిని ఏదైతే సాటి కల్పిస్తున్నారో వాటి దానిని వారు తిరస్కరిస్తారు. అంటే ఏంటి? అంటే వారికి ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? మీరు ఇక్కడ మొరపెట్టుకున్న విషయం, అల్లాహ్ను కాకుండా వారిని మీరు ఏదైతే దుఆ చేస్తున్నారో ఇవన్నీ విషయాలు వాస్తవానికి వారు వినలేరు, వారికి ఏమాత్రం తెలియదు. అందుగురించే ప్రళయ దినాన ఎప్పుడైతే వీరు వెళ్తారో, అక్కడ కూడా వారు వీరి యొక్క ఈ షిర్క్ను తిరస్కరిస్తారు. ఈ తిరస్కరిస్తారు అన్న విషయం బహుశా ఇంకొందరికి అర్థం అవతలేదు అనుకుంటా. సూరె బఖరాలో, సూరె అహ్కాఫ్లో 26వ పారా స్టార్టింగ్ ఆయతులలోనే ఐదు ఆరు ఆయతులలోనే అక్కడ విషయం ఉంది. సూరె బఖరాలో రెండవ అధ్యాయం అంటే రెండవ పారా ఏదైతే ఉందో, అందులో సగం అయిన తర్వాత ఇంచుమించు సుమారు ఒక క్వార్టర్ పారా అయిపోయిన తర్వాత
إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
(ఆ రోజును గుర్తు చేసుకోండి), ఎప్పుడైతే అనుసరించబడిన వారు తమను అనుసరించిన వారి నుండి వైదొలగిపోతారో, మరియు వారు శిక్షను చూస్తారో, మరియు వారి మధ్య సంబంధాలన్నీ తెగిపోతాయో.
ఆ ఆయతుల సంగతి ఆ ఆయతులను దాని యొక్క వ్యాఖ్యానం చదవండి. ఏమవుతుంది, సహీ బుఖారీలో వివరణ ఉంది. ప్రళయ దినాన ప్రజలందరూ ఆ మైదానే మహ్షర్లో జమా అవుతారు కదా, అక్కడ అల్లాహు త’ఆలా ఎవరెవరు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారి వెంట వెళ్ళండి అని అన్నప్పుడు, ఈ ఇమాములను, పీరీలను, ముర్షదులను, బాబాలను వారందరినీ మొరపెట్టుకునేవారు వారి వారిని వెనుకులాడుతూ ఉంటారు. వెనుకులాడి ఆ మీరే కదా పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలాని, మీరే కదా పెద్ద గుట్ట వాళ్ళు, మీరే కదా ఈ విధంగా వారి వారి వద్దకు వెళ్లి వారి వెంట ఉండి వారి యొక్క సిఫారసు పొందడానికి వారి వెనక వెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రళయ దినాన. అప్పుడు వారు వీరిని చూసి ఓ అల్లాహ్ వీరు మమ్మల్ని పూజించే వారు కాదు, మమ్మల్ని మొరపెట్టుకునే వారు కాదు, వీరు మాకు శత్రువులు, మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు వీరికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్తారు.
సోదరులారా, ఖుర్ఆన్లో ఈ ఆయతులు, హదీసుల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలైన రోగం, అసలైన పెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి ఆయతులను ఇలాంటి హదీసులను మనం చదవడం లేదు. ఈ సమాధుల వద్ద ఉండే మౌల్వీలు, ఇలాంటి పండితులు మన సామాన్య ప్రజలకు తెలపడం లేదు. అందుగురించి సామాన్య ప్రజలు ఇలాంటి ఘోరమైన షిర్క్లో పడిపోతున్నారు.
అల్లాహు త’ఆలా మనందరికీ సరియైన సన్మార్గం మరియు తౌహీద్, ఈ నిజమైన అఖీదా విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా మరిన్ని ఎక్కువగా తెలుసుకునే భాగ్యం అల్లాహ్ కలిగించుగాక. ఈ రోజుల్లో ప్రజలు ఏదైతే షిర్క్లో పడి ఉన్నారో వాటి నుండి అల్లాహు త’ఆలా వారిని రక్షించుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=8426
ఇతరములు: