నిజాయితీగా వాపసు చెయ్యటం (Returning honestly)

హదీథ్׃ 04

أداء الأمانة నిజాయితీగా వాపసు చెయ్యటం

حدثنا أبُو كُرَيْبٍ، حدَّثنَا طَلْقُ بنُ غَنَّامٍ عنْ شَرِيكٍ وَ قَيْسٌ عَنْ أَََبي حَصِينٍ ، عَنْ أبي صَالَحْ عَنْ أَبي هُرَيْرَة  قَالَ، قَالَ النَبِيّ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ  ”أَدِّ الأمَانَةَ إِلَى مَنِ أْتَـمَنَكَ ، وَلاَ تَخُنْ مَنْ خَانَكَ رواة أحمد و أبوداود و التِّرْمِذِي

హద్దథనా అబు కురైబిన్ హద్దథనా తల్ఖు ఇబ్ను గన్నామిన్ అన్ షరీకిన్ వ ఖైసున్ అన్ అబి హసీనిన్ అన్ అబి శాలహ్ అన్ అబి హురైరత ఖాల, ఖాలన్నబియ్యి సల్లల్లాహు ఆలైహి వ సల్లమ అద్ది అల్ అమానత ఇలా మనిఁ తమనక, వలాతఖున్ మన్ ఖానక .  రవాహ్ అహమద్, అబుదావూద్, తిర్మిది .

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) అహమద్, అబుదావూద్, తిర్మిది హదీథ్ గ్రంధకర్తలు ← అబు కురైబిన్ ← తల్ఖు ఇబ్ను గన్నామిన్ ← అన్ షరీకిన్ ←  ఖైసున్ అన్ అబి హసీనిన్ ← అబి శాలహ్ ← అబి హురైరత (రదియల్లాహుఅన్హు)  ← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ప్రకటించారు.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ఏదైతే నమ్మకంతో మీ దగ్గర ఉంచబడినదో, దానిని వారికే నిజాయితితో తిరిగి అప్పగించండి. మరియు ఎవరైతే మిమ్మల్ని మోసగించారో వారిని మీరు తిరిగి మోసగించవద్దు (అంటే మోసగాళ్ళతో కూడా నిజాయితి తోనే వ్యవహరించ వలెను). అహమద్, అబుదావూద్, తిర్మిది హదీథ్ గ్రంధాలు

ఉల్లేఖకుని పరిచయం: అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.

హదీథ్ వివరణ

నమ్మకంగా మీ దగ్గర ఉంచిన వస్తువును, నిజాయితీగా దాని యజమానికి తిరిగి ఇచ్చివేయమని (వాపసు చేయమని) ఈ హదీథ్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు. వాడుకోవటానికి తీసుకున్న పనిముట్లయినా, తాకట్టు పెట్టిన వస్తువులైనా సరే ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. వీటిని కూడా చాలా జాగ్రత్తగా, నమ్మకంగా వాటి యజమానికి తిరిగి ఇవ్వవలెను. ఇస్లాం ధర్మంలో నిజాయితీకి చాలా ఉన్నత స్థానమున్నది. నిజాయితీకి ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా ప్రతి ముస్లిం దీనిని తప్పని సరిగా, సీరియస్ గా పాటించవలెను. నిజాయితీగా ఉండటం వలన ప్రజలు గౌరవిస్తారు. ప్రజలు నిజాయితీ పరులపై నమ్మకం ఉంచుతారు, వారిపై భరోసా ఉంచుతారు. బంధుమిత్రులు వారిని గౌరవాభిమానాలతో చూస్తారు. ఉదాహరణకు నిజాయితీగా ఇతరుల హక్కులను పూర్తిచేసే ఉపాధ్యాయులు, గురువులు ప్రతిచోట ఆదరించబడతారు. వారు అల్లాహ్ తరుపు నుండి మరియు అక్కడి ప్రజల తరుపు నుండి తెలుపబడే కృతజ్ఞతలు స్వీకరించటానికి అర్హులు. అలాగే నిజాయితీగా విద్యనభ్యసించే విద్యార్థి కూడా నిజాయితీ పరుడిగా గుర్తింపు పొందుతాడు. ఇతరుల వస్తుసామగ్రీని, ధనసంపదలను కాపాడి, వారికి చేర్చే వాడు కూడా తన నిజాయితీకి సరైన పుణ్యాలు పొందుతాడు. ఎవరైతే నిజాయితీగా జీవించరో, ఇతరుల వస్తువులను నిజాయితీగా తిరిగి ఇవ్వాలని ప్రయత్నించరో, వారు ప్రజల దృష్టిలో చులకనైపోతారు. మరియు అల్లాహ్ తరుపు నుండి కఠిన శిక్షలకు గరువుతారు.

అతడు ఉద్యోగస్తుడైతే, అతడి ఉద్యోగం ఏదో ఒకరోజున పోతుంది. వ్యాపారస్తుడైతే, ప్రజలలో నమ్మకం పోగొట్టుకుంటాడు.  కాబట్టి ప్రతి ముస్లిం, తన దగ్గర ప్రజలు ఉంచిన వాటిని, వాటి వాటి యజమానులకు జాగ్రత్తగా చేర్చవలెను. వాటికి ఎటువంటి నష్టం గాని, అపాయం గాని చేకూర్చకూడదు. వస్తుసామగ్రి మాత్రమే కాకుండా, ఇతరుల రహస్యాలను, వ్యవహారాలను, గౌరవ మర్యాదలను కూడా నిజాయితీగా కాపాడ వలెను. ఇతరులతో సంప్రదాయబద్ధంగా, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కలిసిమెలిసి పూర్తి నిజాయితీతో  జీవించవలెను. ఎందుకంటే ఎవరి దగ్గరైతే నిజాయితీ ఉండదో, వారి దగ్గర దైవవిశ్వాసం (ఈమాన్) కూడా ఉండదు.

హదీథ్ వలన కలిగే లాభాలు

  1. నమ్మకంగా ఉంచబడిన దానిని, దాని యజమాని వద్దకు జాగ్రత్తగా తిరిగి చేర్చటం తప్పని సరి బాధ్యత.
  2. నిజాయితీగా వాపసు చెయ్యక, మోసం చేసేవారితో బదులుగా మోసం చెయ్యడం నిషేధించబడినది.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్