దైవ విశ్వాసుల మధ్య సహకారం (cooperation among believers)

హదీథ్׃ 01

దైవ విశ్వాసుల మధ్య సహకారం التعاون بين المؤمنين

حدّثنا أَبُو بَكْرِ بْنُ أَبِي شَيْبَةَ و أَبُو عَامِرٍ الأَشْعَرِيُّ . قَالاَ: حَدَّثَنَا عَبْدُ اللّهِ بْنُ إِدْرِيسَ وَ أَبُو أُسَامَةَ وَحَدَّثَنَا مُحَمَّدُ بْنُ الْعَلاَءِ ، أَبُو كُرَيْبٍ . حَدَّثَنَا ابْنُ الْمُبَارَكِ وَ ابْنُ إِدْرِيسَ وَ أَبُو أُسَامَةَ . كُلُّهُمْ عَنْ بُرَيْدٍ عَنْ أَبِي بُرْدَةَ عَنْ أَبِي مُوسَى  قَالَ: قَالَ رَسُولُ اللّهِ ‏صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ *اَلْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ، يَشُدُّ بَعْضُهُ بَعْضاً * ثُمَّ شَبَّكَ بَيْنَ أَصَابِعِهِ رواة صحيح البخاري

హద్దథనా అబూబక్రి అబ్ను అబి షయ్బత వ అబూ ఆమిరిన్ అల్ అష్అరియ్యు ఖాల హద్దథనా అబ్దుల్లాహి అబ్నుఇద్రీస వ అబూ ఉసామత వ హద్దథనా ముహమ్మదు అబ్ను అల్ అలాయి అబూ కురైబిన్ హద్దథనా ఇబ్ను అల్ ముబారకి వ అబ్నుఇద్రీస వ అబూ ఉసామత కుల్లుహుమ్ అన్ బురైదిన్ అన్ అబీ బుర్దత అన్ ఇబీ ముసా ఖాల, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ “అల్ ముఁమిను లిల్ ముఁమిని కల్ బున్యాని యషుద్దు బఆదుహు బఆదన్” థుమ్మ షబ్బక బైన అశాబిఇహి. రవాహ్ సహీ బుఖారి.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారీ హదీథ్ గ్రంధకర్త ← అబూబక్రి అబ్ను అబి షయ్బత ← అబూ ఆమిరిన్ అల్ అష్అరియ్యు ← అబ్దుల్లాహి అబ్నుఇద్రీస ← అబూఉసామత ←అన్ బురైదిన్ ←అన్ అబీబుర్దత ← అన్ అబీముసా (రదిఅల్లాహుఅన్హు)← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ప్రకటించారు.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) “ఒక విశ్వాసికి, మరొక విశ్వాసికి, మధ్య సంబంధం ఎంత దృఢంగా ఉండాలంటే ఒకరి వలన మరొకరికి బలం, శక్తి చేకూరాలి” తరువాత వారు తన చేతి వ్రేళ్ళను ఒకదానిలో మరొకటి జొప్పించటం ద్వారా అవి ఎంత బలంగా మారతాయో ప్రదర్శించారు. సహీ బుఖారి హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

పరస్పరం ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకునే విశ్వాసులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకదానికొకటి బలాన్నిస్తూ కట్టడాన్ని (ఇంటిని) పటిష్టంగా ఉంచే వేర్వేరు ఇటుకరాళ్ళతో, ఇతర భాగాలతో పోల్చారు. ఎందుకంటే ఏ భవనమైనా (ఇల్లయినా) సరే దాని నిర్మాణం పూర్తియినదని మరియు నివాసయోగ్యంగా ఉందనీ చెప్పాలంటే, దానిలోని విభిన్న భాగాలు, కట్టడంలోని ఇటుకరాళ్ళు ఒకదానినొకటి గట్టిగా అంటిపెట్టుకుని ఉండి, భవనాన్ని దృఢ పర్చాలి. అలా కాని పక్షంలో, ఆ ఇంట్లోని గోడల్లో పగుళ్ళు వచ్చి కొంతకాలం తర్వాత మొత్తం భవనమే కూలిపోతుంది. ఒక ముస్లిం ఇతరుల తోడ్పాటు లేకుండా ఒక్కడే ఇస్లామీయ పద్ధతి ప్రకారం జీవించటం మరియు రోజువారి ఆరాధనలు చేయటం చాలా కష్టం.

హదీథ్ ఉల్లేఖకుడి పరిచయం

అబు మూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ బిన్ ముస్లిం అల్ అష్అరీ ప్రసిద్ధి చెందిన సహచరులలో ఒకరు. కూఫా పట్టణంలో నివసించేవారు. 50వ హిజ్రీ సంవత్సరంలో చనిపోయారు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. కట్టడం, ఇటుకరాళ్ళు వంటి మామూలు ఉదాహరణలు ఇవ్వటం వలన అసలు విషయం సులభంగా అర్థం అవుతుంది. అందులోని సారం కూడా తేలికగా తెలుస్తుంది.
  2. ముస్లింల మధ్య సహాయసహకారములు ద్వారా వారి దైవవిశ్వసం (ఈమాన్) బలపడుతుంది మరియు వారిని బలవంతులుగా చేస్తుంది.
  3. ముస్లిం ల మధ్య సహాయసహకారముల బంధం కోసం ప్రయత్నించాలి మరియు స్థాపించాలి.

ప్రశ్నలు

  1. ప్రజలు ఎలా సహాయసహకారాలందించుకోవాలి?
  2. అబు మూసా అష్అరీ రదియల్లాహు అన్హు గురించి వ్రాయండి.
  3. ఈ హదీథ్ ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనాలు వ్రాయండి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్