పుణ్యఫలాలు [పుస్తకం]

Punya-Falaalu-Doors-to-Great-Rewards


టైటిల్
: పుణ్యఫలాలు (Doors to Great Rewards)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
క్లుప్త వివరణ : దివ్యఖుర్ఆన్ ద్వారా లభించే పుణ్యాలు, అల్లాహ్ ధ్యానం యొక్క ద్వారా లభించే పుణ్యాలు, ఉదూ మరియు నమాజు ద్వారా లభించే పుణ్యాలు, ఉపవాసం ద్వారా లభించే పుణ్యాలు, వేర్వేరు ఉత్తమ ఆచరణల ద్వారా లభించే పుణ్యాలు

(Great Rewards of certain acts of worship in Islam) – E-Book

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [37 పేజీలు]

దివ్య ఖుర్ఆన్ శ్రేష్ఠత

حفظ القرآن: عَنْ عَائِشَةَ رَضي الله عنها عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (مَثَلُ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَهُوَ حَافِظٌ لَهُ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ وَمَثَلُ الَّذِي يَقْرَأُ وَهُوَ يَتَعَاهَدُهُ وَهُوَ عَلَيْهِ شَدِيدٌ فَلَهُ أَجْرَانِ).

1-ఖుర్ఆన్ కంఠస్తం చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని ఆయిషా ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్య ఫలానికి అర్హుడవుతాడు”. (బుఖారీ 4937. ముస్లిం 798).

تلاوة القرآن الكريم: عَنْ أَبِي أُمَامَةَ البَاهِلِي  رَضِيَ ٱللَّٰهُ عَنْهُ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ).

2-ఖుర్ఆన్ పారాయణం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ పారాయణం చేయండి. అది తన్ను చదివినవారి పట్ల ప్రళయదినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).

تعلم القرآن وتعليمه: عَنْ عُثْمَانَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ).

3- ఖుర్ఆన్ నేర్చుకోవటం, నేర్పించటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ నేర్చుకునేవాడు మరియు నేర్పేవాడు మీలో మేలైనవారు”. (బుఖారీ 5027).

4- సూర ఇఖ్లాస్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రశ్నించారని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా?” దానికి సహచరులు ‘ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగం ఎలా చదవగలడు? ప్రవక్తా!’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారుః “ఖుల్ హువల్లాహు అహద్ (సూరా) ఖుర్ఆన్ లో మూడవ వంతుకు సమానం”. (ముస్లిం 811. బుఖారీ 5015).

5- “ముఅవ్విజతైన్”: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఈ రాత్రి అవతరించిన ఆయతుల గురించి నీకు తెలియదా? అంతటి గొప్ప ఆయతులు ఎప్పుడూ అవతరించలేదుః ‘ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్’ మరియు ‘ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్’ సూరాలు”. (ముస్లిం 814)

6- సూర బఖర: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీరు మీ ఇళ్ళను శ్మశానంగా చేసుకోకండి. సూర బఖర పారాయణం ఏ ఇంట్లో జరుగుతుందో అందులో నుంచి షైతాన్ పారిపోతాడు”. (ముస్లిం 780).

7-సూర బఖర మరియు ఆలె ఇమ్రాన్: అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానుః “ఖుర్ఆన్ చదవండి. అది ప్రళయదినాన తన్ను చదివినవారి పట్ల సిఫారసు చేస్తుంది. రెండు పుష్పములైన సూర బఖర, సూర ఆలె ఇమ్రాన్ లు చదవండి. అవి రెండు మేఘాలుగా లేక రెండు ఛాయాలుగా లేక రెండు వరుసల్లో ఎగురుతున్న పక్షుల్లాగా ప్రళయదినాన వస్తాయి. వాటిని చదివినవారి కోసం అవి వాదిస్తాయి. సూర బఖర చదవండి. దాన్ని చదివితే భాగ్యం. విడనాడితే దౌర్భాగ్యం. మాంత్రికులకు అది అసాధ్యం”. (ముస్లిం 804).

8- ఆయతుల్ కుర్సీ: ఉబై బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “అబూ ముంజిర్! నీవు కంఠస్తం చేసిన అల్లాహ్ గ్రంథంలో గొప్ప ఆయతు ఏదో నీకు తెలుసా?” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ప్రశ్నించారు. ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని నేనన్నాను. ప్రవక్త మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. {అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం…} (సూర బఖరలోని 255వ ఆయతు) అని జవాబిచ్చాను. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (సంతోషంతో) నా ఛాతిపై కొట్టి “అల్లాహ్ సాక్షిగా! జ్ఞానం నీకు సులభంగా అబ్బుతుంది అబుల్ ముంజిర్” అని చెప్పారు. (ముస్లిం 810)

9- సూర బఖర చివరి ఆయతులు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సూర బఖరలోని చివరి రెండు ఆయతులు రాత్రి వేళ పఠించే వ్యక్తికి ఆ రాత్రంతా ఆ రెండు ఆయతులే చాలు”. (బుఖారీ 5009). ఇమాం నవవీ రహిమహుల్లాహ్ దీని భావం ఇలా చెప్పారుః ‘తహజ్జుద్ కొరకై లేవకున్నాపరవాలేదు అని ఒక భావం. షైతాన్ బారి నుండి కాపాడుకోవటానికి ఇవి సరిపోతాయనేది రెండవ భావం. ఆపదల నుండి రక్షించబడటానికి అనేది మూడవ భావం. అయితే ఇవన్నీ కూడా దీని భావంలో వస్తాయని కూడా చెప్పబడింది.

10- సూర కహఫ్ లోని మొదటి ఆయతులు కంఠస్తం చేయటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ” సూర కహఫ్ యొక్క మొదటి ఆయతులు కంఠస్తం చేసిన వ్యక్తి దజ్జాల్ కీడు నుండి రక్షింపబడుతాడు”. (ముస్లిం 809). మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః “మొదటి పది ఆయతులు కంఠస్తం చేసినవారికి……”.

అల్లాహ్ స్మరణ మహత్త్వం

11-అల్లాహ్ యొక్క అధిక స్మరణ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారరు: “‘ముఫర్రిదూన్’ ముందుకు వెళ్ళారు. ‘ముఫర్రిదూన్’ ఎవరు ప్రవక్తా! అని అడిగారు సహచరులు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారుః “అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేసే పురుషులు మరియు స్త్రీలు”. (ముస్లిం 2676).

12- “అల్లాహ్ ను స్మరించేవాని మరియు స్మరించనివాని ఉదాహరణ జీవినిర్జీవి లాంటిది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 6407). ముస్లింలోని ఉల్లేఖనం ఇలా ఉందిః “అల్లాహ్ స్మరణ జరిగే ఇల్లు మరియు అల్లాహ్ స్మరణ జరగని ఇల్లు ఉదాహరణ జీవినిర్జీవి లాంటిది”. (ముస్లిం 779).

13- సుబ్ హానల్లాహ్: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సమక్షంలో ఉండగా “ప్రతి రోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించడం మీలో ఎవరికైనా కష్టమా?” అని అడిగారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం). ఆ సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి ‘మాలో ఎవరైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలడు’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) “వంద సార్లు సుబ్ హానల్లాహ్ అని స్మరిస్తే వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి. లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి” అని సమాధానమిచ్చారని సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2698).

14- “సుబ్ హానల్లాహి వబిహందిహీ” అని రోజుకు వంద సార్లు ఎవరు పఠిస్తాడో అతని పాపాలన్నీ క్షమించబడతాయి. ఆ పాపాలు సముద్రపు నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2691).

15- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “సుబ్ హానల్లాహి వబి హందిహీ” అని ఉదయం వందసార్లు, సాయంకాలం వంద సార్లు ఎవరైతే పఠిస్తారో, అతనికంటే ఉత్తమమైన సత్కార్యం ప్రళయదినాన మరెవరిదీ ఉండదు. అదే విధంగా లేదా అంతకు మించి పఠించిన వ్యక్తి సత్కార్యం తప్ప”. (ముస్లిం 2692).

16- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః  “రెండు వచనాలున్నాయి. అవి (పఠించడానికి) నాలుక పై తేలిగ్గానే ఉంటాయి. కాని పరలోకపు త్రాసులో మాత్రం చాలా బరువుగా ఉంటాయి. కరుణామయుడయిన ప్రభువుకు ఈ వచనాలు ఎంతో ప్రియమైనవి, (అవేమిటంటేః) సుబ్ హానల్లాహి వబిహందిహీ, సుబ్ హానల్లాహిల్ అజీం (అల్లాహ్ పరమపవిత్రుడు, పరిశుద్ధుడు నేనాయన్ని స్తుతిస్తున్నాను. పరమోత్తముడైన అల్లాహ్ ఎంతో పవిత్రుడు). (బుఖారీ 6406. ముస్లిం 2694).

17- అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారుః “సూర్యుని కాంతి ఎన్నిటిపై పడుతుందో వాటన్నిటి కంటే అధికంగా “సుబ్ హానల్లాహి వల్ హందులిల్లాహి వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్” అనడం నాకు చాలా ఇష్టం”. (ముస్లిం 2695).

18- “ఎవరైనా ప్రతి నమాజు తర్వాత 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్ హందులిల్లాహ్ మరియు 33 సార్లు అల్లాహు అక్బర్ అని పఠిస్తే, ఇవి 99, మరియు లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అని 100 పూర్తి చేస్తే అతని పాపాలు క్షమించబడతాయి. ఒక వేళ అవి సముద్రం నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే. (ముస్లిం 597).

19-లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాః అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ఉద్దేశించి “నేను స్వర్గ నిక్షేపాలలో ఒక నిక్షేపం వంటి ఒక వచనాన్ని నీకు తెలుపనా? అని చెప్పారు. తప్పకుండా తెలియజేయండని నేనన్నాను. అప్పుడాయన r “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”. (బుఖారీ 6409. ముస్లిం 2704).

20-సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇది సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్: అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్ తనీ వఅన అబ్దుక వఅన అలా అహ్దిక వవఅదిక మస్తతఅతు అఊజుబిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారుః “ఎవరు ఈ దుఆ పూర్తి నమ్మకంతో ఉదయం చదివి, సాయంకాలం రాక ముందే చనిపోతాడో అతడు స్వర్గవాసుల్లో ఒకడు. ఎవరు రాత్రిపూట దాన్ని చదివి, తెల్లవారక ముందే చనిపోతాడో అతడూ స్వర్గవాసుల్లో ఒకడు”. (బుఖారీ 6306). (అనువాదం: ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు. నీవు తప్ప నిజ ఆరాధ్యుడెవ్వడూ లేడు. నీవే నన్ను సృష్టించావు. నేను నీ దాసుణ్ణి. నేను నీతో చేసిన (దాస్య) ప్రమాణాన్ని, వాగ్దానాన్ని సాధ్యమైనంత వరకు నిలబెట్టుకుంటాను. నా ద్వారా జరిగిన చెడు (వల్ల కలిగే దుష్పరిణామాల) నుండి నీ శరణు వేడుకుంటున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకొంటున్నాను. నేను చేసిన అపచారాలను ఒప్పుకుంటున్నాను. నా అపరాధాలను మన్నించు. పాపాలను మన్నించేవాడు నీవు తప్ప నాకు మరెవ్వరూ లేరు).

21- నిద్ర మధ్యలో మేల్కొన్న వ్యక్తి చదవ వలసిన దుఆ: “ఎవరు రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని ‘లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్ హందులిల్లాహ్, వ సుబ్ హానల్లాహ్, వల్లాహు అక్బర్, వలాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహ్’ చదివి, ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని వేడుకుంటే లేదా మరేదైనా దుఆ చేసుకుంటే అది అంగీకరింపబడు తుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజ్ చేస్తే అదీ స్వీకరించబడుతుంది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1154).

22-లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ వచనాలను ప్రతి రోజూ వంద సార్లు పఠించే వాడికి పది మంది బానిసలను విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది.  పైగా అతని కర్మల రికార్డులో వంద సత్కర్మలు అదనంగా వ్రాయబడతాయి. ఆ రికార్డులో నుంచి వంద దుష్కర్మలు తొలగించి వేయబడతాయి. అంతే గాకుండా ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ వచనాలు అతడ్ని షైతాన్ బారి నుండి రక్షిస్తాయని హామీ కూడా ఉంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాజాలదు. (బుఖారీ 6403. ముస్లిం 2691). [అనువాదం: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు ఎవరూ సాటి లేరు. రాజ్యాధికారం అంతా ఆయనదే. సర్వ స్తుతి, స్తోత్రాలకు ఆయనే యోగ్యుడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు].

23- అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ప్రవచించారుః “ఎవరైనా “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” పది సార్లు చదివితే అతనికి ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురి మనుషులను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 2694).

24- జిక్ర్ సమావేశాల శ్రేష్ఠత: అబూ హురైరా మరియు అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః  “ఎవరైనా కొంత మంది అల్లాహ్ ను స్మరిస్తూ కూర్చుంటే దైవదూతలు వారిని చుట్టుముడుతారు. (అల్లాహ్) కారుణ్యం వారిని ఆవరిస్తుంది. శాంతి వారిపై అవతరిస్తుంది. అల్లాహ్ వారి ప్రస్తావన తన వద్ద ఉన్నవారి ముందు చేస్తాడు”. (ముస్లిం 2700).

25- ప్రవక్తపై దరూద్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరు నాపై ఒకసారి దరూద్ పంపుతారో అతనిపై అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).

26- తిన్నత్రాగిన తర్వాత అల్ హందులిల్లాహ్ అనండి: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్ హందు లిల్లాహ్ అనడం అల్లాహ్ కు చాలా ఇష్టం. (ముస్లిం 2734).

వుజూ, నమాజుల ఘనత

27- ఉత్తమ రీతిలో వుజూ చేయడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తాడో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”. (ముస్లిం 245).

28- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఆదేశించిన విధంగా ఎవరైనా వుజూ చేసి, ఆ తర్వాత (ఐదు పూటల) ఫర్జ్ నమాజులు చేస్తే, అవి వాటి మధ్యలో జరిగే పాపాల పరిహారానికి కారణమవుతాయి”. (ముస్లిం 231).

29- వుజూ తర్వాత దుఆ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సజావుగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు” అని పలికితే అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తనకు ఇష్టమైన ద్వారం గుండా అందులో అతను ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

30- అజాన్ యొక్క జవాబు, ప్రవక్తపై దరూద్: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారుః “ముఅజ్జిన్ అజాన్ ఇస్తుండగా విన్నపుడు అతను చెప్పిన విధంగానే చెప్పి ఆ తరువాత నాపై దరూద్ పంపండి. నాపై ఒకసారి దరూద్ పంపినవారిపై అల్లాహ్ పదిసార్లు కరుణ పంపుతాడు”. (ముస్లిం 384).

31- అజాన్ తర్వాత దుఆ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ؆ ఉల్లేఖించారుః “అజాన్ విని (దాని జవాబు ఇచ్చిన  తర్వాత) ఈ దుఆ చదివిన వ్యక్తి ప్రళయం దినాన నా సిఫారసుకు అర్హుడవుతాడుః “అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ”. (బుఖారీ 614).

32- అజాన్ యొక్క మహత్తు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ముఅజ్జిన్ యొక్క అజాన్ శబ్దాన్ని విన్న మానవులు, జిన్నాతులు ఇంకా ఎవరైనా సరే,  ప్రళయదినాన వారు దానికి తప్పక సాక్ష్యం ఇస్తారు. (బుఖారీ 609).

33- మస్జిద్ నిర్మాణం: ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) మస్జిదె నబవీని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారుః మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని నేను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నానుః “కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం అల్లాహ్ అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు”. (బుఖారీ 450. ముస్లిం 533).

34- ఇమాంతో పాటు ఆమీన్ అనటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమామ్ ఆమీన్ అన్నప్పుడు మీరూ అమీన్ అని పలకండి. (అప్పుడు దైవదూతలు కూడా ఆమీన్ అంటారు). ఎవరి ఆమీన్ దైవదూతల ఆమీన్ కు అనుగుణంగా ఉంటుందో అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 780. ముస్లిం 410).

35- నమాజుకు తొలి వేళలో బయలుదేరటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశిం చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “వేళ కాగానే తొలి వేళలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే అందులో ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615. ముస్లిం 437).

36- ఇంట్లో వుజూ చేసి, మస్జిద్ కు కాలినడకతో వెళ్ళుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా  ఉల్లేఖించారు: “ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

37- మస్జిద్ కు నడచి వెళ్లటం: అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం మహనీయ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి మాటల్ని నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([1])“. (ముస్లిం 587).

38- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా  ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తికి అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు”. (బుఖారీ 662. ముస్లిం 669).

39- సున్నతె ముఅక్కద: ఉమ్మె హబీబా ؅ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖించారుః “ఏ ముస్లిం భక్తుడు అల్లాహ్ కొరకు ప్రతి రోజు పన్నెండు రకాతుల నఫిల్ నమాజు చేస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు”. (ముస్లిం: 1696).

అవిః జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2 మరియు ఫజ్ర్ కు ముందు 2.

40- తహజ్జుద్ నమాజ్: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు ఏది? అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అడిగినప్పుడు “ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు అర్థ రాత్రి తరువాత చదివే (తహజ్జుద్) నమాజు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బదులిచ్చారు. (ముస్లిం 2756).

41- ఇషా మరియు ఫజ్ర్ నమాజ్ సామూహికంగా (జమాఅత్ తో) చేయటం: నేను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నాను అని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే ఇషా నమాజ్ సామూహికంగా పాటించారో వారికి అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం, మరెవరైతే ఫజ్ర్ నమాజ్ సామూహికంగా చేశారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 656).

42- సక్రమంగా వుజూ చేసి జుమాకు వెళ్ళి, నిశబ్దంగా, శ్రద్ధగా ఖుత్బా వినటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా t ఉల్లేఖించారుః “ఎవరైతే సక్రమంగా వుజూ చేసి, జుమా కొరకు వచ్చి, నిశబ్దంగా ఉండి, శ్రద్ధగా ప్రసంగం వింటాడో అతని ఈ జుమా నుండి మళ్ళీ జుమా వరకు ఇంకా మూడు రోజుల అదనంగా (అంటే మొత్తం పది రోజుల పాపాలు) మన్నించబడతాయి”. (ముస్లిం 1987).

43-శీఘ్రంగా జుమా నమాజు కొరకు వెళ్ళుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “జుమా రోజు దైవదూతలు మస్జిద్ యొక్క ద్వారంపై నిలబడి ఉంటారు. ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు వ్రాసుకుంటారు. అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి లభించే పుణ్యం ఒక ఒంటె ఖుర్బానీ ఇచ్చిన వ్యక్తికి లభించే పుణ్యానికి సమానం. ఆ తర్వాత గడియలో వచ్చేవారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తరువాత వారికి ఒక పొట్టేలు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తర్వాత వారికి కోడి, ఆ తర్వాత వారికి గ్రుడ్డు అల్లాహ్ మార్గంలో సదకా చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇమాం మెంబర్ పై వచ్చాక దైవదూతలు తమ రిజిస్టర్లను చుట్టుకొని, ఖుత్బా వింటారు. (అంటే ఆ తరువాత వచ్చేవారు ఆ దైవదూతల రిజస్టర్లో లిఖించబడరు). (బుఖారీ 929. ముస్లిం ). 

44- జనాజా నమాజ్ మరియు ఖననంలో పాల్గొనుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూహురైరా r ఉల్లేఖించారుః “ఎవరైతే జనాజా వెంట వెళ్తాడో, జనాజా నమాజ్ చేయించే వరకు ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ హాజరై ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది”. రెండు ‘ఖీరాత్’లంటే ఎంత? అని ప్రశ్నించగా “అవి రెండు పెద్ద పర్వతాలకు సమాన”మని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధానమిచ్చారు. (బుఖారీ 1325. ముస్లిం 945).

ఉపవాస (రోజా) ఘనతలు

45- విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాను రోజాలుండుట: “ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ 38. ముస్లిం 760).

46- విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజానులో తరావీహ్ చేయుట: “విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజానులో తరావీహ్ పాటించిన వ్యక్తి పూర్వ పాపాలు క్షమించ బడున”ని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చినట్లు అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 37. ముస్లిం 759). 

47- షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారని అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా రమజానుపవా సాలు పాటించి, ఆ తరువాత షవ్వాల్ నెలలో కూడా 6 ఉపవాసాలు పాటిస్తే, ఒక సంవత్సర కాలం రోజా ఉన్నంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 1164).

48- ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) చెప్పారుః ‘నా ప్రాణ స్నేహితులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నాకు మూడు విష యాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ వదలి పెట్టను. ఆ మూడు విషయాలు ఇవిః (1) ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసాలు పాటించడం. (2) చాష్త్ నమాజ్ చేయడం. (3) విత్ర్ నమాజు చేసి నిద్రపోవడం. (బుఖారీ 1178. ముస్లిం 721).

42- అరఫా దినాన ఉపవాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అరఫా దినాన ఉపవాసం వల్ల, గడచిన సంవత్సరం పాపాలనూ, వచ్చే సంవత్సరం పాపాలనూ అల్లాహ్ మన్నిస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

43- ఆషూరా దినపు ఉపవాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు “ఆషూరా దినపు ఉపవాసం వలన అల్లాహ్ గడిచిన ఒక సంవత్సరపు పాపాలను దూరం చేస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

వివిధ ఘనతలు

51- పశ్చాత్తాపం: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః “పశ్చిమ దిశ నుండి సూర్యోదయానికి ముందు వరకు అల్లాహ్ పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు”. (ముస్లిం 2703).

52- హజ్, ఉమ్రాల ఘనత: “ఎవరైనా ఒక ఉమ్రా తరువాత మరొక ఉమ్రా చేస్తే, ఆ రెండు ఉమ్రాల మధ్య కాలంలో అతని వల్ల జరిగిన పాపాలకు రెండవ ఉమ్రా పరిహారం అవుతుంది. మబ్రూర్ హజ్ కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ కాదు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1773. ముస్లిం 1349).

53- జిల్ హిజ్జ మొదటి దశకంలో అధికంగా సత్కార్యాలు చేయటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “జిల్ హిజ్జ మొదటి దశలో చేసిన సత్కార్యాలకున్నంత ఘనత వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు లేదు”. జిహాద్ కు సయితం ఆ పుణ్యం లేదా? అని సహచరులు అడిగారు. దానికి ఆయన r “అవును జిహాద్ కు కూడా లేదు. కేవలం తన ధన ప్రాణంతో సహా జిహాద్ కు వెళ్ళి తిరిగిరాని అమరవీరునికి తప్ప” అని జవాబిచ్చారు. (బుఖారీ 969).

54- విద్యాభ్యాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లే ఖించారుః “విద్యాభ్యాసం కొరకు ఎవరైనా ఒక దారిన వెళ్తే అల్లాహ్ అతని కొరకు ఆ దారిని స్వర్గం వైపునకు సులభం చేస్తాడు. (ముస్లిం 2646).

55- ధర్మావగాహన: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని ముఆవియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “అల్లాహ్ ఎవరి పట్ల మేలు కోరుతాడో అతనికి ధర్మావగాహన ప్రసాదిస్తాడు”. (బుఖారీ 71. ముస్లిం 2389).

56- ధర్మప్రచారం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరు సన్మార్గం వైపునకు పిలుస్తారో, అతనికి దానిని అనుసరించేవారంత పుణ్యం లభిస్తుంది. (ఆచరించేవారి) పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు”. (ముస్లిం 2674).

57- మంచిని ఆదేశించడం, చెడును ఖండించడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ సఈద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా చెడును చూసినచో తన చేత్తో దాన్ని రూపు మాపాలి. ఈ శక్తి లేకుంటే తన నోటి (మాట, ఉపదేశం)తో, ఈ శక్తి కూడా లేనిచో మనుస్సులో దాన్ని చెడుగా భావించి (దానికి దూరంగా ఉండాలి). ఇది విశ్వాసం యొక్క అధమ స్థానం”. (ముస్లిం 49).

58- సలాంను వ్యాపింపజేయటం: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ‘ఏ ఇస్లాం మేలైనది’ అని ఒక వ్యక్తి అడిగాడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ని. ఆయన r ఇలా సమాధానమిచ్చారుః “అన్నం తినిపించు. నీకు పరి చయం ఉన్నవారికీ, లేనివారికీ సలాం చేయి”. (బుఖారీ 12. ముస్లిం 29).

59- అల్లాహ్ కొరకే ప్రేమ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: “ప్రళయదినాన అల్లాహ్ ఇలా అంటాడుః నా కొరకే పరస్పర ప్రేమ సంబంధాలను పెంచుకున్న వారెక్కడున్నారు? ఈ రోజు నా ఛాయ తప్ప ఏ ఛాయాలేని రోజు, నేను వారిని నా ఛాయలో ఉంచుతాను”. (ముస్లిం 6548).

60- సత్యం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సత్యాన్ని మీరు విడనాడకండి. సత్యం మనిషిని పుణ్యకార్యాల వైపునకు తీసుకెళ్తుంది. పుణ్యకార్యాలు స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లపుడు సత్యం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి)గా మార్చేస్తుంది”……. (బుఖారీ 6094. ముస్లిం 2607).

61- సత్ప్రవర్తన: “మీలో ఉత్తమ నడవడికగలవారే మేలైనవారు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనేవారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 3559. ముస్లిం 2321).

62- చిరునవ్వు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ఉద్దేశించి ఇలా చెప్పారని అబూ జర్ r ఉల్లేఖించారుః “ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువలేనిదిగా భావించకు – అది నీ తోటి సోదరునితో నగుమోముతో కలియుటయే అయినా సరే”. (ముస్లిం 2626).

63- మృదుత్వం: “మృదుత్వం కోల్పోయిన వ్యక్తి సర్వ మేళ్ళను కోల్పోయినట్లే” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని జరీర్ t ఉల్లేఖించారు. (ముస్లిం 2592).

64- రోగిని పరామర్శించటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఆయన r సేవకుడైన సౌబాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారుః “ఎవరు రోగిని పరామర్శించ టానికి వెళ్తాడో అతను (తిరిగి వచ్చే వరకు) స్వర్గపు తోటలో ఉంటాడు”. (ముస్లిం 2568).

65- సహనం: “ఒక ముస్లిం మానసిక వ్యధకూ లేదా అనారోగ్యానికి లేదా ఏదయినా కష్టానికి గురయి దాన్ని ఓరిమితో సహించినట్లయితే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ అతని తప్పులను మన్నిస్తాడు. కడకు అతనికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అది అతని పాప పరిహారానికి కారణభూతం అవుతుంది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 5642. ముస్లిం 2573).

66- సత్కార్యం చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ప్రతి సత్కార్యం సదకాయే”. (బుఖారీ 6021. ముస్లిం 1005).

67- ఒకరి కష్టం దూరం చేయడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారుః “ఇహలోకంలో ఒక విశ్వాసికి ఎదురయ్యే కష్టాల్లో ఏ ఒక కష్టాన్నయినా ఎవరయినా దూరం చేస్తే, పరలోకంలో అతనికి ఎదురయ్యే కష్టాల్లో ఒక పెద్ద కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే ఋణగ్రస్తునికి వ్యవధి ఇస్తాడో, ఇహపరాల్లో అతడికి అల్లాహ్ సుఖసంపదలు నొసంగుతాడు”. (ముస్లిం 2699).

68- అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “అల్లాహ్ ప్రళయదినాన ఆపదల నుండి కాపాడుట ఎవరికి ఇష్టమో వారు రుణగ్రస్తుని రుణ చెల్లింపుకై గడువు ఇవ్వాలి. లేదా మొత్తానికే మన్నించాలి”. (ముస్లిం 1563).

69- అనాథ సంరక్షణ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ శుభవార్త ఇచ్చారని సహల్ బిన్ సఅద్ r ఉల్లేఖించారుః “నేను మరియు అనాథుల సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చూపుడు వ్రేళు మరియు మధ్య వ్రేళ్ళను కలిపి చూపించారు. (బుఖారీ 6005).

70- వితంతువులు మరియు పేదలను ఆదుకోవటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోదించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “పేదలు మరియు వితంతువుల సేవ చేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉండేవాడు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారిలాంటివాడు. లేదా పగలంతా ఉపవాసం పాటిస్తూ రాత్రిళ్ళు దైవారాధనలో గడిపే వారితో సమానుడవుతాడు”. (బుఖారీ 5353. ముస్లిం 2982).

71- ముస్లిం సోదరుని కోసం దుఆ చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారు అబూ దర్దా t: “ఎవరు తన సోదరుని వెనక అతని కొరకు దుఆ చేస్తాడో, అక్కడ ఒక దైవదూత నియమింపబడి ఉంటాడు, అతడు దానిపై ఆమీన్, నీకూ ఇలాంటి మేలే కలుగుగాక! అని దీవిస్తాడు”. (ముస్లిం 2732).  

72- రక్త సంబంధం పెంచుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “తన ఉపాధిలో సమృద్ధిని, దీర్ఘా యుష్షును కోరే వ్యక్తి బంధుత్వ హక్కులను నెరవేర్చాలి”. (ముస్లిం 2557).

73-సదఖా: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా తన మంచి (ధార్మిక) సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేస్తే -అల్లాహ్ మంచి వస్తువును మాత్రమే స్వీకరిస్తాడు- అల్లాహ్ దాన్ని తన కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పెరిగి పర్వతం మాదిరిగా అయి పోతుంది”. (బుఖారీ 1410. ముస్లిం 1014).

74-ఇంటివారిపై ఖర్చు చేస్తూ పుణ్యాన్నాశించటం: అబూ మస్ఊద్ బద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “మనిషి పరలోకంలో సత్ఫలితం పొందే ఉద్దేశ్యంతో తన ఇంటివారిపై ఖర్చు చేస్తే, అది అతని ‘సదకా’ (మంచి దానం)గానే పరిగణించ బడుతుంది”. (బుఖారీ 55. ముస్లిం 1002).

75- కూతుళ్ళకు సుశిక్షణ: అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “ఎవరైతే ఇద్దరు బాలికలకు వారు పెళ్ళి ఈడుకు చేరుకునే వరకు మంచి శిక్షణ ఇస్తాడో అతను మరియు నేను ప్రళయదినాన ఇలా ఉంటాము అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ వ్రేళ్ళను కలిపారు”. (ముస్లిం 2631).

76- ఎడతెగని పుణ్యం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః మనిషి చనిపోయినపుడు అతని ఆచరణ అంతమయి పోతుంది. అయితే మూడు రకాల ఆచరణలు మటుకు అంతం కావు. (వాటి పుణ్య ఫలం మనిషికి లభిస్తునే ఉంటుంది). (1) సదకా జారియ. (2) ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం. (3) అతని కోసం దుఆ చేసే ఉత్తమ సంతానం. (ముస్లిం 1631).

77- బాధాకరమైన వస్తువును దారి నుండి తొలగించుటం: అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారుః “ఒక వ్యక్తి దారిన నడచిపోతూ దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం చూశాడు. అతను దాన్ని తీసి పక్కన పారేసి వెళ్ళిపోయాడు. అతను చేసిన ఈ పుణ్యకార్యాన్ని అల్లాహ్ స్వీకరించి అతని (గత పాపాల్ని) మన్నించాడు”. (బుఖారీ 2472 ముస్లిం 1914).

78- ఆరోగ్యం, తీరిక: హజ్రత్ ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారుః “రెండు వరాల పట్ల అనేక మంది నష్టములో పడియున్నారు. ఒకటిః ఆరోగ్యం. రెండవదిః తీరిక”. (బుఖారీ 6412).

79-సంతానం చనిపోయినవారు చేసే సహనానికి ఫలితం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఇలా సెలవిచ్చాడుః నేను నా దాసునికి ప్రియమైనవారిని చంపినపుడు అతను సహనం వహిస్తే, పుణ్యాన్నాశిస్తే దానికి బదులుగా నేను అతనికి స్వర్గం ప్రసాదిస్తాను”. (బుఖారీ 6424).

80-ఏడుగురిని అల్లాహ్ తన ఛాయలో ఉంచుతాడు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసన) నీడా తప్ప మరెలాంటి నీడ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు గుణాలవారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలోః (1) న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు. (2) తన యౌవన జీవితం అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి. (4) కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం పరస్పర అభిమానించుకునే, అల్లాహ్ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు. (5) అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్య కార్యానికి పిలిచినప్పుడు, తాను అల్లాహ్ కు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతములో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 1423. ముస్లిం 1031).

81- అల్లాహ్ కొరకు పరస్పర దర్శనం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి తన సోదరుణ్ణి దర్శించటానికి వేరే గ్రామానికి వెళ్ళాడు. ఆ దారిలో అల్లాహ్ ఒక దైవదూతను మాటు వేసి ఉండమని పంపాడు. ఆ వ్యక్తి రాగానే దైవదూత “నీవు ఎటు వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆ గ్రామంలో నా ధార్మిక సోదరుడు ఒకడున్నాడు. అతన్ని కలుసుకోవటానికి వెళ్తున్నాను అన్నాడతను. “అతడు నీకు ఏదైనా మేలు చేశాడని, నీవు దాన్ని తీర్చడానికి వెళ్తున్నావా?” అని అడిగాడు దైవదూత. అదేం కాదు. నేను అల్లాహ్ కొరకే అతన్ని ప్రేమించాను అని ఆ మనిషి జవాబిచ్చాడు. దానికి ఆ దూత ఇలా చెప్పాడుః “నేను అల్లాహ్ యొక్క దూతను, అల్లాహ్ నన్ను ఈ శుభవార్తతో పాటు నీ వైపు పంపాడు. నీవు అతడ్ని అల్లాహ్ కొరకే ప్రేమించినందుకు అల్లాహ్ నిన్ను ప్రేమించాడు”. (ముస్లిం 2567).

82- అతి స్వల్పమైన షిర్క్ నుండి కూడా దూరముండాలి: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ కు ఏ మాత్రం షిర్క్ చేయనివాడు (భాగస్వామ్యం కల్పించనివాడు) అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటే స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఆయనకు సాటి కల్పించే మనిషి అదే స్థితిలో కలుస్తే నరకంలో చేరుతాడు”. (ముస్లిం 270).

83- బల్లిని చంపుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక దెబ్బకే బల్లిని చంపినవారికి 100 పుణ్యాలు లభిస్తాయి. రెండు దెబ్బల్లో చంపినవానికి అంతకు తక్కువ. మూడు దెబ్బల్లో చంపినవానికి అంతకు తక్కువ”. (ముస్లిం 2240).

84- ఏదైనా నఫిల్ సత్కార్యం అది తక్కువైనా నిరంతరం చేయటం: ఆయిషా ؅ ఉల్లేఖనం ప్రకారం ‘అల్లాహ్ కు అన్నింటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?’ అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ని ప్రశ్నించగా, “అల్లాహ్ కు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం, అది తక్కువైనా సరే” అని ఆయన సమాధానమిచ్చారు. (బుఖారీ 6465. ముస్లిం 1828).

85- మంచి సంప్రదాయం (సున్నతె హసన): ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(ప్రజలు మరచిపోయిన) ఇస్లాంలోని ఒక మంచి సంప్రదాయాన్ని ఎవరు పునరారంభిస్తారో అతనికి దాని పుణ్యంతో పాటు అతని తర్వాత దాన్ని అనుసరించే వారి పుణ్యం కూడా లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు.  ఇక ఎవరు ఇస్లాంలో ఒక చెడు సంప్రదాయాన్ని మొదలెడతారో దాని పాప భారం అతనిపై పడుతుంది. ఇంకా అతని తర్వాత ఎవరు దాన్ని అవలంబిస్తారో వారి పాప భారం కూడా అతనిపై పడుతుంది. మరి వారి పాపాల్లో ఏ కొరతా జరగదు”. (ముస్లిం 2351).


(1) రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరా కాయడంతో సమానమని అర్థం.