షిర్క్ (బహు దైవారాధన లేదా విగ్రహారాధన) ఎలా ప్రారంభమైనది ? (How shirk or idolatory started?)

షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించుట) గురించి తెలుసుకున్న తర్వాత, అది ఈ లోకంలో ఎలా ప్రారంభమైనదో తెలుసుకోవటం మంచిది. షిర్క్ మొట్టమొదట నూహ్ అలైహిస్సలాం కు పూర్వపుకాలంలో ప్రారంభం అయినది. అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం ను వారి సంతతి వద్దకు ప్రవక్తగా చేసి పంపినప్పుడు ఆయన వారిని విగ్రహారాధనను విడనాడవలసినదిగా ఉద్బోదించారు, సకలరాశి సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాహ్ యొక్క ఆరాధన వైపునకు పిలిచారు. దానితో వారు ఆయనను వ్యతిరేకించారు, విగ్రహారాధనకు కట్టుబడి ఉంటానికి పూనుకున్నారు, ఆయనను ఉపదేశాలను తిరస్కరించారు, ఆయనను కష్టపెట్టడం ప్రారంభించారు. ఇంకా వారు ఇలా ప్రకటించారు.

నూహ్ 71:23:- “ మరియు వాళ్ళు అన్నారు – ఎట్టి పరిస్థితిలోను మన దేవుళ్ళను (విగ్రహారాధన ను) వదలవద్దు. మరియు వద్ మరియు సువాఅ మరియు యగూస్ మరియు యఊఖ్ మరియు నసరా ని వదలవద్దు అన్నారు.”

పై వాక్యం యొక్క వివరణ (సహీ బుఖారీ) లో అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఉల్లేఖన లో ఇలా వివరించబడినది – ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలాం కాలంనాటి ప్రజలలోని పుణ్యపురుషుల పేర్లు. వీరు చనిపోయిన తర్వాత షైతాన్ ఇట్లా ఉసి కొల్పెను.” మీరు మీ సభలలో ఆ పుణ్యపురుషుల ఫొటోలు, విగ్రహములు చేసి ఉంచి వారి గురించి తెలియజేస్తుండండి” వారు అదే విధముగా చేయటం ప్రారంభించారు.  కాని ఆ ప్రజలు వారిని ఆరాధించలేదు. తర్వాత ఈ విధంగా విగ్రహాలు తయారు చేసి వారు చనిపోయారు. వారి తర్వాత వచ్చిన ప్రజలు ఆ విగ్రహాలను ఆరాధించటం (పూజించడం) ప్రారంభించారు.

హాఫిజ్ ఇబ్నె అల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా విశదీకరించారు – “చాలామంది మతగురువులు ఇలా తెలిపారు. ఆ పుణ్యపురుషులు చనిపోయినప్పుడు ప్రజలు వారి సమాధుల వద్ద గుమిగూడి తపస్సులు(ధ్యానం) చేసెడివారు. ఆ తర్వాత వారి ఫొటోలు(చిత్రపటాలు), విగ్రహాలు తయారు చేశారు. ఇంకా కాలం మారే కొద్దీ, వారి తరువాత ప్రజలు వాటిని పూజించటం ప్రారంభించారు.” కాబట్టి దీని వలన అర్థం మవుతున్నది ఏమిటంటే షిర్క్ (బహు దైవారాధన లేదా అల్లాహ్ కు సాటి కల్పించుట) ప్రారంభమగుటకు అసలు కారణం పుణ్యపురుషుల విషయంలో గులూ (హద్దు మీరటం) చేయటమే. పుణ్యపురుషుల విషయంలో హద్దు మీరి విధేయత చూపటం వలన ప్రజలలో షిర్క్ చోటు చేసుకుంటుంది.

Source: Tawheed Course – Level 01