ఇస్లాం అమర వీరులు [6p] [PDF]
وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
“అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.”
(అల్ బఖర 2: 154)
మహాశయులారా!
పై ఆయతులో అల్లాహ్ ధన్యజీవుల గురించి ప్రస్తావించాడు. వారే ఇస్లాం మార్గంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులు. అల్లాహ్ సన్నిధిలో వారికి మహోన్నత స్థానం ఉంది. మన ఊహకందని మహత్తర జీవితం, ఆనందం వారికి అక్కడ లభిస్తుంది. పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో అమరవీరుల గురించి, వారి విశిష్ఠత గురించి పలు ఆయతుల్లో చెప్పబడింది.
దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో అధర్మంగా, మోసగించబడి ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రముఖ అమరవీరుల గాథలను ఈ రోజు తెలుసుకుందాం. కాని కరుడుగట్టిన విరోధులు వారిని మోసగించి హతమార్చారు. పిరికిపందలైన తిరస్కారుల అలవాటే అది. సత్యవంతులను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది. అందుకే మోసపూరిత సన్నాగాలు, కుట్రలు పన్ని వారిని అధర్మంగా హతమార్చారు. నేటి ఇస్లాం విరోధుల స్థితి కూడా అలానే ఉంది.
ముస్లిం సోదరులారా!
మీ ముందు చెప్పబోయే ఈ సంఘటన ఉహద్ యుద్దం తరువాత హిజ్ర శకం 4వ యేట జరిగింది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం:
ఉహద్ యుద్ధానంతరం తిరస్కారులు, ఇస్లాం విరోధులు ముస్లింల గౌరవ మర్యాదలను మట్టిపాలు చేయటానికి, వారికి నష్టం కల్గించే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నసాగారు. ఇంత నష్టం జరిగినా ముస్లింలు యుద్ధ వ్యూహరచనలతో, శక్తిసామర్థ్యాలతో, సైన్యాన్ని సమీకరిస్తూ పుంజుకోవటాన్ని వారు సహించలేకపోయారు. ఇస్లాంను దెబ్బతీయటానికి, నష్టం, కీడు తలపెట్టడానికి మరో దుష్టాలోచన చేశారు. ఖురైషులంతా కలసి అజల్ ఖిరా జాతిలోని 7 గురు వ్యక్తులను ఎన్నుకుని వారిని మదీనాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి పంపారు. వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, “దైవ ప్రవక్తా! (సల్లల్లాహు అలైహి వసల్లం) ! మా వర్గమంతా ఇస్లాం స్వీకరించటానికి సిద్ధంగా ఉంది. వారి శిక్షణ కోసం ఇస్లామీయా బోధకులను మీరు మా వెంట పంపించండి” అని అంటారు.