[ 7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَّفْرُوضًا
“తల్లిదండ్రులు, సమీపబంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం విధిగా ఉంది.” (సూరా నిసా , 7వ ఆయత్) [1]
[1]ఇస్లాంకు పూర్వం జరిగే అన్యాయాలలో ఒకటి స్త్రీలకు, చిన్న పిల్లలకు వారసత్వంలో వాటా యివ్వకుండా ఉండటం. యుద్దాలలో పాల్గొనేందుకు అర్హులైన పెద్ద పిల్లలు మాత్రమే ఆస్తి మొత్తానికి వారసులయ్యేవారు. తమ తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలి వెళ్ళిన ఆస్తిలో పురుషుల మాదిరిగానే స్త్రీలకు, ఆడపిల్లలు – మగపిల్లలందరికీ కూడా వాటా నిర్ధారితమై ఉందని అల్లాహ్ ఈ ఆయతులో విపులీకరించాడు. కాకపోతే ఆడ పిల్లకు లభించే వాటా మగ పిల్లవాడికి లభించే వాటాలో సగభాగం అయి ఉంటుంది. అది వేరే విషయం (మూడు ఆయతుల తర్వాత ఆ వివరాలు కూడా వస్తాయి). దీన్ని స్త్రీజాతికి జరిగిన అన్యాయంగా భావించి గగ్గోలు చెందవలసిన అవసరం లేదు. ఇస్లాం యొక్క ఈ వారసత్వ నియమం న్యాయం, ధర్మంతో కూడుకుని ఉంది. ఎందుకంటే స్త్రీలపై ఇస్లాం సంపాదనా భారం మోపలేదు. పురుషుణ్ణి ఆమె పోషకునిగా, సంరక్షకునిగా నియమించింది. అదీగాక వివాహ సమయంలో స్త్రీకి మహర్ రూపంలో సొమ్ము ముడుతుంది. దాన్ని చెల్లించే బాధ్యత కట్టుకున్న మొగుడిపై మోపబడింది. ఈ రకంగా పురుషునిపై – స్రీకన్నా – ఎన్నో రెట్లు ఆర్థికపరమైన బరువు, బాధ్యతలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో స్త్రీకి సగభాగం బదులు మగవానితో సమానంగా పూర్తి భాగం ఇస్తే అది ఒక రకంగా పురుషునిపై ‘జులుం” అవుతుంది. కాని అల్లాహ్ ఎవరికీ అన్యాయం (జులుం) చేయదలచలేదు. ఎందుకంటే ఆయన న్యాయశీలుడు, వివేకవంతుడు.
[1] [నుండి: అహ్సనుల్ బయాన్]

You must be logged in to post a comment.