40 హదీసుల సమాహారం | అల్ అర్బయీన్ అన్ నవవియ్యహ్

40 హదీసుల సమాహారం
అల్ అర్బయీన్ అన్ నవవియ్యహ్

మూల రచయిత: ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్)

తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి (హఫిజహుల్లాహ్)
పున: పరిశీలకులు: డా. సయీద్ అహ్మద్ ఉమరి, మదని (హఫిజహుల్లాహ్)
చిన్న భాషా పరమైన మార్పులు, చేర్పులు: తెలుగుఇస్లాం.నెట్

ఒక్కక్కటిగా అన్నీ హదీసుల లింకులు ఏర్పాటు చేస్తాము, ఇన్ షా అల్లాహ్

విషయసూచిక [PDF]

చెదరని ఖ్యాతి 

ఏడో శతాబ్దపు కాలం నాటి హదీసు వేత్తల్లో గొప్ప పేరు గాంచిన వారిలో ‘అబూ జకరియా ముహ్యుద్దీన్ యహ్యా బిన్ షరఫ్ అన్నవవి‘ (రహిమహుల్లాహ్) గారు. వీరు ధర్మజ్ఞానములో మూర్తిభవించిన ప్రతిభశాలి. ఎన్నో గ్రంధాలను కూర్పు చేసారు. ‘రియాజుస్సాలిహీన్’ (హదీసు కిరణాలు) అనే పుస్తకం ముస్లిం సమాజములో ఒక విప్లవాత్మకమైన శైలిని పరచివేసింది. రేయింబవళ్ళు ప్రతి ఒక్కరూ దానితో ప్రయోజనాలు అర్జిస్తూంటారు. ఇలాంటి గొప్ప వ్యక్తి ఆ కాలంలోనే ‘అర్బయీన్’ని సమకూర్చడం చెపుకోదగిన విషయమే. అర్బయీన్ వ్రాయటానికి గల కారణాలను తెలియపరుస్తూ చెబుతున్నారు: 

హజ్రత్ అబూ హురైరా, మరియు అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హుమ్) ఉల్లేఖనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: ‘ఎవరైతే నా జాతిలో నలభై హదీసులు ధర్మాదేశాల పట్ల కంఠస్తం చేస్తాడో అల్లాహ్ అతన్ని ప్రళయ దినమున ‘ఫఖీహ్’ (జ్ఞానవగాహను)ల మరియు ఉలమా(ధార్మిక పండితు)ల వర్గీయుల్లో లేపుతాడు“. మరో ఉల్లేఖనంలో: ‘ఫఖీహ్’ (జ్ఞానవగాహనుడు), ‘ఆలిమ్’ (ధార్మిక పండితుడు) గా లేపుతాడు.’ అబూదర్గా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో: ‘అతనికి నేను ప్రళయదినమున సిఫారసు చేస్తాను, సాక్షిగా వుంటాను‘. ఇబ్నె మసూద్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనంలో: ‘అతనితో చెప్పబడుతుంది స్వర్గానికి వున్న తలుపుల్లో నుండి నీకు ఇష్టమొచ్చిన తలుపు నుంచి స్వర్గములో ప్రవేశించు‘. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ‘అతని పేరు ఉలమాల్లో వ్రాయబడుతుంది, మరి ప్రళయ దినమున అతను అమరగతుల వర్గములో లేపబడుతాడు‘. ఇలాంటి ఉల్లేఖనాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి అయితే హదీసు వేత్తల్లో ఇవి ‘జయీఫ్ ‘గానే పరిగణించబడ్డాయి. 

ఈ మార్గములో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినవారు అబ్దుల్లాహ్ బిన్ ముబారక్, తరువాత ముహమ్మద్ బిన్ అస్లమ్ అత్తూసీ, ఇంకా అల్ హసన్ బిన్ సుఫియాన్ అన్నసాయి మొదలైన వారు. పూర్వీకుల్లోను తరువాతి తరంలోను చాలా మందే వున్నారు. నేను కూడ వారి అడుగుజాడల్లో పయనించాను. ‘ఫజాయిలుల్ ఆమాల్’ (కర్మల ప్రాముఖ్యత) అనే అభ్యాసములో జయీఫ్ హదీస్ పై కూడా అమలు చేయవచ్చు అని ధార్మిక వేత్తలు ఏకీభవించియున్నప్పటికీ నేను దాని మీద ఆధార పడలేదు. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రవచనం: ‘లియుబల్లిఘష్ షాహిద్ మిన్ కుముల్ ఘాయిబ్’ (ఉన్నవారు మీలో లేని వారి వరకు చేరవేయాలి). అలాగే మరో హదీసు: ‘అల్లాహ్ ఆవ్యక్తిని వసంతభరితంగా వుంచుగాక ఎవరైతే నా మాట విని దాన్ని కంఠస్తం చేసి ఎలాగైతే విన్నాడో అలాగే వేరేవారికి వినిపిస్తాడో‘ అనే హదీసులను పరిగణలోకి తీసుకొని దీన్ని వ్రాయడం జరిగింది. 

అర్బయీన్ కూర్పు చేసిన ప్రతి ధార్మిక పండితుడు సదుద్దేశముతో ఒక అంశాన్ని లక్ష్యంగా ఎంచుకొని చేయడం జరిగింది. అయితే నేను ఇందులో పొందుపరిచిన హదీసులు ప్రతి ఒక్కటి ధార్మిక సూత్రాల్లో ఒక గొప్ప సూత్రముగా అయివున్నది. (పేజి: 23-25) 

మరో విషయం ఏమంటే ఇందులో దాదాపు ‘సహీహ్, హసన్, హదీసులనే కూర్పు చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని హదీసులు గురించి భిన్నాభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతాయి. 

ఇందులో మౌలికప్రాయమైన, సూత్రప్రాయమైన హదీసులు సమకూర్చారు. ఒకే అంశానికి పరిమితం కాకుండా విభిన్న అంశాలను ఎంచుకొని, వాటికి ఒక నిర్దేశాన్ని సూచిస్తూ గీటురాయిగాను, మార్గదర్శకముగాను, మరియు సౌకర్యవంతమైన ఆకర్షణీయమైన ప్రాయంలో సమాహారం చేసారు. 

దీని కారణంగానే అన్ని రకాల స్థాయిల వారికి సమానంగా ఉపయోగకర మైయ్యింది. ధార్మికవేత్తలు, జ్ఞానవంతులు, అభ్యాసకులు, బోధకులు, వక్తలు, మరియు ప్రసంగీకులు, అందరూ దీన్ని మనసార అంగీకరిస్తూ ప్రయోజనము పొందుతున్నారు. 

పుణ్యాత్ముల కర్మలకు అల్లాహ్ సమృద్ధిగా చేస్తూ ఎల్లప్పుడు వాటి సత్ఫలితాలను సజావుగా వుంచుతాడన్నది బహుశ ఇదేనేమో..! 

‘అల్ అర్బయీన్ అన్ నవవియ్యహ్’ ఇలాంటి అనేక విశిష్టతలు కలిగియుండుట మూలంగానే ఏడో శతాబ్దము నాటి కాలము నుండి నేటి తరం వరకు తన ఖ్యాతిని చెదరకుండా పదిలపర్చు కోగలిగింది. అల్లాహ్ దీన్ని ఎల్లప్పుడు ప్రజలందరికీ ప్రయోజన కరముగా వుంచుగాక, దీనిని కూర్పు చేసిన వారికి కూడ స్వర్గములో ఉత్తమ స్థానాన్ని ప్రసాదించుగాక! ఆమీన్.