పర స్త్రీని ఉద్ధేశపూర్వకంగా చూచుట [వీడియో & టెక్స్ట్]

పర స్త్రీని ఉద్ధేశపూర్వకంగా చూచుట
https://youtu.be/SBNQ2OCxekU [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

పర స్త్రీని ఉద్దేశపూర్వకంగా చూచుట, అలాగే ఎవరైనా స్త్రీ పర పురుషుడిని ఉద్దేశపూర్వకంగా చూచుట.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతున్ నూర్ ఆయత్ నంబర్ 30లో ఆదేశించాడు.

قُل لِّلْمُؤْمِنِينَ يَغُضُّوا مِنْ أَبْصَارِهِمْ وَيَحْفَظُوا فُرُوجَهُمْ ۚ ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ ۗ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا يَصْنَعُونَ
“ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను క్రిందికి దించుకోండి (అదుపులో ఉంచుకోండి), తమ మర్మాంగాలను కాపాడుకోండి అని మీరు ఆదేశించండి. వారికి చెప్పండి. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. వారు చేసే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.”

ఆ తర్వాత గమనించండి,

ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ
(జాలిక అజ్కాలహుమ్)
ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి.

ఈ ఆయత్, ఇది మనసులో నాటుకోండి. మనం ఏదైనా అవసరానికి బయటికి వెళ్ళాము, ఎవరైనా స్త్రీ ముఖముపై పరదా లేకుండా, లేదా టైట్ బురఖా వేసుకొని, లేదా ఏ అలంకరణను దాచి పెట్టడానికి బురఖా ఉందో, ఆ బురఖాయే మొత్తం అలంకరణతో, డిజైన్లతో, ఎంబ్రాయిడింగ్ తో, అక్కడ ఓ కలర్, ఇక్కడ ఓ కలర్, ఈ విధంగా, ఇలా ఒకవేళ ఎవరైనా స్త్రీలు ఎదురైతే, వారిని చూడకుండా మన యొక్క చూపును కాపాడుకోవడం.

సేమ్ ఇలాంటి ఆదేశమే స్త్రీలకు ఉంది, ఆ విషయం వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. కళ్ళు అదుపులో ఉంచుకుంటే మర్మాంగం కూడా రక్షణలో ఉంటుంది అన్నటువంటి విషయం ఇక్కడ అల్లాహ్ ఏదైతే చెబుతున్నాడో, దీని ద్వారా మీరు గమనించండి. మర్మాంగాల కలయిక ద్వారా ఏ వ్యభిచారం అయితే సంభవిస్తుందో, దానికి మొట్టమొదటి బీజం, పునాది ఎక్కడి నుండి అయితే ఈ చెడు ప్రారంభమవుతుందో, చూపు. దానినే ఎలా అదుపులో ఉంచుకోవాలని ఇస్లాం ఆదేశించింది.

అసలైన అశ్లీలత అక్కడి వరకు తీసుకువెళ్ళడానికి షైతాన్ యొక్క అడుగుజాడలు ఎన్ని ఉంటాయో గమనించండి. చూపే కదా ముందు? చూసిన తర్వాత, ఇక్కడ (మైండ్ లో ) కదులుతుంది. ఇది (హృదయం) శాంతంగా ఉండదు. ఆ తర్వాత కలుసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు, ఆ తర్వాత అడుగులు, ఆ తర్వాత మాటలు, ఆ తర్వాత వినికిడి, ఆ తర్వాత చేతులు, నాలుక, పెదవులు, ఎన్ని జరుగుతాయి, ఆ తర్వాత చివరి అశ్లీలం జరిగినప్పటికీ, అయ్యో ఛీ! ఆ ముందు చూపే చాలా పాడు, అది జరగకుండా ఉంటే ఎంత బాగుండు అని తల పట్టుకుంటే ఏమైనా లాభమా? గమనించండి.

అల్లాహ్ ఏమంటున్నాడు?

ذَٰلِكَ أَزْكَىٰ لَهُمْ
(జాలిక అజ్కాలహుమ్)
చూపును క్రిందకి ఉంచుకోవడం ద్వారా, అందులో వారి యొక్క పరిశుద్ధత ఉంది.

ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు?

إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا يَصْنَعُونَ
(ఇన్నల్లాహ ఖబీరుమ్ బిమా యస్నఊన్)
“వారు చేసే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.”

సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారని సహీ బుఖారీలో హదీస్ ఉంది. హదీస్ నెంబర్ 6243. ఏంటి?

فَزِنَا الْعَيْنِ النَّظَرُ
(ఫజినల్ ఐని అన్నజర్)
“(నిషిద్ధమైన వాటి వైపునకు) చూచుట, ఇది కళ్ళ వ్యభిచారం అవుతుంది.”

అల్లాహు అక్బర్. అసలు వ్యభిచారానికి కంటే ముందు, ఈ పనులు ఏవైతే ఉన్నాయో, వీటిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యభిచారం అన్నటువంటి పేరు ఇచ్చారంటే, వీటికి మనం దూరం ఉండడం ఎంత అవసరమో గమనించండి.

ధార్మిక అవసరంతో పర స్త్రీని చూచుట తప్పు కాదు. ధార్మిక అవసరం ఏంటి? పెళ్లి చూపులు అని ఏదైతే మనం అనుకుంటామో. పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మంగేతర్ (నిశ్చితార్ధమైన స్త్రీ) అంటే, ఏ అమ్మాయి నిశ్చితార్థమైనదో, సంబంధం ఇక అన్నీ ఓకే అయినాయి, కేవలం చివరి ఒక చూపు అన్నట్లుగా, అది దాని కొరకు అనుమతి ఉంది హదీసుల ద్వారా. లేక డాక్టర్ రోగిని చూచుట. కానీ ఏకాంతంలో కాకుండా, ఎవరైనా మహరమ్ ఆమెతో పాటు ఆ సందర్భంలో ఉండాలి.

ఈ రోజుల్లో, ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను, మీరు గమనించే ప్రయత్నం చేయండి. మహరమ్ వెంబడి ఉన్నాడు. పళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది ఒక స్త్రీకి. అలాంటప్పుడు, మొత్తం పరదా తీసేస్తారు ట్రీట్మెంట్ కొరకు. కదా? సర్వసాధారణంగా జరుగుతుంది కదా? కానీ ఇలాంటి చోట, కొంచెం ఆ డాక్టర్ చూడకుండా ఉండే సందర్భంలో, భర్త లేదా సోదరుడు వెంబడి ఉన్నాడు, ఆ సమయంలో, కళ్ళు కనబడడానికి ఏ స్కార్ఫ్ అయితే కట్టుకున్నారో, ఆ స్కార్ఫ్, ఆ ప్రదేశం ఏదైతే ఉందో, దాన్ని ఉల్టా గాని, కొంచెం కిందికి గాని కట్టుకొని, ఇక్కడి వరకు ఇలా ఓపెన్ ఉండి, మిగతా మొత్తం బంద్ ఉండేది ఉంటే, అలా కూడా ట్రీట్మెంట్ జరగవచ్చు కదా? సాధ్యం కాదా? అవుతుంది, ఎందుకు కాదు? తెలుసు మన తల్లులకు, మన సోదరీమణులకు, కడుపు చోట లేదా నాభి కింద ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ముందు నర్స్ పేషెంట్ ని తీసుకెళ్ళి, శరీరంపై ఉన్న వస్త్రాలు ఇక్కడి వరకు తీసేసి, ఒక గ్రీన్ లాంటిది కప్పుతారు, అక్కడ కొంచెం రంధ్రం ఉంటుంది, ఎక్కడైతే డాక్టర్ చూసే అవసరం ఉంటుందో. అవునా లేదా? అలాంటి విషయాలు వాటితో గుణపాఠం నేర్చుకొని, వేరే సందర్భంలో మనం అనవసరంగా మన ముఖం ఒక పర పురుషుడు చూడకుండా స్త్రీ స్వయంగా ఈ పద్ధతి పాటించే, ఇలాంటి ఘైరత్, హమియ్యత్ ఉంచుకునే ప్రయత్నం రేషం అనేది ఉండాలి, ఆమె దీని కొరకు ప్రయత్నం చేయాలి.

మరొక విషయం ఈ సందర్భంలో, పెళ్లి చూపుల గురించి ఏదైతే మాట వచ్చిందో, అల్లాహ్ హిదాయత్ ఇవ్వు గాక! కొందరు యువకులు, ఆ యువకుల యొక్క తల్లులు, కొడుకు సంబంధం విషయం అని ఎందరో అమ్మాయిలను చూచుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి అనుమతి లేదు. నీ బిడ్డ విషయంలో ఈ రోజు నీ కొడుకు గురించి 10 ఇండ్లల్లో తిరిగి 10 అమ్మాయిలను కేవలం ఒక స్త్రీ చూడటమే కాకుండా, ఆ అబ్బాయికి, అబ్బాయి యొక్క తండ్రికి, అబ్బాయి యొక్క పెద్ద అన్న ఉండేది ఉంటే వారికి కూడా చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఒక్కసారి ఇలాంటి స్త్రీలు, తల్లులు ఆలోచించాలి, ఆమె బిడ్డను చూడడానికి 10 మంది వచ్చి తిరస్కరిస్తే ఆ అమ్మాయి యొక్క మైండ్ సెట్ ఎలా అవుతుంది? ఆమె ఆలోచనా విధానం ఎలా అవుతుంది? ఎంత ఆమె మనస్తాపానికి గురి అవుతుంది? అసలు విషయం చూసుకోవడానికి ఏమిటి? తల్లుల ద్వారా, సోదరీమణుల ద్వారా, పిన్నమ్మల ద్వారా, మేనత్తల ద్వారా ఎవరైనా అమ్మాయి గురించి, ఆమె యొక్క డిటైల్స్ అన్నీ ఏవేవైతే ఒక సంబంధం మంచిగా ప్రేమగా కుదిరి ఉండడానికి అవసరం ఉన్నాయో, తెలుసుకున్న తర్వాత, కేవలం కాబోయే పెళ్లి కుమారుడు, కాబోయే ఈ యువకుడు, భర్తగా కాబోయే ఈ యువకుడు ఒకసారి చూసుకోవడం, దీని ద్వారా ప్రేమ పెరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శుభవార్త, ఒక శుభ సూచన ఇచ్చారు. కానీ అక్కడ ఆ సదుద్దేశాన్ని మరచి, ఈ రోజుల్లో, అమ్మా, ఏక్ బార్ ఖోల్ కే, మూతి ఇంత పెద్దగా ఇప్పి పళ్ళన్నీ చూపించమని అంటారు. ఆ సమయంలో, ఒక స్త్రీ ఈ మాట చెప్పినప్పుడు, స్వయంగా గమనించాలి. ఆ తల్లి ఎవరైతే ఇలాంటి విషయాలు అడుగుతారో, మీ బిడ్డ విషయంలో ఇలా అడిగినప్పుడు మీకు ఎంత బాధ కలుగవచ్చు? చెప్పాలంటే ఈ పెళ్లిళ్ల విషయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి దురాచారాలు, సమయం సరిపోదు. ముందుకు సాగుదాము.

అలాగే స్త్రీలు పురుషుని వైపు కూడా దురుద్దేశంతో చూడటం నిషిద్ధం. అల్లాహ్ ఇచ్చినటువంటి ఆదేశం సూరతున్ నూర్ ఆయత్ నంబర్ 31.

وَقُل لِّلْمُؤْمِنَاتِ يَغْضُضْنَ مِنْ أَبْصَارِهِنَّ وَيَحْفَظْنَ فُرُوجَهُنَّ
“ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను క్రిందికి దించుకోండి, అదుపులో ఉంచుకోండి, తమ మర్మాంగాలను రక్షించుకోండి.”

అదే విధంగా, గడ్డం, మీసాలు మొలవని అందమైన నవ యువకుని వైపు కామోద్దేశంతో చూచుట కూడా నిషిద్ధం. ఇంకా, ఒక పురుషుడు ఇంకొక పురుషుని మర్మాంగాన్ని, ఒక స్త్రీ ఇంకొక స్త్రీ మర్మాంగాన్ని చూచుట నిషిద్ధం. ఏ మర్మాంగాన్ని అయితే చూచుట నిషిద్ధమో, దాన్ని ముట్టుకొనుట కూడా నిషిద్ధం. అది ఏదైనా అడ్డు నుంచైనా సరే.

ఇక సోషల్ మీడియాలో, స్మార్ట్ ఫోన్ లు ఇంట్లో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కొందరు పత్రికల్లో, సంచికల్లో, మ్యాగజైన్ లలో, ఫిలింలలో, ఇంకా వారి యొక్క మొబైల్ లలో, ఏ ఫోటోలు అయితే చూస్తూ ఉంటారో, వాటిని ఏమనుకుంటారు? కేవలం ఇవి బొమ్మలు. వాస్తవికతలు కావు అన్న భ్రమలో షైతాన్ వారిని పడవేస్తున్నాడు. నగ్న, అర్ధనగ్న ఫోటోలను మ్యాగజైన్ లలో, టీవీ, థియేటర్లలో, మొబైల్ లలో, స్మార్ట్ ఫోన్ లలో చూడడం వలన భావోద్రేకాలలో ఎలాంటి ఉత్తేజం కలుగుతుందో, ప్రతి తెలివి గలవాడు గ్రహించగలడు. అందుకే, వాటికి దూరంగా ఉండాలి.

—

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=40651

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

మొహర్రం నెల మరియు ఆషూరా ఉపవాసం గొప్పతనం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బహ్]     

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ అరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట. మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి. మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యమూ బిద్అత్ క్రిందికే వస్తుంది. మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! అల్లాహ్ దైవభీతి కలిగి ఉండండి మరియు ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి – అల్లాహ్ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. ఉదాహరణకు ఆయన కొన్ని సమయాలను ఎంచుకున్నాడు. వాటికి ఇతర సమయాల పై ప్రాధాన్యతను ఆధిక్యతను ప్రసాదించాడు, ఈ సమయాలలో మొహర్రం నెల కూడా ఉంది. ఇది ఎంతో ఉన్నతమైన నెల మరియు ఇది హిజ్రీ సంవత్సరం యొక్క మొదటి నెల అలాగే గౌరవప్రదమైన నెలలలో ఇది కూడా ఒకటి అల్లాహ్ దీని గురించి ఇలా సెలవిస్తున్నాడు:  

(إِنَّ عِدَّةَ الشُّهُورِ عِنْدَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ذَلِكَ الدِّينُ الْقَيِّمُ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنْفُسَكُمْ) 

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవ ప్రదమైనవి.) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. 

(మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) అనగా ఈ గౌరవప్రదమైన నెలలలో అని అర్థం. ఎందుకంటే వీటిలో చెడు మరియు అవిధేయతల పాపం పెరుగుతుంది.  

(మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) ఈ వాక్యం యొక్క వివరణలో ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలియజేశారు:

అల్లాహ్ దౌర్జన్యాన్ని, అన్యాయాన్ని సంవత్సరపు పన్నెండు మాసాల్లోనూ నిషేధించాడు మరియు ముఖ్యంగా అందులో నాలుగు మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశాడు. ఎందుకంటే ఇందులో చేసేటువంటి పాపకార్యాలు మరియు అవిధేయత యొక్క పాపం పెరుగుతుంది. అదేవిధంగా సత్కార్యాలు, సదాచరణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది. 

అదేవిధంగా (మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) ఈ వాక్యం యొక్క వివరణలో ఖతాదా (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:

ఈ పవిత్రమైన మాసాలలో చేసేటువంటి దౌర్జన్యపు పాపం యొక్క తీవ్రత ఇతర నెలల్లో చేసేటువంటి పాపం యొక్క తీవ్రత కంటే అతి ఎక్కువగా ఉంటుంది.

ఇంకా ఇలా అన్నారు:

అల్లాహ్ తన సృష్టిలో నుండి కొందరిని ఎన్నుకున్నాడు. దైవదూతలలో కొందరిని దైవ సందేశారులుగా మరియు మానవులలో నుండి కొందరిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. అదేవిధంగా ఈ భూమండలంపై ఉన్న మస్జిద్ లలో నుండి కొన్నింటిని ఎన్నుకున్నాడు, మాసాలలోనుండి రమజాన్ మాసంతో పాటు నాలుగు గౌరవప్రదమైన నెలలను కూడా ఎన్నుకున్నాడు, రోజులలో నుండి శుక్రవారంను, రాత్రులలో లైలతుల్ ఖద్ర్ రాత్రిని ఎన్నుకున్నాడు. కాబట్టి అల్లాహ్ వేటినైతే గొప్పదిగా భావించాడో మనం కూడా తప్పక వాటిని గొప్పదిగా భావించాలి.  

అబూబకర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు:

“సంవత్సరం 12 నెలలు కలిగి ఉంది. వీటిలో నాలుగు నిషిద్ధ మాసాలు ఉన్నాయి వాటిలో నుండి మూడు ఒకదాని తరువాత మరొకటి వస్తాయి. అవి జిల్ ఖా, జిల్ హిజ్జా మరియు మొహర్రం కాగా నాలుగవది జమాదిస్సానీ మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే రజబ్ నెల” (బుఖారి, ముస్లిం) 

ముహర్రం మాసానికి ఈ పేరు ఎందుకంటే ఇది పవిత్రమైన మాసం, దాని పవిత్రత మరియు గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. 

రజబ్ ముజిర్ నెల అని పిలవడానికి గల కారణం ఏమిటంటే; ముజిర్ సంతతి వారు ఈ నెలను తన స్థానం నుంచి తరలించేవారు కాదు. కానీ కొందరు అరబ్బు తెగలవారు ఈ నిషిద్ధ మాసాలను వాటి సమయాల్లో కాకుండా వారికి అనుకూలంగా మార్చుకునే వారు “ఈ ప్రక్రియను అల్ నసీ అని పిలుస్తారు.” 

అల్లాహ్ తఆలా ఈ మాసాలకు ఎంతో ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని ప్రసాదించాడు.  కనుక మనం వీటిని గుర్తించి ఈ మాసాలలో వారించబడిన విషయాలకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఈ మాసాలలో యుద్ధాలు చేయడం నిషేధించబడింది మరియు పాపకార్యాలకు దూరంగా ఉండమని వారించబడింది.  

ఓ ముస్లిం లారా! మొహర్రం నెలలో అత్యధికంగా నఫీల్ ఉపవాసాలు పాటించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “రంజాన్ ఉపవాసాల తర్వాత అన్నింటికన్నా శ్రేష్టమైన ఉపవాసాలు అల్లాహ్ మాసము అయిన మొహర్రం నెల ఉపవాసాలు”. (ముస్లిం) 

ఓ విశ్వాసులారా! ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క రుబూబియత్ యొక్క రుజువు ఏమిటంటే ఆయన కొన్ని దినాలను ఎన్నుకున్నాడు, ఇందులో చేయబడేటువంటి ఆరాధనలకు ఇతర దినాలలో చేసే ఆరాధనలపై ప్రాధాన్యతను ప్రసాదించాడు అందులో నుండి ఆషూరా దినము (మొహర్రం నెల 10వ తారీకు) కూడా ఉంది. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం హిజ్రీ సంవత్సరం యొక్క 10వ రోజు, ఈరోజుకు గల గొప్పదనానికి ఒక ఆసక్తి కరమైన నేపథ్యం కూడా ఉంది, అదేమిటంటే  అల్లాహ్ తన ప్రవక్త అయినటువంటి మూసా అలైహిస్సలాం మరియు ఆయన సమాజానికి ముక్తి కలిగించి ఫిర్ఔన్ మరియు అతని జాతిని సముద్రంలో ముంచి వేశాడు.  ఈ కారణంగా మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ కు కృతజ్ఞతతో మొహర్రం నెల పదవ తారీకున ఉపవాసాన్ని పాటించేవారు ఆ తరువాత గ్రంథవహులు అనగా (యూదులు మరియు నస్రానీలు) కూడా ఈ ఉపవాసం పాటించేవారు. అలాగే అజ్ఞాన కాలపు అరబ్ జాతుల వారు కూడా ఉపవాసం పాటించేవారు వీరు గ్రంథవహులు కాదు విగ్రహారాధకులు. కాబట్టి ఖురేష్ జాతి వారు కూడా ఈ ఉపవాసాన్ని పాటించేవారు.

ఎప్పుడైతే మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు హిజ్రత్ చేసి మదీనా వచ్చారో అక్కడి యూదులను ఉపవాసం పాటించడం చూసి మీరెందుకు ఈ దినం నాడు ఉపవాసం పాటిస్తారు? అని ప్రశ్నించారు. వారు ఆయనతో ఈరోజు ఎంతో విశిష్టమైనది ఈ రోజే అల్లాహ్ మూసా ప్రవక్తకు మరియు ఆయన సహచరులకు ఫిరోన్ నుండి ముక్తిని ప్రసాదించాడు. అందుకే’ మూసా అలైహిస్సలాం అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు ఉపవాసం ఉండేవారు. అందుకే మేము కూడా ఈరోజు ఉపవాసం పాటిస్తున్నాము అని అన్నారు. ఇది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: మూసా అలైహిస్సలాం కు మీకన్నా మేము దగ్గర వాళ్ళము.” ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు స్వయంగా తాను కూడా ఈరోజు ఉపవాసం ఉండేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు.(బుఖారి, ముస్లిం) 

అంతేకాదు యూదులు ఆ రోజున తమ స్త్రీలకు ఆభరణాలు మరియు అందమైన దుస్తులు ధరింపజేసి వారిని అలంకరించేవారు. (ముస్లిం) 

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:
“యూదులు మరియు నస్రానీలు ఆషూరా దినాన్ని గౌరవించేవారు“.(ముస్లిం) 

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేశారు:

అజ్ఞాన కాలంలో ఖురైషులు ఆషూరా దినం నాడు ఉపవాసం వుండేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఆ రోజు ఉపవాసం వుండేవారు. ఆ తరువాత ఆయన మదీనా కు విచ్చేసిన తర్వాత కూడా ఆ రోజు ఉపవాసం పాటించేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు. ఆ తర్వాత రమజాన్ మాసపు ఉపవాసాలు ఫర్జ్ అయ్యాయి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (ఆషూరా దినపు ఉపవాసం) నిర్ణయాన్ని ప్రజలపై వదిలేస్తూ ఇలా సెలవిచ్చారు: “మీలో ఇష్టమైవారు ఆ రోజు ఉపవాసం వుండవచ్చు ఇష్టంలేని వారు త్యజించ వచ్చు.” (బుఖారి, ముస్లిం) 

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేశారు: ఇదే రోజున ఖురైషులు కాబా గృహం మీద (ఘిలాఫ్) నల్లటి వస్త్రాన్ని ధరింప చేసేవారు. (బుఖారి) 

ఎప్పుడైతే అల్లాహ్ తఆలా రంజాన్ ఉపవాసాలను విధిగావించాడో అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: మీలో ఇష్టమైనవారు ఆ రోజు ఉపవాసం ఉండవచ్చు ఇష్టం లేనివారు త్యగించవచ్చు. అనగా ఈ ఆషూరా ఉపవాసం రంజాన్ ఉపవాసాల మాదిరిగా విధి కాదు. కేవలం ఇది అభిలాష నియమైనది.కాబట్టి ఉపవాసం పాటించిన వారు తప్పకుండా గొప్ప పుణ్యఫలాన్ని పొందుతారు.  

ఒక వ్యక్తి ప్రవక్త వారిని ఈ విధంగా ప్రశ్నించాడు. మీరు ఏ విధంగా ఉపవాసాలు పాటిస్తారు? అప్పుడు ప్రవక్త వారు ఇలా అన్నారు “ప్రతి నెలలో మూడు రోజులు మరియు రంజాన్ నెల ఉపవాసాలు ఇవి ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటంతో సమానం, అరఫా ఉపవాసం గురించి నాకు అల్లాహ్ పై నమ్మకం ఉంది. దీని ద్వారా గతించిన ఒక సంవత్సరం మరియు రాబోయే ఒక సంవత్సరం యొక్క పాప క్షమాపణ కలుగుతుంది. మరియు ఈ విషయంలో కూడా అల్లాహ్ పై నాకు నమ్మకం ఉంది. ఆషూరా ఉపవాసం వలన గతించిన ఒక సంవత్సరం యొక్క పాప క్షమాపణ కలుగుతుంది. (ముస్లిం) 

అయితే గతించిన ఒక సంవత్సరంలో మనిషి ద్వారా జరిగినటువంటి చిన్న చిన్న పాపాలను ఆ రోజు ఉపవాసం పాటించడం ద్వారా అల్లాహ్ క్షమిస్తాడు. ఇది అల్లాహ్  యొక్క అపారమైన కారుణ్యము, ఆయన ఒకరోజు ఉపవాసం ద్వారా ఒక సంవత్సరం యొక్క పాపాలను క్షమిస్తున్నాడు. ఇక పెద్ద పాపాల విషయానికొస్తే ఇది కేవలం స్వచ్ఛమైన పశ్చాత్తాపం ద్వారా మాత్రమే క్షమించబడతాయి, అల్లాహ్ ఎంతో గొప్పవాడు మరియు కరుణామయుడు. 

ఓ ముస్లిం లారా! ఆషూరా ఉపవాసం యొక్క ఔన్నత్యం ఏమిటంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ ఉపవాసం గురించి చాలా జాగ్రత్త వహించేవారు.  అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా తెలియజేశారు: నేను మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని, ఆషూరా ఉపవాసము మరియు రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు పాటించినంతగా ఇతర ఉపవాసాలు పాటించడాన్ని నేను చూడలేదు. (బుఖారి) 

సలఫె స్వాలిహీన్ యొక్క ఒక సమూహం దీని ఘనతను కోల్పోకుండా ఉండటానికి  ప్రయాణంలో కూడా అషురాలో ఉపవాసం ఉండేవారు.ఇబ్న్ రజబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇబ్నే అబ్బాస్, అబూ ఇస్ హాఖ్, జోహ్రీ, లాంటి సలఫ్ యొక్క ఒక జమాత్ ప్రయాణంలో కూడా ఆషూరా ఉపవాసాన్ని పాటించేవారు. 

జోహ్రీ ఇలా అనే వారు: రంజాన్ లో విడిచిపెట్టబడిన ఉపవాసాలు ఇతర దినాలలో (ఖజా) ద్వారా తిరిగి పాటించవచ్చు కానీ ఆషూరా పుణ్యఫలాన్ని విడిచిపెడితే మాత్రం దానిని (ఖజా) చేయడం కుదరదు. (బైహఖీ) 

ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) గారు ప్రయాణంలో కూడా ఆషూరా ఉపవాసం పాటించవచ్చు అనే విషయాన్ని స్పష్టపరిచారు. 

సహాబాలు తమ పిల్లలకు ఉపవాసాన్ని అలవాటు చేయడానికి గాను ఈ ఆషూరా ఉపవాసాన్ని పెట్టించేవారు. రబీ బిన్తె ముఅవ్విజ్ (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చుట్టుప్రక్కల నివసించే బస్తీలలో “ఆషూరా దినం నాడు ఉపవాసం వుండండి” అన్న సందేశాన్ని పంపించారు. ఈ మేరకు, స్వయంగా మేము కూడా ఆ రోజు ఉపవాసం వుండేవాళ్ళం మరియు మా చిన్న పిల్లల చేత కూడా ఉపవాసం పాటింపజేసేవాళ్ళం. ఒకవేళ పిల్లలు భోజనం కోసం అల్లరి చేస్తే మేము వారికి ఇఫ్తార్ సమయం వరకు కాలం వెళ్ళబుచ్చటానికి ఆటబొమ్మలను ఇచ్చి శాంతింపజేసేవాళ్ళం.(బుఖారి ముస్లిం)  

అల్లాహ్ దాసులారా! ఆషూరా ఉపవాసం యొక్క సున్నత్ విధానం ఏమిటంటే దానితోపాటు నెల 9వ తేదీన ఉపవాసం కూడా ఉండాలి. దీని ఆధారం హదీసులో ఇలా ఉంది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: ఒకవేళ నేను వచ్చే సంవత్సరం కూడా జీవించి ఉంటే’ నేను 10 వ తేదీతో పాటు 9వ తేదిన కూడా ఉపవాసం ఉంటాను, కానీ తదుపరి సంవత్సరం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు లేరు.(ముస్లిం) 

ఓ ప్రజలారా! 10వ తేదీతో పాటు 9వ తేదీ ఉపవాసం ఉండడానికి గల కారణం ఏమిటంటే ముస్లింలు యూదులకు వ్యతిరేకంగా వ్యవహరించమని ఆదేశించబడింది. యూదులు పదవ తేదీన ఉపవాసం పాటిస్తారు కావున ప్రవక్త వారు దీనిని ఇష్టపడలేదు కాబట్టి ఈ సారూప్యతను తొలగించడానికి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారు 10వ తేదీతో పాటు తొమ్మిదవ తేదీన ఉపవాసం ఉండమని మార్గ నిర్దేశం చేశారు. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకతలలో ఒకటి 

ఒకవేళ ఎవరైనా కేవలం పదవ తేదీన ఉపవాసం పాటించాలా? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, “అవును”  కానీ ఉత్తమం ఏమిటంటే 10వ తేదీతో పాటు దాని కంటే ఒకరోజు ముందు కూడా ఉపవాసం ఉండాలి. ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా వెలువడినటువంటి సాంప్రదాయము. 

అల్లాహ్ ఖుర్ఆన్  యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.    

స్తోత్రం మరియు దరూద్ తరువాత 

ఓ ముస్లిం లారా! అల్లాహ్ ఆలా తన గొప్ప వివేకంతో ఈ రాత్రి పగటిని తయారు చేశాడు. అదేమిటంటే సదాచరణ చేసేవారు ఎవరు? అని పరీక్షించడానికి. 

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: 

(وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِمَنْ أَرَادَ أَنْ يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورا) 

(ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది.) 

మరొకచోట ఇలా అంటున్నాడు:  

(الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا) 

(మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు.) 

అబూ బరజ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “తీర్పుదినం రోజున ఐదు విషయాల గురించి విచారించనంత వరకు మానవుని పాదాలు కదల లేవు. అతని వయస్సు ఎక్కడ ఖర్చు చేశాడు, జ్ఞానం గురించి విద్య నేర్చుకుని ఆచరించాడా లేదా, అతని ధనం గురించి దానిని ఎక్కడి నుంచి సంపాదించాడు మరియు ఎక్కడ ఖర్చు చేశాడు, మరియు అతని యవ్వనం గురించి దాన్ని ఎక్కడ ఖర్చు చేశాడు”. (తిర్మీజి) 

ఓ విశ్వాసులారా! ఈ రోజుల్లో మనం గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము కాబట్టి ఎవరైనా గత సంవత్సరం (తమ లెక్కల పత్రంలో) మనం ఏ సత్కార్యాన్ని నమోదు చేసామో ఎవరైనా నాకు చెప్పగలరా? మరియు కొత్త సంవత్సరంలో మేము ఏ చర్యలను స్వాగతించబోతున్నాం? సంవత్సరాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి, ఈ సంవత్సరం చూడండి, ఇలా గడిచిపోయింది. ఒక రోజు ఒక గంట గడిచిపోయినట్లుగా గడిచింది, కాబట్టి మన గురించి మనం పరిగణనలోకి తీసుకోవాలి, ఈ సంవత్సరంలో స్వర్గం పొందడం కొరకు మరియు నరకం నుండి ముక్తి పొందడానికి ఎం చేసుకున్నాము? అల్లాహ్ కు విధేయత చూపడంలో మనం ఎంత చురుకుదనం చూపించాం? గడిచిన పూర్తి సంవత్సరంలో ఎన్ని నఫీల్ నమాజులు చదివాము? ఎన్ని నఫీల్ ఉపవాసాలు పాటించాము? ఎన్ని దానధర్మాలు చేశాము? ఎంత సమయాన్ని అల్లాహ్ మార్గంలో గడిపాము? ఎన్నిసార్లు మొదటి సమయంలో మస్జిద్ కి వెళ్ళాము? ఎన్నిసార్లు మనల్ని మనం పాపాల నుండి కాపాడు కొన్నాము? అల్లాహ్ నిషేధించబడిన విషయాలను చూడటం నుండి మన కంటిని ఎంతవరకు రక్షించుకున్నాం? మన నాలుకను ఎంతవరకు అదుపులో ఉంచుకున్నాము?  మనం మన హృదయాలను కుళ్ళు కుతంత్రాల నుండి ఈర్షద్వేషాల నుండి పరిశుభ్రపరచుకున్నామా? మనం మన బంధుమిత్రులతో, ఇరుగుపొరుగుతో మన బంధుత్వాన్ని మెరుగుపరుచుకున్నామా? ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఎన్నిసార్లు పరదా గురించి బోధించాము? ఒకసారి ఆలోచించండి!  

మొదటిది: తనకు జీవితంలో మరో అవకాశం ఇచ్చినందుకు అల్లాహ్ కు ధన్యవాదాలు. 

రెండవది: మునుపటి నెల మరియు సంవత్సరం వెలుగులో స్వీయ పరిశీలన. 

మూడవది: మిగిలిన రోజులలో మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి. 

ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా అన్నారు:

మీ లెక్క తీసుకోబడక ముందే మీ లెక్క చూసుకోండి, మీకు మీరే మీ కర్మలను తూకం వేసుకోండి, దీని ద్వారా మీ లెక్క సులభతరం అవుతుంది, మరియు తీసుకోబోయేటువంటి ఆ పెద్ద లెక్క కొరకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఓ ముస్లింలారా! మృత్యువు జీవితాన్ని ఢీ కొట్టకముందే మీ పగలు మరియు రాత్రిని మంచి పనులతో నింపుకోండి. 

మరియు ఇది కూడా తెలుసుకోండి అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు. 

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما) 

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) 

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి ఆయన ఖలీఫాలు,తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.  

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.  

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి.ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.  

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.   

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గం లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.  మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము. మరియు  నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.  

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ న్యాయం గురించి, బందువుల హక్కులు నెరవేర్చడం గురించి అజ్ఞాపిస్తున్నాడు. అశ్లీలం దౌర్జన్యం నుండి ఆపుతున్నాడు. ఆయన మనకు హితోపదేసిస్తున్నాడు, కనుక మనం ఎల్ల వేళలా ఆయనను స్మరిస్తూ ఉండాలి, ఆయన ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపాలి. అల్లాహ్ స్మరణ అన్నిటి కంటే గొప్పది. అల్లాహ్ మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు. 

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين 

—

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

జిహాద్ అంటే ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

జిహాద్ అంటే ఏమిటి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/cdbNg2hlL_U [10 నిముషాలు]

ఈ ప్రసంగంలో, జిహాద్ అనే పదం యొక్క నిజమైన మరియు విస్తృతమైన అర్థం వివరించబడింది. సాధారణంగా యుద్ధం లేదా పవిత్ర యుద్ధంగా తప్పుగా అర్థం చేసుకోబడినప్పటికీ, జిహాద్ యొక్క ప్రాథమిక అర్థం “కృషి చేయడం” లేదా “కష్టపడటం”. ఈ ప్రసంగం జిహాద్ యొక్క వివిధ రూపాలను వివరిస్తుంది, అవి చెడు కోరికలకు వ్యతిరేకంగా పోరాడటం, తల్లిదండ్రులకు సేవ చేయడం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం, మరియు ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం వంటివి. సైనిక చర్యగా జిహాద్ కు ఇస్లాంలో కఠినమైన షరతులు మరియు నియమాలు ఉన్నాయని, అవి ఒక ఇస్లామిక్ ప్రభుత్వం ద్వారా మాత్రమే ప్రకటించబడాలని, తల్లిదండ్రుల అనుమతి అవసరమని, మరియు యుద్ధంలో అమాయకులను, మహిళలను, పిల్లలను మరియు వృద్ధులను హింసించకూడదని స్పష్టం చేయబడింది. జిహాద్ అనే పదాన్ని నేటి హింస మరియు విధ్వంసంతో ముడిపెట్టడం పూర్తిగా తప్పు అని వక్త గట్టిగా నొక్కి చెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]

وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ
[వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్]

وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْبِيَا ءِ وَالْمُرْسَلِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్]

وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ
[వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్]

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ రోజు మనం జిహాద్ అంటే ఏమిటి తెలుసుకోబోతున్నాం.

జిహాద్ అంటే ఏమిటి? జిహాద్ అనే పదం ప్రతీ వ్యక్తి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా విన్న పదం ఇది. ఇస్లాంకు సంబంధించిన పదం ఇది. మరియు ఖురాన్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో ఈ పదం బోధించబడి ఉన్నది. కానీ వాస్తవానికి దీని అర్థం, జిహాద్ అంటే ఏమిటి, జిహాద్ అనే పదానికి అర్థం ఏమిటి, భావం ఏమిటి అనేది అతి తక్కువ మందికే తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత అసత్యానికి, అత్యంత దారుణంగా వక్రీకరించిన పదం జిహాద్. అసలు జిహాద్ అంటే ఏమిటో మనము వివరంగా కాకపోయినా క్లుప్తంగా తెలుసుకుందాం.

జిహాద్ అనేది ఒక అరబిక్ పదం. దీని అర్థం కఠోర శ్రమ, శాయశక్తుల ప్రయత్నించటం లేక అసాధారణ కృషి చేయటం. ఈ విధంగా పలు అర్థాలు జిహాద్ అనే పదానికి వస్తాయి.

జిహాద్ గురించి ఖురాన్ మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో అనేక రకాలుగా వివరించబడింది.

మనిషి తన చెడు కోరికలకు దూరం అవటానికి చేసే శాయశక్తుల ప్రయత్నం జిహాద్. మనిషి మంచి మార్గంలో ప్రయాణించేటప్పుడు చేసిన కృషి మరియు పడిన కష్టం జిహాద్.

మానవాళిని అజ్ఞానం నుంచి వెలుగు వైపునకు తీసుకురావటానికి చేసే ప్రయత్నం జిహాద్.

అల్లాహ్ మార్గంలో మంచి పనులకు ఖర్చు చేయటం జిహాద్.

అల్లాహ్ కృప కొరకు హజ్ చేసే వారు ప్రయాణంలో కలిగే అన్ని రకాల ఇబ్బందులను సహించటం జిహాద్.

తల్లిదండ్రుల సేవ చేస్తూ కష్టపడటం కూడా జిహాద్.

ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేయడం కూడా జిహాద్.

వీటన్నింటి గురించి ఖురాన్ మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో జిహాద్ అనే పదం వచ్చింది.

ఇక సామాన్యంగా అందరూ జిహాద్ అంటే ఇస్లాం కోసం యుద్ధం చేయటం, ధర్మం కోసం పోరాటం చేయటం అంటారు. ఇది వాస్తవమే, కానీ జిహాద్ అనే విశాలమైన అర్థంలో లేక ఆ అంశంలో ఇది ఒక భాగమే. అలా కాకుండా ఈ ఒక్క అర్థమే పూర్తి జిహాద్ అంశం అనుకోవటం పొరపాటు.

ఇస్లాం కోసం యుద్ధం చేయటం అంటే ఇస్లాం వ్యాప్తి చెందటానికి కాదు. ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై ఏమని రాశారంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం వారితోనే చేసేవారు ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటారో. ధన, ప్రాణ, మాన రక్షణ కోసం ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటారో వారికి ఎదురుదాడిగా ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం జిహాద్ ఉంది.

జిహాద్ ఎటువంటి పరిస్థితులలో, వాటి షరతులు ఏమిటి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. జిహాద్ చేయాలంటే, అంటే ధర్మం కోసం పోరాటం చేయటం, ఈ జిహాద్ చేయాలంటే దానికి అనేక షరతులు ఉన్నాయి. చాలా కండిషన్లు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. ముఖ్యమైన మూడు షరతులు నేను చెప్పదలిచాను.

ఒకటి ఏమిటి? జిహాద్ అనేది ఒక పూర్తి ఇస్లాం అనుసరించే రాజ్యం లేక ప్రభుత్వం చేసేది. అంతే కానీ ఒక వ్యక్తి లేక ఒక గ్రూప్ చేసే కార్యం ఎంత మాత్రం కాదు.

రెండవ షరతు, తల్లిదండ్రుల అనుమతి కలిగి ఉండాలి. దీనికి ఆధారం ఏమిటంటే, ఒకసారి ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నాకు దైవ మార్గంలో జిహాద్ చేయడానికి అనుమతించండి” అని అనుమతి కోరాడు స్వయంగా వచ్చి. “ఓ దైవ ప్రవక్త, నేను దైవ మార్గంలో పోరాడాలి, ఈ అనుమతి నాకు ప్రసాదించండి” అని కోరితే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, “నీకు తల్లిదండ్రులు ఉన్నారా?” ఆయన “ఉన్నారు ఓ దైవ ప్రవక్త” అంటే, “అలాగైతే వారి సేవ చెయ్యి, అదే నీకు జిహాద్” అన్నారు. సుబ్ హా నల్లాహ్! అంటే తల్లిదండ్రుల సేవ కూడా జిహాద్.

అలాగే మూడవ షరతు ఏమిటంటే, యుద్ధంలో ఉన్న వారితోనే యుద్ధం, వేరే వారికి ఎటువంటి హాని చేయకూడదు. అంతే కాదు, ముసలివాళ్ళకి, వృద్ధులకి, చిన్న పిల్లలని, స్త్రీలను, మహిళలను హాని చేయకూడదు. చెట్లను నరకకూడదు, పంటలను నాశనం చేయకూడదు. ఈ విధంగా అనేక షరతులు ఉన్నాయి.

ఈ మూడింటిలో ఏది ఆచరించకపోయినా అది జిహాద్ కాదు. చివరగా, ప్రపంచంలో జరుగుతున్న మారణకాండకు, వినాశానికి జిహాద్ అనే పదంతో ముడివేయటం ఎంత మాత్రం సబబు కాదు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, జిహాద్ అనే పదానికి పలు అర్థాలు వస్తాయి. కాకపోతే ఇస్లాం మరియు ముస్లిం శత్రువులు కొందరు తెలిసి, కొందరు తెలియక ఈ పదాన్ని అత్యంత అసత్యానికి, అత్యంత దారుణంగా వక్రీకరించారు. దీనికి చాలా అర్థాలు వచ్చాయి. ఈ విషయాల గురించి ఖురాన్‌లో అనేక చోట్ల వాక్యాలు ఉన్నాయి.

జిహాద్ అనే పదం ఖురాన్‌లో, ప్రవక్త గారి యొక్క ప్రవచనాలలో అనేక చోట్ల ప్రస్తావించబడింది. కానీ సమయ సందర్భాన్ని బట్టి దానికి అర్థం ఉంది. అమ్మానాన్న సేవ చేయటం కూడా జిహాద్. మంచి పని చేయడం కూడా జిహాద్. ఉదాహరణకి, విపరీతమైన చలి, చలికాలం. ఆ చలికాలంలో ఉదయం 3:30 కి, 4:00 కి లేచి, వుజూ చేసి మస్జిద్ కి పోవాలి, అది కూడా జిహాదే.

ఒక వ్యక్తి దారిలో పోతున్నాడు, యాక్సిడెంట్ జరిగింది, రక్తం కారిపోతా ఉంది, ఎవరూ సహాయం చేయటం లేదు. అటువంటి వ్యక్తి దగ్గరికి పోయి, కాపాడి, సహాయం చేసి, ఆసుపత్రికి తీసుకువెళ్లడం ఇది కూడా జిహాద్.

చెడుని ఆపటం కూడా జిహాద్. ఒక అబ్బాయి చెడు పని చేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. అతనికి చెబుతున్నాం, “బాబూ ఇది హరాము, ఇది తప్పు, ఇది నీ శరీరానికి నాశనం చేస్తుంది, ఇది ఆరోగ్యపరంగా కూడా ఇది మంచిది కాదు, తాగవద్దు” అని ఆపుతాము కదా, అది కూడా జిహాద్.

చెడు నుండి, రుగ్మతల నుండి, అన్యాయం నుండి, దౌర్జన్యం నుండి, అసత్యం నుండి, చెడు విషయాల నుండి ఆపే ప్రయత్నం చేయటం కూడా జిహాదే.

మంచి పనులు చేసే విషయంలో కష్టాలు వస్తే, ఆ కష్టాలను ఎదుర్కొని సహనంతో ఆ కార్యం నెరవేర్చుకుంటే అది కూడా జిహాదే. హజ్, ఉమ్రా కోసం పోతున్నాము, సులభం కాదు, చాలా కష్టం. ప్రయాణం కష్టం, ఎయిర్పోర్ట్ లో కష్టం, అక్కడ పోయిన తర్వాత చాలా విషయాలు ఉంటాయి. చలికాలంలో వస్తుంది, ఎండాకాలంలో వస్తుంది. అప్పుడు కష్టాన్ని సహిస్తాము, భరిస్తాము, అది కూడా జిహాదే.

ఈ విధంగా ఖురాన్‌లో అలాగే హదీసులలో జిహాద్ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. కేవలం దానికి ఒకే ఒక్క అర్థం తీసుకొని, సమయ సందర్భాలు లేకుండా వక్రీకరించటం అది సబబు కాదు. కావున అది మనం తెలుసుకోవాలంటే మనం ఖురాన్‌ని చదవాలి, పఠించాలి, తెలుసుకోవాలి. అప్పుడు మనకు వాస్తవం తెలుస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ సరైన అవగాహనని ప్రసాదించు గాక. ఆమీన్. మరిన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَاٰخِرُ دَعْوٰىنَا اَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

—

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=25123

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]

తావీజులు, తాయత్తులు… !? – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

తావీజులు, తాయత్తులు… !?
https://youtu.be/W9VBuoPiFfk [15 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్)
నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.

ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.

మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.

ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.

కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ
(ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్)
“నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)

అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.

అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.

మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.

అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.

కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.

ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ تَعَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ
(మన్ త’అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక్)
“ఎవరైతే తాయత్తు వేలాడదీసుకున్నాడో, అతను షిర్క్ చేశాడు.” (ముస్నద్ అహ్మద్)

ఇంకో హదీసులో ఉంది:

مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ
(మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి)
“ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)

ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.

కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.

మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,

وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
(వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా)
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.

అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

—

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24530

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]

ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు – ధర్మపరమైన నిషేధాలు [వీడియో] [6 నిముషాలు]

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు [వీడియో | టెక్స్ట్]

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు
https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).

ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.

ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.

ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.

ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ
(ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి)
కనుక మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)

అనగా, మీరు అల్లాహ్‌ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.

طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي
(తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.)
ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,

والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار
(వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్).
దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.

ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు

الحمد لله ثم الحمد لله
(అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్),
బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

لَا تَجْعَلُوا دُعَاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعَاءِ بَعْضِكُمْ بَعْضًا
(లా తజ్అలూ దుఆ అర్రసూలి బైనకుమ్ క దుఆఇ బఅదికుమ్ బఅదా)
ఓ విశ్వాసులారా! మీలో మీరు ఒకరినొకరు పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవకండి. (24:63)

దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.

అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్)
ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)

దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్‌కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.

కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.

ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
(ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్)
కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)

దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.

అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.

చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:

لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله
(లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.)
చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.

చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.

అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.

ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

ثلاث من كن فيه وجد حلاوة الإيمان
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.)
మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు.
ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:

أن يكون الله ورسوله أحب إليه مما سواهما
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.)
అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి.
అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.

దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:

لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين
(లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.)
మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,

يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي
(యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ)
అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك
(లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.)
లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

الآن يا عمر
(అల్ ఆన యా ఉమర్.)
ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.

చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.

జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.

ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.

ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.

కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.

చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.

وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا
(వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా)
ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69)
ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.

దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.

ఎవరైతే అల్లాహ్‌ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?

سبحان الله ثم سبحان الله
(సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).

అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి

متى الساعة؟
(మతస్సాఅ)
ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి

ماذا أعددت لها؟
(మాజా ఆదత్త లహా)
అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు.
అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.


ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,

أنت مع من أحببت
(అంత మఅ మన్ అహబబ్త.)
నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.

లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.

కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا
(లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా)
వాస్తవానికి అల్లాహ్‌ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్‌ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)

అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్‌గా ఉంటాడు లేదా ఒక డాక్టర్‌గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.

ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను.
ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.

ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,

وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
(వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్)
అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)

అల్లాహ్‌కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.

ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,

لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم
(లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.)
అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.

అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.

చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.

అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము

إِنْ شَاءَ ٱللَّٰهُ
(ఇన్ షా అల్లాహ్)
వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.

وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్).

وَعَلَيْكُمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ అలైకుమ్ అస్సలామ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).

—

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ఫిఖ్‘హ్ దుఆ -1: దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఫిఖ్‘హ్ దుఆ – ఈ మొదటి క్లాస్ లో దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. వచ్చే క్లాసులలో ప్రతి పాయింట్ గురుంచి వివరంగా చెప్పబడుతుంది ఇన్ షా అల్లాహ్.

విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.

ఫిఖ్‘హ్ దుఆ -1
దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు
https://youtu.be/dmsLFYvatN4 [36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, దాని షరతులు, మర్యాదలు, అంగీకార సమయాలు మరియు అంగీకారానికి అడ్డంకులుగా ఉండే విషయాల గురించి వివరించబడింది. దుఆ అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహమని, అల్లాహ్ యే దుఆ చేయమని ఆదేశించి, దాని విధానాన్ని నేర్పించి, దానిని అంగీకరిస్తానని వాగ్దానం చేశాడని వక్త నొక్కిచెప్పారు. దుఆ అంగీకరించబడటానికి ఐదు ముఖ్య షరతులు ఉన్నాయి: ఇఖ్లాస్ (చిత్తశుద్ధి), ముతాబఆ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం), ప్రగాఢ నమ్మకం, ఏకాగ్రత మరియు దృఢ నిశ్చయం. దుఆ చేసేటప్పుడు వుదూతో ఉండటం, ఖిబ్లా వైపు తిరగడం, చేతులు ఎత్తడం, అల్లాహ్ ను స్తుతించడం, దరూద్ పంపడం మరియు పశ్చాత్తాపం చెందడం వంటి మర్యాదలను పాటించాలని సూచించారు. అర్ధరాత్రి, అజాన్ మరియు ఇఖామత్ మధ్య, వర్షం కురుస్తున్నప్పుడు మరియు జుమా రోజు వంటి ప్రత్యేక సమయాల్లో దుఆ అంగీకరించబడుతుందని తెలిపారు. చివరగా, హరామ్ తినడం, తొందరపాటు, ఘోర పాపాలు చేయడం మరియు విధులను నిర్లక్ష్యం చేయడం వంటివి దుఆ అంగీకారానికి అడ్డంకులుగా నిలుస్తాయని హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
అల్హందులిల్లాహి వహదహ్, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.

సోదర మహాశయులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క దయతో మనం అల్హందులిల్లాహ్ ఒక కొత్త సబ్జెక్ట్ ప్రారంభం చేయబోతున్నాము. ఈరోజు నుండి, తర్వాత కొన్ని వారాల వరకు అల్లాహ్ యొక్క దయతో ఈ క్లాస్ కొనసాగుతూ ఉంటుంది.

ఇందులో మనం దుఆ, దాని యొక్క నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు, అవరోధాలు, అంటే దుఆ అంగీకరించబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.

అయితే, ఈరోజు మనది ఫస్ట్ క్లాస్ గనుక, మొదటి క్లాస్. ఇందులో మనం అల్లాహ్ యొక్క దయతో, ఇప్పుడు మీరు ఇక్కడ ముఖ్యంగా ఏ విషయాలు చూస్తున్నారో, దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయ సందర్భాలు, స్థలాలు, అవరోధాలు అని, వీటి గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుంటాము. వీటిలో ప్రతీ ఒక్కటి సంపూర్ణ ఆధారాలతో, వాటికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసుల నిదర్శనాలతో రాబోయే క్లాసుల్లో కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకోబోతారు.

అయితే, రండి ఏమీ ఆలస్యం చేయకుండా, దుఆ గురించి ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు చూపించబడుతుంది, అలాగే ఆ విషయం తెలపబడుతుంది కూడా. అదేమిటంటే, దుఆ అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని మీరు ఒకసారి గ్రహించండి, దుఆ చేయండని అల్లాహ్ యే ఆదేశించాడు. దుఆ చేసే విధానం కూడా అల్లాహ్ యే నేర్పాడు. ఇంకా మీరు దుఆ చేస్తే నేను అంగీకరిస్తాను అన్న వాగ్దానం కూడా అల్లాహ్ చేశాడు.

గమనిస్తున్నారా? దుఆ చేయండని అల్లాహ్ యే ఆదేశించాడు. దుఆ ఎలా చేయాలి, దుఆ చేసే విధానం కూడా అల్లాహ్ యే నేర్పాడు. మనం దుఆ చేస్తే అంగీకరిస్తానని కూడా అల్లాహ్ వాగ్దానం చేశాడు. అంతేకాదు, మనం దుఆ చేస్తున్నందుకు అదనంగా మనకు ఇంకా వేరే పుణ్యాలు కూడా ప్రసాదిస్తాడు. విషయాన్ని గ్రహిస్తున్నారా ఇక్కడ?

ఇక్కడ విషయం గ్రహించండి. ఒకటి, మనం చేసే దుఆ, దుఆలో ఏం అడుగుతామో అది అల్లాహు త’ఆలా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. ఇది ఒక విషయం. మరొక విషయం ఏంటి? మనం దుఆ చేసినప్పుడు అల్లాహు త’ఆలా దానిని స్వీకరించడమే కాకుండా, దుఆ చేసినందుకు సంతోషపడి మనకు పుణ్య ఫలం కూడా ఇస్తాడు.

సోదర మహాశయులారా, ఇంతటి గొప్ప ఈ దుఆలో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైనా మీరు గ్రహించే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు, దీనికి సంబంధించిన ఎన్నో సంఘటనలు కూడా గుర్తుకు వస్తున్నాయి. కానీ నేను చెప్పాను కదా, అల్లాహ్ యొక్క దయతో ఇన్ షా అల్లాహ్, అవన్నీ కూడా నేను మీకు తర్వాత రోజుల్లో తెలియజేస్తాను.

ఇక్కడ మరో విషయం గమనించండి. సూరత్ అల్-ముఅ్‌మినూన్… సారీ, సూరత్ అల్-ముఅ్‌మిన్, దానిని గాఫిర్ అని కూడా అనడం జరుగుతుంది. సూర నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో ఉంది,

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వకాల రబ్బుకుముద్’ఊనీ అస్తజిబ్ లకుమ్)
మరి మీ ప్రభువు చెప్పాడు: “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను.” (40:60)

మరి మీ ప్రభువు చెప్పాడు, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. అంతేకాకుండా, సూరె ఫాతిహా, ఖురాన్ యొక్క ఆరంభం, దీనిని గనక మనం శ్రద్ధగా గమనించామంటే, స్వయంగా అల్లాహు త’ఆలా ఇందులో దుఆ చేసే విధానము, దుఆలో అతి ముఖ్యమైనవి ఏమిటి అన్న విషయాలు, ఇంకా మనం అల్లాహ్ తో దుఆ చేయడంలో ఏ పద్ధతిని అవలంబించాలి, ఆ విషయం అల్లాహు త’ఆలా తెలియజేశాడు. అలాగే ఖురాన్ చివరిలో రెండు సూరాలు గనక మీరు చూస్తే సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్ నాస్, అందులో కూడా మనం వాస్తవానికి అల్లాహ్ ను వేడుకుంటున్నాము. అల్లాహ్ యొక్క శరణులోకి వస్తున్నాము. ఆ గొప్ప విషయం అక్కడ ఉంది.

ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రియ వీక్షకులారా, దుఆ యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, ఎల్లవేళల్లో మనం దుఆ చేస్తూ ఉండాలి. ఈ దుఆ అనేది మన జీవితంలో చాలా చాలా గొప్ప మార్పు తీసుకువస్తుంది. ఈ దుఆ వల్ల విధి వ్రాత కూడా మార్చడం జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా మనం వింటాము, దానికి కూడా సహీ హదీసుల ద్వారా ఆధారం దొరుకుతుంది. కానీ అది ఏ విధి వ్రాత? లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది కాదు. దైవదూతలకు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో మరియు ఏ దాని ద్వారానైతే ప్రతీ సంవత్సరం అలాగే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏదైతే వ్రాయబడుతుందో అది అని భావం.

ఇక రండి, సోదర మహాశయులారా, దుఆ నిబంధనలు, దాని యొక్క షరతుల గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.

దుఆ ఆయుధం అని చెప్పడం జరిగింది.

اَلدُّعَاءُ سِلَاحُ الْمُؤْمِنِ
(అద్దుఆఉ సిలాహుల్ ముఅ్‌మిన్)
దుఆ విశ్వాసి యొక్క ఆయుధం. అని మీరు మాటి మాటికి వింటూనే ఉంటారు కావచ్చు.

అయితే ఆయుధం ఎంత పదునుగా, మనం వాడుక భాషలో ఏమంటాము? కొచ్చగా. ఇలా పెడితేనే కోసేయాలి. అంత పదునుగా మరియు దానిని వాడేవాడు ఎంత నేర్పరి అయి ఉంటాడో, మరియు అది కరెక్టుగా పని చేయడానికి వేరే ఏ ఆటంకము, అడ్డు ఉండదో అప్పుడే ఆ ఆయుధం చాలా చక్కగా పనిచేస్తుంది, ఉద్దేశాన్ని పూర్తి చేస్తుంది.

ఈ మూడిటిలో, మూడు అంటే అర్థమయ్యాయా? ఆయుధం పదునుగా ఉండడం, వాడేవాడు నేర్పరి అయి ఉండడం మరియు ఏ ఆటంకము ఉండకపోవడం. ఈ మూడిటిలో ఏ ఒక్క లోపం ఉన్నా అది సరిగా పనిచేయదు, ఉద్దేశం పూర్తి కాదు. అందుకే, అన్నిటికీ ముందు దుఆ యొక్క షరతులు మరియు దుఆ అంగీకారంలో అడ్డు ఏమిటో తెలుసుకోవడం చాలా చాలా అవసరం.

అయితే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా, దుఆ యొక్క షరతులలో మొట్టమొదటి షరతు, ఇఖ్లాస్. చిత్తశుద్ధి. అంటే, దుఆ కేవలం అల్లాహ్ తో మాత్రమే చేయాలి, అల్లాహ్ ప్రసన్నత కొరకే చేయాలి. పేరు ప్రఖ్యాతి, ప్రదర్శన బుద్ధి అనేది దుఆ చేయడంలో ఏమాత్రం ఉండకూడదు.

రెండవది, ముతాబఆ. అంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, అనుసరణ. అంటే, దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలోనే చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆకు సంబంధించి ఇంకా ఏ ఏ బోధనలు హదీసులు ఉన్నాయో, అందులో ఏ రీతిలో దుఆ చేయాలి అని, దుఆలో ఏ తొందరపాటు ఇంకా వేరే విషయాలు ఉండకూడదు అని చెప్పారో, వాటిని మనం పాటించాలి.

ఈ ఇఖ్లాస్ మరియు ముతాబఆ, ఈ రెండు షరతులు ప్రతీ సత్కార్యంలో అవసరం. తప్పనిసరి. నమాజ్, ఉపవాసం, హజ్, ఉమ్రా, జకాత్, విధిదానం , తల్లిదండ్రుల పట్ల సేవ, ఎవరికైనా ఏదైనా మనం దానం చేస్తున్నాము, ఎవరి పట్ల ఏదైనా మనం ఉత్తమ రీతిలో వ్యవహరిస్తున్నాము, మీరు ఏ ఏ విషయాన్ని సత్కార్యంగా భావిస్తారో వాటన్నిటిలో కూడా ఇఖ్లాస్ మరియు ముతాబఆ, ఈ రెండు షరతులు ఉండడం తప్పనిసరి. ఈ రెండు షరతులు లేవు అంటే, మన ఏ సత్కార్యం కూడా స్వీకరించబడదు. దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు, మన సలఫ్ సాలిహీన్ వారి యొక్క ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ తర్వాత రోజుల్లో అవి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మూడవ షరత్, అల్లాహ్ దుఆ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం ఉండాలి. అయ్యో, ఏదో మౌల్వీ సాబ్ చెప్పిండు కదా చేయమని, చేసి చూస్తాను. ఇలా ఉండకూడదు. అల్లాహ్ నా యొక్క దుఆను తప్పకుండా స్వీకరిస్తాడు. బలమైన నమ్మకం ఉండాలి.

నాల్గవ షరతు, మనస్సు పెట్టి దుఆ చేయాలి. దుఆ చేసే సందర్భంలో అశ్రద్ధగా ఉండకూడదు. నోటితో ఏ పలుకులు పలుకుతున్నామో మనస్సులో దాని అర్థ భావాలు తెలిసి, మనం పూర్తి శ్రద్ధా భక్తులతో దుఆ చేయాలి.

ఇక ఐదవ నిబంధన, దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి. అంటే ఏంటి దృఢ నిశ్చయంతో? ఓ అల్లాహ్ నీకు ఇష్టం ఉంటే నాకు ఆరోగ్యం ఇవ్వు, లేకుంటే లేదు. నీకు ఇష్టం ఉంటే నన్ను క్షమించు, లేకుంటే లేదు. ఇట్లాంటి ధోరణి, ఇట్లాంటి మాట విధానం ఉండకూడదు. దృఢంగా ఓ అల్లాహ్ నన్ను క్షమించు. ఓ అల్లాహ్ నీవే క్షమించేవాడివి, ఇంక నేను ఎక్కడికి వెళ్లి క్షమాపణ కోరాలి? నీవు నన్ను తప్పకుండా క్షమించాలి. ఓ అల్లాహ్ ఇది నాకు అవసరం, ఆరోగ్యం, విద్య, సదాచరణ, ఇంకా సంతాన బాగోగుల గురించి, తల్లిదండ్రుల మంచి గురించి, ముస్లింలందరి మేలు గురించి మనం ఏదైతే అడుగుతున్నామో, ఓ అల్లాహ్ నీవు దీని శక్తి గలవానివి, నాకు తప్పకుండా ఇది ప్రసాదించు అని దుఆ చేయాలి.

అర్థమైంది కదా? ఈ షరతులు, నిబంధనలు గుర్తుంచుకోండి. ఒకటి ఇఖ్లాస్. రెండవది ముతాబఆ. మూడవది అల్లాహ్ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం. నాలుగవది మనస్సు పెట్టి దుఆ చేయాలి, అశ్రద్ధగా ఉండొద్దు. ఐదవది దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి, ఇష్టం ఉంటే ఇవ్వు అన్నటువంటి మాటలు ఉండకూడదు.

ఏమేం తెలుసుకున్నారు మీరు ఇప్పటి వరకు? దుఆ యొక్క ప్రాముఖ్యత. దుఆ ఎంత గొప్ప అనుగ్రహం అల్లాహ్ వైపు నుండి అన్న విషయం తెలుసుకున్నారు. మనం దుఆ చేస్తూ ఉండాలి ఎల్లవేళల్లో అన్న మాట తెలుసుకున్నారు. ఆ తర్వాత రెండవది దుఆ యొక్క షరతులు, దుఆ యొక్క నిబంధనలు తెలుసుకున్నారు.

ఇక రండి, ఇప్పుడు మనం మరికొంత ముందుకు వెళ్లి, దుఆ యొక్క కొన్ని ఆదాబ్, మర్యాదలు, పద్ధతులు తెలుసుకుందాం.

1- వుజూ స్థితిలో ఉండి దుఆ చేయలి.
2- ఖిబ్లా దిశలో ముఖం చేయాలి.
3- రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి.
4- అల్లాహ్ యొక్క స్తోత్రం, ప్రవక్తపై దరూద్.
5- అల్లాహ్ యొక్క మంచి నామాల, ఉత్తమ గుణవిషేశణాల, మన సత్కార్యాల మాధ్యమంతో.
6- పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తపరుస్తూ, క్షమాభిక్ష కోరుతూ దుఆ చేయాలి.
(సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్)

అయితే ఇక్కడ గమనించండి, శ్రద్ధ వహించండి. మీరు స్క్రీన్ లో ఏదైతే చూస్తున్నారో అంతవరకే కాకుండా, దాని యొక్క వివరణలో నేను చెప్పే మాటలు కూడా హృదయంలో నాటుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయిపోతారు.

మొదటిది, వుదూ స్థితిలో ఉండి దుఆ చేయాలి. అయితే వుదూ లేకుండా దుఆ చేయకూడదా? అలా భావం కాదు. షరతులు ఏవైతే మనం చదివామో అవి తప్పకుండా ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి ఉన్నాగాని దుఆ అనేది పైకి వెళ్లదు, అల్లాహ్ అంగీకరించడు. కానీ, ఇక్కడ ఈ మర్యాదలు దుఆ అంగీకారానికి ఇవి మరింత ఎక్కువగా దోహదపడతాయి. ఏదైనా స్థితిలో ఇవి లేకున్నా గాని నడుస్తుంది. కానీ, వీటి అలవాటు చేసుకుంటే మన కొరకే చాలా మంచిది. దుఆ అంగీకారం కొరకు గానీ, దుఆ మనం చేయడంలో మంచి ఖుషూ వ ఖుదూ, దుఆ చేయడంలో మనకు మంచి కాన్సంట్రేషన్ ఉండడానికి ఈ విషయాలన్నీ కూడా దోహదపడతాయి.

అయితే ఇక్కడ గుర్తించాలి, మనం ఇక్కడ దుఆ అని ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో, దుఆ యొక్క మర్యాదలో కొన్ని విషయాలు ఏవైతే ప్రస్తావిస్తున్నామో, ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా అవసరానికి మనం దుఆ చేసుకుంటాము కదా, అది ఇక్కడ ఉద్దేశం. ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు దుఆ చదువుతారు, మజీద్ లో వెళ్ళినప్పుడు దుఆ చదువుతారు, ఇంట్లో వచ్చినప్పుడు దుఆ చదువుతారు. అక్రమకుముల్లాహ్ వఅజకుమ్, మీరు టాయిలెట్ లో వెళ్ళినప్పుడు, వచ్చిన తర్వాత దుఆ చదువుతారు, పడుకునే ముందు చదువుతారు, ఉదయం సాయంకాలం దుఆలు, జిక్రులు చదువుతారు, ఆ సందర్భం గురించి కాదు ఇక్కడ చెప్పడం జరిగేది.

అర్థమైందా? మనం దుఆ అన్న ఉద్దేశంతో, ప్రత్యేకంగా అల్లాహ్ తో వేడుకోవాలి. ఇప్పుడు ఈ నా ప్రాబ్లం సాల్వ్ కావాలి. నేను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ని ఎంతో శ్రద్ధా భక్తులతో ఏడ్చుకుంటూ అల్లాహ్ తో దీనంగా నేను ఇప్పుడు ఈ మాట నా అల్లాహ్ ముందు పెడతాను అని ఒక ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో ఒక విషయం కోరుతూ, ఒక ప్రాబ్లం పరిష్కరింపబడడానికి ఏదైతే దుఆ చేస్తాము కదా, అలాంటి దుఆ విషయం ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. సలాం తిప్పిన తర్వాత కూడా మీరు దుఆ చేస్తారు లేక అజాన్ పూర్తయిపోయిన తర్వాత దుఆ చదువుతారు. అలాంటి దుఆల గురించి ఇక్కడ కాదు మనం చెప్పుకునేది ఇప్పుడు. అర్థమైంది కదా?

అయితే ఎప్పుడైతే ప్రత్యేకంగా, ఒక ఉద్దేశపూర్వకంగా మనం దుఆ చేయడానికి పూనుకుంటామో, అప్పుడు వుదూ ఉంటే చాలా మంచిది. అలాంటి సందర్భంలో కూడా ఒకవేళ వుదూ లేకుంటే దుఆ అంగీకరించబడుతుంది మరియు దుఆ చేయవచ్చు కానీ వుదూ ఉండడం మంచిది.

అలాగే ఖిబ్లా దిశలో ముఖం చేయాలి. ఇది కూడా ఉత్తమ విషయం. లేకుంటే దుఆ ఖుబూల్ కాదు అన్నటువంటి మాట కాదు ఇక్కడ కూడా.

మూడవది, రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి. నిన్న అంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలో దీనికి సమాధానం వివరంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లాంటి ఏదైనా ప్రత్యేక దుఆ చేయడానికి మనం కూర్చుంటే, అప్పుడు ఏం చేయాలి? రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి.

ఈరోజు నేను దీని గురించి ఎన్నో హదీసులు చదువుతూ చదువుతూ మరొక విషయం కూడా తెలిసింది. అదేమిటి? దుఆ చేస్తున్నప్పుడు రెండు చేతులు ఎప్పుడైతే మనం ఎత్తుతామో, ఆ చేతుల యొక్క లోపలి భాగం మన ముఖం వైపునకు, ఆ అరచేతుల యొక్క వీపు అంటే అరచేతుల యొక్క పై భాగం ఖిబ్లా దిశలో ఉండాలి. ఈ విధంగా మనం భుజాల వరకు ఎత్తాలి. భుజాల వరకు అంటే భుజాలకు సమానంగా మన ముఖం ముందు.

నాలుగవ మర్యాద, పద్ధతి, అదబ్, అల్లాహ్ యొక్క స్తోత్రం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్. దీని గురించి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి చెప్పిన విషయాలు మనం ఇంతకుముందు ప్రవక్తపై దరూద్ ఓ సలాం అనే ఒక అంశం విన్నాము జుమా రోజు. గుర్తుందా? అందులో కూడా ఈ విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అదేంటి? దుఆ ఆరంభంలో, మధ్యలో, చివరిలో ఈ మూడు సందర్భాల్లో, మూడిటిలో ఏదైనా ఒక సందర్భంలో అల్లాహ్ యొక్క స్తోత్రము మరియు ప్రవక్తపై దరూద్ చదవాలి. అతి ఉత్తమ పద్ధతి ఏమిటి? ముందు అల్లాహ్ యొక్క స్తోత్రము, ఆ తర్వాత ప్రవక్తపై దరూద్, ఆ తర్వాత మనం అల్లాహ్ తో కోరుకునేది అంటే దుఆ, మళ్ళీ ఆ తర్వాత ప్రవక్తపై దరూద్ చదివి, అల్లాహ్ యొక్క స్తోత్రముతో సమాప్తం చేయాలి, ముగించాలి.

ఐదో విషయం శ్రద్ధ వహించండి. అల్లాహ్ యొక్క మంచి నామములు, ఉత్తమ గుణ విశేషణాలు మరియు మన సత్కార్యాల మాధ్యమంతో, వసీలాతో, ఆధారంతో దుఆ చేయడం ఉత్తమం. ఖురాన్లో కూడా అల్లాహ్ చెప్పాడు కదా మరి,

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా)
అత్యుత్తమమైన పేర్లు అల్లాహ్ కే ఉన్నాయి. కాబట్టి ఆ పేర్లతోనే మీరు ఆయనను ప్రార్థించండి.

నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు నేను ముఖ్యమైన విషయాలు సంక్షిప్తంగా చెప్తున్నాను. తర్వాత రోజుల్లో మనం వివరంగా దలీల్ తో తెలుసుకుందామని. కానీ గుర్తుకు వచ్చేస్తుంది నాకు కూడా, ఇలాంటి ఆయతులు, హదీసులు ఎన్నో ఉన్నాయి. దీని ద్వారా కూడా మన దుఆ అంగీకరింపబడే అటువంటి గ్యారెంటీ అనేది పెరిగిపోతుంది.

సోదర మహాశయులారా, నేను ముందే చెప్పినట్లు, ఈ దుఆ మర్యాదలు అంశం స్టార్ట్ చేసే ముందు, ఏం చెప్పాను? ఈ మర్యాదలు ఏవైతే చెప్పబడుతున్నాయో వీటిని పాటించడం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు ఎమర్జెన్సీ మీకు ఏదైనా, ఒక దెబ్బ తగిలింది మీకు పోతూ పోతూ, నడుస్తూ నడుస్తూ ఫోటోరాయి తగిలింది లేదా మీరు బండిలో వెళ్తూ వెళ్తూ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ కిక్ కొడుతున్నారు స్టార్ట్ కావట్లేదు. ఇక అక్కడ మీరు ఖిబ్లా దిశలో ఉండి, వుదూ చేసుకొని, అదబ్ లో కూర్చొని, ఇవన్నీ చేసుకుంటూ దుఆ చేస్తారా? లేదు వెంటనే మనస్సులో ఓ అల్లాహ్, నా యొక్క బండి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఓ అల్లాహ్ నీవు నాకు సహాయం చేయి. వెళ్తూ వెళ్తూ నడుస్తూ నడుస్తూ ఏదో కింద పడిపోయారు లేదా మీకు ఆ ఏమంటారు దాన్ని? చక్కర వచ్చినట్లు అయిపోయింది. ఆరోగ్యం కొరకు వెంటనే అక్కడ దుఆ చేస్తారు. అలా చేయకూడదా? చేయాలి. అదే ఉత్తమ పద్ధతి అక్కడ. విషయం అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ మర్యాదలు ప్రత్యేకంగా దుఆ చేయడానికి మనం కూర్చున్నప్పుడు ఈ పద్ధతులను పాటించడం చాలా చాలా ఉత్తమం.

ఆరవ మర్యాద, పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తపరుస్తూ క్షమాభిక్ష కోరుతూ దుఆ చేయాలి. అవును, మనం ఏ విషయం కూడా అల్లాహ్ కు ఇష్టమైనది, పాపం కానిది అల్లాహ్ తో మనం కోరుకుంటున్నప్పుడు, వేడుకుంటున్నప్పుడు, నాకు కావాలి అని మనం అల్లాహ్ తో అర్ధిస్తున్నప్పుడు ముందు మన పాపాల విషయం, ఓ అల్లాహ్ నేను నా అన్ని రకాల పాపాల నుండి నీ క్షమాపణ కోరుతున్నాను. నా పాపాలే నీ కరుణ నా వరకు చేరడంలో అడ్డు కాకూడదు ఓ అల్లాహ్. ఈ పాపాలను వదులుకునేటువంటి భాగ్యం కూడా ప్రసాదించు ఓ అల్లాహ్. ఈ విధంగా మనం వేడుకోవాలి అల్లాహ్ తో, విన్నవించుకోవాలి.

పక్కన అరబీలో సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అని రాసి ఉంది. కన్ఫ్యూజ్ కాకండి. ఆ సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అనే దుఆ ఏదైతే ఉందో, అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, అందులో ఈ విషయం చాలా గొప్పగా నొక్కి చెప్పడం జరిగింది అని గుర్తు రావడానికి కేవలం అది ఒక హింట్ ఇచ్చాను అంతే. అయితే మీరు ఒకసారి

اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ
(అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్దిక వ వ’అదిక మస్తత’అతు, అ’ఊదు బిక మిన్ షర్రి మా సన’అతు, అబూఉ లక బి ని’అమతిక అలయ్య, వ అబూఉ బి దంబీ ఫగ్ఫిర్లీ, ఫ ఇన్నహూ లా యగ్ఫిరుద్ దునూబ ఇల్లా అంత)

ఓ అల్లాహ్! నీవే నా ప్రభువువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. నీవే నన్ను సృష్టించావు మరియు నేను నీ దాసుడను. నేను నా శక్తి కొలది నీతో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటాను. నేను చేసిన చెడు నుండి నీ శరణు కోరుతున్నాను. నాపై నీవు కురిపించిన అనుగ్రహాలను నేను ఒప్పుకుంటున్నాను. మరియు నా పాపాలను కూడా నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి నన్ను క్షమించు. నిశ్చయంగా నీవు తప్ప పాపాలను క్షమించేవాడు మరొకడు లేడు.

చదివి చూడండి, దాని అర్థ భావాలను, ఈ మాట అనేది అక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్పాను మీకు ఇప్పుడు హింట్స్ తెలుసుకుంటున్నాము.

దుఆ ప్రాముఖ్యత, దుఆ యొక్క ప్రాముఖ్యత మరియు దాని యొక్క ఇంత పెద్ద అనుగ్రహం అది. ఆ తర్వాత దాని యొక్క షరతులు, నిబంధనలు మరియు మర్యాదలు, ఆదాబ్, ఆ తర్వాత ఇప్పుడు దుఆ అంగీకార సమయాలు తెలుసుకుంటున్నాము.

1- అర్థ రాత్రి
2- రాత్రి మూడవ భాగంలో
3- అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు
4- అజాన్ ఇఖామత్ ల మధ్యలో
5- ఇఖామత్ ఇవ్వబడుతున్నప్పుడు
6- ఫర్జ్ నమాజుల తర్వాత
7- రాత్రి నిద్రమేల్కొన్నప్పుడు
8- వర్షం కురుస్తున్నప్పుడు
9- జుమా రోజు ఖుత్బా మధ్యలో, అస్ మగ్రిబ్ మధ్యలో
10- సహరీ సమయంలో

అయితే సోదర మహాశయులారా, మర్యాదల విషయంలో గాని ఇక్కడ అంగీకార సమయాల విషయంలో గాని ఇంక ఎన్నో ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైనవి, మన రోజువారీ జీవితంలో మనకు అవసరమయ్యేటివి నేను ఇక్కడ కొన్ని ప్రస్తావించాను.

అంగీకార సమయాలు, అర్ధరాత్రి, రెండవది రాత్రి మూడవ భాగంలో, మూడవది అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు, నాలుగవది అజాన్, ఇఖామత్ ల మధ్యలో, ఐదవ సమయం ఇఖామత్ ఇవ్వబడుతున్నప్పుడు, ఆరవ సమయం రాత్రి నిద్ర మేల్కొన్నప్పుడు, ఎనిమిదవ సమయం వర్షం కురుస్తున్నప్పుడు, తొమ్మిదవ సమయం జుమా రోజు ఖుత్బా మధ్యలో అలాగే అస్ర్ మరియు మగ్రిబ్ మధ్యలో. సహీ హదీసుల ద్వారా ఈ రెండు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

పదవ సమయం, సహరీ సమయం. అంటే రోజా ఉంటే సహరీ చేస్తేనే అని కాదు. మనం ఉపవాసం లేకున్న రోజుల్లో కూడా సహరీ సమయం ఏదైతే ఉందో అది దుఆ అంగీకరింపబడడానికి,

وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
(వబిల్ అస్ హారి హుమ్ యస్తగ్ఫిరూన్)
వారు రాత్రి జామున క్షమాపణ వేడుకునేవారు.

ఖురాన్ లో కూడా దీని గురించి మనకు ఆధారం కనబడుతుంది.

ఈ విధంగా సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? దుఆ అంగీకరింపబడే అటువంటి సమయాల గురించి తెలుసుకున్నాము.

ఇప్పుడు రండి దుఆ అంగీకరింపబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి? ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.

అల్లాహ్ యే కాపాడుగాక మనందరినీ. మనం ఈ విషయంలో ఒకవేళ జాగ్రత్తగా ఉండకుంటే, మనం ఎన్ని మర్యాదలు పాటించినా, మనం దుఆ అంగీకారం యోగ్యం పొందడానికి ఏ మంచి సమయం ఎన్నుకొని దుఆ చేసినా, అంతా వృధా అయిపోతుంది. ఎలాగో తెలుసా? అల్లాహ్ అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి, అన్ని రకాల రోగాల నుండి కాపాడాలి. ఒకవేళ వీరు షుగర్ పేషెంట్ అయి, షుగర్ వ్యాధిని ఇంకా పెరగకుండా, అల్లాహ్ యొక్క దయతో మొత్తమే దూరమైపోయి ఆరోగ్యవంతులు అవ్వడానికి మంచి మందులు వాడుతున్నారు. కానీ, అటు ఒకవైపున మందులు వాడుకుంటూ మంచి రసగుల్లాలు తింటున్నారు, పల్లి పట్టీలు తింటున్నారు, ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు పెద్దలు చూడటం లేదు కదా అని ఓ దోసెడు చక్కెర కూడా మింగేస్తున్నారు. ఇలా చేస్తే ఏమవుతుంది? మీ మందులు మీకు పనిచేస్తాయా? చేయవు కదా. అందుకొరకే అడ్డంకులు, ఆటంకాలు, అవరోధాలు, దుఆ అంగీకరింపబడడానికి ఏ విషయాలు ఇందులో ముఖ్యమో అవి తెలుసుకోవడం చాలా చాలా అవసరం.

వాటిలో అతి ముఖ్యమైనవి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేమిటి? మనిషి హరామ్ తినడం, త్రాగడం, ధరించడం, తొడగడం. వీటన్నిటికీ దూరం ఉండాలి.

నేను చెప్పాను కదా ఇంతకుముందే? హదీసులు, ఆధారాలు అవన్నీ కూడా తర్వాత మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాము. కానీ ఇప్పుడు సంక్షిప్తంగా ఏం తెలిసింది? మన దుఆ అంగీకరింపబడాలంటే మనం హరామ్ తిండికి దూరం ఉండాలి. వడ్డీ అయినా గాని, లంచం తీసుకోవడం అయినా గాని, ఇంకా వేరే దొంగతనం చేసి గాని, లేకుంటే తెలిసి తెలిసి ఈ రోజుల్లో ఎన్నో రకాల జూదములు, లాటరీలు, ఎన్నో రకాల చైన్ బిజినెస్, చైన్ సిస్టం బిజినెస్ లు వస్తున్నాయి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. హరామ్ సొమ్ము అనేది మన తిండిలో, మన త్రాగడంలో, మన దుస్తుల్లో, బట్టల్లో ఏమాత్రం ఉండకూడదు.

రెండవది, తొందరపాటు. అంటే ఏంటి? ఒకసారి, రెండుసార్లు, కొన్నిసార్లు దుఆ చేసి అయ్యో ఇంకా దుఆ అంగీకరింపబడటం లేదు, ఇంకా అంగీకరింపబడటం లేదు అని దుఆ చేయడం మానుకోవడం. ఇది కూడా చాలా ప్రమాదకరం. చేస్తూ ఉండండి దుఆ. మీ యొక్క కోరిక, మీరు ఏ విషయం గురించి అయితే అల్లాహ్ తో దుఆ చేస్తున్నారో, అలా చేయడం ఇస్లాం ప్రకారంగా యోగ్యమైనది ఉంటే, అది మీకు పొందే వరకు ఇహలోకపు ఏదైనా అవసరం కావచ్చు, మీ యొక్క మంచి ఉద్యోగం కొరకు కావచ్చు, మీ చదువులో ఉన్నత శిఖరానికి చేరి మంచి ర్యాంకులో పాస్ అవ్వడం కావచ్చు, ఇంకా మంచి భార్య దొరకాలని లేకుంటే మంచి భర్త దొరకాలని కావచ్చు, అలాగే మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే అల్లాహ్ ఆరోగ్యం ప్రసాదించాలని కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మీకు అది ప్రాప్తించే వరకు దుఆ చేస్తూనే ఉండండి కానీ, ఏంటయ్యా, ఓ సంవత్సరం నుండి దుఆనే చేస్తున్నాను, పది సంవత్సరాల నుండి దుఆ చేస్తున్నాను, నాకు సంతానమే కలగటం లేదు అని దుఆ చేయడం వదులుకోవడం, ఇంకా వేరే తప్పుడు మార్గాలు వెళ్ళడం, ఉదాహరణకు సంతానం లేనివారు ఎంతోమంది ఏం చేస్తారు? దర్గాల వద్దకు వెళ్ళిపోతారు. అది ఇంకా మరింత ఎక్కువ ప్రమాదంలో పడిపోతారు.

మూడో విషయం, ఘోరమైన పాపాలు. ప్రతీ పాపం కూడా చాలా ప్రమాదకరమైనది, నష్టం చేకూర్చేది. కాకపోతే, పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోకపోవడం. ఇది కూడా మన దుఆ అంగీకారానికి అడ్డు కలుగుతుంది. చూడండి కొన్ని సందర్భాల్లో స్వీకరించబడుతుంది, అది అల్లాహ్ యొక్క దయ. అల్లాహ్ ఖురాన్ లో చెప్పిన ప్రకారంగా మనకు ఏం తెలుస్తుంది? ఎన్నో సందర్భాల్లో, అలాగే సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీస్ ప్రకారంగా ద’వతుల్ మజ్లూమ్, అవిశ్వాసి, కాఫిర్, ముష్రిక్, బహుదైవారాధకుల దుఆ కూడా అల్లాహ్ స్వీకరిస్తాడు. కానీ, మనం అల్లాహ్ ను నమ్ముకున్న వాళ్ళము, ముస్లింలము, విశ్వాసులము. మనం పాపాలను, ప్రత్యేకంగా పాపాలలో ఘోర పాపాలు ఏవైతే ఉంటాయో వాటిని వదులుకోవాలి.

ఇక నాలుగవది, అల్లాహు త’ఆలా మనపై విధించిన వాటిని పాటించకపోవడం. అల్లాహు త’ఆలా మనపై ఏ విధులను విధించాడో, ఆ విధులను మనం ఒకవేళ నెరవేర్చకుంటే, మన దుఆలు అంగీకారానికి అవి అడ్డుపడతాయి. అందుకొరకే అల్లాహ్ విధించిన ప్రతీ విధిని మనం పాటిస్తూ ఉండాలి.

ఐదవది, ఏ విషయం మనం అల్లాహ్ తో కోరుతున్నామో, అడుగుతున్నామో, ఇది నాకు కావాలి అని అంటున్నామో అది ఏదైనా పాప విషయం కాకూడదు. ఓ అల్లాహ్, నా కొడుకు టెన్త్ లో మంచిగా పాస్ అయ్యేది ఉంటే, అతడు పబ్జీ గేమ్ ఆడుకోవడానికి మరియు మంచి ఫిలింలు, సీరియల్లు చూసుకుంటూ ఉండడానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తానని నేను వాగ్దానం చేశా. ఓ అల్లాహ్ ఇంకా జీతం దొరకట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు. నాకు మంచిగా డబ్బులు సమకూర్చు ఓ అల్లాహ్. నా కొడుక్కి నేను చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తాను. మంచిగా ఉందా? పాప కార్యానికి, పాప కార్యం కోరుతూ దుఆ చేయడం జరుగుతుంది కదా, ఇలాంటి దుఆ చేయకూడదు.

అలాగే, బంధుత్వాలు తెగిపోవడానికి, సత్సంబంధాలు ఉండకుండా దూరం కావడానికి అలాంటి దుఆ కూడా చేయకూడదు. ఎవరైనా ఒక బంధువు నుండి ఎప్పుడైనా ఏదైనా మాట మీకు ఇష్టం లేనిది విన్నారు కావచ్చు, ఓ అల్లాహ్ రేపటి నుండి నేను అతని ముఖమే చూడకుండా చెయ్. ఇలా బంధుత్వాల తెగ తెంపులకు దుఆ చేయకూడదు.

అయితే ముఖ్యంగా ఈ ఐదు విషయాలు ఏవైతే మనం మన యొక్క దుఆ అంగీకారానికి అడ్డుగా ఉంటాయో, వాటిని తెలుసుకున్నారు. ఇన్ షా అల్లాహ్ వచ్చే క్లాసులలో ఇందులో ఇంక ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటి వివరాలు, ఖురాన్, హదీసుల ఆధారాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అల్లాహు త’ఆలా మనందరికీ కూడా దుఆ అతనికి ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో చేస్తూ ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వ’స్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

—

ఫిఖ్‘హ్ దుఆ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV27wc82PWsbdneU9YNGriU2

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ [తప్పక వినండి] [ఆడియో & టెక్స్ట్]

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ
https://youtu.be/Pj0-SewzPaA [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తిని చూసి, అతనిని చాలా ఆకలితో ఉండి ఒకటి లేదా రెండు ఖర్జూరాలు మాత్రమే తిన్న వ్యక్తితో పోల్చారు. ఎలాగైతే ఆ కొద్దిపాటి ఆహారం ఆకలిని తీర్చదో, అలాగే అసంపూర్ణమైన రుకూ మరియు సజ్దాలతో చేసే నమాజ్ ఆత్మకు పోషణ ఇవ్వదని వివరించారు. నమాజ్ అనేది విశ్వాసుల హృదయాలకు ఆహారం లాంటిదని, దానిని సంపూర్ణంగా, ఉత్తమ రీతిలో చేయడం ద్వారానే ఆత్మకు, మనస్సుకు కావలసినంత పోషణ లభిస్తుందని తెలిపారు. సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తి తన ఆత్మను పస్తులు ఉంచినట్లేనని, దానివల్ల ఆత్మ అనారోగ్యానికి గురై చివరకు “చనిపోతుందని” (ఆధ్యాత్మికంగా నిర్జీవమవుతుందని) హెచ్చరించారు. ఈ “ఆత్మ మరణం” అనేది భౌతిక మరణం కాదని, అల్లాహ్ స్మరణ, ఆరాధనల నుండి దూరం కావడం అని స్పష్టం చేశారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక వ్యక్తిని చూశారు, నమాజ్ చేస్తున్నది. కానీ ఆ వ్యక్తి ఎలా నమాజ్ చేస్తున్నాడు?

لَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(లా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
అతను రుకూ మరియు సజ్దాలను సరిగ్గా చేయడం లేదు.

يَنْقُرُ صَلَاتَهُ كَمَا يَنْقُرُ الْغُرَابُ
(యన్ఖురు సలాతహు కమా యన్ఖురుల్ గురాబ్)
కాకి ఎలా చుంచు కొడుతుందో విత్తనం ఎత్తుకోవడానికి, ఆ విధంగా అతను నమాజ్ చేస్తున్నాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

إِنَّ مَثَلَ الَّذِي يُصَلِّي وَلَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(ఇన్న మసలల్లదీ యుసల్లీ వలా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
ఎవరైతే ఈ విధంగా నమాజ్ చేస్తున్నారో, అందులో రుకూ కూడా సరిగ్గా చేయడం లేదు, సజ్దా కూడా సరిగ్గా చేయడం లేదు,

كَمَثَلِ الَّذِي يَأْكُلُ التَّمْرَةَ وَالتَّمْرَتَيْنِ
(క మసలిల్లదీ య’కులుత్తమ్రత వత్తమ్రతైన్)
అతని ఉదాహరణ, దృష్టాంతం ఎలాంటిదంటే, చాలా ఆకలిగా ఉండి కేవలం ఒక్క ఖర్జూరము లేదా రెండు ఖర్జూరపు ముక్కలు తిన్న వాని మాదిరిగా,

لَا يُغْنِيَانِ عَنْهُ شَيْئًا
(లా యుగ్నియాని అన్హు షైఆ)
ఆ ఒక్క రెండు ఖర్జూరపు ముక్కలు అతని యొక్క ఆకలిని తీర్చవు.

فَأَتِمُّوا الرُّكُوعَ وَالسُّجُودَ
(ఫఅతిమ్ముర్రుకూఅ వస్సుజూద్)
మీరు నమాజులలో రుకూ సజ్దాలు పూర్తిగా చెయ్యండి, సంపూర్ణంగా చెయ్యండి, సరిగ్గా చెయ్యండి.

ఇమామ్ ముందిరి రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను హసన్ కోవకు చెందినది అని చెప్పారు. అయితే ఇమామ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ చెప్పారు, ఈ హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఉదాహరణ, దృష్టాంతం తెలియజేశారో అది చాలా గొప్పది, చాలా ఉత్తమ రీతిలో తెలియజేశారు.

ఎలాగైతే ఆకలి ఉన్న వానికి ఒక ఖర్జూరపు, రెండు ఖర్జూరపు ముక్కలు అతని ఆకలిని తీర్చలేవో, ఇలా రుకూ సజ్దాలు సరిగ్గా చేయకుండా నమాజును తొందరపాటుతో చేసేవాడు వాస్తవానికి అతడు నమాజ్ ఏదైతే విశ్వాసుల హృదయాలకు ఆహారంగా ఉందో, ఆ ఆహారం అతడు తీసుకోని వాడవుతాడు.

వాస్తవానికి నమాజ్ అల్లాహ్ యొక్క ధిక్ర్, అల్లాహ్ తో వేడుకోలు, అల్లాహ్ సాన్నిధ్యానికి చేరవేసే, అల్లాహ్ కు చాలా దగ్గరగా చేసే సత్కార్యాల్లో గొప్ప సత్కార్యం. ఇక ఎవరైతే ఈ నమాజ్ సంపూర్ణంగా, మంచి ఉత్తమ రీతిలో చేస్తారో అతడే తన ఆత్మకు, తన మనస్సుకు కావలసినంత ఆహారం ఇచ్చిన వాడవుతాడు. మరి ఎవరైతే నమాజ్ సరియైన రీతిలో చెయ్యడో, టక్కు టిక్కు మని, ఎక్స్ప్రెస్ నమాజ్, ఇలా చూసి అలా చూసేసరికి అల్లాహు అక్బర్ అని మొదలవుతుంది, అస్సలాము అలైకుం అని పూర్తయిపోతుంది, ఇలాంటి నమాజ్ ద్వారా అతడు తన హృదయ, తన మనస్సుకు కావలసిన, తన ఆత్మకు కావలసిన ఆహారాన్ని సరిగా ఇవ్వలేదు. ఇక ఎలాగైతే మనిషికి కావలసినంత ఆహారం దొరకకుంటే చనిపోతాడో, అనారోగ్యానికి గురవుతాడో అలాగే ఎప్పుడైతే హృదయానికి, ఆత్మకు, మనస్సుకు దాని ఆహారం దొరకదో అది కూడా అనారోగ్యానికి గురి అవుతుంది మరియు అది కూడా చనిపోతుంది. మనిషి యొక్క చావు అంత నష్టమైనది కాదు, ఆత్మ చనిపోయిందంటే అది చాలా పెద్ద నష్టం.

ఏమైనా అర్థమైందా అండీ మీకు ఇప్పుడు చెప్పిన మాటలతో?

ప్రశ్న మరియు జవాబు

ఆత్మ చనిపోవడం అంటే, ఇది ఒక ఉదాహరణగా. ఆత్మ చనిపోవడం అంటే ఆత్మకు కావలసిన ఆహారం ఇవ్వకపోవడం. ప్రాపంచిక పరంగా బ్రతికి ఉన్నప్పటికీ, అల్లాహ్ యొక్క ధిక్ర్ తో, అల్లాహ్ యొక్క ఆరాధనతో, అల్లాహ్ యొక్క స్మరణతో, ఖురాన్ యొక్క తిలావత్ తో దానికి ఏ ఆహారం అవసరం ఉంటుందో, అది దానికి చేరనీయకపోవడం. ఇక్కడ ఆత్మ చనిపోవడం అంటే మనం ఫిజికల్ గా, లేదా కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ పరంగా ఏదైతే మాటలు మాట్లాడతారో ఇతని యొక్క మెదడు చనిపోయింది, ఆ మైండ్ డెత్ అని, ఆత్మ డెత్, ఇలాంటి విషయం ఇక్కడ కాదు. ఇక్కడ చనిపోవడం అంటే, “అరే ఏందిరా, నువ్వు జీవితం, ఏదైనా జీవితమా? నీదే బ్రతుకు, ఏదైనా బ్రతుకా? చనిపోయిన శవం కంటే అధ్వానం రా నువ్వు!” ఇలా మనం ఎప్పుడు అంటాము? ఆ మనిషి బ్రతికి కూడా సరియైన పనులు చేయకుంటే అంటాము కదా, ఆ విధంగా. ఇన్షా అల్లాహ్ మాట అర్థమైందని భావిస్తున్నాను.

—

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=15701

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా? [వీడియో & టెక్స్ట్]

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా?
https://youtu.be/-wurwxOMX1A [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేసే సరైన పద్ధతి గురించి వివరించబడింది. సజ్దా సమయంలో ఏడు శరీర భాగాలు నేలను తాకాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఆ ఏడు భాగాలు ఏవో స్పష్టంగా చెప్పబడింది. పురుషులు మరియు స్త్రీల సజ్దా పద్ధతిలో ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇద్దరికీ ఒకే విధానం వర్తిస్తుందని నొక్కి చెప్పబడింది. ఇస్లామిక్ సజ్దాకు మరియు ఇతర సంప్రదాయాలలో కనిపించే సాష్టాంగ నమస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది, ముఖ్యంగా భంగిమ మరియు ఉద్దేశ్యం పరంగా. చివరగా, సజ్దాలో సరైన భంగిమను, అంటే అవయవాలను ఎలా ఉంచాలో దృశ్య సహాయంతో వివరించడం జరిగింది.

ప్రశ్న : సజ్దా చేసినప్పుడు ఎన్ని బాడీ పార్ట్స్ టచ్ అవ్వాలి ? పురుషుల సజ్దా, స్త్రీల సజ్దా ఒకటేనా? అలాగే సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం అనేది ఒకటేనా?

చూడండి, ఆ సజ్దాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీస్, బుఖారీలో ఉంది:

أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ
[ఉమిర్తు అన్ అస్జుదా అలా సబ’అతి ఆ’దా]
ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది.

ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది. ఆ ఏడింటిలో ముక్కు మరియు నొసటి కలిసి ఒకటి, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల వేళ్ళు భూమికి తాకి ఉండడం, ఈ ఏడు అంగములు భూమికి తాకి ఉండాలి. కావాలని, తెలిసి, ఉద్దేశపూర్వకంగా వీటిలో ఏ ఒక్కటి భూమికి తాకకున్నా, మన యొక్క నమాజ్ నెరవేరదు.

అయితే, ఈ సజ్దా యొక్క పద్ధతి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ఒకటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలు సజ్దా చేసినప్పుడు ఇలా ముడుచుకొని చేయాలి అని, పురుషులు చేసినప్పుడు ఇలాగ వెడల్పు చేయాలి అని వేరు వేరు చెప్పలేదు. అందరికీ ఒకే పద్ధతి నేర్పారు.

ఇక మీ ప్రశ్నలో రెండవ అంశం ఏదైతే ఉందో, సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం రెండూ ఒకటేనా? సజ్దా అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా? కావాలంటే దీనికి సంబంధించి ఇంతకుముందు మనం నమాజ్ యొక్క పద్ధతి అని ఏదైతే చూపించామో, అందులో కూడా వివరణ మీరు చూసి ఉండవచ్చును. ఆ ప్రకారంగా మనం సజ్దా చేయాలి. అది సజ్దా, సజ్దాలో ఏడు అంగములు స్త్రీలైనా, పురుషులైనా భూమికి తాకించాలి.

కానీ సాష్టాంగ నమస్కారం అన్నది ఏదైతే ఉందో, ఒకవేళ ఉద్దేశంగా, ఉద్దేశం ఏది, సాష్టాంగం, ఇక్కడ అష్టాంగం అని అంటున్నారా? సా అని తీసుకున్నారైతే ఏడు అని వస్తుందా? అష్ట అని ఎనిమిదిని కూడా అంటారు. అయితే ఈ ఎనిమిది అవయవాలు భూమికి తాకాలి, ఆ ఉద్దేశ పరంగా చెప్పడం జరిగిందా?

ఒకసారి యోగాలోని కొన్ని విషయాలు ఒక వ్యక్తి చూపిస్తూ, సాష్టాంగ నమస్కారం అని చూపించాడు. అందులో ఏం చేశాడు? పడుకున్నాడు. ముఖము, కడుపు ఇది మొత్తం భూమికి తాకి ఉండి, ఈ విధంగా చేతులు ఇలా ముందుకు చేసి, ఇలా అందులో అతను చూపిస్తున్నాడు. ఒకవేళ అతను అలా చూపిస్తున్నాడంటే మరి ఇది సరైన పద్ధతి కాదు. ఇస్లాం ఏదైతే చూపుతుందో, దాని ప్రకారంగా ఒకవేళ మనం చూసుకుంటే ఇది సరైన విషయం కాదు. అందుకొరకు నేను చెప్పేది ఏమిటి? మనం ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి అర్థం కావడానికి తెలుగులో, సంస్కృతంలో, వేరే భాషలో వచ్చిన ఏదైనా పదం వాడుతున్నప్పటికీ, ఇస్లామీయ ఇస్తిలాహాత్, ఇస్లామీయ పదాలను మనం తప్పకుండా వాడాలి, తప్పకుండా అర్థం చేసుకోవాలి మరియు వాటినే పలుకుతూ ఉండడం చాలా మంచి విషయం.

సజ్దా చేసే సరైన విధానం

ఇక్కడ సంక్షిప్తంగా మీకు సజ్దా విషయం చూపించడం జరుగుతుంది, గమనించండి. సజ్దా చేయు విధానంలో, అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలోకి వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలి. నొసటి, ముక్కు, చూస్తున్నారు కదా ఇక్కడ? ఇక్కడ గమనిస్తున్నారా? ఆ తర్వాత రెండు అరచేతులు. ఆ తర్వాత రెండు మోకాళ్ళు. ఆ తర్వాత రెండు పాదముల వేళ్ళు, ఎలా ఉన్నాయో ఇక్కడ గమనిస్తున్నారు కదా? ఇందులో,

سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى
[సుబ్ హా న రబ్బియల్ ఆ’లా]
మహోన్నతుడైన నా ప్రభువు పరమ పవిత్రుడు

అని చదవాలి అని, ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి.

సజ్దా చేసే సరైన విధానం

ఆ తర్వాత ఇక్కడ గమనించండి. సజ్దాలో ఈ క్రింది విషయాల్ని గమనించాలి. తొడలను పిక్కల నుండి వేరుగా ఉంచాలి, గమనిస్తున్నారు కదా? మోచేతులను ప్రక్కల నుండి వేరుగా ఉంచాలి. కడుపు తొడలకు తాకకుండా ఉండాలి, ఇక్కడ. ఇంకా మోచేతులు భూమికి తాకకుండా లేపి ఉంచాలి. చేతులు, చేతుల వ్రేళ్ళు మరియు కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లా దిశలో ఉండాలి. ఇది సజ్దా యొక్క వివరణ ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు సజ్దా చేయండి.

—

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు | ధర్మపరమైన నిషేధాలు – 35 [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు
https://youtu.be/RCMU6hao5aE [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ప్రధాన అంశం అల్లాహ్ పట్ల సద్భావన (హుస్న్ అజ్-జన్) కలిగి ఉండటం మరియు దురభిప్రాయం (సూ అజ్-జన్) కలిగి ఉండకుండా ఉండటం. అల్లాహ్ తన దాసుడు తన గురించి ఎలా భావిస్తాడో అలానే అతనితో వ్యవహరిస్తాడని వక్త నొక్కిచెప్పారు. అల్లాహ్ పట్ల చెడుగా భావించడం విశ్వాసుల లక్షణం కాదని, అది ఘోరమైన పాపమని పేర్కొన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు చేసిన ఉపదేశాన్ని ఉల్లేఖించారు, ప్రతి ఒక్కరూ అల్లాహ్ పట్ల మంచి అభిప్రాయంతోనే మరణించాలని చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు ఇమామ్ మావుర్దీ వంటి పండితుల అభిప్రాయాలను కూడా ఉటంకిస్తూ, అల్లాహ్ పట్ల దురభిప్రాయం కలిగి ఉండటం ఎంత పెద్ద పాపమో మరియు అది మార్గభ్రష్టత్వానికి ఎలా దారితీస్తుందో వివరించారు.

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు

35వ విషయం. అల్లాహ్ పట్ల سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), చెడు తలంపు కలిగి ఉండకు. మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో, అల్లాహ్ అతని ఆ తలంపు ప్రకారమే అతనికి తోడుగా ఉంటాడు. విషయం అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా అల్లాహ్ విషయంలో చెడు తలంపు అనేది ఉండకూడదు, అల్లాహ్ నన్ను కరుణించడు కావచ్చు, ఏ నా పని ఇది కాదు నేను ఎప్పటినుండి దుఆ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఈ విధంగా ప్రజలు అల్లాహ్ విషయంలో చెడు తలంపులు కలిగి ఉంటారు.

ఈ చెడు తలంపు కలిగి ఉండడం, سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), అల్లాహ్ గురించి ఇలా చెడుగా ఆలోచించడం విశ్వాసుల గుణం ఎంత మాత్రం కాదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చివరి ఉపదేశం

జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి కంటే ముందు మూడు రోజులు ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు స్వయంగా నేను విన్నాను అని అంటున్నారు. గమనించండి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు ఏం ఉపదేశించారు?

لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللَّهِ عَزَّ وَجَلَّ
(లా యమూతన్న అహదుకుమ్ ఇల్లా వహువ యుహ్సినుజ్-జన్న బిల్లాహి అజ్జ వజల్)
మీలో ఎవరూ అల్లాహ్ అజ్జ వజల్ పట్ల సద్భావన కలిగి ఉన్న స్థితిలో తప్ప మరణించవద్దు (ముస్లిం 2877).

మీలో ఎవరు కూడా, మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి. మరణ సమయంలో అల్లాహ్ విషయంలో చాలా మంచి తలంపు ఉండాలి. దీనికి భిన్నంగా అల్లాహ్ క్షమించడేమో అన్నటువంటి చెడు తలంపును ఎంత మాత్రం ఉండకూడదు.

చెడు తలంపు ఘోరమైన పాపం

ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, అల్లాహ్ పట్ల చెడు తలంపు విశ్వాసుల గుణం కాదు. అల్లాహ్ పట్ల చెడు తలంపు ఘోర పాపాల్లో ఒక పాపం.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) చెప్పారు:

أَعْظَمُ الذُّنُوبِ عِنْدَ اللَّهِ إِسَاءَةُ الظَّنِّ بِهِ
(అఅజముజ్-జునూబి ఇందల్లాహి ఇసాఅతుజ్-జన్ని బిహి)
ఘోరమైన పాపాల్లో ఒక పాపం అల్లాహ్ వద్ద ఏమిటంటే అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండడం.

ఇమామ్ మావుర్దీ (రహిమహుల్లాహ్) చెప్పారు:

سُوءُ الظَّنِّ هُوَ عَدَمُ الثِّقَةِ بِمَنْ هُوَ لَهَا أَهْلٌ، فَإِنْ كَانَ بِالْخَالِقِ كَانَ شَكًّا يَؤُولُ إِلَى ضَلَالٍ
సూ అజ్-జన్ (చెడు తలంపు) అంటే నమ్మకానికి అర్హుడైన వానిపై నమ్మకం లేకపోవడం. ఒకవేళ అది సృష్టికర్త (అల్లాహ్) పట్ల అయితే, అది మార్గభ్రష్టత్వానికి దారితీసే సందేహంగా మారుతుంది

సూ అజ్-జన్, చెడు తలంపు అంటే ఏంటి? ఒక వ్యక్తి దేనికి అర్హుడు కాడో, అతడు అలాంటి వాడు అని తప్పుగా భావించడం. ఇక ఈ తలంపు చెడు, ఈ చెడు తలంపు అల్లాహ్ విషయంలో ఉంది అంటే అతడు ఒక రకమైన సందేహానికి, అనుమానానికి గురి అయి, అతడు మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నాడు.

అందుకొరకు అల్లాహు తఆలా ఖురాన్లో అనేక సందర్భాలలో, సూరత్ ఫుస్సిలత్, దీని మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నంబర్ 22, 23లో, అలాగే సూరతుల్ ఫత్హ్ ఆయత్ నంబర్ 6, ఆయత్ నంబర్ 12 వీటి గురించి చాలా నష్టాలు తెలపడం జరిగింది. నేను చెప్పిన ఆ ఆయతులు మీరు చదవండి మరియు వాటి ద్వారా సరియైన జ్ఞానం అర్ధించే ప్రయత్నం చేయండి.

41:22 وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ

“మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.”

41:23 وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ

“మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు.”

48:6 وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا

అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.

48:12 بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا

అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ)

బిస్మిల్లాహ్

యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0Mlhg-zp9sHUArkqQGOoEz

పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం – షేఖ్ హబీబుర్ రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]
https://teluguislam.net/2026/06/28/the-danger-of-sins-during-the-holy-months/
ఈ ప్రసంగం ఇస్లాంలోని పవిత్ర మాసాల (ముహర్రం, రజబ్, జుల్ ఖాదా మరియు జుల్ హిజ్జా) విశిష్టతను మరియు ఆ మాసాలలో పాపాలకు దూరంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరిస్తుంది. అల్లాహ్ పన్నెండు నెలల్లో నాలుగింటిని ప్రత్యేకంగా పవిత్రమైనవిగా ప్రకటించారని, ఈ కాలంలో చేసే సత్కార్యాలకు ప్రతిఫలం పెరగడమే కాకుండా, చేసే పాపాల తీవ్రత మరియు వాటి శిక్ష కూడా ఇతర సమయాల కంటే అధికంగా ఉంటాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. పాపాలు సంఖ్యాపరంగా పెరగకపోయినా, పవిత్ర స్థలాలు మరియు కాలాల గౌరవాన్ని బట్టి వాటి ప్రభావం తీవ్రమవుతుందని, ఇవి హృదయాలకు తుప్పు పట్టించి మనిషిని అల్లాహ్ కరుణకు దూరం చేస్తాయని ఆయన హెచ్చరించారు.

హిజ్రీ క్యాలెండర్ ఆవశ్యకత | Importance of Hijri Calendar [వీడియో] [21 min]
https://teluguislam.net/2022/08/01/importance-of-hijri-calendar/
ప్రస్తుతం మనం క్రొత్త హిజ్రీ సంవత్సరం లోకి ప్రవేశించాము (హిజ్రీ 1444). ముహర్రం మాసం హిజ్రీ క్యాలెండరు లోని మొదటి నెల. హిజ్రత్ అంటే వలస పోవడం. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేయడం పురస్కరించుకొని ఈ హిజ్రీ క్యాలెండరు తయారు అయింది

మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్
https://teluguislam.net/?p=29531
1) మొహర్రం మాసం ప్రాధాన్యత  2) నాలుగు నిషిద్ధ మాసాలు మరియు వాటి ప్రత్యేక ఆదేశాలు 3) దుష్కార్యాల ప్రభావాలు  4) మొహర్రం నెలలో శోక గీతాలాపన (నోహా) మరియు హాహాకారాలు (మాతం) చేయడం 5) హుస్సేన్ (రదియల్లాహు  అన్హు) వీర మరణం 6) మొహర్రం మాసం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులు 7) మొహర్రం మాసంలో ఉపవాసం ప్రాధాన్యత 8) చరిత్రలో ఆషూరా దినం ప్రాధాన్యత 9) ఆషూరా దినపు ఉపవాసం ప్రాధాన్యత మరియు మహత్యం 

ముహర్రం మరియు ఆషూరా ఘనతలు [28 నిమిషాల వీడియో]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2019/08/29/muharram-and-ashurah-greatness/
కేవలం 28 నిమిషాల ఈ క్లిప్ లో ముహర్రమ్ మాసము అందులోని ఆషూరా (పదవ తేది) ఘనత ఖుర్ఆన్ హదీసుల ఆధారంగా తెలుపడంతో పాటు, ఉపవాసం ఘనత, ఏ రోజుల్లో ఉపవాసం ఉండడం ఉత్తమం అన్న విషయం సహీ హదీసుల ఆధారంగా తెలుపాము.

ముహర్రం ఘనత [వీడియో] [6 నిమిషాలు ]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2019/08/20/muharram-greatness/
అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటైన ముహర్రం నెల త్వరలో మన ముందుకు రాబోతున్నది. ఇటువంటి శుభప్రదమైన నెలలో ఎక్కువ పుణ్యాలు సంపాదించిపెట్టే మంచిపనుల గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవలెను. దీని ద్వారా వారు తమ ఉన్నత స్థితిని మరింతగా అభివృద్ధి పరచుకోవటానికి, చేసిన పాపాలను క్షమింప జేసుకోవటానికి మరియు అల్లాహ్‌ మెప్పును పొందటానికి ప్రయత్నించేందుకు ఇది ఒక మంచి అవకాశం. [వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)]

ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసం యొక్క విశిష్టత
https://teluguislam.net/2012/11/19/virtue-of-fasting-10th-muharram-ashoora/
ఈ విషయాలు షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉధైమిన్ రహిమహుల్లాహ్ యొక్క నుండి మరియు షేఖ్ సాలెహ్ అల్ఫౌజాన్ హాఫిజహుల్లాహ్ యొక్క నుండి తీసుకోబడినవి

ముహర్రం పండుగ ఎలా జరుపుకోవాలి? [వీడియో]
https://teluguislam.net/2020/08/20/can-we-celebrate-muharram-festival/
మనం ముహర్రం పండుగ జరుపుకోవచ్చా? జరుపుకో కూడదు అంటే ఏంటి సాక్ష్యం (దలీల్)? జరుపుకొనేది ఉండి వుంటే ఎలా జరుపుకోవాలి? – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పీర్లు, దర్గాలు, కుండీలు దగ్గర జరిగే భోజనాలకు పోవచ్చా? [వీడియో] [3 నిముషాలు]
https://youtu.be/CJew08uEB4Y?list=PLw5IiDSnUeV0Mlhg-zp9sHUArkqQGOoEz

ముహర్రం నెలలో హుస్సేన్ (రజియల్లాహు అన్హు) మా మీదకి వస్తారు? కానీ ఎవరు నమ్మరు? ఇది వాస్తవమేనా? [వీడియో] [2 నిముషాలు]
https://youtu.be/7ov6a2nXfRI

ముహర్రం నెలలో “నెల్లూరు రొట్టెల పండగ” పేరుతో జరిగే షిర్క్ మరియు దురాచారాలు
జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2019/09/23/nellore-rottela-pandaga/

ముహర్రం నెల వాస్తవికత
https://teluguislam.net/2019/08/27/reality-of-the-month-of-muharram/
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 52-66). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్). ఇందులో కూర్చిన విషయాలు: (1) ముహర్రం నెల విశిష్టత, (2) ముహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం, (3) అహ్లె బైత్‌ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారి) విశిష్టత, (4) హజ్రత్ హసన్‌ మరియు హుసైన్‌ (రజియల్లాహు అన్హుమా) విశిష్టత, (5) కర్బలా సంఘటన, కర్బలా సంఘటన అనంతరం, (6) మరణానంతరం భాధను తెలిపే ధర్మ విధానం, (7) అతిశయిల్లటం (హద్దు మీరటం), (8) ముహర్రం నెలలో అధర్మ ఆచారాలు

ముహర్రం దురాచారాలు – గౌరవప్రదమైన మాసాల్లో ‘దౌర్జన్యం’ చేసుకోకండి [వీడియో] [6 నిముషాలు]
https://teluguislam.net/2019/08/20/bidah-in-muharram/
ఈ వీడియోలో గౌరవప్రదమైన మాసాలు ఏమిటి? వాటిలో చేసేవి, చేయరాని పనులు ఏమిటి? దౌర్జన్యం చేసుకోకండి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, అయితే దౌర్జన్యం అంటే ఏమేమి భావాలు వస్తాయి. ప్రత్యేకంగా ముహర్రంలో మన సమాజంలో జరుగుతున్న దురాచారాలు ఏమిటో తెలుపడం జరిగింది [వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)]

ముహర్రం నెలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఈ నెలతో హుస్సైన్ (రజియల్లాహు అన్హు) కు సంబంధం ఏమిటి? – ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో] [60నిముషాలు]
https://teluguislam.net/2020/08/25/muharram-ashura-sunnah-and-bidah/

ముహర్రం – సాంప్రదాయాలు, దురాచారాలు
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2012/11/20/muharram-virtues-and-bidahs/

ముహర్రం, సఫర్ మాసాలలో పెళ్లిళ్లు, శుభ కార్యాలు చేసుకోకూడదా? [ఆడియో]

హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) హంతకులెవరు? [వీడియో][50:41 నిముషాలు]
ఫజీలతుష్షేఖ్ సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2020/08/26/who-killed-al-husayn/

ముహర్రం మాసం & సహాబాల ఔన్నత్యం [వీడియో] [55 నిముషాలు]
https://teluguislam.net/2020/08/31/muharram-and-greatness-of-sahaba/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ﷺ మనవళ్లు – హసన్, హుసైన్ (రదియల్లాహు అన్హుమా) విశిష్టతలు [వీడియో]
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహర్రం నెల, సంఘటనలు, సంప్రదాయాలు| సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో]

మొహర్రం నెల మరియు ఆషూరా ఉపవాసం గొప్పతనం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బహ్]