సహాబాల మధ్య జరిగిన విభేదాలు వాటిని అధ్యయనం చేసే సరైన పద్ధతి
https://youtu.be/ggDQYVIDMU4 [71 నిముషాలు]
షేఖ్ అబూ బక్ర్ బేగ్ ఉమరీ
సహాబా (ప్రవక్త సహచరులు) ఎవరు? దివ్య ఖుర్ఆన్ వారి ఘనతను ఎలా చాటింది? వారి మధ్య తలెత్తిన విభేదాలు, యుద్ధాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి ఏమిటి? ఈ ప్రశ్నలకు ఖుర్ఆన్, హదీసు మరియు ఇమాముల వ్యాఖ్యల వెలుగులో సమాధానమిచ్చే ప్రసంగం ఇది.
విషయసూచిక
- ఈ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- సహాబా ఎవరు? ఖుర్ఆన్లో వారి ఘనత
- సహాబాల శ్రేణులు – అషర-ఎ-ముబష్షరహ్
- ఉపద్రవానికి మూలం
- హజ్రత్ అలీ, ముఅవియా (రదియల్లాహు అన్హుమా) – ఇరువురి వైఖరి
- సహాబా (రదియల్లాహు అన్హుమ్) మధ్య పొడసూపిన విభేదాల ఫలితంగా జరిగిన యుద్ధాలు
- ఆ కథనాలను అర్థం చేసుకునే నాలుగు పద్ధతులు
- నేటి విమర్శకులు – మన బాధ్యత
- చివరిగా దుఆ
- సంబంధిత పోస్టులు
ఈ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- సహాబా ఎవరు: విశ్వాస స్థితిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కలుసుకొని, విశ్వాస స్థితిలోనే మరణించినవారు సహాబా. వారు ఈ ఉమ్మత్లో అత్యుత్తమ సమూహం.
- ఖుర్ఆన్ సాక్ష్యం: అత్తౌబా 9:100, అల్ ఫత్హ్ 48:29, అల్ హష్ర్ 59:8-9 వచనాలలో అల్లాహ్ ముహాజిర్లను, అన్సార్లను ప్రశంసించాడు; వారి పట్ల తాను ప్రసన్నుడయ్యానని ప్రకటించాడు.
- సహాబాల శ్రేణులు: నలుగురు ఖలీఫాలు, అషర-ఎ-ముబష్షరహ్, బద్ర్ యోధులు, బైఅతె రిజ్వాన్లో పాల్గొన్నవారు, మక్కా విజయానికి ముందు ఇస్లాం స్వీకరించినవారు – వీరికి ప్రత్యేక స్థానం ఉంది.
- ఉపద్రవానికి మూలం: అబ్దుల్లాహ్ బిన్ సబా కుట్రల ఫలితంగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) హత్య జరిగింది; ఆ తరువాతే సహాబాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.
- అహ్లె సున్నత్ వైఖరి: సహాబాల మధ్య జరిగిన వివాదాలపై మౌనం వహించటం, వారి కొరకు దుఆ చేయటం (అల్ హష్ర్ 59:10).
- కథనాలను పరిశీలించే పద్ధతులు: కొన్ని కట్టుకథలు; కొన్ని వక్రీకరించబడినవి; ప్రామాణికమైన వాటిలో వారు ఇజ్తెహాద్ చేశారు – సరైతే రెండు పుణ్యాలు, పొరపాటైతే ఒక పుణ్యం; వారు దోషరహితులు కాకపోయినా వారి పశ్చాత్తాపం, సత్కార్యాలు వారి పొరపాట్లకు పరిహారం.
- మన బాధ్యత: సహాబాపై బురద జల్లే రచయితల మాటలకు లోనుకాకుండా, సలఫ్-ఎ-సాలిహీన్ మార్గాన్ని అనుసరిస్తూ వారి కొరకు దుఆ చేయాలి.
భాగం 1
సహాబా ఎవరు? ఖుర్ఆన్లో వారి ఘనత
సహాబీ అనే పదానికి బహువచనం సహాబా. విశ్వాస స్థితిలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కలుసుకొని, విశ్వాస స్థితిలోనే తనువు చాలించిన వారంతా సహాబా అనబడతారు.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు. వారు ఇస్లాం వైపు ముందంజ వేసినవారు, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారు, ప్రవక్తతో కలిసి ధర్మ పోరాటం చేసినవారు, షరీఅత్ బరువు బాధ్యతలను మోయటమే కాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించినవారు. ఈ కారణంగా వారు అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి. అల్లాహ్ దివ్య ఖుర్ఆన్లో వారిని ఇలా ప్రశంసించాడు:
﴿وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ﴾
“ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారికోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (అత్తౌబా 9:100)
﴿مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا﴾
“ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు.” (అల్ ఫత్హ్ 48:29)
﴿لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ هُمُ الصَّادِقُونَ﴾
“(ఈ సొమ్ము) తమ ఇల్లూ వాకిలి నుండి, తమ ఆస్తి పాస్తుల నుండి గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు వర్తిస్తుంది. (ఎందుకంటే) వారు దైవానుగ్రహాన్ని, దైవప్రసన్నతను ఆశిస్తూ, దైవానికీ, ఆయన ప్రవక్తకు తోడ్పడుతున్నారు. వారే అసలు సిసలు సత్య సంధులు.” (అల్ హష్ర్ 59:8)
﴿وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ﴾
“ఇకపోతే వీరికంటే ముందే ఈ ప్రదేశం (మదీనా)లోనూ, విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు (అన్సార్లు), ఇల్లూ వాకిలిని వదలి తమ వైపుకు వలస వచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ స్వార్థ ప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు.” (అల్ హష్ర్ 59:9)
ఈ వాక్యాల్లో అల్లాహ్ ముహాజిర్లను, అన్సార్లను మెచ్చుకున్నాడు. వారిని సత్కార్యాల వైపు ముందంజ వేసేవారుగా అభివర్ణించాడు. తాను వారి పట్ల ప్రసన్నుణ్ణి అయ్యానని, వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలను సిద్ధపరిచి ఉంచానని తెలిపాడు. ఇంకా వారిలోని సుగుణాలను తెలుపుతూ – వారు పరస్పరం దయాగుణం కలవారని, అవిశ్వాసులకు మాత్రం సింహస్వప్నమని చెప్పాడు. వారు అత్యధికంగా దైవ సన్నిధిలో సాష్టాంగపడేవారని, వారిలోని మరో ప్రత్యేకత ఏమిటంటే వారు దైవ విధేయతా చిహ్నంతో కనుగొనబడతారని, అల్లాహ్ వారిని తన ప్రవక్త సహచర్యం కొరకు ఎంపిక చేశాడని తెలిపాడు.
వారిలో ముహాజిర్లు అనబడే వారి విశిష్టత ఏమిటంటే, వారు అల్లాహ్ ప్రీతి కోసం, ధర్మసంస్థాపన కోసం తమ స్వదేశాన్ని, తమ ఆస్తిపాస్తులను వదిలి హిజ్రత్ చేశారు. అన్సార్లు అనబడే వారి ప్రత్యేకత ఏమిటంటే, మదీనావాసులైన వారు ముహాజిర్లను ఆదుకోవటంలో, దైవ ధర్మానికి తోడ్పడటంలో నిలబడ్డారు. వారిలోని ఒక గొప్ప సుగుణం ఏమిటంటే, వారు తమ ముహాజిర్ సోదరులను అమితంగా ప్రేమించేవారు. వారి ప్రేమ నిష్కల్మషమైనది, వారి అంతర్యాలలో కల్లాకపటం ఉండేది కాదు. వారు ఎల్లప్పుడూ తమకన్నా తమ సోదరులకే ప్రాధాన్యతనిచ్చేవారు. అందుకే వారు విజయభాగ్యాన్ని నోచుకున్నారు.
భాగం 2
సహాబాల శ్రేణులు – అషర-ఎ-ముబష్షరహ్
ఇవి వారందరిలోని సర్వసామాన్య సుగుణాలు. అలాగే కొన్ని ప్రత్యేక సుగుణాల దృష్ట్యా – ముఖ్యంగా ఇస్లాం కొరకు, ధర్మ పోరాటం కొరకు, హిజ్రత్ కొరకు ముందంజ వేసిన కారణంగా – వారిలో కొందరు మరికొందరి కంటే గొప్పవారుగా కీర్తించబడ్డారు. వారిలో అందరికన్నా గొప్ప సహాబీలు నలుగురు ఖలీఫాలు. ఆ తరువాత అషర-ఎ-ముబష్షరహ్ – అంటే ఈ ప్రపంచంలోనే స్వర్గ శుభవార్త పొందిన పది మంది:
- అబూబక్ర్ సిద్దీఖ్
- ఉమర్ బిన్ ఖత్తాబ్
- ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్
- అలీ బిన్ అబీ తాలిబ్
- తల్హా బిన్ ఉబైదుల్లాహ్
- జుబైర్ బిన్ అవ్వామ్
- అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్
- అబూ ఉబైదా బిన్ జర్రాహ్
- సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్
- సయీద్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హుమ్)
ముహాజిర్లకు అన్సార్లపై ఒకింత ప్రాధాన్యత ఉంది. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నవారికి, బైఅతె రిజ్వాన్లో పాల్గొన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలాగే మక్కా విజయానికి పూర్వం ఇస్లాం స్వీకరించినవారు, మక్కా విజయం తరువాత ఇస్లాం స్వీకరించిన సహాబాల కన్నా గొప్పవారు.
ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి
భాగం 3
ఉపద్రవానికి మూలం
ప్రవక్త ప్రియ సహచరుల మధ్య చీలిక రావటానికి ప్రధాన కారకులు యూదులు. వారు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. వారు వంచనా శిల్పనిష్ణాతుడైన, యమన్ దేశస్తుడైన అబ్దుల్లాహ్ బిన్ సబా అనే యూదు వ్యక్తిని దీని కొరకు సిద్ధం చేశారు. వాడు ఇస్లాం స్వీకరిస్తున్నట్లు నాటకమాడి తన చుట్టూ ఓ సుందర వలయాన్ని అల్లుకున్నాడు. తరువాత అతను తృతీయ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కు వ్యతిరేకంగా దుర్విమర్శలు చేయటం మొదలెట్టాడు. చివరకు ఆయనపై విషం కక్కాడు. ఆయనపై అపనిందలు కూడా మోపాడు. తత్ఫలితంగా సంకుచిత స్వభావులు, బలహీన విశ్వాసం గలవారు కొందరు అతని మాటల్లో పడి, అసమ్మతి వాదులుగా అతని చుట్టూ చేరారు. వారి కుట్ర మూలంగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) నిర్దాక్షిణ్యంగా హత్యచేయబడ్డారు. ఆయన (రదియల్లాహు అన్హు) అమరగతినొందిన తరువాత ముస్లిములలో విభేదాలు పొడసూపాయి. దానికి తోడు యూదులు చాపక్రింద నీరులా ప్రవహించి ప్రజలను రెచ్చగొట్టడంతో ప్రవక్త సహచరుల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వారు తమ తమ ఇజ్తెహాద్ ప్రకారం (అంటే వారిలో ప్రతి ఒక్కరూ తాము ఎన్నుకునే విధానమే సరైనదని భావించటం వల్ల) కలహాలకు, యుద్ధాలకు తెరలేచింది.
‘అఖీదయే తహావీయ’ లో ఇలా పేర్కొనబడింది : “రఫ్జ్ (షియాతత్వం) అనే ఉపద్రవాన్ని ఓ కపట విశ్వాసి సృష్టించాడు. ఇస్లాం ధర్మాన్ని రూపుమాపి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యక్తిత్వాన్ని కళంకితం చేయాలన్నది వాడి ఉద్దేశ్యం. అందుకే అబ్దుల్లాహ్ బిన్ సబా ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించగానే తన వంచనాపూరిత, మోసపూరిత చేష్టల ద్వారా ఇస్లాం ధర్మానికి తూట్లు పొడవటం మొదలెట్టాడు. క్రైస్తవ మతం పట్ల పౌలు వ్యవహరించినట్లే ఇతనూ వ్యవహరించాడు. అంటే తను ఒక మహా సాత్వికునిగా, సమాజ సంస్కరణకు నడుం బిగించినవానిగా చాటుకుని తనచుట్టూ ఓ సుందరవలయాన్ని అల్లుకున్నాడు. ఆ తరువాత హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కు వ్యతిరేకంగా అసంతృప్తవాదాన్ని వ్యాప్తింపజేసి, ఆయన్ని హతమార్చే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత ‘కూఫా’ వచ్చి, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కి వీరాభిమానిగా ప్రకటించుకుని, ఆయనను పొగడటంలో అతిశయిల్లి రాగానపడ్డాడు. ఆ విధంగా ఆయన (రదియల్లాహు అన్హు) అభిమానం చూరగొని, తన తుచ్ఛమయిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకుందామనుకున్నాడు. అతని దుర్బుద్ధి గురించి తెలియగానే హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), అతన్ని హతమార్చమని ఆదేశించారు. దాంతో వాడు ‘ఖర్ కైస్’కు పారిపోయాడు. అతని పూర్తి వృత్తాంతం చరిత్రపుటల్లో ఉంది.”
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: “హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందిన తరువాత ప్రజల గుండెలు శోకంతో అవిసిపోయాయి. ముస్లింలపై దుఃఖ పర్వతం విరుచుకుపడింది. దుష్టశక్తులు చెలరేగిపోయాయి. సజ్జనుల ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోయింది. అప్పటి వరకు అణిగిమణిగి ఉండేవారు ఉపద్రవాన్ని వ్యాప్తింపజేయటంలో కృతకృత్యులైపోయారు. సంస్కరణా సరళిని అవలంబించదలచిన వారు అశక్తులై పోయారు. అందువల్ల వారంతా ఖిలాఫత్కు అందరికన్నా ఎక్కువ అర్హులైన హజ్రత్ అలీ బిన్ అబీతాలిబ్ (రదియల్లాహు అన్హు) చేతులపై ప్రతిజ్ఞ (బైఅత్) చేశారు. కాని అప్పటికే ఉపద్రవం రాజుకుని ఉండటం వల్ల, ప్రజల హృదయాలు భగ్నమై ఉండటం వల్ల సమాజంలో సమైక్యత సాధ్యం కాలేకపోయింది. ముస్లింలలో సామూహికత వేళ్ళూనుకోలేకపోయింది. ఆనాటి ఖలీఫాగానీ, సమాజంలో మానవ నవనీతంగా పరిగణించబడే మంచివారుగాని ఎంతగా అభిలషించినప్పటికీ అనుకున్న మంచిని సాధించలేకపోయారు. విచ్ఛిన్నకరమైన ఆ వాతావరణంలో మరికొందరు స్వార్థపరులు కూడా జొరబడ్డారు. ఆ తరువాత జరగవలసినదంతా జరిగిపోయింది.” (మజ్మూఅ అల్ ఫతావా : 25/304, 305)
భాగం 4
హజ్రత్ అలీ, ముఅవియా (రదియల్లాహు అన్హుమా) – ఇరువురి వైఖరి
ఇకపోతే హజ్రత్ అలీ, ముఅవియా (రదియల్లాహు అన్హుమా)ల మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్న ప్రవక్త ప్రియ సహచరుల సంజాయిషీని వివరిస్తూ షేఖుల్ ఇస్లాం ఇలా అభిప్రాయపడ్డారు:
“ముఅవియా (రదియల్లాహు అన్హు) అలీ (రదియల్లాహు అన్హు)తో యుద్ధానికి సంసిద్ధమైనపుడు ఖిలాఫత్ తనకే చెందాలని ఆయన కోరలేదు. ఆయనకు ఖిలాఫత్ కట్టబెట్టే విషయమై బైఅత్ (ప్రతిజ్ఞ) కూడా చేయించలేదు. తానొక ఖలీఫా అనే భావనతో ఆయన యుద్ధానికి రాలేదు. ఈ విషయం గురించి ముఅవియా (రదియల్లాహు అన్హు)ను ఎవరు ప్రశ్నించినా వారి ముందు ఆయన ఇదంతా చెప్పేవారు. ఆయన అనుయాయులు కూడా అంతే. వారు అలీ (రదియల్లాహు అన్హు)తోనూ, అలీ సహచరులతోనూ యుద్ధానికి ముందంజ వేయలేదు. అదే సమయంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), మరియు ఆయన సహచరుల ఆలోచనలు మరోవిధంగా ఉన్నాయి. తానొక ఖలీఫా కావటం చేత ముఅవియా మరియు ముఅవియా సహచరులు వచ్చి తన చేతుల మీద ప్రమాణ స్వీకారం చేయాలన్నది అలీ (రదియల్లాహు అన్హు) అభిలాష. ఎందుకంటే ముస్లింలకు ఖలీఫాగా ఒకే వ్యక్తి ఉండాలి. కాని వారు తనకు విధేయత చూపటం లేదు. తన చేతిపై ‘ప్రమాణం’ చేయటం లేదు సరికదా, తమను స్వతంత్రులుగా ఊహించుకుంటున్నారు. కాబట్టి వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది, తద్వారా ముస్లింల సామాజిక వ్యవస్థ పటిష్టంగా ఉండగలుగుతుంది. ఇదీ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచన.
కాగా, హజ్రత్ ముఅవియా (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచనా తీరు తద్భిన్నంగా ఉంది. తాము అలీ (రదియల్లాహు అన్హు) చేతులపై ‘ప్రమాణం’ చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా ఒకవేళ తమతో యుద్ధం చేయబడినా తాము బాధిత ప్రజల కోవకే చెందుతాము. ఎందుకంటే తృతీయ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) దారుణంగా హత్య చేయబడ్డారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను హత్య చేయడంలో కీలకపాత్ర పోషించినవారు ప్రస్తుతం హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నారు. సైనిక విభాగంలో వారి ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది. మనం గనక ఈ సమయంలో చూస్తూ ఉండిపోతే వారు మరింతగా విజృంభించి మనపై దౌర్జన్యానికి ఒడిగట్టవచ్చు. అదే గనక జరిగితే ఖలీఫా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని నిలువరించలేరు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను ముట్టడించినపుడు అలీ (రదియల్లాహు అన్హు) ఎలా నిస్సహాయులుగా ఉండిపోయారో అలాగే ఉండిపోవచ్చు.”
భాగం 5
సహాబా (రదియల్లాహు అన్హుమ్) మధ్య పొడసూపిన విభేదాల ఫలితంగా జరిగిన యుద్ధాలు
ఈ విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి రెండు విషయాలపై ఆధారపడి ఉంది.
ఒకటి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రియసహచరుల (రదియల్లాహు అన్హుమ్) మధ్య తలెత్తిన వివాదాలపై, అవాంఛనీయ ఘటనలపై అహ్లె సున్నత్ వల్ జమాఅత్ కి చెందిన వారు నోరెత్తకుండా మౌనం వహించటమే శ్రేయస్కరమని భావిస్తారు. ఈ విషయాలపై వారు తర్జనభర్జన చేయటంగానీ, తమవైన అభిప్రాయాలు వ్యక్తపరచటం గానీ చేయరు. పైగా వారు ఇలా వేడుకుంటూ ఉంటారు:
﴿رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ﴾
“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావుడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59:10)
రెండవది: సహాబా (రదియల్లాహు అన్హుమ్) గురించి ప్రచారంలో ఉన్న కథనాలకు సమాధానాలివ్వటం.
భాగం 6
ఆ కథనాలను అర్థం చేసుకునే నాలుగు పద్ధతులు
దీనికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఇవి :
మొదటి పద్ధతి: అలాంటి కథనాలలో కొన్ని పచ్చి అబద్ధాలు. ప్రవక్త సహచరులకు అపఖ్యాతి అంటగట్టడానికి ఇస్లాం విరోధులచే సృష్టించబడిన కట్టుకథలు.
రెండవ పద్ధతి: సహాబాకు సంబంధించిన మరికొన్ని కథనాలున్నాయి. వాటిలో హెచ్చుతగ్గులు, మార్పులు చేర్పులు చేయబడ్డాయి. ఆ విధంగా వాటి రూపురేఖలనే మార్చివేయటం జరిగింది. అందులో అబద్ధం ఎక్కువ. కాబట్టి అలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా ఉండటమే శ్రేయస్కరం.
మూడవ పద్ధతి: ఆ కథనాలలో ప్రామాణికం అనదగినవి చాలా తక్కువే. ఈ విషయంలో మట్టుకు ప్రవక్త సహచరులు అశక్తులు. ఎందుకంటే వారు ఆ విషయాలలో తమ ‘ఇజ్తెహాద్’ ప్రకారం పనిచేశారు. అందులో వారు సత్యం వరకూ చేరుకున్నారు లేదా వారివల్ల పొరపాటు కూడా జరిగి ఉండవచ్చు.
ఈ ప్రయత్నంలో వారు సరైన ఆజ్ఞ వరకు చేరగలిగితే వారికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ వారు సరైన నిర్ణయానికి చేరుకోలేకపోయినప్పటికీ వారివల్ల పొరపాటు జరిగినప్పటికీ చిత్తశుద్ధితో కూడిన వారి కృషికి గాను ఒకింత పుణ్యఫలం లభిస్తుంది. మరోవైపు వారి తప్పు కూడా మన్నించబడుతుంది. ఎందుకంటే హదీసులో ఇలా అనబడింది :
«إِذَا اجْتَهَدَ الْحَاكِمُ فَأَصَابَ فَلَهُ أَجْرَانِ وَإِنْ اجْتَهَدَ فَأَخْطَأَ فَلَهُ أَجْرٌ وَاحِدٌ»
“న్యాయ నిర్ణయం గైకొనే వ్యక్తి ‘ఇజ్తెహాద్’ చేసినపుడు అతను సరైన నిర్ణయానికి చేరుకోగలిగితే అతనికి రెండుంతల ప్రతిఫలం ప్రాప్తమవుతుంది. ఒకవేళ అతని వల్ల పొరపాటు జరిగినట్లయితే అతనికి ఒకింత ప్రతిఫలం లభిస్తుంది.” (బుఖారీ, ముస్లిం)
నాల్గవ పద్ధతి: ప్రవక్త సహచరులు కూడా మానవమాత్రులే. వారివల్ల కూడా తప్పులు జరగటం సహజం. వ్యక్తిగతంగా చూస్తే వారు దోషరహితులు కారు. అయితే వారివల్ల జరిగే పొరపాట్లను పరిహరించే మరెన్నో పనులు, అంశాలున్నాయి. అవి వారి పాపాలకు పరిహారంగా ఉపయోగపడతాయి.
అలాంటి వాటిలో కొన్ని ఇవి :
- బహుశా వారు పశ్చాత్తాపపడ్డారేమో! ఎందుకంటే పశ్చాత్తాపం వాటిని రూపుమాపుతుంది.
- ఒకవేళ వారివల్ల అలాంటిదేదైనా జరిగి ఉన్నా, మరెన్నో విషయాలలో వారు ముందంజవేసి ఉన్నారు. వారివల్ల జరిగిన తప్పుల మన్నింపునకు అవి సాధనం కావచ్చు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴿إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ﴾
“నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి.” (హూద్ 11:114)
- వారి పుణ్యకార్యాలు ఇతరుల కంటే ఎన్నో రెట్లు పెంచబడవచ్చు. గొప్పతనం విషయంలో ఇతర వ్యక్తులు వారితో సరితూగలేరు. వారు మంచి కాలానికి చెందినవారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనం ద్వారానే రూఢీ అయింది. వారిలో ఎవరైనా ఒక ‘ముద్ద్’కు సమానంగా దానం చేస్తే అది ఇతరులు ఉహుద్ పర్వతానికి సమానంగా దానం చేసిన బంగారం కన్నా గొప్పది. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతోషంగా ఉంచుగాక!
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “మొత్తం అహ్లె సున్నత్ వల్ జమాఅత్ అఖీదా (విశ్వాసం) ఏమిటంటే సహాబాలలో ఏ ఒక్కరూ దోష రహితులు కారు. అలాగే ప్రవక్త బంధువులుగానీ, సహాబాలలో తొలికాలానికి చెందినవారు గానీ, ఇతరులు గానీ – వారెవరైనా వారివల్ల తప్పు జరగటం సహజం, సంభవం కూడా. అయితే అల్లాహ్ పశ్చాత్తాపం ద్వారా వారి పాపాలను క్షమిస్తాడు. వారి అంతస్తులను ఉన్నతం చేస్తాడు. అలాగే పాపాలను రూపుమాపే సత్కార్యాల ద్వారా వారిని కనికరిస్తాడు.”
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ لَهُم مَّا يَشَاءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ لِيُكَفِّرَ اللَّهُ عَنْهُمْ أَسْوَأَ الَّذِي عَمِلُوا وَيَجْزِيَهُمْ أَجْرَهُم بِأَحْسَنِ الَّذِي كَانُوا يَعْمَلُونَ﴾
“ఎవరయితే సత్యధర్మాన్ని తీసుకువచ్చాడో, మరెవరయితే దాన్ని సత్యమని ధృవీకరించాడో అటువంటి వారే భయభక్తులు గలవారు. వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే. అల్లాహ్ వారి పాపాలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సత్కార్యాలకుగాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి.” (అజ్ జుమర్ 39:33-35)
భాగం 7
నేటి విమర్శకులు – మన బాధ్యత
ప్రవక్త సహచరుల మధ్య తలెత్తిన విభేదాలను, పోరాటాలను ఇస్లాం శత్రువులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ సహాబాల వ్యక్తిత్వాలపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. వారి గౌరవ మర్యాదలను మంటగలిపేందుకు అవకాశంగా తీసుకున్నారు. అదే రకమైన నీచ స్వభావంతో ఈనాటి కొందరు రచయితలు, సోకాల్డ్ మేధావులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరు అనాలోచితంగా సహాబాపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ విధంగా వారు తమను తాము సహాబా వైఖరిపై తీర్పు చెప్పే న్యాయమూర్తులుగా ఊహించుకుంటున్నారు. తమ మనోవాంఛలకు లోబడి, కపట విమర్శకుల వ్యాఖ్యలను ఉదాహరిస్తూ కొంతమంది సహాబీలను సత్యవాదులుగా, మరికొంతమంది సహాబీలను దోషులుగా నిర్ధారిస్తున్నారు. అంతేకాదు, ఇస్లామీయ నాగరికత పట్ల తగు అవగాహన లేని కొంతమంది ముస్లిం యువకులలో ఇస్లాం యొక్క గొప్ప చరిత్ర పట్ల, తొలి కాలపు మహనీయుల పట్ల లేనిపోని అనుమానాలను కల్పిస్తున్నారు.
దీనికి బదులు వారు తొలి కాలపు సత్పురుషుల అడుగుజాడల్లో నడిచి, వారి కొరకు దుఆ చేసినట్లయితే ఎంత బాగుండేది!
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ﴾
వారి తరువాత వచ్చినవారు, వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59:10)
భాగం 8
చివరిగా దుఆ
ప్రవక్త ﷺ ప్రియసహచరులందరిపై ప్రసన్నుడవు గాక, వారి తప్పులను మన్నించి, వారి సత్కార్యాలను స్వీకరించి, ఉన్నతమైన స్వర్గంలో వారికి అత్యున్నత స్థానాలను ప్రసాదించుగాక, మరియు మాకు సహాబాల అడుగుజాడల్లో నడిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక, ముస్లిం సమాజ ఐక్యతను భగ్నం చేయాలనుకునే వారి కుట్రలను వమ్ము చేయుగాక, మాకు ఇస్లాం పై నిలకడను ప్రసాదించుగాక, సలఫ్-ఎ-సాలిహీన్ అవలంబించిన మన్హజ్ పై జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ప్రభూ! మాకు ఈ లోకంలోనూ మంచిని ప్రసాదించు, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. నరకాగ్ని శిక్ష నుండి మమ్మల్ని రక్షించు. ఆమీన్…
సంబంధిత పోస్టులు
- ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- సహాబాలు – వారి గొప్పతనం, వారి గురించి మనకు ఉండ వలసిన అఖీదా (విశ్వాసము) [ఆడియో & టెక్స్ట్]
- సహాబాలను తూలనాడటం, ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- ముహర్రం మాసం & సహాబాల ఔన్నత్యం [వీడియో]
- అల్లాహ్ మరియు ప్రవక్త ﷺ పై సహాబాల విశ్వాసం & ప్రేమ [వీడియో]