ప్రవక్త ﷺ షరీఅత్ నుండి తప్పుకోవచ్చని భావించేవారి కుఫ్ర్ మరియు అపమార్గం గురించిన ఆదేశము – ఇమామ్ ఇబ్న్ బాజ్ [పుస్తకం]

ప్రవక్త ﷺ షరీఅత్ నుండి తప్పుకోవచ్చని భావించేవారి కుఫ్ర్ మరియు అపమార్గం గురించిన ఆదేశము - షేఖ్ ఇబ్న్ బాజ్ పుస్తకం ముఖచిత్రం

రచయిత: షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
హరమైన్ షరీఫైన్ పుస్తకాలు (రిసాలతుల్ హరమైన్) | 20 పేజీలు

ఈ పుస్తకంలో షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్), ఒక వ్యక్తి ముహమ్మద్ ﷺను అనుసరించకుండా యూదుడిగానో, క్రైస్తవుడిగానో ఉంటూ కూడా సత్య ధర్మంపై ఉండవచ్చని వాదిస్తూ రాసిన ఒక పత్రికా వ్యాసానికి ఖుర్ఆన్ మరియు సున్నత్ ఆధారాలతో సమాధానం ఇచ్చారు. ముహమ్మద్ ﷺ సందేశం సమస్త మానవజాతి కొరకు అని, అది మునుపటి షరీఅత్ లన్నింటినీ రద్దు చేసిందని, ఆయన గురించి విని కూడా ఆయనను అనుసరించనివాడు కాఫిర్ అని, ఇస్లాం తప్ప మరే ధర్మమూ అల్లాహ్ వద్ద స్వీకరించబడదని ఈ పుస్తకం స్పష్టంగా వివరిస్తుంది. చివరగా వ్యాసకర్తను నిజమైన తౌబా (పశ్చాత్తాపం) చేయమని హితబోధ చేస్తుంది.

పాఠకులకు గమనిక: PDF లోని తెలుగు అనువాదంలో కనుగొన్న కొన్ని అనువాద పొరపాట్లను, అసలు అరబీ గ్రంథం «بَيَانُ كُفْرِ وَضَلَالِ مَنْ زَعَمَ أَنَّهُ يَجُوزُ لِأَحَدٍ الْخُرُوجُ عَنْ شَرِيعَةِ مُحَمَّدٍ ﷺ» (రిసాలతుల్ హరమైన్ అరబీ PDF) తో పోల్చి ఈ పోస్ట్‌లో సరిదిద్దాము. కాబట్టి, PDF కంటే ఈ పోస్ట్‌లోని పాఠాన్నే ప్రామాణికంగా పరిగణించవలసిందిగా మనవి.

ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలు

↑ మెన్యూ

  • వ్యాసం నేపథ్యం: 1415 హిజ్రీలో అష్ షర్కుల్ అవ్సత్ పత్రికలో అబ్దుల్ ఫతాహ్ అల్ హాయిక్ రాసిన వ్యాసం, ముహమ్మద్ ﷺను అనుసరించకుండా యూదుడిగానో, క్రైస్తవుడిగానో ఉంటూ కూడా సత్య ధర్మంపై ఉండవచ్చని వాదించింది.
  • ఆ వాదన స్పష్టమైన కుఫ్ర్: ధర్మంలో స్పష్టంగా తెలిసిన, గ్రంథం మరియు ఏకాభిప్రాయం (ఇజ్మా) ద్వారా నిర్ధారించబడిన విషయాన్ని తిరస్కరించటం స్పష్టమైన అవిశ్వాసం; పాలకుడు అలాంటి వ్యక్తిచే తౌబా చేయించేందుకు అతనిని న్యాయస్థానానికి పంపి, షరీఅత్ ప్రకారం తీర్పు ఇవ్వాలి.
  • ప్రవక్త ﷺ సందేశం సర్వమానవాళి కొరకు: “మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను” [అల్ ఆరాఫ్ 7:158]; “నేను ప్రజలందరి కొరకు పంపబడ్డాను” (బుఖారి, ముస్లిం).
  • మునుపటి షరీఅత్ లు రద్దు: ముహమ్మద్ ﷺ షరీఅత్ మునుపటి షరీఅత్ లన్నింటినీ రద్దు చేసింది; ఇస్లాం తప్ప వేరే ధర్మాన్ని కోరేవాని నుండి అది ఏ మాత్రమూ స్వీకరించబడదు [ఆలె ఇమ్రాన్ 3:85].
  • ప్రవక్త ﷺకు విధేయత అల్లాహ్ కు విధేయత: “ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే” [అన్నిసా 4:80].
  • విని కూడా విశ్వసించనివాడు: ఈ ఉమ్మత్ (మానవ సమాజం) లోని యూదుడైనా, క్రైస్తవుడైనా ప్రవక్త ﷺ గురించి విని కూడా ఆయన తెచ్చిన సందేశాన్ని విశ్వసించకుండా మరణిస్తే నరకవాసులలో ఒకడవుతాడు (సహీహ్ ముస్లిం).
  • ప్రవక్త ﷺ ఆచరణ: ఆయన బైతుల్ మిద్-రాస్ వద్ద యూదులను, రోమన్ల అధిపతి హిర్కల్ ను ఇస్లాం వైపు ఆహ్వానించారు; “ఇస్లాం స్వీకరించండి, మీరు రక్షించబడతారు” అని పిలుపునిచ్చారు.
  • తౌబా ద్వారం తెరిచే ఉంది: వ్యాసకర్త తన తప్పును గుర్తించి, పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ నిజమైన తౌబా చేయాలి; “ఇస్లాం (స్వీకరించటం) దానికి ముందు చేసిన పాపాలను తుడిచివేస్తుంది, మరియు తౌబా దానికి ముందు చేసిన పాపాలను తుడిచివేస్తుంది.”

పుస్తకం గురించి: ఇది రిసాలతుల్ హరమైన్ (ఉభయ పవిత్ర మస్జిదుల సందేశం) సిరీస్‌లోని ఒక సందేశము. 1415 హిజ్రీలో అష్ షర్కుల్ అవ్సత్ పత్రికలో ప్రచురించబడిన ఒక వ్యాసానికి సమాధానంగా షేఖ్ ఇబ్న్ బాజ్ (రహిమహుల్లాహ్) దీనిని రాశారు. అరబీ మూల గ్రంథం: «بَيَانُ كُفْرِ وَضَلَالِ مَنْ زَعَمَ أَنَّهُ يَجُوزُ لِأَحَدٍ الْخُرُوجُ مِنْ شَرِيعَةِ مُحَمَّدٍ ﷺ».

పూర్తి పుస్తకం

↑ మెన్యూ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

ఎవరికైనా ముహమ్మద్ ﷺ యొక్క షరీఅత్ నుండి తప్పుకోవడం అనేది అనుమతించబడుతుందని భావించే వారి అవిశ్వాసం, సత్యతిరస్కారము (కుఫ్ర్) మరియు అపమార్గం గురించిన ఆదేశము

స్తుతులన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. ప్రవక్తలలో, సందేశహరులలో చివరివారైన మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై అల్లాహ్ శుభాలను, శాంతిని వర్షింపజేయుగాక!

అమ్మా బఅద్: అష్-షర్కుల్ అవ్సత్ పత్రిక సంచిక నంబర్ 5824 (తేదీ 5/6/1415 హిజ్రీ) లో ప్రచురించబడిన ఒక వ్యాసాన్ని నేను చూశాను. దానిని అబ్దుల్ ఫతాహ్ అల్-హాయిక్ అని తనను తాను పిలుచుకునే ఒక వ్యక్తి “(తప్పుడు అవగాహన)” అనే శీర్షికతో రాశాడు.

వ్యాసం సారాంశం: ఇస్లాం ధర్మంలో అందరికీ తప్పనిసరిగా తెలిసిన, (ఖుర్ఆన్ మరియు సున్నత్ యొక్క) స్పష్టమైన ఆధారాలు (నస్) మరియు ఏకాభిప్రాయం (ఇజ్మా) ద్వారా నిర్ధారించబడిన ఒక విషయాన్ని అతడు తిరస్కరించాడు – అదే, ముహమ్మద్ ﷺ సందేశం ప్రజలందరి కొరకు అనే విషయం. ముహమ్మద్ ﷺను అనుసరించకుండా, ఆయనకు విధేయత చూపకుండా యూదుడిగానో, క్రైస్తవుడిగానో ఉండిపోయిన వ్యక్తి కూడా సత్య ధర్మంపైనే ఉన్నాడని అతడు వాదించాడు. ఆ తరువాత, సర్వలోకాల ప్రభువైన పరమ పవిత్రుడైన అల్లాహ్ అవిశ్వాసులను, పాపాత్ములను శిక్షించటంలో గల ఆయన వివేకం (హిక్మత్) విషయంలో ఆయనపై దురుసుగా మాట్లాడాడు, దానిని నిరర్థకమైన పని (అబస్) గా పేర్కొన్నాడు.

అతడు షరీఅత్ ఆధారాలను వక్రీకరించాడు, వాటిని వాటికి తగని చోట్ల అన్వయించాడు, తన మనోవాంఛ నిర్దేశించిన విధంగా వాటికి వ్యాఖ్యానం చెప్పాడు. ముహమ్మద్ ﷺ సందేశం సార్వత్రికమైనదని, ఆయన గురించి విని కూడా ఆయనను అనుసరించనివాడు కాఫిర్ అని, అల్లాహ్ ఇస్లాం తప్ప మరే ధర్మాన్నీ స్వీకరించడని తెలియజేసే షరీఅత్ ఆధారాల నుండి, స్పష్టమైన వచనాల నుండి – ఇంకా ఇటువంటి ఇతర స్పష్టమైన వచనాల నుండి – అతడు ముఖం తిప్పుకున్నాడు; అజ్ఞానులు అతడి మాటలకు మోసపోవాలని. అతడు చేసిన ఈ పని స్పష్టమైన కుఫ్ర్, ఇస్లాం నుండి వైదొలగటం (రిద్దహ్), మరియు అల్లాహ్ మాటలను, ఆయన ప్రవక్త ﷺ మాటలను అబద్ధమని తిరస్కరించటం (తక్జీబ్) – ఈ వ్యాసాన్ని చదివిన జ్ఞానం, విశ్వాసం గలవారు దీనిని గ్రహిస్తారు.

పాలకుడిపై ఉన్న విధి, బాధ్యత: అతనిచే తౌబా చేయించేందుకు అతనిని న్యాయస్థానానికి పంపించటం, మరియు పవిత్ర షరీఅత్ నిర్దేశించే విధంగా అతనిపై తీర్పు ఇవ్వటం.

ప్రవక్త ﷺ సందేశం సర్వమానవాళి కొరకు

↑ మెన్యూ

పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ ముహమ్మద్ ﷺ యొక్క సార్వత్రిక సందేశాన్ని (రిసాలత్) మరియు మానవులు, జిన్నాతులు అందరూ ఆయనను అనుసరించడం తప్పనిసరి అని స్పష్టంగా తెలియజేశాడు. ఇస్లాం గురించి కనీస జ్ఞానం ఉన్న ఏ ముస్లింకైనా ఇది తెలియని విషయం కాదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

﴿قُلْ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّى رَسُولُ ٱللَّهِ إِلَيْكُمْ جَمِيعًا ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِۦ وَيُمِيتُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِ ٱلنَّبِىِّ ٱلْأُمِّىِّ ٱلَّذِى يُؤْمِنُ بِٱللَّهِ وَكَلِمَٰتِهِۦ وَٱتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ ١٥٨﴾

“(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: “మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు!” [అల్ ఆరాఫ్ 7:158]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿…وَأُوحِىَ إِلَىَّ هَٰذَا ٱلْقُرْءَانُ لِأُنذِرَكُم بِهِۦ وَمَنۢ بَلَغَۚ…﴾

“… మరియు మిమ్మల్ని మరియు ఇది (ఈ సందేశం) అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి, ఈ ఖుర్ఆన్ నాపై అవతరింపజేయబడింది…” [అల్ అన్’ఆమ్ 6:19]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِى يُحْبِبْكُمُ ٱللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْۚ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ ٣١﴾

“(ఓ ప్రవక్తా!) ఇలా అను: “మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” [ఆలె ఇమ్రాన్ 3:31]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿وَمَن يَبْتَغِ غَيْرَ ٱلْإِسْلَٰمِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِى ٱلْءَاخِرَةِ مِنَ ٱلْخَٰسِرِينَ ٨٥﴾

“మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.” [ఆలె ఇమ్రాన్ 3:85]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَمَآ أَرْسَلْنَٰكَ إِلَّا كَآفَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا…﴾

“మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము…” [సబా 34:28]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَمَآ أَرْسَلْنَٰكَ إِلَّا رَحْمَةً لِّلْعَٰلَمِينَ ١٠٧﴾

“మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.” [అల్ అంబియా 21:107]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿…وَقُل لِّلَّذِينَ أُوتُواْ ٱلْكِتَٰبَ وَٱلْأُمِّيِّۦنَ ءَأَسْلَمْتُمْۚ فَإِنْ أَسْلَمُواْ فَقَدِ ٱهْتَدَواْۖ وَإِن تَوَلَّوْاْ فَإِنَّمَا عَلَيْكَ ٱلْبَلَٰغُۗ وَٱللَّهُ بَصِيرٌۢ بِٱلْعِبَادِ﴾

“మరియు గ్రంథప్రజలతో మరియు నిరక్షరాస్యులతో (చదువురాని అరబ్బులతో): “ఏమీ? మీరు కూడా విధేయులయ్యారా?” అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందిన వారవుతారు. కాని ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే! మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.” [ఆలె ఇమ్రాన్ 3:20]

అల్లాహ్ సెలవిచ్చాడు:

﴿تَبَارَكَ ٱلَّذِى نَزَّلَ ٱلْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِۦ لِيَكُونَ لِلْعَٰلَمِينَ نَذِيرًا ١﴾

“సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు!” [ఫుర్ఖాన్ 25:1]

బుఖారీ మరియు ముస్లిం: జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త ﷺ ఇలా పలికినారు:

«أُعْطِيتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ قَبْلِي: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيرَةَ شَهْرٍ، وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا، فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ، فَلْيُصَلِّ، وَأُحِلَّتْ لِيَ الْمَغَانِمُ، وَلَمْ تُحَلَّ لِأَحَدٍ قَبْلِي، وَأُعْطِيتُ الشَّفَاعَةَ، وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً، وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً».

“నాకు ఐదు విషయాలు ప్రత్యేకించి ప్రసాదించబడినాయి. అవి ఇంతకు ముందు గడిచిన ఏ ప్రవక్తకూ ఇవ్వబడలేదు: 1. ఒక నెల ప్రయాణ దూరంలో ఉన్న శత్రువుల హృదయాలలో కూడా భయం కలిగించటం ద్వారా నాకు సహాయం చేయబడింది. 2. భూమి మొత్తం నాకు మస్జిద్ గా (నమాజు స్థలంగా) మరియు పరిశుద్ధపరిచేదిగా చేయబడింది, కాబట్టి నా సమాజానికి చెందిన వ్యక్తికి నమాజు సమయం అయినప్పుడు, అతడు నమాజు ఆచరించాలి. 3. నాకు ముందు ఎవరికీ ధర్మసమ్మతం కాని యుద్ధప్రాప్తి సొమ్ము (గనీమత్) నాకు ధర్మసమ్మతం చేయబడింది. 4. నాకు షఫాఅత్ (సిఫారసు చేసే అధికారం) ప్రసాదించబడింది. 5. ప్రవక్తలు ఒక జాతి కోసం ప్రత్యేకించి పంపబడేవారు, కానీ నేను ప్రజలందరి కొరకు పంపబడ్డాను.”

ముహమ్మద్ ﷺ షరీఅత్ మునుపటి షరీఅత్ లన్నింటినీ రద్దు చేసింది

↑ మెన్యూ

ఇవి మన ప్రవక్త ముహమ్మద్ ﷺ సందేశం మానవులందరికీ వర్తిస్తుందని, అందరినీ కలుపుకుంటుందని, అది మునుపటి షరీఅత్ లన్నింటినీ రద్దు చేసిందని, ముహమ్మద్ ﷺను అనుసరించని, ఆయనకు విధేయత చూపనివాడు అవిధేయుడైన కాఫిర్ అని, ఆయన శిక్షకు అర్హుడని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿…وَمَن يَكْفُرْ بِهِۦ مِنَ ٱلْأَحْزَابِ فَٱلنَّارُ مَوْعِدُهُۥۚ…﴾

“మరియు దీనిని (ఖుర్ఆన్ ను) తిరస్కరించే తెగల వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే!” [హూద్ 11:17]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿…فَلْيَحْذَرِ ٱلَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِۦٓ أَن تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ﴾

“… ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి.” [అన్నూర్ 24:63]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَمَن يَعْصِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَتَعَدَّ حُدُودَهُۥ يُدْخِلْهُ نَارًا خَٰلِدًا فِيهَا وَلَهُۥ عَذَابٌ مُّهِينٌ ١٤﴾

“మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.” [అన్నిసా 4:14]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿…وَمَن يَتَبَدَّلِ ٱلْكُفْرَ بِٱلْإِيمَٰنِ فَقَدْ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ﴾

“మరియు ఎవడైతే, సత్యతిరస్కారాన్ని, విశ్వాసానికి బదులుగా స్వీకరిస్తాడో! నిశ్చయంగా, వాడే సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడు.” [అల్ బఖరహ్ 2:108]

ఈ అర్థంలో ఆయతులు చాలా ఉన్నాయి.

ప్రవక్త ﷺకు విధేయత – అల్లాహ్ కు విధేయత

↑ మెన్యూ

పరమ పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్త ﷺకు విధేయత చూపటాన్ని తనకు విధేయత చూపటంతో జతచేశాడు. ఇస్లాం కాకుండా వేరే ధర్మాన్ని విశ్వసించేవాడు నష్టపోయేవాడని, అతని నుండి ఏ ఆచరణా (సర్ఫ్), ఏ పరిహారమూ (అద్ల్) స్వీకరించబడదని స్పష్టపరిచాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ ٨٥﴾

“మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప మరే ఇతర ధర్మాన్నైనా అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపోయే వారిలో చేరుతాడు.” [ఆలె ఇమ్రాన్ 3:85]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿…مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ…﴾

“ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే.” [అన్నిసా 4:80]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿قُلْ أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُم مَّا حُمِّلْتُمْ وَإِن تُطِيعُوهُ تَهْتَدُوا…﴾

“వారితో అను: “అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు మరలిపోతే, అతనిపై (ప్రవక్తపై) విధించబడిన దాని బాధ్యత అతనిది; మరియు మీపై విధించబడిన దాని బాధ్యత మీది. మీరు అతనిని (ప్రవక్తను) అనుసరిస్తే మార్గదర్శకత్వం (తప్పక) పొందుతారు.” [అన్నూర్ 24:54]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أُوْلَئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ ٦﴾

“నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి విసిరి వేయబడతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.” [అల్ బయ్యినహ్ 98:6]

ఇమామ్ ముస్లిం రహిమహుల్లాహ్ తన సహీహ్ గ్రంథములో రసూలుల్లాహ్ ﷺ ఇలా ప్రవచించారని నమోదు చేసినారు:

«وَالَّذِي نَفْسِي بِيَدِهِ؛ لَا يَسْمَعُ بِي أَحَدٌ مِنْ هَذِهِ الْأُمَّةِ، يَهُودِيٌّ وَلَا نَصْرَانِيٌّ، ثُمَّ يَمُوتُ وَلَمْ يُؤْمِنْ بِالَّذِي أُرْسِلْتُ بِهِ؛ إِلَّا كَانَ مِنْ أَهْلِ النَّارِ».

“ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా, ఈ ఉమ్మత్ (మానవ సమాజం) లోని యూదుడైనా లేదా క్రైస్తవుడైనా, నా గురించి విని కూడా, నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే మరణిస్తే, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”

యూదులను, క్రైస్తవులను ఇస్లాం వైపు ఆహ్వానించటం

↑ మెన్యూ

ప్రవక్త ﷺ తన ఆచరణల ద్వారా మరియు మాటల ద్వారా ఇస్లాం ధర్మంలో ప్రవేశించని వారి ధర్మం అసత్యమైనదని (బాతిల్) స్పష్టంగా తెలియజేశారు. ఆయన యూదులు మరియు క్రైస్తవులతో పాటు ఇతర అవిశ్వాసులతో కూడా యుద్ధం చేశారు, మరియు వారిలో జిజియా చెల్లించిన వారి నుండి దానిని స్వీకరించారు; వారు తమలోని మిగతా వారికి ఇస్లాం సందేశం చేరకుండా అడ్డుకోకుండా ఉండేందుకు, మరియు వారిలో ఎవరైనా ఇస్లాం స్వీకరించదలిస్తే – తన జాతి వారు తనను అడ్డుకుంటారనీ, ఆపుతారనీ లేదా చంపుతారనీ భయం లేకుండా స్వీకరించగలిగేందుకు.

బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖన, అబీ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము మస్జిద్ లో ఉన్నప్పుడు రసూలుల్లాహ్ ﷺ బయటకు వచ్చి ఇలా పలికినారు:

«انْطَلِقُوا إِلَى يَهُودَ، فَخَرَجْنَا مَعَهُ حَتَّى جِئْنَا بَيْتَ الْمِدْرَاسِ، فَقَامَ النَّبِيُّ ﷺ، فَنَادَاهُمْ فَقَالَ: يَا مَعْشَرَ يَهُودَ، أَسْلِمُوا تَسْلَمُوا، فَقَالُوا: قَدْ بَلَّغْتَ يَا أَبَا الْقَاسِمِ، فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ ﷺ: ذَلِكَ أُرِيدُ، أَسْلِمُوا تَسْلَمُوا، فَقَالُوا: قَدْ بَلَّغْتَ يَا أَبَا الْقَاسِمِ، فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ ﷺ: ذَلِكَ أُرِيدُ، ثُمَّ قَالَهَا الثَّالِثَةَ…».

“«యూదుల వద్దకు వెళ్ళండి». అప్పుడు మేము ఆయనతో బయలుదేరి బైతుల్ మిద్-రాస్ వద్దకు చేరుకున్నాము. ప్రవక్త ﷺ నిలబడి వారిని పిలిచారు: «ఓ యూదుల సమూహమా! ఇస్లాం స్వీకరించండి, మీరు సురక్షితంగా ఉంటారు». వారు: “ఓ అబూ అల్ – ఖాసిం, మీరు సందేశాన్ని అందించారు” అని అన్నారు. దానికి రసూలుల్లాహ్ ﷺ: «అదే నేను కోరుకుంటున్నాను, ఇస్లాం స్వీకరించండి, మీరు సురక్షితంగా ఉంటారు» అని అన్నారు. వారు మళ్ళీ: “ఓ అబూ అల్ – ఖాసిం, మీరు సందేశాన్ని అందించారు” అని అన్నారు. దానికి రసూలుల్లాహ్ ﷺ: «అదే నేను కోరుకుంటున్నాను» అని మూడోసారి అన్నారు.” (హదీథు)

ఉద్దేశ్యం ఏమిటంటే: ప్రవక్త ﷺ యూదులలోని ధర్మపండితుల వద్దకు, వారి బైతుల్ మిద్రాస్ (విద్యాలయం) కు వెళ్ళి, వారిని ఇస్లాం వైపు ఆహ్వానించారు మరియు ‘ఇస్లాం స్వీకరించండి, సురక్షితంగా ఉంటారు’ అని పలుమార్లు పునరావృతం చేశారు.

అలాగే: ప్రవక్త ముహమ్మద్ ﷺ తన లేఖను హిర్కల్ కు పంపి, అతనిని ఇస్లాం వైపుకు ఆహ్వానించారు, మరియు అతను నిరాకరిస్తే, అతని నిరాకరణ కారణంగా ఇస్లాం స్వీకరించని అతడి ప్రజల పాపం అతనిపై ఉంటుందని తెలియజేశారు. బుఖారీ మరియు ముస్లిం తమ సహీహ్ గ్రంథాలలో ఇలా ఉల్లేఖించారు: హిర్కల్ అల్లాహ్ ప్రవక్త ﷺ లేఖను తెప్పించి చదివాడు. అందులో ఇలా ఉంది:

«بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ، مِنْ مُحَمَّدٍ رَسُولِ اللَّهِ إِلَى هِرَقْلَ عَظِيمِ الرُّومِ، سَلَامٌ عَلَى مَنِ اتَّبَعَ الْهُدَى، أَمَّا بَعْدُ: فَإِنِّي أَدْعُوكَ بِدِعَايَةِ الْإِسْلَامِ، أَسْلِمْ تَسْلَمْ، وَأَسْلِمْ يُؤْتِكَ اللَّهُ أَجْرَكَ مَرَّتَيْنِ، فَإِنْ تَوَلَّيْتَ، فَإِنَّ عَلَيْكَ إِثْمَ الْأَرِيسِيِّينَ وَ

“బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం! దైవప్రవక్త ముహమ్మద్ ﷺ తరఫు నుంచి ‘రోమన్ల అధిపతి హిర్కల్’ కు! అస్సలాము అలా మనిత్తబఅల్ హుదా (సన్మార్గం పై ఉన్నవారిపై శాంతి కురియుగాక)! వ్రాయునది ఏమనగా- నిశ్చయంగా నేను మిమ్మల్ని ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తున్నాను, ఇస్లాం స్వీకరించండి శాంతిని పొందుతారు, అల్లాహ్ మీకు రెండింతల పుణ్యాలను ప్రసాదిస్తాడు, ఒకవేళ మీరు నిరాకరిస్తే అరీసియ్యీన్ (మీ ప్రజలు / రైతుల) పాపం కూడా మీపై ఉంటుంది,”

﴿يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ تَعَالَوْاْ إِلَىٰ كَلِمَةٍ سَوَآءٍۭ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشْرِكَ بِهِۦ شَيْـًٔا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ ٱللَّهِۚ فَإِن تَوَلَّوْاْ فَقُولُواْ ٱشْهَدُواْ بِأَنَّا مُسْلِمُونَ ٦٤﴾

“ఓ గ్రంథప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య సమానమైన ఒక మాట (కలిమహ్) వైపునకు రండి, అది ఏమిటంటే: “మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మన వారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు.” వారు (సమ్మతించక) తిరిగి పోతే: “నిశ్చయంగా మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి.” అని పలుకు.” [ఆలె ఇమ్రాన్ 3:64]

తరువాత వారు తిరస్కరించి ఇస్లాంలో ప్రవేశించడానికి నిరాకరించినప్పుడు; ప్రవక్త ﷺ మరియు ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ వారితో ధర్మపోరాటం జరిపారు, మరియు వారిపై జిజియా విధించారు.

యూదులు, క్రైస్తవులు మార్గభ్రష్టులని, ముహమ్మద్ ﷺ ధర్మం ద్వారా రద్దు చేయబడిన అసత్య ధర్మంపై వారు ఉన్నారని ధృవీకరించటానికి, అల్లాహ్ ప్రతి ముస్లింను ప్రతి రోజు, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో (సూరతుల్ ఫాతిహా ద్వారా) ఇలా అర్థించమని ఆదేశించాడు:

మొదటిది: సరైన, అల్లాహ్ వద్ద స్వీకరించబడే రుజుమార్గం (అస్-సిరాతల్ ముస్తఖీమ్) వైపు తనకు మార్గదర్శకత్వం చేయమని. ఆ రుజుమార్గం ఇస్లాం.

రెండవది: ‘అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారి’ (అల్-మగ్దూబి అలైహిమ్) మార్గం నుండి తనను దూరంగా ఉంచమని. వీరు యూదులు మరియు వారి వంటి వారు. తాము అసత్యంపై ఉన్నామని తెలిసి కూడా వారు దానిపైనే మొండిగా కొనసాగుతారు.

మూడవది: ‘మార్గభ్రష్టుల’ (అద్-దాల్లీన్) మార్గం నుండి తనను దూరంగా ఉంచమని. వీరు జ్ఞానం లేకుండా ఆరాధన చేస్తూ, తాము సన్మార్గంపై ఉన్నామని భావిస్తారు; కానీ వాస్తవానికి వారు మార్గభ్రష్టతపై ఉన్నారు. వీరు క్రైస్తవులు మరియు అజ్ఞానంతో, మార్గభ్రష్టతతో ఆరాధించే ఇతర జాతుల వారు.

ఇదంతా ఎందుకంటే: ఇస్లాం తప్ప మిగతా ప్రతి ధర్మమూ అసత్యమైనదని, ఇస్లాం కాకుండా వేరే విధంగా అల్లాహ్ ను ఆరాధించే ప్రతి ఒక్కరూ మార్గభ్రష్టులేనని ముస్లిం దృఢ నిశ్చయంతో తెలుసుకోవాలి. దీనిని విశ్వసించనివాడు ముస్లింలలోని వాడు కాడు. ఈ విషయంలో ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో అనేక ఆధారాలు ఉన్నాయి.

వ్యాసకర్తకు హితబోధ – నిజమైన తౌబా

↑ మెన్యూ

కాబట్టి, వ్యాసకర్త అబ్దుల్ ఫతాహ్ పై విధి ఏమిటంటే: అతను వెంటనే నిష్కల్మషమైన తౌబా (తౌబతన్ నసూహా) చేయాలి, మరియు తన తౌబాను ప్రకటిస్తూ ఒక వ్యాసం రాయాలి. ఎవరైతే అల్లాహ్ వైపు సత్యమైన తౌబాతో మరలుతాడో, అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు; అల్లాహ్ సుబ్ హానహు వ తఆలా యొక్క వాక్కు:

﴿…وَتُوبُوٓاْ إِلَى ٱللَّهِ جَمِيعًا أَيُّهَ ٱلْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ﴾

“మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు!” [అన్నూర్ 24:31]

మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

﴿وَٱلَّذِينَ لَا يَدْعُونَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ وَلَا يَقْتُلُونَ ٱلنَّفْسَ ٱلَّتِى حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلْحَقِّ وَلَا يَزْنُونَۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ يَلْقَ أَثَامًا ٦٨ يُضَٰعَفْ لَهُ ٱلْعَذَابُ يَوْمَ ٱلْقِيَٰمَةِ وَيَخْلُدْ فِيهِۦ مُهَانًا ٦٩ إِلَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ عَمَلًا صَٰلِحًا فَأُوْلَٰٓئِكَ يُبَدِّلُ ٱللَّهُ سَيِّـَٔاتِهِمْ حَسَنَٰتٍۗ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا ٧٠﴾

“మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు. కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” [ఫుర్ఖాన్ 25:68-70]

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:

«الْإِسْلَامُ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ، وَالتَّوْبَةُ تَهْدِمُ مَا كَانَ قَبْلَهَا».

“ఇస్లాం (స్వీకరించటం) దానికి ముందు చేసిన పాపాలను తుడిచివేస్తుంది, మరియు తౌబా దానికి ముందు చేసిన పాపాలను తుడిచివేస్తుంది.”

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:

«التَّائِبُ مِنَ الذَّنْبِ كَمَنْ لَا ذَنْبَ لَهُ».

“పాపం నుండి పశ్చాత్తాపం పడినవాడు, అసలు పాపమే చేయనివాడి వంటివాడు.”

ఈ అర్థంలో ఆయతులు మరియు హదీథులు చాలా ఉన్నాయి.

మరియు నేను అల్లాహ్ తో ఆయన మాకు సత్యమును సత్యముగా చూపించి, దాన్ని అనుసరించే భాగ్యమును కలిగించమని, మాకు అసత్యమును అసత్యముగా చూపించి, దాని నుండి దూరంగా ఉండే భాగ్యమును కలిగించమని, మాకు, వ్యాసకర్త అబ్దుల్ ఫతాహ్ కు మరియు ముస్లింలందరికీ నిష్కల్మషమైన తౌబా భాగ్యాన్ని ప్రసాదించమని, మరియు మనందరినీ మార్గభ్రష్టతకు గురిచేసే ఫిత్నాల నుండి, మనోవాంఛలను మరియు షైతాన్ ను అనుసరించటం నుండి కాపాడమని అర్థిస్తున్నాను. నిశ్చయంగా ఆయన మాత్రమే దీని కొరకు కార్యసాధకుడు మరియు దాని సామర్థ్యం కలవాడు.

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, ప్రళయదినం వరకు చిత్తశుద్ధితో ఆయనను అనుసరించేవారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక. (ఆమీన్)

↑ మెన్యూ

ఇతర పుస్తకాల కోసం చూడండి: హరమైన్ షరీఫైన్ పుస్తకాలు