దైవ దూతల పట్ల విశ్వాసం – సలీమ్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దైవ దూతల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీమ్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/MiDl95p280k [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాస మూలస్తంభాలలో రెండవది అయిన దైవదూతల పట్ల విశ్వాసం గురించి వివరించబడింది. దైవదూతలు ఎవరనేది, వారి లక్షణాలు, వారి పుట్టుక, వారి సంఖ్య, మరియు వారి శక్తి సామర్థ్యాల గురించి చర్చించబడింది. దైవదూతలు కాంతితో సృష్టించబడినవారని, వారు పాపాలు చేయరని, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను ఆరాధిస్తారని చెప్పబడింది. వారి సంఖ్య అపారమని, ప్రతిరోజు 70,000 మంది దైవదూతలు ‘బైతే మామూర్’లో ఆరాధన చేస్తారని హదీసు ద్వారా వివరించబడింది. చివరగా, జిబ్రీల్, మీకాయీల్, ఇస్రాఫీల్, మల‌కుల్ మౌత్ వంటి కొంతమంది ముఖ్యమైన దైవదూతల పేర్లు, వారి బాధ్యతల గురించి కూడా తెలియజేయబడింది.

అల్ హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని రెండవ ముఖ్యాంశం, దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం.

ఇంతకు ముందు కూడా మనము హదీసు విని ఉన్నాం, జిబ్రీల్ అలైహిస్సలాం, దైవదూత, మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్ గురించి, విశ్వాసం గురించి తెలియజేస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, దైవదూతలను విశ్వసించటం, దైవ గ్రంథాలను విశ్వసించటం, దైవ ప్రవక్తలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి-చెడు విధివ్రాతను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని సమాధానం ఇచ్చినప్పుడు, దైవదూత, “మీరు చెప్పింది నిజమే” అని ధ్రువీకరించారు.

అయితే, ప్రవక్త వారు తెలియజేసిన ఆరు విషయాలలో నుంచి రెండవ విషయం దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

దైవదూతలు ఎవరు? దైవదూతల లక్షణాలు ఏమిటి? దైవదూతల పుట్టుక ఎలా జరిగింది? దైవదూతల సంఖ్య ఎంత? దైవదూతల శక్తి సామర్థ్యాలు ఏమిటి? కొంతమంది దైవదూతల పేర్లు మరియు బాధ్యతలు, ఇవన్నీ విషయాలు ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

ముందుగా, దైవదూతలు ఎవరు అనేది తెలుసుకుందాం. దైవదూతలు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. మానవులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, జంతువులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, పక్షులు ఒక ప్రాణి, జలచరాలు ఒక ప్రాణి. అలాగే, దైవదూతలు కూడా అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. దైవదూతలు మానవుల కంటికి కనిపించరు. అయితే, దైవదూతలు ఉన్నారు అనేది వాస్తవము కాబట్టి, ఆ వాస్తవాన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి.

దైవదూతల లక్షణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దైవదూతలు పుణ్యాత్ములు, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను స్మరిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. అల్లాహ్ ఆదేశాలను అతిక్రమించటం, పాపాలకు పాల్పడటం దైవదూతలకు రాదు. ఖురాన్ గ్రంథం, ఆరవ అధ్యాయం 66వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు:

لَّا يَعْصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
[లా య’సూనల్లాహ మా అమరహుమ్ వ యఫ్’అలూన మా యు’మరూన్]
అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏ మాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాటిస్తారు, పాలిస్తారు.

చూశారా? అల్లాహ్ వారికి ఇచ్చిన బాధ్యత వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించటం వారికి రాదు. పాపాలు చేయటం, అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించటం వారికి రానే రాదు.

దైవదూతలకు మానవుల లాంటి లక్షణాలు ఉండవు. ఉదాహరణకు, కామం, ఆకలి, దప్పిక, అలసట, నిద్ర మొదలైన అవసరాలు దైవదూతలకు ఉండవు. ఇవన్నీ మానవులకు ఉంటాయి, కానీ దైవదూతలకు అలాంటి అవసరాలు, లక్షణాలు లేవు అని తెలుపబడింది.

మరి దైవదూతల పుట్టుక ఎలా జరిగింది అని మనం చూచినట్లయితే, దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో సృష్టించాడు. మానవులను దేనితో సృష్టించాడు? మట్టితో మానవులను సృష్టించాడు. ఇది మనం తెలుసుకొని ఉన్నాం ముందు ప్రసంగాలలో. దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో పుట్టించాడు, నూర్, కాంతితో పుట్టించాడు. మనం చూచినట్లయితే, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

خُلِقَتِ الْمَلَائِكَةُ مِنْ نُورٍ
[ఖులిఖతిల్ మలాయికతు మిన్ నూర్]
దైవదూతలు నూర్ అనగా కాంతితో పుట్టించబడ్డారు, సృష్టించబడ్డారు.

దైవదూతలలో ఆడ-మగ అనే లింగభేదము లేదు. కావున, దైవదూతల మధ్య వివాహాలు జరగవు. వివాహాలు జరగవు కాబట్టి, వారిలో వంశపరంపర కూడా లేదు. ఇది దైవదూతల గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం.

ఇక, దైవదూతల సంఖ్య ఎంత ఉంది? మానవులను ఫలానా దేశంలో ఇంతమంది ఉన్నారు, ఫలానా దేశంలో అంతమంది జనాభా ఉన్నారు మానవులు అని లెక్కింపు అనేది మనం చూస్తూ ఉంటాం. మరి, దైవదూతల లెక్కింపు ఎవరైనా చేశారా? దైవదూతలు ఎంతమంది ఉన్నారు? అంటే, మనం చూచినట్లయితే, దైవదూతల సంఖ్య చాలా ఎక్కువ. అది ఎలాగంటే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రెండు హదీసులు మీ ముందర నేను ఉంచుతున్నాను చూడండి.

మేరాజ్ యాత్రలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆకాశాల పైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ‘బైతే మామూర్’ ఒక పుణ్యక్షేత్రము ఆకాశాల పైన ఉంది, అది చూపించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ, “ఓ దైవ ప్రవక్తా, ఈ బైతే మామూర్‌లో ప్రతి రోజూ 70,000 మంది దైవదూతలు ఆరాధనలో పాల్గొంటారు. ఒక్కసారి ఆ బైతే మామూర్ పుణ్యక్షేత్రంలో ఆరాధన ముగించుకొని ఆ 70,000 మంది దైవదూతలు బయటికి వచ్చేస్తే, మళ్ళీ వారికి అక్కడ వెళ్లి ఆరాధన చేసుకోవడానికి వంతు రాదు. అంటే ప్రళయం వచ్చేస్తుంది గానీ, ఒక్కసారి అక్కడ ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత, ఆ దైవదూతలకు మరొకసారి అక్కడ అవకాశం దొరకదు, వారి వంతు రాదు,” అన్నారు. ఆ ప్రకారంగా ఎంతమంది దైవదూతలు ఉన్నారో మనము ఇట్టే ఆలోచించవచ్చు.

మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

مَا فِيهَا مَوْضِعُ أَرْبَعِ أَصَابِعَ إِلَّا وَمَلَكٌ قَائِمٌ أَوْ رَاكِعٌ أَوْ سَاجِدٌ
[మా ఫీహా మౌదివు అర్‌బయి అసాబిఇన్ ఇల్లా వ మలకున్ ఖాయిమున్ అవ్ రాకివున్ అవ్ సాజిదున్]
దీని అర్థం ఏమిటంటే, ఆకాశం దైవదూతలతో నిండి కిటకిటలాడుతున్నది. ప్రతి నాలుగు వ్రేళ్లంతటి స్థానంలో ఒక దైవదూత ఖియాంలో, రుకూలో, సజ్దాలో నిమగ్నమై ఉన్నాడు.

అంటే, ప్రతి బెత్తెడు, నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక్కొక్క దూత నిలబడి ఉన్నాడు ఆకాశం మీద అంటే, ఆకాశం ఎంత పెద్దది? అంత పెద్ద ఆకాశంలో ప్రతి నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక దైవదూత నిలబడి ఉన్నారంటే, మరి వారి సంఖ్య ఎంత? మనం లెక్క చేయలేము. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మనం లెక్క చేయలేము. నక్షత్రాల కంటే బహుశా దైవదూతలు ఎక్కువ ఉన్నారేమో. కాబట్టి, దైవదూతల సరైన లెక్కింపు ఎవరికీ తెలియజేయబడలేదు. వారి లెక్కింపు అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఈ విషయం కూడా మనము గట్టిగా విశ్వసించాలి, నమ్మాలి.

ఇక, దైవదూతల శక్తి సామర్థ్యాల గురించి మనము చూచినట్లయితే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప గొప్ప శక్తులు ప్రసాదించాడు. దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. కొంతమంది దైవదూతలకు రెండు రెక్కలు ఉంటాయి, మరికొంత మందికి నాలుగు, ఆ తర్వాత అలాగే ఎంత పెద్ద దైవదూత ఉంటే అన్ని ఎక్కువ రెక్కలు వారికి ఉంటాయి అని తెలుపబడింది. మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథం 35వ అధ్యాయం, ఒకటవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

جَاعِلِ ٱلْمَلَٰٓئِكَةِ رُسُلًا أُو۟لِىٓ أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَ ۚ يَزِيدُ فِى ٱلْخَلْقِ مَا يَشَآءُ
[జాయిలిల్ మలాయికతి రుసులన్ ఉలీ అజ్నిహతిమ్ మస్నా వ సులాస వ రుబాఅ. యజీదు ఫిల్ ఖల్కి మా యషా]
ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు.

అంటే దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. వారి రెక్కలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతూ పోయాడు అన్న విషయము ఇక్కడ తెలుపబడింది. మనము బుఖారీ, ముస్లింలో ఉన్న ఉల్లేఖనాన్ని చూసినట్లయితే, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “మేరాజ్ యాత్రలో భాగంగా నేను ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో నేను ఆయనను చూశాను.” జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త వారు ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో చూశారు. నిజ స్వరూపంలో చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, జిబ్రీల్ అలైహిస్సలాం వారికి ఆరు వందల రెక్కలు ఉన్నాయి. అల్లాహు అక్బర్! ఆరు వందల రెక్కలు ఆయన ఒక్కరికే ఉన్నాయంటే, ఆయన ఎంత గొప్ప, పెద్ద దైవదూతనో మనము అర్థం చేసుకోవచ్చు.

అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రూపాలు ధరించే శక్తి కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ రూపము ధరించి వచ్చి దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. కొన్ని సందర్భాలలో ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు శిష్యులు, సహాబాలు కూడా జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మానవ రూపంలో చూశారు. అలాంటి ఉదాహరణలు మనము ప్రసంగాలలో విని ఉన్నాం.

అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వేగంగా కదిలే, ప్రయాణించే శక్తి ఇచ్చాడు. దైవదూతలు భూమి ఆకాశాల మధ్య రాకపోకలు జరుపుతూ ఉంటారు. భూమి ఆకాశాల మధ్య ఎంతో, భూమి ఆకాశాల మధ్య ఎంతో దూరము ఉంది. అంత దూరాన్ని వారు క్షణాలలో ఛేదించేస్తూ ఉంటారు. వారు అంత స్పీడుగా, వేగంగా వస్తూ వెళుతూ ఉంటారు. అంత వేగంగా కదిలే శక్తి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతలకు ఇచ్చి ఉన్నాడు. ఇవి దైవదూతల యొక్క లక్షణాలు, దైవదూతల యొక్క శక్తి సామర్థ్యాలు.

ఇక, కొంతమంది దైవదూతల పేర్లు మరియు వారి బాధ్యతల ప్రస్తావన కూడా గ్రంథాలలో వచ్చి ఉంది. అవి తెలుసుకొని ఇన్ షా అల్లాహ్ మాటను ముగిద్దాం.

దైవదూతలలో జిబ్రీల్ అలైహిస్సలాం వారు దైవదూతలందరిలో గొప్పవారు మరియు దైవదూతలందరికీ ఆయన నాయకుడు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. మరి జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క బాధ్యత ఏమిటంటే, అల్లాహ్ వద్ద నుండి వాక్యాలు తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. అలాగే, ఇతర బాధ్యతలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చినప్పుడు, ఆ బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చేవారు. ముఖ్యంగా, దైవ వాక్యాలు అల్లాహ్ నుండి తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు వినిపించటము ఆయన నిర్వహించిన గొప్ప బాధ్యత.

మీకాయీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వర్షం కురిపించే బాధ్యత ఇచ్చాడు. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఎక్కడ, ఎంత వర్షం కురిపించమని ఆదేశిస్తాడో, ఆయన ఆ ప్రదేశంలో అంత వర్షం కురిపిస్తూ ఉంటారు.

ఇస్రాఫీల్ అలైహిస్సలాం అని ఒక దైవదూత ఉన్నారు. ఆయన ప్రళయ దినాన అల్లాహ్ ఆదేశంతో శంఖంలో ఊదుతారు. ఆ శంఖం ఊదబడిన తర్వాత ప్రళయం సంభవిస్తుంది.

మల‌కుల్ మౌత్ అనే ఒక దైవదూత ఉన్నారు. మల‌కుల్ మౌత్ దైవదూత ప్రాణాలు హరిస్తూ ఉంటారు.

‘ముఅఖ్ఖిబాత్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవుల రక్షణ కొరకు నియమించబడి ఉన్నారు. మానవులు నిద్రపోతున్నప్పుడు, నిద్ర లేచి నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, స్థానికంగా ఉంటున్నప్పుడు, ఎల్లవేళలా ఆ దైవదూతలు వారి రక్షణలలో, రక్షణలో నియమించబడి ఉన్నారు. అలాంటి దైవదూతలను ‘ముఅఖ్ఖిబాత్’ అంటారు.

అలాగే, ‘ఖజనతుల్ జన్నహ్’, స్వర్గంలో కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారికి ‘ఖజనతుల్ జన్నహ్’ అంటారు. స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశిస్తారో, ఆ ‘ఖజనతుల్ జన్నహ్’ అనే దైవదూతలు స్వర్గవాసులని స్వర్గంలో వచ్చేటప్పుడు సాదరంగా ఆహ్వానిస్తారు.

అలాగే, ‘ఖజనతున్ నార్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు నరకంలో నియమించబడి ఉన్నారు. నరకవాసులు నరకంలో వెళ్ళిపోయిన తర్వాత, ఆ బాధలు భరించక, ఆ నరకంలో ఉన్న దూతలను, “మాకు చావు ఇచ్చేయమని అల్లాహ్‌తో కోరమని” వేడుకుంటారు. ఆ ప్రకారంగా ‘ఖజనతున్ నార్’ అనే కొంతమంది దైవదూతలు నరకంలో నియమించబడి ఉన్నారు.

అలాగే, ‘సయ్యాహీన్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు భూమండలం మొత్తము తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరైనా, ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దైవ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠిస్తూ ఉంటే గనక, ఆ దరూద్ వారు సేకరించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెళ్ళి వినిపిస్తారు.

అలాగే, ‘కిరామన్ కాతిబీన్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవులు చేసే కర్మలన్నీ లిఖిస్తూ ఉంటారు. మంచి కార్యము, చెడు కార్యము, వారు చేసే పని, వారు మాట్లాడే ప్రతి మాట, వారు నమోదు చేస్తూ ఉంటారు. వారిని ‘కిరామన్ కాతిబీన్’ దైవదూతలు అంటారు.

ఇవి దైవదూతల గురించి మనము తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ సంపూర్ణ విశ్వాసులుగా, ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30622

దేవదూతలు (ملائِكة‎) – మెయిన్ పేజీ
https://teluguislam.net/angels/

దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో | టెక్స్ట్]

దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/4EZatwSP2Lo [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి మనం తెలుసుకోబోతున్నాం. దైవ ప్రవక్తలు అంటే ఎవరు, వారి సంఖ్య, ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన 25 మంది ప్రవక్తల పేర్లు, మరియు వారిలో ఐదుగురు ముఖ్యమైన ప్రవక్తల (ఉలుల్ అజ్మ్) గురించి చర్చించబడింది. ప్రవక్తలందరూ అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మానవులని, వారు దైవత్వాన్ని పంచుకోరని స్పష్టం చేయబడింది. చివరి ప్రవక్త అయిన ముహమ్మమ్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ మానవాళికి మార్గదర్శకుడని, నేటి ప్రజలు ఆయనను అనుసరించాలని ఉద్బోధించబడింది. ప్రవక్తలకు ఇవ్వబడిన మహిమలు (అద్భుతాలు) వారి సొంత శక్తి కాదని, అవి అల్లాహ్ యొక్క శక్తి ద్వారా ప్రదర్శించబడ్డాయని కూడా వివరించబడింది.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ
దైవప్రవక్తలలో అత్యంత శ్రేష్ఠుడు, దైవసందేశహరులలో అత్యుత్తముడైన మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన అనుచరులందరిపై శాంతి శుభాలు వర్షించుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
“మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

ఆ హదీస్ పదేపదే మనం వింటూ వస్తున్నాము చూడండి, జిబ్రీల్ అలైహిస్సలాం వారు, దైవదూత, మానవ ఆకారంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, విశ్వాసం (ఈమాన్) అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, ఆకాశ గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధి వ్రాతలను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని తెలియజేసినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, మీరు నిజం చెప్పారు అని ధ్రువీకరించారు.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఆరు విషయాలలో నుంచి ఒక విషయం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగి ఉండటం.. కాబట్టి ఈ ప్రసంగంలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలు దైవ ప్రవక్తల పట్ల తెలుసుకుందాం.

ముందుగా, దైవ ప్రవక్తలు అంటే ఎవరు? అది తెలుసుకుందాం. దైవ ప్రవక్తలు అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచంలో మానవులు ఎప్పుడెప్పుడైతే మార్గభ్రష్టత్వానికి గురయ్యారో, ఆ సందర్భములో మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, మానవులలో నుంచే ఒక భక్తుడిని ఎన్నుకున్నాడు. ఆ భక్తుని వద్దకు దూతల ద్వారా దైవ వాక్యాలు పంపించగా, ఆ దైవ వాక్యాలు దూతల ద్వారా పొందిన ఆ ఎన్నుకోబడిన దైవభక్తులు ప్రజలకు ఆ దైవ వాక్యాలు బోధించారు, వినిపించారు. అల్లాహ్ వైపుకి, అల్లాహ్ మార్గం వైపుకి ప్రజలను ఆహ్వానించారు. ఆ తర్వాత, ఏ విధంగా అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలో ఆచరించి చూపించారు. అలా చేసిన వారిని, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించి, అల్లాహ్ మార్గంలో ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించిన ఆ అల్లాహ్ తరఫున ఎన్నుకోబడిన భక్తులను దైవ ప్రవక్తలు అంటారు, బోధకులు అంటారు, నబీ, రసూల్ అని అరబీలో కూడా అంటారు.

అయితే, ఈ ప్రపంచంలో ఎంతమంది దైవ ప్రవక్తలు వచ్చారు అంటే, ఈ ప్రపంచంలో ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం వద్ద నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నాటికి ఇంచుమించు 1,24,000 మంది దైవ ప్రవక్తలు వేరేవేరే యుగాలలో, ప్రపంచంలోని భూమండలంలోని వేరేవేరే ప్రదేశాలలో అవసరాన్నికి తగ్గట్టుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిస్తూ వచ్చాడు. మొదటి దైవ ప్రవక్త పేరు ఆదం అలైహిస్సలాం. అంతిమ దైవ ప్రవక్త పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

ఇక, ఖుర్‌ఆన్ గ్రంథంలో ఎంతమంది దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉంది అని మనం చూసినట్లయితే, ధార్మిక పండితులు లెక్కించి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఖుర్‌ఆన్ గ్రంథంలో 25 దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉన్నది. ఎవరు వారు అంటే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాం, ఇస్ హాఖ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, ధుల్ కిఫ్ల్ అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, అల్ యస అలైహిస్సలాం, జకరియ్యా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మొత్తం 25 దైవ ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్ గ్రంథంలో వచ్చి ఉంది. వారి పేర్లన్నీ మీ ముందర నేను ఇప్పుడు వినిపించటం జరిగింది.

ఇక ఈ 1,24,000 ప్రవక్తలలో నుంచి 25 ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో వచ్చింది కదా, వారందరిలో నుంచి ఐదుగురు దైవ ప్రవక్తలకు, ప్రవక్తలందరి మీద ఒక గౌరవ స్థానం ఇవ్వబడింది. వారిని అరబీ భాషలో “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని బిరుదు ఇవ్వబడింది ప్రత్యేకంగా. తెలుగు భాషలో దానికి అనువాదము సహనమూర్తులు అని, వజ్ర సంకల్పము గల ప్రవక్తలు అని అనువాదం చేసి ఉన్నారు. వజ్ర సంకల్పము గల దైవ ప్రవక్తలు అన్న బిరుదు పొందిన ప్రవక్తలు ఎంతమంది అంటే ఐదు మంది ఉన్నారు. ఆ ఐదు మంది ఎవరంటే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ఐదు మందిని “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని తెలియజేయడం జరిగింది.

ఇక, మనము ఏ ప్రవక్తను అనుసరించాలి? నేడు ప్రపంచంలో ఉన్నవారు, ప్రజలందరూ ఏ ప్రవక్తను అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ప్రపంచంలో పుట్టిన వారము కాబట్టి, నేడు మన మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే బాధ్యత వేయబడి ఉన్నది. మనమంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులు అని అంటారు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనము ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త. ఇక ప్రళయం వరకు మరొక ప్రవక్త ఎవరూ రాజాలరు. ఆయనే చివరి ప్రవక్త. ఎవరైనా నేను ప్రవక్తను అని ఇప్పుడు గానీ, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత గానీ ఎవరైనా ప్రకటన చేస్తే, అతను అబద్ధం పలుకుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఖుర్‌ఆన్‌లో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, ఇంకా అల్లాహ్ తరఫు నుంచి ప్రవక్తలు రారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి ప్రవక్త కాదండి, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే ముందు వచ్చిన ప్రవక్తలు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి, ఒక ప్రదేశానికి మాత్రమే ప్రవక్తలుగా పంపించబడేవారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా చేసి పంపించాడు కాబట్టి, భూమండలంలో ఏ మూలన నివసిస్తున్న వారైనా సరే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించాలి.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వ ప్రవక్తల నాయకుడిగా చేసి ఉన్నాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శాసనము ఇచ్చి ఉన్నాడు. ఆ శాసనాన్ని మనము అనుసరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము ప్రవక్తగా అభిమానించాలి, ఆయనను గౌరవించాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, అంటే ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఏ విషయాలు అయితే ఆయన చేయమని మనకు తెలియజేశారో, అవన్నీ మనము పుణ్యకార్యాలు, సత్కార్యాలు అని తెలుసుకొని వాటిని అమలు పరచాలి. ఏ విషయాల నుండి అయితే ఆయన వారించాడో, ఆగిపోమని తెలియజేశారో, ఆ విషయాల జోలికి వెళ్ళకుండా మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఆయన ఏ విషయాల గురించి అయితే వారించారో అవన్నీ దుష్కార్యాలు, పాపాలు కాబట్టి వాటికి మనము దూరంగా ఉండాలి.

ఇక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వము కొంతమంది ప్రవక్తలు వచ్చారు కదా. ఆ ప్రవక్తల గురించి మన విశ్వాసం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వైఖరి కలిగి ఉండాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, చాలా చక్కగా మరియు జాగ్రత్తగా ఆలోచించండి.

ప్రవక్తలందరూ కూడా మానవులు అని మనము విశ్వసించాలి. అలాగే, ప్రవక్తలందరూ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తరఫున ఎన్నుకోబడిన వారు అని వారందరినీ మనము గౌరవించాలి. అలాగే ప్రవక్తలందరి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా వాక్యాలు పంపించగా, వారు ఆ వాక్యాలు ప్రజలకు తూచా తప్పకుండా పూర్తిగా వివరించారు. వారు ఆ బాధ్యతలో రవ్వంత కూడా జాప్యము చేయలేదు, పూర్తిగా ఆ కార్యాన్ని వారు నిర్వహించారు అని మనము విశ్వసించాలి.

అలాగే ప్రవక్తలందరూ కూడా మానవులలోనే ఉత్తములు, పుణ్యాత్ములు, సజ్జనులు అని కూడా మనము గౌరవించాలి. అలాగే, ధర్మ ప్రచారపు మార్గంలో ప్రవక్తలు బాధలు ఎదుర్కొన్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు, హింసలు భరించారు, చివరికి ప్రాణత్యాగాలు కూడా కొంతమంది ప్రవక్తలు చేశారు. అవన్నీ మనకు చరిత్రలో తెలుపబడి ఉన్నాయి కాబట్టి, వారందరూ గొప్ప దైవభీతిపరులు, భక్తులు మరియు అల్లాహ్ వారికి అప్పగించిన కార్యము కోసము అవమానాలు భరించిన వారు, బాధలు భరించిన వారు, ప్రాణత్యాగాలు చేసిన వారు అని వారి భక్తి గురించి మనము తెలుసుకోవాలి, అలాగే వారిని భక్తులు అని మనం వారిని గౌరవించాలి.

ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు. ప్రవక్తలను కించపరచటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అనుమతి లేదు. ప్రవక్తలందరినీ గౌరవించాలి, ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు.

మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, చివర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్వం వచ్చిన ప్రవక్తలందరి శాసనాలు మన్సూఖ్ చేయబడ్డాయి, అనగా రద్దు చేయబడ్డాయి. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనం మాత్రమే అమలుపరుచుకోవటానికి అనుమతి ఇవ్వబడి ఉంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకొని విశ్వసించాలి మిత్రులారా.

ఇక చివరిలో, ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చి ఉన్నాడు, ఆ మహిమల గురించి తెలుసుకొని మాటను ముగిద్దాం. చూడండి, ప్రవక్తలలో కొన్ని ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సందర్భానుసారంగా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఉదాహరణకు, మూసా అలైహిస్సలాం వారి కాలంలో అలనాటి ప్రజలు మూసా అలైహిస్సలాం వారితో మహిమలు అడిగినప్పుడు, ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు కొన్ని మహిమలు ఇచ్చాడు. అందులో ఒక మహిమ ఏమిటంటే చేతికర్ర. అది కింద పడవేస్తే పెద్ద సర్పంలాగా మారిపోతుంది, మళ్లీ ముట్టుకుంటే అది మామూలు కర్రగా మారిపోతుంది. అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ఒక మహిమ.

అలాగే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మహిమలు ఇచ్చారు. ఆయన పుట్టుకతో గుడ్డివారిగా ఉన్న వారిని స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే, పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్న వారికి కంటి చూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చేసేవాడు. కఠినమైన వ్యాధిగ్రస్తులను కూడా ఆయన స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే వారందరికీ స్వస్థత లభించేది. అంటే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మహిమలు ఇచ్చాడు. ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా చంద్రుడు రెండు ముక్కలయ్యాడు. ఆయన వేళ్ళ మధ్య నుండి నీళ్లు ప్రవహించాయి. ఇలా అవన్నీ ఇన్ షా అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అన్న ప్రసంగంలో మనం వింటే వివరాలు తెలుస్తాయి. కాకపోతే, ఈ మహిమల గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మహిమలు ప్రవక్తల సొంత శక్తులు కానే కావు. వారు అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన శక్తితో అవన్నీ ప్రజల ముందర చేసి చూపించాడు.

ప్రవక్తలు దేవుళ్ళు కారు, దేవునిలో భాగస్థులు కారు, దేవునికి సరిసమానులు కూడా కారు. అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు. ప్రవక్తలు అల్లాహ్ లో భాగము కాదు, అల్లాహ్ కుమారులు కాదు మరియు అల్లాహ్ కు సరిసమానులు కాదు. వారు మానవులు, మానవులలోనే ఉత్తములు, అల్లాహ్ ద్వారా ఎన్నుకోబడిన వారు.

ప్రవక్తలను ప్రతి ప్రవక్తను వారి వారి సమాజం వారు అనుసరించాల్సిన బాధ్యత ఉండేది. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, రండి అల్లాహ్ వైపు, రండి అల్లాహ్ ను విశ్వసించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించండి. అల్లాహ్ మరియు ప్రవక్త చూపించిన మార్గం, ఇస్లాం మార్గంలో వచ్చి చేరండి. మీకు అందరికీ ఇదే నా ఆహ్వానం.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనలందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

وَجَزَاكُمُ اللهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్)
“అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక.”

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
“మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30611

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets/

భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ [వీడియో]

భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NClr-TiBAc4 [25 నిముషాలు]

ఈ వీడియోలో తెలుసుకోవలసిన విషయాలు:

1- భూకంపాలు సంభవించేలా చేస్తున్నది ఎవరు ?
2- సునామీలు, భూకంపాలు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తాయి ?
3- అభం శుభం తెలియని పిల్లలు వీటి వల్ల మరణిస్తున్నారు వారు చేసిన పాపం ఏమిటి ?
4- దైవ వాక్యాలు బోధించే పండితులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు వారి నేరం ఏమిటి ?
5- ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక విశ్వాసి గా మన బాధ్యత ఏమిటి ?
6- పదే పదే ఎక్కువగా భూకంపాలు సంభవించటం దేనికి సంకేతం ?
7- పూర్తి భూమి కంపించే రోజు రానుందా ?

“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

యూదులు, ప్రవక్త ﷺ జీవిత కాలం లో – సలీం జామి’ఈ [వీడియో]

యూదులు, ప్రవక్త (స) జీవిత కాలం లో – సలీం జామి’ఈ [వీడియో]
https://youtu.be/FklHh-21N8E [32 నిముషాలు]

ఖురాన్ & సున్నత్ నుండి దుఆలు – డాక్టర్ సయీద్ అల్ ఖహ్తానీ [పుస్తకం]

అజ్జిక్రు వద్దుఆఉ మినల్ కితాబి వస్సున్న
 రచన/కూర్పు: ఫఖీర్ ఇలల్లాహ్ డాక్టర్ సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
(1408 హిజరి షాబాన్ లో సవరించబడినది)

[అరబిక్ బుక్ డౌన్లోడ్ లింక్]

విషయ సూచిక

స్త్రీల సహజ రక్త సంభంధిత ఆదేశాలు – ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]

రచన: ఫజీలతుష్షేక్ అల్లామ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్
(అల్లాహ్ ఆయనను,ఆయన తల్లిదండ్రులను మరియు సమస్తముస్లింలను మన్నించుగాక!)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.

సమస్త స్తుతులు అల్లాహ్’కు మాత్రమే అంకితం, మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనతో సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతో మన్నింపులు వేడుకుంటున్నాము మరియు ఆయన వైపుకు మాత్రమే మరలుతున్నాము!అలాగే మా హృదయాల కీడు నుండి, దుష్కర్మల నుండి అల్లాహ్’తో శరణు వేడుకొంటున్నాము.ఎవరికైతే అల్లాహ్ సన్మార్గం చూపుతాడో అతన్ని ఎవరు మార్గభ్రష్టుడిగా మార్చలేరు, ఎవరినైతే ఆయన మార్గబ్రష్టుడిగా చేస్తాడో అతనికెవరూ సన్మార్గం చూపరు.ఇంకా అల్లాహ్ తప్ప మరో నిజఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను.మరియు ముహమ్మద్ ఆయన యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను.ఆయనపై,ఆయన కుటుంబీకులపై,ఆయన సహచరులపై మరియు ప్రళయదినం వరకు ఆయనను అత్యుత్తమంగా అనుసరించే అనుచరసమాజం పై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక!

అమ్మాబాద్! నిస్సందేహంగా స్త్రీలు క్రమంగా సహజ రుతుస్రావం, ఇస్తిహాజా మరియు (నిఫాస్) పురిటిరక్తానికి లోనవుతూ ఉంటారు, ఇది ప్రధాన అంశాలలో ఒకటి కనుక దీనికి సంబంధించిన ఆదేశాలను వివరించడం, అవగాహన కల్పించడం మరియు విజ్ఞులు చెప్పిన విషయాలలో తప్పుడు వివరణల నుండి సరైన జ్ఞానం వైపుకు మార్గదర్శనం చేయడం చాలా అవసరం.కాబట్టి ప్రముఖులు చెప్పిన మాటల్లో సమంజసమైనవి లేక బలహీనమైనవి ఏమిటి అని ఖరారు చేయడంలో మేము ఖుర్ఆను మరియు సున్నతు మార్గాన్ని అవలంభిస్తాము.

  • 1-ఎందుకంటే ఈ రెండు ప్రధాన మూలాలు, వీటి ఆధారంగానే షరీఅతుకు సంబంధించిన ఆదేశాలు, ఆరాధనలు మరియు విధులు దాసులకు నిర్దేశించ బడతాయి.
  • 2-ఈ విధంగా ఖుర్ఆను మరియు సున్నతులను ఆధారం చేసుకోవడం వలన మనసుకు శాంతి చేకూరుతుంది,హృదయాలు తెరుచుకుంటాయి ఆత్మకు తృప్తికలుగుతుంది మరియు బాధ్యతలు తీరుతాయి.
  • 3- కావున ఈ రెండు కాకుండా ఇతర మూలాల కోసం సాక్ష్యం తీసుకోబడింది కానీ వాటినే సాక్ష్యంగా పరిగణించబడదు.

ఎందుకంటే,ప్రామాణిక అభిప్రాయం ప్రకారం, హుజ్జతు (రుజువు) కేవలం అల్లాహ్ వాక్కుయగు ఖుర్ఆను మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలలో మాత్రమే ఉంది, అలాగే పండితులగు సహాబాల తీర్పులలో ఉంది, ఆయితే ఆ తీర్పులు ఖుర్ఆను మరియు సున్నత్ లకు విరుద్ధంగా ఉండకూడదు.అలాగే మరొక సహాబీ అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉండకూడదు ఒకవేళ అది ఖుర్ఆను మరియు సున్నతులకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అప్పుడు ఖుర్ఆను సున్నతులోని ఆదేశాన్ని పాటించడం తప్పనిసరి అవుతుంది.ఒకవేళ ఈ సహాబీ అభిప్రాయానికి మరొక సహాబీ అభిప్రాయం విరుద్ధంగా ఉంటే, అప్పుడు ఈ రెండు అభిప్రాయాల మధ్య తర్జీహ్ అవసరం పడుతుంది ఆ రెండింటిలో ప్రాధాన్యత పర్చబడ్డ రాజిహ్ అభిప్రాయం తీసుకోబడుతుంది

.لقوله تعالى: {فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللّهِ وَالْيَوْمِ الآخِرِ ذَلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلا } [النساء:59].
అల్లాహ్ సెలవిచ్చాడు:{“ఒకవేళ ఏ విషయంలోనయినా మీ మధ్య వివాదం తలెత్తితే దానిని అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరల్చండి -మీకు నిజంగానే అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అనివార్యం).ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది”.}(అల్ నిసా:59)

ఇది స్త్రీల సహజ రక్తసంబంధిత విషయాలు మరియు ఆదేశాలను వివరించే చిరుపుస్తకం, వీటిని వివరించే పుస్తకం చాలా అవసరం.

ఈ పుస్తకం క్రింది అధ్యాయాలను కలిగి ఉంది:

“నేను అతి సమీపంలో ఉన్నాను” – మార్గదర్శకాలు & నియమాలు [పుస్తకం]

సంకలనం: అమల్ అన్-నష్వాన్.
సమీక్ష: సనావుల్లాహ్ సిద్ధీఖి, ప్రత్యక్ష వ్యాఖ్యాత, అల్ మస్జిద్ అల్ హరమ్.
తెలుగు అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణాప్రదాత, అపార కృశీలుడైన అల్లాహ్ పేరుతో

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

సకల ప్రశంసలు, స్తోత్రములు, కృతజ్ఞతలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులపై అనేక దీవెనలు వర్షించు గాక!

అమల్ బింత్ ఇబ్రాహీం అన్-నష్వాన్ రచించిన “దుఆ: అల్లాహ్ అనుబంధానికి తాళంచెవి” అనే సంకలనం గురించి నాకు తెలిసినది. ఇది కీలకమైన ప్రముఖ సమస్యలను వివరించే ప్రయోజనకరమైన సంకలనం అని గుర్తించాను. దీనిని సంకలనం చేయడంలో అనుసరించిన ఆచరణాత్మక విధానాలు పూర్తిగా ప్రయోజనకరంగా మరియు అత్యుత్తమంగా ఉన్నాయి. దీనిని అమూల్యమైనదిగా చేయమని మరియు ఈ ప్రయోజనకరమైన పనికి బదులుగా దీని రచయిత్రికి తగిన ప్రతిఫలం ప్రసాదించమని నేను అల్లాహ్ ను అర్థిస్తున్నాను. రచయిత్రి యొక్క అభ్యర్థన మేరకు, నేను ఈ తొలి అభిప్రాయాన్ని వ్రాసాను.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులపై అనేక దీవెనలు వర్షించు గాక!

డాక్టర్ ఫాలిహ్ బిన్ ముహమ్మద్ అస్-సగీర్.

1.తొలి అభిప్రాయం
2. అంకితం
3. ఒక అద్భుత ఆశాకిరణం
4. పీఠిక
5. దుఆ: ఒక అనుగ్రహం, దీవెన, ఆశీర్వాదం
6. దుఆ యొక్క ప్రాముఖ్యత
7. దుఆలో పాటించవలసిన ఆవశ్యకతలు మరియు మర్యాదలు
8. కొన్ని యథార్థ గాథలు
9. చివరి మాట

‘కలిమా’లోని కోణాలన్నీ మీకు తెలిసి వుండాలి | ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు 

అసలు ‘కలిమా‘ అంటే ఏమిటి? 

లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” 

అనువాదం: అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్య దైవం లేడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త, సందేశహరులు”. 

– కలిమా అంటే ఇదే! 

మీ విశ్వాసానికి బలం ‘కలిమా’ భావం 

ఇస్లాంలో ప్రవేశించటానికి ఏకైక ద్వారం కలిమా. ‘కలిమా’ను ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా విశ్వాసం బలపడుతుంది. తద్వారా ఇతరులకు కూడా ఇస్లాం గురించి చక్కగా బోధించటానికి వీలవుతుంది. 

ఇస్లాంలో ప్రవేశించటానికి బాప్తిజం (Baptism) అవసరం లేదు 

ఈ పాఠంలో చెప్పబడిన ప్రకారంగా కలిమా (సద్వచనం)ను మనసా, వాచా, కర్మణా పఠించిన వారెవరైనా ముస్లింలు అవుతారు. ముస్లిం కావటానికి మతపెద్దల ద్వారా బాప్తిజము పొందవలసిన అవసరం లేదు. మరే పూజలూ, ఆచారాలు ఇస్లాంలో ప్రవేశించటానికి అవసరం ఉండవు. 

సద్వచనం (కలిమా) సారాంశం 

విశ్వాసానికి (ఈమాన్ కు) మూలమైన “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” అనే కలిమాలో రెండు అంశాలున్నాయి. 

ఒకటి : లా ఇలాహ ఇల్లల్లాహ్
రెండవది: ముహమ్మదు రసూలుల్లాహ్

‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్య దైవం లేడని అర్థం. ఇందులో కూడా రెండు భావనలు ఇమిడి ఉన్నాయి. 

1) తిరస్కరణ (మనఃపూర్వకంగా నిరాకరించటం) 
2) ధృవీకరణ (మనసారా ఒప్పుకుంటూ పైకి గట్టిగా చెప్పటం) 

మొదటిది: 

దైవత్వం అనేది మహోన్నతుడైన అల్లాహ్ కు స్వంతం. కాబట్టి ఒక్కడైన అల్లాహ్ ను కాదని వేరెవరికయినా దైవత్వాన్ని ఆపాదించటాన్ని కలిమా (సద్వచనం)లోని ఈ భాగం ఖండిస్తుంది. ఉదాహరణకు: దైవదూతలు, ప్రవక్తలు, పుణ్యపురుషులు, వలీలు, స్వాములు, విగ్రహాలు, ప్రపంచ రాజ్యాధికారులు – వీరెవరూ దేవుళ్ళు కారు. కాబట్టి వీరిలో ఏ ఒక్కరూ ఆరాధనలకు, సృష్టి దాస్యానికి అర్హులు కారు. 

రెండవది : 

కలిమాలోని రెండవ భాగం ప్రకారం అల్లాహ్ మాత్రమే నిజ ఆరాధ్య దైవం. కనుక ఈ మొత్తం కలిమాను అంగీకరించిన వారు అల్లాహ్ యే నిజ ఆరాధ్య దైవమని నమ్మి నడుచుకోవాలి. తమ సమస్త ఆరాధనలను, ఉపాసనలను ఆయనకే ప్రత్యేకించుకోవాలి. దైవత్వంలో అల్లాహ్ కు భాగస్వామిగా వేరొకరిని నిలబెట్టకూడదు. అంటే అల్లాహ్ ఆరాధనతో పాటు ఇతరులను ఆరాధించకూడదు. 

ముహమ్మదుర్రుసూలుల్లాహ్ అంటే… 

“ఓ అల్లాహ్ ! ముహమ్మద్ (సఅసం) నీ సందేశహరుడు” అని నోటితో పలకటమేగాక హృదయపూర్వకంగా ఈ వాక్కును విశ్వసించటం. అంటే అల్లాహ్ ఆజ్ఞలను శిరసావహించిన మీదట, అంతిమ దైవప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన మార్గమే అనుసరణీయమని మీరు మాటిస్తు న్నారు. 

అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు- 

(ఓ ప్రవక్తా) వారికి చెప్పు: 

దివ్యఖుర్ఆన్లోని పై వాక్యాల ద్వారా బోధపడేదేమిటంటే ఇస్లాం ధర్మంలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఇతరత్రా వ్యక్తుల అభిప్రాయాలు అల్లాహ్ గ్రంథానికి (ఖుర్ఆను), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి, ఆయన సూచించిన చట్టాలకు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు, ఆరాధనా పద్ధతులకు, ప్రవచనాలకు (ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్త సున్నతుకు) అనుగుణంగా ఉంటే స్వీకరిం చాలి. లేదంటే వాటిని త్రోసిపుచ్చాలి. 

‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ మన నుండి కోరేదేమిటి? 

1. జ్ఞానం: అల్లాహ్ యే సిసలైన ఆరాధ్యదైవమని మనం తెలుసుకోవాలి. మన ఆరాధనలు, ఉపాసనలు ఆయనకు మాత్రమే ప్రత్యేకించ బడాలి. అల్లాహ్ తప్ప వేరితర దేవుళ్ళంతా మిథ్య, అసత్యం, బూటకం. వారిలో ఏ ఒక్కరూ లాభంగానీ, నష్టంగానీ కలిగించ లేరన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. 

2. దృఢ నమ్మకం: అల్లాహ్ ఒక్కడే నిజదైవమనీ, దైవత్వం ఆయనకే సొంతమని విశ్వసించటంలో ఎలాంటి సందేహానికి, సంకోచానికి, ఊగిసలాటకు తావు ఉండరాదు. 

3. సమ్మతి, అంగీకారం: ఈ ప్రకటనతో ముడిపడి ఉన్న నియమ నిబంధనలను, షరతులన్నింటినీ ఒప్పుకోవాలి. 

4. సమర్పణ : అల్లాహ్ యే ప్రభువు, పోషకుడనీ, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ తరఫున మానవ మార్గదర్శకత్వం నిమిత్తం పంపబడిన ఆఖరి ప్రవక్త అనే విషయానికి కట్టుబడి ఉంటానని మాట ఇవ్వాలి. ఆ మాటను కడదాకా నిలబెట్టుకోవాలి. దానిపట్ల ఆత్మసమర్పణా భావంతో మసలుకోవాలి. 

5. నిజాయితి: కలిమా కోరే అంశాలను మనస్ఫూర్తిగా, నిజాయితీగా నెరవేర్చాలి. 

6. చిత్తశుద్ధి : అల్లాహ్ ను ఆరాధించే విషయంలో ఎలాంటి కల్మషం, కపటత్వం ఉండకూడదు. నిష్కల్మషమైన మనసుతో ధర్మాన్ని అల్లాహ్ ప్రత్యేకించుకుని మరీ ఆరాధించాలి. అన్ని రకాల ఆరాధనలను కేవలం అల్లాహు మాత్రమే అంకితం చేయాలి. 

7. ప్రేమ: మహోన్నతుడైన అల్లాహు ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, వారికి విధేయులై ఉండే సాటి సోదరులందరినీ, అనగా ముస్లింలందరినీ హృదయపూర్వకంగా ప్రేమించాలి. 

మొత్తమ్మీద అర్థమయ్యేదేమిటంటే అల్లాహ్ కు ఆజ్ఞాబద్ధులై నడుచు కోవాలి. ఆయనకు విధేయత చూపాలి. ఆయన చేయమన్న దానిని చేయాలి. చేయకూడదన్న దానికి దూరంగా ఉండాలి. అప్పుడే మన మనస్సుల్లో విశ్వాస (ఈమాన్) బీజం నాటుకుంటుంది. అల్లాహ్ కు విధేయత చూపటమంటే ఆయన్ని ప్రేమించటం, ఆయన విధించే శిక్షలకు భయపడటం, ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఆశపడటం, క్షమాపణకై ఆయన్ని వేడుకోవటం, మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశాలను, ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించటం. 

అల్లాహ్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు షరీఅతును (ఇస్లామీయ చట్టాలను, ధార్మిక నియమావళిని) ఇచ్చి పంపాడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) షరీఅతు రాకతో గతకాలపు చట్టాలు, ధార్మిక నిబంధనలు అన్నీ రద్దయిపోయాయి. ఇప్పుడు ఈ షరీఅతు అన్ని విధాలుగా గత షరీఅతులన్నిటి కంటే సమున్నతంగా, సంపూర్ణంగా ఉంది. 

ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]
సంకలనం : అబ్దుల్ అజీజ్ సాలెహ్ అష్ షౌమార్,సౌదీఅరేబియా. ఈ పుస్తకం షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారి మూలరచన “అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మహ్” యొక్క వ్యాఖ్యానంతో కూడుకున్న పుస్తక సంకలనం

రబీ ఉల్ అవ్వల్ నెలలోని కల్పితాచరణలు – ముహమ్మద్ జాకిర్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

రబీ ఉల్ అవ్వల్ నెలలోని కల్పితాచరణలు – ముహమ్మద్ జాకిర్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/hnKnm_DP4eo [34 నిముషాలు]

అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం  – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]

అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం
(హృదయ ఆచరణలు – 12వ భాగం)
షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/CoiTVUw5Gq4 [10 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మాబాద్.

హృదయ ఆచరణలు పన్నెండవ భాగంలో మనము తెలుసుకోబోయే విషయము అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.

ప్రియులారా, హృదయ ఆచరణలు ఏదైతే అంశాన్ని మనం వింటూ ఉన్నామో ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశము మరియు అత్యంత ఆవశ్యకమైన అంశం. ఎందుకంటే స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం, స్వర్గం. దాని గురించి ఇలా చెప్పటం జరిగింది, మీరు అర్ధిస్తే జన్నతుల్ ఫిర్దౌస్‌ను అర్ధించండి.

అనేకమంది సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాహచర్యాన్ని స్వర్గంలో పొందాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి స్వర్గంలో ఉండాలని కోరుకునేవారు. మరి స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం. మరి అందులో నుండి మరొక ముఖ్యమైన ఆచరణ అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.

మనిషి కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం అనేది చాలా గొప్ప విషయం సోదరులారా. సాధారణంగా ప్రజలు తమ అవసరాల కోసం ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రోజులలో ప్రజలు ఇతరుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు, చాలా తక్కువగా ఇతరుల బాగోగుల గురించి యోగక్షేమాల గురించి తెలుసుకుంటారు. కానీ ఇలాంటి కాలంలో ప్రస్తుత క్లిష్టతర పరిస్థితులలో ఎవరైనా ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క దాసులను కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తే అలాంటి వ్యక్తికి స్వర్గంలో ఇన్షా అల్లాహ్ ఉన్నత స్థానం లభిస్తుంది ప్రియులారా.

తబ్రానీ గ్రంథంలో ఉల్లేఖించబడిన ఒక సహీ హదీసు ప్రకారం హజరతే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు సోదరులారా. ప్రళయ దినాన కొంతమంది అల్లాహ్‌తో కలిసి కూర్చుంటారు. హదీసులో చెప్పబడింది,

إِنَّ لِلَّهِ جُلَسَاءَ
ఇన్న లిల్లాహి జులసా
కొంతమంది అల్లాహ్‌తో కలిసి కూర్చుంటారు.

మరియు ఆ సమావేశం గురించి చెప్పబడింది:

عَنْ يَمِينِ الْعَرْشِ
అన్ యమీనిల్ అర్ష్
అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. అంటే అల్లాహ్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు.

وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ
వ కిల్తా యదైల్లాహి యమీనున్
మరియు అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే.

ఇక్కడ చెప్పడం జరుగుతుంది అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే. దీన్ని బట్టి మనకి తెలుస్తున్న విషయం ఏమిటంటే అల్లాహ్‌కు చేతులు ఉన్నాయి. మరి ఆ చేతులను గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ రెండు చేతులు కుడి చేతులు.

ఇక్కడ మనము అల్లాహ్ యొక్క చేతులకు సంబంధించి షేఖ్ సాలెహ్ అల్ ఉసైమీన్ రహమహుల్లాహ్ వారు తెలియజేసిన విషయాలను తెలుసుకుందాం. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని మనం వింటామో, వాస్తవానికి కొన్ని హదీసులలో ఎడమ చేతి ప్రస్తావన కూడా ఉంది. ఈ హదీసులో దైవ ప్రవక్త వారి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని? అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దాని ఉద్దేశం ఏమిటంటే అల్లాహ్ యొక్క రెండు చేతులు మంచిలో, శుభాలలో, మంచిలో మరియు శుభాలలో పూర్తిగా సరిసమానమైనవే. ఎవరూ దానిని ఇలా అర్థం చేసుకోకూడదు ఎలాగైతే మనిషి చేతులు ఉంటాయో ఆ విధంగా ఎవరూ కూడా అల్లాహ్ యొక్క చేతులను పోల్చకూడదు. అల్లాహ్ మనల్ని రక్షించు గాక. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడమ చేతితో ఇవ్వటాన్ని వారించారు, ఎడమ చేతితో పుచ్చుకోవటాన్ని వారించారు, ఎడమ చేతితో భోజనం చేయటం నుండి వారించారు, నీళ్లు త్రాగటాన్ని వారించారు. కానీ మనము అల్లాహ్ యొక్క చేతులను ఈ విధంగా మనం ఎంత మాత్రమూ ఊహించకూడదు. వాస్తవానికి అల్లాహ్ యొక్క రెండు చేతులు మేలులో, మంచిలో, సరిసమానమైనవే అన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది. ఎలాగైతే హదీసులో మనము విన్నామో. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఇలా తెలియజేస్తున్నారు:

وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ عَلَىٰ مَنَابِرِهِمْ مِنْ نُورٍ
వ కిల్తా యదైల్లాహి యమీనున్ అలా మనాబిరిహిమ్ మిన్ నూర్
అల్లాహ్ ఎవరినైతే తనతో కూర్చోబెడతారో వారు కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారు.

وُجُوهُهُمْ مِنْ نُورٍ
వుజూహుహుమ్ మిన్ నూర్
వారి ముఖాలు కాంతిలీనుతూ ఉంటాయి.

لَيْسُوا بِأَنْبِيَاءَ وَلَا شُهَدَاءَ وَلَا صِدِّيقِينَ
లైసూ బి అంబియా వలా షుహదా వలా సిద్దీఖీన్
ఎవరైతే కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారో, ఎవరి ముఖాలైతే దగదగా మెరిసిపోతూ ఉంటాయో, వారు ప్రవక్తలు కాదు, షహీదులు కాదు, సిద్దీఖులు కారు.

మరి ఎందుకు వారికి అలాంటి ఘనత దక్కింది? అడగటం జరిగింది,

قِيلَ يَا رَسُولَ اللَّهِ مَنْ هُمْ؟
ఖీల యా రసూలల్లాహి మన్ హుమ్?
అడగబడింది, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారు ఎవరు?

ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు,

هُمُ الْمُتَحَابُّونَ بِجَلَالِ اللَّهِ تَبَارَكَ وَتَعَالَى
హుముల్ ముతహాబ్బూన బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా
వారు అల్లాహ్ యొక్క ఘనత కోసం, అల్లాహ్ యొక్క గొప్పతనం కోసం, కేవలం అల్లాహ్ కోసం ఒండొకరిని ప్రేమించేవారు, అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు.

ఎవరైతే అల్లాహ్‌కు విధేయత చూపుతారో, అల్లాహ్‌కు దాస్యం చేస్తారో అలాంటి వారిని వీరు ప్రేమిస్తారు. ఏ ముస్లింనైనా వారు కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం వారు ప్రేమిస్తారు. అది తప్ప వేరే ఎలాంటి ఉద్దేశము వారికి ఉండదు. ఇలాంటి వారినే అల్లాహ్ తన అర్ష్ యొక్క కుడివైపున కూర్చోబెడతాడు. దీన్ని బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే మనం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించాలి. ఎవరైతే అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమిస్తారో అలాంటి వారికి అల్లాహ్ త’ఆలా గొప్ప సన్మానాన్ని ఇస్తాడు.

కాబట్టి ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయము కొంతమంది అల్లాహ్‌తో పాటు అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. వారి ముఖాలు దగదగా మెరిసిపోతుంటాయి. అల్లాహ్ యొక్క రెండు చేతుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రళయ దినాన కూర్చుంటారో వారు అల్లాహ్ యొక్క అర్ష్ కు కుడివైపున మింబర్లపై కూర్చుంటారని, వారి ముఖాలు దగదగా మెరిసిపోతాయని చెప్పబడింది. అయినప్పటికీ వారు ప్రవక్తలు కానీవారు, షహీదులు కానీవారు, సిద్దీఖులు కానీవారు కానీ ప్రవక్తతో అడిగారు మరి ఎవరు ప్రవక్త? “హుముల్ ముతహాబ్బూన్ బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా“, వారు అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు అన్న విషయం మనకు తెలుస్తుంది.

ఆ తర్వాత ఇదే విధంగా హృదయ ఆచరణలలో ఇతర నైతిక ఉత్తమ నైతిక కార్యాలు కూడా ఉన్నాయి. ఒకటి అల్ హయా అనగా సిగ్గు బిడియం మనిషి బిడియాన్ని కలిగి ఉండటం. అదే విధంగా రధా, అల్లాహ్‌ను ఇష్టపెట్టే ప్రయత్నము చేయటం. వస్సబ్ర్ ఓర్పు సహనాన్ని కలిగి ఉండటం. ఇవన్నీ హృదయ ఆచరణలకు సంబంధించిన విషయాలు.

అదే విధంగా హజరతే అబూ దర్దా రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం వేరే హృదయ ఆచరణ, ఉత్తమ హృదయ ఆచరణ ప్రళయ దినాన మనిషికి గౌరవాన్ని తీసుకువచ్చే ఆరాధన ప్రవక్త వారు అన్నారు,

مَا مِنْ شَيْءٍ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ مِنْ حُسْنِ الْخُلُقِ
మా మిన్ షైయిన్ అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిని యౌమల్ ఖియామతి మిన్ హుస్నిల్ ఖులుఖి

ప్రవక్త వారు అన్నారు ఏమన్నారు, “మా మిన్ షైయిన్”, ఆ ప్రళయ దినాన ఏ వస్తువు ఉండదు, “అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిన్” అంటే ఆ విశ్వాసి యొక్క ఆ త్రాసులో ఏ వస్తువు వేరేది బరువైనది ఉండదు, “యౌమల్ ఖియామతి యౌమల్ ఖియామతి” ప్రళయ దినాన దేనికంటే “మిన్ హుస్నిల్ ఖులుఖ్”, ఉత్తమ నడవడిక కంటే వేరే మంచి వస్తువు ఏదీ ఉండదు.

కాబట్టి ప్రియులారా ఈ హదీసులో మనకి తెలిసిన విషయము, ప్రళయ దినాన విశ్వాసి యొక్క త్రాసులో అన్నింటి కంటే బరువైన వస్తువు అతని ఉత్తమ నైతికత. కాబట్టి సోదరులారా మనిషి ప్రజలతో మంచిగా ప్రవర్తించాలి, ప్రజలను అల్లాహ్ కోసం ప్రేమించాలి, కష్టకాలంలో మనిషి ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి, మనిషిలో సిగ్గు బిడియం కూడా ఉండాలి, అల్లాహ్‌ను మనం ఇష్టపెట్టే కార్యాలు చేయాలి. వీటన్నింటి ద్వారా మనకి ప్రళయ దినాన అల్లాహ్ వద్ద గొప్ప గౌరవం లభిస్తుంది ప్రియులారా. ఇక చిట్టచివరిగా ఈ రోజుల్లో మనం మంచి ప్రవర్తన ప్రజల పట్ల కలిగి ఉందాం. ప్రజలకు ఈ కష్టకాలంలో ప్రజల యొక్క కష్ట నష్టాలలో వారితో మనం పాలుపంచుకోవాలి, వారికి సహాయపడాలి. ఎవరైతే ప్రజల కష్టాలు తీర్చటంలో వారికి తోడుగా ఉంటారో అలాంటి వారి కష్టాలను అల్లాహ్ త’ఆలా ప్రళయ దినాన వారి కష్టాలను అల్లాహ్ దూరము చేస్తాడు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ కేవలం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


హృదయ ఆచరణలు (12 భాగాలు) – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]
https://teluguislam.net/2023/09/03/actions-of-the-heart/

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb