అల్లాహ్ సామీప్య మార్గాలు (వసీలా) – అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ కు దగ్గర కావాలనుకుంటున్నారా? అల్లాహ్ ప్రేమించేవారిలో, ఇష్టపడేవారిలో చేరాలనుకుంటున్నారా? మరి అల్లాహ్ సామీప్యం పొందడానికి మార్గాలు ఏమిటి? అల్లాహ్ సామీప్యం పొందితే కలిగితే గొప్ప ప్రయోజనాలు ఏమిటి? తప్పక విని ప్రయోజనం పొందండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్

అల్లాహ్ సామీప్య మార్గాలు
https://youtu.be/CiCtBSNqJAI [38 నిముషాలు]
వక్త: అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ సామీప్యాన్ని (వసీలా) ఎలా పొందాలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ప్రసంగం ప్రారంభంలో, విశ్వాసులు అల్లాహ్ సామీప్యాన్ని అన్వేషించాలని సూచించే ఖురాన్ ఆయతును ఉదహరించారు. అల్లాహ్ సామీప్యం పొందడానికి పది ముఖ్యమైన మార్గాలు వివరించబడ్డాయి: సమయానికి నమాజ్ చేయడం, ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ మరియు నఫిల్ నమాజులు అధికంగా చేయడం, అల్లాహ్ పట్ల విధేయత చూపడంలో ఉత్సాహం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్), అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండటం, చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందడం, ఖురాన్ ను పారాయణం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం, సజ్జనులతో స్నేహం చేయడం, మరియు పేదవారికి దానం చేయడం. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడిగా మారి, అతని ప్రార్థనలు అంగీకరించబడతాయని మరియు ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడని నొక్కి చెప్పబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్.

ఫ అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
కరుణామయుడు, కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ
(సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్)
“(ఓ అల్లాహ్‌!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)

వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి.  (5:35)

ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కృతజ్ఞత, ఆయన దయతో ఈరోజు మనమంతా ఒక కొత్త అంశాన్ని తీసుకొని సమావేశమై ఉన్నాము. అల్లాహ్ తో దుఆ ఏమనగా, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఏవైతే వాక్యాలు మనకు వినబడతాయో వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మాకు ప్రసాదించు గాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ ఒకేచోట సమావేశపరుస్తున్న వారందరికీ అల్లాహ్ త’ఆలా మంచి ఫలితాన్ని ఇహపరలోకాలలో ప్రసాదించు గాక. ఆమీన్.

ప్రియమైన మిత్రులారా! ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడు.

ఈరోజు మన అంశం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్య మార్గాలు. అల్లాహ్ సామీప్యం ఎలా పొందగలము? వాటి యొక్క మార్గాలు ఏమిటి? దాని ఫలితంగా మనకు అల్లాహ్ త’ఆలా కల్పించే భాగ్యాలు ఏమిటి? దీనిపై ఈరోజు సవివరంగా మీ ముందు ఉంచబోతున్నాను.

సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనల్ని అందరినీ సృష్టించారు. సరైన మార్గం కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు సూచించాడు. సర్వ జనుల్లో అనేకమంది అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. కొంతమందికి కొన్ని విషయాల వల్ల ప్రేమ, మరి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆకర్షణ, మరికొంతమందికి కొన్ని విషయాల పట్ల సంతుష్టి ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఏమి చెబుతున్నాడంటే, ఓ విశ్వాసులారా! నా యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి.

అల్లాహ్ యొక్క సామీప్యం ఎంతో ఉన్నతమైన స్థానం. విలువైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానానికి, ఆ విలువైన స్థానానికి మనిషి చేరుకోగలిగితే, ఇక అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ త’ఆలా ను ఆ మనిషి ఏది కోరుకుంటాడో, ఆ దాసుడు ఏది కోరుకుంటాడో దాన్ని అల్లాహ్ త’ఆలా ప్రసాదిస్తాడు. ఆ విలువైన స్థానం, ఆ విలువైన సామీప్యాన్ని పొందడానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు సూచించారు. ఆ సామీప్యం మనిషికి దొరికినట్లయితే ఆ మనిషి యొక్క విలువ కూడా పెరిగిపోతుంది. అతని భక్తి కూడా పెరిగిపోతుంది. అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాల్లో ఉంటాడు.

అయితే ఆ సామీప్యం మనకు ఎలా లభిస్తుంది? దాని కోసం మనం ఎన్నుకోవలసిన మార్గాలు ఏమిటి? ఇది మీరు, మేము చెప్పుకుంటే వచ్చేది కాదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! మీకు ఏ దేవుడైతే, ఏ అల్లాహ్ అయితే మీకు ప్రవక్తగా చేసి పంపించాడో అతని సాక్షిగా నేను చెబుతున్నాను. అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశం ఏమిటో నాకు వివరించండి.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “షహాదతైన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.” దాన్ని “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్.” నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరి నిజమైన ఏ దేవుడు లేడు. అలాగే నేను సాక్ష్యమిస్తున్నాను మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని తర్వాతే మిగతా విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఆ వ్యక్తి దాన్ని విశ్వసించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అంటున్నాడు, రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మాపై విధించిన విషయాలు ఏమిటో చెప్పండి.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదేశించారు. రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై విధించిన విషయం ఏమిటంటే, ఐదు పూటల నమాజు విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! ఇంకేమైనా ఉందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఐదు పూటల నమాజు తర్వాత నీకిష్టమైతే ఇంకా ఎక్కువైనా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశంలో ఇంకేమైనా చేయవలసి ఉంటే అది కూడా చెప్పండి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాన్ మాసములో ఉపవాసాలు ఉండుట, పూర్తి మాసంలో ఉపవాసాలు ఉండుట. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేమైనా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ పూర్తి మాసం తర్వాత నీకు ఇష్టమైతే మిగతా రోజుల్లో కూడా నువ్వు ఉపవాసాలు ఉండవచ్చు.

మీకు అందజేసిన ఆదేశాల్లో ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాత్ చెల్లించటం, సంవత్సరానికి ఒకసారి జకాత్ చెల్లించటం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చాలా క్లుప్తంగా వివరించారు. అన్ని విషయాలు విన్న ఆ వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అన్నాడు, ఓ ప్రవక్తా! ఏవైతే మీరు నాకు వినిపించారో, ఏవైతే సందేశం నాకు ఇచ్చారో ఆ సందేశంలో నేను రవ్వంత కూడా ఎక్కువ చేయను, రవ్వంత కూడా తగ్గించను. ఏదైతే నేను నాపై విధిగా ఉందో అది మాత్రమే నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను, ఇంకా తక్కువ చేయను అని ఆ వ్యక్తి పలకరించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెళ్తుండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే ఈ మనిషి అన్నాడో, ఏదైతే ఈ మనిషి వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని సరిగ్గా నెరవేరిస్తే ఇతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇచ్చారు.

ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా! ఇది బుఖారీ, ముస్లింలో ఉంది, ఈ ఒక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువు. కానీ మనం కాస్త గ్రహించట్లేదు. ఒకవేళ మనం గ్రహిస్తే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన విషయాల్లో ఏవైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో అవి మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త వినిపించారు, ఈ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని. అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి మనిషికి కావలసినది ఏమిటంటే, అత్యంత విలువైన, అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే అతనిపై విధిగా చేశాడో దాన్ని అమలు పరచటం. అల్లాహ్ త’ఆలా విధిగా చేయనిది మనము ఎంత చేసుకున్నా అది విధికి సమానంగా ఉండదు. ధార్మిక పండితులు, ధార్మిక విద్వాంసులు అనేక విషయాలు దీనికి సంబంధించి చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడానికి మార్గాలు అన్నమాట.

మొట్టమొదటిదిగా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి కావలసింది ఏమిటంటే, ‘అదావుస్ సలాతి ఫీ అవ్ఖాతిహా’. నమాజుని దాని యొక్క సమయంలో ఆచరించటం.

ఫజర్ నమాజ్ ఫజర్ సమయంలో, జోహర్ నమాజ్ జోహర్ సమయంలో, అసర్ నమాజ్ అసర్ సమయంలో, మగ్రిబ్ నమాజ్ మగ్రిబ్ సమయంలో, ఇషా నమాజ్ ఇషా సమయంలో. ఏ నమాజ్ ఏ సమయంలో అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో ఆ నమాజ్ ని ఆ సమయంలో విధిగా భావించి ఆచరించాలి. కొంతమంది ఫజర్ నమాజ్ ని హాయిగా పడుకొని జోహర్ నమాజ్ తో కలిపి చదువుతారు. ఇది అల్లాహ్ తబారక వ త’ఆలాకి నచ్చదు. సమయాన్ని తప్పించి నమాజ్ ఆచరించటం అనేది విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేయలేదు. కనుక అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో, ఎప్పుడు చేశాడో దాన్ని ఆ ప్రకారంగానే అమలు చేయటం. ఇస్లాం ధర్మంలో రెండో మౌలిక విధి నమాజ్ ది ఉంది. మొదటిది షహాదతైన్, ఆ తరువాత నమాజ్ అన్నమాట. నమాజ్ ని దాని సమయంలో పాటించటం, ఆచరించటం ఉత్తమం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, మనిషి చనిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్ వద్ద అతనితో ప్రశ్నించబడేది నమాజే. నమాజ్ గురించి అతను సమాధానం ఇవ్వగలిగితే మిగతా విషయాల్లో అతను విజయం, సాఫల్యం పొందుతాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సామీప్యం పొందడానికి కావలసినది విధిగా చేసి ఉన్న నమాజులని సమయం ప్రకారం ఆచరించటం, పాటించటం.

ఇక రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ప్రవక్తా! స్వర్గంలో నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అయితే నువ్వు ఎక్కువగా నమాజ్ ఆచరించు. విధిగా ఉన్న నమాజులని ఆచరించిన తర్వాత సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను ఇలాంటి నమాజులను ఎక్కువగా ఆచరించటం వలన అల్లాహ్ యొక్క సామీప్యం మనకు లభిస్తుంది. ఎంతవరకు అయితే మనిషి అల్లాహ్ యొక్క భక్తిని తన హృదయంలో, తన మనసులో పెంపొందించుకుంటాడో, అల్లాహ్ తబారక వ త’ఆలా అతనికి తన సామీప్యానికి దరికి తీసుకుంటాడు. కనుక సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను, అలాగే రాత్రిపూట ఏకాంతంలో చదివే తహజ్జుద్ నమాజులను కూడా వదలకూడదు. ఈ నమాజులు మన స్థాయిని పెంచుతాయి. అల్లాహ్ సన్నిధిలో మన యొక్క విలువ పెరుగుతుంది.

ఆ తర్వాత మూడో మార్గం ఏమిటంటే అల్లాహ్ యొక్క విధేయతను పాటించడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. విధేయత అంటే ఇతాఅత్. ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ పని చేయమని, ఆ పని చేయమని అల్లాహ్ త’ఆలా మాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను శిరసా వహించటానికి ఇతాఅత్ అంటాము. ఆ ఇతాఅత్ చేయటానికి మనము ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. ఉత్సాహం కలిగి ఉండాలి. ఉత్సాహం లేకుండా ఏదీ మనిషి చేయలేడు, ఇష్టం లేకుండా ఏది మనిషి చేయలేడు. అల్లాహ్ విధేయత పట్ల మనిషి ఉత్సాహం కలిగి ఉంటే ఆ విశ్వాసంలో కలిగే రుచే వేరుగా ఉంటుంది. ఇది మూడో మార్గం అన్నమాట.

ఇక నాలుగో మార్గం ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలాని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అంటే జిక్ర్. జిక్ర్ అంటే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామము యొక్క జపము. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దుఆలతో నామాలతో, జపాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. మనిషి కూర్చొని ఉన్నా, నమాజ్ తర్వాత అయినా, ఏదైనా వస్తువు మన చేతి నుండి కింద పడిపోయినా, ఏదైనా వస్తువు మనకు ఆకర్షణను కలిగించినా, అనేక విధాలుగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి. దీని ద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తద్వారా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం మనకు లభిస్తుంది.

ఇక ఐదోది ఏమిటంటే, అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండుట. ఉపవాసం అనేది ఎవరికీ కానవచ్చేది కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనిషి ఉపవాసం ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక రోజు ఉపవాసం ఉండినట్లయితే, అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాల దూరంగా నరకాగ్ని నుండి ఉంచుతాడు. ఇది కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరం వరకు తప్పిస్తాడు. ఆ విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ఉపవాసాలు చూపించారు. వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుట, ఒక మాసములో, ఒక నెలలో మూడు రోజులు, 13, 14, 15 వ తేదీలలో ఉపవాసాలు ఉండుట. అలాగే అరఫా రోజున ఉపవాసం ఉండుట, ముహర్రం రోజులో 9, 10 ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండుట. రమజాన్ మాసములో విధిగా చేయబడిన ఒక నెల ఉపవాసాలు ఉండుట. ఈ విధంగా అనేక ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉపదేశించారు. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో విశ్వాసము, ఈమాన్ పెరుగుతుంది. దాని మూలంగా అతను అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందగలుగుతాడు.

ఇక ఆరోది ఏమిటంటే పశ్చాత్తాపం, ‘అత్తౌబతు అనిల్ మ’ఆసీ’. పశ్చాత్తాపం. ఏవైతే మనము చెడు కర్మలు చేసి ఉన్నామో, నేరాలు చేసి ఉన్నామో, దాని పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. అల్లాహ్ త’ఆలాతో ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా వైపు మరలుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ త’ఆలాతో క్షమాపణ, మన్నింపు కోరుతూ ఉండాలి. దీని మూలంగా మన యొక్క పాపాలు అల్లాహ్ తబారక వ త’ఆలా తుడిచి పెడతాడు. దాని ద్వారా మన యొక్క ఈమాన్ పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం మనకు కలుగుతుంది. మనిషి ఏ సమయంలో ఎలాంటి పాపం చేస్తాడో అతనికే తెలుసు. కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అతను పాపాలు చేస్తాడు, ఆ పాపాలు అతనికి గుర్తు ఉండవు. కనుక అల్లాహ్ తబారక వ త’ఆలాతో దుఆ ఏమని చేయాలంటే, ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, తెలియక చేశానో అన్నిటినీ నువ్వు క్షమించు అని అల్లాహ్ త’ఆలాతో మన్నింపు కోరుతూ ఉండాలి.

పశ్చాత్తాపం చేయటానికి, క్షమాపణ కోరటానికి, మన్నింపు కోరటానికి గడువు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, రాత్రిళ్ళలో ఎవరైతే పాపాలు చేస్తారో, నేరాలు చేస్తారో అతని కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా పగలు తన రెండు హస్తాలను చాచి, ఓ నా భక్తులారా! ఎవరైతే రాత్రిళ్ళలో మీరు పాపాలు చేసి ఉన్నారో, నేరాలు చేసి ఉన్నారో, నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ సమయంలో ఎవరైతే అల్లాహ్ తబారక వ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతారో, అల్లాహ్ త’ఆలా వారిని క్షమిస్తాడు, మన్నించి వేస్తాడు. అదే విధంగా పగటి పూట ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, వారి కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా రాత్రి తన హస్తాలు చాచి, ఓ నా దాసులారా! మీరు పగటిపూట ఏమైనా నేరాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, రండి, క్షమాపణ కోరండి, మీ పాపాలను నేను తుడిచి వేస్తాను, మన్నించి వేస్తాను. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పాపం పట్ల పశ్చాత్తాపం చెందితే మళ్ళీ బహుశా నాతో పాపం జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పశ్చాత్తాపం చెందకూడదు. జీవితంలో చివరి కాలంలో, శేష జీవితంలో నేను పాపాల నుండి విముక్తి పొందటానికి అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరాలి అనే భావన అతనిలో కలిగి ఉంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు, పొరపాటు. మనిషి అన్న తర్వాత చిన్న పాపాలు గాని, పెద్ద పాపాలు గాని, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా క్షమిస్తూనే ఉంటాడు. గఫూరుర్ రహీం. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఎల్లప్పుడూ తమ పాపాల పట్ల అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతూ ఉండాలి.

ఇక ఏడో మార్గం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా అవతరింపజేసిన ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అల్లాహ్ తబారక వ త’ఆలా మహత్తరమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. మన సాఫల్యం కోసం, పరలోకంలో మనం విజయం సాధించాలనే ఉద్దేశ్యముతో అల్లాహ్ త’ఆలా మన కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈనాడు మన స్థితి కాస్త గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది, అదేమిటంటే ఖురాన్ చదవటం వచ్చిన వాళ్ళు అయినా సరే, ఖురాన్ చదవటం రాని వాళ్ళు అయినా సరే సమానమయ్యారు. ఖురాన్ చదవటానికి వారి వద్ద సమయం లేదు. ఖురాన్ నేర్చుకోవడానికి వారి వద్ద సమయం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం. నిజమైన గ్రంథం. ఈ భూమండలంలో ఏదైనా నిజమైన గ్రంథం, అల్లాహ్ యొక్క దైవ గ్రంథం ఉండినట్లయితే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. అసలైన స్థితిలో అలాగే భద్రంగా ఉంది.

ఎంత అభాగ్యులు వారు, ఎవరైతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాగిస్తున్నారో. చాలా దురదృష్టవంతులు. అల్లాహ్ యొక్క గ్రంథం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మనలో విశ్వాసం దాన్ని చదవడానికి, దాన్ని పారాయణం చేయడానికి, కంఠస్థం చేయడానికి ఎలా తహతహలాడాలంటే అంత ఉత్సాహంతో ఉండాలి. ఖురాన్ గ్రంథం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ఎవరైతే ఒక అక్షరం చదువుతాడో దానికి బదులుగా అల్లాహ్ తబారక వ త’ఆలా పది పుణ్యాలు లభింపజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలు, పదాలు అనేక అక్షరాలతో కూడి ఉన్నాయి. అది చదవంగానే అల్లాహ్ తబారక వ త’ఆలా వారికి ఎంతో విలువైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాని మూలంగా వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం వారికి లభిస్తుంది. కనుక ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, ఒక సూరా వచ్చినా, మొత్తం ఖురాన్ వచ్చినా, నిరంతరంగా చదువుతూ ఉండాలి.

అల్లాహ్ తబారక వ త’ఆలా సూరె ఫుర్ఖాన్ లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రళయ దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సన్నిధిలో అంటారు, “యా రబ్బీ ఇన్న హాజల్ కౌమీత్తఖజూ ఖురాన మహ్జూరా”. ఓ నా ప్రభువా! ఈ నా జాతి వారు ఖురాన్ గ్రంథాన్ని చదవటం విడిచిపెట్టారు. కనుక ఈ స్థితి రాకుండా మనం ఏం చేయాలంటే, ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దాని దాని కారణంగా మనకు మేలు జరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం దొరుకుతుంది.

ఎనిమిదో మార్గం ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ త’ఆలా మన సన్మార్గం కోసం పంపించాడు. ఆయన్ని ప్రవక్తగా చేసిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై పెద్ద ఉపకారమే చేశాడు. ఆయన చెప్పకపోతే, ఆయన మార్గాన్ని సూచించకపోతే నిజమైన మార్గం మనకు దొరికేది కాదు. అర్థమయ్యేది కాదు. కనుక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ చదువుతూ ఉండాలి.

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.

ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చదివే దరూద్, పంపే దరూద్ అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించి ఉన్నారు, మీలో ఎవరైతే నాపై ఎక్కువ దరూద్ పంపుతారో, చదువుతారో అతను నాకు సమీపంగా ఉంటాడు. అల్లాహ్ సామీప్యం పొందడానికి ఈ దరూద్ కూడా మనకు తోడ్పాటు అవుతుంది.

అలాగే తొమ్మిదో మార్గం ఏమిటంటే, మంచి వ్యక్తులతో స్నేహం కలిగి ఉండాలి. స్నేహం అన్నది కేవలం ప్రపంచంలో మనం చెప్పుకుంటా స్నేహం కాదు. సద్వర్తుల స్నేహం. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో, ఎల్లప్పుడూ అల్లాహ్ ని గుర్తు చేస్తూ ఉంటాడో, అల్లాహ్ యొక్క విధేయతను పాటిస్తూ ఉంటాడో, అల్లాహ్ తో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారి యొక్క స్నేహాన్ని మనము చేసుకోవాలి. మనము ఇటువంటి వారిని స్నేహించము. మన జీవిత కాలంలో మనకున్న స్నేహాలు, స్నేహితులు వేరు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే సూచిస్తున్నాడో అది వేరు. కనుక గుర్తుంచుకోవాలి, స్నేహం చేసేటప్పుడు మనలో ఉన్న గుణం ఏమిటి, అది మన స్నేహం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక మంచి మనిషి అల్లాహ్ తో భయపడేవాడు, అల్లాహ్ పట్ల సంతుష్టుడయ్యేవాడు, అల్లాహ్ యొక్క దాసులతో ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు. కనుక మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. దాని మూలంగా వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న కర్మలు మనకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాని ద్వారా మన విశ్వాసం కూడా, ఈమాన్ కూడా పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సన్నిధిలో మనము కూడా ఒక సామీప్యాన్ని పొందగలుగుతాం.

పదోది ఏమిటంటే, దానము చేయటం, పేదవారిపై దానము చేయటం. దానం చేయడాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా ఎంతో మెచ్చుకుంటాడు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఏదైతే మీకు నేను ప్రసాదించి ఉన్నానో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టండి పేదవారిపై. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఏదైతే అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించి ఉన్నాడో, అది కొంత అయినా ఎంతైనా సరే, అందులో నుంచి ఖర్చు పెట్టి అల్లాహ్ ప్రసన్నత కోరటం అనేది ఇక్కడ మాట. ఎల్లప్పుడూ అల్లాహ్ తబారక వ త’ఆలా కోసం, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనము దానధర్మాలు చేస్తూ ఉండాలి. దీని మూలంగా అల్లాహ్ యొక్క సామీప్యం మనకు దొరుకుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలు ఎంతో శ్రమపడి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క ప్రసన్నత కోరేవారు. ఒక సందర్భంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రవేశపెట్టారు. వారి స్థితిని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తో అన్నారు, ఓ అబూబకర్! ఇవన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంట్లో ఏమి పెట్టుకున్నావు? ఆయన అన్నారు, ప్రవక్తా! నేను ఇంట్లో అల్లాహ్ మరియు ప్రవక్తను వదిలేసి వచ్చాను.

ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు అల్లాహ్ ప్రసన్నత కోసం అనేక విధాలుగా ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలని.

ఈ పది సూత్రాలు, పది మార్గాలు ఉన్నాయి అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి.

అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే, అప్పుడు అల్లాహ్ తబారక వ త’ఆలా మా యొక్క ప్రతి మాటను వింటూ ఉంటాడు, మేము కోరేదానికి అల్లాహ్ తబారక వ త’ఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ‘లవ్ అఖ్సమ అలల్లాహి ల అబర్రహ్’. అల్లాహ్ సామీప్యం పొందినవాడు ఎప్పుడైనా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు.

అదే విధంగా మరో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం పొందినవాడు అల్లాహ్ యొక్క స్నేహితుడు అవుతాడు, వలీ అవుతాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క వలీతో ఏదైనా విషయం పట్ల హాని కలిగించినట్లయితే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు, అతను తోనే అతనితో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాను. అల్లాహ్ మిత్రుల పట్ల, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన వారి పట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఏం చెప్తున్నాడంటే, అతనిని నేను మెచ్చుకుంటాను, అతనిని నేను ఇష్టపడతాను, అతను ఏ చేతిలోనైతే పట్టుకుంటుంటాడో ఆ చేతిని నేను అయిపోతాను. ఏ కాలి ద్వారా అయితే అతను నడుస్తూ ఉంటాడో ఆ కాలును నేను అయిపోతాను. ఏ కళ్ళ ద్వారా అతను చూస్తూ ఉంటాడో ఆ కళ్ళు నేను అయిపోతాను. అని ఎంతో ప్రేమతో, ఎంతో ప్రసన్నతతో అల్లాహ్ తబారక వ త’ఆలా చెప్తున్నాడు.

అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే మన యొక్క ప్రతి మాట అల్లాహ్ తబారక వ త’ఆలా వింటాడు. మేము ఏది కోరితే అల్లాహ్ తబారక వ త’ఆలా అది మాకు ప్రసాదిస్తాడు.

కనుక చివరిగా అల్లాహ్ తబారక వ త’ఆలా తో దుఆ ఏమనగా, ఏవైతే మనం విన్నామో ఆ మాటలని గుర్తించి సరైన మార్గంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు ప్రసాదించు గాక. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏవైతే విధిగా చేసి ఉన్నాడో వాటిని ఆచరించి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17147


అనేక సమస్యలకు ఒక్కటే పరిష్కరం: ఇస్తిగ్ఫార్ (అల్లాహ్ తో క్షమాభిక్ష) [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 21
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7 నిముషాలు )

సూరా 71. నూహ్ , ఆయతులు 10 నుండి 12

71:10 فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا
“నేనిలా అన్నాను – క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.”

71:11 يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
“ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.”

71:12 وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
“మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.”

సూరా 11.హూద్ , అయతులు 3, 52

11:3 وَأَنِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُمَتِّعْكُم مَّتَاعًا حَسَنًا إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَيُؤْتِ كُلَّ ذِي فَضْلٍ فَضْلَهُ ۖ وَإِن تَوَلَّوْا فَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ
ఇంకా మీరు మీతప్పుల మన్నింపుకోసం మీప్రభువును వేడుకోండి. తర్వాత (పశ్చాత్తాపంతో) ఆయన వైపుకే మరలండి. ఒక నిర్థారిత కాలం వరకూ ఆయన మీకు మంచి (జీవన) సామగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణచేసే ప్రతిఒక్కరికీ ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను.

11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ
“ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్‌) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”

క్రింద ఇచ్చిన లింకులు సందర్శించి మరింత జ్ఞానం పెంచుకోండి:

ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్): సూరా బకరా: ఆయత్ 153 – 167 [వీడియో]

బిస్మిల్లాహ్

[52:08 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [52:08 నిముషాలు]

అహ్సనుల్ బయాన్ నుండి:

153 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్‌ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.

2:154 وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
అల్లాహ్‌ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.

2:155 وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ
మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.

2:156 الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు.

2:157 أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.

2:158 إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ ۖ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ
నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్‌ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్‌ ఉమ్రహ్‌లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్‌ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు.

2:159 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَٰئِكَ يَلْعَنُهُمُ اللَّهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ
మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్‌ శపిస్తాడు. ఇంకా, వేరే శపించే వారు కూడా వారిని శపిస్తారు.

2:160 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ
అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సంస్కరించుకుని, సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను (వారి తప్పును మన్నిస్తాను). నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి.

2:161 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి, అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్‌ మరియు ఆయన దూతల, ఇంకా జనులందరి శాపం పడుతుంది.

2:162 خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ
అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి కొంత విడుపు ఇవ్వటంగానీ జరగదు.

2:163 وَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ
మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.

2:164 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్‌ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి.

2:165 وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ
కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్‌ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్‌ పాపానికి ఒడిగట్టరు).

2:166 إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.

2:167 وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ
అప్పుడు (కనువిప్పు కలిగిన) అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు (ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరిపట్ల విసుగును ప్రదర్శించేవారం.” ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్‌ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినాసరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం.

ఇతరములు:

ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు – హిస్న్ అల్ ముస్లిం నుండి

బిస్మిల్లాహ్

129. ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు

248. “అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతి దినము డెబ్బైసార్లకంటే ఎక్కువ అల్లాహ్ ను మన్నింపుకై వేడుకుంటాను, మరియు పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతుంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు. (బుఖారీ). [అల్ బుఖారీ, అల్ అస్ఖలాని ఫత్-హుల్ బారీ 11/101]


249. “ప్రజలారా! పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి నేనయితే రోజుకు వందేసి సార్లు క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు? (ముస్లిం 4/2076).


250. ఎవరయితే “అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి” అని పలుకుతారో అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు. ఒకవేళ అతను యుద్ధభూమి నుండి పారిపోయిన వాడైనా సరే అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (అబూదావూద్, అహ్మద్, తిర్మిదీ 3-182).

أَسْتَغْفِرُ اللهَ الْعَظِيمَ الَّذِي لَا إِلَهَ إلَّا هُوَ الحَيُّ القَيُّومُ وأَتُوبُ إِلَيْهِ

అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి

నేను  మహోన్నతుడు అయిన అల్లాహ్ మన్నింపు కోరుతున్నాను. ఆయన తప్ప (నిజ) ఆరాధ్యుడు ఎవరూ లేరు. అయన నిత్యుడు. శాశ్వతుడు. నేను అయన సమక్షంలోనే తౌబా చేస్తున్నాను.

[దీనిని అబుదావూద్ ఉల్లేఖించారు. 2/85, అత్తిర్మిదీ 5/569, అల్ హాకిం 1/115 సహీహ్ మరియు అజ్జహబీ ఏకీభవించారు. అల్బానీ గారు దీనిని సహీహ్ అన్నారు. చూడుము సహీహ్ అత్తిర్మిదీ 3/182 జామిఆ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం 4/389–390 అల్ అర్నావూత్ శోధన.]


251. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకటించారు: “రాత్రి చివరి గడియలలో ప్రభువు దాసునికి అతి చేరువలో ఉంటాడు. ఆ వేళ అల్లాహ్ ను  స్మరించే వారిలో మీరు కూడా చేరాలనుకుంటే చేరండి.”

[దీనిని అత్తిర్మిదీ, అన్నిసాఈ 1/279, మరియు అల్ హాకిం ఉల్లేఖించారు. చూడుము అల్ అల్బానీ సహీహ్ అత్తిర్మిదీ 3/183 మరియు జామిఅ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్ అర్నావూత్ శోధన 4/144. ]


252. “సజ్దా స్థితిలో దాసుడు అల్లాహ్ కు అతి చేరువలో ఉంటాడు. కనుక ఆ స్థితిలో మీరు (అల్లాహ్ ను) ఎక్కువగా వేడుకోండి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం 1/350, అబుషేబా).


253. “అప్పుడప్పుడు నా మనసుకు ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను రోజుకు నూరుసార్లు అల్లాహ్ క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం).

[దీనిని ముస్లిం ఉల్లేఖించారు 4/2075, ఇబ్నుల్ అధీర్ అలా అన్నారు: “లయుఘాను అలా ఖల్ బీ” నాహృదంపై మీద పొర వచ్చినప్పుడు అంటే, దీని అర్థం : తప్పిదం పొరపాటు (మరచిపోవుట) : ఎందుకంటే రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎల్లప్పుడు అధికంగా స్మరణలో నిమగ్నులై ఉండేవారు, అయితే ఎప్పుడైనా కొన్ని సమయాలలో వారు మరచిపోతే దానిని వారు తన తప్పిదముగా లెక్క కట్టేవారు మరియు క్షమాభిక్ష వేడుకునేవారు. చూడుము జామిఅ అల్ ఉసూల్ 4/386.]


ఇది హిస్న్ అల్ ముస్లిం (తెలుగు)  అనే పుస్తకం నుండి తీసుకోబడింది ( కొన్ని చిన్న మార్పులతో)
అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని.
అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ.
https://teluguislam.net/2010/11/23/hisn-al-muslim-vedukolu-telugu-islam/

పశ్చాత్తాపం (తౌబా):రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
రెండవ అధ్యాయం – హదీసులు # 13– 24

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

పశ్చాత్తాపం (తౌబా) – యూట్యూబ్ ప్లే లిస్ట్ 
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV132qYigRnubXEJQLDjCdjk

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

భాగం 01 (హదీసు #13,14) (32 నిముషాలు)

భాగం 02 (హదీసు #15,16,17,18) (36 నిముషాలు)

భాగం 03 (హదీసు #19,20) (34 నిముషాలు)

భాగం 04 (హదీసు #21) (44 నిముషాలు)

భాగం 05 (హదీసు #22,23,24) (38 నిముషాలు) – చివరి భాగం


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
పశ్చాత్తాపం (తౌబా) [PDF]


హదీసులు మీ సౌకర్యం కోసం క్రింద ఇవ్వ బడ్డాయి:

విద్వాంసుల స్పష్టీకరణ : జరిగిపోయిన ప్రతి పాపానికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి, దాసుని పాపం అల్లాహ్‌కు మరియు ఆ దాసునికే పరిమితమై సాటి మానవుల హక్కుకి దానితో ఎలాంటి సంబంధం లేనట్లయితే అలాంటి వ్యక్తి పశ్చాత్తాపం అంగీకరించబడటానికి మూడు షరతులు ఉన్నాయి.

  • ఒకటి : పశ్చాత్తాపం చెందుతున్న పాపానికి తను పూర్తిగా స్వస్తి పలకాలి.
  • రెండు : జరిగిపోయిన పాపానికి సిగ్గుతో కుమిలిపోవాలి,
  • మూడు : భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలా చేయనని గట్టిగా నిశ్చయించుకోవాలి.

ఈ మూడు నియమాల్లో ఏ ఒక్కటి లోపించినా అతని పశ్చాత్తాపం సరైనది కాదు.

ఒకవేళ జరిగిన పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే పశ్చాత్తాపం దైవ సన్నిధిలో అంగీకరించబడటానికి నాలుగు నిబంధనలున్నాయి.

  • పై మూడు నిబంధన లతో పాటు నాల్గవ నిబంధన ఏమిటంటే, అతను తోటి మానవుని హక్కుని అతనికి తిరిగి ఇచ్చివేయాలి. పరులనుండి ధనం లేక మరేదైనా వస్తువు అధర్మంగా తీసుకొనివుంటే దాన్ని వాపసుచేయాలి. తోటి వ్యక్తులపై నీలాపనిందలు ఇత్యాదివి మోపి వున్నట్లయితే వారి శిక్షను తాను అనుభవించాలి లేదా క్షమాభిక్ష కోరి వారిని సంతోషపరచాలి. తోటి మనిషి వీపు వెనక చాడీలు చెప్పివుంటే అతణ్ణి నిర్దోషిగా నిలబెట్టాలి.

అయితే పాపాలన్నిటిపై పశ్చాత్తాపం చెందటం మాత్రం తప్పనిసరి. ఏవో కొన్ని పాపాలపై మాత్రమే పశ్చాత్తాపపడితే అహ్లే సున్నత్‌ వారి దృష్టిలో ఆయా విషయాల్లో అతని పశ్చాత్తాపం సరైనదే గాని ఇతర పాపాలు మాత్రం ఇంకా అతనిపై మిగిలే వుంటాయి.

పాపాలపై పశ్చాత్తాపం అవసరమన్న విషయమై ఖుర్‌ఆన్‌ హదీసుల్లో అనేక ఆధారాలున్నాయి. వాటిపై ముస్లిం సమాజ ఏకాభిప్రాయమూ ఉంది.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : “ఓ విశ్వాసులారా! మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్‌ వైపుకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు.” (నూర్‌ – ౩7)

మరోచోట అల్లాహ్‌ ఉపదేశిస్తున్నాడు : “మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపుకే మరలండి (పాపాల పశ్చాత్తాపపడండి).” (హూద్‌ – ౩)

ఇంకొకచోట ఇలా అంటున్నాడు : “విశ్వసించిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్‌ వైపుకు మరలండి.” (తహ్రీమ్‌ – 8)


13. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:

“అల్లాహ్ సాక్షి! నేను రోజుకు డెబ్భైకన్నా ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడుకుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉంటాను.” (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రార్ధనల ప్రకరణం.)

ముఖ్యాంశాలు:

1. ఈ హదీసులో నిత్యం పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ మన్నింపు కోసం వేడుకుంటూ ఉండాలని పురికొల్పడం జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అత్యంత పునీతులు. అల్లాహ్‌ ఆయన వెనుకటి పాపాలను, జరగబోయే పాపాలను అన్నింటినీ మన్నించాడు. అసలు ఆయన చేత దొర్లిన పొరపాట్లను పాపాలు అనడం కూడా సబబు కాదు. అయితే సాధారణ వ్యక్తులకు సమ్మతమైనవిగా భావించబడే కొన్ని పనులు మహనీయులకు శోభాయమానం కావు. ఆయన గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదో ఒక దశలో స్వల్పమయిన పొరపాట్లు జరగవచ్చు. అలాంటి దైవప్రవక్తే రోజుకు డెబ్బైకన్నా ఎక్కువసార్లు పాపాల మన్నింపు కోసం వేడుకుంటుండగా పీకలదాకా పాపాల్లో మునిగివున్న మనం ఎలా ఉపేక్షించబడతాం!

2. నిరంతరం వీలైనంత ఎక్కువగా పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉండాలి. దీనివల్ల మనకు తెలియకుండానే మనవల్ల దొర్లిపోయే తప్పిదాలు మన్నించబడతాయి. రాబోయే హదీసులో కూడా పశ్చాత్తాప భావన గురించే నొక్కి వక్కాణించబడింది.


14. హజ్రత్ అగర్ర్ బిన్‌ యసార్‌ ముజనీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :

“ప్రజలారా! పాపాలపై పశ్చాత్తాపభావంతో అల్లాహ్‌ వైపుకు మరలండి. మన్నింపు కోసం ఆయన్ను వేడుకోండి. నేను అల్లాహ్ సన్నిధిలో రోజుకు వందసార్లు పశ్చాత్తాప భావంతో కుంగి పోతూ ఉంటాను.”

(సహీహ్‌ ముస్లింలోని ధ్యాన ప్రకరణం)


15. దైవప్రవక్త సేవకులు, హజ్రత్‌ అబూ హంజా అనస్‌ బిన్‌ మాలిక్‌ అన్సారీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :

“తన దాసుడు పాపాలపై పశ్చాత్తాప పడినందుకు అల్లాహ్‌, ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టుకొని తిరిగి పొందిన వ్యక్తి కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు.” (బుఖారీ – ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో తన ఒంటెపై ప్రయాణిన్తున్నాడు. దానిపైనే అతని ఆహారసామగ్రి, నీరు ఉన్నాయి. (మార్గమధ్యంలో) ఆ ఒంటె తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె దొరకదని భావించాడు. (వెతికి వేసారి) నిరాశతో తిరిగి వచ్చి ఓ చెట్టు నీడలో మేనువాల్చాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి అతని ముందు నిలబడింది. వెంటనే అతను దాని ముక్కుతాడు పట్టుకొని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్పైపోయి “ఓ అల్లాహ్‌! నీవే నా దాసుడివి, నేనునీ ప్రభువును” అన్నాడు. సంతోషం పట్టలేక ఆ వ్యక్తి మాటలు అలా తడబడ్డాయనుకుంటే నిశ్చయంగా అల్లాహ్‌ తన దాసుని పశ్చాత్తాపంపై అంతకన్నా ఎక్కువగానే సంతోషిస్తాడు.

(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం. సహీహ్‌ ముస్లింలోని పశ్చాత్తాప ప్రకరణం)

ముఖ్యాంశాలు:

1.పై హదీసులో కూడా పశ్చాత్తాపం ప్రోత్సహించబడింది, దాని ప్రాముఖ్యత గురించి నొక్కి వక్కాణించటం జరిగింది.

2. దాసుల పశ్చాత్తాప భావం చూసి అల్లాహ్‌ అమితంగా సంతోషిస్తాడు.

3. అసంకల్పితంగా దొర్లిపోయే పారబాట్లను తప్పుపట్టడం జరగదు. మాటల్లో చేవ తీసుకురావటం కోసం విషయాన్ని ప్రమాణం చేసి మరీ చెప్పటం ధర్మసమ్మళమే.

5. విషయాన్ని బోధపరిచేందుకు ఉదాహరణలు కూడా ఇవ్వవచ్చు.


16. హజ్రత్‌ అబూ మూసా అబ్దుల్లాహ్‌ బిన్‌ ఖైస్‌ అష్‌అరీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్పోధించారు:

“పగటిపూట పాపం చేసినవాడు రాత్రికి పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్‌ రాత్రివేళ తన చేయిని చాపుతాడు. అలాగే రాత్రి వేళ పాపం చేసినవాడు పగలు పశ్చాత్తాపం చెందుతాడని అల్లాహ్‌ పగటిపూట తన చేయిని చాచి ఉంచుతాడు. (ఈ పరంపర) సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించేంతవరకూ (అంటే ప్రళయం వచ్చేంత వరకు) కొనసాగు తూనే ఉంటుంది.” (ముస్లిం)

ముఖ్యాంశాలు:

‘పై హదీసులో అల్లాహ్‌కు చేయి కూడా ఉంటుందనే గుణం గురించి వివరించడమైనది. అయితే ఆ చెయ్యి ఎలా ఉంటుంది? దాన్ని ఆయన ఎలా చాపుతాడు? అనే విషయం వాస్తవిక స్వరూప స్వభావాల గురించి మనకు తెలియదు. దాన్ని మనం వివరించనూలేము. అయితే దాని వాస్తవిక స్వరూప స్వభావాలు తెలియకపోయినప్పటికీ ఊహాగానాలు, ఉపమానాలు ఇవ్వకుండా దానిపై విశ్వాసముంచటం అవసరం. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే, రేయింబవళ్ళలో ఎప్పుడైనా ఏదైనా తప్పిదం జరిగిపోతే ఏమాత్రం జాప్యం చేయకుండా మనిషి వెంటనే పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ దైవసన్నిధిలో మోకరిల్లాలి.


17. హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :

“సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించక మునుపే తన పాపాలపై పశ్చాత్తాపం చెందే వాని పశ్చాత్తాపాన్ని అల్లాహ్‌ సమ్మతించి ఆమోదిస్తాడు.” (ముస్లిం)

(సహీహ్‌ ముస్లింలోని ధ్యానం, ప్రార్ధనల ప్రకరణం)

ముఖ్యాంశాలు: 

నిఘంటువు ప్రకారం “తౌబా” అంటే మరలటం అని అర్థం. మనిషి పాపం చేసినప్పుడు అల్లాహ్‌కు దూరమవుతాడు. తిరిగి “తౌబా” చేసుకున్నప్పుడు (పశ్చాత్తాప పడినప్పుడు), ఆయన వైపుకి మరలి ఆయన సాన్నిహిత్యం, ఆయన క్షమాభిక్ష కోసం పరితపిస్తాడు. ఈ మార్పును, ఈ మరలింపునే ‘తౌబా‘ (పశ్చాత్తాపం) అంటారు. అల్లాహ్‌ అతని వైపు దృష్టి సారిస్తాడంటే అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడని భావం.


18. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్‌ అబూ అబ్దుర్రహ్మాన్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ తెలియజేశారు:

“జీవితంలోని అంతిమ ఘడియలు దాపురించక ముందువరకూ అల్లాహ్‌ తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు.”

ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి హసన్‌గా ఖరారు చేశారు. (సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలో చరమ ఘడియలకంటే ముందు పశ్చాత్తాపం  ఆమోదించబడుతుందన్న అధ్యాయంలో ఈ హదీసు  ప్రస్తావించ బడింది)

ముఖ్యాంశాలు:

‘పై హదీసులో “గర్‌గరా” అనే పదం వాడబడింది. ఇది ఆత్మ శరీరాన్ని వదలి కంఠానికి చేరుకునేదానికి ధ్వన్యానుకరణం. అంటే జీవితపు చివరి శ్వాసలన్నమాట. ఈ హదీసును ‘హసన్‌’గా ఖరారు చేయడం జరిగిందంటే ఈ హదీసు పరంపరలో వైవిధ్యాలకు, లొసుగులకు తావులేదు గాని దీని ఉల్లేఖకులు సహీహ్‌ హదీసుల ఉల్లేఖకుల కంటే తక్కువ స్థాయికి చెందినవారని అర్ధం. హదీసువేత్తల దృష్టిలో సహీహ్‌ హదీసుల మాదిరిగా “హసన్‌” కోవకు చెందిన హదీసులు కూడా ఆచరించదగినవే.