నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం

311. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మొదట్లో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే ఆయనకు సలాం చేసే వాళ్ళము. నమాజు స్థితిలోనే ఆయన మాకు ప్రతి సలాం పలికేవారు. అయితే మేము (అబిసీనియా రాజు) నజాషీ దగ్గర నుండి (వలస వెళ్లి) తిరిగి వచ్చిన తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు (నమాజు స్థితిలో) సలాం చేస్తే, ఆయన మాకు సమాధానమివ్వలేదు. (నమాజు ముగిసిన తరువాత) “నమాజు చేస్తున్నప్పుడు మనిషికి ఏకాగ్రత చాలా అవసరం” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 21 వ ప్రకరణం – అల్ అమలు ఫిస్సలాత్, 2 వ అధ్యాయం – మాయున్హా మినల్ కలామి ఫిస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 7 వ అధ్యాయం – నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ముహర్రం – సాంప్రదాయాలు, దురాచారాలు

“ముహర్రముల్ హరామ్” ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం మొదటి మాసం. ప్రతి సంవత్సరం ఈ మాసం వచ్చి- నప్పుడు ప్రవక్త జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం గుర్తుకు వస్తుంది. అదే ‘హిజ్రత్’ (మక్కా నుండి మదీనాకు వలసపోవుట). హిజ్రత్ తరువాతనే ఇస్లాం ధర్మం బల పడింది. ఇతర ప్రాంతాలకు అతి వేగంగా పాకింది. ఇస్లాం దర్మాన్ని కాపాడుటకొనుటకు స్వదేశాన్ని వీడిపోయే సందర్భం వచ్చినా నేను సిద్ధం అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ ముహర్రం మాసం.

ఇస్లామీయ పన్నెండు మాసాల్లో నాలుగు మాసాలు చాలా గౌరవనీయమైనవి. (ఖుర్ఆన్ 9:36). అందులో ఒకటి ఇది కూడాను. ప్రవక్త సల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః

“పన్నెండు నెలలది ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవనీయమైనవి. మూడు క్రమంగా ఉన్నాయి; జుల్ ఖాద, జుల్ హిజ్జ, ముహర్రమ్. నాల్గవది; జుమాద మరియు షఅబాన్ మధ్యలోని రజబ్”. (బుఖారి 3197).

పై ఆయతు మరియు హదీసు ద్వారా తెలిసిందేమిటంటే ఈ పవిత్ర మాసములో ముస్లిములు ఇతర మాసాలకంటే ఎక్కువగా పాపాలకు దూరంగా ఉండాలి. ఇస్లాం వ్యాప్తికై, దాని ప్రాభల్యానికై నిరంతరం కృషి చేయాలి. సమాజంలో అన్ని రకాల చెడుల రూపు మాపడానికి ప్రయత్నం చేయాలి. ఎల్లవేలల్లో అల్లాహ్ భయబీతి (తఖ్వా) పాటించాలి. అప్పుడే అల్లాహ్ మనతో ఉండి మన ప్రతి కార్యానికి సహాయపడతాడు.

ఈ పవిత్ర మాసము ఘనత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః “రమజాను మాసంలోని విధి ఉపవాసాల తరువాత ఉత్తమమైన ఉపవాసాలు అల్లాహ్ మాసము ముహర్రమ్ యొక్క ఉపవాసాలు”. (ముస్లిం 1163). స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు. తమ సహచరులకు దీని గురించి ప్రోత్సహించేవారు. రుబయ్యిఅ బిన్తె ముఅవ్విజ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త కాలంలో సహచరులు వారి పిల్లవాళ్ళు కూడా ఈ మాసంలో ఉపవాసాలుండేవారు. (బుఖారి 1960, ముస్లిం 1136). రమజాను ఉపవాసాలు విధికాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండింది. మరియు అదే రోజు కాబాపై క్రొత్త వస్త్రం వేయబడేది. (బుఖారి 1592). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నగరానికి వలస వచ్చిన తరువాత యూదులు కూడా ఆషూరా రోజు ఉపవాసం పాటించడాన్ని చూసి, వారిని అడిగితే వారు చెప్పారుః ‘ఈ రోజు సుదినం. ఈ దినమే అల్లాహ్ ఇస్రాయీల్ సంతతిని వారి శత్రువుల బారి నుండి విముక్తి కలిగించాడు. అందుకు హజ్రత్ మూసా  అలైహిస్సలాం ఈ రోజు ఉపవాసం పాటించారు’. అప్పడు ప్రవక్త ఇలా ప్రవచించారుః “మూసా అనుకరణ హక్కు మాకు మీ కంటే ఎక్కువ ఉంది”. ఆ తరువాత ప్రవక్త ఉపవాసం పాటించారు, తమ సహచరులకు దీని ఆదేశమిచ్చారు. (బుఖారి 2004).

ఆషూరా రోజు ఉపవాసం ఘనతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

“ఆషూరా రోజు ఉపవాసం గురించి అడిగినప్పుడు చెప్పారుః “అందువల్ల గత ఒక సంవత్ససరపు పాపాలు మన్నించబడతాయి”. (ముస్లిం 1162).

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరతో పాటు తొమ్మిదవ తేదిన ఉపవాసం పాటిస్తానని ఉద్దేశించారు. అంటే 9, 10 రెండు రోజులు. (ముస్లిం 1134). అయితే 10, 11 రెండు రోజులు లేదా 9,10,11 మూడు రోజులు కూడా ఉపవాసముండవచ్చని కొందరు పండితులు చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు బలహీనంగా ఉన్నాయి. ఇవి ముహర్రం మాసములోని ధర్మాలు.

ప్రవక్తశ్రీ సల్లల్లాహు అలైహి వసల్లంతో రుజువు కాని, ధర్మంగా భావిస్తూ చేస్తున్న పనులను విడనాడాలి. ఉదాహరణకుః పీరీల పండుగలు. ఈ పండుగలు చేయాలని మనకు ఖుర్ఆనులో గాని లేదా ప్రవక్తశ్రీ గారి సహీ హదీసుల్లో గాని ఏదైనా ఆధారం గలదా? కనీసం హజ్రత్ హుసైన్ రజియల్లాహు అన్హు ఇలా చేయాలని ఏదైనా ఆదేశం ఇచ్చారా? మరి కొందరు ఈ పవిత్ర మాసాన్ని అపశకునంగా భావిస్తారు. అంటే వివాహము వంటి ఏదైనా శుభకార్యం ఇందులో చేయరాదని భావిస్తారు. దీనికి ఏ ఆధారమూ మన ఇస్లామ్ ధర్మంలో లేదు. ఇవి ప్రజల మూఢనమ్మకాలు మాత్రమే. ఇంకొందరు నల్లటి దుస్తులు ధరించి శోక వ్రతం అని పాటి-స్తారు. దీనికి కూడా ఇస్లాంలో ఏ మాత్రం అనుమతి లేదు. మరి కొందరు ఈ మాసంలో ఇమాం హుసైన్ రజియల్లాహు అన్హు పేరున మ్రొక్కుబడులు చేస్తారు. మ్రొక్కుబడి ‘ఇబాదత్’ (ఆరాధన), ఇది అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట ఎంతమాత్రం యోగ్యం కాదు.

అల్లాహ్ మనందరిని ఇస్లాంపై స్థిరంగా ఉంచుగాకా! దురాచారాల నుండి దూరముంచి, ప్రవక్త సహీ సాంప్ర దాయాలను అనుసరించే భాగ్యం నొసంగుగాకా! ఆమీన్

ఈ కరపత్రాన్ని చదివిన సోదరులు ఇందులో ఏ విధమైన తప్పులు గోచరించినచో క్రింది మోబైల్ నం. పై లేదా మేల్ పై తెలియజేయగలరని మనవి. +966533458589 gdknaseer@gmail.com

సౌదీ అరబియా క్యాలెండర్ ప్రకారం  ఆషూరా – 24th Nov 2012 వచ్చింది. ఇండియా లో 25 కావచ్చు. కాబట్టి 24 and 25 Nov ఉపవాసం ఉండటం మంచిది.

ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసం యొక్క విశిష్టత

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క విశిష్టత

ఆషూరాఅ రోజు (ముహర్రం నెల 10 తేదీ) ఉపవాసం గురించి అడిగిన ప్రశ్నకు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారని అబూ ఖతాదహ్ రధి అల్లాహు అన్హు ఉల్లేఖించినారు :

” ఆయన ఆషూరాఅ రోజు ఉపవాసానికి ప్రతిఫలంగా క్రిత సంవత్సరపు పాపాలు (చిన్న పాపాలు) మన్నిస్తాడని నేను అల్లాహ్ నుండి ఆశిస్తున్నాను.”

ఆషూరాఅ దినమున ఉపవాసం పాటించే పద్ధతి :

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క మూడు పద్ధతులను కొందరు ఇస్లామీయ పండితులు ఇలా తెలిపినారు.

(1) ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసంతో పాటు, దాని ముందు రోజున లేదా దాని తరువాత రోజున కూడా ఉపవాసం ఉండటం.
(2) కేవలం ఆషూరాఅ రోజున (ముహర్రం 10 వ తేదీన) మాత్రమే ఉపవాసం ఉండటం.
(3) ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసంతో పాటు, దాని ముందు రోజు (ముహర్రం 9 వ తేదీ) మరియు దాని తరువాత రోజులలో (ముహర్రం 11 వ తేదీలలో) కూడా ఉపవాసం ఉండటం, అంటే వరుసగా మూడు రోజులు (ముహర్రం నెల 9, 10 మరియు 11 వ తేదీలు) ఉపవాసం పాటించడం.

ఆషూరాఅ దినమున ఉపవాసం ఎందుకు ఉండవలెను :

ఆషూరాఅ దినమున అంటే ముహర్రం 10 వ తేదీన అల్లాహ్ తన ప్రవక్త మూసా అలైహిస్సలాం ను మరియు ఆయన ప్రజలను, ఫిరౌను మరియు అతడి ప్రజల దౌర్జన్యం నుండి రక్షించినాడు. కాబట్టి దీనికి కృతజ్ఞతగా అల్లాహ్ కొరకు ఉపవాసం ఉండవలెను.

ఆషూరాఅ రోజు ఉపవాసం – కొన్ని ప్రయోజనాలు :

  1. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరిస్తూ ఆషూరాఅ దినము యొక్క ఉపవాసం పాటించడం ఉత్తమం.
  2. ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) కంటే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తరువాత కూడా ఉపవాసం ఉండటం ఉత్తమం.
  3. ఈరోజు చాలా శుభమైనది. పూర్వం నుండే దీని పావనత్వం మరియు ఔన్నత్యం ప్రసిద్ది గాంచి యున్నది.
  4. పూర్వ సమాజములలో నెలల నిర్ణయం ఇంగ్లీషు క్యాలెండరును బట్టికాక, చంద్రుడ్ని గమనాన్ని బట్టి జరిగేదని స్పష్టమవుతున్నది. ఎందుకంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపి ఉన్నారు – అల్లాహ్ ముహర్రం 10 వ తేదీన ఫిరౌను మరియు అతడి సహచరులను వినాశం చేసినాడు. మరియు ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు అతని సహచరులకు ఆ రోజున విజయం ప్రసాదించినాడు.
  5. ఆషూరాఅ దినమున ఉపవాసం ఉండటమనేది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు (విధానం) నుండి స్పష్టంగా ద్రువీకరించబడినది. ఉపవాసం కాకుండా ఈ దినమున చేసే ఇతర చేష్టలన్నీ నూతన కల్పితాలే (బిదాఅతులే) తప్ప ఇంకేమీ కావు. అంతేకాక – అవన్నీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలకు విరుద్ధమైనది కూడా.
  • ఒక దినపు ఉపవాసానికి బదులుగా మొత్తం ఒక సంవత్సరపు పాపాలన్నీ క్షమించివేయడమనేది అల్లాహ్ మనపై చూపుతున్న అనంతమైన కరుణకు మరియు అనుగ్రహానికిఒక చిన్న మచ్చు తునక మాత్రమే. నిశ్చయంగా అల్లాహ్ సాటిలేని అనుగ్రహం కలవాడు.
  •  ఓ నా సోదరులారా! ఈ అనుగ్రహాన్ని చేజిక్కించుకోవటానికి సిద్ధపడండి. తమ నూతన సంవత్సరాన్ని అల్లాహ్ కు విధేయత చూపటంలో, దానధర్మాలు చేయటంలో మరియు పుణ్యాలు సంపాదించటంలో పోటీపడుతూ ప్రారంభించండి. పుణ్యాలు, మంచిపనులు తప్పకుండా పాపాలను, చెడుపనులను చేరిపివేస్తాయి.

(ఈ విషయాలు షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉధైమిన్ రహిమహుల్లాహ్ యొక్క నుండి మరియు షేఖ్ సాలెహ్ అల్ఫౌజాన్ హాఫిజహుల్లాహ్ యొక్క నుండి తీసుకోబడినవి.)

గమనుక : కేవలం ఆషూరాఅ రోజున మాత్రమే ఉపవాసం ఉండటంలో ఎలాంటి తప్పూ లేదు – దీనికి ఆధారం షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉధైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ఫత్వా. కాని రెండు రోజులు ఉపవాసం ఉండటం సున్నత్

గమనిక: సౌదీ అరబియా క్యాలెండర్ ప్రకారం  ఆషూరా 19th ఆగష్టు 2021 వచ్చింది. కాబట్టి 18 మరియు 19 ఆగష్టు ఉపవాసం ఉండటం మంచిది. ఇండియా లో ఆషూరా 20th ఆగష్టు. కాబట్టి 19 & 20 ఆగష్టు ఉపవాసం ఉండటం మంచిది.

మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం

882. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

మూడు మస్జిద్ ల దర్శనం కోసం తప్ప మరే పుణ్యస్థల దర్శనం కోసమూ ప్రయాణం చేయకూడదు.
(1) మస్జిదుల్ హరాం (మక్కాలోని కాబా మస్జిద్)
(2) మస్జిదె నబవి (మదీనాలోని ప్రవక్త మస్జిద్)
(3) బైతుల్ మఖ్దిస్ లోని మస్జిదె అఖ్సా

[సహీహ్ బుఖారీ : 20 వ ప్రకరణం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్ మక్కా వ మదీనా – 1 వ అధ్యాయం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్]

హజ్ ప్రకరణం – 95 వ అధ్యాయం – మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు

753. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒక వ్యక్తి అర్ఫా రోజు (Day of Arafah) వఖూఫ్ (లేచి ఉండు) స్థితిలో ఉండి హఠాత్తుగా ఒంటె మీద నుంచి జారిపడ్డాడు. అతని మెడ ఎముక విరగడంతో (అక్కడికక్కడే) చనిపోయాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అతని భౌతిక కాయానికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి రెండు వస్త్రాలతో చుట్టండి. శవానికి సువాసన పూయకండి. ముఖం (వస్త్రంతో) కప్పకుండా అలాగే బయట ఉంచండి. ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 20 వ అధ్యాయం – అల్ కఫని ఫి సౌబైన్]

హజ్ ప్రకరణం : 14 వ ప్రకరణం – ఇహ్రాం స్థితిలో యాత్రికుడు చనిపోతే ఏం చేయాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం

533. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఓ రోజు ఒక స్త్రీ సమాధి మీద కూర్చొని ఏడుస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అటుగా పోవడం జరిగింది. అపుడు ఆయన ఆ స్త్రీని చూసి “అల్లాహ్ కి భయపడి కాస్త సహనం వహించు” అని అన్నారు. దానికి ఆ స్త్రీ (ముఖం చిట్లించుకుంటూ) “మీ దారిన మీరు వెళ్ళండి, నన్ను నా మానాన వదిలెయ్యండి. నా మీద వచ్చిపడిన ఆపద మీ మీద రాలేదు. అందువల్ల మీరు (నా) బాధను అర్ధం చేసుకోలేరు” అని అన్నది.

తరువాత (కొందరు) ఆ స్త్రీకి ‘ఆయనగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)’ అని తెలియజేశారు. అది విని ఆమె (పరుగుపరుగున) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వెళ్ళింది. చూస్తే ఆయన వాకిలి ముందు ఒక్క ద్వారపాలకుడు కూడా లేడు. సరే, ఆ మహిళ [దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను కలుసుకొని] “నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను (క్షమించండి)” అని అన్నది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆపద ప్రారంభంలో వహించే సహనమే (అసలు) సహనం”(*) అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 32 వ అధ్యాయం – జియారతుల్ ఖుబూర్]

(*) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచానానికి భావం ఏమిటంటే – నీ వన్న మాటలకు నువ్వు క్షమాపణ చెప్పుకోనవసరం లేదు. నేను స్వవిషయం గురించి ఎవరి మీద కోపగించుకోను. నా ఇష్టాఇష్టాలన్నీ ధైవప్రసన్నత కోసమే పరిమితం. కాకపోతే నువ్వు కష్ట సమయంలో సహనం వహించకుండా ఏడ్పులు పెడబొబ్బలు పెట్టి నీకు దక్కే పుణ్యాన్ని పోగొట్టుకున్నావు. ఇది నీ పొరపాటు. నా విషయంలో నీవు చేసిన పొరపాటు క్షమించబడింది. కాని ధైవధర్మం విషయంలోనే నీవు పొరబడ్డావు. ఆపద ప్రారభంలో సహనం వహించి ఉంటే పుణ్యం లభించి ఉండేది. నువ్వలా చేయలేకపోయావు.

జనాయెజ్ ప్రకరణం : 8 వ అధ్యాయం – ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

షాబాన్ నెలలో ఉపవాసపు ప్రాముఖ్యత

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవ నెల షాబాన్. ఈ నెలలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా నఫిల్ ఉపవాసాలుండేవారు.

సహీ బుఖారీ 1969లో ఉంది: హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః

عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: فَمَا رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ اسْتَكْمَلَ صِيَامَ شَهْرٍ إِلَّا رَمَضَانَ، وَمَا رَأَيْتُهُ أَكْثَرَ صِيَامًا مِنْهُ فِي شَعْبَانَ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ తప్ప మరే మాసమంతా ఉపవాసం ఉన్నది చూడలేదు. మరియు షాబాన్ కంటే ఎక్కువ (ఇతర మాసాల్లో నఫిల్) ఉపవాసాలున్నది చూడలేదు.

ఈ మాసములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు అధికంగా ఉపవాసాలుండేవారో ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త గారినే అడిగారు, అందుకు ప్రవక్త ఇలా సమాధానమిచ్చారుః

ذَاكَ شَهْرٌ يَغْفُلُ النَّاسُ عَنْهُ بَيْنَ رَجَبٍ وَرَمَضَانَ، وَهُوَ شَهْرٌ تُرْفَعُ فِيهِ الْأَعْمَالُ إِلَى رَبِّ الْعَالَمِينَ، فَأُحِبُّ أَنْ يُرْفَعَ عَمَلِي وَأَنَا صَائِمٌ

ఈ మాసం, ఇది రజబ్ (గౌరవనీయ నాలుగు మాసాల్లో ఒకటి-బుఖారి 4662) మరియు (ఘనతలుగల, శుభప్రదమైన) రమజాను మాసాల మధ్యలో ఉంది, ప్రజలు దీని పట్ల అశ్రద్ధగా ఉంటారు. ఈ మాసంలోనే సర్వలోకాల ప్రభువు వైపునకు (మానవుల) కర్మలు ఎత్తబడతాయి, మరియు నేను ఉపవాస స్థితిలో ఉండగా నా కర్మలు ఎత్తబడాలి అన్నది నాకు చాలా ఇష్టం.

(ముస్నద్ అహ్మద్ 36/85, సహీ తర్గీబ్ 1022. దీని సనద్ హసన్ అని షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ తెలిపారు).

Qur'an Surah 78. An-Naba – Telugu Subtitles [video]

Qur’an Surah 78.An-Naba – Telugu Subtitles

78 సూరహ్ అన్-నబా
అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
1. (*) ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?
2. ఆ మహా వార్తను గురించేనా?
3. దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో!
4. అదికాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
5. ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
6. ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
7. మరియు పర్వతాలను మేకులుగా?
8. మరియు మేము మిమ్మల్ని (స్త్రీ , పురుషుల) జంటలుగా సృష్టించాము.
9. మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.
10. మరియు రాత్రిని ఆచ్చాదంగా చేశాము.
11. మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
12. మరియు మేము మీపైన పటిష్ఠమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
13. మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
14. మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.
15. దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లుచేమలను) పెరిగించటానికి!
16. మరియు దట్టమైన తోటలను.
17. నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.
18. ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచివస్తారు.
19. మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
20. మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమైపోతాయి.
21. నిశ్చయంగా, నరకం ఒక మాటు;
22. ధిక్కారుల గమ్యస్థానం;
23. అందులో వారు యుగాలతరబడి ఉంటారు.
24. అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవిచూడరు.
25. సలసల కాగే నీరు మరియు చీములాంటి మురికి (పానీయం) తప్ప!
26. (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
27. వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
28. పైగా వారు మా సూచన (ఆయాత్) లను అసత్యాలని తిరస్కరించారు.
29. మరియు మేము (వారు చేసిన) ప్రతి దానిని ఒక పుస్తకంలో వ్రాసిపెట్టాము.
30. కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవిచూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.
31. నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
32. ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ!
33. మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందరకన్యలు;
34. మరియు నిండి పొర్లే (మధు) పాత్ర.
35. అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్ధపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
36. (ఇదంతా) నీ ప్రభువు తరుఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
37. భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన  అనంత కరుణామయుని (బహుమానం); ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
38. ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచిఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.
39. అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!
40. నిశ్చయంగా, మేము అతి సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతిమనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: “అయ్యో, నా పాడుగానూ! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!” అని వాపోతాడు.

Telugu Translation Source: దివ్య ఖురాన్ సందేశం