అరఫా దినం – షేక్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

The Day of ‘Arafah – by Shaykh ‘Abdurrazzāq al Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/b_laOsp-N6Y [56 min]

గౌరవనీయ సోదరులారా, అరఫా దినం చాలా గొప్ప దినం. దానికి ఇవ్వాల్సిన సరైన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి, దాని స్థాయిని మనం తెలుసుకోవాలి. దాని స్థానం మరియు ప్రాధాన్యత పట్ల మనం స్పృహతో ఉండాలి. తద్వారా దాని అపారమైన ప్రాముఖ్యతను, ఉన్నత స్థాయిని అలాగే దాని గొప్ప అంతస్తును స్పష్టంగా అర్థం చేసుకుని మనం ఆ రోజులోకి ప్రవేశించగలము. ఇది మరే ఇతర దినం లాంటిది కాదు, ప్రత్యేకంగా అరఫాలో నిలబడే భాగ్యాన్ని అల్లాహ్ ఎవరికైతే ప్రసాదించాడో వారికి ఇది మరింత ప్రత్యేకం, అయితే ఈపుణ్యం కేవలం వారికి మాత్రమే పరిమితం కాదు.

ఎందుకంటే, మీ అందరికీ తెలిసినట్లుగా, అరఫా రోజున ఉపవాసం ఉండటం గురించి ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను.” ఇది సాధారణ ముస్లింలకు వర్తిస్తుంది. హజ్ యాత్రికుల (హాజీల) విషయానికొస్తే, వారు అరఫా రోజున ఉపవాసం ఉండక పోవడమే వారికి ఉత్తమం. ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం)ను ఆదర్శంగా తీసుకుని, ఆ గొప్ప మరియు పవిత్రమైన రోజున అల్లాహ్ స్మరణలో (జిక్ర్), దుఆలు చేయడంలో మరియు అల్లాహ్ ధ్యానంలో గడపడానికి వారు తమను తాము, తమ శరీరాలను బలోపేతం చేసుకోవాలి. ఉమ్ముల్ ఫజ్ల్ బింత్ అల్-హారిస్(రజియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీసు సహీహైన్ (బుఖారీ, ముస్లిం)లో ఉంది, ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాసం ఉన్నారా లేదా అనే విషయమై కొందరు ఆమె దగ్గర చర్చిస్తున్నారు, అది అరఫా రోజు. కాబట్టి, ఆమె ఒక కప్పు పాలు తీసుకుని ప్రవక్తకు అందించగా, ఆయన దానిని త్రాగారు. ‘మీరు చూస్తున్నదే సమాధానం’ అని ఆమె చెప్పినట్లుగా అది ఉంది. ప్రవక్త దానిని త్రాగారు, కాబట్టి ఆయన ఉపవాసం లేరని తెలిసింది. కాబట్టి, అరఫా రోజున హాజీలు ఉపవాసం ఉండక పోవడమే సున్నత్. హాజీలు కాని ఇతరుల విషయానికొస్తే, అరఫా రోజున ఉపవాసం ఉండటం అనేది ఐచ్ఛిక (నఫిల్) ఉపవాసాలలో అత్యుత్తమమైనది. నిశ్చయంగా, ప్రవక్త ఇలా అన్నారు: “గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నేనుఆశిస్తున్నాను.”