ప్రశ్న:
సలాత్ అల్-ఇస్తిఖారా (ఇస్తిఖారా నమాజు) అంటే ఏమిటి? నేను దానిని ఆచరిస్తే, రెండు విషయాల మధ్య ఎలా ఎంచుకోవాలో నాకు తెలుస్తుందనేది నిజమేనా?
షేఖ్ ఇబ్న్ బాజ్ (రహిమహుల్లాహ్) సమాధానం:
ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యవహారాన్ని ఎదుర్కొని, అది తన శ్రేయస్సుకు మంచిదా కాదా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు అతనికి సలాత్ అల్-ఇస్తిఖారా నిర్దేశించబడింది. ఉదాహరణకు, అతను ఒక నిర్దిష్ట ప్రదేశానికి ప్రయాణించాలని లేదా ఒక నిర్దిష్ట కుటుంబంలో వివాహం చేసుకోవాలని లేదా అలాంటిదేదైనా నిర్ణయించుకోవచ్చు, కానీ అతనికి అస్పష్టత ఉండవచ్చు: ఈ ప్రయాణం సరైనదేనా? ఈ వివాహం సరైనదేనా? అటువంటి సందర్భంలో, అతను అల్లాహ్ నుండి మార్గదర్శకత్వాన్ని కోరుకుంటాడు.
అతను రెండు రకాతులు నమాజు చేయడం, ఆ తర్వాత, ఆ రెండు రకాతులు పూర్తి చేసిన తర్వాత (అంటే సలాం చెప్పిన తర్వాత) , ఇస్తిఖారా దుఆతో తన ప్రభువును వేడుకోవడం అతనికి నిర్దేశించబడింది.
اللهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ، وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ، فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ، وَتَعْلَمُ وَلَا أَعْلَمُ، وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ، اللهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الأَمْرَ — [تُسَمِّي حَاجَتَكَ] — خَيْرٌ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي فَاقْدُرْهُ لِي، وَيَسِّرْهُ لِي، ثُمَّ بَارِكْ لِي فِيهِ، وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ، وَاقْدُرْ لِيَ الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ أَرْضِنِي بِهِ
(“అన్న హాజల్ అమ్ర” అన్న చోట తన అవసరాన్ని గురించి ఆలోచించుకోవాలి, లేదా అవసరాన్ని ప్రస్తావించాలి).
అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వ అస్తఖ్దిరుక బి ఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅలము వలా అఅలము వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఫఖ్దుర్ హు లీ వ యస్సిర్ హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి వ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహీ.
(అల్లాహ్! నీ జ్ఞానంతో నేను శుభాలను అడుగుతున్నాను. నీ అధికార సాయంతో శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోత్తరమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్తిస్తున్నాను. నిశ్చయంగా నువ్వు అధికారం గలవాడివి. నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లాహ్! నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా నాకు నష్టం కలిగించేదయితే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. ఆ తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి) (బుఖారి 1166).
ఈ ప్రార్థన (దుఆ) అల్లాహ్ యొక్క సందేశహరులు ﷺ ద్వారా ఉల్లేఖించబడింది. ఒక వ్యక్తి రెండు రకాతుల నమాజు చేసిన తర్వాత ఈ దుఆ చదువుతాడు. అతను దుఆ చేసేటప్పుడు తన చేతులను పైకెత్తితే అది మంచిది, ఎందుకంటే చేతులు పైకెత్తడం అనేది దుఆ స్వీకరించబడటానికి గల కారణాలలో ఒకటి.
ఆ తర్వాత, అతను నిర్ణయించుకున్న విషయానికి సంబంధించి అతని హృదయానికి ప్రశాంతత కలిగితే, అతను దానిని కొనసాగించాలి. అతను ఇంకా సంకోచిస్తూనే ఉంటే, అప్పుడు అతను తన ఆప్తులు మరియు స్నేహితులలో సలహా ఇవ్వడానికి అర్హులైన వారుగా భావించే వారిని సంప్రదించాలి. అప్పటికీ అతని హృదయం కుదుటపడకపోతే, ఆ వ్యవహారంలో ముందుకు సాగడం గురించి లేదా దానిని వదిలేయడం గురించి అతని హృదయానికి ప్రశాంతత కలిగే వరకు రెండవసారి లేదా మూడవసారి ఇస్తిఖారాను పునరావృతం చేయడంలో ఎలాంటి తప్పు లేదు.
అంతేకాకుండా, తన శ్రేయస్సు కోరుకునే ధార్మికులైన, సత్యవంతులైన మరియు చిత్తశుద్ధి గల వ్యక్తులను అతను సంప్రదించాలి, వారు నమ్మకస్తులు, అనుభవజ్ఞులు మరియు సత్యవంతులు అని అతనికి తెలిసి ఉండాలి. ఇస్తిఖారా ఆచరించి, ఇతరులను సంప్రదించిన తర్వాత, ఆ విషయానికి సంబంధించి అతని హృదయానికి ప్రశాంతత కలిగితే, అప్పుడు అతని మనస్సుకు దేని పట్ల ప్రశాంతత కలిగిందో ఆ విషయంలో అతను ముందుకు సాగాలి. ఒకవేళ అతని హృదయానికి ప్రశాంతత కలగకపోతే, అప్పుడు అతను దానిని వదిలేయాలి. అందులో ఎలాంటి నష్టం లేదు, మరియు సకల ప్రశంసలూ అల్లాహ్కే చెందుతాయి.
మూలం: binbaz.org.sa
ఇంగ్లీష్ అనువాదం: యాసీన్ ఇబ్న్ జమాల్
https://salafitranslations.com/how-to-perform-salat-al-istikharah
—
ఇస్తిఖారా నమాజ్ (Istikhara Namaz)
https://youtu.be/5PcLWckemrg [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)