మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 7] – నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు
[మరణానంతర జీవితం – పార్ట్ 61 [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=jcQ-5KK6IMk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో నరకవాసుల గురించి తీవ్రమైన హెచ్చరికలు చేయబడ్డాయి. నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు నరకాగ్నితో కూడుకున్నవని, వారి తలల పైనుండి, పాదాల క్రింది నుండి శిక్ష కమ్ముకుంటుందని వివరించబడింది. నరకవాసులను బంధించే సంకెళ్లు, ఇనుప గదలు, వేడి నీటితో చర్మం కాలిపోవడం, తిరిగి కొత్త చర్మం రావడం వంటి భయంకరమైన శిక్షల గురించి ఖురాన్ ఆయతుల ద్వారా తెలపబడింది. ముఖం కిందికి లాగబడటం, గాడిదలా తిరగడం, పాములు, తేళ్లు కుట్టడం వంటి శిక్షలను వివరిస్తూ, ఈ నరక యాతనల నుండి ఏ విధంగానూ ఉపశమనం లేదా మరణం ఉండదని వక్త హెచ్చరించారు. చివరగా, అల్లాహ్ దయతో ఇహలోకంలో ప్రసాదించిన వరాన్ని సద్వినియోగం చేసుకుని నరక శిక్ష నుండి రక్షణ పొందాలని కోరారు.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. నరక శిక్షలు, నరకవాసులకు ఇవ్వబడే ఆహారం, పానీయాలు, దుస్తులు వీటన్నిటి వివరాలు మనం తెలుసుకున్నాము.
నరకవాసుల పడకలు మరియు శిక్షల తీవ్రత
ఇక ఈ రోజు మనం వారి గురించి ఎలాంటి పడక ఉంటుంది? ఎలాంటి పరుపు అనేది పడుకోవడానికి వారికి ఇవ్వడం జరుగుతుంది? ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అయితే, నరకం అనేది విశ్రాంతి స్థలం కాదు కదా పడుకొని ఉండడానికి! నరకం అనేది ఏదైనా ఆనందకరమైన ప్రదేశం కాదు, అక్కడ మనిషి కొంతసేపటి గురించి ఏదైనా ఎంజాయ్మెంట్ చేసుకోవాలని. అది శిక్షలతో కూడిన స్థలం. అయినా, అక్కడ ఇవ్వబడే తిండి, పానీయం, దుస్తులు ఇవన్నీ శిక్షలతో కూడి ఉంటాయి. ఈ విధంగా వారి గురించి ఏ పరుపులైతే ఉంటాయో, అవి కూడా శిక్షలతో కూడి ఉంటాయి.
సూరహ్ అల్ ఆరాఫ్, ఆయత్ నంబర్ 41 లో అల్లాహ్ తెలిపాడు:
لَهُم مِّن جَهَنَّمَ مِهَادٌ وَمِن فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
[లహుమ్ మిన్ జహన్నమ మిహాదువ్ వమిన్ ఫౌకిహిమ్ గవాష్. వ కజాలిక నజ్ జిజ్ జాలిమీన్]
వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పుఉంటుంది. పైన దుప్పటి కూడా (దానితోనే తయారైనదయి ఉంటుంది). దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. (7:41)
నరకమే నరకం. మరియు వారు కప్పుకోవడానికి పైనుండి ఏ దుప్పట్లయితే వేసుకుంటారో, అవి కూడా నరకానికి సంబంధించినవే,
సూరహ్ అన్ కబూత్, ఆయత్ నంబర్ 55 లో అల్లాహ్ తెలిపాడు:
يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ
[యౌమ యగ్ షాహుముల్ అజాబు మిన్ ఫౌకిహిమ్ వమిన్ తహ్ తి అర్జులిహిమ్ వ యకూలు జూకూ మా కున్తుమ్ త’మలూన్]
ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు (అల్లాహ్) వారితో “మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి” అని అంటాడు. (29:55)
ఇక వారు ఆ నరకం నుండి పారిపోయి ఏ నీడ పొందాలని కోరుతారో, ఆ నీడ కూడా నరకం యొక్క నీడ! అందులో కూడా వారికి ఎలాంటి ప్రశాంతత అనేది, సౌఖ్యం అనేది ఉండదు. వారు నీడను చూసి, ఆ నీడలోకి వచ్చినప్పుడు, అక్కడ వారికి నరకం నుండి ఏదైతే పారిపోయి వచ్చారో, నరకాగ్ని నుండి రక్షణ పొందాము అన్నట్లుగా వారికి అర్థమవుతుందో, నీడలో వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ విధంగా పొగ వారిని కమ్ముకొని ఉంటుంది మరియు దుర్వాసన అనేది వారు భరించలేకపోతారు. అలాంటి ఆ స్థితిలో, నరకంలో నరకాగ్నిని భరిస్తూ ఏదైతే ఉన్నారో దానికంటే మరీ ఘోరమైన పరిస్థితి వారిది ఉంటుంది.
ఇరుకు ప్రదేశాల్లో బంధించబడడం మరియు ఇనుప గదలు
ఇంకా మహాశయులారా, నరకంలో ఇన్ని కష్టాలు వారు భరిస్తూ ఉంటారు, కానీ ఇంతటితో వారి యొక్క కష్టాలకు అంతం అనేది ఉండదు. నరకంలోనే ఇంకా ఎన్నో రకాల శిక్షలు ఉంటాయి. కొందరిని బందీలుగా ఖైదు చేయడం జరుగుతుంది. మరికొందరిని చాలా ఇరుకు ప్రదేశంలో వారిని వేయడం జరుగుతుంది. ఎంతటి ఇరుకు ప్రదేశం అంటే, వారు అక్కడ కదలడానికి కూడా అవకాశం ఉండదు.
وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا
[వ ఇజా ఉల్కూ మిన్హా మకానన్ దయ్యికమ్ ముఖర్రనీన దఅవ్ హునాలిక సుబూరా]
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)
అయితే వారికి సమాధానం ఇవ్వబడుతుంది: “ఏమిటి ఒక్క చావును? ఎన్నో చావులను మీరు పిలిచినా, కేకలు వేసినా ఏ ఒక్క చావు కూడా మీకు రాదు, మీరు అసలు అక్కడ చనిపోనే చనిపోరు.”
మరో రకమైన శిక్ష ఎలా ఉంటుందో సూరహ్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 49 లో తెలపడం జరిగింది:
وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ
[వతరల్ ముజ్రిమీన యౌమఇజిమ్ ముకర్రనీన ఫిల్ అస్ ఫాద్]
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు. (14:49)
మరియు సూరహ్ ఇన్సాన్ ఆయత్ నంబర్ 4 లో ఉంది:
إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا
[ఇన్నా అఅతద్ నా లిల్ కాఫిరీన సలాసిల వ అగ్లాలవ్ వసయీరా]
అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. (76:4)
అబూ లహబ్ యొక్క భార్య, ఆమె గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ ఏం చెప్పాడు?
فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
[ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్]
ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది (111:5)
మరియు సూరహ్ హాక్కా లో ఇంతకుముందే మీరు విని ఉన్నారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎడమ చేతిలో ఎవరైతే తమ కర్మపత్రాన్ని తీసుకుంటారో వారు ఎలా బాధపడుతూ అరుస్తారో, ఆ తర్వాత వారిని ఎలా బంధించడం జరుగుతుందో తెలియజేస్తూ:
ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
[సుమ్మ ఫీ సిల్సిలతిన్ జర్ఉహా సబ్ ఊన జిరాఅన్ ఫస్లుకూహ్]
మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి. (69:32)
ఇంకా మహాశయులారా, మరో రకమైన శిక్ష అక్కడ ఏం జరుగుతుంది అంటే, పెద్ద పెద్ద ఇనుప గదలతో, ఇనుప రాళ్లతో, ఇనుప సలాకులతో నరకవాసులను కొట్టడం జరుగుతుంది.
وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ
[వలహుమ్ మకామిఉ మిన్ హదీద్]
ఇంకా, వారి కొరకు (వారిని చితక బాదటానికి) ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి. (సూరహ్ హజ్ 22:21)
మరియు అక్కడి శిక్షల్లో ఒక రకమైన శిక్ష, నరకవాసుల తలల మీదుగా బాగా వేడిలో, మితిమీరి వేడిగల నీళ్లు వారిపై పోయడం జరుగుతుంది. ఆ నీళ్లు వారి శరీరంపై పడిన వెంటనే తోలు అంతా కాలిపోతూ కాలిపోతూ లోపల కడుపులోని ప్రేగులు కూడా ముక్కలు ముక్కలు అవుతూ ఉంటాయి.
ఇంకా నరకంలో ఒక రకమైన శిక్ష మరీ ఘోరంగా ఉంది. చూడడానికి అంతం సమాప్తం అని ఏర్పడుతుంది కానీ అలా జరగదు. ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఎవరైతే మదీనా వాసుల పట్ల చెడుగా చూస్తాడో, చెడుగా ప్రవర్తిస్తాడో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నరకంలో అతన్ని ఎలాంటి శిక్షకు గురి చేస్తాడు అంటే, ఉప్పు నీళ్లలో ఎలా కరిగిపోతుందో అతడు అలా నరకంలో కరిగిపోతా ఉంటాడు. ఇలాంటి శిక్ష అతనికి జరుగుతూనే ఉంటుంది.
ఇంకా మహాశయులారా, అక్కడి శిక్షల్లో మరొక ఘోరమైన శిక్ష ఏమిటంటే, ఎప్పుడెప్పుడు శిక్షించబడి తోలు కాలిపోతూ ఉంటుందో, అప్పుడప్పుడు మరొక కొత్త తోలు వారిపై వేయడం జరుగుతుంది. వారికి కొత్త తోలు పుట్టుకొస్తుంది. మళ్లీ శిక్షించడం జరుగుతుంది. తోలు కాలిపోతుంది, మళ్లీ కొత్తగా వారికి తోలు వస్తూ ఉంటుంది.
كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ
[కుల్లమా నజిజత్ జులూదుహుమ్ బద్దల్నాహుమ్ జులూదన్ గైరహా లియజూకుల్ అజాబ్]
వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము (4:56)
మరి ఈ రోజుల్లో సైంటిఫిక్ పరంగా కూడా, మనిషి యొక్క తోలులో కొన్ని కణాలు ఉన్నాయి, అవి మనిషికి కలిగే బాధను గ్రహించగలుగుతాయి. ఎప్పుడైతే అవి కాలిపోతూ ఉంటాయో, వాటిని మార్చడం జరుగుతూ ఉంటుంది.
ముఖం క్రిందులుగా లాగబడటం మరియు పేగులు బయటపడే శిక్ష
ఇంకా సోదరులారా, నరకంలో వారిని ఎలా పడవేయడం జరుగుతుందో దాని ప్రస్తావన కూడా వచ్చి ఉంది మహాశయులారా.
తల క్రిందులుగా చేసి అవమానకరంగా వారిని నరకంలో వేయడం జరుగుతుంది.
يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ
[యౌమ యుస్ హబూన ఫిన్నారి అలా వుజూహిహిమ్]
వారిని ముఖం క్రిందులుగా చేసి నరకం వైపునకు లాగుతూ ఉండడం జరుగుతుంది. (54:48)
మరి కొందరికి శిక్ష అక్కడ ఎలా ఉంటుంది? బహుశా కొన్ని పల్లెటూర్లలో మనం చూసి ఉంటాము, నూనె తీయడానికి ఎద్దు గాని, గాడిద గాని గుండ్రంగా త్రిప్పుతూ ఉండడం జరుగుతుంది. అటు ఇటు చూసి అది తన పని వదలకూడదు అని కొన్ని సందర్భాల్లో దాని ముఖం మొత్తం కప్పి ఉంచడం కూడా జరుగుతుంది. కేవలం ఒక విషయం అర్థం కావడానికి మన గ్రామాల్లో జరిగే ఒక విషయం ఉదాహరణగా చెప్పాను. కానీ నవూజుబిల్లాహ్, నరకంలో ఉండే నరక శిక్షల యొక్క పోలిక కాదు ఇది. విషయం ఏంటంటే, నరకంలో కొందరికి శిక్ష ఈ విధంగా జరుగుతుంది.
ప్రళయ దినాన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నరకంలో వేయడం జరుగుతుంది. నరకంలో అతను పడిన తర్వాత అతని పేగులన్నీ బయటికి వచ్చి ఉంటాయి. కడుపు చాలా పెద్దగా అయిపోతుంది. అతడు లేచి నిలబడాలి అనుకుంటాడు, కానీ నిలబడలేడు, తిరుగుతాడు. ఇలా ఆ గాడిద లేదా ఎద్దు తిరిగే విధంగా అలాగే అతనికి శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు అతన్ని చూసి, “నీవు మంచిని గురించి ఆదేశిస్తూ ఉండేవాడివి కదా! చెడు నుండి ఆపుతూ ఉండేవాడివి కదా! నీవు ఇలాంటి శిక్షకు ఎందుకు గురయ్యావు?” అని అంటే, అతను అంటాడు:
كُنتُ آمُرُكُم بِالْمَعْرُوفِ وَلَا آتِيهِ وَأَنْهَاكُمْ عَنِ الْمُنكَرِ وَآتِيهِ
[కున్తు ఆమురుకుమ్ బిల్ మఅరూఫి వలా ఆతీహి వ అన్హాకుమ్ అనిల్ మున్కరి వ ఆతీహ్]
“ఏ మంచిని గురించి మీకు ఆదేశిస్తూ ఉండేవాడినో, అది నేను పాటించేవాడిని కాదు. ఏ చెడు నుండి మిమ్మల్ని వారిస్తూ ఉండేవాడినో, ఆ చెడు నేను చేసేవాడిని.”
అందుకే ఇలాంటి శిక్ష జరుగుతుంది అని అంటాడు. అల్లాహ్ ఈ విధంగా మనకు చెప్పే బోధనలను స్వయంగా ఆచరించే భాగ్యం కలిగించు గాక. ఏ విషయాల నుండి మనం వారిస్తున్నామో వాటి నుండి స్వయంగా మనం ముందు దూరంగా ఉండే అటువంటి భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
నరకవాసుల ఆక్రందనలు మరియు భయంకరమైన సర్పాలు
నరకంలోని శిక్షల్లో ఒక రకమైన శిక్ష ఏమిటంటే, ఆ శిక్షలను భరించలేక వారు పెడబొబ్బలు పెడతారు. ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుండి ఏ సహాయం అందదు, ఎవరూ వారి యొక్క ఏడ్పుబొబ్బలను వినేవారు ఉండరు.
حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِم بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ
[హత్తా ఇజా అఖజ్ నా ముత్రఫీహిమ్ బిల్ అజాబి ఇజా హుమ్ యజ్ అరూర్]
ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు, వారు ఆర్తనాదాలు చేయసాగారు.(23:64)
لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ
[లా తజ్ అరుల్ యౌమ ఇన్నకుమ్ మిన్నా లా తున్సరూన్]
వారికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది: “మీరు ఈ రోజు ఎలాంటి సహాయానికై మీరు కేకలు వేయకండి, ఈ రోజు మా వైపు నుండి మీకు ఎలాంటి సహాయం అందదు.” (23:65)
నరకంలో ఒక రకమైన శిక్ష: మనిషి నరకాగ్నిలో ఉండి ఉండి, నీళ్లు త్రాగడానికి అని పక్కకు వస్తాడు, వేడి వేడి నీళ్లు, మితిమీరిన వేడి నీళ్లు!
يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
[యతూఫూన బైనహా వబైన హమీమిన్ ఆన్]
అటు అది త్రాగలేడు, ఇటు దీనిని భరించలేడు, ఈ విధంగా ఇటునుండి అటు, అటునుండి ఇటు తిరుగుతూనే ఉంటాడు. (55:44)
అంతేకాదు నరకంలో, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో అక్కడ కూడా భయంకరమైన పాములు మరియు తేళ్లు ఉంటాయి. నరకవాసులకు అవి వాతలు పెడుతూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి. ముస్నద్ అహ్మద్ మరియు సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ లోని ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని ప్రస్తావించారు: నరకంలో పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఒక్కొక్క పాము “బుఖ్త్” ఒంటె (చాలా పెద్ద, ఎత్తుగా ఉండే ఒంటె) అలాంటి ఒంటెల మాదిరిగా పెద్ద పెద్ద పాములు ఉంటాయి.
ఒక్కసారి అది కాటు వేసిందంటే నలభై సంవత్సరాల వరకు దాని యొక్క బాధను మనిషి భరిస్తూనే ఉంటాడు అల్లాహు అక్బర్. మరియు నరకంలో సామానుతో ఎత్తుగా ఉన్నటువంటి కంచర గాడిద రూపంలో అంత పెద్ద పెద్ద తేళ్లు కూడా ఉంటాయి. ఆ తేళ్లు వాటి యొక్క విషం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కసారి అవి కాటు వేస్తే దాని యొక్క విషం, దాని యొక్క బాధ నలభై సంవత్సరాల వరకు భరిస్తూ ఉండవలసి ఉంటుంది.
నరకవాసుల బాధాకరమైన శ్వాసలు మరియు భయంకర ముఖాలు
ఇంకా సోదరులారా, సోదరీమణులారా, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, పెద్ద పెద్ద పర్వతాల మీద ఎక్కడానికి బలవంతం చేయబడుతుంది. ఇది కూడా ఒక రకమైన వారికి శిక్ష ఉంటుంది.
سَأُرْهِقُهُ صَعُودًا
[స ఉర్హికహు సఊదా]
దానిని వారు ఎక్కలేరు, పడుతూ ఉంటారు, మళ్లీ ఎక్కడం జరుగుతుంది. “త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను.“ (74:17)
అల్లాహ్ ఆయత్లలో తిరస్కరించి, ఖురాన్ గ్రంథాన్ని “ఓ మనిషి లాంటి మాటలే కదా ఇందులో ఉన్నవి” అన్నటువంటి ఎగతాళి చేసే వారి గురించి ఇలాంటి శిక్షలు కూడా జరుగుతాయి.
నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష: నరకంలో ఉన్న వ్యక్తి ఏ శ్వాస పీలుస్తాడో, మళ్లీ వదులుతాడో, పీల్చుకునే, వదులుకునే ప్రతి ఒక్క శ్వాసకు మహా భయంకరమైన ధ్వని, చప్పుడు అనేది ఉంటుంది.
فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ
[ఫఅమ్మల్ లజీన షకూ ఫఫిన్నారి లహుమ్ ఫీహా జఫీరువ్ వషహీక్]
ఎవరైతే దౌర్భాగ్యులో వారు నరకాగ్నిలో ఉంటారు. వారు అందులో విలపిస్తూ, కేకలు వేస్తూ (భయంకరమైన శ్వాసలు తీస్తూ) ఉంటారు. (11:106)
అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఈ మస్జిద్ లో లక్ష, లక్షకు పైగా మంది ఉన్నారంటే, వీరి మధ్యలో కేవలం ఒకే ఒక వ్యక్తి నరకవాసుల్లోని వ్యక్తి ఉండి అతను శ్వాస తీసుకుంటే, అతని శ్వాస ఏదైతే అతను బయటికి వదిలాడో దానివల్ల ఈ లక్ష, లక్షకు పైగా ఉన్న వారందరూ కాలిపోతారు, చనిపోతారు. అల్లాహు అక్బర్.
నరక వాసులకు ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, వారి ముఖాన్ని మరీ అంధకారంగా చేసి భయంకరమైనవిగా కూడా చేయబడతాయి. ఒక హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తండ్రి ఆజర్ విషయంలో ఇలాంటి ప్రస్తావన ఒక సహీహ్ హదీసులో వచ్చి ఉంది.
నరకంలో మరణం లేదు మరియు సహాయం అందదు
అయితే మహాశయులారా, ఇంతటి ఘోరమైన శిక్షలు వారు అనుభవిస్తున్నప్పుడు వారికి అక్కడ చావు వస్తుందనా? వారి యొక్క శిక్షల్లో ఏదైనా తగ్గింపు జరుగుతుంది అనా? వారికి ఏదైనా సహాయం దొరుకుతుందా? ఇవన్నీ ఏమాత్రం అవకాశం లేదు. ఇవన్నీ కూడా అసంభవం.
فَلَا يُخَفَّفُ عَنْهُمُ
[ఫలా యుఖఫ్ఫఫు అన్హుము]
వారి యొక్క శిక్షల్లో ఎలాంటి తగ్గింపు జరగదు, అని ఎన్నో సందర్భాల్లో ఖురాన్ లో చెప్పడం జరిగింది. మరియు మీకు ఎలాంటి సహాయం అందించేవాడు కూడా అక్కడ ఎవరూ ఉండడు.
మరియు వారికి చావు వస్తుందా?
لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
[లా యమూతు ఫీహా వలా యహ్యా]
అక్కడ చావు రాదు, హాయిగా బ్రతికినట్లు కూడా ఉండదు. (87:13)
గమనించండి, ఇహలోకంలో ఎంత పెద్ద శిక్ష జరిగినా కనీసం చచ్చిపోదాము అని భావిస్తాడు, మనిషి చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, ఏదో జరుగుద్ది, కానీ అక్కడ నరకంలో చావు కూడా రాదు. నరకవాసులు అందరూ నరకంలో, స్వర్గవాసులు అందరూ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత, స్వయంగా చావును అల్లాహ్ త’ఆలా ఒక పొట్టేలు రూపంలో తీసుకొస్తాడు. వారందరూ దానిని గుర్తుపడతారు, ఇది చావు అని ఒప్పుకుంటారు. అల్లాహ్ త’ఆలా ఆ చావుకే చావు ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఎవరికీ ఏ చావు అనేది ఉండదు.
అయితే నరకం నుండి ఏదైనా పారిపోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అది కూడా ఉండదు.
كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا
[కుల్లమా అరాదూ అయ్ యఖ్ రుజూ మిన్హా ఉఈదూ ఫీహా]
ఎప్పుడెప్పుడు వారు బయటికి వెళ్ళాలని అనుకుంటారో, ఏదైనా కొంచెం పైకి వస్తారో, కొంచెం బయటికి రావాలనుకుంటారో, వారిని తిరిగి అందులోనే వేయడం జరుగుతుంది. (32:20)
మరియు వారు నరకం నుండి బయటికి వెళ్లడానికి ఏ అవకాశమూ లేదు అని కూడా అల్లాహ్ స్పష్టంగా తెలియజేశాడు.
మహాశయులారా, సమయం సమాప్తం కానుంది, ఇక్కడ ఒక హదీస్ తప్పకుండా మీరు వినండి. వాటిపై శ్రద్ధ వహించండి. అవకాశం అల్లాహ్ ఏదైతే మనకు ఇచ్చాడో దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అల్లాహ్ ఈ భాగ్యం నాకు, మీకు మనందరికీ ప్రసాదించుగాక.
ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఒక వ్యక్తిని హాజరు పరుస్తాడు. అతనితో ప్రశ్నిస్తాడు:
أَلَمْ أَجْعَل لَّكَ سَمْعًا وَبَصَرًا وَمَالًا وَوَلَدًا
[అలమ్ అజ్ అల్ లక సమ్ అన్ వ బసరన్ వ మాలన్ వ వలదా]
“నేను నీకు చెవులు, కళ్లు, డబ్బు ధనం, సంతానం ఇవన్నీ ప్రసాదించలేదా?” ఆ మనిషి అంటాడు: “అవును ఓ అల్లాహ్! అన్నీ నీవే ప్రసాదించావు, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.”
وَسَخَّرْتُ لَكَ الْأَنْعَامَ وَالْحَرْثَ وَتَرَكْتُكَ تَرْأَسُ وَتَرْبَعُ
[వ సఖ్ఖర్తు లకల్ అన్ ఆమ వల్ హర్స వ తరకుక తర్ అసు వ తర్బఉ]
“నీకు పంటలు, పొలాలు, జంతువులు ఇంకా ఎన్నో రకాల వరాలు ప్రసాదించాను. వాటన్నిటిపై నీవు అధికారం కలిగి ఉన్నావు. వాటన్నిటితో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ నీ జీవితం గడిపావు, అవునా?” అతను అంటాడు: “అవును ఓ అల్లాహ్!”
“అయితే ఈ రోజు వచ్చి నన్ను నీవు కలుసుకుంటావు అన్నటువంటి నమ్మకం నీకు ఉండెనా ఇహలోకంలో?” అని అడుగుతాడు.
అప్పుడు అతను అంటాడు: “లేదు ఓ అల్లాహ్! చనిపోయేది ఉంది, నీవు మళ్లీ నన్ను లేపుతావు, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నటువంటి నమ్మకం నాకు లేకుండినది.”
అప్పుడు అంటాడు అల్లాహ్:
الْيَوْمَ أَنْسَاكَ كَمَا نَسِيتَنِي
[అల్యౌమ అన్సాక కమా నసీతనీ]
“ఇహలోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో, ఇక ఈ రోజు కూడా నేను నిన్ను మర్చిపోతాను.”
అంటే ఏమిటి భావం? అల్లాహ్ యొక్క కరుణాకటాక్షాల్లో స్వర్గం, అక్కడి యొక్క వరాలు ఏమీ కూడా అతనికి లభించవు, నరకంలోనే ఉండవలసి వస్తుంది.
గమనించారా సోదరులారా? ఇహలోకంలోని వరాలన్నీ కూడా మనకు ఎలా లాభాన్ని తీసుకొచ్చాయి? ఒకవేళ మనం అల్లాహ్ ను తిరస్కరిస్తే, అల్లాహ్ చెప్పినట్లుగా అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు మన జీవితం గడపకుంటే. అందుగురించి అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తల్ని విశ్వసించి, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బాటను అనుసరించి జీవితం గడిపే ప్రయత్నం చేస్తూ, పరలోక దినాన్ని విశ్వసించాలి.
అల్లాహ్ త’ఆలా మనందరికీ కూడా అన్ని రకాల నరక శిక్షల నుండి రక్షణ పొందే భాగ్యం కలిగించు గాక.
వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46128
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
యూట్యూబ్ – ప్లే లిస్ట్ (మరణానంతర జీవితం)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH