[Emotional] The Beautiful Advice of Umar ibn al Khattab to a Sinner
Shaykh Abdurrazzaq al Badr
https://www.youtube.com/watch?v=jzPs_1jaLIM [8 min]
సూరా అల్-గాఫిర్ తఫ్సీర్ ప్రారంభంలో ఇబ్న్ కసీర్ గారు ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని వివరించారు. మీరు దానిని ఇబ్న్ కసీర్ తఫ్సీర్లో స్వయంగా చదవవచ్చు. ఇది అమీరుల్ ముమినీన్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారికి సంబంధించిన ఎంతో స్ఫూర్తిదాయకమైన కథ.
ఇబ్న్ అబీ హాతిమ్ ఉల్లేఖించిన ఈ విషయాన్ని ఇబ్న్ కసీర్ గారు ఇలా ప్రస్తావించారు: షామ్ దేశానికి చెందిన ఒక బలవంతుడైన వ్యక్తి ఉండేవారు. ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా ఉన్న కాలంలో ఆయన తరచుగా ఆయన్ని కలవడానికి వస్తూ ఉండేవారు. అయితే, చాలా కాలం వరకు ఆయన కనిపించకపోవడంతో ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తూ.. ‘ఫలానా వ్యక్తి ఏమయ్యాడు? చాలా కాలంగా అతను మమ్మల్ని కలవడానికి రాలేదు’ అని అడిగారు. దానికి అక్కడి వారు సమాధానమిస్తూ.. ‘ఓ విశ్వాసుల నాయకుడా! అతను మద్యానికి బానిసయ్యాడు, ఇప్పుడు అవే పనుల్లో నిమగ్నమై ఉన్నాడు’ అని చెప్పారు.”
అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) తన లేఖరిని పిలిపించి ఇలా రాయించారు: ‘ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ నుండి ఫలానా వ్యక్తికి.. నీపై అల్లాహ్ శాంతి కలుగుగాక. ఎవరైతే తప్ప వేరే ఆరాధ్య దైవం లేడో, ఆ అల్లాహ్ ను నేను నీ వద్ద స్తుతిస్తున్నాను.
غَافِرِ الذَّنْبِ وَقَابِلِ التَّوْبِ شَدِيدِ الْعِقَابِ ذِي الطَّوْلِ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ إِلَيْهِ الْمَصِيرُ
గాఫిరిద్ దంబి వ ఖాబిలిత్ తౌబి షదీదిల్ ఇఖాబి దిత్ తౌలి, లా ఇలాహ ఇల్లాహువ ఇలైహిల్ మసీర్.
ఆయన పాపాలను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, కఠినంగా శిక్షించేవాడు మరియు గొప్ప దాతృత్వం కలవాడు. ఆయన తప్ప వేరే దైవం లేడు. అందరూ ఆయన వైపునకే మరలి వెళ్ళవలసి ఉంది [గాఫిర్: 3]
ఆ తరువాత, ఉమర్ (రదియల్లాహు అన్హు) తన సహచరులను ఉద్దేశించి ఇలా అన్నారు: ‘మీ సోదరుడి హృదయం అల్లాహ్ వైపు మళ్ళాలని మరియు అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని మీరందరూ ప్రార్థించండి.’
ఆ లేఖ ఆ వ్యక్తికి చేరినప్పుడు, దాని ద్వారా ఉమర్ (రదియల్లాహు అన్హు) ఒకేసారి రెండు పనులు చేశారు: ఒకటి అత్యంత సున్నితమైన రీతిలో హితబోధ చేయడం, రెండవది అతని మార్గదర్శకత్వం కోసం ఇతరులను దుఆ చేయమని కోరడం.
ఆ వ్యక్తి ఆ లేఖను పదే పదే చదువుతూ..
غَافِرِ الذَّنْبِ وَقَابِلِ التَّوْبِ شَدِيدِ الْعِقَابِ
గాఫిరిద్ దంబి వ ఖాబిలిత్ తౌబి షదీదిల్ ఇఖాబ్
“పాపాలను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, కఠినంగా శిక్షించేవాడు…“
అనే మాటలను మననం చేసుకోసాగాడు. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు: ‘అల్లాహ్ ఒకవైపు తన శిక్ష గురించి నన్ను హెచ్చరిస్తూనే, మరోవైపు నేను పశ్చాత్తాపం చెంది ఆయన వైపునకు మరలి వస్తే క్షమిస్తానని నాకు వాగ్దానం చేశాడు.
ఇబ్న్ కసీర్ గారు ఈ వృత్తాంతాన్ని అల్-హాఫిజ్ అబూ నుయైమ్ కూడా ఉల్లేఖించారని తెలుపుతూ, అందులో ఒక అదనపు విషయాన్ని చేర్చారు. ఆ అదనపు విషయమే ఈ కథకు అసలైన ఉద్దేశ్యం, ఇది ఈ హదీసుకు సంబంధించినది:
لَا تُعِيْنُوْا عَلَيْهِ الشَّيْطَانَ
లా తుయీనూ అలైహిష్ షైతాన్
“అతనిపై షైతానుకు సహాయపడకండి.“
ఆ వ్యక్తి ఈ మాటలను పదే పదే మననం చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు, ఆ తర్వాత మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాడు. అతను పశ్చాత్తాపం చెందాడనే వార్త ఉమర్ రదియల్లాహు అన్హు కి చేరినప్పుడు, ఆయన ఇలా అన్నారు: “మనం ఇటువంటి వ్యవహారాలను ఈ పద్ధతిలోనే పరిష్కరించాలి.”
ఇది ఉమర్ (రదియల్లాహు అన్హు) అందించిన ఎంతో గొప్ప హితబోధ. ఎవరైనా పాపం చేశారని మనకు తెలిసినప్పుడు, “అల్లాహ్ అతన్ని అవమానించుగాక” లేదా “శపించుగాక” అని అనకుండా, ఉమర్ రదియల్లాహు అన్హు చూపిన మార్గాన్ని అనుసరించాలి. వారికి ఎంతో సున్నితంగా సలహా ఇవ్వాలి మరియు వారి మార్గదర్శకత్వం కోసం దుఆ చేయమని మన సోదరులను కోరాలి.
ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మనం ఈ విధంగానే ప్రవర్తించాలి. మీ సోదరుడు పొరపాటు పడితే, అతన్ని సరిదిద్దండి మరియు అతని పశ్చాత్తాపం అంగీకరించబడాలని అల్లాహ్ ను వేడుకోండి… అంతేగానీ షైతానుకు అతనిపై సహాయకులుగా మారకండి (وَلَا تَكُونُوا أَعْوَانًا لِلشَّيْطَانِ عَلَيْهِ).”
ప్రజలు మద్యం సేవించినందుకు శిక్ష పొందిన ఒక వ్యక్తిని ఉద్దేశించి “అల్లాహ్ నిన్ను అవమానించుగాక…” అన్నప్పుడు, ప్రవక్త ﷺ ఇలా అన్నారు: “అతనిపై షైతానుకు సహాయపడకండి (لَا تُعِيْنُوْا عَلَيْهِ الشَّيْطَانَ).” ఇక్కడ ఉమర్ (రదియల్లాహు అన్హు) కూడా అదే చెప్తున్నారు: “మీ సోదరుడిపై షైతానుకు సహాయకులుగా మారకండి.” ఎవరైనా పాపాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు వారిని అవమానించడం షైతానుకు సహాయపడటమే అవుతుంది. ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారి ఈ అద్భుతమైన మార్గం సున్నత్ నుండి గ్రహించబడింది.
ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:
عَلَيْكُمْ بِسُنَّتِي وَسُنَّةِ الْخُلَفَاءِ الرَّاشِدِينَ الْمَهْدِيِّينَ مِنْ بَعْدِي، تَمَسَّكُوا بِهَا
“నా సున్నత్ ను మరియు నా తర్వాత వచ్చే సన్మార్గం పొందిన ఖలీఫాల సున్నత్ ను ఖచ్చితంగా పాటించండి. దానిని గట్టిగా పట్టుకోండి.“
ఇది చాలా గొప్ప సున్నత్ మరియు ఇతరులతో వ్యవహరించేటప్పుడు పాటించవలసిన అత్యున్నతమైన పద్ధతి.
نَسْأَلُ اللهَ الْكَرِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ أَنْ يَتُوبَ عَلَيْنَا أَجْمَعِينَ
నస్-అలుల్లాహల్ కరీమ రబ్బల్ అర్షిల్ అజీమి అన్ యతూబ అలైనా అజ్మయీన్
ఘనమైన అర్ష్ (సింహాసనానికి) ప్రభువు మరియు అత్యంత దాతృత్వం గల అల్లాహ్ ను మేము వేడుకుంటున్నాము: మా అందరి పశ్చాత్తాపాన్ని ఆయన అంగీకరించుగాక.
وَأَنْ يَهْدِيَنَا لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا هُوَ
వ అన్ యహ్దియనా లి-అహ్సనిల్ అఖ్లాఖి లా యహ్దీ లి-అహ్సనిహా ఇల్లా హువ
ఆయన తప్ప మరెవ్వరూ మార్గదర్శకత్వం చేయలేని ఉత్తమ స్వభావాన్ని మాకు ప్రసాదించుగాక.
وَأَنْ يُعِيذَنَا أَجْمَعِينَ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَسَيِّئَاتِ أَعْمَالِنَا
వ అన్ యుయీదన అజ్మయీన మిన్ షురూరి అన్ఫుసినా వ సయ్యిఆతి ఆమాలినా
మా ఆత్మల చెడుల నుండి, మా పనుల చెడుల నుండి మాకు రక్షణ కల్పించుగాక.
نَسْأَلُ اللهَ جَلَّ وَعَلَا أَنْ يُقْبِلَ بِقُلُوبِ الْعُصَاةِ إِلَى اللهِ
నస్-అలుల్లాహ జల్ల వ అలా అన్ యుఖ్బిల బి-ఖులూబిల్ ఉసాతి ఇలల్లాహ్
పాపాలు చేసేవారి హృదయాలను అల్లాహ్ తన వైపు మళ్ళించుగాక.
اللَّهُمَّ أَقْبِلْ بِقُلُوبِهِمْ عَلَيْكَ
అల్లాహుమ్మ అఖ్బిల్ బి-ఖులూబిహిమ్ అలైక్
ఓ అల్లాహ్! వారి హృదయాలను నీ వైపు మళ్ళించు.
وَتُبْ عَلَيْهِمْ تَوْبَةً نَصُوحَةً وَارْزُقْهُمُ الْقُرْبَ مِنْكَ
వ తుబ్ అలైహిమ్ తౌబతన్ నసూహతన్ వర్-జుఖ్హుముల్ ఖుర్బ మింక్
వారి మనస్ఫూర్తిగా చేసిన పశ్చాత్తాపాన్ని అంగీకరించు మరియు వారికి నీ సామీప్యాన్ని ప్రసాదించు.
وَهَيِّئْ لَهُمْ مِنْ أَبْوَابِ التَّوْفِيقِ وَالصَّلَاحِ وَالْهِدَايَةِ
వ హయ్యి లహుమ్ మిన్ అబ్వాబిత్ తౌఫీఖి వస్ సలాహి వల్ హిదాయహ్
వారికి విజయం, సన్మార్గం మరియు మార్గదర్శకత్వం యొక్క ద్వారాలను తెరువు.
يَا حَيُّ يَا قَيُّومُ
యా హయ్యు యా ఖయ్యూమ్
ఓ నిత్యజీవి, సర్వానికీ ఆధారభూతుడవైనవాడా!
يَا مَنْ بِيَدِهِ قُلُوبُ الْعِبَادِ
యా మమ్ బి-యదిహీ ఖులూబుల్ ఇబాద్
దాసుల హృదయాలు ఎవరి చేతిలో ఉన్నాయో…
يَا مُقَلِّبَ الْقُلُوبِ
యా ముఖల్లిబల్ ఖులూబ్
హృదయాలను త్రిప్పేవాడా…
تُبْ عَلَى عُصَاةِ الْمُؤْمِنِينَ
తుబ్ అలా ఉసాతిల్ ముమినీన్
విశ్వాసులైన పాపుల పశ్చాత్తాపాన్ని అంగీకరించు.
وَاهْدِنَا وَإِيَّاهُمْ إِلَيْكَ صِرَاطًا مُسْتَقِيمًا
వహ్దినా వ ఇయ్యాహుమ్ ఇలైక సిరాతమ్ ముస్తఖీమా
మాకు మరియు వారికి నీ రుజుమార్గాన్ని చూపించు.
يَا حَيُّ يَا قَيُّومُ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ
యా హయ్యు యా ఖయ్యూము యా దల్ జలాలి వల్ ఇక్రామ్
ఓ సదా సజీవుడవైనవాడా! ఓ సమస్తాన్ని పరిరక్షించే ఆధారభూతుడా! మహోన్నతమైన మహిమ మరియు అపారమైన దాతృత్వము గలవాడా!
షేక్ అబ్దుర్ రజాక్ అల్ బద్ర్ గారు వివరించిన ఈ అద్భుతమైన కథ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారి దయ మరియు జ్ఞానాన్ని చాటిచెప్తుంది. షామ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి మద్యపానానికి అలవాటు పడి పాపంలో మునిగిపోవడంతో, ఉమర్ (రదియల్లాహు అన్హు) అతన్ని అవమానించడానికి బదులుగా ఎంతో సున్నితంగా ఒక లేఖను రాశారు. ఆ లేఖలో అల్లాహ్ పాపాలను క్షమించేవాడని మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడని గుర్తు చేస్తూ సూరా అల్-గాఫిర్ లోని ఆయతులను పేర్కొన్నారు, అంతేకాకుండా తన సహచరులందరినీ ఆ వ్యక్తి మార్పు కోసం అల్లాహ్ను వేడుకోమని కోరారు. ఆ ప్రేమపూర్వకమైన హితబోధ మరియు అందరి దుఆల ఫలితంగా ఆ వ్యక్తి హృదయం కరిగి, కన్నీళ్లతో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెంది సన్మార్గంలోకి తిరిగి వచ్చాడు. ఎవరైనా విశ్వాసి పొరపాటు చేసినప్పుడు వారిని తిట్టి లేదా శపించి షైతానుకు సహాయపడకూడదని, బదులుగా ప్రేమతో మరియు ప్రార్థనలతో వారిని సరిదిద్దడమే నిజమైన ఇస్లామీయ పద్ధతి అని ఈ ఘటన మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45720