అరఫా రోజు పాటించబడే ఉపవాసం ఘనత

1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.

[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]

ముఖ్యాంశాలు:-

జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.

227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత
హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

నోట్: సఊది అరేబియా కాలమానం ప్రకారం అరఫా రోజు 25/10/2012. ఇండియా లో 26/10/2012 ఉండవచ్చు. కాబట్టి 25 మరియు 26 తారీఖు లలో ఉపవాసం ఉండి ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా చూసుకోండి. బారకల్లః ఫీకుం.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?

429. హజ్రత్ మస్రూఖ్ (రహ్మతుల్లా అలై) కధనం :-

నేను (ఓసారి) హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?” అని అడిగాను. దానికామె “ఆయనకు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం” అని సమాధానమిచ్చారు.

“మరి రాత్రివేళ ఆయన (తహజ్జుద్ నమాజు చేయడానికి) ఎప్పుడు లేస్తారు? అని అడిగాను మళ్ళీ. అందుకామె “కోడికూత వినగానే లేస్తారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 7వ అధ్యాయం – మన్ నామ ఇన్ద స్సహార్]

ప్రయాణీకుల నమాజు ప్రకరణం – 17 వ అధ్యాయం – ఇషా నమాజులో పఠించవలసిన రకాతుల సంఖ్య
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్