హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 9. అపరాధాల పుస్తకం, 3వ అధ్యాయం: తిరుగుబాటుదారులపై యుద్ధం. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 1022 – 1026) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
9.3 తిరుగుబాటుదారులపై యుద్ధం
باب قتال أهل البغي
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1022
عَنْ اِبْنِ عُمَرَ رِضَيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ حَمَلَ عَلَيْنَا اَلسِّلَاحَ, فَلَيْسَ مِنَّا } مُتَّفَقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “మాకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన వానితో మాకెలాంటి సంబంధం లేదు.” (బుఖారీ, ముస్లిం)
English
Ibn 'Umar (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Whoever carries arms against us, is not one of us.” Agreed upon.
సారాంశం
ముస్లింలు పరస్పరం అన్నదమ్ముల్లా మెలగాలనీ, ప్రేమైక భావంతో జీవనయాత్ర సాగించాలని ఇస్లాం ప్రబోధిస్తోంది. ఇంకా వారు పరస్పరం సానుభూతి, సహకారభావంతో వ్యవహరించాలనీ, ఒండొకరి శ్రేయాన్ని అభిలషిస్తూ ఉండాలని అది ఉపదేశిస్తున్నది. ఈ హదీసు ప్రకారం ఒక ముస్లిం మరో ముస్లింకు వ్యతిరేకంగా కత్తి కట్టడం, కయ్యానికి కాలుదువ్వటం ఇస్లాం ప్రబోధనలకు పూర్తిగా విరుద్ధం అన్నమాట! అందుకే మహనీయ ముహమ్మద్ ﷺ వారు స్పష్టంగా వక్కాణించారు – “మాకు వ్యతిరేకంగా ఆయుధమెత్తిన వానితో మాకెలాంటి సంబంధం లేద”ని!
ముస్లింల పనైతే పరస్పర సహాయసహకారాలేగాని పోట్లాటలు, కొట్లాటలు కావు. ఇలాంటి విచ్ఛిన్నకర కార్యకలాపాలకు తిరుగుబాటు భావాలు గలవారు మాత్రమే పాల్పడతారు. ఎవరయితే సమాజంలో అరాచకం, అలజడులను సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో అటువంటివారిపై – ఖుర్ఆన్ ప్రకారం – యుద్ధ ప్రకటన చేయాలి. వారు తమ ఈ నకారాత్మక ధోరణిని మానుకొనంతవరకూ వారి మెడలు వంచే ప్రయత్నం చేయాలి. “వాళ్ళు తమ తిరుగుబాటు ధోరణిని మాని దైవాజ్ఞ వైపునకు మరలిరానంత వరకూ వారితో యుద్ధం చేయండి” అని ఖుర్ఆన్ అంటోంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.3 తిరుగుబాటుదారులపై యుద్ధం|హదీసు 1022
హదీసు 1023
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { مَنْ خَرَجَ عَنْ اَلطَّاعَةِ, وَفَارَقَ اَلْجَمَاعَةَ, وَمَاتَ, فَمِيتَتُهُ مِيتَةٌ جَاهِلِيَّةٌ } أَخْرَجَهُ مُسْلِمٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఎవరయినా నాయకునికి విధేయత చూపడానికి నిరాకరిస్తే, ముస్లింల సామూహిక వ్యవస్థ నుండి వేరుపడిపోయి ఉండగా ఆ స్థితిలోనే అతన్ని మృత్యువు కబళిస్తే, అతని ఈ మరణం అజ్ఞానావస్థకు చెందిన మరణం అవుతుంది.” (ముస్లిం)
English
Abd Hurairah (RAA) narrated, “He who rebels against obedience to the ruler, abandons the Muslim community and then dies, his death will be as if he died at the time of Jahiliyah.” Related by Muslim.
సారాంశం
ఈ హదీసు ప్రకారం ఒక వ్యక్తి ఏవో కొన్ని విషయాల్లో విభేదించి ముస్లింల సామూహిక వ్యవస్థకు దూరమైనంతమాత్రాన – కేవలం ఈ వేర్పాటు ప్రాతిపదికపై – అతనిపై చర్య తీసుకోవటం భావ్యం కాదు. అతన్ని అతని మానాన వదలిపెట్టాలి. వేర్పడిన తరువాత అతను గనక తిరుగుబాటు ధోరణిని అవలంబిస్తే మాత్రం అప్పుడతనిపై చర్య తీసుకోవచ్చు.
మరో ముఖ్య విషయం ఏమిటంటే; నాయకుడైనవాడు (అమీర్) బహిరంగంగా షరీయత్ ఆజ్ఞల్ని అతిక్రమించకుండా ఉన్నంతవరకూ అతనికి ముస్లింలు విధేయులై ఉండాల్సిందే.
షరీయత్‌కు బద్ధుడై ఉన్న అమీర్‌ను ధిక్కరించటం, అవిధేయత చూపటం తిరుగుబాటు క్రిందికి వస్తుంది. సజ్జనుడైన నాయకునికి విధేయత కనబరచటంపై విముఖుడై, సామూహిక వ్యవస్థ నుంచి వేర్పడిన వ్యక్తి స్థితి గొఱ్ఱెల మంద నుంచి తప్పిపోయిన గొఱ్ఱెలాంటిది. ఆ స్థితిలో ఒకవేళ అతనికి మరణం సంభవిస్తే అది అజ్ఞాన స్థితికి చెందిన మరణం అవుతుంది. అలాంటి మరణాన్ని మార్గ విహీనస్థితి మరణం అని అనవచ్చునేమోగాని, అవిశ్వాసస్థితి మరణం అని మాత్రం అనలేము. తిరుగుబాటు వైఖరికి ఒడిగట్టే ముస్లింతో పోరాడటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. అయితే పోరాడవలసింది ప్రభుత్వమేగాని వ్యక్తులు కాదు. ప్రతి వ్యక్తీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసేసుకుంటే సమాజంలో శాంతి భద్రతలు అతలాకుతలమైపోతాయి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.3 తిరుగుబాటుదారులపై యుద్ధం|హదీసు 1023
హదీసు 1024
وَعَنْ أَمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ تَقْتُلُ عَمَّارًا اَلْفِئَةُ اَلْبَاغِيَةُ } رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు : “అమ్మార్ను తిరుగుబాటు వర్గం హత్య చేస్తుంది.” (ముస్లిం)
English
Umm Salamah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “The transgressing party will kill 'Ammar ('Ammar bin Yasir).” Related by Muslim.
సారాంశం
సాధారణ చరిత్రకారుల కథనం ప్రకారం అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు)ను సిఫ్ఫీన్ యుద్ధం జరిగిన రోజున అమీర్ ముఆవియా (రదియల్లాహు అన్హు) సహచరులు హత్యచేశారు. కాని ఇది వాస్తవం కాదు. తృతీయ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ని హత్యచేసిన తిరుగుబాటు వర్గమే హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) – అమీర్ ముఆవియా (రదియల్లాహు అన్హు)ల మధ్య చిచ్చుపెట్టింది. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సైనిక దళంలో ఆ తిరుగుబాటు వర్గం జొరబడి ఉంది. కాగా; హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) గారు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) పక్షాన నిలిచారన్న సంగతి ఇక్కడ గమనార్హం. యుద్ధం జరుగుతున్న సమయంలో – ముస్లింలను నిరంతరం సంక్షోభంలో పడవేసి ఉంచాలని కోరుకునే ఈ తిరుగుబాటు వర్గం అకస్మాత్తుగా అమ్మార్ (రదియల్లాహు అన్హు)పై దాడిచేసి చంపేసింది. ఈ విధంగా దైవప్రవక్త ﷺ భవిష్యవాణి నిజమయింది. దైవప్రవక్త ﷺ సూచించిన ఈ తిరుగుబాటు వర్గం ఇదేనన్నమాట!
కాని కొంతమంది విమర్శకులు ఈ హదీసు ఆధారంగా అమీర్ ముఆవియా (రదియల్లాహు అన్హు)ను తూలనాడటానికి కూడా వెనుకాడలేదు. మరి చూడబోతే మహాప్రవక్త ﷺ ప్రియసహచరుల స్థానం ఉన్నతమైనది. అల్లాహ్ వారిపై తన కారుణ్యాన్ని కురిపించాడు. వారితో ప్రసన్నుడయ్యాడు. కాబట్టి మహాప్రవక్త ప్రియసహచరుల గురించి ఏమైనా వ్యాఖ్యానించ దలచుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించటం అవసరం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.3 తిరుగుబాటుదారులపై యుద్ధం|హదీసు 1024
హదీసు 1025
وَعَنْ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ هَلْ تَدْرِي يَا اِبْنَ أُمِّ عَبْدٍ, كَيْفَ حُكْمُ اَللَّهِ فِيمَنْ بَغَى مِنْ هَذِهِ اَلْأُمَّةِ? ", قَالَ: اَللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ. قَالَ: "لَا يُجْهَزُ عَلَى جَرِيحِهَا, وَلَا يُقْتَلُ أَسِيرُهَا, وَلَا يُطْلَبُ هَارِبُهَا, وَلَا يُقْسَمُ فَيْؤُهَا } رَوَاهُ اَلْبَزَّارُ و اَلْحَاكِمُ وَصَحَّحَهُ فَوَهِمَ; لِأَنَّ فِي إِسْنَادِهِ كَوْثَرَ بْنَ حَكِيمٍ, وَهُوَ مَتْرُوكٌ. وَصَحَّ عَنْ عَلِيٍّ مِنْ طُرُقٍ نَحْوُهُ مَوْقُوفًا. أَخْرَجَهُ اِبْنُ أَبِي شَيْبَةَ, وَالْحَاكِمُ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒక సహచరుణ్ణి ఉద్దేశ్యించి, “ఓ ఉమ్మె అబ్ద్ పుత్రుడా! ఈ సమాజంపై తిరుగుబాటు చేసిన వ్యక్తి విషయంలో దైవాజ్ఞ ఏమిటో నీకు తెలుసా?” అని ప్రశ్నించారు. “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ﷺ కే బాగా తెలుసు” అని ఆ సహచరుడు సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా వివరించారు : “అతని క్షతగాత్రులను చంపటంగానీ, అతని తరఫు ఖైదీలను వధించటం గానీ, పారిపోయే వారిని వెంబడించటంగానీ, అతనికి చెందిన ఆస్తిపాస్తులను పంచుకోవటం గానీ జరగదు.” (ఈ హదీసును బజ్జార్ మరియు హాకిమ్ ఇరువురూ ఉల్లేఖించారు. దీనిని హాకిమ్ ప్రామాణికమైనదిగా కూడా ఖరారు చేశారు గాని ఆయన ఇక్కడ పొరబడ్డారు. ఎందుకంటే హదీసును అందజేసిన వారిలో ఒకరైన కౌసర్ బిన్ హకీమ్ ఎన్నదగ్గ వ్యక్తికాడు.
అయితే ఈ సందర్భంగా – ఇదేవిధంగా – విభిన్న వర్గాల ఆధారంగా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) గారిచే ‘మౌఖూఫ్’గా ఉల్లేఖించబడిన హదీసు ప్రామాణిక మైనది. (దీనిని ఇబ్నె అబీ షైబ, హాకిమ్ వెలికి తీశారు)
English
Ibn 'Umar (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said “Do you realize Ibn Umm ’Abd what the ruling of Allah is concerning those who rebel against the ruler in this Ummah?’ I said, ‘Allah and His Messenger know best. ‘He said, “A wounded man among them is not to be given the last stroke (that kills him), their captive is not killed, the one who runs away is not followed and their booties are not divided (among other Muslims).” Related by Al-Bazzar and al-Hakim. The latter graded it as Sahih but he was mistaken as Kawthar bin Hakim (one of the narrators) is a rejected narrator.
And it is authentic from similar chains as Mawquf (saying of a Companion) related by Ibn Abi Shaybah and Al-Hakim.
సారాంశం
ఈ హదీసు పరంపరలోని కౌసర్ బిన్ హకీమ్ ఎన్నదగ్గ వ్యక్తి కాడన్న విషయంపై అందరిమధ్యా ఏకాభిప్రాయముంది. తిరుగుబాటుదారులను ఉపేక్షించి వదలిపెట్టడం సమంజసం కాదు. నిశ్చయంగా వారితో యుద్ధం చేయటం ధర్మసమ్మతమే. అయితే వారి ఆస్తిపాస్తులు, పాడిపంటలు, పశువులను దోచుకోవటం గురించి, వారి క్షతగాత్రులను, పలాయనవాదులను పట్టుకుని వధించటం గురించి భేదాభిప్రాయముంది. వివరాల కోసం “సుబులుస్సలామ్” చూడగలరు.
హదీసు ఉల్లేఖకులు
ఉల్లేఖకులలో ఒకరైన కౌసర్ బిన్ హకీమ్‌పై చాలామందికి సదభిప్రాయం లేదు. ఈయన కూఫా వాసి. ‘హలబ్’లో స్థిరపడ్డారు. హదీసులను వివరించే సత్తా ఈయనకు ఏమాత్రం లేదని ఇబ్నె మొయీన్ అభిప్రాయపడ్డారు. ఈయన ఉల్లేఖనాలు బూటకమని ఇమామ్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.3 తిరుగుబాటుదారులపై యుద్ధం|హదీసు 1025
హదీసు 1026
وَعَنْ عَرْفَجَةَ بْنِ شُرَيْحٍ، قَالَ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ: { مَنْ أَتَاكُمْ وَأَمَرَكُمْ جَمِيعٌ, يُرِيدُ أَنْ يُفَرِّقَ جَمَاعَتَكُمْ, فَاقْتُلُوهُ } أَخْرَجَهُ مُسْلِمٌ..
దైవప్రవక్త ﷺ చెప్పగా తాను విన్నానని హజ్రత్ అర్ఫజ బిన్ షురైహ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “మీరు ఒక నాయకుని (అమీర్)కి విధేయులై ఉండగా ఎవరయినాసరే మీ మధ్య వచ్చి మీ సంగఠిత వ్యవస్థలో అనైక్యతను సృష్టించే యత్నం చేస్తే అతన్ని హతమార్చండి.” (ముస్లిం)
English
Arfajah bin Shuraih (RAA) narrated, ‘I heard the Messenger of Allah (ﷺ) say, “He who comes to you when you are united and wants to disunite your community, kill him.” Related by Muslim.
సారాంశం
ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యే ముఖ్య విషయం ఏమిటంటే ముస్లింలంతా కలసి ఒకానొక వ్యక్తిని తమ నాయకునిగానో, ఖలీఫాగానో ఎన్నుకుని తమ కార్యకలాపాలను సాఫీగా కొనసాగిస్తుండగా ఎవరయినా తమ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం ముస్లింల సంగఠిత వ్యవస్థకు తూట్లు పొడిచే ప్రయత్నంచేస్తే, అటువంటి చీడ పురుగులను ఎంతమాత్రం ఉపేక్షించరాదు. శరీరంలో కుళ్ళిపోయిన భాగాన్ని శస్త్ర చికిత్స ద్వారా తీసిపారెయ్యటం ఎంత అవసరమో ఇలాంటి దుష్టులను ప్రజా జీవితాల నుంచి ఏరిపారెయ్యటం కూడా అంతే అవసరం.
హదీసు ఉల్లేఖకులు
అర్ఫజ బిన్ షురైహ్ (రదియల్లాహు అన్హు) : అష్జా తెగకు చెందిన వారవటం చేత అష్జయీగా పిలువబడ్డారు. ప్రముఖ సహాబీ. కూఫాలో స్థిరపడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.3 తిరుగుబాటుదారులపై యుద్ధం|హదీసు 1026
You must be logged in to post a comment.