హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 8.13 భరణం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 13వ అధ్యాయం: భరణం. ఈ అధ్యాయంలో 12 హదీసులు (హదీసు 975 – 986) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

باب النفقات

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

975

హదీసు 975

عَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { دَخَلَتْ هِنْدُ بِنْتُ عُتْبَةَ ‏-اِمْرَأَةُ أَبِي سُفْيَانَ‏- عَلَى رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-.‏ فَقَالَتْ: يَا رَسُولَ اَللَّهِ! إِنَّ أَبَا سُفْيَانَ رَجُلٌ شَحِيحٌ لَا يُعْطِينِي مِنْ اَلنَّفَقَةِ مَا يَكْفِينِي وَيَكْفِي بَنِيَّ, إِلَّا مَا أَخَذْتُ مِنْ مَالِهِ بِغَيْرِ عِلْمِهِ, فَهَلْ عَلَِيَّ فِي ذَلِكَ مِنْ جُنَاحٍ? فَقَالَ: "خُذِي مِنْ مَالِهِ بِالْمَعْرُوفِ مَا يَكْفِيكِ, وَيَكْفِي بَنِيكِ".‏ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : అబూ సుఫ్యాన్ భార్య హింద బిన్తె ఉతబా దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి “ఓ దైవప్రవక్తా ﷺ! అబూ సుఫ్యాన్ పిసినారి మనిషి. నాకు, నా పిల్లల ఖర్చులకు సరిపడినంత డబ్బు ఆయన ఇవ్వడు. మరైతే నేను ఆయనకు చెప్పకుండా కొంత మొత్తం తీసుకోవచ్చా?” అని సందేహపడింది. దానికి ఆయన ﷺ “నీకు, నీ పిల్లల ఖర్చులకు సరిపోయేటంత సొమ్మును ఉత్తమ రీతిలో తీసుకోవచ్చు” అని సమాధానమిచ్చారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated 'Aishah (RA): Hind daughter of 'Utbah – wife of Abu Sufyan – came to Allah's Messenger (ﷺ) and said, "O Allah's Messenger, Abu Sufyan is a miser who does not give me and my sons enough maintenance, except what I take from his wealth without his knowledge. Is there any blame on me for doing this?" He replied, "Take from his wealth what is reasonable and enough for you and your sons." [Agreed upon].

సారాంశం

భర్త స్థితిమంతుడై ఉండి కూడా ఇంటి ఖర్చులకు డబ్బు ఇవ్వటంలో మరీ పిసినారిలా ప్రవర్తిస్తుంటే భార్య అతనికి చెప్పకుండానే అతని సంపాదనలో నుంచి అవసరం మేరకు తీసుకుని ఖర్చుపెట్టుకోవచ్చని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అయితే దుబారా ఖర్చుకు అనుమతి లేదు. ఈ హదీసు ద్వారా అవగతమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే, భర్త తన ఆలుబిడ్డల హక్కులను నెరవేర్చటంలో అశ్రద్ధ కనబరచినా, అన్యాయం చేసినా అతని గురించి భార్య ఫిర్యాదు చేయటం సమంజసమే. ఆఖరికి ఈ వ్యవహారాన్ని ఆమె న్యాయస్థానం దాకా కూడా తీసుకుపోవచ్చు. ఈ విషయం పరోక్ష నింద క్రిందికి రాదు. ఒకవేళ ఇదే గనక పరోక్షనింద అయి ఉంటే దైవప్రవక్త ﷺ అప్పటికప్పుడు హిందను వారించి ఉండేవారు.

హదీసు ఉల్లేఖకులు

1. హింద బిన్తె ఉతబా బిన్ రబీయ బిన్ అబ్దె షమ్స్ (రదియల్లాహు అన్హా): మక్కా విజయం నాడు ఈమె తన భర్త అబూ సుఫ్యాన్ సమేతంగా ఇస్లాం స్వీకరించింది. ఈమె తండ్రి ఉతబా, బాబాయి షైబా, సోదరుడు వలీద్ బద్ర్ యుద్ధంలో వధించబడ్డారు. ఈ సంఘటన ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోసాగింది. ఉహుద్ యుద్ధంలో హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) వీరమరణం పొందినపుడు ఆమె ఆయన రొమ్మును చీల్చి కాలేయాన్ని తీసి నమిలింది. అజ్ఞానంలో ఆమె ఇంత కిరాతకంగా ప్రవర్తించినప్పటికీ తరువాత ఆమె ఇస్లాం పరిధిలోకి వచ్చిన మీదట దైవప్రవక్త ﷺ పెద్ద మనసుతో మన్నించారు. ఈమె హిజ్రీ 14వ సంవత్సరం ముహర్రం నెలలో మరణించింది.

2. అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) : అసలు పేరు సఖర్. సఖర్ బిన్ హరబ్ బిన్ ఉమయ్యా బిన్ అబ్దె షమ్స్. దైవప్రవక్త ﷺకు వ్యతిరేకంగా సమీకరించబడే అవిశ్వాసులకు నాయకుడు. సేనాధిపతి. మక్కా విజయం సందర్భంగా ఈయన ఇస్లాంలోకి ప్రవేశించారు. ఇస్లాం స్వీకారం తరువాత కడదాకా స్థైర్యం కనబరచారు. తన జీవితంలో దీన్ని మరుపురాని మలుపుగా భావించేవారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో – హిజ్రీ 32లో – మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 975

976

హదీసు 976

وَعَنْ طَارِقِ الْمُحَارِبِيِّ قَالَ: { قَدِمْنَا اَلْمَدِينَةَ, فَإِذَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَائِمٌ عَلَى الْمِنْبَرِ يَخْطُبُ النَّاسَ وَيَقُولُ: "يَدُ اَلْمُعْطِي اَلْعُلْيَا, وَابْدَأْ بِمَنْ تَعُولُ: أُمَّكَ وَأَبَاكَ, وَأُخْتَكَ وَأَخَاكَ, ثُمَّ أَدْنَاكَ فَأَدْنَاكَ".‏ } رَوَاهُ النَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَاَلدَّارَقُطْنِيُّ.

హజ్రత్ తారిఖ్ ముహారిబీ (రదియల్లాహు అన్హు) కథనం : మేము మదీనాకు వచ్చినపుడు దైవప్రవక్త ﷺ వేదికపై నిలబడి ప్రసంగిస్తున్నారు – “ఇచ్చేవాని చెయి (పుచ్చుకునే వాని చెయికన్నా) గొప్పది. నీపై ఆధారపడి ఉన్న వారినుండి ఇవ్వటం మొదలెట్టు. వారిలో నీ తల్లి, నీ తండ్రి, నీ సోదరి, నీ సోదరుడు కూడా ఉన్నారు. ఆ తరువాత అత్యంత సమీప బంధువులను ఆదుకో” అని ఆయన ﷺ బోధించారు. (దీనిని నసాయి ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్, దారెఖుత్నీ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు)

English

Narrated Tariq al-Muharibi (RA): We arrived at al-Madinah when Allah's Messenger (ﷺ) was standing on the Minbar addressing the people and saying, "The hand of the giver is the upper one, and spend first on those who are dependent on you: your mother and father, your sister and brother, then your relatives in order of their closeness to you." [Reported by an-Nasa'i. Ibn Hibban and ad-Daraqutni graded it Sahih (authentic)].

హదీసు ఉల్లేఖకులు

తారిఖ్ బిన్ అబ్దుల్లాహ్ ముహారిబీ (రదియల్లాహు అన్హు). గిత్ఫాన్ తెగతో ఈయనకు సంబంధం ఉండేది. కొన్ని హదీసులు ఈయనచే ఉల్లేఖించబడ్డాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 976

977

హదీసు 977

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لِلْمَمْلُوكِ طَعَامُهُ وَكِسْوَتُهُ, وَلَا يُكَلَّفُ مِنْ اَلْعَمَلِ إِلَّا مَا يُطِيقُ.‏ } رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) చెప్పారు : “బానిసకు అన్న వస్త్రాలు సమకూర్చే బాధ్యత యజమానిది. అతని శక్తికి మించిన పనిని అతనిచేత చేయించరాదు.” (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "A slave is entitled to his food and clothing, and he should be burdened except with the work that he is capable of doing." [Reported by Muslim].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 977

978

హదీసు 978

وَعَنْ حَكِيمِ بْنِ مُعَاوِيَةَ اَلْقُشَيْرِيِّ, عَنْ أَبِيهِ قَالَ: { قُلْتُ: يَا رَسُولَ اَللَّهِ! مَا حَقُّ زَوْجَةِ أَحَدِنَا عَلَيْهِ? قَالَ: "أَنْ تُطْعِمَهَا إِذَا طَعِمْتَ, وَتَكْسُوَهَا إِذَا اِكْتَسَيْتَ, وَلَا تَضْرِبِ اَلْوَجْهَ, وَلَا تُقَبِّحْ".‏ } اَلْحَدِيثُ.‏ وتَقَدَّمَ فِي عِشْرَةِ اَلنِّسَاءِ.‏.

హజ్రత్ హకీమ్ బిన్ ముఆవియ ఖుషైరీ తన తండ్రి ఆధారంగా చేసిన కథనం : “ఓ దైవప్రవక్తా ﷺ! మాలోని ప్రతి ఒక్కరిపై వారి భార్యలకు గల హక్కు ఏమిటి?” అని నేను ప్రశ్నించగా, “మీరు తిన్నప్పుడు ఆమెకూ పెట్టాలి. మీరు తొడిగినప్పుడు ఆమెకూ తొడిగించాలి. ఆమె మొహంపై కొట్టకూడదు. ఆమెను తిట్టకూడదు” అని ఆయన ﷺ ప్రబోధించారు. (సుదీర్ఘమయిన హదీసులోని ఒక భాగమిది) ఈ హదీసు ఇంతకుముందు “స్త్రీలతో వ్యవహార సరళి” అన్న అధ్యాయంలో వచ్చింది కూడ.

English

Narrated Hakim bin Mu'awiyah al-Qushairi on his father's authority (RA): I asked, "O Allah's Messenger, what is the right of the wife of one of us upon her husband?" He replied, "That you should give her food when you eat, and clothe her when you clothe yourself, and do not strike her on the face and do not revile her." [The narrator narrated the rest of the Hadith that has been mentioned in the chapter on the treatment of wives].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 978

979

హదీసు 979

وَعَنْ جَابِر بْنِ عَبْدِ اَللَّهِ ‏- رضى الله عنه ‏- عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-‏-فِي حَدِيثِ اَلْحَجِّ بِطُولِهِ‏- قَالَ فِي ذِكْرِ اَلنِّسَاءِ: { وَلَهُنَّ عَلَيْكُمْ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ.‏ } أَخْرَجَهُ مُسْلِمٌ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) హజ్‌కు సంబంధించిన దైవప్రవక్త ﷺ వారి సుదీర్ఘమయిన హదీసును వివరిస్తూ, ఆయన ﷺ ఈ విధంగా ప్రబోధించినట్లు తెలిపారు: “మీ భార్యలకు మీపై గల హక్కు ఏమిటంటే మీరు వారికి అన్నవస్త్రాలను ఉత్తమ రీతిలో సమకూర్చాలి.” (ముస్లిం)

English

Narrated Jabir (RA): The Prophet (ﷺ) – in the Hadith of pilgrimage which is long – said in regard to women, "They (women) have rights over you (the men) to provide them with their sustenance and clothing in a reasonable manner." [Muslim reported it].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 979

980

హదీసు 980

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ كَفَى بِالْمَرْءِ إِثْمًا أَنْ يُضَيِّعَ مَنْ يَقُوتُ.‏ } رَوَاهُ النَّسَائِيُّ.‏. وَهُوَ عِنْدَ مُسْلِمٍ بِلَفْظِ: "أَنْ يَحْبِسَ عَمَّنْ يَمْلِكُ قُوتَهُ".

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “ఎవరయినా ఒక వ్యక్తికి ఉపాధిని సమకూర్చే బాధ్యతను స్వీకరించి, ఆ బాధ్యతను విస్మరిస్తే అతడు పాపానికి ఒడిగట్టాడనడానికి ఈ ఒక్క దృష్టాంతం చాలు” (నసాయి). “ఒకరి ఉపాధికి యజమాని అయివుండి దాన్ని నిలిపివేస్తే…” అని ‘ముస్లిం’లో ఉంది.

English

Narrated 'Abdullah bin 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "It is enough for a person to be considered sinful, that he neglects those whom he is responsible to sustain." [Reported by an-Nasa'i].

Muslim has this wording: "…to withhold (food) from the one whose food he possesses."

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 980

981

హదీసు 981

وَعَنْ جَابِرٍ ‏-يَرْفَعُهُ, فِي اَلْحَامِلِ اَلْمُتَوَفَّى عَنْهَا زَوْجُهَا‏- قَالَ: { لَا نَفَقَةَ لَهَا } أَخْرَجَهُ اَلْبَيْهَقِيُّ, وَرِجَالُهُ ثِقَاتٌ, لَكِنْ قَالَ: اَلْمَحْفُوظُ وَقْفُهُ. وَثَبَتَ نَفْيُ اَلنَّفَقَةِ فِي حَدِيثِ فَاطِمَةَ بِنْتِ قَيْسٍ كَمَا تَقَدَّمَ.‏ رَوَاهُ مُسْلِمٌ.

భర్త చనిపోయిన గర్భవతి అయిన మహిళ గురించి హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు)చే చేయబడిన ‘మర్ఫూ’ కథనం: “ఆమె కొరకు భరణం (మనోవర్తి) లేదు.” (ఈ హదీసును బైహఖీ సేకరించారు. దీని ఉల్లేఖకులు ఎన్నదగినవారే. కాని దీనిని ‘మౌఖూఫ్’ అనటమే సురక్షితమని ఇమామ్ బైహఖీ అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు వచ్చిన ఫాతిమా బిన్తె ఖైస్ (రదియల్లాహు అన్హా) హదీసు ద్వారా భరణం లేదని తేలిపోయింది. ఈ హదీసును ‘ముస్లిం’ ఉల్లేఖించారు)

English

Narrated Jabir (RA) in a Hadith which he attributed to the Prophet (ﷺ) regarding a pregnant (woman) whose husband died: "She has no maintenance rights." [al-Baihaqi reported it. Its narrators are reliable, but al-Baihaqi said, "The correct narration is that which is Mawquf (a saying of a Companion)"].

It was established that no maintenance is due (to a woman who was divorced with three pronouncements) in the Hadith of Fatimah (RA) daughter of Qais, which has preceded. [Reported by Muslim].

సారాంశం

గర్భవతి అయిన మహిళ యొక్క భర్త చనిపోతే ఆమెకు భరణం ఇవ్వబడదని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. గర్భవతికే భరణం లేనపుడు గర్భవతి కాని మహిళకు కూడా ఇచ్చే ప్రశ్నే తలెత్తదు. మూడు విడాకులు పొందిన గర్భవతికాని మహిళకు భరణంగానీ, వసతి సౌకర్యంగానీ (రెండూ) ఇవ్వబడవు. కాగా; మూడు విడాకులు పొందిన గర్భవతికి మాత్రం భరణం ఇవ్వబడుతుంది. కాని ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించబడదు. వితంతువు అయిఉండి గర్భవతికాని మహిళకు భరణం – ఇవ్వబడదు – వసతి మాత్రం కల్పించబడుతుంది – వితంతువు అయిన గర్భవతి కోసం వసతి సౌకర్యం ఇవ్వబడుతుంది. భరణం ఇచ్చే విషయంలో మటుకు భేదాభిప్రాయం ఉంది. ‘భరణం ఇవ్వబడదు’ అనటమే సరైనది. భరణం మరియు వసతి గురించిన ఈ తర్జన భర్జన అంతా ఆ స్త్రీ ‘ఇద్దత్’లో ఉన్నప్పటిదే. ఇద్దత్ (గడువు) ముగిసిన పిమ్మట ఇవి రెండూ ఆమెకు వర్తించవు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 981

982

హదీసు 982

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلْيَدِ اَلْعُلْيَا خَيْرٌ مِنْ اَلْيَدِ اَلسُّفْلَى, وَيَبْدَأُ أَحَدُكُمْ بِمَنْ يَعُولُ.‏ تَقُولُ اَلْمَرْأَةُ: أَطْعِمْنِي, أَوْ طَلِّقْنِي.‏ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَإِسْنَادُهُ حَسَنٌ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “పై చేయి క్రింది చెయికన్నా శ్రేష్ఠమయినది. మీలో ప్రతి ఒక్కరూ మీ ఆలనా పాలనలో ఉన్న వారినుండి బాధ్యతల నిర్వర్తింపును మొదలెట్టాలి. ‘ఇంటి ఖర్చులన్నా ఇవ్వు లేక విడాకులన్నా ఇవ్వు’ అని ఇల్లాలు తెగేసి చెప్పే పరిస్థితి రాకుండా చూసుకోండి.” (ఈ హదీసును దారెఖుత్నీ ‘హసన్’గా ఉల్లేఖించారు)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "The upper hand is better than the lower one, and one of you should spend first on those he is responsible to provide for, lest a woman would say, 'Feed me or divorce me.'" [Reported by ad-Daraqutni, and its chain of narrators is Hasan (good)].

సారాంశం

ఇంటి బయట దుబారా ఖర్చు చేస్తూ, ఇంట్లో ఆలుబిడ్డలను ఇబ్బందిపెట్టే మగరాయుళ్ళకు ఈ హదీసులో హెచ్చరిక ఉంది. సంసార సమస్యలను పట్టించుకోకుండా పూలరంగడులా తిరిగే భర్తను భార్య నిలదీసి అడగగలదనీ, అవసరమైతే విడాకుల కోసం కూడా డిమాండు చేయగలదని పై హదీసు ద్వారా విదితమవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 982

983

హదీసు 983

وَعَنْ سَعِيدِ بْنِ اَلْمُسَيَّبِ ‏-فِي اَلرَّجُلِ لَا يَجِدُ مَا يُنْفِقُ عَلَى أَهْلِهِ‏- قَالَ: { يُفَرَّقُ بَيْنَهُمَا }. أَخْرَجَهُ سَعِيدُ بْنُ مَنْصُورٍ: عَنْ سُفْيَانَ, عَنْ أَبِي اَلزِّنَادِ, عَنْهُ.‏ قَالَ: { قُلْتُ لِسَعِيدٍ: سُنَّةٌ? فَقَالَ: سُنَّةٌ }. وَهَذَا مُرْسَلٌ قَوِيَ.

తన భార్యను పోషించలేని మనిషి గురించి హజ్రత్ సయీద్ బిన్ ముసయ్యబ్ (రహిమహుల్లాహ్) చేసిన ఉల్లేఖనంలో “వారి మధ్య వేర్పాటు చేయబడుతుంది” అని వుంది. ఈ ఉల్లేఖనాన్ని సయీద్ బిన్ మన్సూర్ సుఫ్యాన్ ఆధారంగా, ఆయన అబూ జినాద్ సౌజన్యంతో సంగ్రహించారు – దీని ప్రకారం ; “ఇది సున్నత్ (సంప్రదాయం) అంటారా?” అని నేను సయీద్ బిన్ ముసయ్యబ్‌ను అడగ్గా “అవును, సున్నతే” అని ఆయన జవాబిచ్చారు. (ఇది ‘ముర్సల్’ హదీసు అన్నది దృఢమైనది)

English

Narrated Sa'id bin al-Musaiyab regarding a man who finds nothing to spend on his wife: "They are to be separated." Reported by Sa'id bin Mansur, from Sufyan, from Abu az-Zinad, from Sa'id bin al-Musaiyab. He said, "I asked Sa'id (bin al-Musaiyab), 'Is this Sunnah?' And he replied, 'Yes, it is Sunnah!'" [This Hadith is a strong Mursal (missing link after the Tabi'i].

సారాంశం

ఈ హదీసు ప్రకారం భర్త భార్య పోషణకయ్యే ఖర్చుల్ని ఇవ్వలేని పక్షంలో ఆ దంపతుల మధ్య ‘వేర్పాటు’ చేయబడుతుంది. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), అబూహురైరా (రదియల్లాహు అన్హు), తాబయీన్లలోని ఒక సమూహం, ఇంకా ధర్మవేత్తలైన ఇమాములలో ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) తదితరులంతా ఈ నికాహ్‌ను రద్దుపరచే అధికారం స్త్రీకి ఇస్తున్నారు. జాహిరియా వర్గీయుల దృక్పథం కూడా ఇదే. ‘లా జరర వలా జిరార’ అనే హదీసును కూడా వారు తమ ఈ వాదనకు అనుకూలంగా ఉదాహరిస్తున్నారు.

అయితే భరణం ఇవ్వలేని పరిస్థితిలో వివాహాన్ని రద్దుచేసే అధికారం స్త్రీకి వర్తించదని హనఫీ పండితులు అభిప్రాయపడుతున్నారు. వీరు తమ అభిప్రాయానికి ఆధారంగా దివ్య ఖుర్‌ఆన్‌లోని ‘వ అన్ ఖదర అలైహి రిజ్‌ఖుహు….’ అనే సూక్తిని సమర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా అల్లామా హాఫిజ్ ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) గారి పలుకులు గమనార్హమైనవి: ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి వివాహమాడినపుడు అతను ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. అతని ఆర్థిక లేమి గురించి కూడా ఆ స్త్రీకి తెలుసు. లేదా వివాహ సమయంలో అతని ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంది. కాని ఆ తర్వాత ఏవో కారణాలవల్ల ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఇట్టి పరిస్థితిలో ఆ స్త్రీకి ఆ వివాహాన్ని రద్దుపరచే అధికారం ఉండబోదు. ఎందుకంటే పరిస్థితులు మారటానికి అట్టే కాలం పట్టదు. నేడు అతను లేమికి గురై ఉన్నాడు. రేపు కలిమితో కళ కళ లాడవచ్చు. ఇదిగాక వేరితర పరిస్థితుల్లో మాత్రం స్త్రీకి, వివాహాన్ని రద్దుపరచే అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని ఆమె ఉపయోగించుకోదలిస్తే ఉపయోగించుకోవచ్చు.

స్త్రీకి వివాహాన్ని రద్దుపరచే అధికారం ఉందని వాదించిన ఇమాములలో ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) భర్తకు నెల రోజుల గడువు ఇస్తున్నారు. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) కేవలం మూడు రోజుల గడువు ఇస్తున్నారు. హమ్మాద్‌గారు మాత్రం ఏడాది కాలం వ్యవధి ఇచ్చారు.

హదీసు ఉల్లేఖకులు

1. సుఫ్యాన్ : సుఫ్యాన్ బిన్ సయీద్ బిన్ మస్రూఖ్ సౌరి. అబూ అబ్దుల్లాహ్ కూఫీగా కూడా పిలువబడతారు. అగ్రశ్రేణి ఇమాములలో ఒకరుగా పరిగణించబడతారు. ఈయన ఇమామ్ అన్న విషయంలో అందరి మధ్యా ఏకాభిప్రాయం ఉంది. స్పష్టత, జ్ఞాపకశక్తి, హదీసు పరిజ్ఞానం, ధర్మనిష్ఠ – ఇత్యాది సుగుణాలు ఈయన సొంతం. హిజ్రీ 77లో జన్మించారు. హిజ్రీ 161వ సంవత్సరంలో బస్రాలో మరణించారు.

2. అబూ జినాద్ : ఈయన అసలు పేరు అబ్దుల్లాహ్ బిన్ జక్వాన్ – అమవీ. ఈయన సంరక్షకులు మదీనావాసులు. గొప్ప ఇమాములలో ఒకరు. ఈయన విశ్వసనీయులని ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) అన్నారు. అమీరు‌ల్ మోమినీన్. హిజ్రీ 130 లేక 131లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 983

984

హదీసు 984

وَعَنْ عُمَرَ ‏- رضى الله عنه ‏- { أَنَّهُ كَتَبَ إِلَى أُمَرَاءِ اَلْأَجْنَادِ فِي رِجَالٍ غَابُوا عَنْ نِسَائِهِمْ: أَنْ يَأْخُذُوهُمْ بِأَنَّ يُنْفِقُوا أَوْ يُطَلِّقُوا, فَإِنْ طَلَّقُوا بَعَثُوا بِنَفَقَةِ مَا حَبَسُوا }. أَخْرَجَهُ اَلشَّافِعِيُّ.‏ ثُمَّ اَلْبَيْهَقِيّ بِإِسْنَادِ حَسَنٌ.

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం : సైన్యంలో చేరిన కారణంగా తమ భార్యలకు దూరంగా ఉంటున్న వారి గురించి ఆయన సేనాధిపతులకు వ్రాసి పంపిన సందేశంలో ఇలా పేర్కొన్నారు – “వారు తమ భార్యలకు మనోవర్తి పంపుతుండాలి. లేదా వారికి విడాకులైనా ఇవ్వాలి. ఒకవేళ విడాకులు గనక ఇస్తే తాము ఎంతకాలం దూరంగా ఉన్నారో అంత కాలానికి సరిపడా మనోవర్తిని పంపవలసి ఉంటుంది.” (ఈ హదీసును ఇమామ్ షాఫయి, బైహఖీ ఉత్తమ ప్రమాణాలతో ఉల్లేఖించారు)

English

Narrated 'Umar: He wrote (letters) to the commanders of the armies regarding some men (soldiers) who have been absent from their wives, that they should impose upon them to spend on their wives or divorce them; and if they divorce them they should then send the maintenance which they have withheld. [ash-Shafi'i reported it, then al-Baihaqi with a Hasan (good) chain of narrators].

సారాంశం

ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇంత ఖచ్చితంగా ఉత్తర్వును జారీ చేయటం వెనుక ఒక సంఘటన ఉంది. ఒకరోజు రాత్రి ఆయన (రదియల్లాహు అన్హు) ప్రజల కష్టసుఖాలను తెలుసుకునే ఉద్దేశ్యంతో వీధుల్లో గస్తీ చేస్తుండగా, భర్త ఎడబాటును భరించలేక, బాధాతప్త హృదయంతో గీతాలాపన చేస్తున్న ఒక స్త్రీ కంఠం ఆయనకు వినిపించింది. ఆమె భర్త ఒక సిపాయి. ఈ విరహ గీతం ఆయన్ని కదిలించింది. ఆయన వెంటనే తన కూతురు (దైవప్రవక్త సతీమణి) అయిన హజ్రత్ హఫ్స (రదియల్లాహు అన్హా) దగ్గరకెళ్ళి, ఒక స్త్రీ తన భర్త లేకుండా ఎంతకాలం ఉండగలదని దర్యాప్తు చేశారు. నాలుగు మాసాలు ఉండగలదని ఆమె జవాబిచ్చారు. అంతే, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సైనిక దళాధికారులకు ఉత్తర్వులు జారీ చేస్తూ, నాలుగు మాసాలు కాగానే సైనికులు తమ తమ ఇండ్లకు సెలవుపై వెళ్ళి తీరాలనీ, లేకుంటే తమ భార్యలకు విడాకులు ఇవ్వాలనీ ఆదేశించారు. మనిషి భావాలు భావోద్రేకాలను, ముఖ్యంగా స్త్రీ మానసిక స్థితిగతులను ఇస్లాం ఎంతగా పరిగణనలోకి తీసుకుంటుందో ఈ హదీసును బట్టి అర్థమవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 984

985

హదీసు 985

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { جَاءَ رَجُلٌ إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: يَا رَسُولَ اَللَّهِ! عِنْدِي دِينَارٌ? قَالَ: "أَنْفِقْهُ عَلَى نَفْسِكَ".‏ قَالَ: عِنْدِي آخَرُ? قَالَ: "أَنْفِقْهُ عَلَى وَلَدِكَ".‏ قَالَ: عِنْدِي آخَرُ? قَالَ: "أَنْفِقْهُ عَلَى أَهْلِكَ".‏ قَالَ: عِنْدِي آخَرُ, قَالَ: "أَنْفِقُهُ عَلَى خَادِمِكَ".‏ قَالَ عِنْدِي آخَرُ, قَالَ: "أَنْتَ أَعْلَمَ".‏ } أَخْرَجَهُ اَلشَّافِعِيُّ وَأَبُو دَاوُدَ, وَاللَّفْظُ لَهُ, وَأَخْرَجَهُ النَّسَائِيُّ وَالْحَاكِمُ بِتَقْدِيمِ. اَلزَّوْجَةِ عَلَى اَلْوَلَدِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! నా దగ్గర ఒక దీనారు ఉంది” అని విన్నవించుకున్నాడు. “నీ స్వయం కోసం ఖర్చుపెట్టుకో” అని ఆయన ﷺ అన్నారు. “నా దగ్గర మరొకటి కూడా ఉంది” అని అతడు చెప్పగా “దాన్ని నీ సంతానంపై ఖర్చుపెట్టు” అని ఆయన ﷺ సూచించారు. “నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది” అని అతను అభిప్రాయపడగా “నీ ఇల్లాలిపై ఖర్చుపెట్టు” అని ఆయన ﷺ సలహా ఇచ్చారు. “నా వద్ద ఇంకొకటి కూడా ఉంది” అని అతడు చెప్పగా, “దాన్ని నీ సేవకునిపై వెచ్చించు” అని ఆయన ﷺ సూచించారు. “నా దగ్గర ఇంకా వుంది”అని అతడు చెప్పగా, “దాన్ని ఖర్చుపెట్టే అవగాహన నీకు బాగానే ఉంది” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. (షాఫయి, అబూదావూద్‌లు దీనిని వెలికి తీశారు. వాక్యాలు అబూదావూద్‌వి. నసాయి, హాకిమ్‌లు కూడా దీనిని సేకరించారు. వీరి సేకరణలో – ‘సంతానం’ అనే వాక్యానికి ముందు ‘ఇల్లాలు’ అనే మాట వచ్చింది)

English

Narrated Abu Hurairah (RA): A man came to the Prophet (ﷺ) and said, "I have a Dinar." He said, "Spend it on yourself." He said, "I have another." He replied, "Spend it on your children." He said, "I have another." He replied, "Spend it on your wife." He said, "I have another." He replied, "Spend it on your servant." He said, "I have another." He replied, "You know best (what to do with it)." [ash-Shafi'i and Abu Dawud reported it, and the wording is Abu Dawud's. an-Nasa'i and al-Hakim reported it with the wife preceding the children].

సారాంశం

దేవుడు ఎవరికయినా తన కారుణ్యంతో అమితంగా అనుగ్రహిస్తే, అతడు దైవదాసులపై ఖర్చుపెట్టదలిస్తే, ఏ క్రమంలో ఖర్చు పెట్టాలో ఈ హదీసులో చెప్పబడింది. అందరికన్నా ముందు మనిషి తన ఆత్మకోసం డబ్బును వెచ్చించాలనీ, ఆ తరువాత హదీసులో సూచించబడిన క్రమంలో ఖర్చుపెట్టాలని చెప్పబడింది. ఆలుబిడ్డల, ఆత్మీయుల, తనపై ఆధారపడిన సేవకుల తరువాత సమాజంలోని ఇతరుల వంతు వస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 985

986

హదీసు 986

وَعَنْ بَهْزِ بْنِ حَكِيمٍ, عَنْ أَبِيهِ, عَنْ جَدِّهِ قَالَ: { قُلْتُ: يَا رَسُولَ اَللَّهِ! مَنْ أَبَرُّ? قَالَ: "أُمَّكَ".‏ قُلْتُ: ثُمَّ مِنْ? قَالَ: "أُمَّكَ".‏ قُلْتُ: ثُمَّ مِنْ "? قَالَ: "أُمَّكَ".‏ قُلْتُ: ثُمَّ مِنْ? قَالَ: "أَبَاكَ, ثُمَّ اَلْأَقْرَبَ فَالْأَقْرَبَ".‏ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ وَحُسَّنَهُ.

హజ్రత్ బహ్జ్ బిన్ హకీమ్ (రహిమహుల్లాహ్) తన తండ్రి ఆధారంగా తన తాతగారి నుండి ఉల్లేఖించారు : ఓ దైవ ప్రవక్తా ﷺ! నేను చూపే ఆదరణకు, సద్వ్యవహారానికి అందరికన్నా ఎక్కువ హక్కుదారులెవరు?” అని నేను విన్నవించుకోగా “నీ తల్లి” అని ఆయన ﷺ బదులిచ్చారు. “ఆ తరువాత ఎవరు?” అని నేను మళ్ళీ ప్రశ్నించగా, “నీ తల్లి” అనే ఆయన సమాధానమిచ్చారు. “ఆ తరువాత ఎవరు?” అని నేను తిరిగి అడగ్గా, “నీ తల్లి” అనే ఆయన ﷺ చెప్పారు. “ఆ తర్వాత….?” అని నేను మళ్ళీ సందేహపడగా “నీ తండ్రి, ఆపైన క్రమబద్ధంగా ఆత్మీయుల, బంధువుల వంతు వస్తుంది” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. (దీనిని అబూదావూద్, తిర్మిజీ వెలికి తీశారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా ఖరారు చేశారు)

English

Narrated Bahz bin Hakim on his father's authority from his grandfather (RA): I asked, "O Allah's Messenger, to whom should I be kind and dutiful?" He replied, "Your mother." I asked, "Who comes next?" He replied, "Your mother." I asked, "Who comes next?" He replied, "Your mother." I asked, "Who comes next?" He replied, "Your father, then your relatives in order of nearness (of relationship)." [Abu Dawud and at-Tirmidhi reported it; the latter graded it Hasan (good)].

సారాంశం

తండ్రి స్థానం కన్నా తల్లి స్థానం మరింత ఉన్నతమైనదని ఈ హదీసు ద్వారా విదితమవుతున్నది. బిడ్డ తల్లి కడుపులో పడినప్పటినుండీ అతన్ని కని, పెంచి పెద్దవాణ్ణి చేసే వరకు తల్లి భరించే బాధల దృష్ట్యా గౌరవాదరణలకు ఆమె అందరికన్నా ఎక్కువ హక్కుదారు అని గట్టిగా తాకీదు చేయటం జరిగింది. అందుకే మహనీయ ముహమ్మద్ ﷺ వారు మూడుసార్లు “తల్లి” అని నొక్కి చెప్పి ఆమె ప్రాధాన్యతను అందరూ గుర్తించేలా చేశారు.

స్త్రీ సహజంగా బలహీనురాలు. కోమలాంగి. కొడుకులు కూతుళ్ళు పసివాళ్ళుగా ఉన్నప్పుడు ఆమె వాళ్ళ అల్లరి చేష్టల్ని ఎంతో ఓపికగా భరిస్తుంది. వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. కాని వాళ్ళు పెద్దవారైనాక తల్లిని లెక్కపెట్టరు. ఆమె అదుపులో ఉండరు. పైగా ఆమె మనసును నొప్పించే మాటలంటారు. అందుకే; ఎట్టి పరిస్థితిలోనూ తల్లిని నిర్లక్ష్యం చేయరాదనీ, ఎంతో వినయ వినమ్రతలతో ఆమె సేవచేయాలని ఇస్లామీయ షరీయత్ నొక్కి వక్కాణించింది. అయితే ధర్మానికి, షరీయత్‌కు విరుద్ధమయిన పని కోసం ఆమె ఒత్తిడి తీసుకువస్తే అప్పుడు ఆమె మాటను నిరాకరించవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.13 భరణం|హదీసు 986