హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 8.12 పాల సంబంధం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 8. నికాహ్ పుస్తకం, 12వ అధ్యాయం: పాల సంబంధం. ఈ అధ్యాయంలో 11 హదీసులు (హదీసు 964 – 974) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

8.12 పాల సంబంధం

↑ విషయ సూచిక

باب الرضاع

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

964

హదీసు 964

عَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تُحَرِّمُ اَلْمَصَّةُ وَلَا الْمَصَّتَانِ.‏ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఒకటి రెండుసార్లు చనుబాలు పీల్చినంతమాత్రాన నిషిద్ధ (హుర్మత్) ఆజ్ఞ వర్తించదు.” (ముస్లిం)

English

Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) said: "One or two sucks do not make (marriage) unlawful." [Muslim reported it].

సారాంశం

ఏ పరిమాణంలో పాలు త్రాగటం వల్ల స్తన్య సంబంధిత వరస ఏర్పడుతుంది? అన్న అంశంపై భేదాభిప్రాయం ఉంది. చనుబాలు కొద్ది పరిమాణంలో తాగినా, ఎక్కువ తాగినా పాలవరస ఏర్పడినట్లే నన్నది మెజారిటీ విద్వాంసుల అభిప్రాయం. ఇమామ్ దావూద్ జాహిరీ, ఇమామ్ అహ్మద్, ఇమామ్ ఇస్‌హాఖ్, అబూ ఉబైద తదితరులు ఈ హదీసు వెలుగులో విషయాన్ని చర్చిస్తూ, మూడుసార్లు చనుబాలు పీలిస్తే చాలు పాల వరస ఏర్పడుతుందని, రెండుసార్లు పీల్చటం వల్ల ఏర్పడదని అభిప్రాయపడ్డారు. ఐదుసార్లు కనీసం త్రాగి ఉంటేనే ఈ పాల వరస ఖరారవుతుందని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అంటున్నారు.

“మీకు పాలు ఇచ్చిన తల్లులు మీ కొరకు నిషేధించబడ్డారు” (4:23) అని దివ్య ఖుర్ఆన్‌లో అనబడింది. ఇన్నిసార్లు అనిగానీ, ఇంత పరిమాణంలో అనిగానీ వివరించబడలేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 964

965

హదీసు 965

وَعَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اُنْظُرْنَ مَنْ إِخْوَانُكُنَّ, فَإِنَّمَا اَلرَّضَاعَةُ مِنْ اَلْمَجَاعَةِ.‏ } مُتَّفَقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చెప్పారు : “నిజంగా ఎవరు సోదరుడో సరిగా పరికించి మరీ నిర్ధారించుకోవాలి. ఎందుకంటే (పసితనంలో) ఆకలి తీర్చడానికి పట్టే పాల వల్ల మాత్రమే పాల వరస ఏర్పడుతుంది.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated ['Aishah (RA)]: Allah's Messenger (ﷺ) said: "Be sure (you women) who your brothers are, for suckling is that which is the result of hunger (i.e. when milk is the child's only food)." [Agreed upon].

సారాంశం

ఒకానొక సందర్భాన్ని పురస్కరించుకుని దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆ సంఘటనను గురించి ఇలా అన్నారు : దైవప్రవక్త ﷺ ఓసారి నా ఇంటికి వచ్చినపుడు ఒక వ్యక్తి నా దగ్గర కూర్చుని ఉన్నాడు. ఇది ఆయన ﷺకు నచ్చలేదు. ఆయన ﷺ ముఖారవిందంపై అయిష్టత తొణికిసలాడింది. “దైవప్రవక్తా ﷺ! ఇతను నాకు పాలవరస సోదరుడు కదా!” అని అన్నాను. దానికాయన ﷺ, “నిజంగా నీ సోదరుడు ఎవరో బాగా పరికించి నిర్ధారించుకోవాలి” అని చెప్పారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 965

966

హదీసు 966

وَعَنْهَا قَالَتْ: { جَاءَتْ سَهْلَةُ بِنْتُ سُهَيْلٍ.‏ فَقَالَتْ: يَا رَسُولَ اَللَّهِ! إِنَّ سَالِمًا مَوْلَى أَبِي حُذَيْفَةَ مَعَنَا فِي بَيْتِنَا, وَقَدْ بَلَغَ مَا يَبْلُغُ اَلرِّجَالُ.‏ فَقَالَ: "أَرْضِعِيهِ.‏ تَحْرُمِي عَلَيْهِ".‏ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : సహ్లా బిన్తె సుహైల్ (రదియల్లాహు అన్హా) వచ్చి, “ఓ దైవప్రవక్తా ﷺ! అబూ హుజైఫాచే విముక్తి నొసగబడిన బానిస సాలిమ్ మా దగ్గరే ఉంటున్నాడు. కాని ఇప్పుడతను ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్నాడు (ఇప్పుడు మేము అతని యెడల ఎలా మెలగాలి?)” అని అడిగారు. దానికి ఆయన ﷺ, అతనికి నీ పాలు పట్టు. తద్వారా అతడు ‘మహ్రమ్’ అయిపోతాడు (అంటే అతనితో పాల వరస ఏర్పడుతుంది)” అని సలహా ఇచ్చారు. (ముస్లిం)

English

Narrated ['Aishah (RA)]: Sahlah (RA) daughter of Suhail (RA) came and said, "O Allah's Messenger, Salim the manumitted slave of Abu Hudhaifah lives with us in our house; and he has attained what men attain (i.e. puberty)." He said, "Suckle him so you would become unlawful to him (in marriage)." [Reported by Muslim].

సారాంశం

ఇక్కడ ‘పాలు పట్టడం’ అంటే అర్థం నేరుగా చనుబాలు ఇవ్వటం అని కాదు. బహుశా ఆమె పాలు పితికి త్రాగటానికి ఇచ్చి ఉండవచ్చు. సుననె అబూదావూద్‌లోని ఉల్లేఖనం ప్రకారం ఆమె ఐదుసార్లు సాలిమ్‌కు పాలు త్రాపి, అతన్ని తన కుమారునిగా చేసుకున్నారు. ఈ ఉల్లేఖనం ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) గారి దృక్పథాన్ని సమర్థిస్తోంది.

ఈ వ్యవహారం ఒక్క సాలిమ్‌కు మాత్రమే ప్రత్యేకమని మెజారిటీ ఉలమాలు తేల్చి చెప్పారు. ఇతరుల వ్యవహారంలో ఈ ఆజ్ఞ వర్తించదు.

హదీసు ఉల్లేఖకులు

1. సాలిమ్ (రదియల్లాహు అన్హు) : సాలిమ్ బిన్ మాఖిల్. అబూ హుజైఫాచే స్వేచ్ఛ నొసగబడిన బానిస. మొదట ఈయన్ని ఒక అన్సార్ మహిళ కొన్నది. ఆమె పేరు లైలా. అబూ హుజైఫా ఈమెను కూడా నికాహ్ చేసుకున్నారు. అందువల్ల సాలిమ్ ఆమె వెంట అబూ హుజైఫా ఇంటికి వచ్చారు. అబూ హుజైఫా సాలిమ్‌ను తన పెంపుడు కొడుకుగా గ్రహించారు. బద్ర్ యుద్ధంలో సాలిమ్ పాల్గొన్నారు. తన సహచరుల్లో ఏ నలుగురి వద్ద ఖుర్ఆన్‌ను నేర్చుకోమని దైవప్రవక్త ﷺ ఆజ్ఞాపించారో ఆ నలుగురిలో సాలిమ్ కూడా ఉన్నారు. దైవప్రవక్త ﷺ మదీనాకు రాక మునుపు ‘ఖుబా’లో ఈయన ముహాజిర్లకు నమాజ్‌లో సారథ్యం వహించేవారు. ఈయన వెనుక సామూహిక నమాజు చేసినవారిలో హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కూడా ఉన్నారు.

2. అబూ హుజైఫా (రదియల్లాహు అన్హు) : ఒక కథనం ప్రకారం ఈయన అసలు పేరు ముహాషిమ్. హాషిమ్ బిన్ ఉత్బా బిన్ అబ్దెషమ్స్ అని కూడా అనబడుతోంది. ఈయన గొప్ప మేధావులలో ఒకరు. బద్ర్, ఉహద్ యుద్ధాలలోనూ, ఆ తరువాత జరిగిన యుద్ధాలలో కూడా ఉన్నారు. యమామ యుద్ధంలో వీర మరణం పొందారు. అప్పటికి ఆయన వయస్సు 53.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 966

967

హదీసు 967

وَعَنْهَا: { أَنْ أَفْلَحَ ‏-أَخَا أَبِي الْقُعَيْسِ‏- جَاءَ يَسْتَأْذِنُ عَلَيْهَا بَعْدَ اَلْحِجَابِ.‏ قَالَتْ: فَأَبَيْتُ أَنْ آذَنَ لَهُ, فَلَمَّا جَاءَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَخْبَرْتُهُ بِاَلَّذِي صَنَعْتُهُ, فَأَمَرَنِي أَنْ آذَنَ لَهُ عَلَيَّ.‏ وَقَالَ: "إِنَّهُ عَمُّكِ".‏ } مُتَّفَقٌ عَلَيْهِ..

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : అబుల్ ఖువైస్ సోదరుడు అఫ్లహ్ మా ఇంట్లోకి రావడానికి నా అనుమతి కోరారు. ఇది ‘పరదా’ ఆదేశం అవతరించిన తరువాత జరిగిన సంఘటన. అందువల్ల నేను ఆయన్ని ఇంటి లోపలికి రావడానికి అనుమతించలేదు (అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అన్నారు). దైవప్రవక్త ﷺ ఇంటికి విచ్చేసిన తరువాత జరిగినదంతా ఆయన ﷺకు వివరించాను. దైవప్రవక్త ﷺ ఇదంతా విని, “ఆయన్ని ఇంటి లోపలికి రావడానికి అనుమతిని ఇస్తూ ఉండు. ఆయన నీకు పినతండ్రి కదా!” అని అన్నారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated ['Aishah (RA)]: Aflah (her foster suckling uncle), brother of Abul-Qais, came and asked her permission to enter after the Hijab (was instituted for women). She said, "I refused to allow him in and when Allah's Messenger (ﷺ) came, I told him about what I had done, so he commanded me to give him permission to enter where I am and said, 'He is your paternal uncle.'" [Agreed upon].

సారాంశం

ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే; ఏ స్త్రీ పాలైనా త్రాగి ఉంటే, ఆ స్త్రీ భర్త తండ్రి సమానుడవుతాడు. తల్లిదండ్రుల తరపున ఏ ఏ బంధుత్వాలు వివాహానికి హరామ్ అవుతాయో అలాగే పాల వరస వల్ల ఏర్పడిన బంధుత్వాలు కూడా హరామ్ అవుతాయి. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) పసితనంలో అబుల్ ఖువైస్ భార్య పాలు త్రాగి ఉండటం మూలంగా, అబుల్ ఖువైస్ సోదరుడైన అఫ్లహ్ ఆయిషా గార్కి పాల వరస పినతండ్రి అయిపోయారు. పాల ఉత్పత్తిలో స్త్రీ పురుషులిరువురి (సంపర్క) ప్రమేయం ఉంటుంది. కాబట్టి పాల వరస ఆ ఇరువురి తరపున ఏర్పడుతుంది.

హదీసు ఉల్లేఖకులు

అఫ్లహ్. అబుల్ జాద్ మరో పేరు. అసలు పేరు మాత్రం అఫ్లహ్. దైవప్రవక్త ﷺ చే స్వేచ్ఛ నొసగబడిన బానిస. హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) ఈయనకు స్వేచ్ఛ నొసగారని మరొక కథనం ఉంది. అబుల్ ఖువైస్ ఈయన సోదరులు. ఈయన పేరు జాద్ అనీ, వాయల్ బిన్ అఫ్లహ్ అష్‌అరీ అనీ, అఫ్లహ్ అనే పేరు నిజానికి ఈయన సోదరునిదనీ విభిన్న కథనాలున్నాయి. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి పాల వరస బాబాయిలు ఇద్దరన్న సంగతి గమనార్హం. వారిలో ఒకాయన దైవప్రవక్త ﷺ హయాంలోనే మరణించారు. ఇంకొక వ్యక్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)కు పాలుపట్టినామె మరిది. ఆయన పేరు అఫ్లహ్.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 967

968

హదీసు 968

وَعَنْهَا قَالَتْ: { كَانَ فِيمَا أُنْزِلَ الْقُرْآنُ عَشْرُ رَضَعَاتٍ مَعْلُومَاتٍ يُحَرِّمْنَ, ثُمَّ نُسِخْنَ بِخَمْسٍ مَعْلُومَاتٍ, فَتُوُفِّيَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-وَهِيَ فِيمَا يُقْرَأُ مِنَ اَلْقُرْآنِ }. رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : “పదిసార్లు పాలు త్రాగి ఉన్నట్టు ఖచ్చితంగా తెలిస్తేనే ఈ పాల వరస నికాహ్‌ను హరామ్ (నిషిద్ధం)గావిస్తుందని ఖుర్ఆన్ ఆజ్ఞ అవతరించింది. కాని తరువాత ఈ ఆజ్ఞ రద్దు చేయబడింది. ఐదుసార్లు అని అనబడింది. ఆ కాలంలోనే దైవప్రవక్త ﷺ మరణించారు. ఆ సమయంలో ఈ ఐదు సంఖ్య ఖుర్ఆన్‌లో పఠించబడేది.” (ముస్లిం)

English

Narrated ['Aishah (RA)]: In what was sent down in the Qur'an was 'ten known sucklings made marriage unlawful'. Afterwards, they were abrogated by 'five known ones.' Then, when Allah's Messenger (ﷺ) died these words were among what was recited in the Qur'an. [Reported by Muslim].

సారాంశం

ఈ హదీసుకు వివరణగా ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు : “ఐదుసార్లు పాలు త్రాగి ఉంటే….” అనే ఆజ్ఞ కూడా రద్దయింది. అయితే ఇది రద్దు అయ్యే సమయానికే దైవప్రవక్త ﷺ అంతిమ ఘడియలు కూడా సమీపించాయి. ఆ రోజుల్లో కొంతమంది ఈ ఐదు సంఖ్య ఖుర్ఆన్‌లో అంతర్భాగమని తలపోసి, ఆ విధంగానే పారాయణం చేసేవారు. దైవప్రవక్త ﷺ మరణం తరువాత, ఈ సంఖ్య రద్దయిన సంగతిని సహచరులు తెలియజేయగా, అప్పటి వరకూ దీనిగురించి తెలియని వారు తమ పొరబాటును సరిదిద్దుకున్నారు. ఈ విషయంపై కడకు అందరూ ఏకీభవించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 968

969

హదీసు 969

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أُرِيدُ عَلَى اِبْنَةِ حَمْزَةَ.‏ فَقَالَ: "إِنَّهَا لَا تَحِلُّ لِي; إِنَّهَا اِبْنَةُ أَخِي مِنْ اَلرَّضَاعَةِ } وَيَحْرُمُ مِنْ اَلرَّضَاعَةِ مَا يَحْرُمُ مِنْ اَلنَّسَبِ.‏ مُتَّفَقٌ عَلَيْهِ

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “మీరు మీ పినతండ్రియగు హమ్జా (రదియల్లాహు అన్హు) కుమార్తెను వివాహం చేసుకోండి” అని దైవప్రవక్త ﷺను ఒప్పించే ప్రయత్నం చేయగా ఆయన ﷺ ఇలా సెలవిచ్చారు : “ఆమెను నేను వివాహమాడటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఆమె నాకు పాల వరస సోదరుని కుమార్తె. ఏవిధంగా అనువంశిక బంధుత్వ ప్రాతిపదికపై ఒక స్త్రీ నిషిద్ధం అవుతుందో అదే విధంగా పాల వరస వల్ల కూడా నిషిద్ధం అవుతుంది.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) was offered to marry the daughter of Hamzah. He said, "She is unlawful to me for she is the daughter of my brother in suckling; and what is unlawful by reason of blood relationship is unlawful by reason of suckling relationship." [Agreed upon].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 969

970

హదీసు 970

وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يُحَرِّمُ مِنْ اَلرَّضَاعَةِ إِلَّا مَا فَتَقَ اَلْأَمْعَاءَ, وَكَانَ قَبْلَ اَلْفِطَامِ.‏ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ هُوَ وَالْحَاكِمُ.

హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “జీర్ణకోశాన్ని వ్యాకోచించేలా చేసే పాలు, పాల గడువుకు ముందు త్రాపే పాలు తప్ప మరే రకమయిన పాలు కూడా సంబంధాలను నిషిద్ధం గావించదు.” (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు. తిర్మిజీ, హాకిమ్ లిరువురూ దీనిని ప్రమాణబద్ధమైన హదీసుగా ఖరారు చేశారు)

English

Narrated Umm Salamah (RA): Allah's Messenger (ﷺ) said: "The suckling that makes marriage unlawful is that which reaches the intestines (i.e. nourishes the child), and is taken before (two years) time of weaning." [Reported by at-Tirmidhi, he and al-Hakim graded it Sahih (authentic)].

సారాంశం

అంటే ఒక శిశువుకు ఆకలి తీర్చడానికి కేవలం పాలు తప్ప మరో ఆహారం ఇవ్వబడని పసితనంలో గనక పాలు పట్టి ఉంటేనే స్తన్య సంబంధమైన వరస ఏర్పడుతుందని దీని భావం. పుట్టిన శిశువుకు పాలు తప్ప మరో ఘన పదార్థం ఆహారంగా ఇవ్వబడదు. అతని జీర్ణ కోశంలో పాలు మాత్రమే ఆహార పదార్థంగా ప్రవేశిస్తుంది. పాలతోనే ప్రేగులు వ్యాకోచిస్తాయి. పాలతోనే శిశువు శరీరం పెరుగుతుంది. పాలతోనే ఎముకలు బలపడతాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 970

971

హదీసు 971

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { لَا رَضَاعَ إِلَّا فِي اَلْحَوْلَيْنِ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ وَابْنُ عَدِيٍّ مَرْفُوعًا وَمَوْقُوفًا, وَرَجَّحَا اَلْمَوْقُوفَ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్(రదియల్లాహు అన్హుమా) కథనం: “పాలు పట్టే రెండేళ్ళ వ్యవధిలోపు తప్ప పాల సంబంధం వర్తించదు.” (దీనిని దారె ఖుత్నీ, ఇబ్నె అదీ – ఇద్దరూ మర్ఫూ మరియు మౌఖూఫ్‌గా ఉల్లేఖించారు. అయితే దీన్ని మౌఖూఫ్ అనడానికే వారు మొగ్గుచూపారు)

English

Narrated Ibn 'Abbas (RA): Suckling applies only (to infants) during the first two years (of their life). [Reported by ad-Daraqutni and Ibn 'Adi as Marfu' (a saying of the Prophet) and Mawquf (a saying of a Companion). However, they both held that the stronger view is that it is Mawquf (i.e. saying if Ibn 'Abbas).

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 971

972

హదీసు 972

وَعَنِ اِبْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا رَضَاعَ إِلَّا مَا أَنْشَزَ اَلْعَظْمَ, وَأَنْبَتَ اَللَّحْمَ.‏ } رَوَاهُ أَبُو دَاوُدَ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “(శిశువు) ఎముకలను గట్టిపరచే, మాంసాన్ని పెంపొందించే స్థాయిలో పట్టబడిన పాలు మాత్రమే పాల వరస (రజాఅత్)గా పరిగణించబడుతుంది.” (అబూదావూద్)

English

Narrated Ibn Mas'ud (RA): Allah's Messenger (ﷺ) said: "The only suckling (to be considered) is that which gives life to the bones and causes flesh to grow." [Abu Dawud reported it].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 972

973

హదీసు 973

وَعَنْ عُقْبَةَ بْنِ اَلْحَارِثِ; { أَنَّهُ تَزَوَّجَ أُمَّ يَحْيَى بِنْتَ أَبِي إِهَابٍ, فَجَاءَتْ اِمْرَأَةٌ.‏ فَقَالَتْ: قَدْ أَرْضَعْتُكُمَا, فَسَأَلَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: "كَيْفَ وَقَدْ قِيلَ? " فَفَارَقَهَا عُقْبَةُ.‏ وَنَكَحَتْ زَوْجًا غَيْرَهُ.‏ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ ఉఖ్‌బా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను ఉమ్మె యహ్యా బిన్తె అబూ ఇహాబ్ (రదియల్లాహు అన్హా)ను వివాహమాడాను. అప్పుడు ఒక మహిళ వచ్చి, “అయ్యా! నేను మీ ఇద్దరికీ నా పాలు పట్టి ఉన్నానయ్యా” అని అన్నది. అప్పుడు నేను ఈ విషయమై దైవప్రవక్త ﷺను సంప్రతించగా, “పాల వరస గురించి స్పష్టంగా సమాచారం అందినమీదట ఇక నువ్వామెను నీ వివాహబంధంలో ఎలా ఉంచుతావు?” అని ఆయన ﷺ అన్నారు. అందువల్ల ఉఖ్‌బా ఆమెకు విడియాకులు ఇచ్చేశారు. ఆ స్త్రీని మరో వ్యక్తి పెళ్ళి చేసుకున్నాడు. (బుఖారీ)

English

Narrated 'Uqbah bin al-Harith: He married Umm Yahya, daughter of Abu Ihab, and a woman came and said, "I have suckled both of you." So he asked the Prophet (ﷺ) and he replied, "How (can you hesitate) while it has been said (that you are foster brothers and sisters)?" 'Uqbah therefore separated from her and she married another husband. [al-Bukhari reported it].

హదీసు ఉల్లేఖకులు

1. ఉఖ్‌బా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) : ఉఖ్‌బా బిన్ హారిస్ బిన్ ఆమిర్ బిన్ నౌఫిల్ బిన్ అబ్దె మునాఫ్ మక్కీ. ప్రఖ్యాత ప్రవక్త సహచరులు. మక్కా విజయం సందర్భంగా ముస్లిం అయ్యారు. ఆ తరువాత 50 ఏండ్లు జీవించి ఉన్నారు.

2. ఉమ్మె యహ్యా : అసలు పేరు ఘునియ్య. ఘునియ్య బిన్తె అబూ ఇహాబ్ బిన్ ఉవైర్ తమీమి. ఈమె అసలు పేరు జైనబ్ అని వేరొక కథనం ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 973

974

హదీసు 974

وَعَنْ زِيَادِ اَلسَّهْمِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ تُسْتَرْضَعَ اَلْحَمْقَى.‏ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ وَهُوَ مُرْسَلٌ, وَلَيْسَتْ لِزِيَادٍ صُحْبَةٌ.

హజ్రత్ జియాద్ సహ్మీ (రహిమహుల్లాహ్) తెలియజేసిన ఒక కథనం ప్రకారం; అవివేకులు, మందబుద్ధిగల మహిళలు పాలుపట్టడాన్ని దైవప్రవక్త ﷺ వారించారు. (అబూదావూద్ దీనిని సేకరించారు. ఈ హదీసు ‘ముర్సల్’ కోవకు చెందినది. ఎందుకంటే జియాద్‌గారు సహాబీ కారు)

English

Narrated Ziyad as-Sahmi: Allah's Messenger (ﷺ) forbade that a stupid woman may be asked to suckle an infant. [Abu Dawud reported it. It is Mursal (missing link after the Tabi'i) and Ziyad is not a Sahabi].

సారాంశం

మూర్ఖులు, మందబుద్ధిగల వారు, విజ్ఞతా వివేచనలు బొత్తిగా లేని మహిళల చేత పాలుపట్టించరాదన్న ప్రబోధనంలోని మర్మం ఏమిటంటే తల్లి పిల్లవాడికి పాలు పట్టడంతోపాటు తన గుణగణాలను కూడా బదిలీ చేస్తుంది. ఆమె స్వభావం, లక్షణాలు పాల ద్వారా శిశువుకు అబ్బుతాయి. ‘ఉగ్గుతో పెట్టిన విద్య’ అనే తెలుగు నానుడి ఎరుకే కదా! పాలుపట్టే మహిళ ఉత్తమురాలై ఉంటే ఆ ఉత్తమ గుణాలు శిశువుకు కూడా అబ్బుతాయి. అందుకే వ్యభిచారిణులు, ధర్మవిహీనురాలైన స్త్రీల చేత పాలు త్రాగించరాదని ఇమామ్ గజాలీ (రహిమహుల్లాహ్) లాంటి ఇస్లామీయ విద్వాంసులు అభిప్రాయపడ్డారు.

హదీసు ఉల్లేఖకులు

జియాద్ సహ్మీ : ఈయన అమ్ర్ బిన్ ఆస్‌చే స్వేచ్ఛ నొసగబడిన బానిస అనీ, ముర్సల్ హదీసులను వివరించేవారని చెప్పబడుతోంది. ఈయన సహాబీ (ప్రవక్త ప్రత్యక్ష సహచరులు) మాత్రం కారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|8. నికాహ్ పుస్తకం|8.12 పాల సంబంధం|హదీసు 974