హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 7.17 వక్ఫ్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 17వ అధ్యాయం: వక్ఫ్. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 785 – 787) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

باب الوقف

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

785

హదీసు 785

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { إِذَا مَاتَ اَلْإِنْسَانُ اِنْقَطَعَ عَنْهُ عَمَلُهُ إِلَّا مِنْ ثَلَاثَةٍ : صَدَقَةٍ جَارِيَةٍ ، أَوْ عِلْمٍ يُنْتَفَعُ بِهِ، أَوْ وَلَدٍ صَالَحٍ يَدْعُو لَهُ } رَوَاهُ مُسْلِم ٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – మానవుడు చనిపోయినంతనే అతని కర్మల పరంపర తెగిపోతుంది. అయితే మూడు కర్మల ఫలం మాత్రం మరణానంతరం కూడా అతనికి లభిస్తూ ఉంటుంది. (1) ఎడతెగని దానం (సదఖా). (2) నిత్యం ప్రయోజనం చేకూర్చే విద్య. (3) మృతుని మన్నింపుకై వేడుకుంటూ ఉండే సజ్జన సంతానం.

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "When a son of Adam (i.e. any human being) dies his deeds are discontinued, with three exceptions: Sadaqah, whose benefit is continuous; or knowledge from which benefit continues to be reaped, or a righteous child who supplicates for him." [Reported by Muslim].

సారాంశం

చనిపోయిన తరువాత కూడా మృతునికి అతని సత్కర్మల పుణ్యఫలం చేరుతూ ఉంటుందని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. ఈ హదీసులో మూడు సత్కర్మలు ప్రస్తావించబడ్డాయి.

ఒకటి : ఎప్పుడూ ఎడతెగకుండా కొనసాగే దానధర్మాలు (సదఖయె జారియా). అంటే ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ వక్ఫ్ చేయబడే ఆస్తులు. ఉదాహరణకు : బాటసారుల కోసం విశ్రాంతి నిలయాలను నిర్మించటం, బావులు త్రవ్వించటం, పంపుసెట్లు, కుళాయిలు వేయించటం, మస్జిదులను నిర్మించటం, ఆసుపత్రుల్ని నెలకొల్పటం, రోడ్లు వంతెనల నిర్మాణాన్ని చేపట్టడం – ఇత్యాదివన్నీ మనిషి తన జీవితంలో చేసుకుంటే మరణించిన తరువాత కూడా వాటి పుణ్యఫలం అతనికి చేకూరుతూ ఉంటుంది.

రెండు : ప్రయోజనకరమైన విద్యా శిక్షణ. జనులకు ధార్మిక విద్యను బోధించటం, విద్యనార్జించే ఏర్పాట్లు చేయటం, పేద విద్యార్థుల విద్యా విషయక ఖర్చుల్ని భరించటం, రచనా ప్రక్రియను కొనసాగించే వ్యవస్థను నెలకొల్పటం, విద్యాలయాలను స్థాపించటం, ధార్మిక గ్రంథాల ప్రచురణకై ఏర్పాట్లు చేయటం మొదలగువన్నీ ప్రయోజనకరమయిన విద్య క్రిందికే వస్తాయి.

మూడు : సజ్జన సంతానం. సజ్జన సంతానంలో కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మాత్రమేగాక శుభాత్ముల సహచర్యం కోసం ఆరాటపడుతూ వచ్చి శిక్షణ పొందిన శిష్యులు కూడా ఈ జాబితాలోకి వస్తారు. వారికి గనక శిక్షణ ఇచ్చి, మార్గభ్రష్టత నుంచి కాపాడి సన్మార్గంలో పయనింపజేసినట్లయితే ఈ సజ్జన సంతానం మృతుని మన్నింపు కోసం నిష్కల్మషమైన విశ్వాసంతో నిజప్రభువును వేడుకుంటుంది. పరలోకంలో ఉన్నత సోపానాలను ప్రసాదించమని ప్రార్థిస్తుంది. మృతుడు తన ప్రాపంచిక జీవితంలో చేసుకున్న ఈ సదాచరణల సత్ఫలితం అతనికి పరలోకంలో ఎడతెగకుండా చేరుతూ ఉంటుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.17 వక్ఫ్|హదీసు 785

786

హదీసు 786

وَعَنْ اِبْنِ عُمَرَ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ : { أَصَابَ عُمَرُ أَرْضًا بِخَيْبَرَ , فَأَتَى اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-يَسْتَأْمِرُهُ فِيهَا , فَقَالَ : يَا رَسُولَ اَللَّهِ ! إِنِّي أَصَبْتُ أَرْضًا بِخَيْبَرَ لَمْ أُصِبْ مَالًا قَطُّ هُوَ أَنْفَسُ عِنْدِي مِنْه ُ. قَالَ : " إِنْ شِئْتَ حَبَسْتَ أَصْلَهَا , وَتَصَدَّقْتَ بِهَا ". قَالَ : فَتَصَدَّقَ بِهَا عُمَرُ , أَنَّهُ لَا يُبَاعُ أَصْلُهَا, وَلَا يُورَثُ , وَلَا يُوهَبُ , فَتَصَدَّقَ بِهَا فِي اَلْفُقَرَاءِ , وَفِي اَلْقُرْبَى , وَفِي اَلرِّقَابِ , وَفِي سَبِيلِ اَللَّهِ , وَابْنِ اَلسَّبِيلِ , وَالضَّيْفِ , لَا جُنَاحَ عَلَى مَنْ وَلِيَهَا أَنْ يَأْكُلَ مِنْهَا بِالْمَعْرُوفِ , وَيُطْعِمَ صَدِيقاً } غَيْرَ مُتَمَوِّلٍ مَالً ا. مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِمُسْلِمٍ.. وَفِي رِوَايَةٍ لِلْبُخَارِيِّ : { تَصَدَّقْ بِأَصْلِهِ , لَا يُبَاعُ وَلَا يُوهَبُ , وَلَكِنْ يُنْفَقُ ثَمَرُهُ }.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: (నా తండ్రి) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు ఖైబర్ ప్రాంతంలో కొంత భూమి లభించింది. దీనికి సంబంధించి దైవప్రవక్త ﷺను సంప్రతించే ఉద్దేశ్యంతో (నా తండ్రిగారైన) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆయన ﷺ వద్దకు వచ్చారు. “ఓ దైవప్రవక్తా ﷺ! నాకు ఖైబర్ లో కొంత భూమి లభించింది. చాలా ఖరీదైన, సారవంతమైన భూమి అది. ఇంతకు ముందెన్నడూ నాకు ఇటువంటి భూమి ప్రాప్తించలేదు. నేనీ భూమిని దానంగా ఇవ్వదలిచాను” అని విన్నవించుకున్నారు. దానికి ఆయన ﷺ, “నీవు కోరుకుంటే అసలును నీ దగ్గరే వుంచుకుని, ఫలసాయాన్ని దానంగా ఇస్తూ ఉండవచ్చు” అని సలహా ఇచ్చారు. ఉల్లేఖకుని కథనం ప్రకారం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ భూమిని నిరుపేదల, బంధువుల కోసం, బానిసల విముక్తి కోసం, దైవమార్గం కోసం, బాటసారుల కోసం, అతిథి మర్యాదకోసం వక్ఫ్ (అంకితం) చేశారు. వాటి పర్యవేక్షకుడు ధర్మసమ్మతమైన రీతిలో తన స్వయం కోసం కొంత ఖర్చు పెట్టుకోవచ్చనీ, తన స్నేహితులకు కొంత పెట్టవచ్చుననీ వసీయతు కూడా చేశారు. అయితే సొమ్మును నిలువచేసి ఉంచరాదని షరతు విధించారు. (బుఖారీ, ముస్లిం – వాక్యాలు మాత్రం ‘ముస్లిం’లోనివి. బుఖారీలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి – “అసలును దానంగా ఇచ్చారు. అంటే వక్ఫ్ చేశారు. దాన్ని అమ్మనూ రాదు. కానుకగా ఇవ్వనూ రాదు. అయితే దాని ఫలసాయం మాత్రం దైవమార్గంలో ఖర్చుపెట్టబడుతుంది.”

English

Narrated Ibn 'Umar (RA): 'Umar (RA) got some land in Khaibar and went to the Prophet (ﷺ) asking his command regarding it and said, "O Allah's Messenger, I have acquired a land in Khaibar which is the most valuable property that I have ever acquired." He replied, "If you wish you may make the property an endowment and give its produce as Sadaqah." So 'Umar (RA) gave the land as Sadaqah (in endowment on the condition) that must not be sold, inherited, or given away. And he gave its produce as Sadaqah to be devoted to the poor, relatives, the emancipation of salves, in Allah's Cause, for travelers and guests, and there is no sin upon the one who administers it if he eats something from it in a reasonable manner or gives something to a friend to eat, provided he does not store anything as goods (for himself). [Agreed upon; the wording is Muslim's].

A narration by al-Bukhari has: "He gave the land in Sadaqah (as an endowment) that must not be sold or gifted, but its produce must be spent (as Sadaqah)."

సారాంశం

ఆ భూమిని ఇతరులకు విక్రయించటంగానీ, కానుకగా ఇవ్వటం గాని చేయరాదని హదీసులో చెప్పబడింది. అంటే ఒకసారి వక్ఫ్ చేయబడిన ఆస్తిని వేరొకరికి అమ్మకూడదు. కానుక రూపంలో కూడా ఇవ్వకూడదు. హదీసు వెలుగులో బోధపడేది మాత్రం ఇదే. అయితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) మాత్రం; వక్ఫ్ ఆస్తిని అమ్మవచ్చు అని అభిప్రాయపడ్డారు. దీని గురించి ఆయన ప్రియశిష్యులైన ఇమామ్ అబూ యూసుఫ్ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారో చూడండి: “ఈ హదీసు గనక ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టికి వచ్చి ఉంటే, బహుశా ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకునేవారేమో!”

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.17 వక్ఫ్|హదీసు 786

787

హదీసు 787

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : { بَعَثَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عُمَرَ عَلَى اَلصَّدَقَةِ.. } اَلْحَدِيثَ , وَفِيهِ : { وَأَمَّا خَالِدٌ فَقَدْ اِحْتَبَسَ أَدْرَاعَهُ وَأَعْتَادَهُ فِي سَبِيلِ اَللَّهِ } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను సదఖాల (జకాత్ మరియు ఇతర దానధర్మాల) వసూళ్ళకై నియమించి పంపారు. (అల్ హదీస్) “ఖాలిద్ (రదియల్లాహు అన్హు) అయితే తన కవచాలన్నింటినీ దైవమార్గంలో వక్ఫ్ చేశాడు కదా!” అని ఇందులో (హదీసులో) వచ్చింది. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) sent 'Umar (RA) to collect Sadaqah…" The narrator reported the Hadith and it contains:

"As for Khalid, he has kept back his coats of mail and weapons to use them in Allah's Cause." [Agreed upon].

సారాంశం

పూర్తి హదీసు ఇలా వుంది : ఇబ్నె జమీల్, ఖాలిద్ బిన్ వలీద్, దైవప్రవక్త ﷺ పినతండ్రి అయిన అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ లు జకాత్ ను చెల్లించలేదు. వీళ్ళను గురించి చెబుతూ దైవప్రవక్త ﷺ, “ఇబ్నె జమీల్ ఒకప్పుడు నిరుపేదగా ఉండేవాడు. దేవుడు అతన్ని ధనికునిగా చేయగా ఇప్పుడతను పగ తీర్చుకుంటున్నాడు. ఇక ఖాలిద్ (రదియల్లాహు అన్హు) అంటారా, మీరు అతని యెడల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అతనైతే తన కవచాలన్నింటినీ దైవమార్గంలో అర్పించాడు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గురించి ఇక చెప్పేదేముంది! ఆయన (రదియల్లాహు అన్హు) పై ఉన్న జకాత్ ను చెల్లించే బాధ్యత నాది. ఫర్జ్ గా చెల్లించవలసిన జకాత్ తో పాటు, రెట్టింపు అదనంగా కూడా ఇస్తాను” అని అన్నారు.

హదీసు ఉల్లేఖకులు

ఖాలిద్ (రదియల్లాహు అన్హు). మారు పేరు అబూ సులైమాన్. వంశపరంపర ప్రకారం – ఖాలిద్ బిన్ వలీద్ బిన్ ముగీరా మఖ్జూమీ ఖురషి. తల్లి పేరు అస్మా. ఆమె లుబాబా సుఘ్రాగా కూడా పిలువబడేవారు. ఈమె హారిస్ కూతురు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) మక్కా విజయానికి పూర్వం- హిజ్రీ 8లో – ఇస్లాం స్వీకరించారు. మరో కథనం ప్రకారం హిజ్రీ 5వ యేట లేక 6వ యేటలో ముస్లిం అయ్యారు. మక్కా విజయం, హునైన్ యుద్ధం, తబూక్ పోరాటంలో పాల్గొన్నారు. మూతా యుద్ధం జరిగిన రోజు ఆయన చేతులపై తొమ్మిది ఖడ్గాలు విరిగాయి. దైవప్రవక్త ﷺ ఈయనకు ‘సైఫుల్లాహ్’ (దేవుని కరవాలం) అనే బిరుదు నిచ్చారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తన పరిపాలనా కాలంలో మార్గభ్రష్టతా ఉపద్రవం పుట్టినపుడు ఈయన్ని అధికారిగా నియమించారు. ఆ తరువాత పారసీకులను ఎదుర్కొన్నారు. అనంతరం ఈయన్ని సిరియా వైపునకు పంపగా, సిరియాలోని పెక్కు ప్రాంతాల్లో విజయ పతాకం ఎగురవేశారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈయనకు ఉద్వాసన పలికే వరకూ సేనాధిపతిగా కొనసాగారు. పదవీచ్యుతులైన పిదప ‘హిమ్స్’లో స్థిరపడ్డారు. ఆఖరి ఘడియ వరకూ హిమ్స్ లోనే ఉన్నారు. హిజ్రీ 21లో శాశ్వతంగా కన్నుమూశారు. ‘హిమ్స్’కు ఒక మైలు దూరంలో వున్న ఒక పేటలో ఈయన అంత్యక్రియలు జరిగాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.17 వక్ఫ్|హదీసు 787