హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 2.3 నమాజుకై షరతులు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 3వ అధ్యాయం: నమాజ్‌కై షరతులు. ఈ అధ్యాయంలో 20 హదీసులు (హదీసు 160 – 179) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

2.3 నమాజ్‌కై షరతులు

↑ విషయ సూచిక

باب شروط الصلاة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

160

హదీసు 160

عَنْ عَلِيِّ بْنِ طَلْقٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا فَسَا أَحَدُكُمْ فِي اَلصَّلَاةِ فَلْيَنْصَرِفْ , وَلْيَتَوَضَّأْ , وَلْيُعِدْ اَلصَّلَاةَ } رَوَاهُ اَلْخَمْسَةُ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ అలీ బిన్ తల్ఖ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రవచించారు – “నమాజ్ చేస్తుండగా మీలో ఎవరికయినా అపాన వాయువు వెలువడితే వారు తిరిగి వెళ్ళి (నమాజ్‌ను పరిత్యజించి), సరికొత్తగా వుజూ చేసి, మళ్ళీ నమాజ్ చేయాలి.” (అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ – ఈ ఐదుగురూ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు).

English

Narrated 'Ali bin Talq (RA): Allah's Messenger (ﷺ) said: "When one of you releases air (through his anus) during Salat (prayer), he should break the Salat (prayer) then perform ablution and repeat the prayer." [Reported by al-Khamsah and Ibn Hibban graded it Sahih (authentic)].

హదీసు ఉల్లేఖకులు

అలీ బిన్ తల్ఖ్ (రదియల్లాహు అన్హు) గారి పూర్తిపేరు – అలీ బిన్ తల్ఖ్ బిన్ ముంజిర్ బిన్ ఖైస్ సహిమీ యమామి హనఫీ. బనూ హనీఫా తెగతో సంబంధం కలిగి ఉండటంచేత హనఫీగా పిలువబడ్డారు. ఈయన తల్ఖ్ బిన్ అలీ తండ్రి అని ఒక వాదన ఉంది. వీరిద్దరూ ఒక్కరేనన్న అభిప్రాయం కూడా ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 160

161

హదీసు 161

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهَا , عَنِ النَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { لَا يَقْبَلُ اَللَّهُ صَلَاةَ حَائِضٍ إِلَّا بِخِمَارٍ } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا النَّسَائِيُّ , وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ.‏

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “ఎవరికయితే నెలవారీ అవుతుందో (అంటే ఏ స్త్రీ యుక్త వయస్సుకు చేరిందో) ఆమె వోణీ కప్పుకునేదాకా అల్లాహ్ ఆమె నమాజును స్వీకరించడు.” (ఒక్క నసాయి తప్ప మిగిలిన నలుగురూ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు).

English

Narrated ['Aishah (RA)]: The Prophet (ﷺ) said: "The Salat (prayer) of a woman, who has reached puberty, is not accepted unless she is wearing a Khimar." [Reported by al-Khamsah except an-Naza'i. And Ibn Khuzaimah graded it Sahih (authentic)].

సారాంశం

యుక్త వయస్సుకు చేరిన స్త్రీ శరీరమంతా నమాజ్ చేసే సమయంలో వస్త్రంతో కప్పబడి ఉండాలని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. ఆఖరికి శిరోజాలు సయితం కప్పబడి ఉండాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 161

162

హదీసు 162

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ لَهُ : { إِنْ كَانَ اَلثَّوْبُ وَاسِعًا فَالْتَحِفْ بِهِ" } ‏- يَعْنِي : فِي اَلصَّلَاةِ ‏- وَلِمُسْلِمٍ : { "فَخَالِفْ بَيْنَ طَرَفَيْهِ ‏- وَإِنْ كَانَ ضَيِّقًا فَاتَّزِرْ بِهِ " }. مُتَّفَقٌ عَلَيْهِ. وَلَهُمَا مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { لَا يُصَلِّي أَحَدُكُمْ فِي اَلثَّوْبِ اَلْوَاحِدِ لَيْسَ عَلَى عَاتِقِهِ مِنْهُ شَيْءٌ }

దైవప్రవక్త ﷺ తనకు ఈ విధంగా ఉపదేశించారని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “వస్త్రం పెద్దగా పొడవుగా ఉంటే (నమాజ్‌లో) వస్త్రాన్ని బాగా చుట్టుకోండి” ముస్లింలోని ఉల్లేఖనంలో ఇలా వుంది – “వస్త్రం పొడవుగా ఉంటే దాని రెండు అంచులను భుజం యొక్క ఇరువైపులా వేసుకోండి. ఒకవేళ వస్త్రం చిన్నగా, కురచగా ఉంటే లుంగీ మాదిరిగా కట్టుకోండి.” (బుఖారీ, ముస్లిం) బుఖారీ, ముస్లింలోనే హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది – “మీలో ఎవరూ ఒకే వస్త్రంలో – దాని భాగమేదయినా భుజాలపై లేనంత వరకూ – నమాజ్ చేయకండి.”

English

Narrated Jabir (RA): The Prophet (ﷺ) said: "If the garment is ample, wrap it round your body i.e. during the Salat (prayer)." A narration by Muslim has: "you should cross the two ends, and if it is tight, you should wrap it round your waist." [Agreed upon].

Narrated Abu Hurairah (RA): [The Prophet (ﷺ) said:] None of you should offer Salat (prayer) in a single garment with no part of it on his shoulders. [Agreed upon].

సారాంశం

నమాజ్ చేసేవాని భుజాలు కూడా నగ్నంగా ఉండరాదని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 162

163

హదీసు 163

وَعَنْ أُمِّ سَلَمَةَ ‏- رَضِيَ اَللَّهُ عَنْهَا‏- ; أَنَّهَا سَأَلَتْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-{ أَتُصَلِّي اَلْمَرْأَةُ فِي دِرْعٍ وَخِمَارٍ , بِغَيْرِ إِزَارٍ ? قَالَ : "إِذَا كَانَ اَلدِّرْعُ سَابِغًا يُغَطِّي ظُهُورَ قَدَمَيْهَا } أَخْرَجَهُ أَبُو دَاوُدَ وَصَحَّحَ اَلْأَئِمَّةُ وَقْفَهُ.

హజ్రత్ ఉమ్మె సలమ (రదియల్లాహు అన్హా) కథనం : ఏ స్త్రీ అయినా నడుము బట్ట (లంగా, చీర, పైజామా ఇత్యాదివి) లేకుండానే కేవలం చొక్కా మరియు వోణీ ధరించి నమాజ్ చేయవచ్చా? అని నేను దైవప్రవక్త ﷺ ను ప్రశ్నించగా ఆయన ﷺ ఇలా సమాధానమిచ్చారు- “చొక్కా పొడవుగా ఆమె పాదాల వరకూ వచ్చేలా ఉంటే అప్పుడు ధర్మసమ్మతమవుతుంది.” (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు – ఇమాములు దీనిని మౌఖూఫ్‌గా ఖరారు చేశారు)

English

Narrated Umm Salamah (RA): She asked the Prophet (ﷺ), "Can a woman pray in a long dress and a veil without wearing a lower garment?" He replied, "If the long dress is ample and covers the surface of her feet." [Reported by Abu Dawud and the Imams graded it Mawquf (a saying of Umm Salamah)].

సారాంశం

నమాజ్ చేసే సమయంలో స్త్రీ తన శరీరమంతటినీ వస్త్రంతో కప్పటం అవసరం. ఒక పొడవాటి (మాక్సి తరహా) చొక్కాను తొడుక్కొని, వోణీ కప్పుకుని కూడా ఆమె నమాజ్ చేయగలదు. కాని ఆ చొక్కా ఆమె కాలి మడమలను సయితం కప్పేంత నిడివిగా ఉండాలి. నమాజ్ చేసేటప్పుడు స్త్రీ పాదాలను కూడా కప్పటం అవసరమని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. ఈ హదీసు వెలుగులో కొంతమంది ఉలమా (పండితులు) స్త్రీ పాదాలను సయితం ఆమె ‘సతర్’లో అంతర్భాగంగా చేర్చారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 163

164

హదీసు 164

وَعَنْ عَامِرِ بْنِ رَبِيعَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : { كُنَّا مَعَ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فِي لَيْلَةٍ مَظْلَمَةٍ , فَأَشْكَلَتْ عَلَيْنَا اَلْقِبْلَةُ , فَصَلَّيْنَا. فَلَمَّا طَلَعَتِ اَلشَّمْسُ إِذَا نَحْنُ صَلَّيْنَا إِلَى غَيْرِ اَلْقِبْلَةِ , فَنَزَلَتِ الْآيَةُ : (فَأَيْنَمَا تُوَلُّوا فَثَمَّ وَجْهُ اَللَّهِ )‏ } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ وَضَعَّفَهُ.

హజ్రత్ ఆమిర్ బిన్ రబీయ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక చీకటి రాత్రి మేము దైవప్రవక్త ﷺ వెంట ఉన్నాము. ‘ఖిబ్లా’ దిశను నిర్ధారించటం మాకు గగనమైపోయింది. మేము (ఒక అంచనా ప్రకారం దిశను నిర్ధారించి) నమాజ్ చేశాము. తీరా సూర్యోదయం అయిన పిదప మాకు బోధపడింది – మేము నిర్ధారించుకున్న ఖిబ్లా సరైనది కాదనీ, మరో దిశలో తిరిగి నమాజ్ చేశామని! అప్పుడు ఈ ఆయత్ అవతరించింది: ‘మరి మీరు ఏ వైపునకు అభిముఖమైనా ఆ వైపే అల్లాహ్ ఉన్నాడు.” (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు – జయీఫ్‌గా ఖరారు చేశారు)

English

Narrated 'Aamir bin Rabi'ah (RA): We were with the Prophet (ﷺ) during a dark night and we became uncertain about the Qiblah (the direction of Makkah) we then prayed (without being certain). When the run rose, we discovered that we prayed towards a direction other than the Qiblah. So this Verse was revealed: "…so wherever you turn yourselves or your faces, there is the Face of Allah…" [Reported by at-Tirmidhi who graded it Da'if (weak)].

సారాంశం

మనిషి వల్ల పొరపాటు జరగటం సహజం. ప్రయాణావస్థలో పలు కారణాలవల్ల ఖిబ్లా దిశను నిర్ణయించటం కష్టమవుతుంది. మనిషి తన ఆలోచనకు పదునుపెట్టి ఏదో ఒక నిర్ధారణకు వస్తాడు. అతని నిర్ధారణ తప్పని తరువాత తెలిసిరావచ్చు. అంతమాత్రాన నమాజును మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. కాని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) దృక్పథం మాత్రం మరోవిధంగా ఉంది. నమాజ్ వేళ దాటినా, దాటకపోయినాసరే – ఖిబ్లా దిశ నిర్ధారించటంలో తప్పటడుగు వేసినట్టు తెలియగానే ఆ నమాజ్‌ను తిరిగి చేయాల్సిందే. ఎందుకంటే నమాజ్ కోసం ఖిబ్లా వైపునకు తిరగటం అవసరం అంటారాయన.

హదీసు ఉల్లేఖకులు

ఆమిర్ బిన్ రబీయ (రదియల్లాహు అన్హు) అన్జ్ బిన్ వాయల్ తెగకు చెందినవారు. వాయల్ కుమారులగు బక్ర్, తగ్లిబ్‌లు ఈయనకు సోదరులు. ఈయన తొలి కాలంలోనే ఇస్లాం సత్యామృతాన్ని ఆస్వాదించారు. అబిసీనియా వైపునకు, మదీనా వైపునకు – రెండు హిజ్రత్‌లు చేశారు. బద్ర్ సంగ్రామంలోనూ, ఇతర యుద్ధాలలోనూ వీరోచితంగా పోరాడారు. ఈయన మరణ సమయం గురించి అభిప్రాయభేదం ఉంది. హిజ్రీ 32 అనీ, 33 అనీ, 35 అనీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 164

165

హదీసు 165

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَا بَيْنَ اَلْمَشْرِقِ وَالْمَغْرِبِ قِبْلَةٌ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ , وَقَوَّاهُ اَلْبُخَارِيُّ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺప్రవచించారు: “తూర్పు – పడమరల మధ్యన ‘ఖిబ్లా’ ఉంది.” (తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు. బుఖారీ దీనిని దృఢతరమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "The direction between the east and west is Qiblah." [Reported by at-Tirmidhi, and al-Bukhari considered it Qawi (strong)].

సారాంశం

ఈ హదీసు మదీనా వాసులను, ఆ దిశలోనే ఉన్న ఇతరులను దృష్టిలో పెట్టుకుని చెప్పబడింది. అన్ని ప్రాంతాలవారికి, ముఖ్యంగా భారతీయులకు ఇది వర్తించదు. మదీనా నగరం పవిత్ర మక్కాకు ఉత్తరాన ఉంది. అంటే మదీనా వాసులకు కాబా గృహం దక్షిణాన ఉంటుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 165

166

హదీసు 166

وَعَنْ عَامِرِ بْنِ رَبِيعَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : { رَأَيْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُصَلِّي عَلَى رَاحِلَتِهِ حَيْثُ تَوَجَّهَتْ بِهِ } مُتَّفَقٌ عَلَيْهِ. زَادَ اَلْبُخَارِيُّ : { يُومِئُ بِرَأْسِهِ , وَلَمْ يَكُنْ يَصْنَعُهُ فِي اَلْمَكْتُوبَةِ }. وَلِأَبِي دَاوُدَ : مِنْ حَدِيثِ أَنَسٍ : { وَكَانَ إِذَا سَافَرَ فَأَرَادَ أَنْ يَتَطَوَّعَ اِسْتَقْبَلَ بِنَاقَتِهِ اَلْقِبْلَةِ , فَكَبَّرَ , ثُمَّ صَلَّى حَيْثُ كَانَ وَجْهَ رِكَابِهِ } وَإِسْنَادُهُ حَسَنٌ.

హజ్రత్ ఆమిర్ బిన్ రబీయ (రదియల్లాహు అన్హు) తెలిపారు: నేను దైవప్రవక్త ﷺను తమ ఒంటెపై నమాజ్ చేస్తుండగా చూశాను. ఒంటె ఏ వైపునకు తిరిగినప్పటికీ ఆయన నమాజ్‌ను చేస్తూనే ఉండేవారు (బుఖారీ, ముస్లిం). ‘ఆయన తన తల ఊపటం ద్వారా నమాజ్ చేసేవారు. ఫర్జ్ నమాజ్‌లో అలా చేసేవారు కాదు.’ అన్న వాక్యం బుఖారీలో అదనంగా ఉంది.

అబూదావూద్‌లో హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా వుంది – ఆయన ﷺ ప్రయాణంలో నుండగా (ఒకసారి) నఫిల్ నమాజ్ చేయగోరి తన ఒంటె దిశను ‘కాబా’ వైపునకు మళ్ళించారు. ఆ తరువాత వాహనం ఏఏ దిశలలో సాగినా -నమాజ్‌ను నిరాఘాటంగా చేసి – పూర్తి చేశారు. (ఈ హదీసు ‘పరంపర’ దృష్ట్యా ‘హసన్’గా ఖరారు చేయబడింది)

English

Narrated 'Aamir bin Rabi'ah (RA): I saw Allah's Messenger (ﷺ) praying while mounted on his riding animal facing whatever direction it faced. [Agreed upon].

al-Bukhari added: "Making gestures with his head and he did not do that (pray while mounted) with obligatory prayers."

Narrated Anas in another narration of the Hadith reported by Abu Dawud: When [he (ﷺ)] traveled, and intended to pray a voluntary prayer, he used to direct his riding camel towards the Qiblah, say, "Allahu Akbar" and pray facing whatever direction it faced. [Its chain is Hasan (good)].

సారాంశం

ప్రయాణావస్థలో నఫిల్ నమాజులు కూడా వాహనంపై కూర్చుని చేయవచ్చని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఒకసారి మన ముఖాన్నిగానీ, వాహనం ముఖాన్నిగానీ ఖిబ్లా వైపునకు తిప్పి ఆరంభిస్తే చాలు – మధ్యలో వాహనం ఎన్ని దిశలవైపునకు తిరిగినా ఫరవాలేదు; నిస్సంశయంగా నమాజ్ నెరవేరుతుంది. ఈవిధంగా ఆధునిక యుగంలో రైలు, ఓడ, విమానం తదితర వాహనాలపై నమాజ్ చేయటం ధర్మసమ్మతమే. ధర్మవేత్తలంతా ఈ విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 166

167

హదీసు 167

وَعَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- أَنَّ النَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلْأَرْضُ كُلُّهَا مَسْجِدٌ إِلَّا اَلْمَقْبَرَةَ وَالْحَمَّامَ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ , وَلَهُ عِلَّةٌ..

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: “ఖబరస్తాన్ (ఖనన వాటిక) మరియు స్నానశాల తప్ప మిగిలిన భూభాగమంతా మస్జిదే (ఎక్కడంటే అక్కడే నమాజ్ చేయవచ్చు).” (తిర్మిజీ)

English

Narrated Abu Sa'id al-Khudri (RA): The Prophet (ﷺ) said: "The whole earth is a mosque (to pray on) except a graveyard and a toilet." [Reported by at-Tirmidhi and it has an 'Illa (a defect)].

సారాంశం

ఖననవాటికలో, బాత్రూంలో నమాజ్ చేయటం సమంజసం కాదని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతున్నది. బహుదైవారాధనకు దారితీసే ఏ అవకాశానికి కూడా తావు కలగరాదన్న ఉద్దేశ్యంతో ‘ఖబరస్తాన్’లో నమాజ్ చేయడాన్ని వారించటం జరిగింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 167

168

హదీసు 168

وَعَنْ اِبْنِ عُمَرَ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-]قَالَ] : { نَهَى رَسُولُ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ يُصَلَّى فِي سَبْعَةِ مَوَاطِنَ : اَلْمَزْبَلَةِ , وَالْمَجْزَرَةِ , وَالْمَقْبَرَةِ , وَقَارِعَةِ اَلطَّرِيقِ , وَالْحَمَّامِ , وَمَعَاطِنِ اَلْإِبِلِ , وَفَوْقَ ظَهْرِ بَيْتِ اَللَّهِ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ وَضَعَّفَهُ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ఏడుచోట్ల నమాజ్ చేయడాన్ని వారించారు. చెత్తా చెదారం (కసువు వగైరా) వేసేచోట, జంతువులను కోసేచోట, ఖబరస్తాన్ (ఖననవాటిక)లో, జనులు నడిచే దారిలో, స్నానశాలలో, ఒంటెను కట్టే చోట మరియు బైతుల్లాహ్ (కాబా గృహం) కప్పుపై (నమాజ్ చేయకూడదు). (తిర్మిజీ దీనిని బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు).

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) forbade prayer at seven places; a dump, a slaughter house, a graveyard, the middle of the path, a bathroom, and where camels sit at a watering place and on (roof) of the Ka'bah. [Reported by at-Tirmidhi who graded it Da'if (weak)].

సారాంశం

భూభాగమంతా మస్జిద్‌గా ఖరారు చేయబడినప్పటికీ కొన్ని నిర్ణీత స్థానాలలో నమాజ్ చేయటం నిషిద్ధమని ఈ హదీసు ద్వారా తెలుస్తున్నది. వాటిలో ఒకటి ప్రజలు చెత్తా చెదారం వేసే స్థలం. అది పరిశుద్ధంగా ఉండదు. నమాజ్ చేసే చోటు పరిశుభ్రంగా ఉండటం అవసరం గనక ఈ స్థలంలో నమాజ్ చేయరాదు. అలాగే జంతువులను జిబహ్ చేసేచోటు (Slaughter House). అది కూడా రక్తం వల్ల, కసువువల్ల అశుద్ధంగా ఉంటుంది. జనులు వచ్చే పోయే మార్గంలో కూడా నమాజ్ చేయకూడదు. ఎందుకంటే అసలే జనుల రాకపోకలవల్ల మార్గాలు ఇరుకుగా ఉంటాయి. అందులోనే ప్రజలు నమాజ్ కోసం కూడా మరికొంత జాగాను ఆక్రమిస్తే వచ్చే పోయేవారికి ఇబ్బంది కలుగుతుంది సరికదా, నమాజ్ చేసేవారికి ఏకాగ్రత కూడా లభించదు. ఇక కాబా గృహం పైకప్పుపై నమాజ్ చేయకుండా వారించటంలోని మర్మం ఏమిటంటే నమాజ్ చేసే సమయంలో మనిషి కాబా గృహం వైపునకు అభిముఖమై ఉండటం అవసరం. కప్పుపైకెక్కి నమాజ్ చేస్తే అతనికి ఖిబ్లా ఎదురుగా ఉండదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 168

169

హదీసు 169

وَعَنْ أَبِي مَرْثَدٍ اَلْغَنَوِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ : سَمِعْتَ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ : { لَا تُصَلُّوا إِلَى اَلْقُبُورِ , وَلَا تَجْلِسُوا عَلَيْهَا } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ ముర్సద్ ఘనవీ (రదియల్లాహు అన్హు) కథనం: “గోరీలు ఎదురుగా నుండగా నమాజ్ చేయటంగానీ, వాటిపై కూర్చోవటంగానీ చేయకండి” అని దైవప్రవక్త ﷺ ప్రబోధించగా నేను విన్నాను.” (ముస్లిం)

English

Narrated Abu Marthad al-Ghanawi (RA): I heard Allah's Messenger (ﷺ) say, "Don't pray towards graves and don't sit on them." [Reported by Muslim]

సారాంశం

సమాధుల వైపునకు ముఖం త్రిప్పి నమాజ్ చేయటం నిషిద్ధమని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. చనిపోయిన కొంతమంది పుణ్య పురుషుల ఆత్మల నుండి స్ఫూర్తి పొందవచ్చన్న సంకల్పంతో కొందరు మస్జిదులను ఉద్దేశ్యపూర్వకంగా సమాధులున్న చోట కడతారు. ఇది కూడా నిషిద్ధమే. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) హదీసులో ఈ సంగతి స్పష్టంగా చెప్పబడింది – “అల్లాహ్ శాపం యూదులపై, క్రైస్తవులపై పడుగాక! వాళ్ళు తమ ప్రవక్తల గోరీలను సాష్టాంగస్థలం (మస్జిద్) గా చేసుకున్నారు” అని మహాప్రవక్త ﷺ చెప్పారు. అంటే నమాజ్ కోసం నిలబడినచోట – ఎదురుగా సమాధి ఉంటే అది షిర్క్ (బహుదైవోపాసన)కు బీజం నాటవచ్చు. అందుకే ఈ అంశాన్ని తీవ్రంగా వారించటం జరిగింది.

ఇక సమాధిపై కూర్చోవటం గురించి –

దీనికీ రెండు అర్థాలున్నాయి. ఒకటి: సమాధిని ఆసీనమయ్యే చోటుగా, తలగడగా చేసుకోవటం తప్పు. రెండు: సమాధులవద్ద ముజావర్లుగా తిష్ట వేయటం లేదా కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఆ స్థలాన్ని దుర్వినియోగపరచటం నిషిద్ధం.

హదీసు ఉల్లేఖకులు

అబూ ముర్సద్ ఘనవీ అసలు పేరు కనాజ్ బిన్ హుసైన్ బిన్ యర్బా. అబూ ముర్సద్ మారు పేరు. ఘిత్ఫాన్ తెగకు చెందిన ఒక వ్యక్తి ఘనీ బిన్ యాసుర్‌తో గల సంబంధం కారణంగా ఘనవీ అని సంబోధించబడ్డారు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్న సహాబీ ఈయన. హమ్జా బిన్ అబ్దుల్ ముత్తలిబ్‌కు మద్దతుదారులు. యుద్ధాలన్నింటిలోనూ పాల్గొన్నారు. హిజ్రీ 16లో 66 ఏళ్ళ వయస్సులో కన్ను మూశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 169

170

హదీసు 170

وَعَنْ أَبِي سَعِيدٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا جَاءَ أَحَدُكُمْ اَلْمَسْجِدَ , فَلْيَنْظُرْ, فَإِنْ رَأَى فِي نَعْلَيْهِ أَذًى أَوْ قَذَرًا فَلْيَمْسَحْهُ , وَلْيُصَلِّ فِيهِمَا } أَخْرَجَهُ أَبُو دَاوُدَ , وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “మీలో ఎవరయినా మస్జిద్‌కు వచ్చినపుడు (లోనికి ప్రవేశించేముందు తన చెప్పులను) సరిగ్గా చూచుకోవాలి. ఒకవేళ తమ చెప్పులకు అశుద్ధతగానీ, మలినంగానీ అంటుకుని ఉంటే అతడు దాన్ని పరిశుభ్రం చేసుకుని మరీ నమాజ్ చేయాలి.” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.

English

Narrated Abu Sa'id (RA): Allah's Messenger (ﷺ) said: "When any of you comes to the mosque he should look and if he sees impurity on his sandals (shoes) he should wipe them and then pray in them." [Reported by Abu Dawud, and Ibn Khuzaimah graded it Sahih (authentic)].

సారాంశం

చెప్పులు (లేక బూట్లు) తొడిగి నమాజ్ చేయటంలో ఆక్షేపణీయం ఏమీ లేదన్న దానికి ఈ హదీసు ప్రబల నిదర్శనం. అయితే పాదరక్షలు పరిశుభ్రంగా ఉండాలన్నది షరతు. చెప్పులకు అంటుకుని వున్న అశుద్ధతను, మాలిన్యాన్ని దూరం చేయటం వల్ల అవి పరిశుభ్రం అయిపోతాయని కూడా దీన్నిబట్టి అవగతమవుతున్నది.

దైవప్రవక్త ﷺ ఈవిధంగా ప్రబోధించటం వెనుక ఒక సంఘటన ఉంది. ఒకసారి ఆయన ﷺ చెప్పులు తొడిగి నమాజ్ చేయిస్తున్నారు. తన చెప్పు అశుద్ధంగా వున్న సంగతి ఆయన ﷺకు తెలీదు. దాని అడుగుభాగాన మలినం తగిలి ఉంది. నమాజ్ మధ్యలో దైవదూత జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఆయన ﷺకు ఈ సంగతి తెలియజేశారు. ఆయన నమాజ్ మధ్యలోనే చెప్పులు విడిచి, నమాజ్‌ను కొనసాగించారు. వెనుక నమాజ్ చేస్తున్న సహచరులు కూడా దైవప్రవక్త ﷺను అనుసరిస్తూ తమ తమ పాదరక్షలను విడిచేశారు. నమాజ్‌ను యధాతథంగా కొనసాగించారు. నమాజ్ పూర్తయిన తరువాత, చెప్పుల్ని విడవటానికి కారణం దర్యాప్తు చేశారు దైవప్రవక్త ﷺ. మేము మిమ్మల్ని అనుసరించేవాళ్ళము, మీరు ఎలా చేస్తే మేమూ అలాగే చేస్తాముకదా! అని సహచరులు సంజాయిషీ ఇచ్చారు. అప్పుడు దైవప్రవక్త ﷺ తాను తన చెప్పులను విడువటానికి గల కారణం వివరించారు.

ఈ హదీసు ద్వారా మనకు బోధపడే విషయం ఏమిటంటే నమాజ్ చేస్తున్న వ్యక్తికీ – తన దుస్తులకుగానీ, చెప్పులకుగానీ, మేజోళ్ళకుగానీ అశుద్ధత అంటుకుని వున్న సంగతి ముందుగా తెలియక, నమాజు మధ్యలో తెలిస్తే నిస్సంకోచంగా అశుద్ధ వస్తువును అప్పటికప్పుడే విడిచి తన నమాజ్‌ను కొనసాగించవచ్చు. అలా చేయటం వల్ల అతని నమాజ్‌కు ఎలాంటి హాని కలుగదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 170

171

హదీసు 171

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا وَطِئَ أَحَدُكُمْ اَلْأَذَى بِخُفَّيْهِ فَطَهُورُهُمَا اَلتُّرَابُ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా మేజోళ్ళు ధరించి అశుద్ధతపై నుంచి నడచివెళితే నిస్సందేహంగా మట్టి పరిశుద్ధపరుస్తుంది.” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "If one of you steps on filth with his two leather socks then the earth is their purification." [Reported by Abu Dawud, and Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

చెప్పులకు, బూట్లకు, (తోలుతో చేయబడిన) మేజోళ్ళకు – వాటి అడుగు భాగాన అంటుకున్న అశుద్ధత ఎండిపోయినా లేక తడిగా ఉన్నా, అది చిన్న తరహా మలినమయినా, పెద్ద తరహా మలిన మయినా, పరిశుద్ధమయిన మట్టిపై తుడవటం వల్ల అది పరిశుభ్రమైపోతుంది. ప్రత్యేకంగా వాటిని కడగవలసిన అవసరం లేదు. అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారి విధానం మరోవిధంగా ఉంది. అయితే హనఫీ శాస్త్రాన్ని అనుసరించేవారు కూడా ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) విధానాన్ని అంగీకరించారు. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) కూడా ఈ పద్ధతిపట్ల ఏకీభవించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 171

172

హదీసు 172

وَعَنْ مُعَاوِيَةَ بْنِ اَلْحَكَمِ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ هَذِهِ اَلصَّلَاةَ لَا يَصْلُحُ فِيهَا شَيْءٌ مِنْ كَلَامِ اَلنَّاسِ , إِنَّمَا هُوَ اَلتَّسْبِيحُ , وَالتَّكْبِيرُ , وَقِرَاءَةُ اَلْقُرْآنِ } رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ముఆవియా బిన్ హకమ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: దైవప్రవక్త ﷺ ప్రబోధించారు: “నమాజ్‌లో సంభాషణకు ఎలాంటి అవకాశం లేదు. నమాజులోనయితే కేవలం దేవుని పవిత్రత (సుబ్‌హానల్లాహ్), దేవుని గొప్పతనం (అల్లాహు అక్బర్) కొనియాడబడాలి. దివ్య గ్రంథ పారాయణం చేయాలి.” (ముస్లిం)

English

Narrated Mu'awiya bin al-Hakam (RA): Allah's Messenger (ﷺ) said: "Talking is not befitting during the Salat (prayer), for it (prayer) consists only of glorifying Allah, declaring His Greatness and the recitation of the Qur'an." [Reported by Muslim].

సారాంశం

ఈ హదీసు పూర్వరంగం ఏమిటంటే నమాజు మధ్యలో ఒక వ్యక్తి తుమ్మి, ‘అల్ హమ్దులిల్లాహ్’ అని పలికాడు. దీనికి సమాధానంగా ముఆవియ (రదియల్లాహు అన్హు) గారు నమాజ్ చేస్తూనే (యర్‌హముకల్లాహ్) అని బదులిచ్చారు. నమాజు ముగించిన తరువాత దైవప్రవక్త ﷺ పై హదీసును ఉపదేశించారు. నమాజు మధ్యలో ఇతరుల్ని సంబోధించి మాట్లాడటం హరామ్ (నిషిద్ధం) అని ఈ హదీసు ద్వారా అర్థమవుతున్నది.

హదీసు ఉల్లేఖకులు

ముఆవియా బిన్ హకమ్ (రదియల్లాహు అన్హు) హిజాజ్ ప్రాంతానికి చెందినవారు. మదీనాలో స్థిరపడ్డారు. ‘బనూ సులైమ్’లో ఉండసాగారు. ఈయన కూడా ప్రవక్త ప్రియసహచరులు (సహాబి)గా పరిగణించబడతారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 172

173

హదీసు 173

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ ‏- رضى الله عنه ‏- قَالَ : { إِنْ كُنَّا لَنَتَكَلَّمُ فِي اَلصَّلَاةِ عَلَى عَهْدِ رَسُولِ اللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُكَلِّمُ أَحَدُنَا صَاحِبَهُ بِحَاجَتِهِ , حَتَّى نَزَلَتْ : (حَافِظُوا عَلَى اَلصَّلَوَاتِ وَالصَّلَاةِ اَلْوُسْطَى وَقُومُوا لِلَّهِ قَانِتِينَ)‏ فَأُمِرْنَا بِالسُّكُوتِ , وَنُهِينَا عَنْ اَلْكَلَامِ } مُتَّفَقٌ عَلَيْهِ , وَاللَّفْظُ لِمُسْلِمٍ

హజ్రత్ జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) కథనం: “మేము దైవప్రవక్త ﷺ కాలంలో నమాజు మధ్యలో ఒండొకరితో సంభాషించేవాళ్ళం. ఒండొకరి అక్కరలను గురించి చర్చించుకునేవాళ్ళం. ఎట్టకేలకు ఈ ఆయత్ అవతరించింది – “హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా వ ఖూమూ లిల్లాహి ఖానితీన్.” దీని తరువాత నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించబడింది. నమాజ్‌లో మాట్లాడుకోవటాన్ని వారించటం జరిగింది.” (బుఖారీ, ముస్లిం – ఈ వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)

English

Narrated Zaid bin Arqam (RA): We used to talk while engaged in Salat (prayer) during the lifetime of Allah's Messenger (ﷺ) and one would talk with his companion regarding his needs in prayer till (this verse) was revealed: "Guard strictly the prayers, especially the middle prayer; and stand before Allah with obedience," then we were commanded to observe silence (in prayer) and were forbidden to talk. [Agreed upon. This wording is from Muslim].

సారాంశం

నమాజ్ మధ్యలో సంభాషించటం నిషిద్ధమని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతున్నది. ఇస్లాం ఆరంభకాలంలో నమాజ్ మధ్యలో సంభాషించుకునేందుకు అనుమతి ఉండేది. తరువాత ఇది నిషేధించబడింది.

హదీసు ఉల్లేఖకులు

జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) అన్సార్ వర్గీయులు. ఖజ్రజ్ తెగకు చెందినవారు. అబూ అమ్ర్ ఈయన నామాంతరం. కందక యుద్ధంలో తొలిసారిగా పాల్గొన్నారు. దైవప్రవక్త ﷺతో కలసి మొత్తం 17 యుద్ధాలలో పాల్గొన్నారు. సిఫ్ఫీన్ యుద్ధ సందర్భంగా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మద్దతుదారుల పక్షాన ఉన్నారు. కూఫాలో స్థిరపడ్డారు. హిజ్రీ 66లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 173

174

హదీసు 174

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلتَّسْبِيحُ لِلرِّجَالِ , وَالتَّصْفِيقُ لِلنِّسَاءِ } مُتَّفَقٌ عَلَيْهِ.. زَادَ مُسْلِمٌ { فِي اَلصَّلَاةِ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “(నమాజులో అవసరమైనప్పుడు) పురుషులు తస్బీహ్ పలకాలి (అంటే సుబ్‌హానల్లాహ్ అని అంటూ ఇమామ్‌ను జాగరూకపరచాలి) స్త్రీలు చప్పట్లు చరచాలి” (బుఖారీ, ముస్లిం- ముస్లింలో ‘ఫిస్సలాతి’ అంటే నమాజులో అనే పదం అధికంగా ఉంది).

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "Glorification of Allah (i.e. saying) is for men and clapping of hands is for women." [Agreed upon].

Muslim added: "during Salat (prayer)".

సారాంశం

నమాజులో ఇమామ్ మరచిపోతే అతన్ని సావధానపర్చడానికి వెనుక నున్నవారు ‘సుబ్‌హానల్లాహ్’ అని పలికి అతని పొరబాటును అతని దృష్టికి తీసుకురావాలి. వెనుక నమాజ్ చేసేవారు స్త్రీలయితే చప్పట్లు చరచటం ద్వారా పొరపాటును ఎత్తి చూపాలి. అంతేగానీ స్త్రీలు తమ నోటితో సుబ్‌హానల్లాహ్ తదితర వాక్యాలు పలుకనవసరం లేదు. వారు తమ కుడిచేతి యొక్క రెండు వ్రేళ్ళను ఎడమచేతి ఉపరితలంపై చరిస్తే సరిపోతుందని ఈసా బిన్ అయ్యూబ్ తెలిపారు. పరాయి స్త్రీ కంఠం మగవారికి తెలియకూడదన్న ఉద్దేశ్యంతోనే చప్పట్లు చరిచే పద్ధతి ప్రతిపాదించబడింది. అంటే స్త్రీ కంఠం (శబ్దం) కూడా ఒకవిధంగా ‘పరదా’ లాంటిదే. ఈ విషయంలో ఇస్లాం ఎంత సెన్సిటివ్‌గా ఉందో, ఆధునికత పేరిట విశృంఖలంగా విహరిస్తున్న మహిళలు ఆలోచించాలి. కొంతమంది మగవాళ్ళు ఇమామ్ పొరబాటును ఎత్తిచూపటానికి ‘సుబ్‌హానల్లాహ్’ బదులు ‘అల్‌హమ్దులిల్లాహ్’ అంటూ ఉంటారు. ఇది కూడా సరైనది కాదు. ఎందుకంటే దైవప్రవక్త విధానంలో ఇలాంటిదేదీ లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 174

175

హదీసు 175

وَعَنْ مُطَرِّفِ بْنِ عَبْدِ اَللَّهِ بْنِ الشِّخِّيرِ , عَنْ أَبِيهِ قَالَ : { رَأَيْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُصَلِّي , وَفِي صَدْرِهِ أَزِيزٌ كَأَزِيزِ اَلْمِرْجَلِ , مِنْ اَلْبُكَاءِ } أَخْرَجَهُ اَلْخَمْسَةُ , إِلَّا اِبْنَ مَاجَهْ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ ముతర్రిఫ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ షిఖ్ఖిర్ (రదియల్లాహు అన్హు) తన తండ్రి గారు చెప్పినట్లు తెలిపారు: (తండ్రిగారు) ఇలా చెప్పారు – నేను దైవప్రవక్త ﷺ ను నమాజ్ చేస్తుండగా చూచాను. దైవభీతి కారణంగా ఆయన ﷺ గుండెలో నుంచి ఉడుకుతున్న కుండ చేసే ధ్వని లాంటిది వినవచ్చేది”. (దీనిని అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, నసాయి ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ ప్రామాణికమని ఖరారు చేశారు)

English

Narrated Mutarrif bin Abdullah bin Shikhkhir (RA) from his father, who said, "I saw Allah's Messenger (ﷺ) when he was engaged in prayer, and heard a sound from his chest, like the bubbling of a pot, from weeping." [Reported by al-Khamsah except Ibn Majah, and Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

దైవభీతి, దైవభక్తి పరాయణత కారణంగా నమాజు మధ్యలో మనిషి విలపిస్తే దానివల్ల నమాజ్‌కు ఎలాంటి భంగం, నష్టం వాటిల్లదని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది.

హదీసు ఉల్లేఖకులు

(1) ముతర్రిఫ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ షిఖ్ఖిర్ (రదియల్లాహు అన్హు) హర్షి ఆమిరీ బస్రీ. తాబయీన్లలో ఒకరుగా పరిగణించబడతారు. విశ్వసనీయులు. దైవభక్తి పరాయణులు. జ్ఞానిగా పేరు మోశారు. హిజ్రీ 95లో మరణించారు.

(2) ‘తండ్రిగారు’ అంటే ఇక్కడ అబ్దుల్లాహ్ బిన్ షిఖ్ఖిర్ బిన్ ఔఫ్ బిన్ కాబ్ హర్షి ఆమిరీ (రదియల్లాహు అన్హు) అన్నమాట. ఈయన దైవప్రవక్త సహచర్యం పొందిన వారిలో ఒకరు. దైవప్రవక్త ﷺ సమక్షంలోకి వచ్చిన బనీ ఆమిర్ బృందంలో ఈయన కూడా కీలకమయిన వ్యక్తి. బస్రీగా పరిగణించబడతారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 175

176

హదీసు 176

وَعَنْ عَلَيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ : { كَانَ لِي مِنْ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-مَدْخَلَانِ , فَكُنْتُ إِذَا أَتَيْتُهُ وَهُوَ يُصَلِّي تَنَحْنَحَ لِي } رَوَاهُ النَّسَائِيُّ , وَابْنُ مَاجَهْ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺ ను రెండు వేళల్లో కలుసుకునేవాణ్ణి. నేను ఆయన ﷺ వద్దకు వెళ్ళిన సమయంలో ఆయన ﷺ గనక నమాజ్ చేస్తున్నట్లయితే నన్ను ‘ఆగు’ అని తెలియజేయడానికి (నమాజ్‌లో నెమ్మదిగా) దగ్గేవారు. (నసాయి, ఇబ్నె మాజ)

English

Narrated Ali (RA): "I had the permission of Allah's Messenger (ﷺ) to see him in his house at two times, and whenever I entered to him while he was praying he would clear his throat as a sign to me." [Reported by an-Nasa'i and Ibn Majah].

సారాంశం

నమాజ్ మధ్యలో అనివార్యమైనపుడు నోటితో మాట్లాడకుండా కేవలం గొంతు సవరించుకున్న చందాన నెమ్మదిగా దగ్గవచ్చు. దీనివల్ల నమాజ్ భగ్నం కాదని హదీసు చెబుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 176

177

హదీసు 177

وَعَنْ اِبْنِ عُمَرَ ‏- رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏-]قَالَ] : { قُلْتُ لِبِلَالٍ : كَيْفَ رَأَيْتُ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-يَرُدَّ عَلَيْهِمْ حِينَ يُسَلِّمُونَ عَلَيْهِ , وَهُوَ يُصَلِّي ? قَالَ : يَقُولُ هَكَذَا , وَبَسَطَ كَفَّهُ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ , وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ

హజ్రత్ (అబ్దుల్లాహ్) ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “నమాజ్ చేసే సమయంలో ప్రజలు దైవప్రవక్త ﷺ కు సలాం చేస్తే ఆయన ﷺ వారికి బదులు ఎలా పలికేవారు?” అని నేను బిలాల్ (రదియల్లాహు అన్హు)ను అడిగాను. ‘ఈ విధంగా చేసేవారు’ అంటూ ఆయన తన చేతిని చాపారు. (అబూదావూద్, తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు -తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Ibn 'Umar (RA): I asked Bilal (RA), "How did you observe the Prophet (ﷺ) replying to their (the Companions) salutation while he was engaged in prayer?" He (Bilal) said: "He used to do this way," and he (Bilal) demonstrated by spreading his palm. [Reported by Abu Dawud and at-Tirmidhi. The latter graded it Sahih (authentic)].

సారాంశం

నమాజ్‌లో సంజ్ఞ (సైగ చేయటం) ద్వారా ‘సలాం’ కు బదులు పలకటం సమంజసమేనని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. చాలామంది దీనితో ఏకీభవిస్తున్నారు. అయితే కొందరు దీంతో విభేదించారు. “నమాజ్‌లో సంభాషించేందుకు అనుమతి వున్న కాలం నాటిది ఈ సంఘటన. నమాజ్ మధ్యలో సంభాషించటం నిషేధించబడిన తరువాత సలాంకు బదులు పలకటం కూడా హరాం గావించబడినట్లే” అని వీళ్ళు అంటున్నారు.

ఇక్కడ కాస్త ఆగి ఆలోచిస్తే ఒక విషయం అర్థం కాగలదు – నమాజ్‌లో సంభాషించే అనుమతి వున్న తొలికాలంలో సైగ ద్వారా జవాబు ఇవ్వవలసిన అగత్యం ఎందుకు ఏర్పడుతుంది? హాయిగా నోటితోనే సలాంకు బదులు ఇవ్వవచ్చుకదా! నోటితో గాకుండా సంజ్ఞతో జవాబు ఇచ్చారంటే, ఇది తరువాతి కాలంలో జరిగిన సంఘటనేననీ, అప్పటికే నమాజ్‌లో సంభాషించటం నిషేధించబడిందని స్పష్టమవుతున్నది. వాస్తవం ఏమిటంటే నమాజ్ స్థితిలో ఎవరయినా చేసిన సలాంకు సైగతో బదులు ఇవ్వటం ధర్మసమ్మతమే.

ఈ హదీసు ద్వారా బోధపడే ఇంకొక విషయమేమిటంటే బయటినుండి, నమాజ్ చేస్తున్న వ్యక్తికి సలాం చేయవచ్చు. కాకపోతే నమాజ్ చేసేవారు నోటితో గాకుండా సైగ చేయటం ద్వారా బదులు ఇవ్వాలి. ఈ సైగ ఎలా చేయాలి? దీనికి సంబంధించి కూడా అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి. ఈ అనేక ఉల్లేఖనాల ఆధారంగా తెలిసేదేమంటే తల ఊపటం ద్వారా, చేయిచాపటం ద్వారా, చేతి వ్రేలి ద్వారా నమాజ్ స్థితిలో సలాంకు బదులు పలకవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 177

178

హదీసు 178

وَعَنْ أَبِي قَتَادَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُصَلِّي وَهُوَ حَامِلٌ أُمَامَةَ بِنْتِ زَيْنَبَ , فَإِذَا سَجَدَ وَضَعَهَا , وَإِذَا قَامَ حَمَلَهَا } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِمُسْلِمٍ : { وَهُوَ يَؤُمُّ اَلنَّاسَ فِي اَلْمَسْجِدِ }.

హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త ﷺ నమాజ్ చేయిస్తూ (తన మనుమరాలైన) ఉమామ బిన్తె జైనబ్ (రదియల్లాహు అన్హా)ను ఒడిలో ఎత్తుకుని ఉండేవారు. సజ్దాలోకి వెళ్ళేముందు ఆమెను దించేసేవారు. సజ్దాచేసి నిలబడిన తరువాత (తిరిగి ఆమెను) ఎత్తుకునేవారు.” (బుఖారీ, ముస్లిం) ‘ఆయన ﷺ ప్రజలకు నమాజ్ చేయిస్తూ ఈ విధంగా చేసేవారు’ అని ముస్లిం ఉల్లేఖనంలో అదనంగా ఉంది.

English

Narrated Abu Qatada (RA): Allah's Messenger (ﷺ) was (one time) offering prayer while he was carrying Umama, daughter of Zainab, when he prostrated he put her down and when he stood up he lifted her up. [Agreed upon].

Muslim has: "While he (ﷺ) led the people in the prayer in the masjid…"

సారాంశం

అంటే దైవప్రవక్త ﷺ సామూహిక నమాజ్‌కు నేతృత్వం వహిస్తూ ఆ పిల్లను ఎత్తుకున్నారని హదీసు ద్వారా వెల్లడవుతోంది. ఫర్జ్ నమాజ్ అయినా, నఫిల్ నమాజులో నయినా తప్పనిసరైనపుడు పిల్లను ఎత్తుకుని నమాజ్ చేయవచ్చని దీన్నిబట్టి అర్థమవుతోంది. దీనివల్ల నమాజ్‌కు కలిగే కీడు ఏమీ లేదు.

నమాజులో తలపై నుండి తలపాగా (లేక టోపీ) క్రింద పడిపోతే దాన్ని ఎత్తుకుని తలపై పెట్టుకోవచ్చా? అని ఎవరో ఇమామ్ షౌకానీ (రహిమహుల్లాహ్) ని ప్రశ్నించగా, దైవప్రవక్త ﷺ మూడేండ్ల పిల్ల ఉమామ బిన్తె జైనబ్‌ను నమాజ్‌లో ఎత్తుకున్నప్పుడు, తల పాగాను ఎత్తుకోవటంలో అభ్యంతరం ఏముందీ? అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే క్రిందపడిన తల పాగా (లేక టోపీ)ను ఎత్తుకోవటం సమంజసమే. ఈ మాత్రం కదలిక ‘అమలె కసీర్’ క్రిందికి రాదు.

హదీసు ఉల్లేఖకులు

హదీసులో ప్రస్తావనకు వచ్చిన ఉమామ బిన్తె జైనబ్ (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ కుమార్తెయగు జైనబ్ (రదియల్లాహు అన్హా) కూతురు. ఈమె తండ్రి పేరు అబుల్ ఆస్ బిన్ రబీ. ఫాతిమా (రదియల్లాహు అన్హా) వసీయతు ప్రకారం హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) గారు ఫాతిమ (రదియల్లాహు అన్హా) మరణానంతరం ఈమెను నికాహ్ చేసుకున్నారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) అమరగతినొందిన తరువాత ముగీరా బిన్ నౌఫిల్ (రదియల్లాహు అన్హు) ఈమెను వివాహమాడారు. కడకు ఈమె ఆయన సతీమణిగానే మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 178

179

హదీసు 179

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اُقْتُلُوا اَلْأَسْوَدَيْنِ فِي اَلصَّلَاةِ : اَلْحَيَّةَ, وَالْعَقْرَبَ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “నమాజులో రెండు నల్లటి జంతువులను (పామును, తేలును) చంపేయండి.” (అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజాలు నలుగురూ ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు.)

English

Narrated Abu Hurairah (RA): "Allah's Messenger (ﷺ) said: "Kill the two black ones during Salat (prayer), the snake and the scorpion." [Reported by al-Arba'a, and Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

నమాజ్ మధ్యలో పాము, తేలు వంటి విషపూరిత జంతువులను, కీటకాలను చంపటం వల్ల నమాజు భంగం కాజాలదని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. హానికరమయిన ఈ రెండు జంతువులను కనిపించగానే చంపివేయటం అవసరమని కూడా హదీసు వల్ల విదితమవుతోంది. అత్యధికమంది పండితులు కూడా దీంతో ఏకీభవించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.3 నమాజ్‌కై షరతులు|హదీసు 179