హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 2.2 అజాన్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 2వ అధ్యాయం: అజాన్. ఈ అధ్యాయంలో 16 హదీసులు (హదీసు 144 – 159) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

باب الأذان

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

144

హదీసు 144

عَنْ عَبْدِ اَللَّهِ بْنِ زَيْدِ بْنِ عَبْدِ رَبِّهِ ‏- رضى الله عنه ‏- قَالَ: { طَافَ بِي ‏-وَأَنَا نَائِمٌ‏- رَجُلٌ فَقَالَ: تَقُولُ: "اَللَّهُ أَكْبَرَ اَللَّهِ أَكْبَرُ, فَذَكَرَ اَلْآذَانَ ‏- بِتَرْبِيع اَلتَّكْبِيرِ بِغَيْرِ تَرْجِيعٍ, وَالْإِقَامَةَ فُرَادَى, إِلَّا قَدْ قَامَتِ اَلصَّلَاةُ ‏- قَالَ: فَلَمَّا أَصْبَحْتُ أَتَيْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: "إِنَّهَا لَرُؤْيَا حَقٍّ.‏.‏.‏" } اَلْحَدِيثَ.‏ أَخْرَجَهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ خُزَيْمَةَ. وَزَادَ أَحْمَدُ فِي آخِرِهِ قِصَّةَ قَوْلِ بِلَالٍ فِي آذَانِ اَلْفَجْرِ: { اَلصَّلَاةُ خَيْرٌ مِنَ اَلنَّوْمِ }. وَلِابْنِ خُزَيْمَةَ: عَنْ أَنَسٍ قَالَ: { مِنْ اَلسُّنَّةِ إِذَا قَالَ اَلْمُؤَذِّنُ فِي اَلْفَجْرِ: حَيٌّ عَلَى اَلْفَلَاحِ, قَالَ: اَلصَّلَاةُ خَيْرٌ مِنَ اَلنَّوْمِ }.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జైద్ బిన్ అబ్దె రబ్బిహి (రదియల్లాహు అన్హు) ఇలా వివరించారు: కలలో నాకు ఒక వ్యక్తి కానవచ్చాడు. అతడు నాకు ‘అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్’ అని పలకమని చెప్పాడు. ఆ తరువాత అతను అజాన్ అంతటినీ వినిపించాడు. అల్లాహు అక్బర్ అని- తర్జీ లేకుండా – నాలుగు సార్లు చెప్పాడు. ఇఖామత్‌లో (ని పదాలు) ఒక్కొక్కసారి పలికాడు. అయితే ‘ఖద్ ఖామతిస్సలాహ్’ మాత్రం రెండుసార్లు పలికాడు. తెల్లవారిన తరువాత నేను దైవప్రవక్త ﷺ సమక్షంలో హాజరయ్యాను (కలలో జరిగినదంతా చెప్పాను). “నిస్సందేహంగా ఈ కల నిజమైనది” అని ఆయన ﷺ అన్నారు. (ఈ హదీసును అహ్మద్, అబూదావూద్ ఉల్లేఖించారు. తిర్మిజీ, ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు).

ఈ ఉల్లేఖనంలో అహ్మద్ హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) గారి ఫజ్ర్ అజాన్‌లో – అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్” – వృత్తాంతాన్ని కూడా విశదీకరించారు.

ఇబ్నె ఖుజైమాలో హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఆయన ఇలా అన్నారు: “ముఅజ్జిన్ ఫజ్ర్ నమాజ్‌కై ఇచ్చే అజాన్‌లో ‘హయ్య అలల్ఫలాహ్’ అన్న తరువాత ‘అస్సలాతు ఖైరుమ్మినన్నౌమ్’ అని పలకటం సున్నత్ (సంప్రదాయం).”

English

Narrated 'Abdullah bin Zaid bin Abd-Rabbihi (RA): A man appeared to me while I was asleep and told me to say, "Allahu Akbar, Allahu Akbar (Allah is the Most Great, Allah is the Most Great)" and he mentioned the Adhan with Allahu Akbar four times without Tarji', and the Iqama once except Qad qamat-is-Salah (the prayer stood ready to begin), (he repeated it twice). He ('Abdullah) said when it was morning I went to Allah's Messenger (ﷺ) and he said, "It is a true vision…" [Reported by Ahmad and Abu Dawud; at-Tirmidni and Ibn Khuzaimah graded it Sahih (authentic)].

Ahmad added to the end of the above Hadith, the story of BIlal's statement in the Fajr Adhan (morning prayer call): as-Salatu khairun minan-nawm – "Prayer is better than sleep".

Ibn Khuzaimah reported from Anas (RA): "It is from the Sunnah that when the Mu'adhadhin says [in the first Adhan of] Fajr (prayer time): 'Haiya 'alal-Falah (Come to the success)', he says (also) 'as-Salatu khairun minan-nawm (Prayer is better than sleep).'"

సారాంశం

హిజ్రత్ చేసిన మొదటి సంవత్సరం మదీనాలో దైవప్రవక్త ﷺ సహచరులను సమావేశపరచి సామూహిక నమాజ్‌కై ప్రజలను పిలిచే పద్ధతి గురించి సంప్రతించారు. ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇచ్చారు. శంఖం ఊదాలని ఒకరు, ఎత్తయిన స్థలంలో మంట పెట్టాలని మరొకరు, బిగులు వినిపించాలని ఇంకొకరు – తలా ఒక విధంగా సూచించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాత్రం అజాన్ పిలుపు ఇవ్వాలని సూచించారు. దైవప్రవక్త ﷺకు ఈ సలహా నచ్చింది. బిగ్గరగా అజాన్ పలకమని ఆయన ﷺ హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)ను ఆదేశించారు. ఈ సందర్భంగానే ఈ హదీసు ఉల్లేఖకులైన అబ్దుల్లాహ్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కూడా కలగన్నారు. కలలో ఒక వ్యక్తి శంఖం పట్టుకుని ఉన్నాడు. ‘దేవుని దాసుడా! ఈ శంఖం అమ్ముతావా?’ అని అబ్దుల్లా బిన్ జైద్ అతన్ని అడిగారు. ‘దీంతో నీకేంపని?’ అని ఆ వ్యక్తి ఎదురు ప్రశ్న వేశాడు. ‘మేము దీని సహాయంతో జనులను సామూహిక నమాజ్ కోసం పిలుస్తాము’ అని ఆయన జవాబిచ్చారు. ‘నేను నీకు ఇంతకన్నా మంచి పద్ధతి తెలుపనా?’ అన్నాడు. ‘తప్పకుండా తెలుపు’ అని అబ్దుల్లా బిన్ జైద్ చెప్పారు. అప్పుడా వ్యక్తి ప్రస్తుత అజాన్ మరియు ఇఖామత్ పలుకులను నేర్పాడు.

హదీసు ఉల్లేఖకులు

(1) అబ్దుల్లాహ్ బిన్ జైద్ బిన్ అబ్దె రబ్బిహి (రదియల్లాహు అన్హు). ఈయన మరోపేరు అబూ ముహమ్మద్. అన్సార్‌కు చెందిన ఖజ్రజ్‌తో సంబంధమున్నందున అన్సారీ, ఖజ్రజీగా వ్యవహరించబడేవారు. బద్ర్ యుద్ధం తప్ప ఇతర యుద్ధాలలో పాల్గొన్నారు. హిజ్రత్ మొదటి సంవత్సరంలో ఈయన కలలో ప్రస్తుత అజాన్‌ను ఆస్వాదించారు. ఈ సంఘటన మస్జిదె నబవీ నిర్మాణం తర్వాత జరిగింది. ఈయన హిజ్రీ 32లో 64 యేండ్ల వయస్సులో మరణించారు.

(2) బిలాల్ (రదియల్లాహు అన్హు). ‘తైమ్’ తెగకు చెందినవారు. పూర్తిపేరు బిలాల్ బిన్ రిబాహ్. స్వేచ్ఛ నొసగబడిన బానిస. తొలికాలంలోనే ఇస్లాం స్వీకరించారు. దైవమార్గంలో వర్ణనాతీతమయిన బాధలకు, వేధింపులకు గురయ్యారు. కాని సత్యమార్గంనుండి ఏమాత్రం తొణకలేదు. దైవప్రవక్త ﷺ గారి ముఅజ్జిన్. దైవప్రవక్త ﷺ మరణానంతరం ఈయన అజాన్ ఇవ్వటం మానేశారు. మదీనా నగరాన్ని విడిచిపెట్టి డెమాస్కస్‌లో స్థిరపడ్డారు. హిజ్రీ 17 లేక 18వ సంవత్సరంలో 60 పైచిలుకు వయస్సులో మరణించారు. ఈయనకు సంతానం లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 144

145

హదీసు 145

عَنْ أَبِي مَحْذُورَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-عَلَّمَهُ اَلْآذَانَ, فَذَكَرَ فِيهِ اَلتَّرْجِيعَ } أَخْرَجَهُ مُسْلِمٌ.‏ وَلَكِنْ ذَكَرَ اَلتَّكْبِيرَ فِي أَوَّلِهِ مَرَّتَيْنِ فَقَطْ. وَرَوَاهُ اَلْخَمْسَةُ فَذَكَرُوهُ مُرَبَّعًا.

హజ్రత్ అబూ మహ్జూర (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తనకు అజాన్ నేర్పారు. అందులో ఆయన ‘తర్జీ’ గురించి ప్రస్తావించారు. (ముస్లిం దీనిని ఉల్లేఖించారు. అయితే ఇందులో మొదటి సారి ‘అల్లాహు అక్బర్’ను రెండుసార్లు పలికినట్లు ఉంది. అబూ మహ్జూర (రదియల్లాహు అన్హు) చేత ఉల్లేఖించబడిన హదీసును ఐదుగురూ పొందుపరచారు. ‘అల్లాహు అక్బర్’ను ప్రథమంలో నాలుగుసార్లు పలికినట్లు వీరు పేర్కొన్నారు).

English

Narrated Abu Mahdhura (RA): The Prophet (ﷺ) taught him the Adhan (call to prayer) and he (the narrator) mentioned the Tarji' in it. [Muslim reported it, but mentioned the phrase (Takbir) "Allah is the Most Great" at its beginning just twice.

al-Khamsah reported it, but mentioned the Takbir four times.

సారాంశం

“అల్లాహు అక్బర్” అనే పదాన్ని మొదట్లో రెండుసార్లు కాదు, నాలుగుసార్లు పలకటమే సరైనదని పై హదీసు ద్వారా స్పష్టమవుతోంది. అజాన్ కోసం పెద్ద కంఠం, మంచి కంఠం గలవారిని ఎన్నుకోవాలి. ఈ ఎంపిక నిమిత్తం ‘అజాన్ పోటీలు’ నిర్వహించినట్లుగా కూడా చరిత్రలో ఆధారాలున్నాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 145

146

హదీసు 146

وَعَنْ أَنَسِ]بْنِ مَالِكٍ] ‏- رضى الله عنه ‏- قَالَ: { أُمِرَ بِلَالٌ أَنْ يَشْفَعَ اَلْآذَانَ, وَيُوتِرَ اَلْإِقَامَةَ, إِلَّا اَلْإِقَامَةَ, يَعْنِي إِلَّا قَوْلَهُ: قَدْ قَامَتِ اَلصَّلَاةُ } مُتَّفَقٌ عَلَيْهِ, وَلَمْ يَذْكُرْ مُسْلِمٌ اَلِاسْتِثْنَاءَ. وَلِلنَّسَائِيِّ: { أَمَرَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِلَالاً }.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: అజాన్ వచనాలు రెండేసిసార్లు, తక్బీర్ (ఖద్ ఖామతిస్సలాహ్) తప్ప మిగిలిన వచనాలన్నీ ఒక్కోసారి పలకాలని హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)కు ఆదేశించబడింది. (బుఖారీ, ముస్లిం)

అయితే ముస్లింలో ‘ఖద్‌ఖామతిస్సలాహ్’ వినాయింపు గురించిన ప్రస్తావన లేదు. ‘దైవప్రవక్త ﷺ బిలాల్‌కు ఆజ్ఞాపించార’ని నసాయిలో ఉంది.

English

Narrated Anas (RA): Bilal was commanded to announce the Adhan (each phrase) twice and the Iqamah (each phrase) once except "The prayer stood ready to begin" (to be pronounced twice). [Agreed upon; but Muslim did not mentioned the exception].

A narration of an-Nasa'i has: "Bilal was ordered by the Prophet (ﷺ)."

సారాంశం

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) హదీసులో ఆదేశమిచ్చిన వారు ఎవరో కాదు, దైవప్రవక్తే ﷺ. అజాన్‌లో ఒక్కో వచనం రెండేసిసార్లు పలకాలి. ఇఖామత్‌లో ఒక్కో వచనం ఒక్కోసారి మాత్రమే పలకాలి. ఒక్క ‘ఖద్‌ఖామతిస్సలాత్’ వచనం మాత్రం రెండుసార్లు పలకాలనీ భావం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 146

147

హదీసు 147

وَعَنْ أَبِي جُحَيْفَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { رَأَيْتُ بِلَالاً يُؤَذِّنُ وَأَتَتَبَّعُ فَاهُ, هَاهُنَا وَهَاهُنَا, وَإِصْبَعَاهُ فِي أُذُنَيْهِ } رَوَاهُ أَحْمَدُ, وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ. وَلِابْنِ مَاجَهْ: وَجَعَلَ إِصْبَعَيْهِ فِي أُذُنَيْهِ. وَلِأَبِي دَاوُدَ: { لَوَى عُنُقَهُ, لَمَّا بَلَغَ "حَيَّ عَلَى اَلصَّلَاةِ " يَمِينًا وَشِمَالاً وَلَمْ يَسْتَدِرْ }. وَأَصْلِهِ فِي اَلصَّحِيحَيْنِ.

హజ్రత్ అబూ జుహైఫా (రదియల్లాహు అన్హు) కథనం: అజాన్ ఇస్తుండగా నేను బిలాల్ (రదియల్లాహు అన్హు)ను చూచాను. ఆయన తన ముఖాన్ని అటూ ఇటూ తిప్పేవారు. అప్పుడు ఆయన చూపుడు వ్రేళ్ళు ఆయన రెండు చెవులలో ఉండేవి. (అహ్మద్, తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు).

ఇబ్నె మాజా ఉల్లేఖనంలో ఉంది – “ఆయన తన వ్రేళ్ళను తన చెవులలో పెట్టుకున్నారు.” అబూదావూద్‌లో ఇలా వుంది: “హయ్య అలస్సలాహ్ అని అనేటప్పుడు తన కుడి ఎడమల వైపునకు కొద్దిగా ముఖం తిప్పేవారంతే. పూర్తిగా తిరిగేవారు కాదు.” దీని మూలం ‘సహీహైన్’లో ఉంది.

English

Narrated Abu Juhaifa (RA): I saw Bilal calling for prayer and I would follow (looking at) his mouth (as he turned it) this (right) side and that (left) side with his fingers in his ears. [Reported by Ahmad and at-Tirmidhi who graded it Sahih (authentic)].

In a narration of Ibn Majah – 'and he put his fingers in his ears'.

And also a narration of Abu Dawud – 'he turned his neck to the right and left when he reached Haiya 'alas-Salah (Come to the prayer) and did not turn his body'.

And its basic meaning is in Sahihain (al-Bukhari and Muslim).

సారాంశం

ఖిబ్లా వైపునకు తిరిగి అజాన్ ఇవ్వటం సంప్రదాయం. అలాగే ‘హయ్య అలస్సలాహ్’ అనేటప్పుడు కుడివైపునకు, ‘హయ్య అలల్‌ఫలాహ్’ అనేటప్పుడు ఎడమవైపునకు కేవలం ముఖం త్రిప్పటం కూడా సంప్రదాయమే. అజాన్ పిలుపు ఇచ్చే సమయంలో వ్రేళ్ళను చెవులలో పెట్టుకోవటం వల్ల రెండు లాభాలున్నాయి. దీనివల్ల శబ్దం బిగ్గరగా వినవస్తుంది. అజాన్ వినలేని చెవిటివాడు ముఅజ్జిన్ యొక్క ఈ దృశ్యం చూచి అజాన్ ఇవ్వబడుతుందని గ్రహించగలుగుతాడు.

హదీసు ఉల్లేఖకులు

అబూ జుహైఫా (రదియల్లాహు అన్హు) మారుపేరు. అసలు పేరు వహబ్ బిన్ అబ్దుల్లాహ్ సువాయి. సువాయి అమీర్‌గా ప్రసిద్ధిచెందారు. యువ సహచరులలో ఒకరుగా పరిగణించబడ్డారు. కూఫాలో స్థిరపడ్డారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తన పరిపాలనా కాలంలో ఈయన్ని కోశాధికారిగా నియమించారు. యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. హిజ్రీ 74లో కూఫాలోనే మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 147

148

హదీసు 148

وَعَنْ أَبِي مَحْذُورَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَعْجَبَهُ صَوْتُهُ, فَعَلَّمَهُ اَلْآذَانَ } رَوَاهُ اِبْنُ خُزَيْمَةَ.

హజ్రత్ అబూ మహ్జూర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ కు ఈయన కంఠస్వరం ఎంతగానో నచ్చింది. అందువల్ల ఆయన ﷺ ఈయన (అబూ మహ్జూర) కు అజాన్ తర్ఫీదు ఇచ్చారు. (ఇబ్నె ఖుజైమ)

English

Narrated Abu Mandhura (RA): The Prophet (ﷺ) liked his voice, so he taught him the Adhan (call to prayer). [Reported by Ibn Khuzaimah].

సారాంశం

ముఅజ్జిన్‌లను ఎంపిక చేసేటప్పుడు, నియమించేటప్పుడు వారి కంఠస్వరాన్ని తప్పకుండా పరిగణన లోకి తీసుకోవాలన్న దానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. మధురమైన స్వరం హృదయాలను ఆకట్టుకుంటుంది. సత్యం గురించి ఆలోచింపజేస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 148

149

హదీసు 149

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { صَلَّيْتُ مَعَ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-اَلْعِيدَيْنِ, مِنْ غَيْرِ مَرَّةٍ وَلَا مَرَّتَيْنِ, بِغَيْرِ أَذَانٍ وَلَا إِقَامَةٍ } رَوَاهُ مُسْلِمٌ. وَنَحْوُهُ فِي اَلْمُتَّفَقِ: عَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, وَغَيْرُهُ.

హజ్రత్ జాబిర్ బిన్ సముర (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: నేను ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, అనేకసార్లు దైవప్రవక్త ﷺతో కలసి పండుగ నమాజు చేశాను. ఇందు నిమిత్తం అజాన్‌గానీ, ఇఖామత్‌గానీ ఇవ్వబడేది కాదు. (దీనిని ముస్లిం ఉల్లేఖించారు. బుఖారీ, ముస్లింలలో హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) చేత కూడా ఇలాగే పేర్కొనబడింది)

English

Narrated Jabir bin Samurah (RA): I prayed with the Prophet (ﷺ) the two 'Eids, not only once or twice, without an Adhan or an Iqamah. [Reported by Muslim].

A similar narration is in al-Bukhari and Muslim narrated by 'Abdullah bin 'Abbas (RA) and others.

సారాంశం

దైవప్రవక్త ﷺ కాలంలో పండుగ నమాజు సామూహికంగా చేయబడేదన్న దానికి ఈ హదీసు నిదర్శనం. అయినప్పటికీ అంత పెద్ద సమూహాన్ని సమావేశపర్చడానికి అజాన్‌గానీ, ఇఖామత్‌గానీ ఇవ్వబడేది కాదు. ముస్లిం అనుచర సమాజం ఆచరణ దీనికనుగుణంగానే ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 149

150

హదీసు 150

وَعَنْ أَبِي قَتَادَةٌ فِي اَلْحَدِيثِ اَلطَّوِيلِ, { فِي نَوْمهُمْ عَنْ اَلصَّلَاةِ ‏- ثُمَّ أَذَّنَ بِلَالٌ, فَصَلَّى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-كَمَا كَانَ يَصْنَعُ كُلَّ يَوْمٍ } رَوَاهُ مُسْلِمٌ. وَلَهُ عَنْ جَابِرٍ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَتَى اَلْمُزْدَلِفَةَ فَصَلَّى بِهَا اَلْمَغْرِبَ وَالْعِشَاءَ, بِأَذَانٍ وَاحِدٍ وَإِقَامَتَيْنِ }. وَلَهُ عَنْ اِبْنِ عُمَرَ: { جَمَعَ بَيْنَ اَلْمَغْرِبِ وَالْعِشَاءِ بِإِقَامَةٍ وَاحِدَةٍ }. زَادَ أَبُو دَاوُدَ: { لِكُلِّ صَلَاةٍ }. وَفِي رِوَايَةِ لَهُ: { وَلَمْ يُنَادِ فِي وَاحِدَةٍ مِنْهُمَا }.

హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) కథనం: (ఇదొక సుదీర్ఘమయిన హదీసు. ఇందులో ప్రయాణావస్థలో ప్రయాణ బడలిక మూలంగా గాఢ నిద్ర వచ్చి సకాలంలో మెలకువ రాలేదని చెప్పబడింది). నిద్రనుండి మెలకువ వచ్చిన తరువాత బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ ఇచ్చారు. దైవప్రవక్త ﷺ ప్రతి రోజూ నమాజ్ చేయించినట్లుగానే నమాజ్ చేయించారు. (ముస్లిం) ముస్లింలో జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ఇలా వుంది: దైవప్రవక్త ﷺ ‘ముజ్దలిఫా’ చేరుకున్నాక, అక్కడాయన మగ్రిబ్ మరియు ఇషా నమాజులను ఒక అజాన్, రెండు ఇఖామత్‌లతో చేయించారు.

ముస్లింలోనే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ఈ విధంగా ఉంది: దైవప్రవక్త ﷺ మగ్రిబ్ మరియు ఇషా నమాజులను కలిపి ఒకే ఇఖామత్‌తో చేశారు.

అబూదావూద్ అదనంగా ఈ వాక్యం చేర్చారు: ప్రతి నమాజు కోసం తక్బీర్ పలుకబడింది. ఈ రెండు నమాజులలో ఏ ఒక్కదానికై కూడా అజాన్ పిలుపు ఇవ్వబడలేదని అందులోనే మరో ఉల్లేఖనంలో అనబడింది.

English

Narrated Abu Qatadah (RA) in a long Hadith about their (Sahaba) sleeping late past the time of Salat (prayer): Then Bilal proclaimed the Adhan and the Prophet (ﷺ) offered the prayer (while leading the Companions) as he used to do every day. [Reported by Muslim].

Muslim also reported from Jabir (RA): The Prophet (ﷺ) came to al-Muzdalifah and offered at it both the Maghrib and 'Isha prayers with one Adhan and two Iqamah.

Muslim also reported from Ibn 'Umar (RA): The Prophet (ﷺ) combined the Maghrib and 'Isha prayers with one Iqamah.

Abu Dawud added the words: "for each prayer".

And in another narration he reported: The Adhan was not announced for any one of them.

సారాంశం

(అ) మెలకువ రాని సంఘటన ఫజ్ర్ నమాజ్‌కు సంబంధించినది. దైవప్రవక్త ﷺ ఖైబర్ నుండి తిరిగి వస్తున్న సందర్భంగా రాత్రి బాగా పొద్దుపోయాక ఒకచోట మకాం వేశారు. మేల్కొనే ఉండమనీ, ఫజ్ర్ నమాజ్ వేళ కాగానే అందరినీ మేల్కొల్పమని దైవప్రవక్త ﷺ హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)ను ఆదేశించి నిద్రపోయారు. బడలిక వల్ల హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)కు సయితం నిద్ర ముంచుకువచ్చింది. సూర్యోదయమయ్యే వరకూ మెలకువ రాలేదు. ఈ పరిస్థితిని గమనించిన దైవప్రవక్త ﷺ తక్షణం ఆ లోయను వదలిపెట్టవలసినదిగా ఆజ్ఞాపించారు. సహచరులంతా అప్పటికప్పుడు అక్కడినుంచి బయలుదేరి మరో లోయలో మకాం వేశారు. దైవప్రవక్త ﷺ ఆదేశంపై హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ ఇచ్చారు. ఆయన ﷺ నమాజ్ చేయించారు.

(ఆ) ‘ముజ్దలిఫా’ – ఇది మక్కాలోని ప్రదేశం పేరు. మినా – అరఫాత్‌ల మధ్య ఉంది. హజ్ ఆచారాలను నిర్వర్తించేటప్పుడు హాజీలు అరఫాత్‌లో ఆగిన పిదప – జిల్ హజ్జ్ 10వ తేదీ రాత్రి ఇక్కడకు వస్తారు.

(ఇ) ఈ హదీసు ద్వారా తెలియవచ్చే ఒక ముఖ్యాంశం ఏమిటంటే; నిద్ర కారణంగా నమాజ్ వేళ దాటి పోయినప్పటికీ సామూహికంగా నమాజ్ చేయదలచుకుంటే అప్పుడు అజాన్ ఇవ్వవలసి ఉంటుంది.

(ఈ) ఇబ్నె ఉమర్ గారి హదీసు, జాబిర్‌గారి మొదటి హదీసుకు విరుద్ధంగా అగుపిస్తుంది. ఎందుకంటే ఈ హదీసు – ముజ్దలిఫాలో మగ్రిబ్ ఇషా నమాజులను కలిపి చేసినపక్షంలో – అజాన్ ఇవ్వనక్కరలేదని అంటోంది. కాగా; ఒక్క అజాన్, రెండు ఇఖామత్‌లు చెప్పబడినట్లు జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం రూఢీ చేస్తోంది. జాబిర్ (రదియల్లాహు అన్హు)గారి మొదటి హదీసు సకారాత్మకమైనది. ఇక్కడ సకారాత్మకమైనదానికి నకారాత్మకమైనదానిపై ప్రాధాన్యతనివ్వాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 150

151

హదీసు 151

وَعَنْ اِبْنِ عُمَرَ, وَعَائِشَةَ قَالَا: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ بِلَالاً يُؤَذِّنُ بِلَيْلٍ, فَكُلُوا وَاشْرَبُوا حَتَّى يُنَادِيَ اِبْنُ أُمِّ مَكْتُومٍ", وَكَانَ رَجُلاً أَعْمَى لَا يُنَادِي, حَتَّى يُقَالَ لَهُ: أَصْبَحْتَ, أَصْبَحْتَ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي آخِرِهِ إِدْرَاجٌ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) మరియు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇరువురి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “బిలాల్ (రదియల్లాహు అన్హు) రాత్రి ఉండగానే అజాన్ పిలుపు ఇస్తారు. మీరు ఇబ్నె ఉమ్మె మక్తూమ్ (రదియల్లాహు అన్హు) అజాన్ అయ్యేవరకూ తినవచ్చు, త్రాగవచ్చు.” ఇబ్నె ఉమ్మె మక్తూమ్ అంధులు. ‘తెల్లవారింది, తెల్లవారింది’ అని జనులు చెప్పేవరకూ ఆయన అజాన్ ఇచ్చేవారు కాదు. (బుఖారీ, ముస్లిం).

English

Narrated Ibn 'Umar and 'Aishah (RA): Allah's Messenger (ﷺ) said: "Bilal calls for prayer when it is still night, so eat and drink till Ibn Umm Maktum calls for prayer." And he (Ibn Umm Maktum) was a blind man who did not call for a prayer until he was told: "It is morning time, it is morning time." [Agreed upon]. There is an Idraj in its last part.

సారాంశం

తెల్లవారుజాము కాకపూర్వం కూడా అజాన్ ఇవ్వటం సబబేనని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఈ (మొదటి) అజాన్ ద్వారా ఉపవాసాలు పాటించేవారికీ, తహజ్జుద్ నమాజ్ చేయదలచుకున్న వారికి ఎంతో మేలు కలుగుతుంది. ఉపవాసం ఉండేవారు తొందరగా మేల్కొని ‘సహరీ’ సన్నాహాలు చేసుకుంటారు. అజాన్ నిమిత్తం ఒక మస్జిద్‌లో ఇద్దరు ముఅజ్జిన్‌లను నియమించవచ్చునని కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తోంది.

హదీసు ఉల్లేఖకులు

హదీసులో ప్రస్తావనకు వచ్చిన ఇబ్నె ఉమ్మె మక్తూమ్ (రదియల్లాహు అన్హు) అసలు పేరు అమ్ర్ లేక అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ ఖురషీ ఆమిరీ. దివ్య ఖుర్‌ఆన్‌లోని ‘అబస’ సూరా అవతరణ సందర్భంగా ఈయన పేరు చర్చకు వస్తుంది. తొలికాలంలోనే ఇస్లాం స్వీకరించారు. హిజ్రత్ కూడా చేశారు. దైవప్రవక్త ﷺ తాను నగరంలో లేనపుడు ఈయన్ని 13సార్లు తన స్థానంలో (నమాజ్ చేయించే నిమిత్తం) తాత్కాలిక సారథిగా నియమించారు. ఖాద్సియా యుద్ధంలో అమరగతినొందారు. ఆ రోజు ధ్వజం ఆయన చేతిలో ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 151

152

హదీసు 152

وَعَنْ اِبْنِ عُمَرَ; { إِنَّ بِلَالاً أَذَّنَ قَبْلَ اَلْفَجْرِ, فَأَمَرَهُ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ يَرْجِعَ, فَيُنَادِيَ: "أَلَا إِنَّ اَلْعَبْدَ نَامَ } رَوَاهُ أَبُو دَاوُدَ وَضَعَّفَهُ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: (ఒక రోజు) బిలాల్ – రజి – తెల్లవారుజాము కాక మునుపే అజాన్ ఇచ్చేశారు. మళ్ళీ అజాన్ ఇవ్వవలసిందిగా దైవప్రవక్త ﷺ ఆజ్ఞాపించగా (బిలాల్ – రజి – ఈ విధంగా ప్రకటన గావించారు – “బాగా వినండి! ఈ దాసుడికి నిద్రవచ్చేసింది.” (అందుకే ఈ పొరపాటు జరిగిపోయింది). (అబూ దావూద్ దీనిని ఉల్లేఖించారు. బలహీన హదీసుగా ఖరారు చేశారు)

English

Narrated Ibn 'Umar (RA): Bilal called for prayer before dawn and the Prophet (ﷺ) told him to return and announce: "Lo! the slave of Allah (i.e. Bilal) had slept (hence this mistake)". [Reported by Abu Dawud, and graded as Da'if (weak)].

సారాంశం

హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) ఒక్కరే అజాన్ ఇస్తున్నప్పటి సంఘటన ఇది. ఫజ్ర్ వేళ అయిపోయిందనుకుని ఆయన అజాన్ పిలుపు ఇచ్చారు. కాని నిజానికి అప్పటికింకా వేళ కాకపోవటంతో మలిసారి పిలుపు ఇవ్వవలసిందిగా దైవప్రవక్త ﷺ ఫురమాయించారు. హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్ రెండవ ముఅజ్జిన్‌గా నియమితులైన తరువాత రెండు అజాన్‌లు ఇవ్వబడసాగాయి. మొదటి అజాన్ హజ్రత్ బిలాల్ ఇవ్వగా, రెండవ అజాన్‌ను ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ఇచ్చేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 152

153

హదీసు 153

وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا سَمِعْتُمْ اَلنِّدَاءَ, فَقُولُوا مِثْلَ مَا يَقُولُ اَلْمُؤَذِّنُ } مُتَّفَقٌ عَلَيْهِ. وَلِلْبُخَارِيِّ: عَنْ مُعَاوِيَةَ رَضِيَ اللَّهُ عَنْهُ مِثْلُهُ. وَلِمُسْلِمٍ: { عَنْ عُمَرَ فِي فَضْلِ اَلْقَوْلِ كَمَا يَقُولُ اَلْمُؤَذِّنُ كَلِمَةً كَلِمَةً, سِوَى اَلْحَيْعَلَتَيْنِ, فَيَقُولُ: "لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاَللَّهِ" }.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీరు అజాన్ విన్నప్పుడు ముఅజ్జిన్ పలికినట్లుగానే మీరు కూడా పలకండి.” (బుఖారీ, ముస్లిం)

బుఖారీలో ముఆవియ (రదియల్లాహు అన్హు) చే కూడా ఇలాగే ఉల్లేఖించబడింది. ముస్లిం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఉల్లేఖించిన దానిలో – ముఅజ్జిన్ పలుకులకు సమాధానంగా అదేవిధంగా ఒక్కొక్క వచనం పలకటంలోని మహాత్మ్యం గురించి చెప్పబడింది. అయితే ‘హయ్య అలస్సలాహ్’ ‘హయ్య అలల్ ఫలాహ్’ అనే పదాలకు బదులుగా ‘లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి’ అని పలకాలి.

English

Narrated Abu Sa'id al-Khudri (RA): Allah's Messenger (ﷺ) said: "When you hear the Adhan repeat what the Mu'adhdhin (the call-maker) says." [Agreed upon].

And al-Bukhari has reported similarly in a narration by Mu'awiyah (RA).

And Muslim reported a narration by 'Umar (RA) regarding the virtue of repeating what the Mu'adhdhin pronounces word by word except when the Mu'adhdhin says: "Haiya 'alas-Salah, Haiya 'alal-Falah (Come to the prayer and come to the success)", one should say: "La hawla wa la quwwata illa billah [there is no might and no power except with (the help of) Allah]."

సారాంశం

ఈ హదీసు ద్వారా మనకు స్పష్టంగా బోధపడేదేమిటంటే – ముఅజ్జిన్ అజాన్‌లో ఏ ఏ వచనాలు పలుకుతాడో వాటిని వినేవారు కూడా – బదులు – పలకాలి. మనిషి ఎట్టి పరిస్థితిలోనూ – అతడు పరిశుద్ధ స్థితిలో వున్నా, అశుద్ధావస్థకులోనై వున్నా సరే – అజాన్‌కు సమాధానం ఇవ్వవలసిందే. అయితే మల మూత్ర విసర్జనలో నిమగ్నమై ఉంటే మాత్రం బదులు పలకటం సమ్మతం కాదు.

హదీసులో చెప్పబడినట్లు ముఅజ్జిన్ ఏ ఏ వచనం పలికితే మనం కూడా ఆ వచనాన్ని పలుకుతూపోవాలి. అయితే ‘హయ్య అలస్సలాహ్’ ‘హయ్య అలల్ ఫలాహ్’ పదాలకు మాత్రం ‘లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి’ అని స్పందించాలి. “ముఅజ్జిన్ పలికినట్లుగానే మీరూ పలకండి” అని అబూ సయీద్ ఖుదరీ హదీసులో చెప్పబడింది. ఇది సాధారణ ఆజ్ఞ. ఆ తరువాత ప్రత్యేక ఆజ్ఞ వచ్చింది. ప్రత్యేకమయిన దానిని సాధారణమైనదానిపై ప్రాధాన్యత నివ్వటం ఇక్కడ నిర్ధారిత సూత్రం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 153

154

హదీసు 154

وَعَنْ عُثْمَانَ بْنِ أَبِي الْعَاصِ ‏- رضى الله عنه ‏- { أَنَّهُ قَالَ : يَا رَسُولَ اَللَّهِ اِجْعَلْنِي إِمَامَ قَوْمِي. فَقَالَ : "أَنْتَ إِمَامُهُمْ , وَاقْتَدِ بِأَضْعَفِهِمْ , وَاِتَّخِذْ مُؤَذِّنًا لَا يَأْخُذُ عَلَى أَذَانِهِ أَجْرًا } أَخْرَجَهُ اَلْخَمْسَةُ , وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ , وَصَحَّحَهُ اَلْحَاكِمُ.

హజ్రత్ ఉస్మాన్ బిన్ అబుల్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం: ఈయన ఇలా విన్నవించుకున్నారు – “ఓ దైవప్రవక్తా ﷺ! నన్ను నా జాతి వారికి ఇమామ్‌గా నియమించండి.” “నీవు వారికి ఇమామ్ అయ్యావు” (నీవు కోరినట్లుగానే నిన్ను నీ జాతివారికి ఇమామ్‌గా నియమించటం జరిగింది). అయితే వారిలో బలహీనులను, వృద్ధులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకో. అజాన్ పిలుపు ఇచ్చి వేతనం పుచ్చుకోని ముఅజ్జిన్‌ను నియమించు” అని సెలవిచ్చారు దైవప్రవక్త ﷺ. (అహ్మద్, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా ఖరారు చేశారు. హాకిమ్ మాత్రం ప్రామాణికం (సహీహ్) అని అన్నారు).

English

Narrated 'Uthman bin Abul-'Aas (RA): He said, "O Messenger of Allah, appointment as the Imam (leader) of my people (in prayers). He (ﷺ) said: "You are their Imam, but you should follow (observe the strength of) the weakest among them and appoint a Mu'adhdhin who does not charge for the call of Adhan." [Reported by al-Khamsah, at-Tirmidhi graded it Hasan (good) and al-Hakim graded it Sahih (authentic)].

సారాంశం

ముఅజ్జిన్ తాను నిర్వర్తించే బాధ్యతకు జీతం పుచ్చుకోవటం ధర్మసమ్మతమేనా? కాదా? ఈ విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. జీతం పుచ్చుకోవటం హరామ్ అని మాత్రం హదీసులో లేదు. అయితే జీతం తీసుకోకుండా – స్వచ్ఛందంగా – ఈ బాధ్యతను నిర్వర్తించటం మంచిదనీ, అభిలషణీయమని బోధపడుతున్నది.

ఎట్టి పరిస్థితిలోనూ ఇమామ్ అయినవారు నమాజీల సాధకబాధకాలను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా మసలుకోవాలనీ, సుదీర్ఘమయిన నమాజ్ చేయించి ప్రజలను సామూహిక నమాజ్ పట్ల విముఖత కలిగించరాదని ఈ హదీసు తాకీదు చేస్తోంది. ముఅజ్జిన్ జీతం పుచ్చుకోకుండా డ్యూటీ చేయటం మంచిదని కూడా ఈ హదీసు సూచిస్తోంది. అత్యధికమంది ధర్మవేత్తలు జీతం పుచ్చుకోవటాన్ని అవాంఛనీయం (మక్రూహ్)గా భావించారే తప్ప అధర్మం (హరామ్) గా మాత్రం తలపోయలేదు. గత్యంతరం లేని స్థితిలో తీసుకుంటే ధర్మసమ్మతమేనని కూడా నిర్ణయించారు. మంచిని పెంపొందించే, సదాచరణలో ముందంజవేసే సంకల్పంతో ఇమామత్‌ను కోరుకోవటం (నమాజ్‌కు సారథ్యం వహించాలనుకోవటం)లో తప్పులేదని కూడా ఈ హదీసు ద్వారా సంకేతం లభిస్తున్నది. సారథ్య బాధ్యతలను సాధ్యమయినంత వరకు సజావుగా నెరవేర్చే శక్తి సామర్థ్యాలుంటే దాన్ని కోరుకోవటం ధర్మసమ్మతమే.

హదీసు ఉల్లేఖకులు

ఉస్మాన్ బిన్ అబుల్ ఆస్ (రదియల్లాహు అన్హు) గారి మరో పేరు అబూ అబ్దుల్లాహ్. తాయిఫ్ నుండి దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చిన ప్రతినిధి బృందంలో అందరికన్నా పిన్న వయస్కులు ఈయన.

దైవప్రవక్త ﷺ ఈయన్ని ఆ బృందానికి నాయకునిగా నియమించారు. ఈయన తన జాతి ప్రజలను ధర్మభ్రష్టులు కాకుండా ఆపారు. తత్ఫలితంగా వారు రుజుమార్గంపై నిలకడగా ఉండగలిగారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తాను ఖలీఫాగా వున్న కాలంలో ఈయన్ని బహ్రైన్, అమ్మాన్‌లకు గవర్నర్‌గా నియమించారు. బస్రాలో హిజ్రీ 51లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 154

155

హదీసు 155

وَعَنْ مَالِكِ بْنِ الْحُوَيْرِثِ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ لَنَا اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا حَضَرَتِ اَلصَّلَاةُ فَلْيُؤَذِّنْ لَكُمْ أَحَدُكُمْ… } اَلْحَدِيثَ أَخْرَجَهُ اَلسَّبْعَةُ.

హజ్రత్ మాలిక్ బిన్ హువైరిస్(రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మాకు ఇలా ఉపదేశించారు- “నమాజ్ వేళ సమీపిస్తే మీలో ఎవరయినా ఒకరు మీ అందరినీ పిలిచే ఉద్దేశ్యంతో అజాన్ పలకాలి.” తరువాత పూర్తి హదీసు వివరించారు. (దీనిని ఏడుగురూ – అంటే అహ్మద్, బుఖారీ, ముస్లిం, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ – ఉల్లేఖించారు)

English

Narrated Malik bin al-Huwairith (RA): The Prophet (ﷺ) said to us, "When the time of Salat (prayer) comes, one of you should announce the Adhan." [Reported by as-Sab'ah].

హదీసు ఉల్లేఖకులు

మాలిక్ బిన్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) గారి మరో పేరు అబూ సల్మాన్. ధార్మిక శిక్షణ గరిపే నిమిత్తం దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చారు. 20 రోజుల వరకూ ఆయన ﷺ దగ్గరవున్నారు. తిరిగి వెడుతున్న సమయంలో దైవప్రవక్త ﷺ ఈ బృందానికి హితబోధ చేస్తూ, “దారిలో నమాజ్ వేళ ఆసన్నమయినపుడు మీలో ఒకరు అజాన్ ఇవ్వాలి. మీలో వయసులో పెద్దవారు నమాజ్‌కు నేతృత్వం వహించాలి” అని అన్నారు. ప్రయాణీకులు కూడా అజాన్ పలకాలనీ, సామూహికంగా నమాజ్ చేయాలని ఈ ఉపదేశం ద్వారా బోధపడుతున్నది. వ్యక్తిగత స్థాయికన్నా సామూహికతకు ఎక్కువ ఆధిక్యత, శ్రేష్ఠత ఉంది. మాలిక్ బిన్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) హిజ్రీ 74లో బస్రాలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 155

156

హదీసు 156

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ لِبِلَالٍ : { إِذَا أَذَّنْتَ فَتَرَسَّلْ , وَإِذَا أَقَمْتُ فَاحْدُرْ , وَاجْعَلْ بَيْنَ أَذَانِكَ وَإِقَامَتِكَ قَدْرَ مَا يَفْرُغُ اَلْآكِلُ مِنْ أَكْلِهِ } اَلْحَدِيثَ. رَوَاهُ اَلتِّرْمِذِيُّ وَضَعَّفَهُ.. وَلَهُ : عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { لَا يُؤَذِّنُ إِلَّا مُتَوَضِّئٌ } وَضَعَّفَهُ أَيْضًا. وَلَهُ : عَنْ زِيَادِ بْنِ اَلْحَارِثِ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ وَمَنْ أَذَّنَ فَهُوَ يُقِيمُ } وَضَعَّفَهُ أَيْضًا. وَلِأَبِي دَاوُدَ: مِنْ حَدِيثِ عَبْدِ اَللَّهِ بْنِ زَيْدٍ أَنَّهُ قَالَ : أَنَا رَأَيْتُهُ ‏- يَعْنِي : اَلْأَذَانُ ‏- وَأَنَا كُنْتُ أُرِيدُهُ. قَالَ : "فَأَقِمْ أَنْتَ " وَفِيهِ ضَعْفٌ أَيْضًا.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ బిలాల్ (రదియల్లాహు అన్హు)కు ఇలా ఉపదేశించారు – “అజాన్ ఇస్తున్నప్పుడు బాగా ఆగి ఆగి ఇవ్వండి. అయితే ‘తక్బీర్’ మాత్రం త్వరత్వరగా పలకండి. అజాన్ – ఇఖామత్‌ల మధ్య విరామం భోజనం చేసే వ్యక్తి భోజనాన్ని పూర్తి చేసి సామూహిక నమాజులో పాల్గొన గలిగేంతగా ఉండాలి.” (తరువాత హదీసునంతటినీ వివరించారు. దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు. జయీఫ్‌గా ఖరారు చేశారు)

దైవప్రవక్త ﷺ ప్రవచించారని అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “వుజూ చేయకుండా ఎవరూ అజాన్ ఇవ్వకండి” (దీన్ని కూడా జయీఫ్ – బలహీనం – గా ఖరారు చేశారు)

జియాద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “అజాన్ ఇచ్చిన వారే ఇఖామత్ చెప్పాలి.” (దీనిని కూడా తిర్మిజీ ‘జయీఫ్’గా ఖరారు చేశారు)

అబూదావూద్‌లో అబ్దుల్లాహ్ బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా వుంది: నేను అజాన్‌ను కలలో చూశాను. నేను ముఅజ్జిన్‌గా నియమించబడాలన్న కోరిక నాకు ఉండేది. “నీవు తక్బీర్ చెప్పు” అని ఆయన ﷺ నన్ను ఆజ్ఞాపించారు. (ఈ హదీసు కూడా జయీఫ్ కోవకు చెందినదే)

English

Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) said to Bilal, "When you announce the Adhan, utter deliberately and when you pronounce the Iqamah utter quickly, and leave between your Adhan and your Iqamah time for one who is eating to finish his food." [Reported by at-Tirmidhi who graded it Da'if (weak)].

He also reported from Abu Hurairah (RA): The Prophet (ﷺ) said: "No one should announce Adhan except the one who has performed the ablution". [Reported by at-Tirmidhi who graded it Da'if (weak)]. So the narration is weak whether Marfu' [reaching back to the Prophet (ﷺ)] or Mawquf (saying of a Companion).

He also reported from Ziyad bin al-Harith (RA): Allah's Messenger (ﷺ) said: "The one who announces the Adhan should also pronounce the Iqamah." [Reported by at-Tirmidhi who graded it Da'if (weak)].

Narrated 'Abdullah bin Zaid in another narration of the Hadith reported by Abu Dawud: I saw it, i.e. the Adhan (in a vision) and I wanted to announce it. Allah's Messenger (ﷺ) said: "You pronounce the Iqamah." [This Hadith is also Da'if (weak)].

సారాంశం

పై హదీసు ద్వారా మన దృష్టికివచ్చే కొన్ని ముఖ్యాంశాలు: (1) అజాన్ వాక్యాలు బిగ్గరగానూ, బాగా ఆగి ఆగి పలకాలి. అయితే ‘ఇఖామత్’ వాక్యాలు మాత్రం త్వరత్వరగా పలకాలి.

(2) అజాన్‌కి – సామూహిక నమాజ్‌కి మధ్య ఎక్కువ విరామం ఉండకూడదు. భోజనం చేస్తున్న వ్యక్తి భోజనం ముగించి వచ్చి సామూహిక నమాజ్‌ను అందుకునేంత విరామం ఇస్తే చాలు. 4 రకత్‌ల నమాజు చేసేంత విరామం ఉంటే చాలని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు.

(3) అజాన్ ఇచ్చిన వ్యక్తే ఇఖామత్ చెప్పాలనీ, విద్వాంసులలో అధిక సంఖ్యాకులు భావిస్తున్నారు. అయితే అజాన్ ఇచ్చిన వ్యక్తికి అభ్యంతరం లేనిపక్షంలో ఇతరులు కూడా ఇఖామత్ చెప్పవచ్చు.

హదీసు ఉల్లేఖకులు

హదీసు ఉల్లేఖకులలో ఒకరైన జియాద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) సుదా తెగకు చెందినవారు. ఈ తెగ యమన్‌కు చెందినది. దైవప్రవక్త ﷺ చేతిపై ప్రమాణం చేసినవారు. ఆయన ﷺ సమక్షంలో అజాన్ కూడా ఇచ్చారు. ఎట్టకేలకు బస్రాలో స్థిరపడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 156

157

హదీసు 157

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلْمُؤَذِّنُ أَمْلَكُ بِالْأَذَانِ , وَالْإِمَامُ أَمْلَكُ بِالْإِقَامَةِ } رَوَاهُ اِبْنُ عَدِيٍّ وَضَعَّفَهُ. وَلِلْبَيْهَقِيِّ نَحْوُهُ : عَنْ عَلِيٍّ مِنْ قَوْلِهِ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: ముఅజ్జిన్ అజాన్ ఇవ్వడానికి, ఇమామ్ తక్బీర్ పలకడానికి ఎక్కువ హక్కుదారులు”, (ఇబ్నె అదీ దీనిని ఉల్లేఖించారు. బలహీనమైనదిగా ఖరారు చేశారు. బైహఖీలో కూడా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) చే ఈ విధంగానే అనబడింది)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "The Mu'adhdhin has more right to [determine the time to] announce the Adhan and the Imam has more right to [determine when to] pronounce the Iqamah." [Reported by Ibn 'Adi who graded it Da'if (weak)].

al-Baihaqi has reported a similar narration from the saying of 'Ali (RA).

సారాంశం

అజాన్ ఇవ్వడానికి ముఅజ్జిన్ ఎక్కువ హక్కుదారుడు. ఎందుకంటే నమాజ్ వేళలను రక్షించవలసిన బాధ్యత అతనిపై ఉంది. అందుచేత వేళకు ముందుగానీ, ఆలస్యంగా గానీ అజాన్ ఇవ్వమని అతనిపై ఒత్తిడి తెచ్చే అధికారం కూడా ఎవరికీ లేదు. తక్బీర్ పలికించే హక్కు ఇమామ్‌ది. అతను సంజ్ఞ చేసే వరకూ (నమాజ్ సారథ్యానికి అతడు సమాయత్తం కానంతవరకూ) ఎవరూ తక్బీర్ పలకలేరు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 157

158

హదీసు 158

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يُرَدُّ اَلدُّعَاءُ بَيْنَ اَلْأَذَانِ وَالْإِقَامَةِ } رَوَاهُ النَّسَائِيُّ , وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ..

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఉపదేశించారు – “అజాన్ – ఇఖామత్‌ల మధ్య గల విరామ సమయంలో చేసే దుఆ త్రోసిపుచ్చబడదు.” (దీనిని నసాయి ఉల్లేఖించారు – ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Anas bin Malik (RA): Allah's Messenger (ﷺ) said: "A supplication made between the Adhan and Iqamah is not rejected." [Reported by an-Nasa'i and Ibn Khuzaimah graded it Sahih (authentic)].

సారాంశం

దైవప్రవక్త ﷺగారి ఈ ఉపదేశాన్ని విని సహచరులు, “మరైతే ఓ దైవప్రవక్తా! మేము ఆ సమయంలో దైవాన్ని ఏమని వేడుకోవాలి?” అని విన్నవించుకున్నారు. “దైవసమక్షంలో మన్నింపును, క్షమాభిక్షను, ఇహపరాల బాగోగులను అర్థించండి” అని ఆయన ﷺ సలహా ఇచ్చారు (తిర్మిజీ). దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే దుఆ స్వీకారానికి ఈ సమయం అత్యంత సముచితమైనది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 158

159

హదీసు 159

]وَعَنْ جَابِرٍ‏- رَضِيَ اَللَّهُ عَنْهُ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ : { مَنْ قَالَ حِينَ يَسْمَعُ اَلنِّدَاءَ : اَللَّهُمَّ رَبَّ هَذِهِ اَلدَّعْوَةِ اَلتَّامَّةِ , وَالصَّلَاةِ اَلْقَائِمَةِ , آتِ مُحَمَّدًا اَلْوَسِيلَةَ وَالْفَضِيلَةَ , وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا اَلَّذِي وَعَدْتَهُ , حَلَّتْ لَهُ شَفَاعَتِي يَوْمَ اَلْقِيَامَةِ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: ఎవరయితే అజాన్ పిలుపు విని ఈ దుఆ చేస్తాడో అతని కోసం ప్రళయదినాన నేను సిఫారసు చేయటం సమ్మతమైపోతుంది. (ఈ దుఆ ఇలా ఉంది) – “అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్దావతిత్తామతి వస్సలాతిల్ ఖాయిమతి ఆతి ముహమ్మద నిల్ వసీలత వల్ ఫజీలత వబ్ అస్హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వ అత్తహు” (అర్థం: ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపుకు, స్థాపించబడే నమాజ్‌కు అధిపతి అయినవాడా! ముహమ్మద్ – సఅసం – కు ప్రతిష్ఠాత్మకమయిన స్థానాన్ని (మఖామె మహ్మూద్), ఆధిక్యతను ప్రసాదించు. ఏ ప్రశంసాత్మకమయిన (ఉన్నత) స్థానం (స్వర్గంలో) ప్రసాదిస్తానని నీవు వాగ్దానం చేశావో ఆ స్థానంలో (ఆయన్ని) ప్రతిష్ఠింపజెయ్యి) (ఈ హదీసును అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ ఉల్లేఖించారు).

English

Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) said: "If anyone says when he hears the Adhan: 'O Allah! Lord of this perfect call and of the regular prayer which is going to be established! Kindly give Muhammad (ﷺ) the right of intercession and superiority, and send him (on the Day of Judgement) to the best and highest place in Paradise which You promised him', he will be assured of my intercession on the Day of Judgement." [Reported by al-Arba'ah].

సారాంశం

అజాన్ విన్న తరువాత పైన పేర్కొనబడిన దుఆ (ప్రార్థన) చేయటం మస్నూన్ (దైవప్రవక్త విధానం) అని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. దుఆ చేసే వాడికి ప్రవక్త గారి సిఫారసు లభిస్తుందంటే అంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది?! ఆయన ఎవరి గురించి సిఫారసు చేసినా అతను ఎట్టకేలకు స్వర్గంలో ప్రవేశిస్తాడు. “మఖామె మహ్మూద్” ప్రస్తావన దివ్య ఖుర్‌ఆన్‌లోని బనీ ఇస్రాయీల్ సూరాలో వచ్చింది. “నీ ప్రభువు నిన్ను మఖామె మహ్మూద్ పైకి చేర్చే అవకాశం ఉంది” అని అందులో వాగ్దానం చేయబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.2 అజాన్|హదీసు 159