హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 2.14 పండుగల నమాజ్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 14వ అధ్యాయం: పండుగల నమాజ్. ఈ అధ్యాయంలో 16 హదీసులు (హదీసు 385 – 400) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

2.14 పండుగల నమాజ్

↑ విషయ సూచిక

باب صلاة العيدين

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

385

హదీసు 385

عَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ الْفِطْرُ يَوْمَ يُفْطِرُ اَلنَّاسُ, وَالْأَضْحَى يَوْمَ يُضَحِّي اَلنَّاسُ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఏ రోజున ప్రజలు ఉపవాసాలు అన్నీ పూర్తిచేసి ‘ఇఫ్తార్’ చేస్తారో ఆ రోజు వారి కొరకు పండుగ రోజు అవుతుంది. ప్రజలు ఖుర్బానీ ఇచ్చే రోజు ఈదుల్ అజ్హా అవుతుంది.” (తిర్మిజి)

English

Narrated 'Aishah (RA): Allah's Messenger (ﷺ) said: "('Eid) al-Fitr is the day on which the people break the fast, and ('Eid) al-Adha is the day the people offer sacrifices." [Reported by at-Tirmidhi].

సారాంశం

ముస్లింల కొరకు ఏడాదికి రెండు పండుగలు మాత్రమే ఉన్నాయని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. అవి (1) ఈదుల్ ఫిత్ర్ (2) ఈదుల్ అజ్హా. ఈ రెండు పండుగలు మినహా మరో పండుగగానీ, సంబరంగానీ ఇస్లాంలో లేదు. ఈ మధ్య ముస్లింలు సృష్టించుకున్న కొంగ్రొత్త పండుగలకు షరియత్‌తో ఏ మాత్రం సంబంధం లేదు.

పండుగలు సామూహికత యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతాయి. ఇస్లాం ప్రతిపాదించిన పండుగలలో సామూహిక స్ఫూర్తితోపాటు, ఆరాధనలు కూడా ఉన్నాయి. ఏ ఒక్క మనిషి కూడా- ఒంటరిగా – నెలవంక చూసి, ఒంటరిగా పండుగ జరుపుకోలేడు. పండుగ జరుపుకోవటానికి ముస్లిం సమాజంలోని అత్యధికులు ఆమోదించాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 385

386

హదీసు 386

وَعَنْ أَبِي عُمَيْرِ بْنِ أَنَسٍ, عَنْ عُمُومَةٍ لَهُ مِنَ اَلصَّحَابَةِ, { أَنَّ رَكْبًا جَاءُوا, فَشَهِدُوا أَنَّهُمْ رَأَوُا الْهِلَالَ بِالْأَمْسِ, فَأَمَرَهُمْ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-أَنْ يُفْطِرُوا, وَإِذَا أَصْبَحُوا أَنْ يَغْدُوا إِلَى مُصَلَّاهُمْ } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ ‏-وَهَذَا لَفْظُهُ‏- وَإِسْنَادُهُ صَحِيحٌ.

హజ్రత్ అబూ ఉమైర్ బిన్ అనస్ (రదియల్లాహు అన్హు) తన పినతండ్రి అయిన ఒక సహాబీ (రదియల్లాహు అన్హు) గారి ఆధారంగా ఉల్లేఖించారు – కొంతమంది దైవప్రవక్త ﷺ దగ్గరకు స్వారీ చేసివచ్చి తాము నిన్న సాయంత్రం నెలవంకను చూసినట్లు సాక్ష్యమిచ్చారు. దీనిపై ఆయన ﷺ, “ఉపవాసాన్ని విరమించండి. రేపుదయం పండుగ నమాజ్ కోసం ఈద్గాహ్‌కు రండి” అని ఆజ్ఞాపించారు. (అహ్మద్, అబూదావూద్‌లు దీనిని ఉల్లేఖించారు – వాక్యాలు మాత్రం అబూదావూద్‌లోనివి. దీని ఆధారం ప్రమాణబద్ధమైనది)

English

Narrated Abu 'Umair bin Anas bin Malik (RA) on the authority of some of his paternal uncles who were among the Companions, that some riders came and testified that they had seen the new moon the previous day. The Prophet (ﷺ) therefore commanded the people to break the fast and go out to their place of prayer in the morning. [Reported by Ahmad and Abu Dawud. This is Abu Dawud's wording and its Isnad is Sahih (authentic)].

సారాంశం

రమజాన్ నెల 29వ రోజు సాయంత్రం – ఆకాశం నిర్మలంగా వున్న ప్రదేశంలో గనక నెలవంక కనబడి – ఆ సమాచారం మరునాడు విశ్వసనీయ వర్గాల ద్వారా అందితే – ఆ సమాచారం ఆధారంగా అప్పటికప్పుడే ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయవచ్చు. అయితే పొద్దు నడినెత్తిపై రాక మునుపే సమాచారం అందితే ఆ రోజు పండుగ నమాజ్ చేయాలి. మధ్యాహ్న సమయానికి సమాచారం అందితే పండుగ మరునాడే జరుపుకోవలసి ఉంటుంది.

ఈ హదీసు ఆధారంగా తెలిసిన మరో విషయమేమిటంటే పండుగ నమాజ్‌ను ఈద్గాహ్‌లో జరుపుకోవటం ఉత్తమం. నెలవంక కనబడినట్లు అధికారికంగా కూడా సమాచారం అందించవచ్చు. ఇలాంటి ప్రకటన ధార్మిక సంస్థల, ధార్మిక వ్యక్తుల ద్వారా చేయించటం మంచిది. ఆధునిక యుగంలో రేడియో, టీవీ వంటి ప్రసార సాధనాల వల్ల క్షణాల్లో సమాచారం అందుతోంది.

హదీసు ఉల్లేఖకులు

అబూ ఉమైర్ బిన్ అనస్ (రహిమహుల్లాహ్) గారి అసలు పేరు అబ్దుల్లాహ్ బిన్ మాలిక్ అన్సారీ. అనస్ (రదియల్లాహు అన్హు) గారి పెద్దకొడుకు. యువ తాబయీన్లలో ఒకరుగా పరిగణించబడ్డారు. 4వ కోవకు చెందిన ఉల్లేఖకులు. తన తండ్రి తరువాత చాలా కాలం వరకు జీవించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 386

387

హదీసు 387

وَعَنْ أَنَسٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-لَا يَغْدُو يَوْمَ اَلْفِطْرِ حَتَّى يَأْكُلَ تَمَرَاتٍ يَأْكُلُهُنَّ وِتْرًا } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ. وَفِي رِوَايَةٍ مُعَلَّقَةٍ ‏-وَوَصَلَهَا أَحْمَدُ‏-: وَيَأْكُلُهُنَّ أَفْرَادًا.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ పండుగ నమాజ్ (ఈదుల్ ఫిత్ర్) కు బయలుదేరకముందు కొన్ని ఖర్జూరపు పండ్లు తినేవారు. ఈ ఖర్జూర పండ్లు బేసి సంఖ్యలో ఉండేవి.” (దీనిని బుఖారీ ఉల్లేఖించారు – ఒక అనిశ్చిత (ముఅల్లఖ్) ఉల్లేఖనంలో కూడా ఇలాగే ఉంది. ఆయన ﷺ ఈ ఖర్జూర పండ్లను ఒక్కొక్కటిగా చేసి తినేవారని అహ్మద్ గారు ఒక మౌసూల్ ఉల్లేఖనంలో ప్రస్తావించారు)

English

Narrated Anas (RA): Allah's Messenger (ﷺ) would not go out on the day of the breaking of the fast till he ate some dates, which he used to eat in odd numbers. [al-Bukhari reported it].

A Mu'allaq narration (broken chain from the side of the Hadith collector, i.e. al-Bukhari) – but connected by Ahmad – has: "and he used to them one by one."

సారాంశం

ఈ హదీసు ద్వారా అనేక అంశాలు మన దృష్టికి వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి: (1) ఈద్ నమాజ్ కోసం బహిరంగ స్థలాలకు వెళ్ళాలి. (2) పండుగ నమాజ్‌కు వెళ్ళేముందు బేసి సంఖ్యలో ఖర్జూర పండ్లు తినటం సంప్రదాయం (సున్నత్). (3) ఖర్జూర పండ్లు ఒకేసారి అనేకం నోట్లో వేసుకునే బదులు ఒక్కొక్కటీ తినాలి. ఒకేసారి నోట్లో కుక్కటం అనాగరికం, సంస్కార విహీనం అనిపించుకుంటుంది. ఒకవేళ ఖర్జూర పండ్లు లభ్యమవకపోతే మరేదయినా తీపి పదార్థంగానీ, తీపి పండ్లుగాని తినవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 387

388

హదీసు 388

وَعَنِ ابْنِ بُرَيْدَةَ, عَنْ أَبِيهِ قَالَ: { كَانَ النَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-لَا يَخْرُجُ يَوْمَ اَلْفِطْرِ حَتَّى يَطْعَمَ, وَلَا يَطْعَمُ يَوْمَ اَلْأَضْحَى حَتَّى يُصَلِّيَ } رَوَاهُ أَحْمَدُ, وَاَلتِّرْمِذِيُّ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ.

తన తండ్రి తనతో చెప్పినట్లు హజ్రత్ ఇబ్నె బురైద తెలిపారు – “దైవ ప్రవక్త ﷺ ఈదుల్ ఫిత్ర్ కొరకు ఏదైనా తినేవరకూ బయలుదేరేవారు కారు. అయితే ఖుర్బానీ పండుగనాడు ఆయన ﷺ నమాజ్ చేసేదాకా ఏమీ తినేవారు కారు. (అహ్మద్ మరియు తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు – ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Narrated Ibn Buraidah on the authority of his father: Allah's Messenger (ﷺ) would not go out on the day of breaking of the fast till he had some food, and he would not to take any food on the day of sacrifice till he had prayed (the 'Eid prayer). [Reported by Ahmad and at-Tirmidhi; Ibn Hibban graded it Sahih (authentic)].

సారాంశం

రమజాన్ పండుగ రోజున ఏదన్నా తిన్న తరువాత నమాజ్ చేయటం, బక్రీద్ పండుగనాడు నమాజ్ చేసిన తరువాత తినటం దైవప్రవక్త ﷺ విధానం. ఫలానా పదార్థమే తినాలన్న ఆంక్ష ఏమీలేదు. కాకపోతే ఖర్జూర పండ్లను ‘మస్నూన్’గా భావించి వాటిని తినటం చాలా మంచిది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 388

389

హదీసు 389

وَعَنْ أُمِّ عَطِيَّةَ قَالَتْ: { أُمِرْنَا أَنْ نُخْرِجَ اَلْعَوَاتِقَ, وَالْحُيَّضَ فِي الْعِيدَيْنِ; يَشْهَدْنَ الْخَيْرَ وَدَعْوَةَ اَلْمُسْلِمِينَ, وَتَعْتَزِلُ اَلْحُيَّضُ اَلْمُصَلَّى } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఉమ్మె అతియ (రదియల్లాహు అన్హా) కథనం : “ముస్లింల సంక్షేమ కార్యాలలో, వేడుకోళ్ళలో పాలుపంచుకునే ఉద్దేశ్యంతో, మేము పడుచు పిల్లలను, బహిష్టు స్త్రీలను కూడా పండుగలకు (ఈద్గాహ్‌లకు) తీసుకు రావలసిందిగా మాకు ఆజ్ఞాపించబడింది. అయితే బహిష్టు స్త్రీలు ఈద్గాహ్ ప్రక్కనే ఉండాలని (నమాజ్ చేయరాదని, కేవలం దుఆలో పాల్గొనాలనీ) సూచించబడింది.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Umm 'Atiyah (RA): We were commanded to bring out on 'Eidul-Fitr and 'Eidul-Adha, the young women and the menstruating women to participate in the goodness and supplications of the Muslims. However, the menstruating women would refrain from the (actual) place of prayer. [Agreed upon].

సారాంశం

పండుగ నమాజ్ కొరకు మహిళలు ఇల్లు వదలి ఈద్గాహ్‌కు వెళ్ళటం సమంజసమేనని హదీసు ద్వారా రూఢీ అవుతోంది. దైవప్రవక్త ﷺ స్వయంగా తన సతీమణులను, కుమార్తెలను ఈద్గాహ్‌కు తీసుకు వెళ్ళేవారని ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), అలీ (రదియల్లాహు అన్హుమా)లు స్త్రీలను పండుగ నమాజ్‌కు పిలుచుకు వెళ్ళటం తప్పనిసరి అని భావించేవారు.

ఈ హదీసుపై హనఫీ ధర్మవేత్తలు ఇలా వ్యాఖ్యానించారు: “ఇది ఇస్లాం ఆరంభకాలంనాటి సంగతి. ఆ రోజుల్లో ముస్లింల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. పర్వదినాలలో – ఈద్గాహ్‌లలో – ముస్లింలు వీలైనంత ఎక్కువమంది పాల్గొంటే అవిశ్వాసులపై దాని ప్రభావం పడుతుందన్న ఉద్దేశ్యంతో మహిళలను సయితం గొనిపోయేవారు.”

అల్లామా తహావీ ఎంతో కష్టపడి సేకరించిన ఈ సమాచారంలో పసలేదు. ఎందుకంటే హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం ఈ (పండుగ) సంఘటన మక్కా విజయం తరువాత సంభవించింది. దైవకృపవల్ల అప్పటికే ముస్లింల సంఖ్య గణనీయంగా పెరిగింది. మక్కా మదీనాలలో దాదాపు ఇస్లామీయ వ్యవస్థ నెలకొన్నది.

ఇంతకీ చెప్పవచ్చిందేమిటంటే ఈద్గాహ్‌లలో స్త్రీలు పాల్గొనటం మంచిది. ఇది దైవప్రవక్త ﷺ నెలకొల్పిన ఒక ఆదర్శం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 389

390

హదీసు 390

وَعَنِ ابْنِ عُمَرَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-وَأَبُو بَكْرٍ, وَعُمَرُ: يُصَلُّونَ الْعِيدَيْنِ قَبْلَ اَلْخُطْبَةِ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “దైవప్రవక్త ﷺ, హజ్రత్ అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా)లు పండుగ నమాజుల సందర్భంగా ప్రసంగానికి ముందే నమాజు చేసేవారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) Abu Bakr and 'Umar (RA) used to offer the 'Eid prayer before the Khutbah (religious talk – sermon). [Agreed upon].

సారాంశం

పండుగలలో తొలుత నమాజ్ చేసి, ఆ తరువాత ప్రసంగం చేయాలని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. బనూ ఉమయ్య పరిపాలనా యుగంలో మర్వాన్ అనే పరిపాలకుడు ముందు ప్రసంగించి తరువాత నమాజ్ చేసే దురాచారాన్ని (బిద్‌అత్‌ను) ఆరంభించాడు. ఆ సమయంలో హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) దీనిపై తీవ్ర నిరసన తెలిపారు. ‘నీవు సున్నత్‌కు విరుద్ధమైన పని మొదలెట్టావు’ అని ఆయన పరిపాలకుని మొహం మీదే చెప్పేశారు. (సహీహ్ ముస్లిం)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 390

391

హదీసు 391

وَعَنِ ابْنِ عَبَّاسٍ: { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-صَلَّى يَوْمَ اَلْعِيدِ رَكْعَتَيْنِ, لَمْ يُصَلِّ قَبْلَهُمَا وَلَا بَعْدَهُمَا } أَخْرَجَهُ اَلسَّبْعَةُ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ పండుగ రోజున రెండు రకతుల నమాజ్ మాత్రమే చేశారు. దీనికి ముందుగానీ, తరువాతగానీ ఆయన ﷺ మరే నమాజూ చేయలేదు.” (దీనిని ఏడు గురూ-అంటే అహ్మద్, బుఖారీ, ముస్లిం, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా – ఉల్లేఖించారు)

English

Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) offered two Rak'at on the day of 'Eid, and did not pray before or after them. [Reported by as-Sab'ah].

సారాంశం

ఈ హదీసు ప్రకారం ఈద్గాహ్‌లో ఈ రెండు రకతుల పండుగ నమాజ్ తప్ప మరే నమాజూ దైవప్రవక్త ﷺ చేయలేదు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన మీదట రెండు రకతులు చేసేవారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 391

392

హదీసు 392

وَعَنْهُ: { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-صَلَّى اَلْعِيدَ بِلَا أَذَانٍ, وَلَا إِقَامَةٍ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ. وَأَصْلُهُ فِي اَلْبُخَارِيِّ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “అజాన్, ఇఖామత్‌లు చెప్పకుండానే దైవప్రవక్త ﷺ పండుగ నమాజ్ చేయించారు.” (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు -దీని మూలం బుఖారీలో ఉంది)

English

Narrated [Ibn 'Abbas (RA)]: The Prophet (ﷺ) offered the 'Eid prayer without an Adhan or an Iqamah. [Reported by Abu Dawud].

And its basic meaning is in al-Bukhari.

సారాంశం

పండుగ నమాజ్ కోసం అజాన్, ఇఖామత్‌లు చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎవరయినా అజాన్, ఇఖామత్ ఇస్తే వారు బిద్‌అత్ (కొత్త పోకడ)ను సృష్టించినవారే అవుతారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 392

393

హదీసు 393

وَعَنْ أَبِي سَعِيدٍ قَالَ: { كَانَ النَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-لَا يُصَلِّي قَبْلَ اَلْعِيدِ شَيْئًا, فَإِذَا رَجَعَ إِلَى مَنْزِلِهِ صَلَّى رَكْعَتَيْنِ } رَوَاهُ اِبْنُ مَاجَهْ بِإِسْنَادٍ حَسَنٍ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ పండుగ నమాజ్‌కు ముందు ఏ నమాజూ చేసేవారు కారు. అయితే ఇంటికి వచ్చిన తరువాత రెండు రకతుల నఫిల్ నమాజు మాత్రం చేసేవారు.” (దీనిని ఇబ్నె మాజ స్పష్టమయిన ఆధారంతో ఉల్లేఖించారు)

English

Narrated Abu Sa'id (RA): The Prophet (ﷺ) never used to offer any prayer before the 'Eid prayer. But when he went back home, he used to pray two Rak'at. [Reported by Ibn Majah through a Hasan (good) chain of narrators].

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 393

394

హదీసు 394

وَعَنْهُ قَالَ: { كَانَ النَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-يَخْرُجُ يَوْمَ اَلْفِطْرِ وَالْأَضْحَى إِلَى اَلْمُصَلَّى, وَأَوَّلُ شَيْءٍ يَبْدَأُ بِهِ اَلصَّلَاةُ, ثُمَّ يَنْصَرِفُ فَيَقُومُ مُقَابِلَ اَلنَّاسِ ‏-وَالنَّاسُ عَلَى صُفُوفِهِمْ‏- فَيَعِظُهُمْ وَيَأْمُرُهُمْ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదె ఖుర్బానీ కొరకు ఈద్గాహ్‌కు రాగానే చేసే మొదటి పని నమాజ్ చేయించటం. నమాజ్ పూర్తయిన వెంటనే ఆయన ﷺ ప్రజల వైపునకు తిరిగి నిలబడేవారు. ప్రజలు తమ తమ పంక్తుల్లో కూర్చుని వుండగా ఆయన ﷺ వారికి హితబోధ చేసేవారు. మంచిని పెంపొందించమని ఆజ్ఞాపించేవారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated [Abu Sa'id (RA)]: The Prophet (ﷺ) used to go out on the day of the breaking of the fast and the day of sacrifice to the place of prayer, and the first thing he would start with was the prayer. When he finished he would stand facing the people, who were seated in their rows, and he would then preach to them and command them. [Agreed upon].

సారాంశం

ఈ హదీసు ద్వారా క్రింది అంశాలు వెలుగులోకి వస్తాయి –

(1) పండుగ నమాజుకు మునుపు దైవప్రవక్త ﷺ మరే ఆచరణా చేసినట్లు ఆధారం లేదు. (2) నమాజ్ చేసిన తరువాత ప్రసంగించాలి. (3) ఉపన్యాసకుడు ప్రజల వైపునకు తిరిగి నిలబడాలి. (4) ఉపన్యాసం నిలబడి ఇవ్వాలి. ప్రతి ఉపన్యాసకుడూ ఉపన్యసించే సమయంలో ప్రజలకు ధర్మబోధ చేయాలి. సదాచరణ గురించి నొక్కి వక్కాణించాలి. అనవసర వ్యాఖ్యలకు, కాలక్షేపపు కబుర్లకు అందులో తావుండరాదు.(5) ప్రసంగం కొనసాగే సమయంలో ప్రజలు తమ తమ స్థానాలలో నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఉపన్యాసకుని వైపునకు తిరిగి కూర్చోవాలి. (6) పండుగ నమాజ్‌ను వీలయినంత వరకు ఈద్గాహ్‌లోనే చేయాలి. ఈ మధ్య జనులు తగు కారణమేదీ లేకుండానే తమ పేటలో వున్న మస్జిదులలో పండుగ నమాజ్ చేస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం కాదు. (7) దైవప్రవక్త ﷺ పండుగ రోజు ప్రసంగం కొరకు వేదికను ఉపయోగించలేదు. అందరికన్నా ముందు ఈద్గాహ్‌లో వేదికను ప్రతిష్ఠించిన వ్యక్తి మర్వాన్ అనీ, అతడు దానిపై నిలబడి ఉపన్యసించాడనీ బుఖారీలో ఉంది. అయితే ఇబ్నె హిబ్బాన్‌లోని ఒక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒకసారి ఒంటెపై కూర్చుని పండుగ ప్రసంగం చేశారు. కనుక అవసరం మేరకు వాహనంపై నుంచి కూడా ప్రసంగించవచ్చునన్న దానికి ఇదొక నిదర్శనం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 394

395

హదీసు 395

وَعَنْ عَمْرِوِ بْنِ شُعَيْبٍ عَنْ أَبِيهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ نَبِيُّ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ اَلتَّكْبِيرُ فِي اَلْفِطْرِ سَبْعٌ فِي اَلْأُولَى وَخَمْسٌ فِي اَلْأُخْرَى, وَالْقِرَاءَةُ بَعْدَهُمَا كِلْتَيْهِمَا } أَخْرَجَهُ أَبُو دَاوُدَ. وَنَقَلَ اَلتِّرْمِذِيُّ عَنِ اَلْبُخَارِيِّ تَصْحِيحَهُ.

హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి గారినుండి, మరి ఆయనేమో తన తాతగారి నుండి గ్రహించిన విషయాన్ని ఇలా తెలియజేస్తున్నారు – దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : “ఈదుల్ ఫిత్ర్ నమాజు మొదటి రకత్‌లో ఏడు తక్బీర్లు, రెండవ రకతులో ఐదు తక్బీర్లు ఉన్నాయి. రెండు రకతులలోనూ తక్బీర్ల అనంతరమే ఖిరాత్ (ఖుర్ఆన్ పారాయణం) ఉంటుంది.” (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు – తిర్మిజీ గారు ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) నుండి దీని ప్రామాణికతను నకలు చేశారు)

English

Narrated 'Amr bin Shu'aib from his father on the authority of his grand father: The Prophet of Allah (ﷺ) said: "The Takbir in ('Eid) al-Fitr prayer are seven in the first Rak'ah and five in the second, and the recitation of the Qur'an in both is after the Takbir." [Reported by Abu Dawud].

at-Tirmidhi transmitted its Tashih (grading of authenticity) from al-Bukhari.

సారాంశం

పండుగ నమాజులలో 12 అదనపు తక్బీర్లు ఉన్నాయని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తదితర సహాబీల ఉల్లేఖనాలు కూడా ఈ హదీసుకు అనుకూలంగా ఉన్నాయి. అనేక మంది తాబయీలు, మదీనా ధర్మవేత్తల (ఫుకహా)తో పాటు ఇమామ్ అహ్మద్, ఇమామ్ షాఫయీ కూడా ఈ హదీసు ప్రకారమే ఆచరించారు. తిర్మిజీ వ్యాఖ్యాత అల్లామా అబ్దుర్రహ్మాన్ ముబారక్‌పూరి దీని గురించి జరిపిన చర్చ తిరుగులేనిది.

అయితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) మరియు కొంతమంది కూఫా ధర్మవేత్తలు మాత్రం 6 అదనపు తక్బీర్లతో పండుగ నమాజ్ చేయాలని అభిప్రాయపడ్డారు. అంటే మొదటి రకతులో ఖిరాత్‌కు ముందు 3 తక్బీర్లు, రెండవ రకతులో ‘రుకూ’ లోకి వెళ్ళకముందు 3 తక్బీర్లు.

పండుగ నమాజ్‌లో అదనపు తక్బీర్లు పలికే సమయంలో కూడా ‘రఫెయదైన్’ చేయటం సంప్రదాయమని ఇమామ్ ఇబ్నె ముంజిర్, బైహఖీలు పేర్కొన్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 395

396

హదీసు 396

وَعَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ قَالَ: { كَانَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-يَقْرَأُ فِي اَلْأَضْحَى وَالْفِطْرِ بِـ (ق)‏, وَ (اقْتَرَبَتْ)‏.‏ } أَخْرَجَهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ వాఖిద్ లైసీ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ ఈదుల్ అజ్హా మరియు ఈదుల్ ఫిత్ర్ నమాజులలో సూరయె ఖాఫ్ మరియు ఇఖ్తరబతిస్సాఅ సూరాలు పఠించేవారు.” (ముస్లిం)

English

Narrated Abu Waqid al-Laithi (RA): The Prophet (ﷺ) used to recite on ('Eid) al-Adha and ('Eid) al-Fitr, Surat Qaf (Chapter 50) and Surat Al-Qamar (Chapter 54). [Reported by Muslim].

సారాంశం

పండుగ నమాజులలో ఏ సూరాలు పఠించినా నమాజు నెరవేరుతుంది. అయితే ప్రవక్త ﷺ అనుసరణకు ప్రతీకగా ఈ రెండు సూరాలను చదవటం మంచిది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 396

397

హదీసు 397

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا كَانَ يَوْمُ اَلْعِيدِ خَالَفَ اَلطَّرِيقَ } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ. وَلِأَبِي دَاوُدَ: عَنِ ابْنِ عُمَرَ, نَحْوُهُ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ పండుగ రోజున ఈద్గాహ్‌కు ఒక దారిన వెళ్ళి మరో దారిగుండా తిరిగి వచ్చేవారు.” (దీనిని బుఖారీ ఉల్లేఖించారు- అబూదావూద్‌లో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) చే కూడా ఇలాగే ఉల్లేఖించబడింది)

English

Narrated Jabir (RA): On an 'Eid day, Allah's Messenger (ﷺ) would return by a different road from the one he had taken when going out (for the 'Eid prayer.) [Reported by al-Bukhari].

Abu Dawud has a similar report from Ibn 'Umar (RA).

సారాంశం

ఈద్గాహ్‌కు ఒక దారిన వెళ్ళి, మరో దారిన రావటం వల్ల ప్రజాబాహుళ్యంలో పండుగ వాతావరణాన్ని సృజించినట్లవుతుంది. పండుగ రోజున వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు పలికే తక్బీర్లతో వీధి వీధి, వాడ వాడ ప్రతిధ్వనిస్తుంది. దేవుని గొప్పదనం, ఘనత చాటబడుతుంది. తద్వారా ఇస్లాం వైభవం కూడా వ్యక్తమవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 397

398

హదీసు 398

وَعَنْ أَنَسٍ قَالَ: { قَدِمَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-اَلْمَدِينَةَ, وَلَهُمْ يَوْمَانِ يَلْعَبُونَ فِيهِمَا.‏ فَقَالَ: "قَدْ أَبْدَلَكُمُ اَللَّهُ بِهِمَا خَيْرًا مِنْهُمَا: يَوْمَ اَلْأَضْحَى, وَيَوْمَ اَلْفِطْرِ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ بِإِسْنَادٍ صَحِيحٍ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మదీనా ఏతెంచినపుడు అక్కడ ఏడాదికి రెండు రోజులు ఆటపాటలకై, వినోదానికై ప్రత్యేకించబడి ఉండటం గమనించారు. “అల్లాహ్ మీ కోసం ఈ రెండు దినాలకు బదులుగా ఇంతకన్నా మేలైన రెండు దినాలను ప్రసాదించాడు. ఒకటి : ఈదుల్ అజ్హా. రెండవది : ఈదుల్ ఫిత్ర్.” (దీనిని అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు – దీని ఆధారం ప్రామాణికమైనది)

English

Narrated Anas (RA) that when Allah's Messenger (ﷺ) came to al-Madinah, the people had two days on which they engaged in games. He (ﷺ) said: "Allah has substituted for you something better than them: the day of sacrifice and the day of breaking the fast." [Reported by Abu Dawud and an-Nasa'i; with a Sahih Isnad (authentic chain)].

సారాంశం

షరియత్ పరిధిలో వుంటూ పండుగ దినాలలో ఆనందంగా ఆటలాడుకోవటం, విద్యా పాటవం ప్రదర్శించటం సమంజసమేనని ఈ హదీసు ద్వారా వెల్లడి అవుతోంది. అయితే అవధులు మీర కూడదు. సభ్యతా సంస్కారాలకు విరుద్ధమైన వెకిలి చేష్టలకు, ధన మాన ప్రాణాలకు నష్టం కలిగించే కృత్యాలకు పాల్పడరాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 398

399

హదీసు 399

وَعَنْ عَلِيٍّ ‏- رضى الله عنه ‏- قَالَ: { مِنَ اَلسُّنَّةِ أَنْ يَخْرُجَ إِلَى اَلْعِيدِ مَاشِيًا } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَحَسَّنَهُ.

ఈద్గాహ్ వైపునకు నడచి వెళ్ళటం సున్నత్ (సంప్రదాయం)అని హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) తెలిపారు. (దీనిని తిర్మిజీ నకలు చేశారు. ‘హసన్’గా ఖరారు చేశారు)

English

Narrated 'Ali (RA): It is Sunnah to go to the 'Eid (prayer) walking. [Reported by at-Tirmidhi who graded it Hasan (good)].

సారాంశం

ఈద్గాహ్‌కు నడచి వెళ్ళడం ఎక్కువ పుణ్యప్రదమయిన విషయం. పండుగ నమాజ్ కోసం ఎన్ని అడుగులు వేస్తే అన్ని సత్కార్యాలు లిఖించబడతాయి. ఒకవేళ ఈద్గాహ్ చాలా దూరముంటే వాహనంపై వెళ్ళటంలో తప్పులేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 399

400

హదీసు 400

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { أَنَّهُمْ أَصَابَهُمْ مَطَرٌ فِي يَوْمِ عِيدٍ.‏ فَصَلَّى بِهِمْ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-صَلَاةَ اَلْعِيدِ فِي اَلْمَسْجِدِ } رَوَاهُ أَبُو دَاوُدَ بِإِسْنَادٍ لَيِّنٍ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: ఒకసారి పండుగ రోజున ముస్లింలను వర్షం వెంటాడటం వల్ల దైవప్రవక్త ﷺ, వారికి మస్జిదులోనే పండుగ నమాజ్ చేయించారు. (అబూదావూద్ దీనిని బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు)

English

Narrated Abu Hurairah (RA): It rained on an 'Eid day, so the Prophet (ﷺ) led them (the people) in the 'Eid prayer in the mosque. [Reported by Abu Dawud with a Laiyin Isnad (weak chain)].

సారాంశం

షరియత్‌పరంగా తగు కారణమేదైనా ఉంటే అప్పుడు మస్జిద్‌లో కూడా పండుగ నమాజ్ చేయవచ్చునని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. సాధారణంగా ఆయన ﷺ ఈద్గాహ్‌లోనే పండుగ నమాజ్‌ను చేసేవారు. కాని ఒకసారి మాత్రం దైవకారుణ్యం వర్షించటం మూలంగా మస్జిదులో పండుగ నమాజ్ చేయించాల్సి వచ్చింది.

ఇక పండుగ నమాజ్ ఈద్గాహ్‌లో చేయాలా? లేక మస్జిదులలో చేయాలా? అన్న విషయమై ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) దృష్టిలో సువిశాలమైన (పెద్ద) మస్జిదులో పండుగ నమాజ్ చేయటం ఉత్తమం.

ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: “దైవప్రవక్త ﷺ జీవితాంతం పండుగ నమాజ్‌ను బహిరంగ ప్రదేశంలో – ఈద్గాహ్ స్థలంలో – ఆచరించారు. కేవలం ఒక్కసారి మాత్రం వర్షం కారణంగా గత్యంతరం లేక మస్జిద్‌లో పండుగ నమాజ్‌ను నెరవేర్చారు. కనుక పండుగ నమాజ్‌ను ఈద్గాహ్‌లో చేయటమే శ్రేష్ఠం.”

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) గారి పలుకులు –

ఆయన (రదియల్లాహు అన్హు) పండుగ నమాజ్ కోసం ఈద్గాహ్‌కు వెళ్ళారు. అక్కడ ఆయన (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు : “ఒకవేళ బహిరంగ స్థలానికి వచ్చి ఈద్ నమాజ్ చేయటం ‘మస్నూన్’ (సంప్రదాయం) కాకపోయినట్లయితే నేను మస్జిద్‌లోనే నమాజ్ చేసి ఉండేవాణ్ణి.”

కాబట్టి పండుగ నమాజ్‌ను ఈద్గాహ్‌లో చేయటమే సంప్రదాయం, శ్రేష్ఠం కూడా.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.14 పండుగల నమాజ్|హదీసు 400