హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 13వ అధ్యాయం: భయస్థితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్). ఈ అధ్యాయంలో 6 హదీసులు (హదీసు 379 – 384) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
2.13 భయస్థితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)
باب صلاة الخوف
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 379
عَنْ صَالِحِ بْنِ خَوَّاتٍ, { عَمَّنْ صَلَّى مَعَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -يَوْمَ ذَاتِ اَلرِّقَاعِ صَلَاةَ اَلْخَوْفِ: أَنَّ طَائِفَةً صَلَّتْ مَعَهُ وَطَائِفَةٌ وِجَاهَ اَلْعَدُوِّ, فَصَلَّى بِاَلَّذِينَ مَعَهُ رَكْعَةً, ثُمَّ ثَبَتَ قَائِمًا وَأَتَمُّوا لِأَنْفُسِهِمْ, ثُمَّ اِنْصَرَفُوا فَصَفُّوا وِجَاهَ اَلْعَدُوِّ, وَجَاءَتِ اَلطَّائِفَةُ اَلْأُخْرَى, فَصَلَّى بِهِمْ اَلرَّكْعَةَ اَلَّتِي بَقِيَتْ, ثُمَّ ثَبَتَ جَالِسًا وَأَتَمُّوا لِأَنْفُسِهِمْ, ثُمَّ سَلَّمَ بِهِمْ } مُتَّفَقٌ عَلَيْهِ, وَهَذَا لَفْظُ مُسْلِمٍ. وَوَقَعَ فِي "اَلْمَعْرِفَةِ" لِابْنِ مَنْدَهْ, عَنْ صَالِحِ بْنِ خَوَّاتٍ, عَنْ أَبِيهِ.
హజ్రత్ సాలిహ్ బిన్ ఖవ్వాత్ (రదియల్లాహు అన్హు), ‘జాతుర్రిఖా’ యుద్ధం జరిగిన నాడు దైవప్రవక్త ﷺతో కలిసి ‘సలాతుల్ ఖౌఫ్’ (భీతావహ స్థితిలో నమాజ్) చేసిన వ్యక్తి ఆధారంగా ఉటంకించారు – ఆ వ్యక్తి ఇలా వివరించాడు – ఒక బృందం ఆయన ﷺతో కలిసి నమాజ్ కోసం వరుసతీరి నిలబడింది. రెండవ బృందం శత్రువును ప్రతిఘటించటానికి ఎదురుగా నిలబడింది. తన వెనుక, వరుస తీరి నిలబడిన వారికి ఆయన ﷺ ఒక రకత్ నమాజ్ చేయించి, ఆయన ﷺ తిన్నగా నిలబడ్డారు. వెనుకనున్నవారు మిగిలిన నమాజును తమ తమ తరఫున పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళి శత్రువును నిలువరించడానికి నిలబడిపోయారు. అప్పుడు రెండవ బృందం వచ్చింది. ఈ బృందానికి ఆయన ﷺ రెండవ రకతును చేయించి కూర్చున్నారు. కాగా; వెనుకనున్న వారు తమ తరఫున మిగిలిన నమాజును పూర్తిచేసుకున్నారు. తరువాత ఆయన ﷺ వారితో కలిసి ‘సలాం’ చేశారు. (బుఖారీ, ముస్లిం – కాని హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. ‘సాలిహ్ బిన్ ఖవ్వాత్ తన తండ్రినుంచి ఉల్లేఖించార’ని ఇబ్నె ముంద యొక్క ‘అల్ మారిఫ’లో ఉంది)
English
Narrated Salih bin Khawwat on the authority of one who offered the Fear prayer with Allah's Messenger (ﷺ) at the battle of Dhatur-Riqa' that a group (of the army) formed a line along with him and a group faced the enemy. He (ﷺ) led the group which was with him in a Rak'ah, and then remained standing while they finished their prayer by themselves. They then departed and lined up facing the enemy, and the other party came. He led them in the remaining Rak'a (of his prayer), after which he remained sitting while they finished their prayer by themselves. He then led them in uttering the Taslim (salutation). [Agreed upon; and this is the wording of Muslim].
This (Hadith) has been reported in al-Ma'rifah of Ibn Mundah: from Salih ibn Khawwat, from his father.
సారాంశం
‘సలాతుల్ ఖౌఫ్’ పలురకాలుగా చేయబడింది. అది ఆయా సమయ సందర్భాలనుబట్టి ఉంటుంది. ఈ హదీసులో పేర్కొనబడిన స్థితి దివ్య ఖుర్ఆన్లో ప్రస్తావించబడిన సంఘటనే. అంటే ఇమామ్ ప్రతి జట్టుకూ ఒక్కో రకత్ చొప్పున చేయించగా మిగిలిన ఒక రకత్ను సహాబీలు తమ తరఫున నెరవేర్చుకున్నారు. ఆ విధంగా రెండు గ్రూపులకు కూడా జమాఅత్ (సామూహిక నమాజ్) లభించింది. మొదటి బృందం తమ తరఫున సలాం చేసుకోగా, రెండవ బృందం దైవప్రవక్త ﷺ సారథ్యంలో సలాం చేసింది.
ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ షాఫయి, ఇమామ్ అహ్మద్ మరియు అధిక సంఖ్యాక ధర్మవేత్తల దృష్టిలో – భయానక స్థితిలో – సలాతుల్ ఖౌఫ్ను ప్రయాణంలో వున్నా లేకపోయినా కూడా చేయవచ్చు. ఇమామ్ మాలిక్ మాత్రం ‘సలాతుల్ ఖౌఫ్’ ప్రయాణావస్థలో ఉన్నప్పుడే చేయాలని షరతు పెట్టారు.
హదీసు ఉల్లేఖకులు
(1) సాలిహ్ బిన్ ఖవ్వాత్ : పూర్తి పరంపర ఇలా వుంది – సాలిహ్ బిన్ ఖవ్వాత్ బిన్ జుబైర్ బిన్ నూమాన్ అన్సారీ మదనీ. ప్రఖ్యాత తాబయీన్లలో ఒకరు. అనేకమంది ప్రవక్త సహచరుల నోట ఈయన హదీసులు విన్నారు. ఈ హదీసును ఈయన హజ్రత్ సహ్ల్ బిన్ హస్మ (రదియల్లాహు అన్హు) గారి ద్వారా విన్నారు లేదా తన తండ్రి (ఖవ్వాత్ – రదియల్లాహు అన్హు) ద్వారా విన్నారు. హదీసు చివరిలో కూడా ఈ విషయం చెప్పబడింది.
(2) ఖవ్వాత్ (రదియల్లాహు అన్హు) : ప్రముఖ సహాబీ. ఉహుద్ సంగ్రామంలో తొలిసారిగా పాల్గొన్నారు. వేరొక ఉల్లేఖనం ప్రకారం బద్ర్ యుద్ధంలో తొలిసారిగా పాల్గొన్నారు. హిజ్రీ 40లో మదీనాలో మరణించారని, హిజ్రీ 40 తరువాత మరణించారని రెండు వేర్వేరు అభిప్రాయాలున్నాయి. అప్పటికి ఈయన వయస్సు 70 లేక 71.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.13 భయస్థితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)|హదీసు 379
హదీసు 380
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: { غَزَوْتُ مَعَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -قِبَلَ نَجْدٍ, فَوَازَيْنَا اَلْعَدُوَّ, فَصَافَفْنَاهُمْ, فَقَامَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -فَصَلَّى بِنَا, فَقَامَتْ طَائِفَةٌ مَعَهُ, وَأَقْبَلَتْ طَائِفَةٌ عَلَى اَلْعَدُوِّ, وَرَكَعَ بِمَنْ مَعَهُ, وَسَجَدَ سَجْدَتَيْنِ, ثُمَّ انْصَرَفُوا مَكَانَ اَلطَّائِفَةِ الَّتِي لَمْ تُصَلِّ فَجَاءُوا, فَرَكَعَ بِهِمْ رَكْعَةً, وَسَجَدَ سَجْدَتَيْنِ, ثُمَّ سَلَّمَ, فَقَامَ كُلُّ وَاحِدٍ مِنْهُمْ, فَرَكَعَ لِنَفْسِهِ رَكْعَةً, وَسَجَدَ سَجْدَتَيْنِ } مُتَّفَقٌ عَلَيْهِ، وَاللَّفْظُ لِلْبُخَارِيِّ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: నేను దైవప్రవక్త ﷺతో కలిసి ‘నజ్ద్’ వైపునకు ఏదో యుద్ధానికి వెళ్ళాను. మేము శత్రు సేనకు ఎదురుగా నిలబడి ఉన్నాము. ఆ సమయంలో దైవప్రవక్త ﷺ నిలబడి మాకు నమాజ్ చేయించారు. ఒక జట్టు ఆయన ﷺ వెనుక నమాజ్ చేయడానికై నిలబడింది. మరో జట్టు శత్రు సేనకు దీటుగా పంక్తులు తీరి నిలబడింది. దైవప్రవక్త ﷺతో కలిసి నమాజ్ చేస్తున్న (తొలి)జట్టు ఒక రుకూ, రెండు సజ్దాలు చేసి తిరిగివచ్చింది. అప్పటి వరకూ నమాజ్‌లో పాల్గొనని (రెండవ) జట్టు సభ్యులు వచ్చిచేరగా ఆయన ﷺ వారికి కూడా ఒక రుకూ, రెండు సజ్దాలు చేయించారు. తరువాత ఆయన ﷺ సలాం చేశారు. అయితే రెండు బృందాల వారు కూడా (తరువాత) వేర్వేరుగా తమ (అసంపూర్ణ) నమాజును పరిపూర్తి గావించుకున్నారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం బుఖారీ లోనివి)
English
Narrated Ibn 'Umar (RA): I went on an expedition with Allah's Messenger (ﷺ) to Najd, and when we came in front of the enemy we lined up in ranks facing them. Allah's Messenger (ﷺ) then stood up and led us in prayer. One group stood up with him while the other faced the enemy. He prayed a Rak'ah with those who were with him and made two prostrations. Then, they changed places with those who had not prayed. When they came Allah's Messenger (ﷺ) prayed a Rak'ah with them and made two prostrations. He then uttered the Taslim (salutation) and each of them got up and prayed a Rak'ah alone and made two prostrations. [Agreed upon, and the wording if from al-Bukhari].
సారాంశం
ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం ‘సలాతుల్ ఖౌఫ్’కు సంబంధించి ఆరు లేక ఏడు సహీహ్ హదీసులు వున్నాయి. ఈ హదీసుల కనుగుణంగా ఎలా చేసినా ఈ నమాజ్ నెరవేరుతుంది. దీనికి ఒక పద్ధతి అంటూ ప్రత్యేకంగా నిర్ధారితం కాలేదు. పరిస్థితుల స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని – తదనుగుణంగా – ఈ నమాజ్‌ను నెరవేర్చవచ్చు. ఈ నమాజ్ దైవప్రవక్త ﷺ నెలకొల్పినదన్న విషయంలో కూడా భేదాభిప్రాయం లేదు.
అల్లామా షౌకానీ (రహిమహుల్లాహ్) కూడా ఈ నమాజుకు సంబంధించి ఆరు పద్ధతులను విశదీకరించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.13 భయస్థితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)|హదీసు 380
హదీసు 381
وَعَنْ جَابِرٍ قَالَ: { شَهِدْتُ مَعَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -صَلَاةَ اَلْخَوْفِ، فَصَفَّنَا صَفَّيْنِ: صَفٌّ خَلْفَ رَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -وَالْعَدُوُّ بَيْنَنَا وَبَيْنَ اَلْقِبْلَةِ, فَكَبَّرَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -وَكَبَّرْنَا جَمِيعًا, ثُمَّ رَكَعَ وَرَكَعْنَا جَمِيعًا, ثُمَّ رَفَعَ رَأْسَهُ مِنَ اَلرُّكُوعِ وَرَفَعْنَا جَمِيعًا, ثُمَّ اِنْحَدَرَ بِالسُّجُودِ وَالصَّفُّ اَلَّذِي يَلِيهِ, وَقَامَ اَلصَّفُّ اَلْمُؤَخَّرُ فِي نَحْرِ اَلْعَدُوِّ, فَلَمَّا قَضَى اَلسُّجُودَ, قَامَ اَلصَّفُّ اَلَّذِي يَلِيهِ... } فَذَكَرَ اَلْحَدِيثَ. وَفِي رِوَايَةٍ: { ثُمَّ سَجَدَ وَسَجَدَ مَعَهُ اَلصَّفُّ اَلْأَوَّلُ, فَلَمَّا قَامُوا سَجَدَ اَلصَّفُّ اَلثَّانِي, ثُمَّ تَأَخَّرَ اَلصَّفُّ اَلْأَوَّلُ وَتَقَدَّمَ اَلصَّفُّ اَلثَّانِي... } وَذَكَرَ مِثْلَهُ. وَفِي آخِرِهِ: { ثُمَّ سَلَّمَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -وَسَلَّمْنَا جَمِيعًا } رَوَاهُ مُسْلِمٌ. وَلِأَبِي دَاوُدَ: عَنْ أَبِي عَيَّاشٍ الزُّرَقِيِّ مِثْلُهُ, وَزَادَ: { أَنَّهَا كَانَتْ بِعُسْفَانَ }. وَلِلنَّسَائِيِّ مِنْ وَجْهٍ آخَرَ عَنْ جَابِرٍ { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -صَلَّى بِطَائِفَةٍ مِنْ أَصْحَابِهِ رَكْعَتَيْنِ, ثُمَّ سَلَّمَ, ثُمَّ صَلَّى بِآخَرِينَ أَيْضًا رَكْعَتَيْنِ, ثُمَّ سَلَّمَ }. وَمِثْلُهُ لِأَبِي دَاوُدَ, عَنْ أَبِي بَكْرَةَ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺ తో కలిసి ‘నమాజె ఖౌఫ్’ చేశాను. మేము రెండు పంక్తులు చేశాము. ఒక పంక్తి దైవప్రవక్త ﷺ వెనుక నిలబడింది. ఆ సమయంలో శత్రుసైన్యం మాకు – ఖిబ్లా దిశకు మధ్యన ఉంది. దైవప్రవక్త ﷺ అల్లాహు అక్బర్ అని పలుకగా మేమంతా అల్లాహు అక్బర్ అన్నాము. ఆయన రుకూ చేయగా మేమందరం రుకూ చేశాము. మరి ఆయన ﷺ రుకూ నుండి తలపైకెత్తగా మేమంతా తలలు పైకెత్తాము. ఆయన ﷺ సజ్దాలోకి వెళ్ళగా మొదటి పంక్తిలోని వారంతా సజ్దాలోకి వెళ్ళారు. అయితే రెండవ పంక్తిలోని వారు మాత్రం – శత్రువును ఎదుర్కొనడానికి – నిలబడే వున్నారు. ఆయన ﷺ సజ్దాలు చేసిన పిదప ఆయన సమీప పంక్తిలో నున్నవారు నిలబడి పోయారు … ఉల్లేఖకుడు ఈ విధంగా పూర్తి హదీసు వివరించారు….
ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది – ఆయన ﷺ సజ్దా చేయగా ఆయన ﷺతో పాటు మొదటి పంక్తివారు కూడా సజ్దా చేశారు. మరి వీరంతా లేచి నిలబడగా, రెండవ పంక్తిలోనివారు సజ్దాలోకి వెళ్ళారు. తరువాత మొదటి పంక్తి వెనక్కి వెళ్ళిపోగా, వెనుక పంక్తి ముందుకు వచ్చింది. మునుపటి వలెనే ఇది దైవధ్యానం చేసింది. చివర్లో దైవప్రవక్త ﷺ సలాం చేయగా మేమంతా సలాం చేశాము. (ముస్లిం)
అబూ అయ్యాష్ జురఖీ నుండి అబూదావూద్ నకలు చేసిన దానిలో – “అది ఉస్ఫాన్ అనే స్థలంలో నెరవేర్చబడింది” అన్న వాక్యం అదనంగా ఉంది.
నసాయి హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) నుండి వేరొక ఆధారంతో ఇలా ఉల్లేఖించారు- దైవప్రవక్త ﷺ తన సహచరులలోని ఒక వర్గానికి రెండు రకతులు చేయించి సలాం చేశారు. తరువాత రెండవ వర్గానికి కూడా ఇదే విధంగా రెండు రకతులు చేయించి సలాం చేశారు. అబూదావూద్లో హజ్రత్ అబూబక్రా (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఇలాంటి ఉల్లేఖనమే ఒకటుంది.
English
Narrated Jabir (RA): "I witnessed Salat-al-Khauf with Allah's Messenger (ﷺ) and we lined up in two rows behind him with the enemy between us and the Qiblah. The Prophet (ﷺ) uttered the Takbir and we all uttered it; then he bowed and we all bowed; then he raised his head after bowing and we all raised ours; then he and the row immediately behind him went down in prostration while the rear row stood facing the enemy. Then, when Allah's Messenger (ﷺ) finished the prostration and the row immediately behind him stood up…" then he mentioned the Hadith. And in a narration "Then he prostrated and the first row prostrated with him. So when they stood, the second row prostrated then the first row went back and the second row came forward…" then he mentioned a similar to it. And at the end of it "Then the Prophet (ﷺ) uttered the Taslim (salutation) and we all did so." [Reported by Muslim].
Abu Dawud has reported from Abu 'Aiyash az-Zuraqi similarly, and he added: "it was in Usfan."
an-Nasa'i reported this narration – through another chain of narrators – from Jabir (RA): The Prophet (ﷺ) led a group of his Companions in two Rak'at after which he uttered the Taslim (salutation). Then he led another group in two Rak'at after which he uttered the Taslim (salutation)."
Abu Dawud has reported similarly from Abu Bakrah (RA).
సారాంశం
ఈ హదీసు ద్వారా నమాజె ఖౌఫ్కు సంబంధించిన మరో పద్ధతి ముందుకు వచ్చింది. నమాజె ఖౌఫ్కు సంబంధించిన పరిస్థితులు, ఉల్లేఖనాలు కూడా అనేకం ఉండటం వల్ల దాన్ని నెరవేర్చిన తీరులో కూడా వైవిధ్యం కనబడుతోంది. నసాయిలో హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ రెండు వేర్వేరు బృందాలకు రెండేసి రకతుల నమాజు చేయించారు. ఆ విధంగా దైవప్రవక్త ﷺకు 4 రకతులు అయ్యాయి. అంటే ఆయన ﷺ మొదటి రెండు రకతులు ‘ఫర్జ్’ గా ఆచరించారు. మిగతా రెండు రకతులు ‘నఫిల్’ రూపంలో చేశారు. ఎందుకంటే ఒకే నమాజ్ రెండుసార్లు ఫర్జ్గా పరిగణించబడదు. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే నఫిల్ నమాజు చేసే ఇమామ్ వెనుక ముఖ్తదీలు ఫర్జ్ నమాజును చేయవచ్చు.
హదీసు ఉల్లేఖకులు
అబూ అయ్యాష్ జురఖీ (రదియల్లాహు అన్హు) అసలు పేరు జైద్ బిన్ సాబిత్. అన్సారీగా, జురఖీగా ప్రసిద్ధి చెందారు. ఈ హదీసును ఒక ముస్లిం సమూహం ఈయనకు తెలియజేసింది. ఈయన హిజ్రీ 40 తరువాత మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.13 భయస్థితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)|హదీసు 381
హదీసు 382
وَعَنْ حُذَيْفَةَ: { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -صَلَّى صَلَاةَ اَلْخَوْفِ بِهَؤُلَاءِ رَكْعَةً, وَهَؤُلَاءِ رَكْعَةً, وَلَمْ يَقْضُوا } رَوَاهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ ابْنُ حِبَّانَ. وَمِثْلُهُ عِنْدَ ابْنِ خُزَيْمَةَ: عَنِ ابْنِ عَبَّاسٍ.
హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మా బృందానికీ ఒకే రకత్ (నమాజె ఖౌఫ్) చేయించారు. వేరొక బృందానికి కూడా ఒకే రకత్ను చేయించారు. మరి వారు నమాజ్‌ను పూర్తి చేయలేదు. (అహ్మద్, అబూదావూద్, నసాయి దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ఇబ్నె ఖుజైమ కూడా ఇబ్నె అబ్బాస్ సౌజన్యంతో ఈ విధంగానే హదీసును నకలు చేశారు)
English
Narrated Hudhaifah (RA): The Prophet (ﷺ) performed Salatal-Khauf leading these (Companions) in one Rak'ah and those (other Companions) in one Rak'ah, and they did not make up the second Rak'ah. [Reported by Ahmad, Abu Dawud and an-Nasa'i. Ibn Hibban graded it Sahih (authentic)].
Ibn Khuzaimah has reported it similarly from Ibn 'Abbas (RA).
సారాంశం
‘నమాజె ఖౌఫ్’ కనీసం ఒక రకత్ కూడా చేయవచ్చునన్న దానికి ఈ హదీసు ఒక ఆధారం వంటిది. ప్రవక్త ﷺ అనుయాయులలో ఒక వర్గం దీన్ని అనుసరిస్తున్నది. తాబయీన్లలో హసన్ బస్రీ (రహిమహుల్లాహ్), జహాక్ (రహిమహుల్లాహ్), ఇబ్నె రాహ్వే (రహిమహుల్లాహ్), అతా (రహిమహుల్లాహ్), తావుస్ (రహిమహుల్లాహ్), హకమ్ బిన్ ఉతైబ (రహిమహుల్లాహ్), ఖతాదా (రహిమహుల్లాహ్) తదితరులు ఇంకా ప్రవక్త ప్రియ సహచరులలో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా), అబూ హురైర (రదియల్లాహు అన్హు), అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) లు దీనికి సుముఖంగా ఉన్నారు. భీతావహస్థితిలో కేవలం సైగతో ఒక రకత్ చేసినా సరిపోతుందని వీరి అభిప్రాయం. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారి హదీసు ఈ దృక్పథాన్ని సమర్థిస్తోంది. ముస్లిం, తిర్మిజీలతో సహా మరో ఐదుగురు ఉల్లేఖించిన ఈ హదీసులో ఇలా వుంది : “అల్లాహ్ తన ప్రవక్త ﷺ నోట సాధారణ స్థితిలో 4 రకతులను, ప్రయాణావస్థలో 2 రకతులను, భయానకస్థితిలో ఒక రకత్ను విధి (ఫర్జ్) గావించాడు.”
అయితే అధిక సంఖ్యాక ధర్మవేత్తలతోపాటు నలుగురు ఇమాములు కూడా రకతుల సంఖ్యలో భయానక స్థితి ప్రభావం అంతగా లేదని వ్యాఖ్యానించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.13 భయస్థితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)|హదీసు 382
హదీసు 383
وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ صَلَاةُ اَلْخَوْفِ رَكْعَةٌ عَلَى أَيِّ وَجْهٍ كَانَ } رَوَاهُ اَلْبَزَّارُ بِإِسْنَادٍ ضَعِيفٍ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “నమాజె ఖౌఫ్ను ఏ విధంగా నెరవేర్చినాసరే అది ఒక రకత్ మాత్రమే.” (బజ్జార్ దీనిని బలహీన ఆధారంతో ఉల్లేఖించారు)
English
Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "The prayer in time of danger is one Rak'ah, in whatever manner it is (performed)." [al-Bazzar reported it through a weak chain of narrators].
సారాంశం
ఈ హదీసు ఆధారంగా కొంతమంది ఇమాములు, ముఖ్తదీలు కూడా నమాజె ఖౌఫ్ ఒకే రకత్ చేయాలని భావిస్తున్నారు. సుఫ్యాన్ కూడా దీనికి సుముఖంగా ఉన్నారు. ‘ఏ విధంగా నెరవేర్చినాసరే’ అన్న వచనంలో ఖిబ్లా వైపునకు అభిముఖమైనా, కాకపోయినాసరే నమాజ్ నెరవేరుతుంది అన్న భావం ఇమిడి ఉంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.13 భయస్థితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)|హదీసు 383
హదీసు 384
وَعَنْهُ مَرْفُوعًا: { لَيْسَ فِي صَلَاةِ اَلْخَوْفِ سَهْوٌ } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيُّ بِإِسْنَادٍ ضَعِيفٍ.
దైవప్రవక్త ﷺ చెప్పినట్లుగా హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు – “నమాజె ఖౌఫ్లో సహూ సజ్దా లేదు.” (దారె ఖుత్నీ దీనిని బలహీన ఆధారాలతో వెలికి తీశారు)
English
Narrated [Ibn 'Umar (RA)]: (This Hadith is) attributed to the Prophet (ﷺ) "There is no Sahw (prostration for forgetfulness) in the prayer in time of danger." [ad-Daraqutni reported it through a weak chain of narrators].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.13 భయస్థితిలో నమాజ్ (సలాతుల్ ఖౌఫ్)|హదీసు 384
You must be logged in to post a comment.