హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 2.12 జుమా నమాజ్

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 2. నమాజ్ పుస్తకం, 12 వ అధ్యాయం: జుమా నమాజ్. ఈ అధ్యాయంలో 25 హదీసులు (హదీసు 354 – 378) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

2.12 జుమా నమాజ్

↑ విషయ సూచిక

باب صلاة الجمعة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

354

హదీసు 354

عَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ, وَأَبِي هُرَيْرَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمْ, { أَنَّهُمَا سَمِعَا رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ ‏-عَلَى أَعْوَادِ مِنْبَرِهِ‏- "لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ اَلْجُمُعَاتِ, أَوْ لَيَخْتِمَنَّ اَللَّهُ عَلَى قُلُوبِهِمْ, ثُمَّ لَيَكُونُنَّ مِنَ اَلْغَافِلِينَ } رَوَاهُ مُسْلِمٌ..

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) మరియు హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు)ల కథనం : దైవప్రవక్త ﷺ మస్జిద్ వేదిక మెట్లపై (నుంచి) చెబుతుండగా తాము విన్నామని తెలిపారు – “ప్రజలు జుమా (శుక్రవారం) నమాజు విడనాడటాన్ని మానుకోవాలి. లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేస్తాడు. మరి వారు నిశ్చయంగా విస్మరణకు గురైన వారిలో చేరిపోతారు.” (ముస్లిం)

English

Narrated 'Abdullah bin 'Umar and Abu Hurairah (RA): They heard Allah's Messenger (ﷺ) say (while standing) upon the planks of his pulpit: "People must cease to neglect the Friday prayers, or else Allah will seal their hearts and then they will be among the unmindful." [Reported by Muslim].

సారాంశం

‘జుమ’ అంటేనే అసలు ఒకచోట సమావేశమవటం అని అర్థం. అజ్ఞానకాలంలో అరేబియాలో దీనిని ‘ఉరూబ’గా వ్యవహరించేవారు. ఇస్లాం దీనికి ‘జుమ’ అని నామకరణం చేసింది. ముస్లింలు ఒక ప్రత్యేక దినాన ప్రత్యేక వేళలో సమావేశమై, అందరూ కలసి దైవారాధన చేసుకోవాలని, ఒండొకరి మంచీచెబ్బరలను గురించి తెలుసుకోవాలని, సామూహిక నిర్ణయాలు గైకొనాలని ఇస్లాం అభిలషిస్తోంది.

ఈ హదీసు ద్వారా శుక్రవారం నమాజు యొక్క ప్రాముఖ్యత స్పష్టమవుతోంది. షరీయత్పరమైన తగు కారణమేదీ లేకుండా దీనిని విడనాడినవారి హృదయాలపై సీలుపడిపోతుందని, దైవధర్మంపట్ల వారిలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి పొడసూపుతుందని, ఎట్టకేలకు వారు కపటులుగా, మిథ్యావాదులుగా మారిపోయే అవకాశం ఉందనీ హదీసు భావం. కాబట్టి శుక్రవారం నమాజును సాధారణ నమాజుగా భావించి దానిపట్ల అశ్రద్ధ, ఉపేక్ష కనబరచరాదు. ఒకవేళ అలా చేస్తే అది దౌర్భాగ్యానికి, పరాభవానికి తొలిమెట్టు అవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 354

355

హదీసు 355

وَعَنْ سَلَمَةَ بْنِ اَلْأَكْوَعِ ‏- رضى الله عنه ‏- قَالَ: { كُنَّا نُصَلِّي مَعَ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-اَلْجُمُعَةَ, ثُمَّ نَنْصَرِفُ وَلَيْسَ لِلْحِيطَانِ ظِلٌّ نَسْتَظِلُّ بِهِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيّ ِ. وَفِي لَفْظٍ لِمُسْلِمٍ: { كُنَّا نَجْمَعُ مَعَهُ إِذَا زَالَتِ اَلشَّمْسُ, ثُمَّ نَرْجِعُ, نَتَتَبَّعُ اَلْفَيْءَ }.

హజ్రత్ సలమ బిన్ అక్వ (రదియల్లాహు అన్హు) కథనం : మేము దైవప్రవక్త ﷺతో కలసి జుమా నమాజు చేసేవారము. జుమా నమాజు ముగిసిన తరువాత మేము ఇళ్ళకు వెళ్ళేటప్పుడు గోడ ప్రక్కన నీడలో విశ్రాంతి తీసుకుందామంటే గోడల నీడ క్రింద కనబడేదికాదు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు బుఖారీలోనివి)

“ఆయన ﷺతో కలసి జుమా నమాజు చేసేవారం. పొద్దు వాలగానే వాపసు అయ్యేవారం” అని ముస్లింలో ఉంది.

English

Narrated Salmah bin Al-Akwa' (RA): We used to offer the Friday prayer with Allah's Messenger (RA) and return (to our homes) while the walls had no shade for us to go under (at that time). [Agreed upon. This is the wording of al-Bukhari].

And in a narration of Muslim: "We used to offer the Friday prayers with him [Allah's Messenger (ﷺ)] when the sun passed the meridian. We would then return and try to find the afternoon shadow.

సారాంశం

దైవప్రవక్త ﷺ కాలంలో శుక్రవారం నమాజు చాలా తొందరగా చేసేవారన్న దానికి ఈ హదీసు మచ్చుతునక. అయితే పొద్దువాలక మునుపు మాత్రం నమాజ్ అయ్యేది కాదన్నది కూడా గమనార్హమే. దాదాపు శుక్రవారం నమాజ్ కూడా జుహ్ర్ వేళలోనే అవుతుంది. విద్వాంసులలో అత్యధికులు ఈ సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ఇమామ్ అహ్మద్, ఇమామ్ రాహ్వే, ఇమామ్ మాలిక్ ప్రభృతులు మాత్రం పొద్దువాలక ముందు కూడా జుమా నమాజ్ చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఆధునిక కాలంలోనయితే కొన్నిచోట్ల ప్రజలు జుహ్ర్ నమాజ్ వేళకన్నా ఆలస్యంగా జుమా నమాజ్ చేస్తున్నారు. ఇది దైవప్రవక్త ﷺ విధానానికి వ్యతిరేకం. మస్జిద్ ఇమాములు, వక్తలు దీని గురించి సీరియస్గా ఆలోచించాలి.

హదీసు ఉల్లేఖకులు

సలమ బిన్ అక్వ (రదియల్లాహు అన్హు). మరోపేరు అబూ ముస్లిం. దైవప్రవక్త ﷺ ప్రియ సహచరులలో గొప్ప యోధునిగా భావించబడేవారు. పరుగులో గుఱ్ఱంకన్నా వేగం అని ప్రతీతి. దాతృ స్వభావం గలవారు. విద్యావంతులు. మూర్తీభవించిన మృదుత్వం. మదీనాలో హిజ్రీ 74లో కన్నుమూశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 355

356

హదీసు 356

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { مَا كُنَّا نَقِيلُ وَلَا نَتَغَدَّى إِلَّا بَعْدَ اَلْجُمُعَةِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ.. وَفِي رِوَايَةٍ: { فِي عَهْدِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-.‏ }.

హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “(శుక్రవారం నాడు) మేము మధ్యాహ్న భోజనం, మధ్యాహ్న విశ్రాంతి జుమా నమాజ్ అనంతరమే చేసేవారము.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)

“దైవప్రవక్త ﷺ గారి కాలంలో ఇలా జరిగేది” అని వేరొక ఉల్లేఖనంలో వుంది.

English

Narrated Sahl bin Sa'd (RA): We would not have a siesta (mid-day nap) nor lunch till after the Friday prayer. [Agreed upon; and the wording is Muslim's].

Another narration has: "during the life time of Allah's Messenger (ﷺ).

సారాంశం

ఈ హదీసు ద్వారా కూడా బోధపడేదేమంటే, దైవప్రవక్త ﷺ కాలంలో జుమా నమాజ్ తొందరగా ముగిసేది. ప్రవక్త సహచరులు నమాజ్ అనంతరం ఇళ్ళకు వెళ్ళి భోజనం చేసి విశ్రమించేవారు.

హదీసు ఉల్లేఖకులు

సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) అసలు పేరు. అబుల్ అబ్బాస్ మారుపేరు. ఖజ్రజీ సైదీ అన్సారీ. ఇస్లాంకు పూర్వం ఈయన పేరు హజన్. ఇస్లాం స్వీకరణ తరువాత దైవప్రవక్త ﷺ ఈయన పేరు మార్చారు. మనిషి పేరులో దోషం ఉంటే దాన్ని మార్చివేయాలని ఈ హదీసు చెబుతోంది. దైవప్రవక్త ﷺ మరణించే సమయానికి ఈయన వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే. హిజ్రీ 91లో మదీనాలో మరణించారీయన. మదీనాలో అందరికన్నా ఆఖరిలో మరణించిన సహాబీ ఈయనే. ఈయనగారి చేత సుమారు 100 హదీసులు ఉల్లేఖించబడ్డాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 356

357

హదీసు 357

وَعَنْ جَابِرٍ { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يَخْطُبُ قَائِمًا, فَجَاءَتْ عِيرٌ مِنَ اَلشَّامِ, فَانْفَتَلَ اَلنَّاسُ إِلَيْهَا, حَتَّى لَمْ يَبْقَ إِلَّا اثْنَا عَشَرَ رَجُلًا } رَوَاهُ مُسْلِمٌ..

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ జుమా ప్రసంగం నిలబడి ఇస్తుండగా సిరియా నుండి ఒక వర్తక బిడారు వచ్చింది. ప్రజలు ఆ బిడారు వైపునకు ఎగబడ్డారు. కేవలం 12 మంది మాత్రమే మస్జిద్లో వుండిపోయారు. (ముస్లిం)

English

Narrated Jabir (RA): Allah's Messenger (ﷺ) was standing while delivering the Khutbah (religious talk, sermon) on Friday when a caravan from Syria arrived. The people flocked towards it till no one was left [with the Prophet (ﷺ)] except twelve men. [Reported by Muslim].

సారాంశం

దైవప్రవక్త ﷺ నిలబడి జుమా ప్రసంగం ఇచ్చేవారని ఈ హదీసు ద్వారా స్పష్టమయింది. సాంప్రదాయిక పద్ధతి ఇదే. జుమా ప్రసంగం జుమా నమాజ్కు ముందే అవుతుంది. 12 మంది ఉన్నప్పటికీ జుమా ప్రసంగం ఇవ్వవచ్చునని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. షాఫయీలు 40 మంది ఉంటేనే జుమా ప్రసంగం ఇవ్వాలన్నారు. ఇది సరైనది కాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 357

358

హదీసు 358

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ أَدْرَكَ رَكْعَةً مِنْ صَلَاةِ اَلْجُمُعَةِ وَغَيْرِهَا فَلْيُضِفْ إِلَيْهَا أُخْرَى, وَقَدْ تَمَّتْ صَلَاتُهُ } رَوَاهُ النَّسَائِيُّ, وَابْنُ مَاجَهْ, وَاَلدَّارَقُطْنِيُّ, وَاللَّفْظُ لَهُ, وَإِسْنَادُهُ صَحِيحٌ, لَكِنْ قَوَّى أَبُو حَاتِمٍ إِرْسَالَهُ..

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ప్రబోధనం – “ఎవరయితే జుమా నమాజు మరియు ఇతర నమాజులలో ఏదైనా ఒక రకతును (జమాఅత్లో) పొందారో, వారు మిగిలిన దానిని దాంతో కలుపు కోవాలి. (అలా కలుపుకుంటే)చాలు, అతని నమాజ్ పూర్తయినట్లే.” (నసాయి, ఇబ్నె మాజ, దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు మాత్రం దారె ఖుత్నీకి చెందినవి. దీని ప్రమాణం సరైనది. అయితే అబూ హాతింగారు దీనిని ‘ముర్సల్’ అని గట్టిగా భావిస్తున్నారు)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "Whoever is in time for a Rak'ah of the Friday prayer, or any other prayer, should add another (Rak'ah) to it and his prayer will then be complete." [an-Nasa'i, Ibn Majah and ad-Daraqutni reported it; the wording is from ad-Daraqutni. Its chain of narrators is Sahih (authentic), but Abu Hatim strengthened the view that it is Mursal (missing link after the Tabi'i)].

సారాంశం

ఈ హదీసు ద్వారా స్పష్టంగా బోధపడేదేమంటే జుమా నమాజులో ఒక రకత్ను మాత్రమే పొందినవాడు, దాంతోపాటు రెండవ రకత్ను కూడా కలుపుకోవాలి. అంటే అతను సలాం చేయకుండా నిలబడి రెండవ రకత్ (నమాజ్) అప్పటికప్పుడే చేయాలి. ఆఖరిలో వచ్చి ఒక రకత్ను పొందినవాడు జుమా ప్రసంగాన్ని కోల్పోయినట్లే. కాని అతని జుమా మాత్రం నెరవేరుతుంది. ఇమామ్ షాఫయి, ఇమామ్ అబూ హనీఫాల అభిప్రాయం కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 358

359

హదీసు 359

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يَخْطُبُ قَائِمًا, ثُمَّ يَجْلِسُ, ثُمَّ يَقُومُ فَيَخْطُبُ قَائِمًا, فَمَنْ أَنْبَأَك َ أَنَّهُ كَانَ يَخْطُبُ جَالِسًا, فَقَدْ كَذَبَ } أَخْرَجَهُ مُسْلِم ٌ.

హజ్రత్ జాబిర్ బిన్ సముర (రదియల్లాహు అన్హుమా) కథనం : “దైవప్రవక్త ﷺ నిలబడి శుక్రవారం ప్రసంగం చేసేవారు. మధ్యలో కొద్దిసేపు కూర్చునేవారు. మళ్ళీ నిలబడి ఉపన్యసించేవారు. ఆయన ﷺ కూర్చొని ఉపన్యసించేవారని ఎవరయినా మీకు సమాచారమందిస్తే అతడు అబద్ధం చెప్పాడు (అని భావించండి).” (ముస్లిం)

English

Narrated Jabir bin Samurah (RA): The Prophet (ﷺ) used to deliver the Khutbah (religious talk, sermon) while standing. He (ﷺ) would then sit down and then stand up and deliver the Khutbah in a standing posture. So, whoever informs you that he [the Prophet (ﷺ)] delivered the Khutbah (religious talk, sermon) while sitting has definitely told a lie. [Reported by Muslim].

సారాంశం

జుమాలో రెండు ప్రసంగాలున్నాయి. రెండు ప్రసంగాలకు మధ్య కొద్దిసేపు విరామం అవసరం. ఆ విరామ సమయంలో కూర్చోవటం సంప్రదాయం (సున్నత్). రెండు ప్రసంగాలను కూడా ఆయన ﷺ నిలబడే చేసేవారు. షరీయత్ పరమయిన కారణమేదీ లేకుండా వీటికి విరుద్ధంగా చేస్తే – అది బిద్అత్ అవుతుంది.

ఇబ్నె అబీ షైబ ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ, అబూబకర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు), అలీ (రదియల్లాహు అన్హు) – వీళ్ళంతా నిలబడే జుమా ప్రసంగమిచ్చేవారు. ఆయన ﷺ వేదికనెక్కి, ముఖ్తదీల వైపునకు తిరిగి అస్సలాము అలైకుమ్ అని అనేవారని కొన్ని హదీసుల ద్వారా తెలుస్తున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 359

360

హదీసు 360

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-إِذَا خَطَبَ, احْمَرَّتْ عَيْنَاهُ, وَعَلَا صَوْتُهُ, وَاشْتَدَّ غَضَبُهُ, حَتَّى كَأَنَّهُ مُنْذِرُ جَيْشٍ يَقُولُ: صَبَّحَكُمْ وَمَسَّاكُمْ, وَيَقُولُ: "أَمَّا بَعْدُ, فَإِنَّ خَيْرَ اَلْحَدِيثِ كِتَابُ اَللَّهِ, وَخَيْرَ اَلْهَدْيِ هَدْي ُ مُحَمَّدٍ, وَشَرَّ اَلْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ } رَوَاهُ مُسْلِمٌ.‏ وَفِي رِوَايَةٍ لَهُ كَانَتْ خُطْبَةُ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-يَوْمَ اَلْجُمُعَةِ: { يَحْمَدُ اَللَّهَ وَيُثْنِي عَلَيْهِ, ثُمَّ يَقُولُ عَلَى إِثْرِ ذَلِكَ, وَقَدْ عَلَا صَوْتُهُ } وَفِي رِوَايَةٍ لَهُ: { مَنْ يَهْدِه ِ اَللَّهُ فَلَا مُضِلَّ لَهُ, وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ }. وَلِلنَّسَائِيِّ: { وَكُلَّ ضَلَالَةٍ فِي اَلنَّارِ }.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన కళ్ళు ఎర్రబడిపోయేవి. గొంతు బిగ్గరయ్యేది. ఆవేశం పెరిగేది (ఆ పరిస్థితిని చూసినవారికి) “శత్రుసైన్యం పొద్దున వచ్చిందా? సాయంత్రం వచ్చిందా?” ఆ సైనికదళాన్ని నిలదీస్తున్నారా? అనిపించేది.

(ప్రసంగ సమయంలో) ఆయన ఇలా అనేవారు : “స్తోత్రానంతరం … అన్నిటికన్నా ఉత్తమమయిన వాక్కు దైవ గ్రంథం. ఉత్తమమయిన విధానం ముహమ్మద్ ﷺ విధానం. ఆచరణలన్నింటిలోకీ చెడ్డది కొత్త పోకడ (బిద్అత్). ప్రతి బిద్అత్తో కూడినపని మార్గభ్రష్టతకు, మార్గవిహీనతకు ప్రతీక. (ముస్లిం)

ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది : జుమా రోజున దైవప్రవక్త ﷺ ఉపన్యాసం ఇలా సాగేది – (తొలుత) దైవస్తోత్రం చేసేవారు. తరువాత ప్రసంగించటం మొదలెట్టగానే ఆయన స్వరం పెరిగేది.

ముస్లింలోని మరో ఉల్లేఖనంలో వుంది- “అల్లాహ్ ఎవరికయితే సన్మార్గం చూపాడో వారినెవరూ అపమార్గం పట్టించలేరు. ఆయన ఎవరిని అపమార్గాన వదిలేశాడో వారిని సన్మార్గానికి తీసుకు రాగలవారు కూడా ఎవరూ లేరు”. “ప్రతి అపమార్గం నరకాగ్నిలోకి తీసుకు పోతుంది” అని నసాయిలో ఉంది.

English

Narrated Jabir bin 'Abdullah (RA): Whenever Allah's Messenger (ﷺ) delivered a Khutbah (religious talk), his eyes would become red, his voice rose and his anger would become intensified, as if he (ﷺ) was like one warning an army and saying, "The enemy has made a morning attack on you. The enemy has made an evening attack on you." He (ﷺ) would also say "Amma ba'du, the best of speech is embodied in the Book of Allah, and the best of guidance is the guidance of Muhammad. And the most evil of affairs are their innovations and every innovation is misguidance." [Reported by Muslim].

And in a narration of Muslim: "In the Prophet's Khutbah on Friday: He would praise Allah and extol Him. Then, following that, he would say – and he had raised his voice…"

And in another narration from Muslim: "Whoever Allah guides, no one can lead astray; and whoever Allah leads astray, no one can guide him."

an-Nasa'i has: "Every misguidance is (a cause to enter) the Fire."

సారాంశం

ఇది దైవప్రవక్త ﷺ నోట జాలువారే ప్రసంగం. శుక్రవారం నాడు ఉపన్యాసకుడు ఉపన్యసించేటప్పుడు పరిసరాల ప్రభావం, పరిస్థితుల స్వరూపం అతని మనో మస్తిష్కాలపై చెరగని ముద్రవేసి ఉంటుంది. ఒకవైపు శుభవార్తలు, మరో వైపు అవాంఛనీయ సంఘటనలు అతని మెదడును తొలుస్తూ ఉంటాయి. అనుచర సమాజాన్ని ఈ సంక్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కించేదెలా? అని అతడు తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. తత్కారణంగా అతని ముఖం ఎర్రగా కందిపోతుంది. ప్రేక్షకుల్ని ప్రభావితం చేయడానికి అతని ముఖ కవళికలు ఈ మాత్రం మారవలసిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది.

ప్రసంగంలో తొలుత దైవస్తోత్రం తప్పక చేయాలి. ప్రసంగం వీలైనంత క్లుప్తంగా ఉండాలి. కాని అది ఎంతో సమగ్రంగా ఉండాలి. ప్రసంగం ద్వారా ప్రేక్షకుల్ని ప్రభావితం చేయాలేగాని, వారిని భయభ్రాంతులకు లోను చేయరాదు. నిరాశానిస్పృహల వాతావరణాన్ని సృజించరాదు. భావప్రకటనలో ఎలాంటి మొహమాటానికి, అస్పష్టతకు తావుండరాదు. ప్రసంగం మరీ సుదీర్ఘంగా ఉండకూడదు. క్లుప్తమైన ప్రసంగాలే ప్రజలకు బాగా జ్ఞాపకముంటాయి. అవి వారి మనోఫలకాలపై ముద్ర వేసుకుంటాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 360

361

హదీసు 361

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { إِنَّ طُولَ صَلَاةِ اَلرَّجُلِ, وَقِصَرَ خُطْبَتِهِ مَئِنَّةٌ مِنْ فِقْهِهِ } رَوَاهُ مُسْلِمٌ..

హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “మనిషి నమాజ్ సుదీర్ఘం మరియు ఉపన్యాసం సంక్షిప్తం అయి ఉండటం అతని విజ్ఞతకు ప్రతీక” అని దైవప్రవక్త ﷺ చెబుతుండగా నేను విన్నాను. (ముస్లిం)

English

Narrated 'Ammar bin Yasir (RA): He heard Allah's Messenger (ﷺ) say: "The length of a man's prayer and the shortness of his Khutbah (religious talk) are a sign of his understanding (of the religion)." [Reported by Muslim].

సారాంశం

సంక్షిప్త ప్రసంగం, సుదీర్ఘ నమాజ్ మనిషి బుద్ధి కౌశల్యానికి, విజ్ఞతా వివేచనలకు తార్కాణమని ఈ హదీసులో చెప్పబడింది. సాధారణంగా దైవప్రవక్త ﷺ శుక్రవారంనాడు క్లుప్తంగా ప్రసంగించేవారు. ఈ ప్రసంగాలు చాలా తేలిగ్గా కంఠస్థం కూడా అయ్యేవి. ఈ సంగతి నేటి మన వక్తలకు కనువిప్పు కావాలి. ఎందుకంటే వారి ఉపన్యాస వరద గోదారి దీనికి విరుద్ధంగా పరవళ్ళు తొక్కుతున్నది. వారి ఉపన్యాసాలు సుదీర్ఘంగా ఉంటాయి, కాని నమాజ్ మాత్రం అతి క్లుప్తంగా ఉంటుంది. ఇది సున్నత్కు విరుద్ధం. ఈ ధోరణి సంస్కరించదగినది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 361

362

హదీసు 362

وَعَنْ أُمِّ هِشَامٍ بِنْتِ حَارِثَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { مَا أَخَذْتُ: "ق وَالْقُرْآنِ اَلْمَجِيدِ", إِلَّا عَنْ لِسَانِ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقْرَؤُهَا كُلَّ جُمُعَةٍ عَلَى اَلْمِنْبَرِ إِذَا خَطَبَ اَلنَّاسَ } رَوَاهُ مُسْلِمٌ..

హజ్రత్ ఉమ్మె హిషామ్ బిన్తె హారిస (రదియల్లాహు అన్హా) వివరించారు : “నేను సూరె ‘ఖాఫ్’ను దైవప్రవక్త ﷺనోట వినీ వినీ జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన ﷺ ప్రతి శుక్రవారం వేదికపై నిలబడి – జుమా ప్రసంగంలో -ఈ సూరాను పారాయణం చేసేవారు.” (ముస్లిం)

English

Umm Hisham (RA) daughter of Haritha said: I learnt Surat Qaf (Chapter 50) from no other source than the tongue of Allah's Messenger (ﷺ) who used to recite it every Friday on the pulpit when he delivered the Khutbah (sermon) to the people." [Reported by Muslim].

సారాంశం

జుమా ప్రసంగంలో ప్రేక్షకులకు దివ్య ఖుర్ఆన్లోని వాక్యాలు వీలైనంత అధికంగా వినిపించటం, విడమరచి చెప్పటం ఎంతో అవసరమని ఈ హదీసు తాత్పర్యం. దైవప్రవక్త ﷺ సాధారణంగా జుమా ప్రసంగంలో ఖాఫ్ సూరాను పఠించేవారని కూడా ఈ హదీసు చెబుతోంది. కడకు ఉమ్మె హిషామ్ (రదియల్లాహు అన్హా)కు ప్రసంగం ద్వారానే సూరా పూర్తిగా కంఠస్థం అయిపోయింది. ఈ సూరాలో మరణ ప్రస్తావన ఉంది. ప్రళయదినం గురించి చెప్పబడింది. స్వర్గనరకాల ప్రస్తావన వచ్చింది. అందుకే ఆయన ఈ సూరాను పదే పదే పఠించి ప్రజలలో పరలోక చింతనను పెంపొందించి, తద్వారా వారిని కార్యోన్ముఖుల్ని చేయాలని తలపోసేవారు. జుమా ప్రసంగంలో అనవసర విషయాలు, కాకమ్మ కథలు చోటు చేసుకోరాదు. కవితలు, ఆశయ రహితమయిన మాటలు షరీయత్ స్వభావానికి విరుద్ధమైనవి. కనుక వీటిని జుమా ప్రసంగంలో విడనాడాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 362

363

హదీసు 363

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ تَكَلَّمَ يَوْمَ اَلْجُمُعَةِ وَالْإِمَامُ يَخْطُبُ فَهُوَ كَمَثَلِ اَلْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا, وَاَلَّذِي يَقُولُ لَهُ: أَنْصِتْ, لَيْسَتْ لَهُ جُمُعَةٌ } رَوَاهُ أَحْمَدُ, بِإِسْنَادٍ لَا بَأْسَ بِهِ. وَهُوَ يُفَسِّرُ.‏ حَدِيثَ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- فِي "اَلصَّحِيحَيْنِ" مَرْفُوعًا: { إِذَا قُلْتَ لِصَاحِبِكَ: أَنْصِتْ يَوْمَ اَلْجُمُعَةِ وَالْإِمَامِ يَخْطُبُ, فَقَدْ لَغَوْتَ }.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : “జుమా రోజున ఇమామ్ వేదికనెక్కి ప్రసంగిస్తుండగా ఏ వ్యక్తయితే మాట్లాడతాడో అతడు వీపుపై పుస్తకాలు మోస్తున్న గాడిద లాంటివాడు. అతన్ని ఉద్దేశ్యించి, ‘నిశ్శబ్దంగా ఉండు’ అని చెప్పిన వాని జుమా కూడా వృధా అయిపోయింది.” (దీనిని అహ్మద్ ఉల్లేఖించారు)

ఈ హదీసు ‘సహీహైన్’లో చెప్పబడిన హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) హదీసుకు ‘తఫ్సీలు’ వంటిది. అందులో ఇలా అనబడింది – “ఇమామ్ జుమా ప్రసంగం చేస్తుండగా ‘నిశ్శబ్దంగా ఉండు’ అని నీవు నీ తోడున్న వానికి చెబితే, నీవు కూడా వ్యర్థమయిన మాటనే అన్నావు లేదా నీ జుమాను వృధా చేసుకున్నావు.”

English

Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ) said: "Whoever speaks on Friday while the Imam is giving the Khutbah (religious talk), he is like a donkey which carries books; and he who tells him to be quiet has no Jumu'ah." [Reported by Ahmad with an acceptable chain of narrators].

This Hadith interprets the Marfu' Hadith [attributed to the Prophet (ﷺ)] of Abu Hurairah reported in the Sahihain: On Friday, when the Imam is delivering the Khutbah (religious talk), if you say to your companion to keep quiet, then indeed you have committed a sin (error/something senseless).

సారాంశం

శుక్రవారం ప్రసంగాన్ని ఎంతో నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో వినాలని, ఆ సమయంలో మనిషి ఆలోచనలకు అవరోధం కలిగించే అలజడి, గలాటా ఏదీ జరగరాదని హదీసు బోధిస్తున్నది. ఒకవేళ ఎవరయినా ఆ సమయంలో తెలియక మాట్లాడినా, ఏదైనా వెకిలిచేష్ట చేసినా అతని జోలికి పోవరాదు. ‘నోరు మూసుకో’ అని చెప్పటం కూడా ఒక విధంగా ప్రశాంతతను భగ్నం చేయటమే అవుతుంది. ఆ సమయంలో ప్రేక్షకుల ధ్యాసంతా వక్త చెప్పేమాటలపై ఉండాలి. మనసును పూర్తిగా లగ్నం చేసి వింటేనే అది హృదయకవాటాలను తట్టగలుగుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 363

364

హదీసు 364

وَعَنْ جَابِرٍ قَالَ: { دَخَلَ رَجُلٌ يَوْمَ اَلْجُمُعَةِ, وَالنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-يَخْطُبُ. فَقَالَ: "صَلَّيْتَ?" قَالَ: لَا.‏ قَالَ: "قُمْ فَصَلِّ رَكْعَتَيْنِ" } مُتَّفَقٌ عَلَيْهِ..

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలిపారు : జుమా రోజున ఒక వ్యక్తి మస్జిదులో ప్రవేశించాడు. ఆ సమయంలో దైవప్రవక్త ﷺ ప్రసంగిస్తున్నారు. వచ్చిన వ్యక్తి నుద్దేశ్యించి ఆయన ﷺ, “నమాజ్ చేశావా?” అని దర్యాప్తు చేశారు. ‘లేదు’ అని అన్నాడా వ్యక్తి. “మరయితే లే. రెండు రకతుల నమాజ్ చెయ్యి” అని ఆయన ﷺ చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

English

Narrated Jabir (RA): A man entered the mosque on a Friday when the Prophet (ﷺ) was delivering the Khutbah (religious talk, sermon) and he [the Prophet (ﷺ)] said, "Have you prayed? He replied, "No." He [the Prophet (ﷺ)] said, "Stand and pray two Rak'at." [Agreed upon].

సారాంశం

జుమా ప్రసంగం జరుగుతుండగా రెండు రకతుల నమాజ్ చేయవచ్చునని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. ప్రసంగ కర్త మటుకు అవసరం మేరకు మాట్లాడగలడని, మస్జిద్కు వచ్చే నమాజీలకు రెండు రకతులు నెరవేర్చమని చెప్పగలడని కూడా దీనిద్వారా స్పష్టమవుతున్నది. హనఫీలు ఈ రెండు రకతులకు అనుకూలంగా లేరు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 364

365

హదీసు 365

وَعَنِ ابْنِ عَبَّاسٍ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يَقْرَأُ فِي صَلَاةِ الْجُمُعَةِ سُورَةَ الْجُمُعَةِ, وَالْمُنَافِقِينَ } رَوَاهُ مُسْلِم ٌ. وَلَهُ: عَنِ اَلنُّعْمَانِ بْنِ بَشِيرٍ: { كَانَ يَقْرَأُ فِي اَلْعِيدَيْنِ وَفِي الْجُمُعَةِ: بِـ "سَبِّحِ اسْمَ رَبِّكَ اَلْأَعْلَى", وَ: "هَلْ أَتَاكَ حَدِيثُ اَلْغَاشِيَةِ" }.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “దైవప్రవక్త ﷺ సాధారణంగా శుక్రవారం నాడు నమాజులో సూరయె జుమా, సూరయె మునాఫిఖూన్ పఠించేవారు.” (ముస్లిం)

ముస్లింలోనే నూమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనంలో ఇలా వుంది : “ఆయన ﷺ పండుగ నమాజులలోనూ, శుక్రవారం నమాజులోనూ ‘సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా’, ‘హల్ అతాక హదీసుల్ ఘాషియ’ సూరాలు పారాయణం చేసేవారు.

English

Narrated Ibn 'Abbas (RA): The Prophet (ﷺ) used to recite in Jumu'ah prayer Surat al-Jumu'ah and al-Munafiqun. [Reported by Muslim].

Narrated Nu'man bin Bashir (RA): He [Allah's Messenger (ﷺ)] used to recite in the two 'Eids and in the Friday prayer: "Sabbih isma Rabbikal-A'la (Surat 87)" and "Hal ataka hadithul-ghashiyah (Surat 88)." [Reported by Muslim].

సారాంశం

ఈ హదీసు ద్వారా అర్థమయ్యేదేమిటంటే ఆయన ﷺ కొన్ని ప్రత్యేక నమాజులలో కొన్ని ప్రత్యేక సూరాలు పఠించేవారు. దైవప్రవక్త ﷺను అనుసరించే ఉద్దేశ్యంతో ఆయా నమాజులలో ఆ సూరాలనే మనం కూడా పారాయణం చేయటం ఉత్తమం. ఇతర సూరాలు పఠిస్తే నమాజ్ నెరవేరదని దీని భావం ఎంతమాత్రం కాదు. పైన పేర్కొనబడిన సూరాలు జుమా సందర్భంలో, పండుగ సందర్భాలలో పఠించటంలో ఎన్నో పరమార్థాలు దాగి ఉన్నాయి.

సూరయె జుమాలో జుమా నమాజు వైపునకు రావటం గురించి, దాని మహత్తు గురించి నొక్కి చెప్పబడింది. జుమా నమాజులో నికార్సయిన ముస్లింలతోపాటు, కపటులు, వంచకులు కూడా వస్తారు. వారికి హెచ్చరిక చేసే ఉద్దేశ్యంతో ఆయన ﷺ మునాఫిఖూన్ సూరా పఠించేవారు. అలాగే అల్ ఆలా, అల్ ఘాషియ సూరాలలో ప్రళయదినం గురించి, పరలోక సాఫల్యం గురించి చెప్పబడింది. అందుచేత దైవప్రవక్త ﷺ నమాజీలకు పరలోకాన్ని పదే పదే జ్ఞాపకం చేయదలచి ఈ రెండు సూరాలను పారాయణం చేసేవారు.

జుమా సూరాలో అల్లాహ్ అంతిమ దైవప్రవక్త ﷺ ప్రభవింపజేయబడటంలోని 4 ముఖ్యోద్దేశాలను తెలియజేశాడు. ముస్లిం అనుచర సమాజానికి ముహమ్మద్ ﷺ ప్రవక్త చేసిన మహోపకారాన్ని కూడా గుర్తుచేశాడు. ఆ తర్వాత దైవధ్యానం వైపునకు మరలమని ప్రేరేపించాడు. అలాగే మునాఫిఖూన్ సూరాలో కాపట్యాన్ని ఖండించటంతోపాటు, దానధర్మాలను ప్రోత్సహించటం జరిగింది.

హదీసు ఉల్లేఖకులు

అసలు పేరు నూమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు). మారుపేరు అబూ అబ్దుల్లాహ్. అన్సార్ వర్గానికి చెందినవారు. హిజ్రత్ తరువాత 14వ మాసంలో అన్సార్లో జన్మించిన తొలి శిశువు ఈయనే. సిరియాలో స్థిరపడ్డారు. కూఫాకు గవర్నర్గా నియమితులయ్యారు. ఆ తరువాత ‘హిమ్స్’ గవర్నర్గా కూడా నియమించబడ్డారు. హిజ్రీ 64లో రాహిత్ దినాన ఖాలిద్ బిన్ ఖలి అల్ కిలాయి ఈయన్ని హత్యచేశాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 365

366

హదీసు 366

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ ‏- رضى الله عنه ‏- قَالَ: { صَلَّى النَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-اَلْعِيدَ, ثُمَّ رَخَّصَ فِي الْجُمُعَةِ, فَقَالَ: "مَنْ شَاءَ أَنْ يُصَلِّيَ فَلْيُصَلِّ" } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا اَلتِّرْمِذِيَّ، وَصَحَّحَهُ ابْنُ خُزَيْمَة َ.

హజ్రత్ జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ పండుగ నమాజ్ చేశారు. జుమా నమాజ్ విషయంలో అనుమతి ఇచ్చారు – “చేయదలచిన వారు చేయండి” అని ఆయన ﷺ ఆ సందర్భంగా సెలవిచ్చారు. (‘ఐదుగురి’లో తిర్మిజీ తప్ప మిగిలిన వారంతా దీనిని ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ దీనిని ప్రామాణికమని నిర్ధారించారు)

English

Narrated Zaid bin Arqam (RA): The Prophet (ﷺ) prayed the 'Eid prayer (on a Friday); and granted a permission (to be excused) from the praying of Friday prayer and said, "Whoever wants to pray it, he may pray." [Reported by al-Khamsah excluding at-Tirmidhi. Ibn Khuzaimah graded it Sahih (authentic)].

సారాంశం

ఒకే రోజు పండుగ మరియు శుక్రవారం వస్తే అట్టి పరిస్థితిలో ఆయన ﷺ పండుగ నమాజ్ను చేయించారు. జుమా నమాజ్ను చేయటం చేయకపోవటం గురించి ప్రజల ఇష్టాయిష్టాలకే వదలిపెట్టారు. అబూదావూద్లో హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఆయన ﷺ ఇలా ప్రకటించారు – “ఈ రోజు రెండు పండుగల సమావేశం ఉంది. దీంతో సరిపెట్టదలచుకున్నవారు సరిపెట్టుకోవచ్చు. అయితే మేము మాత్రం జుమా నమాజ్ తప్పక చేస్తాము.”

ఈ హదీసు ద్వారా వెల్లడయ్యేదేమిటంటే శుక్రవారంనాడు పండుగ వస్తే పండుగ నమాజ్ తర్వాత జుమా నమాజ్ ఫర్జ్ (విధి) కాదు – జుహ్ర్ నమాజ్ చేస్తే సరిపోతుంది. అయితే హనఫీ పండితులు దీనికి అనుకూలంగా లేరు.

పండుగరోజు, శుక్రవారం – రెండూ కలిసివస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వం పతనమవుతుందని జన సామాన్యంలో ఒక నమ్మకం ఉంది. ఇది గుడ్డి నమ్మకం తప్ప మరేమీ కాదు. పైగా ఆయన ﷺ దీనిని రెండు పండుగల దినంగా ఖరారు చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 366

367

హదీసు 367

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا صَلَّى أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيُصَلِّ بَعْدَهَا أَرْبَعًا } رَوَاهُ مُسْلِم ٌ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) తెలిపారు : “మీలో ఎవరయినా జుమా నమాజ్ చేస్తే, ఆ తరువాత 4 రకతులు చదవండి.” (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "When anyone of you prays the Jumu'ah prayer, he should pray four (optional) Rak'at after it." [Reported by Muslim].

సారాంశం

శుక్రవారం నాడు సామూహిక నమాజ్ అనంతరం 4 రకతుల (సున్నత్) నమాజ్ చేయాలని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. ఇమామ్ షాఫయి, ఇమామ్ అహ్మద్, మరియు అధిక సంఖ్యాకులైన పండితుల అభిప్రాయం కూడా ఇదే. వేరొక ఉల్లేఖనంలో ఆయన ﷺ జుమా తరువాత రెండు రకతులు చేసేవారని ఉంది. దీని ఆధారంగా షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఏమన్నారంటే; మస్జిద్లో రెండు రకతులు చదివి, ఇంటి దగ్గర 4 రకతులు చదవాలి. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆచరణ కూడా ఇలాగే ఉండేది. హనఫీ ఫిఖహ్ ననుసరించేవారు జుమా తరువాత 6 రకతులు చేయాలని అంటారు. కాని ప్రామాణికమైన ఏ హదీసు ద్వారా కూడా దీనికి ఆధారం లభించటం లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 367

368

హదీసు 368

وَعَنِ السَّائِبِ بْنِ يَزِيدَ, أَنَّ مُعَاوِيَةَ قَالَ لَهُ: { إِذَا صَلَّيْتَ الْجُمُعَةَ فَلَا تَصِلْهَا بِصَلَاةٍ, حَتَّى تَتَكَلَّمَ أَوْ تَخْرُجَ, فَإِنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَمَرَنَا بِذَلِكَ: أَنْ لَا نُوصِلَ صَلَاةً بِصَلَاةٍ حَتَّى نَتَكَلَّمَ أَوْ نَخْرُجَ } رَوَاهُ مُسْلِم ٌ.

హజ్రత్ సాయిబ్ బిన్ యజీద్ (రదియల్లాహు అన్హు) కథనం : హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) ఇలా తెలిపారు – “నీవు జుమా నమాజ్ చేశాక ఇతరులెవరితోనయినా సంభాషించే వరకూ లేక స్థానమార్పిడి జరిగే వరకూ ఇతర నమాజును చేయకు. ఎందుకంటే దైవప్రవక్త ﷺ మాకు ఈ మేరకు ఆదేశించారు. మేము జుమా చేశాక పరస్పరం సంభాషించుకునే వరకూ లేదా అక్కడి నుండి బదిలీ అయ్యేవరకూ వేరితర నమాజు చేయరాదు” అని ఆయన ﷺ అన్నారు. (ముస్లిం)

English

Narrated as-Sa'ib bin Yazid (RA) that Mu'awiyah (RA) told him, "If you offer the Friday prayer, do not connect it with another prayer, till you talk or go out. Allah's Messenger (ﷺ) had commanded us accordingly: That we should not connect a prayer to another prayer till we talk or go out (in between them)." [Reported by Muslim]

సారాంశం

జుమా చేసిన తరువాత ఇతర సున్నత్ లేక నఫిల్ నమాజులకై అదే స్థానంలో నిలబడరాదని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. ఈ ఆదేశం ఒక్క జుమా నమాజుకే పరిమితం కాకుండా ఇతర దినాలలో కూడా స్థానమార్పిడికై ప్రయత్నించాలి. ఆ విధంగా ఫర్జ్ నమాజ్కీ – నఫిల్ నమాజులకీ మధ్య గల వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కానవస్తుంది. దైవప్రవక్త ﷺ సాధారణంగా నఫిల్, సున్నత్ నమాజులను ఇంట్లో నెరవేర్చేవారు. ఈ పద్ధతే ఉత్తమమైనది. దైవారాధన ఒకేచోట కాకుండా దేవుని భూమండలంపై అనేకచోట్ల జరగాలన్నదీ, దైవనామస్మరణ అన్ని మూలల్లో జరగాలన్నది ఈ ఆదేశంలో దాగివున్న మరో మర్మం కావచ్చు.

హదీసు ఉల్లేఖకులు

సాయబ్ బిన్ యజీద్ (రదియల్లాహు అన్హు) గారి మరోపేరు అబూ యజీద్ అల్ కింది. హిజ్రీ శకం 2వ సంవత్సరంలో జన్మించారు. తండ్రితో కలసి అంతిమ హజ్ యాత్రలో పాల్గొన్నారు. హిజ్రీ 80లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 368

369

హదీసు 369

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنِ اغْتَسَلَ, ثُمَّ أَتَى الْجُمُعَةَ, فَصَلَّى مَا قُدِّرَ لَهُ, ثُمَّ أَنْصَتَ, حَتَّى يَفْرُغَ اَلْإِمَامُ مِنْ خُطْبَتِهِ, ثُمَّ يُصَلِّي مَعَهُ: غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ اَلْأُخْرَى, وَفَضْلُ ثَلَاثَةِ أَيَّامٍ } رَوَاهُ مُسْلِم ٌ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “ఎవరయితే స్నానం చేసి జుమా నమాజ్కు వస్తాడో, తన అదృష్టంలో వున్నంత నమాజ్ చేస్తాడో, మరి ఇమామ్ ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చేవరకూ నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడో, తరువాత ఇమామ్తో కలసి ఫర్జ్ (సామూహిక) నమాజు చేస్తాడో రెండు శుక్రవారాల మధ్య అతని వల్ల జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. మరో మూడు రోజుల పాపాలు అదనంగా కూడా మన్నించబడతాయి.” (ముస్లిం)

English

Narrated Abu Hurairah (RA): Allah's Messenger (ﷺ) said: "Whoever takes a bath, then comes to al-Jumu'ah prayer, then prays what was fixed for him, then keeps silent till the Imam finishes the Khutbah (religious talk – sermon), and then prays along with him – his sins (committed) between that time and the next Friday will be forgiven, with an addition of three days more." [Reported by Muslim].

సారాంశం

ఈ హదీసులో శుక్రవారం నాటి నమాజు మహాత్మ్యం చాటబడింది. స్నానం చేసి ఇమామ్కన్నా ముందే మస్జిద్లోకి వచ్చి దైవధ్యానంలో నిమగ్నమవటం మంచిది. మస్జిద్లో కూర్చున్నంతసేపూ ప్రశాంతంగా కూర్చోవాలి. ఇమామ్ చేసే ప్రసంగాన్ని శ్రద్ధగా వినాలి. సామూహిక నమాజ్ను శ్రద్ధాభక్తులతో చేయాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జుమా నమాజు చేసిన వ్యక్తి యొక్క అపరాధాలు – రెండు శుక్రవారాల మధ్య అతని వల్ల జరిగిన చిన్న చిన్న తప్పులు – మన్నించబడతాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 369

370

హదీసు 370

وَعَنْهُ; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-ذَكَرَ يَوْمَ الْجُمُعَةِ فَقَالَ: { فِيهِ سَاعَةٌ لَا يُوَافِقُهَا عَبْدٌ مُسْلِمٌ وَهُوَ قَائِمٌ يُصَلِّي, يَسْأَلُ اَللَّهَ عَزَّ وَجَلَّ شَيْئًا إِلَّا أَعْطَاهُ إِيَّاهُ، وَأَشَارَ بِيَدِهِ يُقَلِّلُهَا } مُتَّفَقٌ عَلَيْه ِ. وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: { وَهِيَ سَاعَةٌ خَفِيفَةٌ }.

ఈ హదీసు కూడా హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) గారి చేతనే ఉల్లేఖించబడింది – దైవప్రవక్త ﷺ ఒక రోజు జుమా నమాజ్ గురించి ప్రస్తావిస్తూ, ‘అందులో ఒక ఘడియ వుంది. ఆ ఘడియలో ఏ ముస్లిం దాసుడు అయినా నమాజ్ చేసి దైవాన్ని ఏదయినా వేడుకుంటే దేవుడు తప్పక దాన్ని అతనికి ప్రసాదిస్తాడు’ అని అన్నారు. ఆ ఘడియ చాలా కొద్దిసేపే అయివుంటుందని ఆయన ﷺ తన చేత్తో సైగ చేశారు. (బుఖారీ, ముస్లిం)

‘ఆ సమయం చాలా చిన్నది’ అని ముస్లింలోని ఉల్లేఖనంలో ఉంది.

English

Narrated [Abu Hurairah (RA)]: Allah's Messenger (ﷺ) mentioned the day of al-Jumu'ah and then said, "There is a time in it (Friday) at which no Muslim would stand up while praying and beg Allah, Who is Great and Glorious, for something except that He would give it to him. He (ﷺ) indicated with his hand that it (this time) is short." [Agreed upon].

A narration of Muslim has: "This time is brief."

సారాంశం

శుక్రవారం నమాజ్ సందర్భంగా ఉన్న ఆ అత్యంత విలువైన, కారుణ్య ప్రదమయిన ఘడియలో దాసుని దుఆ స్వీకారయోగ్యమవుతుంది. ఆ ఘడియ ఏ దశలో వుంది? అనేది దైవప్రవక్త ﷺ చెప్పలేదు. ‘లైలతుల్ ఖద్ర్’ మాదిరిగా ఈ శుభ ఘడియ కూడా గోప్యంగా ఉంచబడింది. దాని అన్వేషణలో దాసులు వీలైనంత ఎక్కువ సమయం మస్జిద్లో – దైవధ్యానంలో – గడపాలన్నది దీని ఉద్దేశ్యమై ఉండవచ్చు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 370

371

హదీసు 371

وَعَنْ أَبِي بُرْدَةَ عَنْ أَبِيهِ سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { هِيَ مَا بَيْنَ أَنْ يَجْلِسَ اَلْإِمَامُ إِلَى أَنْ تُقْضَى اَلصَّلَاةُ } رَوَاهُ مُسْلِمٌ, وَرَجَّحَ اَلدَّارَقُطْنِيُّ أَنَّهُ مِنْ قَوْلِ أَبِي بُرْدَةَ.. وَفِي حَدِيثِ عَبْدِ اَللَّهِ بْنِ سَلَامٍ عِنْدَ ابْنِ مَاجَه ْ. وَجَابِرِ عِنْدَ أَبِي دَاوُدَ, وَالنَّسَائِيّ ِ : { أَنَّهَا مَا بَيْنَ صَلَاةِ اَلْعَصْرِ إِلَى غُرُوبِ اَلشَّمْسِ } ِ.‏ وَقَدْ اِخْتُلَفَ فِيهَا عَلَى أَكْثَرَ مِنْ أَرْبَعِينَ قَوْلًا, أَمْلَيْتُهَا فِي "شَرْحِ اَلْبُخَارِيِّ ".

హజ్రత్ అబూ బుర్దా (రదియల్లాహు అన్హు) తన తండ్రి ఆధారంగా వివరించారు: ఆయన తండ్రి ఇలా వివరించారు : “దైవప్రవక్త ﷺ ఈ విధంగా చెప్పగా నేను విన్నాను- ‘ఆ (శుభ) ఘడియ ఇమామ్ వేదికపై కూర్చున్న క్షణం నుంచీ సామూహిక నమాజ్ ముగిసే వరకూ ఎప్పుడన్నా ఆసన్నం కావచ్చు” (ముస్లిం). ఈ పలుకులు అబూ బుర్దా (రదియల్లాహు అన్హు) గారివే అయి ఉండవచ్చునని దారె ఖుత్నీ అభిప్రాయపడ్డారు.

అబ్దుల్లా బిన్ సలాం (రదియల్లాహు అన్హు) నుండి ఇబ్నె మాజా గారు, జాబిర్ (రదియల్లాహు అన్హు) నుండి అబూ దావూద్, నసాయి నకలు చేసిన ఉల్లేఖనం ఈ విధంగా ఉంది – “ఆ ఘడియ అస్ర్ నమాజ్ నుండి సూర్యాస్తమయం వరకూగల మధ్య సమయంలో ఉంది.

ఈ నేపథ్యంలో అనేకమంది ఉలమాల 40 వ్యాఖ్యలు ఉన్నాయి. వాటినన్నింటినీ నేను ‘ఫత్హుల్ బారీ’ బుఖారీ వ్యాఖ్యానంలో పొందుపరచాను.

English

Narrated Abu Burdah (RA) from his father's: I heard Allah's Messenger (ﷺ) say, "That time is between the time when the Imam sits down and the end of the prayer." [Reported by Muslim. ad-Daraqutni held that the stronger view is that it is the saying of Abu Burdah].

Ibn Majah reported from 'Abdullah bin Salam

and Abu Dawud and an-Nasa'i reported from Jabir: "It is between the 'Asr prayer and sunset."

More than forty different sayings were narrated about this (special fortune time on Friday), and I have detailed them in (my book) 'Sharh al-Bukhari'.

హదీసు ఉల్లేఖకులు

(1) అబూబుర్దా (రహిమహుల్లాహ్) గారి అసలు పేరు ఆమిర్ బిన్ అబీ మూసా అష్అరీ, ప్రఖ్యాత తాబయీన్లలో ఒకరు. ఈయన తన తండ్రి గారినుండీ, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) గారినుండీ, అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నుండి ఈ హదీసు విన్నారు. 80పై చిలుకు వయస్సులో – హిజ్రీ 104 లో – కన్నుమూశారు.

(2) అబ్దుల్లాహ్ బిన్ సలాం (రదియల్లాహు అన్హు) : ఈయనగారి మారుపేరు అబూ యూసుఫ్. యూద పండితులలో ఎన్నదగినవారు. హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) వంశస్థులు. బనూ ఖైనుఖాతో ఈయనగారికి సంబంధం ఉండేది. దైవప్రవక్త ﷺ మదీనాకు ఏతెంచినపుడే ఇస్లాం స్వీకరించారు. ప్రపంచంలో ఉండగానే స్వర్గలోక శుభవార్త పొందిన భాగ్యవంతులలో ఈయన ఒకరు. మదీనా మునవ్వరాలో హిజ్రీ 43లో మరణించి స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 371

372

హదీసు 372

وَعَنْ جَابِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَضَتِ السُّنَّةُ أَنَّ فِي كُلِّ أَرْبَعِينَ فَصَاعِدًا جُمُعَةً } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ بِإِسْنَادٍ ضَعِيف ٍ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “నలభై లేక అంతకు మించిన సంఖ్య ఉంటేనే జుమా ఏర్పాటు చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది.” (దారె ఖుత్నీ దీనిని అత్యంత బలహీనమైన ఆధారంతో ఉల్లేఖించారు)

English

Narrated Jabir (RA): It is decided in the Sunnah that the Friday prayer (established/recognized) when forty praying persons or more attend it. [ad-Daraqutni reported it through a weak chain of narrators].

సారాంశం

జుమా నమాజ్ కొరకు నమాజీల సంఖ్య ‘ఇంత ఉండాలి’ అని సహీహ్ హదీసులలో ఎక్కడా ప్రస్తావన రాలేదు. అందుచేత ఈ విషయమై ధర్మవేత్తల మధ్య వివిధ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ కనీస సంఖ్య 4 అని కొందరు, 7 అని మరికొందరు, 9 లేక 12 అని ఇంకొందరు, 20 అనీ, 40 అనీ, 50 అనీ – ఇలా రకరకాలుగా అంచనా వేశారు. వీరిలో ఏ ఒక్కరూ సహీహ్ హదీసు ఆధారంగా వ్యాఖ్యానించలేదు. ఇద్దరు వ్యక్తులున్నా జమాఅత్తో నమాజ్ చేయాల్సిందేనని దైవప్రవక్త ﷺ ఆదేశించారు. ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులున్నప్పుడు వారిలో ఒకరు అజాన్ ఇవ్వాలి. ధర్మజ్ఞానం ఎక్కువగా ఉన్న వ్యక్తి ఇమామత్ చేయాలి. ఇమామ్ షాఫయి దృష్టిలో జుమా నమాజుకై 40 మంది హాజరవ్వాలి. ఇమామ్ అబూ హనీఫా అభిప్రాయం ప్రకారం ఇమాముగాక మరో ఇద్దరు వ్యక్తులున్నా చాలు – జుమా నమాజ్ను స్థాపించవచ్చు. అయితే జుమా నమాజ్ కోసం అది పెద్ద గ్రామం అయి ఉండాలని ఆయన షరతు విధించారు. కాని ఇస్లాంలో తొట్టతొలి జుమా నమాజు ‘జవాసీ’ బస్తీలో నెలకొల్పబడింది. మరి అది పెద్ద గ్రామమో లేక పట్టణమో కానేకాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 372

373

హదీసు 373

وَعَنْ سَمُرَةَ بنِ جُنْدُبٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يَسْتَغْفِرُ لِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ كُلَّ جُمُعَةٍ } رَوَاهُ اَلْبَزَّارُ بِإِسْنَادٍ لَيِّن ٍ.

హజ్రత్ సముర బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) కథనం : “దైవప్రవక్త ﷺ ప్రతి శుక్రవారం విశ్వాసులైన పురుషుల, స్త్రీల మన్నింపుకై ప్రార్థించేవారు.” (బజ్జార్ దీనిని బలహీనమైన ఆధారంతో ఉల్లేఖించారు)

English

Narrated Samurah bin Jundub (RA): The Prophet (ﷺ) used to ask for (Allah's) forgiveness for the believing men and believing women, every al-Jumu'ah (Friday prayer). [al-Bazzar reported it through a weak chain of narrators].

సారాంశం

శుక్రవారం నమాజ్ సందర్భంగా ప్రసంగకర్త తన కోసం, విశ్వాసులైన స్త్రీ పురుషులందరి మన్నింపు కోసం ప్రార్థించటం సమంజసమే. అయితే ఈ హదీసు అందజేసిన పరంపరలో లోపం ఏర్పడింది. ఈ పరంపరలో యూసుఫ్ బిన్ ఖాలిద్ అనే వ్యక్తిపై హదీసువేత్తలకు సదభిప్రాయం లేదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 373

374

హదీసు 374

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ فِي اَلْخُطْبَةِ يَقْرَأُ آيَاتٍ مِنَ اَلْقُرْآنِ, يُذَكِّرُ اَلنَّاسَ } رَوَاهُ أَبُو دَاوُد َ. وَأَصْلُهُ فِي مُسْلِم ٍ.

హజ్రత్ జాబిర్ బిన్ సముర (రదియల్లాహు అన్హుమా) కథనం : “దైవప్రవక్త ﷺ దివ్య ఖుర్ఆన్లోని కొన్ని వచనాలు జుమా ప్రసంగం సందర్భంగా పారాయణం చేసి ప్రజలకు హితబోధ చేసేవారు.” (అబూదావూద్ – దీని మూలం ముస్లింలో ఉంది)

English

Narrated Jabir bin Samurah (RA): The Prophet (ﷺ) used to recite some verses from the Qur'an in the Friday Khutbah (religious talk – sermon), reminding the people. [Abu Dawud reported it].

And its basic meaning is in Muslim.

సారాంశం

జుమా ప్రసంగంలో దివ్య ఖుర్ఆన్లోని ఆయతులను ఉదాహరించటం ‘సున్నత్’ అని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఆయత్ల ద్వారా ఉపన్యాసకుడు ప్రజలలో ధార్మిక చింతన కలిగించాలి. పరలోక భీతిని, దైవభీతిని రేకెత్తించి తద్వారా వారి జీవితాలలో నైతిక విప్లవం తీసుకురావటానికి కృషిచేయాలి. ఖుర్ఆన్ హదీసుల ద్వారా జరిగినంత సంస్కరణ మరో సాధనం ద్వారా జరగదన్నది తిరుగులేని సత్యం. ఈ సందర్భంగా కట్టుకథలను, స్వీయకల్పిత విషయాలను జొప్పించే ప్రయత్నం చేయరాదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 374

375

హదీసు 375

وَعَنْ طَارِقِ بْنِ شِهَابٍ; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { الْجُمُعَةُ حَقٌّ وَاجِبٌ عَلَى كُلِّ مُسْلِمٍ فِي جَمَاعَةٍ إِلَّا عَلَى أَرْبَعَةٍ: مَمْلُوكٌ, وَاِمْرَأَةٌ, وَصَبِيٌّ, وَمَرِيضٌ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَقَالَ: لَمْ يَسْمَعْ طَارِقٌ مِنَ اَلنَّبِيِّ ﷺ. وَأَخْرَجَهُ اَلْحَاكِمُ مِنْ رِوَايَةِ طَارِقٍ اَلْمَذْكُورِ عَنْ أَبِي مُوسَى.

హజ్రత్ తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు – “జుమా నమాజును సామూహికంగా నెరవేర్చటం ప్రతి ముస్లింకు తప్పనిసరి. అయితే నాలుగు రకాల వారికి దీని నుండి మినహాయింపు ఉంది – బానిస, స్త్రీ, పసిపిల్లలు, వ్యాధిగ్రస్తుడు.” (అబూ దావూద్ దీనిని ఉల్లేఖించారు – తారిఖ్ నేరుగా దైవప్రవక్త ﷺ నుండి ఈ హదీసు వినలేదని కూడా ఆయన పేర్కొన్నారు – తారిఖ్ గారి ఈ ఉల్లేఖనాన్ని హాకిమ్ గారు అబూ మూసా సౌజన్యంతో ప్రస్తావించారు)

English

Narrated Tariq bin Shihab (RA): Allah's Messenger (ﷺ) said: "The Friday prayer in congregation is an obligatory duty upon every Muslim, with the exception of four: a slave, a woman, a child and a sick person." [Reported by Abu Dawud, who said that Tariq did not hear (any Hadith) from the Prophet (ﷺ)].

al-Hakim also reported it from the narration of the aforementioned Tariq, who narrated from Abu Musa.

సారాంశం

బానిసలు, స్త్రీలు, చిన్న పిల్లలు, రోగగ్రస్తులు – వీళ్ళపై జుమా నమాజ్ ఫర్జ్ (విధి) కాదు. ఒకవేళ వారు జుమా నమాజ్లో పాల్గొంటే జుహ్ర్ నమాజ్ చేయనవసరం లేదు. జుమాకు రాకపోతే మాత్రం జుహ్ర్ నమాజ్ చేసుకోవాలి.

హదీసు ఉల్లేఖకులు

తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు). ఈయన ‘కూఫా’ వాస్తవ్యులు. బజలీ తెగకు చెందినవారు. అందుకే కూఫీగా, బజలీగా పిలువబడ్డారు. దైవప్రవక్త ﷺ ను చూచారు. కాని ఆయన ﷺ ద్వారా ఏమీ వినలేదు. హజ్రత్ అబూబకర్, హజ్రత్ ఉమర్ల పరిపాలనా కాలంలో 33 లేక 34 యుద్ధాలలో పాల్గొన్నారు. హిజ్రీ 82లో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 375

376

హదీసు 376

وَعَنِ ابْنِ عُمَرَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَيْسَ عَلَى مُسَافِرٍ جُمُعَةٌ } رَوَاهُ اَلطَّبَرَانِيُّ بِإِسْنَادٍ ضَعِيف ٍ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: “ఏ ప్రయాణీకునిపై కూడా జుమా నమాజ్ (విధిగా చేయబడ)లేదు” అని దైవప్రవక్త ﷺ ప్రవచించారు. (తబ్రానీ దీనిని బలహీన ఆధారంతో ఉల్లేఖించారు)

English

Narrated Ibn 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "Jumu'ah prayer is not obligatory on a traveller." [Reported by at-Tabarani through a weak chain of narrators].

సారాంశం

ప్రయాణీకునిపై కూడా జుమా నమాజ్ బాధ్యత లేదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతున్నది. ఈ హదీసు జయీఫ్ అన్నది వాస్తవమే అయినప్పటికీ హజ్ యాత్ర సందర్భంగా దైవప్రవక్త ﷺ జుమా నమాజ్ చేయలేదన్న సంగతి గమనార్హం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 376

377

హదీసు 377

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ مَسْعُودٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-]إِذَا [ اسْتَوَى عَلَى الْمِنْبَرِ اسْتَقْبَلْنَاهُ بِوُجُوهِنَا } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, بِإِسْنَادٍ ضَعِيفٍ.. وَلَهُ شَاهِدٌ مِنْ حَدِيثِ الْبَرَاءِ عِنْدَ اِبْنِ خُزَيْمَة َ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ వేదికనెక్కి నిలబడగానే మేము మా ముఖాలను ఆయన ﷺ వైపునకు కేంద్రీకరించేవాళ్ళము. (తిర్మిజీ దీనిని బలహీన ఆధారంతో ఉల్లేఖించారు. దీని సాక్ష్యం ఇబ్నె ఖుజైమలో పొందుపరచబడి ఉంది.)

English

Narrated 'Abdullah bin Mas'ud (RA): Whenever Allah's Messenger (ﷺ) ascended the Minbar (to give the Friday Khutbah), we used to face him. [at-Tirmidhi reported it through a weak chain of narrators].

It has a Shahid (supporting narration) in the Hadith of al-Bara', reported by Ibn Khuzaimah.

సారాంశం

ఈ హదీసు ప్రకారం ప్రేక్షకులు జుమా ప్రసంగం సందర్భంగా తమ ముఖాలను ఖతీబ్ వైపునకు త్రిప్పుకోవాలి. ఈ విషయంలో భేదాభిప్రాయం లేదు. పైగా దీనిపై అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 377

378

హదీసు 378

وَعَنِ اَلْحَكَمِ بْنِ حَزْنٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { شَهِدْنَا الْجُمُعَةَ مَعَ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَامَ مُتَوَكِّئًا عَلَى عَصًا أَوْ قَوْسٍ } رَوَاهُ أَبُو دَاوُد َ.

హజ్రత్ హకమ్ బిన్ హజ్న్ (రదియల్లాహు అన్హు) కథనం : “మేము దైవప్రవక్త ﷺతో కలసి జుమాలో పాల్గొన్నాము. ఆయన ﷺ లాఠీ లేక ఊతకర్ర సాయంతో (ప్రసంగించడానికి) నిలబడ్డారు.” (అబూదావూద్)

English

Narrated al-Hakam bin Hazn (RA): We attended the Friday prayer with the Prophet (ﷺ) and he (ﷺ) stood leaning on a staff or a bow. [Reported by Abu Dawud].

సారాంశం

ఈ హదీసు దృష్ట్యా ప్రసంగకర్త ప్రసంగ సమయంలో ఏదైనా వస్తువును ఊతగా తీసుకుని నిలబడవచ్చు. పైగా ఇది ‘ముస్తహబ్’ కూడా. ఇది ప్రసంగీకునికి ఆధారంగా ఉంటుంది. చేతులు అనవసరంగా అటూ ఇటూ తిరగకుండా అదుపులో ఉంటాయి. ప్రసంగ సమయంలో మనిషి అలసిపోడు.

హదీసు ఉల్లేఖకులు

పూర్తిపేరు హకమ్ బిన్ హజ్న్ బిన్ అబూ వహ్బ్ మఖ్జూమి (రదియల్లాహు అన్హు). మక్కా విజయం సందర్భంగా ఈయన ఇస్లాం స్వీకరించారు. ఈ హదీసును బట్టి ఈయన దైవప్రవక్త ﷺ సారథ్యంలో జుమా నమాజ్ చేశారని అర్థమవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|2. నమాజ్ పుస్తకం|2.12 జుమా నమాజ్|హదీసు 378